కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

94వ కథ

ఆయన చిన్న పిల్లలను ప్రేమించడం

ఆయన చిన్న పిల్లలను ప్రేమించడం

ఇక్కడ చిన్న పిల్లవాని చుట్టూ తన చేతులు వేసిన యేసును చూడండి. యేసుకు చిన్న పిల్లలంటే నిజంగానే శ్రద్ధ ఉందని మనం చెప్పవచ్చు. వాళ్ళవైపు చూస్తున్న వ్యక్తులు ఆయన అపొస్తలులు. యేసు వాళ్ళతో ఏమి చెబుతున్నాడు? మనం తెలుసుకుందాం.

యేసు, ఆయన అపొస్తలులు చాలా దూరం ప్రయాణం చేసి అప్పుడే వచ్చారు. మార్గమధ్యంలో అపొస్తలులు తమలోతాము ఒక విషయం గురించి వాదించుకున్నారు. కాబట్టి ప్రయాణం ముగిసిన తరువాత యేసు వాళ్ళను, ‘మీరు దారిలో దేని గురించి వాదించుకున్నారు?’ అని అడిగాడు. నిజానికి వాళ్ళు దేని గురించి వాదించుకున్నారో యేసుకు తెలుసు. కానీ అపొస్తలులు ఆ విషయాన్ని తనకు చెబుతారో లేదో చూడడానికి ఆయన అలా అడిగాడు.

అపొస్తలులు యేసు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే త్రోవలో వాళ్ళు, తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. కొంతమంది అపొస్తలులు ఇతరులకంటే ప్రాముఖ్యమైన వారిగా ఉండాలని కోరుకున్నారు. అలా మిగతా వాళ్ళకంటే గొప్పగా ఉండాలని కోరుకోవడం మంచిది కాదని యేసు వాళ్ళకు ఎలా చెప్పాడు?

ఆయన ఒక చిన్న పిల్లవాన్ని పిలిచి శిష్యులందరి ఎదుట నిలబెట్టాడు. తర్వాత ఆయన శిష్యులతో, ‘మీరు మార్పు చేసుకొని చిన్న పిల్లలవంటి వారైతే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఈ బిడ్డవలే మారినవాడే దేవుని రాజ్యంలో గొప్పవాడు’ అని చెప్పాడు. యేసు అలా ఎందుకు చెప్పాడో మీకు తెలుసా?

ఎందుకంటే చిన్నపిల్లలు ఇతరులకంటే గొప్పవారిగా లేదా ప్రాముఖ్యమైనవారిగా ఉండాలని ఆలోచించరు. కాబట్టి అపొస్తలులు చిన్న పిల్లలవలె ఉండడం నేర్చుకొని ఎవరు గొప్పవారు లేదా ఎవరు ప్రాముఖ్యమైనవారు అని వాదించుకోకూడదు.

యేసు తనకు చిన్న పిల్లలపై ఎంత శ్రద్ధ ఉందో ఇతర సందర్భాల్లో కూడా చూపించాడు. కొన్ని నెలల తర్వాత కొంతమంది తమ పిల్లలను తీసుకొని యేసును చూడడానికి వచ్చారు. అపొస్తలులు వాళ్ళను యేసుకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించారు. అప్పుడు యేసు తన అపొస్తలులతో, ‘పిల్లలను నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే’ అని చెప్పాడు. ఆ తర్వాత యేసు పిల్లలను తన చేతుల్లోకి తీసుకొని వాళ్ళను ఆశీర్వదించాడు. యేసు చిన్న పిల్లలను ప్రేమించాడని తెలుసుకోవడం సంతోషాన్ని కలిగించడం లేదా?