కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

80వ కథ

దేవుని ప్రజలు బబులోనును విడిచి వెళ్లడం

దేవుని ప్రజలు బబులోనును విడిచి వెళ్లడం

బబులోనును మాదీయులు, పారసీకులు పట్టుకొని దాదాపు రెండు సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత ఏమి జరిగిందో చూడండి! అవును, ఇశ్రాయేలీయులు బబులోనును విడిచి వెళ్తున్నారు. వాళ్ళు ఎలా విడిపించబడ్డారు? వాళ్ళను ఎవరు వెళ్ళనిచ్చారు?

వాళ్ళను పారసీక రాజైన కోరెషు వెళ్ళనిచ్చాడు. కోరెషు జన్మించడానికి ఎంతోకాలం ముందే యెహోవా తన ప్రవక్తయైన యెషయా ద్వారా ఆయన గురించి ఇలా వ్రాయించాడు: ‘నువ్వు ఏమి చేయాలని నేను అనుకుంటానో అదే చేస్తావు. నువ్వు పట్టణమును ఆక్రమించడానికి తలుపులు తెరవబడి ఉంటాయి.’ వ్రాయబడి ఉన్నట్లే కోరెషు బబులోనును ఆక్రమించడంలో నాయకత్వం వహించాడు. మాదీయులు పారసీకులు తెరువబడివున్న తలుపుల ద్వారా రాత్రివేళ పట్టణంలోకి ప్రవేశించారు.

అయితే కోరెషు యెరూషలేము, దాని ఆలయము తిరిగి నిర్మించబడాలనే ఆజ్ఞ ఇస్తాడు అని కూడా యెహోవా ప్రవక్తయైన యెషయా చెప్పాడు. కోరెషు ఆ ఆజ్ఞను ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. కోరెషు ఇశ్రాయేలీయులతో, ‘మీరు యెరూషలేముకు వెళ్ళి మీ దేవుడైన యెహోవాకు ఆలయము నిర్మించండి’ అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు ఆ పని చేయడానికే ప్రయాణమై వెళ్తున్నట్లు చిత్రంలో కనిపిస్తోంది.

అయితే బబులోనులోని ఇశ్రాయేలీయులంతా దూర ప్రయాణం చేసి తిరిగి యెరూషలేముకు వెళ్ళలేకపోయారు. అది దాదాపు 500 మైళ్ళ (800 కిలోమీటర్ల) సుదూర ప్రయాణం, చాలా మంది వృద్ధులు, వ్యాధిగ్రస్తులు కాబట్టి అంత దూరం ప్రయాణం చేయలేకపోయారు. కొంతమంది ఇతర కారణాలనుబట్టి కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళలేదు. అలా వెళ్ళని వారితో కోరెషు, ‘యెరూషలేమును దాని ఆలయాన్ని నిర్మించడానికి వెళ్ళే వాళ్ళకు వెండిని, బంగారాన్ని ఇతర వస్తువులను ఇవ్వండి’ అని చెప్పాడు.

కాబట్టి యెరూషలేముకు తిరిగి వెళ్తున్న ఇశ్రాయేలీయులకు చాలా బహుమానాలు ఇవ్వబడ్డాయి. యెరూషలేమును నాశనం చేసినప్పుడు రాజైన నెబుకద్నెజరు యెహోవా ఆలయం నుండి తెచ్చిన పాత్రలను, గిన్నెలను కూడా కోరెషు వాళ్ళకు తిరిగి ఇచ్చాడు. ప్రజలు తమతోపాటు తిరిగి తీసుకెళ్ళడానికి చాలా వస్తువులు సమకూరాయి.

దాదాపు నాలుగు నెలలు ప్రయాణం చేసిన తర్వాత ఇశ్రాయేలీయులు సరిగ్గా సమయానికే యెరూషలేముకు చేరుకున్నారు. యెరూషలేము నాశనము చేయబడి, నిర్మానుష్యంగా తయారై అప్పటికి సరిగ్గా 70 సంవత్సరాలయ్యింది. అయితే ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి వచ్చినా వాళ్ళకు కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.