కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

100వ కథ

తోటలో యేసు

తోటలో యేసు

మేడ గదిని విడిచిన తర్వాత యేసు, ఆయన అపొస్తలులు గెత్సేమనే తోటకు వెళ్ళారు. వాళ్ళు ఇంతకుముందు చాలాసార్లు అక్కడకు వెళ్ళారు. యేసు వాళ్ళను మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన కొంతదూరం వెళ్ళి, నేలకు తలవంచి ప్రార్థన చేశాడు.

తర్వాత యేసు తన అపొస్తలుల దగ్గరకు వచ్చాడు. అప్పుడు వాళ్ళేమి చేస్తున్నారో తెలుసా? వాళ్ళు నిద్రపోతున్నారు! యేసు వాళ్ళకు మెలకువగా ఉండమని మూడుసార్లు చెప్పాడు, కానీ ఆయన తిరిగి వచ్చిన ప్రతిసారీ వాళ్ళు నిద్రపోతూనే కనిపించారు. యేసు చివరిసారి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళతో ‘ఇలాంటి సమయంలో మీరు ఎలా నిద్రపోతున్నారు? నేను నా శత్రువులకు అప్పగింపబడే సమయం వచ్చింది’ అని అన్నాడు.

ఆ క్షణంలోనే పెద్ద జనసమూహం వస్తున్నట్లు శబ్దం వినబడింది. అదిగో చూడండి! మనుష్యులు కత్తులతో, గుదియలతో వచ్చారు! వాళ్ళు వెలుతురు కోసం తమవెంట దివిటీలు కూడా తెచ్చుకున్నారు. వాళ్ళు దగ్గరకు రాగానే జనసమూహంలో నుండి ఒక వ్యక్తి ముందుకు వచ్చి యేసు పక్కన నిలబడ్డాడు. మీరు చిత్రంలో చూస్తున్నట్లుగా అతడు యేసును ముద్దుపెట్టుకున్నాడు. ఆ వ్యక్తి యూదా ఇస్కరియోతు! అతడు యేసును ఎందుకు ముద్దుపెట్టుకున్నాడు?

యేసు అతనితో ‘యూదా, ఒక ముద్దుతో నువ్వు నన్ను అప్పగిస్తున్నావా?’ అన్నాడు. అవును, ఆ ముద్దు ఒక గుర్తులా పని చేసింది. అది యూదాతోపాటు వచ్చిన మనుష్యులు యేసును గుర్తించడానికి సహాయపడింది. వెంటనే యేసు శత్రువులు ఆయనను పట్టుకోవడానికి ముందుకు వచ్చారు. కానీ పేతురు వాళ్ళు యేసును పట్టుకొని వెళ్ళడానికి అనుమతించాలనుకోలేదు. ఆయన తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటకు తీసి తన దగ్గరున్న మనిషిపై దాడి చేశాడు. ఆ కత్తి కొంచెంలో అతని తలను తప్పి, కుడి చెవిని తెగనరికింది. అయితే యేసు అతని చెవిని ముట్టి అతనిని స్వస్థపరిచాడు.

యేసు పేతురుతో, ‘నీ కత్తిని దాని స్థానంలో పెట్టు. నన్ను రక్షించడానికి వేలాదిమంది దూతలను పంపించమని నేను నా తండ్రిని వేడుకోలేనని అనుకుంటున్నావా?’ అని అడిగాడు. అవును, ఆయన అలా వేడుకోగలడు! కానీ యేసు దూతలను పంపమని తన తండ్రిని అడగలేదు, ఎందుకంటే తన శత్రువులు తనను పట్టుకొనే సమయం వచ్చిందని ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్ళు తనను తీసుకొని వెళ్ళడానికి ఆయన అనుమతించాడు. ఆ తర్వాత యేసుకు ఏమి జరిగిందో చూద్దాం.