కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

112వ కథ

ద్వీపం దగ్గర ఓడ బద్దలు కావడం

ద్వీపం దగ్గర ఓడ బద్దలు కావడం

చూడండి! ఓడ ప్రమాదంలో ఉంది! అది ముక్కలు ముక్కలుగా విరిగిపోతోంది! నీళ్ళల్లోకి దూకిన మనుష్యులను మీరు చూస్తున్నారా? కొంతమంది అప్పటికే ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడున్నది పౌలేనా? ఆయనకు ఏమి జరుగుతుందో మనం చూద్దాం.

పౌలు రెండు సంవత్సరాలు కైసరయలోని చెరసాలలో ఉన్నాడని గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఆయన, ఆయనతోపాటు మరి కొంతమంది ఖైదీలు ఓడలో ఎక్కించబడ్డారు, ఓడ రోమాకు బయలుదేరింది. వాళ్ళు క్రేతు ద్వీపానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు భయంకరమైన తుపాను చెలరేగింది. గాలి ఎంత బలంగా వీచిందంటే, ప్రజలు ఓడను సరిగ్గా నడపలేకపోయారు. వాళ్ళకు పగలు సూర్యుడు గాని, రాత్రివేళ నక్షత్రాలు గాని కనిపించలేదు. చాలా రోజుల తర్వాత, ఓడలో ఉన్నవాళ్ళంతా తాము బ్రతుకుతామనే ఆశను కూడా కోల్పోయారు.

అప్పుడు పౌలు లేచి నిలబడి ఇలా చెప్పాడు: ‘మీలో అందరూ కాపాడబడతారు; కానీ ఓడ మాత్రం మిగలదు. గత రాత్రి దేవుని దూత నా దగ్గరకు వచ్చి “పౌలా భయపడవద్దు! నువ్వు రోమా పరిపాలకుడైన కైసరు ఎదుట విచారణ కోసం నిలబడాలి. నీతోపాటు ఓడలో ప్రయాణిస్తున్న వారందరిని దేవుడు కాపాడతాడు” అని నాతో చెప్పాడు.

తుపాను మొదలైన తర్వాత 14వ రోజున దాదాపు మధ్యరాత్రప్పుడు నీటి లోతు తగ్గుతుందని నావికులు గమనించారు! చీకటిలో ఏ రాళ్ళకో కొట్టుకుంటామనే భయంతో, వాళ్ళు తమ లంగరులను దించారు. మరుసటి రోజు ఉదయం సముద్రపు ఒడ్డు కనిపించింది. కనిపిస్తున్న సముద్రపు ఒడ్డువరకు ఓడను నడిపించడానికి ప్రయత్నిద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు.

వాళ్ళు ఒడ్డు దగ్గరకు చేరుతుండగా ఓడ ఇసుక ఒడ్డుకు కొట్టుకొని ఇసుకలో ఇరుక్కుపోయింది. అప్పుడు అలలు ఓడను గట్టిగా కొట్టడం ప్రారంభించడంవల్ల ఓడ బద్దలైపోయింది. వాళ్ళపై నియమించబడిన సైనికాధికారి ‘ఈదడం వచ్చినవారందరూ ముందుగా సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోండి. వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళందరూ దూకి ఓడ చెక్కలు పట్టుకోండి’ అని చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. ఆ విధంగా ఓడలో ఉన్న 276 మంది వ్యక్తులు, దేవదూత చెప్పినట్లే సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

ఆ ద్వీపం పేరు మెలితే. అక్కడి ప్రజలు చాలా దయగలవాళ్ళు, ఓడలోనుండి వచ్చిన ప్రజలను వాళ్ళు ఆదరించారు. వాతావరణం తేటపడినప్పుడు పౌలును మరొక ఓడలో ఎక్కించి రోమాకు తీసుకెళ్ళారు.