కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

89వ కథ

యేసు దేవాలయాన్ని శుభ్రపరచడం

యేసు దేవాలయాన్ని శుభ్రపరచడం

యేసు ఇక్కడ చాలా కోపంగా కనిపిస్తున్నాడు కదా? ఆయనకు అంత కోపం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ఎందుకంటే యెరూషలేములోని దేవాలయంలో ఈ మనుష్యులు చాలా దురాశతో ప్రవర్తించేవారు. వాళ్ళు దేవున్ని ఆరాధించడానికి వచ్చే ప్రజలనుండి ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నించేవారు.

అక్కడున్న కోడెదూడలను, గొర్రెలను, పావురాలను మీరు చూశారా? ఆ మనుష్యులు వాటిని దేవాలయంలోనే అమ్మేవారు. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే దేవునికి బలిగా అర్పించడానికి ఇశ్రాయేలీయులకు పశువులు, పక్షులు అవసరం.

ఒక ఇశ్రాయేలీయుడు ఎప్పుడైనా తప్పు చేస్తే, అతను దేవునికి బలి అర్పించాలని దేవుని ధర్మశాస్త్రం చెప్పింది. ఇశ్రాయేలీయులు వేరే సందర్భాల్లో కూడా బలులు అర్పించవలసి వచ్చేది. అయితే ఒక ఇశ్రాయేలీయుడు దేవునికి బలి అర్పించాలంటే అతనికి పక్షులు, పశువులు ఎక్కడ లభించేవి?

కొంతమంది ఇశ్రాయేలీయులకు స్వంతగా పక్షులు, పశువులు ఉండేవి. కాబట్టి వాళ్ళు వాటిని అర్పించేవాళ్ళు. కానీ చాలామంది ఇశ్రాయేలీయులకు స్వంత పశువులుగాని, పక్షులుగాని ఉండేవి కావు. మరికొందరు యెరూషలేముకు ఎంతో దూరంలో నివసించేవారు, కాబట్టి వాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు తమతోపాటు పశువులను తీసుకురాలేకపోయేవారు. అందువల్ల ప్రజలు దేవాలయానికి వచ్చి అక్కడే వాళ్ళకు కావలసిన పశువులను లేక పక్షులను కొనుక్కునేవారు. అయితే ఈ మనుష్యులు ప్రజలకు వాటిని మరీ ఎక్కువ ధరకు అమ్మేవాళ్ళు. వాళ్ళు ప్రజలను మోసగించేవారు. అంతేగాక దేవుని ఆలయంలో వాటిని అమ్మకూడదు.

అందుకే యేసుకు కోపం వచ్చింది. కాబట్టి ఆయన వాళ్ళు డబ్బులు పెట్టుకొన్న బల్లలను తలక్రిందులు చేసి వాళ్ళ నాణెములను విసిరేశాడు. అంతేగాక ఆయన త్రాళ్ళతో ఒక కొరడా చేసి పశువులన్నిటిని దేవాలయంనుండి బయటకు వెళ్ళగొట్టాడు. పావురాలు అమ్మే మనుష్యులతో, ‘వాటిని ఇక్కడనుండి తీసుకుపొండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా చేయవద్దు’ అని ఆజ్ఞాపించాడు.

యేసు అలా చేసినప్పుడు ఆయన అనుచరులలో కొంతమంది ఆయనతోపాటు యెరూషలేము దేవాలయంలోనే ఉన్నారు. యేసు చేసిన దానిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళకు దేవుని కూమారుని గురించి బైబిలులో వ్రాయబడిన ఈ మాటలు గుర్తుకు వచ్చాయి: ‘దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆయనను భక్షిస్తుంది.’

యేసు పస్కా పండుగను ఆచరిస్తూ యెరూషలేములో ఉన్నప్పుడు అనేక అద్భుతాలను చేశాడు. ఆ తర్వాత యేసు యూదయను విడిచి గలిలయకు తిరిగి ప్రయాణం ఆరంభించాడు. అయితే ఆయన వెళ్ళేటప్పుడు సమరయ జిల్లా గుండా వెళ్ళాడు. అక్కడ ఏమి జరిగిందో మనం చూద్దాం.