కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

95వ కథ

యేసు బోధించే విధానం

యేసు బోధించే విధానం

ఒకరోజు యేసు ‘నువ్వు నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అని ఒక వ్యక్తితో చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి, ‘నా పొరుగువాడెవడు?’ అని యేసును అడిగాడు. ఆ వ్యక్తి ఏమి ఆలోచిస్తున్నాడో యేసుకు తెలుసు. కేవలం తన జాతికి, తన మతానికి చెందినవారే తన పొరుగువారని ఆ వ్యక్తి భావిస్తున్నాడు. అయితే యేసు అతనికి ఎలా సమాధానమిచ్చాడో మనం చూద్దాం.

కొన్నిసార్లు యేసు ఒక కథ చెప్పడం ద్వారా బోధించేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా యేసు అదే పని చేశాడు. ఆయన ఒక యూదుడు, ఒక సమరయుడు ఉండే కథ ఒకటి చెప్పాడు. చాలామంది యూదులు సమరయులను ఇష్టపడరని మనం ముందే తెలుసుకున్నాం. యేసు చెప్పిన కథ ఇలా ఉంది:

ఒకరోజు ఒక యూదుడు పర్వత మార్గం గుండా యెరికోకు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనిపై దొంగలు పడ్డారు. వాళ్ళు అతని డబ్బు దోచుకొని దాదాపు చనిపోయేలా అతన్ని కొట్టారు.

తర్వాత, ఒక యూదా యాజకుడు ఆ మార్గంలో వచ్చాడు. అతను బాగా గాయపడిన వ్యక్తిని చూశాడు. అతనేమి చేసివుంటాడని మీరనుకుంటున్నారు? అతను వెంటనే రోడ్డు దాటి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎంతో దైవభక్తిగల వ్యక్తి ఒకతను ఆ దారిలో వచ్చాడు. అతను ఒక లేవీయుడు. మరి అతను ఆగాడా? లేదు, గాయపడిన వ్యక్తికి సహాయం చేయడానికి అతను కూడా ఆగలేదు. యాజకుడు, లేవీయుడు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోవడాన్ని మీరు చిత్రంలో చూడవచ్చు.

కానీ గాయపడిన వ్యక్తితో ఎవరున్నారో చూడండి. ఆయన ఒక సమరయుడు. ఆయన ఆ యూదునికి సహాయం చేశాడు. ఆయన ఆ వ్యక్తి గాయాలకు మందు రాశాడు. ఆ తర్వాత ఆయన ఆ యూదుడు విశ్రాంతి తీసుకొని, కోలుకోవడానికి వీలుగా ఒక చోటికి తీసుకొని వెళ్ళాడు.

యేసు కథ చెప్పడం ముగించిన తర్వాత తనను ఆ ప్రశ్న అడిగిన వ్యక్తిని, ‘ఈ ముగ్గురిలో ఎవరు గాయపడిన వ్యక్తికి పొరుగువానిగా ప్రవర్తించారని నువ్వు అనుకుంటున్నావు? యాజకుడా, లేవీయుడా లేక సమరయుడా?’ అని ప్రశ్నించాడు.

అప్పుడు అతను, ‘సమరయుడే పొరుగువానిలా ప్రవర్తించాడు. గాయపడిన వ్యక్తిపట్ల దయ చూపించింది ఆయనే’ అని సమాధానమిచ్చాడు.

యేసు అతనితో ‘సరిగ్గా చెప్పావు. కాబట్టి నువ్వు కూడా అతనిలాగే చెయ్యి’ అని చెప్పాడు.

యేసు బోధించే విధానం మీకు నచ్చిందా? యేసు బైబిల్లో చెప్పిన విషయాలను వినడం ద్వారా మనం ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు కదా?