కంటెంట్‌కు వెళ్లు

బైబిలును మీరెందుకు నమ్మవచ్చును?

బైబిలును మీరెందుకు నమ్మవచ్చును?

బైబిలును మీరెందుకు నమ్మవచ్చును?

కొందరు బైబిలు నమ్మయోగ్యమైంది కాదని అంటారు, మరి వారి అభిప్రాయాలు కూడా విస్తృతంగా ఆమోదించబడ్డాయి. అందువలన ఈనాడు అనేకులు, బైబిలు చెప్పేది నమ్మశక్యం కాదని, దాన్ని త్రోసిపుచ్చుతున్నారు.

మరోవైపు యేసుక్రీస్తు దేవునికి చేసిన ప్రార్థనలో “నీ వాక్యమే సత్యమని” పలికిన మాటలు నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. బైబిలు కూడా తనమట్టుకుతాను దేవునివలన ప్రేరేపించబడిన దానిగా చెప్పుకొంటున్నది.—యోహాను 17:17; 2 తిమోతి 3:16.

ఈ విషయంలో మీరేమనుకుంటారు? బైబిలును నమ్మటానికి సరైన ఆధారం ఏమైనా వుందా? లేక బైబిలు నమ్మదగింది కాదు, పరస్పర విరుద్ధతతో, పొందికలేక ఉందనే దానికే నిజంగా సాక్ష్యముందా?

పరస్పర విరుద్ధత ఉందా?

బైబిలు దానికదే పరస్పర విరుద్ధంగా ఉందని కొందరన్ననూ, ఎవరైనా ఎప్పుడైనా దానికి ఒక్క వాస్తవిక ఉదాహరణను చూపారా? సూక్ష్మమైన పరిశీలనకు నిలువగల అటువంటి ఒక్కదాన్ని కూడా మేము చూడలేదు. నిజమే కొన్ని బైబిలు వృత్తాంతములలో అలాంటి పరస్పర విరుద్ధతలున్నట్లు కనిపించవచ్చును. కాని సాధారణంగా సమస్య ఏమంటే వివరాలు మరియు ఆకాలముల నాటి పరిస్థితులను గూర్చిన అవగాహనా లోపమే.

ఉదాహరణకు, బైబిలులో పరస్పర విరుద్ధత అని తాము తలంచే విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘కయీనుకు భార్య ఎక్కడ నుండి వచ్చింది?’ అని అడుగుతారు. ఆదాము హవ్వలకు కయీను హేబెలు మాత్రమే పిల్లలని వారి ఊహ. అయితే ఈ ఊహ బైబిలు చెప్పేదాన్ని తప్పుగా గ్రహించుకోవడాన్ని బట్టి కలిగిందే. బైబిలు ఆదాము “కుమారులను కుమార్తెలను” కన్నాడని వివరిస్తుంది. (ఆదికాండము 5:4) కాబట్టి కయీను తన సోదరీలలో ఒకామెను లేదా బహుశా తన తమ్ముని కూతుళ్లలో ఒకామెను పెండ్లాడాడు.

తరచు విమర్శకులు కేవలం పరస్పర విరుద్ధతల కొరకే చూస్తూ, ‘యేసుయొద్దకు శతాధిపతి వచ్చి వేడుకొన్నాడని బైబిలు రచయితయైన మత్తయి చెబుతుండగా, లూకా మాత్రము అతని ప్రతినిధులను పంపాడని చెబుతున్నాడు. వీటిలో ఏది సత్యం?’ అని అడగవచ్చును. (మత్తయి 8:5, 6; లూకా 7:2, 3) అయితే ఇది నిజంగా పరస్పర విరుద్ధతేనా?

ప్రజలుచేసిన ఒక పనికి, లేదా కార్యానికి నిజంగా దానికి బాధ్యుడైనవానిని కీర్తిస్తే, సహేతుకమైన ఏ వ్యక్తి దానిని పరస్పర విరుద్ధతగా పరిగణించడు. ఉదాహరణకు ఒక రోడ్డును ఇంజనీర్లు, కార్మికులు వేస్తే రిపోర్టేమో దాన్ని ఒక మేయరు వేశాడని చెబితే, దాన్ని తప్పుగా పరిగణిస్తావా? బహుశ అలా చేయవు! అలాగే లూకా వ్రాసిన ప్రకారం ఆయన కొంతమంది ప్రతినిధుల ద్వారా వేడుకొన్నను, మత్తయి శతాధిపతి వేడుకొన్నాడని చెప్పడం పొందికలేందేమీ కాదు.

వివరాలు ఎక్కువగా తెలిసేకొలది బైబిలులో పరస్పర విరుద్ధతలుగా కన్పించేవన్నీ అదృశ్యమౌతాయి.

చరిత్ర మరియు సైన్సు

ఒకప్పుడు బైబిలుయొక్క చారిత్రాత్మక వాస్తవికత విస్తృతంగా శంకించబడింది. ఉదాహరణకు, విమర్శకులు బైబిలులో పేర్కొనబడిన కొంతమంది వ్యక్తుల అనగా అష్షూరు రాజైన సర్గోను, బబులోనుయొక్క బెల్షస్సరు, రోమా గవర్నరైన పొంతిపిలాతు మొదలగువారి ఉనికిని ప్రశ్నించారు. ఇటీవలి పరిశోధనలు బైబిలు వృత్తాంతాలలో ఒకదానివెంబడి మరొకదాన్ని వెలుగులోకి తెచ్చాయి. అందువలన చరిత్రకారుడైన మోషెపెర్ల్‌మాన్‌ ఇలా వ్రాశాడు: “పాతనిబంధన యొక్క చారిత్రాత్మక భాగాల వాస్తవికతను సహితం సందేహించిన సందేహపరులు అకస్మాత్తుగా తమ దృక్పథాలను మార్చుకొన నారంభించారు.”

మనం బైబిలును నమ్మాలంటే, విజ్ఞాన శాస్త్రపరమైన విషయాలలో కూడా అది వాస్తవికంగా ఉండాలి. మరి అది అలా ఉందా? కొద్దికాలం క్రితం శాస్త్రజ్ఞులు బైబిలుకు భిన్నంగా, విశ్వానికి ప్రారంభం లేదని తలంచారు. అయితే, ఇటీవల ఖగోళ శాస్త్రజ్ఞుడైన రాబర్ట్‌ జాస్ట్రో దీనిని త్రోసిపుచ్చే నూతన సమాచారాన్ని సూచిస్తూ, ఇలా వివరించాడు: “ప్రపంచ పుట్టుకను గూర్చిన బైబిలు దృక్పథానికే ఖగోళశాస్త్రపు రుజువులు ఎలా నడిపిస్తున్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాము. వివరాలు భిన్నంగా ఉన్ననూ, ప్రాముఖ్యమైన మూల విషయాలందు ఖగోళశాస్త్రపు విషయాలు, ఆదికాండపు బైబిలు వృత్తాంతాలు ఒక్కటే.”—ఆదికాండము 1:1.

మనుష్యులు భూమి ఆకారాన్ని గూర్చిన విషయాలందు కూడా తమ దృక్పథాలను మార్చుకున్నారు. “అనేకమంది నమ్మినట్లు భూమి బల్లపరుపుగాకాక, గుండ్రంగా ఉన్నదని పరిశోధనాత్మక సముద్రయానములు చూపించినట్లు” ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా వివరిస్తుంది. కావున బైబిలు ఎల్లప్పుడూ సరిగానే ఉంది. అటువంటి సముద్రయానములకు 2000 సంవత్సరాల కంటే ముందే, యెషయా 40:22లో బైబిలు ఇలా చెప్పింది: “ఆయన భూ మండలము మీద ఆసీనుడైయున్నాడు,” లేక ఇతర తర్జుమాల ప్రకారం “భూగోళము,” (డుయే), “గుండ్రని భూమి” (మొఫత్‌) గా చెప్పబడుతుంది.

కావున మానవులు ఎక్కువ తెలుసుకొనేకొలది, బైబిలు నమ్మబడగలదను రుజువు అధికమౌతుంది. బ్రిటీష్‌ మ్యూజియం మాజీ డైరెక్టరైన సర్‌ ఫ్రెడరిక్‌ కెన్యన్‌ ఇలా వ్రాశాడు: “ఇప్పటికే లభించిన ఫలితాలు, వృద్ధిచెందే జ్ఞానమునుండి బైబిలు దాని నమ్మకత్వమును కోల్పోయేదిగాక, దానియందలి విశ్వాసమును పెంచుకుంటుందని స్థిరపరుస్తున్నవి.”

భవిష్యత్తును ప్రవచించుట

‘నీతియుక్తమైన క్రొత్త ఆకాశము, క్రొత్త భూమితో సహా’ భవిష్యత్తును గూర్చి బైబిలు చెప్పేదాన్ని మనము నిజంగా నమ్మగలమా? (2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) గతములో బైబిలు వృత్తాంతముల వాస్తవికత విషయమేమి? వందల సంవత్సరాల ముందు చెప్పబడిన ప్రవచనములు అనేకమారులు వాటి సంపూర్ణ వివరాలతో నెరవేరాయి!

ఉదాహరణకు, శక్తివంతమైన బబులోను పతనమును గూర్చి, అది నెరవేరుటకు 200 సంవత్సరముల ముందే బైబిలు దానిని ప్రవచించింది. నిజానికి పారశీకులతో విలీనమై మాదీయులు జయిస్తారని పేర్కొనబడ్డారు. పారశీక రాజైన కోరెషు ఇంకా జన్మించకపోయినను ఈ జయములో అతడు ప్రముఖుడైయుంటాడని బైబిలు ప్రవచించింది. బబులోనుకు రక్షణకరంగా ఉన్న జలములు, యూప్రటీసు నది “నీరు ఇంకిపోవునని” “దాని [బబులోను] ద్వారములు వేయబడవని” అది చెప్పెను.—యిర్మీయా 50:38; యెషయా 13:17-19; 44:27–45:1.

చరిత్రకారుడైన హిరొడటస్‌ నివేదించిన ప్రకారం, ఇవి వాటి పూర్తి వివరాలతో నెరవేరాయి. అంతేగాక, బబులోను చివరకు నిర్మానుష్యమై పాడైన శిధిలాలుగా మారునని కూడా బైబిలు ప్రవచించింది. కచ్చితంగా అదే జరిగింది. ఈరోజు బబులోను నిర్మానుష్యమైన రాతి గుట్టలుగా పడివుంది. (యెషయా 13:20-22; యిర్మీయా 51:37, 41-43) బైబిలు ఇంకా నాటకీయంగా జరిగిన అనేక ఇతర ప్రవచనాలతో నిండి ఉంది.

అలాగే ప్రస్తుత లోక విధానాన్ని గూర్చి బైబిలు ఏమి ప్రవచిస్తుంది? అది చెప్పేదేమనగా: “ఈ లోకపు చివరి కాలము కష్టములతో నిండిన కాలమైయుంటుంది. మనుష్యులకు డబ్బు మరియు స్వార్థం తప్ప వేరేదేమీ పట్టదు. వారు అహంకారులు, డంబము గలవారు, దూషకులై ఉంటారు; తల్లిదండ్రుల యెడల గౌరవముండదు, కృతజ్ఞత ఉండదు, జాలి ఉండదు, అనురాగముండదు. వారు దేవుని స్థానంలో సుఖభోగాలను ఉంచుతారు. పైకి మతాన్ని అవలంబిస్తున్నట్లు నటిస్తారేగాని, దానియెడల యథార్థముగా ప్రవర్తించరు.”—2 తిమోతి 3:1-5, ది న్యూ ఇంగ్లీషు బైబిలు.

నిశ్చయంగా దీని నెరవేర్పును మనం ఇప్పుడు చూస్తున్నాము! అయితే బైబిలు “ఈ లోకపు చివరి కాలంలో” జరిగే వేరే వాటిని కూడా ప్రవచిస్తుంది: “జనము మీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును” వాటితోపాటు, “అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. తెగుళ్లును . . . తటస్థించునని,” ప్రవచిస్తుంది.—మత్తయి 24:7; లూకా 21:11.

నిజంగా, బైబిలు ప్రవచనాలు నేడు నెరవేరుతున్నవి! అయితే ఇంకను నెరవేరవలసివున్న “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.” “తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, . . .సాగగొట్టుదురు . . . యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును,” అను వాగ్దానాల సంగతేమి?—కీర్తన 37:29; యెషయా 2:4.

అయితే నెరవేరుటకు ‘అంతటి మంచి కేవలం నమ్మశక్యం కానిదని’ కొందరన వచ్చును. కానీ నిజానికి, మన సృష్టికర్త ప్రమాణం చేసే దేన్నైనా సందేహించడానికి కారణమేమీ లేదు. ఆయన మాట నమ్మవచ్చును. (తీతు 1:2) ఇంకా ఎక్కువ రుజువును పరిశీలించే కొలది, ఈ విషయంలో మరెక్కువగా మీరు ఒప్పించబడతారు.

ప్రత్యేకముగా సూచించబడని లేఖనములు బైబిలు సొసైటి ఆఫ్‌ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు నుండి వ్రాయబడినవి.

[4వ పేజీలోని చిత్రం]

“ఇప్పటికే లభించిన ఫలితాలు, వృద్ధిచెందే జ్ఞానమునుండి బైబిలు దాని నమ్మకత్వమును కోల్పోయేదిగాక, దానియందలి విశ్వాసమును పెంచుకుంటుందని స్థిరపరస్తున్నవి.”