కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

83వ కథ

యెరూషలేము గోడలు

యెరూషలేము గోడలు

ఇక్కడ జరుగుతున్న పనంతటినీ చూడండి. యెరూషలేము గోడలను నిర్మించడంలో ఇశ్రాయేలీయులు చాలా చురుగ్గా పని చేస్తున్నారు. రాజైన నెబుకద్నెజరు 152 సంవత్సరాల క్రితం యెరూషలేమును నాశనం చేసినప్పుడు, ఆయన దాని గోడలను కూలగొట్టి పట్టణ ద్వారాలను కాల్చి వేశాడు. ఇశ్రాయేలీయులు బబులోను నుండి స్వదేశానికి వచ్చినప్పుడు గోడలను మళ్ళీ నిర్మించలేదు.

అన్ని సంవత్సరాలపాటు పట్టణం చుట్టూ గోడలు లేకుండా జీవించడం ప్రజలకు ఎలా అనిపించి ఉంటుంది? వాళ్ళకు అలా జీవించడం సురక్షితం అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ శత్రువులు సులభంగా వచ్చి వాళ్ళను ముట్టడించవచ్చు. అయితే చివరకు నెహెమ్యా అనే ఈ వ్యక్తి, ప్రజలు తిరిగి గోడలు నిర్మించడానికి సహాయం చేశాడు. నెహెమ్యా ఎవరో మీకు తెలుసా?

నెహెమ్యా, మొర్దెకై, ఎస్తేరు నివసించిన షూషను పట్టణం నుండి వచ్చిన ఇశ్రాయేలీయుడు. నెహెమ్యా రాజ భవనంలో పని చేసేవాడు, కాబట్టి ఆయన మొర్దెకైకి, రాణియైన ఎస్తేరుకు మంచి స్నేహితుడై ఉంటాడు. అయితే నెహెమ్యా, ఎస్తేరు భర్తయైన అహష్వేరోషు రాజువద్ద పని చేశాడని బైబిలు చెప్పడం లేదు. ఆయన తర్వాతి రాజైన అర్తహషస్త వద్ద పని చేశాడు.

యెరూషలేముకు తిరిగి వెళ్ళి యెహోవా ఆలయాన్ని మరమ్మతు చేయడానికి ఎజ్రాకు కావలసినంత ధనము ఇచ్చి పంపిన మంచి రాజు అర్తహషస్త రాజే అని గుర్తుంచుకోండి. అయితే ఎజ్రా విరిగిపోయిన గోడలను నిర్మించలేదు. ఆ పనిని నెహెమ్యా ఎలా చేశాడో మనం చూద్దాం.

ఆలయాన్ని మరమ్మతు చేయడానికి అర్తహషస్త రాజు ఎజ్రాకు ధనము ఇచ్చి అప్పటికి 13 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు నెహెమ్యా అర్తహషస్త రాజు దగ్గర పానదాయకునిగా పని చేసేవాడు. అంటే ఆయన అర్తహషస్త రాజుకు ద్రాక్షారసము అందించేవాడు, రాజు త్రాగే పానీయంలో ఎవ్వరూ విషము కలపకుండా చూసుకునేవాడు. అది చాలా ప్రాముఖ్యమైన పని.

ఒకరోజు నెహెమ్యా సహోదరుడైన హానూను మరియు ఇతరులు ఇశ్రాయేలు దేశము నుండి నెహెమ్యాను చూడడానికి వచ్చారు. వాళ్ళు ఇశ్రాయేలీయులు పడుతున్న బాధల గురించి, యెరూషలేము గోడలు ఇంకా నిర్మించబడకుండానే ఉన్నాయనే విషయం గురించి నెహమ్యాకు చెప్పారు. అది విని నెహెమ్యా ఎంతో బాధపడి, దాని గురించి యెహోవాకు ప్రార్థించాడు.

ఒకరోజు నెహెమ్యా బాధగా ఉన్నాడని గమనించి రాజు ఆయనతో, ‘నువ్వెందుకు బాధపడుతున్నావు?’ అని అడిగాడు. యెరూషలేము పాడైన స్థితిలో ఉన్నందుకు, దాని గోడలు ఇంకా కూలిన స్థితిలోనే ఉన్నందుకు తాను బాధపడుతున్నానని నెహెమ్యా రాజుతో చెప్పాడు. దానికి రాజు ‘నన్నేమి చేయమంటావు?’ అని అడిగాడు.

నెహెమ్యా ‘నేను గోడలను తిరిగి నిర్మించడానికి వీలుగా నన్ను యెరూషలేముకు వెళ్ళనివ్వండి’ అన్నాడు. అర్తహషస్త రాజు చాలా దయగలవాడు. నెహెమ్యాను వెళ్ళమని చెప్పి, నిర్మాణానికి కావలసిన కలపను కూడా ఇచ్చాడు. నెహెమ్యా యెరూషలేముకు వచ్చిన వెంటనే ప్రజలకు తన పథకాలను తెలియజేశాడు. వాళ్ళకు ఆ ఆలోచన నచ్చి, ‘నిర్మాణాన్ని ప్రారంభిద్దాం’ అన్నారు.

ఇశ్రాయేలీయుల శత్రువులు గోడలు అంతకంతకు ఎత్తుగా నిర్మించబడడాన్ని చూసినప్పుడు, ‘మనము వెళ్ళి వాళ్ళను చంపి, నిర్మాణ పనిని ఆపుచేద్దాము’ అని అన్నారు. అయితే నెహెమ్యాకు ఆ సంగతి తెలిసినప్పుడు ఆయన పనివాళ్ళకు కత్తులను, ఈటెలను ఇచ్చాడు. ఆయన వాళ్ళతో ‘శత్రువులకు భయపడవద్దు. మీ సహోదరులు, మీ పిల్లలు, మీ భార్యలు, మీ ఇళ్ళు సురక్షితంగా ఉండడానికి వాళ్ళతో పోరాడండి’ అని చెప్పాడు.

ప్రజలు చాలా ధైర్యవంతులు. వాళ్ళు తమ ఆయుధాలను రాత్రింబవళ్ళు సిద్ధంగా ఉంచుకొని నిర్మాణాన్ని కొనసాగించారు. కాబట్టి కేవలం 52 రోజుల్లోనే గోడలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రజలకు పట్టణంలోపల సురక్షితంగా అనిపించింది. నెహెమ్యా, ఎజ్రా ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించారు, ప్రజలు సంతోషంగా జీవించడం ప్రారంభించారు.

అయితే పరిస్థితులు, ఇశ్రాయేలీయులు బబులోనుకు బంధీలుగా తీసుకెళ్ళబడక ముందు ఉన్నట్లు మారలేదు. వాళ్ళను పారసీక దేశపు రాజు పరిపాలించేవాడు, వాళ్ళు ఆయనను సేవించాల్సి వచ్చింది. అయితే యెహోవా తానొక క్రొత్త రాజును పంపిస్తానని, ఆ రాజు ప్రజలకు సమాధానాన్ని తెస్తాడని వాగ్దానం చేశాడు. ఆ రాజు ఎవరు? ఆయన భూమికి సమాధానాన్ని ఎలా తెస్తాడు? దాని గురించిన వివరాలు తెలిసే ముందు దాదాపు 450 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు ఎంతో ప్రాముఖ్యమైన ఒక శిశువు పుట్టాడు. అయితే అది మరో కథ.

నెహమ్యా 1 నుండి 6 అధ్యాయాలు.