కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

91వ కథ

యేసు కొండమీద బోధించడం

యేసు కొండమీద బోధించడం

యేసు ఇక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి. గలిలయలోని ఒక కొండమీద ఆయన ఈ ప్రజలందరికీ బోధిస్తున్నాడు. ఆయనకు దగ్గరగా కూర్చొని ఉన్నవాళ్ళు ఆయన శిష్యులు. ఆయన 12 మందిని తన అపొస్తలులుగా ఉండడానికి ఎంపిక చేసుకున్నాడు. అపొస్తలులు యేసుకు ప్రత్యేకమైన శిష్యులు. వాళ్ళ పేర్లు మీకు తెలుసా?

సీమోను పేతురు, ఆయన సహోదరుడు అంద్రెయ ఉన్నారు. ఆ తర్వాత యాకోబు, యోహాను ఉన్నారు, వాళ్ళు కూడా సహోదరులే. యాకోబు అనే మరో అపొస్తలుడు, సీమోను అనే పేరుగల మరో అపొస్తలుడు ఉన్నారు. ఇద్దరు అపొస్తలులకు యూదా అనే పేరు ఉంది. వాళ్ళలో ఒకరు యూదా ఇస్కరియోతు, మరొకరు తద్దయి అని కూడా పిలువబడే యూదా. తర్వాత ఫిలిప్పు, నతనయేలు (బర్తొలొమయి అని కూడా పిలువబడ్డాడు), మత్తయి, తోమా అనేవాళ్ళు ఉన్నారు.

సమరయ నుండి తిరిగి వచ్చిన తర్వాత యేసు మొదటిసారిగా, ‘పరలోకరాజ్యము సమీపించింది’ అని ప్రకటించడం ప్రారంభించాడు. ఆ రాజ్యం ఏమిటో మీకు తెలుసా? అది దేవుని నిజమైన ప్రభుత్వం. దానికి రాజు యేసు. ఆయన పరలోకంనుండి పరిపాలిస్తూ భూమికి సమాధానం తెస్తాడు. దేవుని రాజ్యం ద్వారా భూమి అంతా అందమైన పరదైసుగా మార్చబడుతుంది.

యేసు ఆ రాజ్యం గురించే ప్రజలకు బోధించాడు. ‘పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడు గాక! నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక’ అని ప్రార్థన చేయాలి అని యేసు వాళ్ళకు నేర్పించాడు. ఆ ప్రార్థనను చాలామంది ‘పరలోక ప్రార్థన’ అని పిలుస్తారు. ఇతరులు ‘మన తండ్రి ప్రార్థన’ అంటారు. మీరు ఆ ప్రార్థనను పూర్తిగా చెప్పగలరా?

ప్రజలు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో కూడా యేసు బోధించాడు. ‘ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో, వాళ్ళకు కూడా మీరు అలాగే చేయండి’ అని ఆయన చెప్పాడు. ఇతరులు మీతో దయగా ప్రవర్తించినప్పుడు మీరు దానిని ఇష్టపడరా? కాబట్టి మనం ఇతరులతో దయగా ప్రవర్తించాలని యేసు చెప్పాడు. పరదైసు భూమిపై అందరూ అలా ప్రవర్తించినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది కదా?

మత్తయి 5 నుండి 7 అధ్యాయాలు;10:1-4.