కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

104వ కథ

యేసు పరలోకానికి వెళ్లడం

యేసు పరలోకానికి వెళ్లడం

రోజులు గడిచే కొద్దీ యేసు చాలాసార్లు తన అనుచరులకు కనిపించాడు. ఒకసారి దాదాపు 500 మంది శిష్యులు ఆయనను చూశారు. యేసు వాళ్ళకు కనిపించినప్పుడు, ఆయన వాళ్ళతో ఏ విషయం గురించి మాట్లాడాడో తెలుసా? దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. రాజ్యం గురించి బోధించడానికే యెహోవా యేసును భూమిపైకి పంపించాడు. యేసు మృతులలోనుండి లేపబడిన తర్వాత కూడా ఆ పని చేశాడు.

దేవుని రాజ్యమంటే ఏమిటో మీకు గుర్తుందా? అవును, దేవుని రాజ్యమంటే పరలోకంలో ఉన్న దేవుని నిజమైన ప్రభుత్వము, దానికి రాజుగా ఉండేందుకు దేవుడు యేసును ఎన్నుకున్నాడు. మనం తెలుసుకున్నట్లుగా, యేసు ఆకలితోవున్నవారికి ఆహారము పెట్టడం ద్వారా, వ్యాధిగ్రస్తులను స్వస్థపర్చడం ద్వారా, చివరకు చనిపోయిన వాళ్ళను తిరిగి బ్రతికించడం ద్వారా తాను ఎంత అద్భుతమైన రాజుగా ఉంటాడో చూపించాడు!

కాబట్టి యేసు పరలోకంలో వెయ్యి సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసినప్పుడు భూమిపై పరిస్థితులు ఎలా ఉంటాయి? భూమి అంతా ఒక అందమైన పరదైసుగా మార్చబడుతుంది. ఇక భూమిపై యుద్ధాలు, నేరము, వ్యాధులు లేక మరణం ఉండవు. అలా తప్పకుండా జరుగుతుందని మనకు తెలుసు ఎందుకంటే మానవులు సంతోషంగా ఉండడానికే దేవుడు భూమిని పరదైసుగా చేశాడు. ఆయన మొదట్లో ఏదెను తోటను చేసింది కూడా అందుకే. దేవుడు ఏమి చేయబడాలని కోరుకుంటున్నాడో, అది నెరవేరేలా యేసు చూస్తాడు.

యేసు తిరిగి పరలోకానికి వెళ్లే సమయం వచ్చింది. యేసు 40 రోజులపాటు తన శిష్యులకు కనిపించాడు. కాబట్టి ఆయన తిరిగి లేచాడని వాళ్ళకు నమ్మకం కుదిరింది. అయితే ఆయన తన శిష్యులను విడిచి వెళ్లేముందు, ‘మీరు పరిశుద్ధాత్మను పొందేవరకూ యెరూషలేములోనే ఉండండి’ అని వాళ్ళకు చెప్పాడు. పరిశుద్ధాత్మ అంటే దేవుని చురుకైన శక్తి, అది వీచే గాలిలా ఉంటుంది, అది దేవుని చిత్తాన్ని చేయడానికి యేసు అనుచరులకు సహాయపడుతుంది. చివరిగా యేసు, ‘మీరు భూదిగంతముల వరకు నా గురించి ప్రకటించాలి’ అని చెప్పాడు.

యేసు ఇలా చెప్పిన తరువాత ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళడం ప్రారంభించాడు. తర్వాత, మేఘాలు ఆయనను కనిపించకుండా చేశాయి. శిష్యులు ఆ తర్వాత మళ్ళీ యేసును చూడలేదు. యేసు పరలోకానికి వెళ్ళి, అక్కడ నుండి భూమిపైనున్న తన అనుచరులను పరిపాలించడం ప్రారంభించాడు.