కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

84వ కథ

ఒక దూత మరియను దర్శించడం

ఒక దూత మరియను దర్శించడం

ఈ అందమైన స్త్రీ మరియ. ఆమె నజరేతులో నివసించే ఇశ్రాయేలీయురాలు. ఆమె చాలా మంచిదని దేవునికి తెలుసు. అందుకే ఆయన ఆమెతో మాట్లాడడానికి గబ్రియేలు అనే దూతను పంపించాడు. గబ్రియేలు మరియకు ఏమి చెప్పడానికి వచ్చాడో మీకు తెలుసా? మనం చూద్దాం.

గబ్రియేలు ఆమెతో ‘దేవుని అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు’ అని చెప్పాడు. మరియ ఆ వ్యక్తిని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఆయన మాటల భావమేమిటో తెలియక ఆమె కలవరపడింది. అయితే వెంటనే గబ్రియేలు ఆమె భయాన్ని తొలగించాడు.

‘మరియా, నువ్వు భయపడవద్దు. యెహోవా నిన్ను చూసి ఎంతో సంతోషించాడు. అందుకే ఆయన నీ కోసం ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నీకు త్వరలోనే ఒక శిశువు పుడతాడు. నువ్వు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి’ అని ఆయన చెప్పాడు.

గబ్రియేలు ఇంకా ఇలా వివరించాడు: ‘ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పిలువబడతాడు. యెహోవా దావీదును రాజుగా చేసినట్లే ఆయనను రాజుగా చేస్తాడు. అయితే యేసు నిత్యమూ రాజై ఉంటాడు, ఆయన రాజ్యం ఎన్నడూ అంతం కాదు!’

‘ఇదంతా ఎలా జరుగుతుంది? నేను ఇంకా పెళ్ళి చేసుకోలేదు. నేను ఒక పురుషునితో కలిసి జీవించలేదు, నాకు శిశువు ఎలా జన్మిస్తాడు?’ అని మరియ అడిగింది.

‘దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి ఆ శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు’ అని గబ్రియేలు సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఆయన మరియతో, ‘నీ బంధువైన ఎలీసబెతును జ్ఞాపకం చేసుకో. ఆమె పిల్లలు కనడానికి చాలా వృద్ధురాలైందని ప్రజలు అనుకున్నారు. కానీ త్వరలోనే ఆమెకు ఒక కుమారుడు కలుగుతాడు. దేవునికి అసాధ్యమైనదేదీ లేదు’ అని చెప్పాడు.

వెంటనే మరియ, ‘నేను యెహోవా దాసురాలను! నువ్వు చెప్పినట్లే నాకు జరుగును గాక’ అని అంది. ఆ తర్వాత దేవదూత ఆమె దగ్గర నుండి వెళ్ళిపోయాడు.

మరియ వెంటనే ఎలీసబెతును కలవడానికి వెళ్ళింది. ఎలీసబెతు మరియ స్వరము వినగానే ఎలీసబెతు గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాడు. ఎలీసబెతు దేవుని ఆత్మతో నింపబడి, ‘నువ్వు స్త్రీలలో ప్రత్యేకంగా ఆశీర్వదింపబడినదానవు’ అని మరియతో అన్నది. మరియ ఎలీసబెతుతో మూడు నెలలు గడిపిన తర్వాత తిరిగి నజరేతులోని తన ఇంటికి వెళ్ళింది.

మరియ యోసేపు అనే పురుషుణ్ణి పెళ్ళి చేసుకోవలసి ఉంది. కానీ మరియకు బిడ్డ పుట్టబోతున్నాడని యోసేపుకు తెలిసినప్పుడు ఆయన ఆమెను పెళ్ళి చేసుకోకూడదు అనుకున్నాడు. అప్పుడు దేవుని దూత ఆయనతో, ‘మరియను భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే దేవుడే ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు’ అని చెప్పాడు. అప్పుడు యోసేపు మరియ పెళ్ళి చేసుకొని, యేసు జననం కోసం ఎదురుచూశారు.