కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

103వ కథ

గడియ వేసివున్న గదిలోకి ప్రవేశించడం

గడియ వేసివున్న గదిలోకి ప్రవేశించడం

యేసు శరీరాన్ని ఉంచిన సమాధి దగ్గర నుండి పేతురు, యోహాను వెళ్ళిపోయిన తర్వాత, మరియ అక్కడే ఉండిపోయింది. ఆమె ఏడ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత మనం ముందు కథలోని చిత్రంలో చూసినట్లుగా ఆమె ముందుకు వంగి, సమాధిలోకి చూసింది. అక్కడ ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు! వాళ్ళు ఆమెను ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగారు.

అందుకు మరియ, ‘వాళ్ళు నా ప్రభువును తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు ఆయనను ఎక్కడ పెట్టారో నాకు తెలియదు’ అని సమాధానమిచ్చింది. తర్వాత మరియ వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన ఆమెను, ‘నీవు ఎవరి కోసం వెదకుతున్నావు?’ అని అడిగాడు.

మరియ ఆ వ్యక్తి తోటమాలి అనుకొని, బహుశా అతను యేసు శరీరాన్ని తీసుకెళ్ళి ఉండవచ్చు అనుకుంది. కాబట్టి ఆమె అతనితో, ‘నీవు ఆయనను తీసుకొని వెళ్ళివుంటే, ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు’ అని అడిగింది. అయితే నిజానికి ఆ వ్యక్తి యేసు. ఆయన మరియ గుర్తుపట్టలేని శరీరాన్ని ధరించి ఉన్నాడు. కానీ ఆయన ఆమెను పేరుతో పిలిచినప్పుడు, ఆయన యేసు అని ఆమె గుర్తించింది. ఆమె పరుగెత్తుకొని వెళ్ళి శిష్యులతో ‘నేను ప్రభువును చూశాను!’ అని చెప్పింది.

తర్వాత అదే రోజు, ఇద్దరు శిష్యులు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు మార్గంలో వాళ్ళకు ఒక వ్యక్తి కలిశాడు. యేసు చంపబడినందుకు ఆ శిష్యులు ఎంతో దుఃఖంతో ఉన్నారు. అయితే వాళ్ళు నడిచి వెళ్తుండగా, ఆ వ్యక్తి వాళ్ళకు ఓదార్పునిచ్చే అనేక విషయాలను బైబిలు నుండి వివరించాడు. చివరకు వాళ్ళు భోజనం చేయడానికి ఆగినప్పుడు, ఆ వ్యక్తి యేసేనని శిష్యులు గుర్తించారు. తర్వాత యేసు అదృశ్యమయ్యాడు. ఆ ఇద్దరు శిష్యులు ఆ విషయాన్ని అపొస్తలులకు తెలియజేయడానికి వెంటనే యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.

అది జరుగుతుండగా, యేసు పేతురుకు కూడా కనిపించాడు. ఆ సంగతిని విన్నప్పుడు ఇతరులు ఎంతో సంతోషించారు. తర్వాత ఆ ఇద్దరు శిష్యులు యెరూషలేముకు వెళ్ళి అపొస్తలులను కలిశారు. వాళ్ళకు కూడా మార్గమధ్యంలో యేసు కనిపించిన సంగతి చెప్పారు. వాళ్ళు అలా చెబుతుండగా జరిగిన ఆశ్చర్యకరమైన విషయమేమిటో మీకు తెలుసా?

ఇక్కడున్న చిత్రాన్ని చూడండి. తలుపులు గడియవేసి ఉన్నప్పటికీ యేసు ఆ గదిలోకి ప్రవేశించాడు. శిష్యులు ఎంత ఆనందించారో! అది ఎంతో ఉత్తేజకరమైన రోజు కదా? అప్పటివరకు యేసు తన అనుచరులకు ఎన్నిసార్లు కనిపించాడో మీరు లెక్కించగలరా? ఐదు సార్లు అని మీరు లెక్కించారా?

యేసు వాళ్ళకు కనిపించినప్పుడు అపొస్తలుడైన తోమా వాళ్ళతో లేడు. కాబట్టి శిష్యులు ఆయనతో, ‘మేము ప్రభువును చూశాము!’ అని చెప్పారు. అయితే తోమా ఆ విషయాన్ని నమ్మాలంటే తనే స్వయంగా యేసును చూడాలి అన్నాడు. ఎనిమిది రోజుల తర్వాత శిష్యులు మళ్ళీ గడియవేసివున్న గదిలో కలుసుకున్నారు, ఈసారి వాళ్ళతోపాటు తోమా ఉన్నాడు. అకస్మాత్తుగా యేసు ఆ గదిలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమా నమ్మాడు.