కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

102వ కథ

యేసు సజీవుడవడం

యేసు సజీవుడవడం

ఇక్కడ కనిపిస్తున్న స్త్రీ, ఆ ఇద్దరు పురుషులు ఎవరో మీకు తెలుసా? ఆ స్త్రీ మగ్దలేనే మరియ, ఆమె యేసు స్నేహితురాలు. తెల్లని వస్త్రాలు ధరించిన ఆ పురుషులు దేవదూతలు. మరియ తొంగిచూస్తున్న ఈ చిన్న గది, యేసు మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని ఉంచిన స్థలం. దానిని సమాధి అంటారు. కానీ ఇప్పుడు యేసు శరీరం అక్కడ లేదు! దానిని ఎవరు తీసుకెళ్ళారు? చూద్దాం.

యేసు చనిపోయిన తర్వాత యాజకులు పిలాతుతో ఇలా అన్నారు: ‘యేసు బ్రతికి ఉన్నప్పుడు, తాను మరణించిన తర్వాత మూడు రోజులకు లేపబడతానని చెప్పాడు. కాబట్టి సమాధి దగ్గర కాపలా కాయమని ఆజ్ఞాపించండి. అప్పుడు అతని శిష్యులు అతని శరీరాన్ని దొంగిలించి, అతను మృతులలోనుండి లేచాడు అని చెప్పలేరు.’ సమాధిని కాపలా కాయడానికి సైనికులను పంపమని పిలాతు యాజకులతో చెప్పాడు.

యేసు మరణించిన తర్వాత మూడవ దినాన పెందలాడే యెహోవా దూత అకస్మాత్తుగా సమాధి దగ్గరకు వచ్చాడు. ఆయన సమాధిని కప్పివుంచిన రాయిని పక్కకు జరిపాడు. అది చూసిన సైనికులు ఎంతో భయపడి కదలకుండా అలాగే నిలబడిపోయారు. చివరకు వాళ్ళు, సమాధిలోకి చూసినప్పుడు యేసు శరీరం అక్కడ కనిపించలేదు! సైనికులలో కొంతమంది పట్టణంలోకి వెళ్ళి ఆ విషయాన్ని యాజకులకు చెప్పారు. అప్పుడు ఆ చెడ్డ యాజకులు ఏమి చేశారో మీకు తెలుసా? అబద్ధాలు చెప్పమని సైనికులకు డబ్బు ఇచ్చారు. ‘మేము నిద్రిస్తున్నప్పుడు యేసు శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని దొంగిలించుకు పోయారని చెప్పండి’ అని యాజకులు ఆ సైనికులకు చెప్పారు.

ఈలోగా, యేసు స్నేహితులైన కొందరు స్త్రీలు ఆయన సమాధిని దర్శించడానికి వచ్చారు. సమాధి ఖాళీగా ఉండడం చూసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు! అప్పుడు వాళ్ళకు అకస్మాత్తుగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రాలతో కనిపించారు. ‘మీరు యేసు కోసం ఇక్కడ ఎందుకు వెదుకుతున్నారు? ఆయన పునరుత్థానం చేయబడ్డాడు. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని ఆయన శిష్యులకు చెప్పండి’ అని చెప్పారు. ఆ స్త్రీలు ఎంత వేగంగా పరుగెత్తుకు వెళ్ళారో! కానీ మార్గ మధ్యంలో ఒక వ్యక్తి వాళ్ళను ఆపాడు. ఆయన ఎవరో మీకు తెలుసా? ఆయన యేసే! ‘వెళ్ళి నా శిష్యులకు చెప్పండి’ అని యేసు అన్నాడు.

ఆ స్త్రీలు వెళ్ళి శిష్యులతో యేసు సజీవుడయ్యాడని, తాము ఆయనను చూశామని చెప్పినప్పుడు, శిష్యులు దానిని నమ్మలేకపోయారు. పేతురు, యోహాను తామే స్వయంగా చూడాలని సమాధి దగ్గరకు పరుగెత్తారు, కానీ సమాధి ఖాళీగా కనిపించింది! పేతురు, యోహాను అక్కడనుండి వెళ్ళిపోయినా మగ్దలేనే మరియ అక్కడే నిలబడింది. ఆమె లోపలికి తొంగి చూస్తే ఆ ఇద్దరు దేవదూతలు కనిపించింది అప్పుడే.

యేసు శరీరానికి ఏమయ్యిందో మీకు తెలుసా? అది అదృశ్యమయ్యేలా దేవుడు చేశాడు. దేవుడు యేసును ఆయన మరణించిన భౌతిక శరీరంతోనే తిరిగి లేపలేదు. ఆయన పరలోకంలోని దూతలకు ఉన్నలాంటి కొత్త ఆత్మ శరీరాన్ని యేసుకు ఇచ్చాడు. అయితే యేసు తాను సజీవుడనై ఉన్నానని తన శిష్యులకు చూపేందుకు మనుష్యులు చూడగలిగే శరీరాన్ని ధరించగలడు. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం.