కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

96వ కథ

యేసు రోగులను స్వస్థపరచడం

యేసు రోగులను స్వస్థపరచడం

యేసు దేశమంతటా ప్రయాణిస్తున్నప్పుడు రోగులను స్వస్థపరిచేవాడు. ఆయన చేసిన అద్భుతాల గురించి చుట్టుప్రక్కల గ్రామాల్లోని పట్టణాల్లోని ప్రజలకు తెలిసిపోయేది. కాబట్టి ప్రజలు అంగవిహీనులను, గ్రుడ్డివాళ్ళను, చెవిటివాళ్ళను, ఇతర వ్యాధులతో బాధపడేవారిని చాలామందిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చేవారు. యేసు వాళ్ళందరినీ స్వస్థపరిచేవాడు.

యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చి అప్పటికి మూడు సంవత్సరాలకంటే ఎక్కువకాలం గడిచింది. యేసు తాను త్వరలోనే యెరూషలేముకు వెళతానని, అక్కడ తాను చంపబడతానని, ఆ తర్వాత మృతులలోనుండి తిరిగి లేపబడతానని తన అపొస్తలులకు చెప్పాడు. అలా జరిగేంతవరకూ యేసు వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూనే ఉన్నాడు.

ఒకరోజు యేసు సబ్బాతు దినాన బోధిస్తున్నాడు. సబ్బాతు యూదులకు విశ్రాంతి దినం. చిత్రంలో మీకు కనిపిస్తున్న ఆ స్త్రీ వ్యాధిగ్రస్తురాలు. ఆమె 18 సంవత్సరాలుగా అలా వంగిపోయి ఉంది, ఆమె సరిగ్గా నిలబడలేకపోయేది. యేసు ఆమెపై తన చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఆమె స్వస్థతపొందింది!

అది చూసి మతనాయకులకు చాలా కోపం వచ్చింది. వారిలో ఒకడు ‘మనం పని చేయడానికి ఆరు రోజులు ఉన్నాయి. స్వస్థపరచబడడానికి రావలసింది ఆ రోజుల్లోనే కానీ విశ్రాంతి దినాన కాదు!’ అని అరిచాడు.

అందుకు యేసు, ‘చెడ్డ మనుష్యులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినాన తన గాడిదను విప్పి తోలుకొని వెళ్ళి దానికి నీళ్ళు పెడతాడు. పద్దెనిమిది సంవత్సరాలనుండి వ్యాధితో బాధపడుతున్న ఈ స్త్రీ విశ్రాంతి దినాన స్వస్థపరచబడకూడదా?’ అన్నాడు. యేసు అన్న మాటలకు ఆ చెడ్డ మనుష్యులు అవమానంతో తలవంచుకున్నారు.

తర్వాత యేసు, ఆయన అపొస్తలులు యెరూషలేము వైపుకు ప్రయాణమై వెళ్ళారు. వాళ్ళు యెరికో పట్టణం వెలుపలికి చేరుకోగానే ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిలో వెళ్తున్నాడన్న సంగతి విని, ‘యేసూ మాకు సహాయం చెయ్యి!’ అని కేకలు వేశారు.

యేసు ఆ గ్రుడ్డివాళ్ళను తన దగ్గరకు పిలిచి ‘నేను మీకు ఏమి చెయ్యాలి?’ అని అడిగాడు. అందుకు వాళ్ళు ‘ప్రభువా, మా కళ్ళు తెరిపించు’ అన్నారు. యేసు వాళ్ళ కళ్ళను ముట్టుకున్నప్పుడు వెంటనే వాళ్ళు చూడగలిగారు! యేసు ఇలాంటి ఆశ్చర్యకరమైన అద్భుతాలు ఎందుకు చేసేవాడో మీకు తెలుసా? ఎందుకంటే ఆయన ప్రజలను ప్రేమించాడు, వాళ్ళు తనపై విశ్వాసముంచాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన రాజుగా పరిపాలించేటప్పుడు భూమ్మీద ఎవ్వరూ వ్యాధులతో బాధపడరు అని మనం నమ్మకంతో ఉండవచ్చు.