కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

106వ కథ

చెరసాలనుండి విడిపించబడడం

చెరసాలనుండి విడిపించబడడం

చెరసాల తలుపులు తెరిచి పట్టుకున్న ఆ దేవదూతను చూడండి. ఆయన విడిపిస్తున్న వ్యక్తులు యేసు అపొస్తలులు. వాళ్ళు చెరసాలలో వేయబడడానికి దారితీసిన పరిస్థితులేమిటో తెలుసుకుందాం.

యేసు శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడి అప్పటికి కొంతకాలమే అయ్యింది. జరిగిన సంగతేమిటంటే: ఒకరోజు మధ్యాహ్నం పేతురు, యోహాను యెరూషలేములోని దేవాలయంలోకి వెళ్తున్నారు. దేవాలయం ద్వారం దగ్గర, పుట్టినప్పటి నుండి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళ దగ్గర భిక్షమడుక్కోవడానికి వీలుగా కొందరు ప్రతిరోజు అతనిని అక్కడకు మోసికొని వచ్చేవాళ్ళు. అతను పేతురు, యోహానులను చూసినప్పుడు తనకు భిక్షమివ్వమని వాళ్ళను అడిగాడు. అప్పుడు అపొస్తలులు ఏమి చేశారు?

వాళ్ళు ఆగి ఆ పేదవానివైపు చూశారు. పేతురు అతనితో, ‘నా దగ్గర డబ్బులేమీ లేవు, కానీ నా దగ్గర ఉన్నదేదో అదే ఇస్తాను. యేసు నామమున లేచి నడువు!’ అన్నాడు. పేతురు అతని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తినప్పుడు అతను వెంటనే లేచి నడవడం ప్రారంభించాడు. ప్రజలు దానిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు, ఆ గొప్ప అద్భుతం జరిగినందుకు వాళ్ళు ఎంతో సంతోషించారు.

‘యేసును మృతులలోనుండి లేపిన దేవుని శక్తితోనే మేము ఈ అద్భుతాన్ని చేశాము’ అని పేతురు చెప్పాడు. ఆయన, యోహాను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మతనాయకులు అక్కడకు వచ్చారు. పేతురు యోహానులు యేసు మృతులలోనుండి లేపబడ్డాడని ప్రజలతో చెబుతున్నందుకు వాళ్ళకు చాలా కోపం వచ్చింది. కాబట్టి వాళ్ళు అపొస్తలులను బలవంతంగా లాక్కొని వెళ్ళి చెరసాలలో వేశారు.

మరుసటి రోజు మతనాయకులు పెద్ద సమావేశం జరిపారు. పేతురు, యోహాను, వాళ్ళు బాగు చేసిన వ్యక్తి పిలిపించబడ్డారు. ‘మీరు ఎవరి శక్తితో ఈ అద్భుతాన్ని చేశారు?’ అని మతనాయకులు అడిగారు.

యేసును మృతులలోనుండి లేపిన దేవుని శక్తితోనే దానిని చేశామని పేతురు చెప్పాడు. ఆ గొప్ప అద్భుతం నిజంగా జరగలేదని వాళ్ళు త్రోసిపుచ్చలేరు కాబట్టి యాజకులకు ఏమి చెయ్యాలో తెలియలేదు. వాళ్ళు యేసు నామమున ఇక ఎంత మాత్రమూ బోధించవద్దని అపొస్తలులను హెచ్చరించి వాళ్ళను పంపించారు.

రోజులు గడిచే కొద్దీ అపొస్తలులు యేసు గురించి ప్రకటిస్తూ వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూనే వచ్చారు. ఆ అద్భుతకార్యాల గురించిన వార్త అంతటా వ్యాపించింది. కాబట్టి యెరూషలేము చుట్టు ప్రక్కల పట్టణాలకు చెందినవారు కూడా అపొస్తలుల దగ్గరకు రోగులను తీసుకొని వచ్చారు. అది చూసి మతనాయకులు అసూయపడి, అపొస్తలులను బలవంతంగా పట్టుకొని చెరసాలలో వేశారు. అయితే వాళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉండలేదు.

మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా, రాత్రివేళ దేవుని దూత చెరసాల తలుపులను తెరిచాడు. ‘మీరు దేవాలయంలో నిలబడి ప్రజలకు ప్రకటిస్తూనే ఉండండి’ అని దేవదూత వాళ్ళకు చెప్పాడు. మరుసటి రోజు ఉదయం మతనాయకులు అపొస్తలులను తీసుకురమ్మని మనుష్యులను పంపినప్పుడు వాళ్ళక్కడ కనిపించలేదు. తరువాత ఈ మనుష్యులు అపొస్తలులు దేవాలయంలో బోధించడాన్ని చూసి, వాళ్ళను మహా సభ ఎదుటకు తెచ్చారు.

‘ఇక మీదట యేసు గురించి బోధించవద్దని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించాము. కానీ మీరు మీ బోధతో యెరూషలేమును నింపేశారు’ అని మతనాయకులు అన్నారు. దానికి అపొస్తలులు ‘మేము మనుష్యులకు కాదు పరిపాలకునిగా దేవునికే విధేయత చూపించాలి’ అని సమాధానమిచ్చారు. కాబట్టి వాళ్ళు “సువార్తను” బోధించడంలో కొనసాగారు. మనం అనుసరించడానికి అది ఒక మంచి మాదిరి కదా?