కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

82వ కథ

మొర్దెకై, ఎస్తేరు

మొర్దెకై, ఎస్తేరు

ఎజ్రా యెరూషలేముకు వెళ్ళడానికి కొన్ని సంవత్సరాల ముందు ఏమి జరిగిందో మనం చూద్దాం. పారసీక రాజ్యంలో మొర్దెకై, ఎస్తేరు చాలా ప్రముఖులైన ఇశ్రాయేలీయులు. ఎస్తేరు ఆ రాజ్యానికి రాణి, ఆమె తండ్రి సహోదరుని కుమారుడైన మొర్దెకై రాజు తర్వాతి అధికారి. అది ఎలా జరిగిందో చూద్దాం.

ఎస్తేరు చాలా చిన్నగా ఉన్నప్పుడే ఆమె తలిదండ్రులు మరణించారు, కాబట్టి మొర్దెకై ఆమెను పెంచాడు. పారసీక దేశపు రాజైన అహష్వేరోషుకు షూషను నగరంలో ఒక రాజభవనం ఉండేది, అక్కడ రాజు సేవకులలో ఒకరిగా మొర్దెకై పని చేసేవాడు. ఒకరోజు రాజు భార్యయైన వష్తి రాజుకు విధేయత చూపించలేదు, అందువలన రాజు మరో క్రొత్త భార్యను తన రాణిగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎంపిక చేసుకున్న స్త్రీ ఎవరో మీకు తెలుసా? అవును, ఆయన అందమైన యువతియైన ఎస్తేరును ఎంపిక చేసుకున్నాడు.

అక్కడ ప్రజలు వంగి నమస్కారం చేస్తున్న ఆ గర్వంగల వ్యక్తిని మీరు చూస్తున్నారా? అతను హామాను. అతను పారసీక దేశంలో చాలా ప్రముఖమైన వ్యక్తి. చిత్రంలో కూర్చొనివున్న మొర్దెకై కూడా తనకు వంగి నమస్కారం చేయాలని హామాను అనుకున్నాడు. అయితే మొర్దెకై అలా చేయలేదు. అలాంటి చెడ్డ వ్యక్తికి వంగి నమస్కరించడం మంచిది కాదని ఆయన అనుకున్నాడు. హామానుకు చాలా కోపం వచ్చింది. అందుకే అతను ఒక పని చేశాడు.

హామాను వెళ్ళి రాజుతో ఇశ్రాయేలీయుల గురించి అబద్ధాలు చెప్పాడు. ‘వాళ్ళు చెడ్డ ప్రజలు, వాళ్ళు మీ ఆజ్ఞలు పాటించరు. వాళ్ళను చంపివేయాలి’ అని అతను చెప్పాడు. అహష్వేరోషుకు తన భార్యయైన ఎస్తేరు ఇశ్రాయేలు స్త్రీ అని తెలియదు. కాబట్టి ఆయన హామాను మాట విని, ఒక రోజున ఇశ్రాయేలీయులందరూ చంపబడతారు అనే శాసనాన్ని జారీ చేశాడు.

ఈ శాసనం గురించి విన్నప్పుడు మొర్దెకై కలత చెందాడు. ఆయన ఎస్తేరుకు ‘నువ్వు రాజు దగ్గరకు వెళ్ళి మనలను రక్షించమని వేడుకోవాలి’ అని వర్తమానం పంపించాడు. పారసీక దేశంలో రాజు ఆహ్వానించకుండానే ఆయనను కలుసుకోవడానికి వెళ్ళడం చట్ట విరుద్ధమైన పని. అయినప్పటికీ ఎస్తేరు ఆహ్వానించబడకుండానే రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు తన బంగారు దండమును ఆమెవైపు చూపించాడు, అంటే ఆమెను చంపకూడదని అర్థం. ఎస్తేరు రాజును, హామానును పెద్ద విందుకు ఆహ్వానించింది. విందుకు వెళ్ళిన తర్వాత రాజు తనకు ఏమి కావాలో చెప్పమని ఎస్తేరును అడిగాడు. ఆయన మరియు హామాను మరుసటి రోజు మరోసారి విందుకు వస్తే చెబుతానని ఎస్తేరు అంది.

ఆ భోజన సమయంలో ఎస్తేరు రాజుతో, ‘నేను, నా ప్రజలు చంపబడబోతున్నాము’ అని చెప్పింది. అది విన్నప్పుడు రాజుకు కోపం వచ్చింది. ‘అలా చేయడానికి సాహసించిన వాడెవడు’ అని ఆయన అడిగాడు.

‘ఆ మనుష్యుడు, ఆ శత్రువు ఈ చెడ్డ హామానే!’ అని ఎస్తేరు చెప్పింది.

అప్పుడు రాజుకు చాలా కోపం వచ్చింది. హామాను చంపబడాలని ఆయన ఆజ్ఞాపించాడు. తర్వాత రాజు మొర్దెకైని తన తర్వాతి అధికారిగా చేశాడు. ఆ తర్వాత మొర్దెకై ఇశ్రాయేలీయులు చంపబడవలసిన రోజున వాళ్ళు తమ జీవితాల కోసం పోరాడేందుకు వీలుగా మరో క్రొత్త శాసనం చేయబడేలా చేశాడు. మొర్దెకై చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి చాలామంది ప్రజలు ఇశ్రాయేలీయులకు సహాయం చేశారు. వాళ్ళు తమ శత్రువులనుండి కాపాడబడ్డారు.

బైబిలు పుస్తకమైన ఎస్తేరు.