కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

108వ కథ

దమస్కుకు వెళ్లే మార్గంలో

దమస్కుకు వెళ్లే మార్గంలో

నేలమీద పడివున్న ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆయన సౌలు. స్తెఫనును రాళ్ళతో కొడుతున్న మనుష్యుల పైవస్త్రాల దగ్గర కావలిగా నిలబడిన వ్యక్తి ఆయనే. ఆ కాంతివంతమైన వెలుగును చూడండి! అక్కడ ఏమి జరుగుతోంది?

స్తెఫను చంపబడిన తర్వాత, యేసు అనుచరులను పట్టుకొని వాళ్ళను హింసించడంలో సౌలు నాయకత్వం వహించాడు. ఆయన ప్రతి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళను బయటకు ఈడ్చి, చెరసాలలో వేసేవాడు. శిష్యులలో చాలామంది వేరే పట్టణాలకు పారిపోయి అక్కడ “సువార్తను” ప్రకటించడం మొదలుపెట్టారు. అయితే సౌలు యేసు అనుచరులను పట్టుకోవడానికి ఇతర పట్టణాలకు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన దమస్కుకు వెళ్తున్నాడు. అయితే మార్గ మధ్యంలో ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది:

అకస్మాత్తుగా ఆకాశంనుండి ఒక వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించింది. మనం ఇక్కడ చూస్తున్నట్లుగా ఆయన నేలమీద పడ్డాడు. అప్పుడు ఒక స్వరం ‘సౌలా, సౌలా! నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు?’ అని అడిగింది. సౌలుతోపాటు ఉన్న మనుష్యులు ఆ వెలుగును చూశారు, ఆ స్వరాన్ని విన్నారు కానీ వాళ్ళకేమి అర్థం కాలేదు.

‘ప్రభువా నువ్వెవరు?’ అని సౌలు అడిగాడు.

‘నేను నువ్వు హింసిస్తున్న యేసును’ అని ఆ స్వరం చెప్పింది. సౌలు యేసు అనుచరులను హింసించినప్పుడు, యేసుకు తానే హింసించబడినట్లు అనిపిస్తుంది కాబట్టి ఆయన అలా అన్నాడు.

అప్పుడు సౌలు, ‘ప్రభువా నేనేమి చేయాలి?’ అని అడిగాడు.

‘నువ్వు లేచి దమస్కుకు వెళ్ళు. అక్కడ నువ్వు ఏమి చేయాలో నీకు చెప్పబడుతుంది’ అని యేసు చెప్పాడు. సౌలు లేచి కళ్ళు తెరిచినప్పుడు ఆయనకు ఏమీ కనపడలేదు. ఆయన గ్రుడ్డివాడయ్యాడు! కాబట్టి ఆయనతోపాటు ఉన్న మనుష్యులు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను దమస్కుకు నడిపించారు.

ఆ తర్వాత యేసు దమస్కులో ఉన్న తన శిష్యులలో ఒకరితో మాట్లాడుతూ, ‘అననీయా, నువ్వు లేచి తిన్ననిది అనబడు వీధికి వెళ్ళు. అక్కడ యూదా ఇంటికి వెళ్ళి సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. ఆయనను నేను నా ప్రత్యేకమైన సేవకునిగా ఉండడానికి ఎంపిక చేసుకున్నాను’ అని చెప్పాడు.

అననీయ అలాగే చేశాడు. సౌలును కలుసుకున్నప్పుడు ఆయన అతనిపై తన చేతులుంచి, ‘నువ్వు మళ్ళీ చూపు పొంది, పరిశుద్ధాత్మతో నింపబడడానికి ప్రభువు నన్ను పంపించాడు’ అని చెప్పాడు. వెంటనే సౌలు కన్నులనుండి పొరలవంటివేవో రాలి పడ్డాయి, ఆయన మళ్లీ చూడగలిగాడు.

అనేక దేశాల ప్రజలకు ప్రకటించడానికి సౌలు ఎంతో శక్తివంతమైన విధంగా ఉపయోగించుకోబడ్డాడు. ఆయన అపొస్తలుడైన పౌలు అని పిలువబడ్డాడు. ఆయన గురించి మనం ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. అయితే దేవుడు పేతురును ఏమి చేయడానికి పంపించాడో మొదట చూద్దాం.