కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక మహాగొప్ప సమూహము

ఒక మహాగొప్ప సమూహము

అధ్యాయం 20

ఒక మహాగొప్ప సమూహము

1. ముద్రింపబడిన 1,44,000 మందినిగూర్చి వర్ణించిన తర్వాత యోహాను ఏ యితర గుంపును చూస్తున్నాడు?

యోహాను 1,44,000 మంది ముద్రింపబడిన విషయాన్ని చెప్పిన తర్వాత లేఖనాలన్నింటిలోను అత్యంత ఆసక్తికరమైన ప్రకటనలలో ఒకానొకదానిని గూర్చి తెల్పుతున్నాడు. ఆ విషయాన్ని యిలా తెల్పేటప్పుడు ఆయన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయి ఉండవచ్చు: “అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడు వారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడిరి.” (ప్రకటన 7:9) అవును, ఆ నాలుగు వాయువులను పట్టుకొనుట, ఆత్మీయ ఇశ్రాయేలీయులైన 1,44,000 మందితోపాటు సకలభాషలవారున్న అంతర్జాతీయ గొప్పసమూహమైన మరోగుంపు రక్షణకు దోహదపడుతుంది. *ప్రకటన 7:1.

2. లోక వ్యాఖ్యాతలు గొప్పసమూహాన్ని ఎలా వివరించారు, మరి బైబిలు విద్యార్థులు సహితం గతంలో వీరిని ఎలా దృష్టించారు?

2 క్త్రెస్తవులుగా మారినటువంటి యూదులుకానివారు, లేక పరలోకానికి వెళ్లవలసియున్న క్రైస్తవహతసాక్షులే యీ గొప్పసమూహమని లౌకిక వ్యాఖ్యాతలు అభివర్ణించారు. గతంలో బైబిలు విద్యార్థులు సహితం, 1886 లో స్టడీస్‌ ఇన్‌ ది స్క్రిప్చర్స్‌, ది డివైన్‌ ప్లాన్‌ ఆఫ్‌ ది ఏజస్‌ సంపుటి 1 నందు తెల్పబడినట్లు, వారు పరలోకానికి వెళ్లే రెండవ గుంపు అని అనుకున్నారు: “వారు సింహాసనాన్ని, దైవత్వపు బహుమతిని పోగొట్టుకుంటారు, గానీ చివరకు దైవత్వపు స్థితికంటె కొంచెం తక్కువైన ఆత్మీయప్రాణులుగా తిరిగి జన్మను పొందుతారు. వీరు నిజంగా పవిత్రులుగా చేయబడినప్పటికిని, వారిజీవితాలను బలిపెట్టలేనంతగా వారు యీ లోకాత్మచేత జయించబడ్డారు.” మరియు యీ మధ్యే 1930 లో లైట్‌ అనే మొదటి పుస్తకంలో ఆ అభిప్రాయం వ్యక్తపరచబడింది: “ఈ గొప్పసమూహానికి సంబంధించిన వారు ప్రభువుకు ఆసక్తిగల సాక్షులుగా తయారగుటకై యిచ్చిన ఆహ్వానానికి స్పందించలేదు.” వారు సత్యం ఎరిగి, దాన్ని స్వల్పంగా ప్రకటించిన స్వనీతిపరుల గుంపని వర్ణించబడ్డారు. వారు క్రీస్తు పరిపాలనలో భాగం వహించకుండ పరలోకానికివెళ్లే రెండవ తరగతి.

3. (ఎ) అటుపిమ్మట కొంతకాలం తర్వాత ప్రచారపు పనిలో ఆసక్తిచూపిన కొందరు యథార్థ హృదయులు ఎటువంటి నిరీక్షణ కల్గియుండిరి? (బి) గొఱ్ఱెలు మేకల ఉపమానం 1923 లో వాచ్‌టవర్‌ ఎలా వివరించింది?

3 అయిననూ, అభిషక్త క్రైస్తవుల ఇతరసహవాసులలో అటుతర్వాత ప్రచారపుపనిలో అత్యంత ఆసక్తిని కనబరచినవారును ఉండిరి. వారికి పరలోకం వెళ్లాలనే కోరికలేమీలేవు. వాస్తవానికి, వారి నిరీక్షణ 1918 నుండి 1922 వరకు యెహోవా ప్రజలు యిచ్చిన ఒక బహిరంగ ప్రసంగానికి అనుగుణంగా ఉండెను. “లోకం గతించింది—జీవించియున్న లక్షలాదిమంది యిక ఎన్నటికీ మరణించరు” అనేదే ఆనాటి ప్రసంగాంశం. * ఆ వెంటనే అక్టోబరు 15, 1923, వాచ్‌టవర్‌ పత్రికలో యేసు చెప్పిన గొఱ్ఱెలు మేకల ఉపమానాన్ని వివరిస్తూ (మత్తయి 25:31-46), యిలా తెల్పింది: “గొఱ్ఱెలు సమస్త జనులను సూచిస్తున్నవి గానీ, ఆత్మీయాభిషక్తులనుకాదు, అయితే, మానసికంగా యేసుక్రీస్తును ప్రభువని, ఆయన పాలనలో సుభిక్షంగా ఉంటారని ఆశతో ఎదురుచూస్తూ నీతిగా జీవిస్తున్న వారిని అవి సూచిస్తున్నాయి.”

4. భూలోక తరగతిని గూర్చిన వెలుగు 1931 లోను 1932 లోను 1934 లోను యింకా ఎలా తేజోవంతమైంది?

4 కొన్ని సంవత్సరాల తర్వాత, 1931 లో, విన్‌డికేషన్‌ అనే మొదటి పుస్తకం, యెహెజ్కేలు 9వ అధ్యాయాన్ని చర్చిస్తూ, పైన తెలుపబడిన ఉపమానంలోని గొఱ్ఱెలవలె వీరు యీ లోకాంతాన్ని తప్పించుకోవడానికి తమ లలాటములమీద ముద్రింపబడిన వారని గుర్తించింది. విన్‌డికేషన్‌, 1932 లో విడుదలైన మూడవ పుస్తకం, ఇశ్రాయేలీయుల అభిషక్తరాజైన యెహూ రథమెక్కి, అబద్ధమతస్థులను సంహరించుటలోగల యెహూ ఆసక్తిని చూడ్డానికై ఆయనతోపాటు వెళ్లిన యూదుడుకాని యెహోనాదాబు యథార్థ హృదయ స్వభావాన్నిగూర్చి వర్ణించింది. (2 రాజులు 10:15-17) ఆ పుస్తకమిలా వ్యాఖ్యానించింది: “యెహోనాదాబు, [యెహోవా తీర్పులను ప్రకటించే] యెహూ పని జరిగే కాలంలో యీ భూమ్మీద జీవిస్తున్న సహృదయులైన ఆ తరగతి ప్రజలను, సాతాను సంస్థతో ఏకీభవించనివారిని, నీతిపక్షంగా నిలిచేవారిని, మరియు ప్రభువు అర్మగిద్దోనులో రక్షించి, ఆ శ్రమనుండి కాపాడి, యీ భూమిపై నిత్యజీవమిచ్చే వారిని సూచిస్తున్నాడు లేక వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరు ‘గొఱ్ఱెల’ తరగతికి చెందినవారు.” ది వాచ్‌టవర్‌ 1934 లో భూలోక నిరీక్షణగల యీ క్రైస్తవులు యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం పొందవలసి యున్నారని విశదపరచింది. ఈ భూసంబంధమైన తరగతిని గూర్చిన వెలుగు మునుపెన్నటికంటెను యింకా తేజోమయంగా ప్రకాశిస్తూంది.—సామెతలు 4:18.

5. (ఎ) గొప్పసమూహము ఎవరని 1935 లో గుర్తించారు? (బి) భూలోకంలో నిరంతరం జీవించే నిరీక్షణగలవారు నిల్చోవాలని 1935 లో జె. యఫ్‌. రూథర్‌ఫర్డ్‌ సభికులను అడిగినప్పుడు ఏమి జరిగింది?

5ప్రకటన 7:9-17 యొక్క భావం యిప్పుడు మరింత తేజోవంతంగా బయల్పర్చబడనై యుండెను! (కీర్తన 97:11) అమెరికాలోని వాషింగ్టన్‌, డి.సి.లో 1935, మే 30 నుండి జూన్‌ 3 వరకు ఏర్పాటుచేయబడిన సమావేశం యెహోనాదాబు తరగతిని సూచించేవారికి “నిజంగా ఓదార్పుకరంగాను ప్రయోజనకరంగాను” ఉండునని వాచ్‌టవర్‌ పత్రిక పదేపదే వ్యక్తపరచింది. అది వాస్తవమని రుజువైంది! వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి అధ్యక్షుడు జె.యఫ్‌. రూథర్‌ఫర్డ్‌, “ది గ్రేట్‌ మల్టిట్యూడ్‌” అనే అంశంపై, సమావేశమైన 20,000 మంది నుద్దేశించి చేసిన ఉత్తేజపూరిత ప్రసంగం, ఆధునిక-దిన వేరేగొఱ్ఱెలు ప్రకటన 7:9 లోని గొప్పసమూహముతో సంబంధం కలిగివున్నట్లు లేఖనాధారమైన సాక్ష్యాన్నిచ్చింది. ఈ ప్రసంగాంతాన ప్రసంగీకుడు యిలా ప్రశ్నించాడు: “భూ నిరీక్షణగలవారంతా దయచేసి నిల్చుంటారా?” ప్రేక్షకులలో అనేకులు నిల్చున్నప్పుడు ఆ అధ్యక్షుడు యిలా ప్రకటించాడు: “ఇదిగో! గొప్పసమూహము!” అంతట నిశ్శబ్దం, ఆ వెనువెంట గొప్ప ఆనందోత్సాహం వెల్లివిరిసింది. యోహాను తరగతి—యెహోనాదాబు గుంపు ఎంతగా ఉప్పొంగిపోయారో! ఆ మర్నాడు 840 మంది క్రొత్తసాక్షులు బాప్తిస్మం పొందారు, వీరిలో ఎక్కువమంది ఆ గొప్పసమూహానికి సంబంధించినవారే.

గొప్పసమూహపు గుర్తింపును స్థిరపరచుట

6. (ఎ) గొప్పసమూహమంటే, భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణగల ఆధునిక సమర్పిత క్రైస్తవుల గుంపేనని మనమెలా స్పష్టంగా గ్రహించగలం? (బి) గొప్పసమూహపు తెల్లని వస్త్రాలు దేన్ని సూచిస్తున్నాయి?

6 ఆ గొప్పసమూహమంటే దేవుని సొత్తైన యీ భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణగల ఆధునికకాల సమర్పిత క్రైస్తవులేనని ఖచ్చితంగా మనమెలా చెప్పగలం? ఆ పరలోకపు గుంపు “ప్రతివంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతిప్రజలోను, ప్రతిజనములోను, దేవునికొరకు . . . కొన”బడినట్లు ఇంతకుముందే యోహాను దర్శనంలో చూశాడు. (ప్రకటన 5:9, 10) గొప్పసమూహము అలాగే కొనబడ్డారు గానీ వారికి మరో గమ్యం ఉంది. అందులో ఎంతమంది ఉంటారో ఖచ్చితంగా ఎవరూ ముందుగానే చెప్పలేరు. యేసు బలియందలి విశ్వాసం మూలంగా యెహోవా ఎదుట నీతియుక్తమైన స్థానమందున్నారని సూచిస్తున్నట్లు, వారి వస్త్రాలను గొఱ్ఱెపిల్ల రక్తంలో తెల్లగా ఉదుకుకొన్నారు. (ప్రకటన 7:14) మరియు వారు ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని, మెస్సీయను వారి రాజుగా మహిమపరుస్తున్నారు.

7, 8. (ఎ) ఖర్జూరపు మట్టలు పట్టుకొనుట యోహానుకు ఏ సంఘటనలను నిశ్చయంగా జ్ఞాపకం చేసియుండవచ్చును? (బి) గొప్పసమూహము ఖర్జూరపు మట్టలను పట్టుకొనుటలోని ప్రాముఖ్యత ఏమిటి?

7 యోహాను యీ దర్శనం చూస్తున్నప్పుడు, తన ఆలోచనలు ఆయనను 60 సంవత్సరాల క్రితం యేసు భూమిపైనున్న చివరి వారానికి తీసుకొని వెళ్లివుండవచ్చును. సా.శ. 33, నీసాను 9వ తేదీన జనసమూహము యేసును యెరూషలేముకు ఆహ్వానించడానికి సమకూడినపుడు వారు “ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి—జయము, ప్రభువు (యెహోవా NW) పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.” (యోహాను 12:12, 13) అదేవిధంగా, గొప్పసమూహము ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొనడం కేకలు వేయడమంటే యేసును యెహోవా నియమిత రాజుగా అంగీకరించడంలో వారికిగల అంతులేని ఆనందాన్ని చూపిస్తుంది.

8 ఆ ఖర్జూరపు మట్టలు, ఆనందపుకేకలు యోహానుకు ప్రాచీన ఇశ్రాయేలీయుల పర్ణశాల పండుగను నిశ్చయంగా జ్ఞాపకం చేసివుండవచ్చు. ఈ పండుగను గూర్చి యెహోవా యిలా ఆజ్ఞాపించాడు: “మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీదేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించు చుండవలెను.” ఖర్జూరపు మట్టలు ఆనందానికి గుర్తుగా ఉపయోగించబడేవి. తాత్కాలికంగా నిర్మించుకున్న పర్ణశాలలు యెహోవా తన ప్రజలను ఐగుప్తునుండి విడిపించి, అరణ్యంలోని గుడారములలో నివసింపజేసిన విషయాన్ని గుర్తుచేశాయి. “పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును” ఆ పండుగలో పాల్గొన్నారు. ఇశ్రాయేలీయులందరూ “నిశ్చయముగా సంతోషింపవలెను.”—లేవీయకాండము 23:40; ద్వితీయోపదేశకాండము 16:13-15.

9. గొప్పసమూహము ఏ ఆనందోత్సాహపు కేకలలో పాల్గొంటారు?

9 గనుక, గొప్పసమూహము ఆత్మీయ ఇశ్రాయేలీయులు కాకపోయినప్పటికిని, యోహాను యిచ్చట తెల్పుతున్నట్లు, వారు తమ విజయానికి రక్షణకు దేవునికి గొఱ్ఱెపిల్లకు ఆనందంతోను కృతజ్ఞతతోను స్తోత్రం చెల్లిస్తున్నందువల్ల వారుకూడ ఖర్జూరపు మట్టలను చేతపట్టుకోవాలి: “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మారక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.” (ప్రకటన 7:10) వారు సమస్త మతసంబంధమైన గుంపులనుండి వేరుచేయ బడినప్పటికిని గొప్పసమూహము ఆ ఒక్క “మహాశబ్దముతో” ఎలుగెత్తి చెబుతున్నారు. వారు పలుజాతుల వారును పలు భాషలు మాటలాడు వారైనప్పటికిని యిదెలా సాధ్యం కాగలదు?

10. వివిధ జాతుల భాషల తేడా ఉన్నప్పటికిని గొప్పసమూహము ఎలా ఒకే “మహాశబ్దముతో” ఐక్యంగా కేకలు వేస్తారు?

10 ఈ గొప్ప సమూహము, ఈనాడు భూమ్మీద సకల జాతులతోకూడి నిజంగా ఏకమైయున్న ఏకైక సంస్థలోని ఒక భాగమే. వారికి వివిధదేశాలకు వివిధ నియమాలు లేవు గానీ వారెక్కడ జీవించిననూ బైబిలు యొక్క యథార్థమైన సూత్రాలను తు.చ. తప్పకుండా పాటిస్తారు. వారు జాతివైషమ్యాల్లోను, తిరుగుబాటు ఉద్యమాల్లోను పాల్గొనడంలేదు గానీ ‘నిజంగా ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టారు.’ (యెషయా 2:4) పెద్దగాకేకలు వేస్తూ పరస్పర విరుద్ధమైన సమాచారం చెప్పుకొనే క్రైస్తవమత సామ్రాజ్యములోని మతశాఖలవలె వారు తెగలుగా, మతశాఖలుగా విభాగించబడలేదు; లేదా తమను పొగడండని అన్నట్లు వారా పనిని మతగురువుల తరగతికి విడవడంలేదు. వారి రక్షణకై పరిశుద్ధాత్మకు స్తోత్రమని చెప్పడంలేదు, ఎందుకంటే వారు త్రిత్వదేవుని సేవకులుకారు. భూమియంతటనున్న సుమారు 200 దేశవిదేశాల్లో ఒకే సత్యమనే స్వచ్ఛమైన భాషను మాట్లాడేటప్పుడు యెహోవా నామాన్ని తెలియజేయడంలో వారంతా ఏకమైయున్నారు. (జెఫన్యా 3:9) తమ రక్షణకర్తయైన యెహోవా దేవునినుండి, రక్షణకు ముఖ్య అధిపతియైన యేసుద్వారా తమకు రక్షణ లభిస్తుందని వారు బహిరంగంగాను సరియైన రీతిగాను ఒప్పుకుంటారు.—కీర్తన 3:8; హెబ్రీయులు 2:10.

11. గొప్పసమూహము వారి మహాశబ్దాన్ని యింకా ఎక్కువ చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎలా సహాయపడింది?

11 ఏకమైయున్న యీ గొప్పసమూహపు మహాశబ్దం మరెంతో బిగ్గరగా వినబడడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయపడింది. ఏ యితర గుంపుకూడ ఒకే సమాచారంతో లోకప్రజలందరిని కలుసుకోవాలనే శ్రద్ధను చూపడంలేదు గనుక ఏ యితర మతగుంపుకూడ యీ లోకంలో 200 కంటే ఎక్కువ భాషల్లో బైబిలు పఠన ఉపకరణాలను ప్రచురించడంలేదు. ఈవిషయంలో యింకా సహాయకరంగా ఉండేనిమిత్తం, యెహోవాసాక్షుల అభిషక్తులైన పరిపాలక సభ పర్యవేక్షణలో ఒక మల్టీ లాంగ్వేజ్‌ ఎలక్ట్రానిక్‌ ఫోటోటైప్‌సెట్టింగ్‌ సిస్టమ్‌ (మెప్స్‌) తయారుచేయబడింది. ఇది వ్రాసే సమయానికి 100 దేశాలలో మెప్స్‌ పద్ధతిద్వారా తర్జుమా చేయబడిన సమాచారం తయారు చేయబడుతుంది, ఇందువల్ల వారి ప్రముఖ పక్ష పత్రికయైన ది వాచ్‌టవర్‌ ను 85 భాషల్లో ఏకకాలంలో తయారు చేయడానికిది సహాయపడుతోంది. యెహోవా ప్రజలు యీ పుస్తకంవంటి పుస్తకాలను అనేకభాషల్లో ఏకకాలంలో ప్రచురిస్తున్నారు. అలా, గొప్పసమూహము అధికంగా ఉన్న యెహోవాసాక్షులు అనేక ప్రముఖ భాషల్లో సాహిత్యాలను సంవత్సరమంతా అందించ గల్గుతున్నారు, సకల జనములును సకలభాషలు మాటలాడువారును దేవుని వాక్యాన్ని పఠించి గొప్పసమూహపు మహాశబ్దంతో వారి స్వరాలు కలిపేలా యింకా అనేకులకు సహాయపడుతున్నారు.—యెషయా 42:10, 12.

పరలోకంలోనా లేక భూమ్మీదనా?

12, 13. గొప్పసమూహము ఏ విధంగా “సింహాసనము యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను నిలువబడియున్నారు”?

12 గొప్పసమూహము “సింహాసనము ఎదుట నిలువబడి యుండుట” అంటే పరలోకంలో కాదని మనకెలాతెలుసు? ఇందుకు చాలా స్పష్టమైన రుజువున్నది. ఉదాహరణకు, “ఎదుట” (యినోపియన్‌) అని యిక్కడ అనువదించబడిన గ్రీకు పదం అక్షరార్థంగా “సన్నిధి” (కనుదృష్టిలో NW) అని అర్థమిస్తుంది, మరి అనేకసార్లు అది భూమ్మీదనున్న మానవులు యెహోవా “యెదుట” లేక “సన్నిధి”లో వున్నట్లు వాడబడింది. (1 తిమోతి 5:21; 2 తిమోతి 2:14; రోమీయులు 14:22; గలతీయులు 1:20) ఒకసారి ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు మోషే అహరోనుతో యిలా అన్నాడు: “యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు సర్వసమాజముతో చెప్పవలెను.” (నిర్గమకాండము 16:9) ఆ సమయంలో ఇశ్రాయేలీయులు యెహోవా యెదుట ఉండడానికి వారు పరలోకానికి వెళ్లవలసిన అవసరం లేకుండెను. (లేవీయకాండము 24:8 పోల్చండి.) బదులుగా వారు అక్కడే ఆ అరణ్యంలోనే యెహోవా కనుదృష్టిలోనే నిల్చున్నారు, మరి ఆయన అవధానం వారిమీద ఉండెను.

13 ఇంకా మనమిలా చదువుతాము: “తన మహిమతో మనుష్యకుమారుడు . . . వచ్చునప్పుడు . . . సమస్తజనములు ఆయన యెదుట పోగుచేయబడుదురు.” * ఈ ప్రవచనం నెరవేరినప్పుడు మానవజాతియంతా పరలోకంలో లేదు. నిశ్చయంగా, “నిత్యనాశనమునకు పోవువారు” పరలోకంలో లేరు. (మత్తయి 25:31-33, 41, 46) బదులుగా, మానవులంతా యేసు కనుదృష్టిలో భూమ్మీద ఉంటారు, ఆయన వారికి తీర్పుతీర్చడానికి తన అవధానాన్ని నిల్పుతాడు. అలాగే, గొప్పసమూహము “సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను” నిలువబడియున్నదంటే అనుకూలమైన తీర్పునిచ్చే యెహోవా మరియు ఆయన నియమించిన రాజైన క్రీస్తు యేసు యెదుట ఉందని అర్థము.

14. (ఎ) “సింహాసనము చుట్టు,” “[పరలోక] సీయోను పర్వతముమీద” ఎవరున్నట్లు వర్ణించబడ్డారు? (బి) గొప్పసమూహము దేవున్ని “ఆయన ఆలయములో” సేవిస్తున్నప్పటికి, యిదెందుకు వారిని యాజకుల తరగతిగా చేయదు?

14 ఆ 24 మంది పెద్దలు, 1,44,000 మంది అభిషక్తుల గుంపు యెహోవా “సింహాసనము చుట్టు,” మరియు “[పరలోక] సీయోను పర్వతముమీద” నిలువబడి యున్నట్లు వర్ణించబడ్డారు. (ప్రకటన 4:4; 14:1) గొప్పసమూహము యాజక తరగతికి చెందిందికాదు గనుక అటువంటి ఉన్నత స్థానాన్ని పొందరు. నిజమే, ఆ తర్వాత ప్రకటన 7:15 లో ఆ గుంపు దేవున్ని “ఆయన ఆలయములో” సేవిస్తున్నట్లు వర్ణించబడ్డారు. అయితే యీ దేవాలయ అంతర్భాగాన్ని, అంటే అతిపరిశుద్ధ స్థలాన్ని సూచించడంలేదు. గానీ, అది దేవుని ఆత్మీయ దేవాలయం యొక్క భూప్రాంగణమై యున్నది. ఇక్కడ దేవాలయం అని అనువదించబడిన నావోస్‌ అను గ్రీకు పదం యెహోవా ఆరాధన కొరకు నిర్మింపబడిన మొత్తం కట్టడాన్నే సూచించే విశాల భావాన్ని తరచూ వ్యక్తం చేస్తుంది. ఈనాడు, ఇది పరలోకం భూలోకం చేరియున్న ఆత్మీయ కట్టడమై యున్నది.—మత్తయి 26:61; 27:5, 39, 40; మార్కు 15:29, 30; యోహాను 2:19-21, న్యూవర్‌ల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి.

విశ్వవ్యాప్త మహాస్తోత్రం

15, 16. (ఎ) గొప్పసమూహము కనబడగా పరలోకంలో ప్రతిస్పందన ఎలావుంది? (బి) యెహోవా బయల్పర్చే ప్రతి నూతన సంకల్పం యెడల ఆయన ఆత్మీయప్రాణుల స్పందన ఏమిటి? (సి) భూమ్మీదవున్న మనమెలా స్తుతిగీతంలో పాలుపొందగలం?

15 గొప్పసమూహం యెహోవాను స్తుతిస్తున్నారు, అయితే యితరులుకూడ ఆయనకు స్తోత్రములు చెల్లిస్తున్నారు. యోహాను యిలా తెల్పుతున్నాడు: “దేవదూతలందరును సింహాసనము చుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి—ఆమేన్‌; యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.”—ప్రకటన 7:11, 12.

16 యెహోవా భూమిని సృజించినప్పుడు, తన పరిశుద్ధ దూతలందరూ “ఏకముగా కూడి పాడిరి. దేవదూతలందరును (దేవుని కుమారులందరూ NW) ఆనందించి జయధ్వనులు చేసిరి.” (యోబు 38:7) యెహోవా సంకల్పాలను గూర్చిన ప్రతి ప్రకటన దేవదూతల యొక్క అలాంటి స్తోత్రపు ధ్వనులను కల్గించియుండవచ్చు. మరి ఆ 24 మంది పెద్దలు—పరలోక మహిమలోనున్న 1,44,000 మంది—గొఱ్ఱెపిల్లను అంగీకరించి జయధ్వనులు చేస్తారు, దేవుని పరలోక ప్రాణులంతా యెహోవా దేవునికిని యేసుక్రీస్తుకును స్తోత్రాలు చెల్లించడంలో తమ స్వరాలను కలుపుతారు. (ప్రకటన 5:9-14) అభిషేకించబడిన నమ్మకమైన మానవులను ఆత్మీయ సామ్రాజ్యంలో మహిమగల స్థానానికి పునరుత్థానులుగా చేయడంలో యెహోవా సంకల్పం నేరవేరుటచూచి యీ ప్రాణులు యిప్పటికే అమితానందంతో ఉన్నారు. ఇప్పుడు, గొప్పసమూహము ప్రత్యక్షం కావడంతో యెహోవాకు నమ్మకమైన పరలోక ప్రాణులంతా ఇంపైన స్తోత్రము చెల్లిస్తారు. నిజంగా, జీవించి ఉండడానికి ప్రభువు దినము యెహోవా సేవకులకెంతో గగుర్పాటు కల్గించే సమయమైవుంది. (ప్రకటన 1:10) ఈ భూమ్మీద, యెహోవా రాజ్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడంద్వారా స్తుతిగీతంలో పాల్గొనడానికి మనమెంతటి ఆధిక్యతగల వారమోగదా!

గొప్పసమూహము కనబడుట

17. (ఎ) ఆ 24 మంది పెద్దలలో ఒకరు ఏ ప్రశ్న వేశారు, మరి పెద్దలు దానికి సమాధానం పొందగలరనే వాస్తవం దేన్ని సూచిస్తుంది? (బి) ఆ పెద్ద అడిగిన ప్రశ్నకు ఎప్పుడు సమాధానం దొరికింది?

17 అపొస్తలుడైన యోహాను కాలమునుండి ప్రభువుదినము వరకును అభిషక్త క్రైస్తవులు గొప్పసమూహము అంటే ఎవరోనని ఆశ్చర్యపడుతూ వచ్చారు. గనుక, అప్పటికే పరలోకములోనున్న అభిషక్తులను సూచించే ఆ 24 మంది పెద్దలు, దానికి సంబంధించిన ప్రశ్నవేసి యోహాను ఆలోచనను పురికొల్పడం యుక్తమే. “పెద్దలలో ఒకడు—తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను—అయ్యా, నీకే తెలియునంటిని.” (ప్రకటన 7:13, 14ఎ) అవును, ఆ పెద్ద దానికి జవాబు వెదకి యోహాను కివ్వగలడు. ఇది తెల్పేదేమంటే, ఆ 24 మంది పెద్దల గుంపులో పునరుత్థానులైన వారు యినాడు దైవ వర్తమానములను చేరవేయడంలో భాగం వహిస్తూండవచ్చును. భూమ్మీదనున్న యోహాను తరగతికి చెందినవారైతే, వారివంతుగా వారు తమమధ్య యెహోవా చేసే వాటిని బాగా గమనిస్తూ, ఆ గొప్పసమూహాన్ని గుర్తించ వలసియున్నారు. యెహోవా నిర్ణయ కాలంలో, 1935 లో దైవజ్యోతిని తేజోవంతంచేసిన దైవవెలుగును వారు తక్షణమే అభినందించారు.

18, 19. (ఎ) యోహాను తరగతి 1920, 1930వ దశాబ్ద కాలాలలో ఏ నిరీక్షణను గూర్చి నొక్కి తెల్పింది? (బి) గొప్పసమూహము 1935 లో గుర్తించబడడంవల్ల 1,44,000 మందిని గూర్చి అదేమి సూచిస్తుంది? (సి) జ్ఞాపకార్థకూటపు గణాంక వివరాలు దేనిని బయలు పరుస్తున్నాయి?

18 యోహాను తరగతి 1920, 1930వ దశాబ్దాలలో అటు సాహిత్యాలద్వారాను, యిటు యింటింటి సేవద్వారాను పరలోక నిరీక్షణనుగూర్చి నొక్కి తెల్పారు. నిజానికి, 1,44,000 మంది సంఖ్య యింకనూ పూర్తి కావలసియుండెను. అయితే, సువార్త వర్తమానాన్ని విని సాక్ష్యపు పనియందాసక్తి కనబరచిన అనేకులు భూపరదైసులో జీవించే నిరీక్షణను కల్గియుండిరి. వారికి పరలోకం వెళ్లాలనే కుతూహలం లేదు. అది వారికున్న పిలుపుకాదు. వారు చిన్నమందకు చెందినవారు కాదుగానీ వేరేగొఱ్ఱెలకు చెందినవారు. (లూకా 12:32; యోహాను 10:16) వారు వేరేగొఱ్ఱెలకు సంబంధించినవారని 1935 లో గుర్తించడం, 1,44,000 మంది సంఖ్య యిక పూర్తికావస్తుందని సూచించింది.

19 గణాంక వివరాలు దీన్ని బలపరుస్తున్నాయా? అవును బలపరుస్తున్నాయి. ప్రపంచమంతటా, 1938 లో 59,047 మంది యెహోవాసాక్షులు పరిచర్యలో పాల్గొన్నారు. వీరిలో 36,732 మంది యేసు మరణ జ్ఞాపకార్థదిన సాంవత్సరిక ఆచరణనాడు చిహ్నములను పుచ్చుకొని అందులో పాలుపంచుకున్నారు, అలా వారు తమకు పరలోక నిరీక్షణవుందని సూచించారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో, అలా పాలుపంచుకునేవారు క్రమేపి తగ్గుతూ వచ్చారు, ఎందుకంటే యెహోవాకు నమ్మకస్థులైన సాక్షులు మరణించడంద్వారా యీ భూజీవితాన్ని చాలించారు. మరి 1993 లో అట్టి ఆచరణకు ప్రపంచవ్యాప్తంగా హాజరైన 1,18,65,765 మందిలో 0.1 శాతంకంటె తక్కువే—అంటే 8,693 మందే జ్ఞాపకార్థ చిహ్నములలో పాలుపంచుకున్నారు.

20. (ఎ) రెండవ ప్రపంచ యుద్ధకాలంలో సొసైటీ అధ్యక్షుడు గొప్పసమూహాన్ని గూర్చి ఒకసారి ఏమని వ్యాఖ్యానించాడు? (బి) గొప్పసమూహం నిజంగా గొప్పదేనని యిప్పుడు ఏ వాస్తవాలు చూపిస్తున్నాయి?

20 రెండవ ప్రపంచయుద్ధం చెలరేగినప్పుడు, గొప్పసమూహము సమకూర్చబడకుండ ఆపడానికి సాతాను గట్టిప్రయత్నాలే చేశాడు. పలుదేశాలలో యెహోవా సేవ నిషేధించబడింది. ఆ అంధకార దినాల్లోను, 1942 లో తాను మరణించకముందు, వాచ్‌టవర్‌ సొసైటి అధ్యక్షుడు జె. యఫ్‌. రూథర్‌ఫర్డ్‌ యిలా చెప్పాడు: “సరే . . . గొప్పసమూహము ఒక మహా సమూహమేమీ కాబోదన్నట్లే కనబడుతోంది.” కానీ దైవాశీర్వాదం మరోవిధమైన నడిపింపు నిచ్చింది! ప్రపంచమంతటా పరిచర్యలో పాల్గొనే సాక్షులు 1946 నాటికి 1,76,456కు చేరుకున్నారు—వీరిలో అనేకులు గొప్పసమూహానికి చెందినవారే. మరి 1993 లో 231 దేశాల్లో 47,09,889 మంది సాక్షులు యెహోవాకు నమ్మకంగా సేవచేస్తున్నారు—నిజంగా ఒక గొప్పసమూహము! ఆ సంఖ్య యింకా పెరుగుతూనేవుంది.

21. (ఎ) ప్రభువు దినములో దేవుని ప్రజలను సమకూర్చుపని ఎలా యోహాను దర్శనంతో సంపూర్ణానుగుణ్యత కల్గివుంది? (బి) ఎలా కొన్ని ప్రాముఖ్యమైన ప్రవచనాలు నెరవేరుట కారంభించాయి?

21 ప్రభువు దినములో దేవుని ప్రజలను సమకూర్చేపని ఆవిధంగా యోహాను దర్శనానికి పూర్తి అనుగుణంగావుంది: మొదట 1,44,000 మందిలో శేషించినవారిని సమకూర్చడం; ఆ పిదప గొప్పసమూహమును సమకూర్చడం. యెషయా ప్రవచించినట్లు, యిప్పుడు “అంత్యదినములలో” యెహోవా స్వచ్ఛారాధనలో పాల్గొనడానికి సమస్తప్రజలు గుంపులుగా వస్తున్నారు. మరి, నిశ్చయంగా మనం యెహోవా “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” సృజించడాన్ని అభినందించడంలో ఆనందిస్తాం. (యెషయా 2:2-4; 65:17, 18) దేవుడు “పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా” సమకూర్చుతున్నాడు. (ఎఫెసీయులు 1:10) యేసు కాలంనుండి శతాబ్దాలుగా ఏర్పాటు చేసుకోబడిన పరలోక రాజ్య అభిషక్త వారసులు “పరలోక సంబంధులు.” మరిప్పుడు వేరేగొఱ్ఱెలకు సంబంధించిన గొప్పసమూహము “భూసంబంధుల”లో ప్రథములుగా కనబడుతున్నారు. ఆ ఏర్పాటుకు అనుగుణంగా నీవు సేవచేయడమంటే నీకు నిత్యాశీర్వాదాలు లభించునని అర్థము.

గొప్పసమూహము యొక్క దీవెనలు

22. గొప్పసమూహాన్ని గూర్చి యోహాను యింకా ఎటువంటి సమాచారాన్ని అందుకుంటాడు?

22 దైవమార్గంద్వారా యోహాను యీ గొప్పసమూహాన్ని గూర్చిన సమాచారమింకను అందుకుంటున్నాడు: “అతడు [ఆ పెద్ద] ఈలాగు నాతోచెప్పెను—వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైనవాడు తానే తన గుడారము వారిమీద కప్పును.”—ప్రకటన 7:14బి, 15.

23. గొప్పసమూహము ‘తప్పించుకునే’ ఆ మహాశ్రమ ఏమిటి?

23 “లోకారంభంనుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, యిక ఎప్పుడును కలుగబోదు” అనే శ్రమతో, రాజ్యమహిమతోవచ్చే తన ప్రత్యక్షత ముగుస్తుందని యేసు ముందొక సందర్భంలో చెప్పాడు. (మత్తయి 24:21, 22) ఆ ప్రవచన నెరవేర్పుగా, సాతాను యీ లోకవిధానాన్ని ధ్వంసం చేయడానికి దేవదూతలు భూమి నలుదిక్కులనుండి నాలుగు వాయువులను వదలిపెడతారు. మొదట ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను నాశనం చేయబడుతుంది. తర్వాత, మహాశ్రమలు తారస్థాయికి చేరినప్పుడు యేసు 1,44,000 మందిలో శేషించినవారిని, వారితోపాటు మహాగొప్పసమూహాన్ని తప్పిస్తాడు.—ప్రకటన 7:1; 18:2.

24. గొప్పసమూహములోని సభ్యులు వ్యక్తిగతంగా తప్పించు కోవడానికి ఎలా అర్హులౌతారు?

24 గొప్పసమూహంలోని వ్యక్తులెలా తప్పించుకునే అర్హత పొందుతారు? ఆ పెద్ద యోహానుతో వారు “గొఱ్ఱెపిల్లరక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి” అని చెబుతున్నాడు. అంటే, వారు యేసును వారి విమోచకుడని విశ్వసించి, యెహోవాకు సమర్పించుకొని, నీళ్లలో బాప్తిస్మం పొందడంద్వారా ఆ సమర్పణను తెలియజేశారు, మరియు వారి యథార్థప్రవర్తన ద్వారా “నిర్మలమైన మనస్సాక్షిని” కల్గియున్నారు. (1 పేతురు 3:16, 21; మత్తయి 20:28) ఆ విధంగా, యెహోవా దృష్టిలో వారు నిర్మలులును, నీతిమంతులునై యున్నారు. మరియు వారు “ఇహలోక మాలిన్యము తమకంటకుండ” దూరంగా వున్నారు.—యాకోబు 1:27.

25. (ఎ) గొప్పసమూహము ఎలా యెహోవాను “రాత్రింబగళ్లు ఆయన ఆలయములో సేవిస్తున్నారు”? (బి) యెహోవా ఎలా గొప్ప సమూహము మీద “తన గుడారమును కప్పును”?

25 ఇంకనూ, “రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవిస్తూ”—వారు యెహోవాకు ఆసక్తిగల సాక్షులయ్యారు. ఈ సమర్పిత గొప్పసమూహంలో నీవును ఒకడివా? అలాగైతే, ఆయన గొప్ప ఆత్మీయాలయంలోని ఆవరణలో యెహోవాను మానక సేవించడం మీ ఆధిక్యతే. ఈనాడు, అభిషక్తుల నడిపింపు క్రింద గొప్పసమూహము సాక్ష్యపు పనిలో అధికభాగం వహిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలున్నప్పటికీ, వారిలో వందలాదిమంది పయినీర్లుగా పూర్తికాల సేవను చేయడానికి వీలుకల్పించుకున్నారు. అయితే, నీవా గుంపులో ఉన్నా, లేకపోయినా, గొప్ప సమూహంలో సభ్యునిగా, నీకున్న విశ్వాసం క్రియలమూలంగా దేవుని స్నేహితునిగా నీవు నీతిమంతుడవని తీర్చబడినందుకు మరి ఆయన గుడారంలో అతిథిగా ఆహ్వానించ బడుతున్నందుకు నీవు సంతోషించగలవు. (కీర్తన 15:1-5; యాకోబు 2:21-26) అలా యెహోవా తనను ప్రేమించేవారిమీద తన ‘గుడారాన్ని కప్పుతాడు,’ మరియు ఉత్తమ అతిథేయునిగా ఆయన వారిని కాపాడుతాడు.—సామెతలు 18:10.

26. ఏ యితర దీవెనలను గొప్పసమూహము అనుభవిస్తారు?

26 ఆ పెద్ద యింకనూ యిలా చెబుతున్నాడు: “వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారికన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.” (ప్రకటన 7:16, 17) అవును, యెహోవా నిజంగా ఆతిథ్యమిచ్చువాడే! ఈ మాటలకు ఎటువంటి లోతైన భావముంది?

27. (ఎ) యెషయా ప్రవచనమెలా ఆ పెద్ద చెప్పిన మాటలవలెనే ఉన్నది? (బి) యెషయా ప్రవచనం పౌలు కాలంలో క్రైస్తవ సంఘంపై నెరవేరుట కారంభించిందని ఏది చూపిస్తుంది?

27 అటువంటి మాటలేవున్న మరో ప్రవచనాన్ని మనం పరిశీలిద్దాం: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని . . . వారియందు కరుణించువాడు వారిని తోడుకొనిపోవుచు నీటిబుగ్గలయొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలియైనను దప్పియైనను కలుగదు. ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు.” (యెషయా 49:8, 10; కీర్తన 121:5, 6 కూడ చూడండి.) అపొస్తలుడైన పౌలు యీ ప్రవచనములోని కొంతభాగాన్ని తీసికొని సా.శ. 33 లో ప్రారంభమైన “రక్షణ దినము”నకు దానిని వర్తించాడు. ఆయనిలా వ్రాశాడు: “అనుకూల సమయమందు నీమొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో రక్షణ దినము.”—2 కొరింథీయులు 6:2.

28, 29. (ఎ) యెషయా మాటలెలా మొదటి శతాబ్దంలో నెరవేరాయి? (బి) ప్రకటన 7:16 లోని మాటలు ఎలా గొప్పసమూహము యెడల నెరవేరుతున్నాయి? (సి) గొప్పసమూహము “జీవజలముల బుగ్గల యొద్దకు” నడిపించబడినపుడు ఏమౌతుంది? (డి) గొప్పసమూహ మెందుకు మానవజాతిలో ఒక ప్రత్యేకమైన గుంపుగా ఉంటుంది

28 ఆకలియైనను లేక దాహమైనను కాదని లేక ఎండయైనను తగలదని చేసిన వాగ్దానం ఆనాడు ఎటువంటి వర్తింపు కల్గియుండెను? నిశ్చయంగా, తొలి క్రైస్తవులు కొన్నిసార్లు అక్షరార్థంగా ఆకలిగొని దప్పికగొని ఉంటారు. (2 కొరింథీయులు 11:23-27) అయినా, ఆత్మీయ విషయాల్లో వారికి సమృద్ధిగా లభించింది. వారికి సమృద్ధిగా అనుగ్రహించ బడినందుకే వారు ఆత్మీయంగా ఆకలిగొనలేదు, దప్పిగొనలేదు. అంతేగాక, సా.శ. 70 లో యూదా విధానాన్ని యెహోవా నాశనం చేసినప్పుడు తనకోపాగ్ని జ్వాలను వారిమీదకు రానివ్వలేదు. ప్రకటన 7:16 నందలి మాటలు యీనాడు గొప్పసమూహము విషయంలో ఆత్మీయ నెరవేర్పును కల్గివున్నాయి. అభిషక్త క్రైస్తవులతోపాటు వారును ఆత్మీయ సమృద్ధిని అనుభవిస్తున్నారు.—యెషయా 65:13; నహూము 1:6, 7.

29 నీవునూ గొప్పసమూహములో ఒకడవైతే, క్షీణిస్తున్న సాతాను విధానంలో నీవెటువంటి కష్టనష్టాలను అనుభవించ వలసియున్ననూ, నీకున్న మంచి హృదయస్థితి నిన్ను “ఆనందంచేత కేకలువేసే”లా చేస్తుంది. (యెషయా 65:14) ఆ భావంలో, యిప్పుడు కూడ యెహోవా ‘నీ కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయ’ గలడు. దేవుని ప్రతికూల తీర్పనే మండే “సూర్యుడు” యిక నిన్ను బెదిరించడు, మరి నాశనకరమైన వాయువులు విడుదల చేయబడినప్పుడు యెహోవా అయిష్టతయనే “ఎండమావి” నుండి నీవు తప్పించబడవచ్చు. ఆ నాశనం ముగిసిన తర్వాత, పునఃశక్తినిచ్చే “జీవజలముల బుగ్గల”నుండి పూర్తి ప్రయోజనం నీవు పొందులాగున గొఱ్ఱెపిల్ల నిన్ను నడిపిస్తుంది, ఈ జీవజలములు, నీవు నిత్యజీవం పొందడానికి యెహోవా చేసే సమస్త ఏర్పాట్లను సూచిస్తున్నాయి. గొఱ్ఱెపిల్ల రక్తమందలి నీ విశ్వాసము నీవు క్రమేపి మానవ పరిపూర్ణస్థితికి తీసుకురాబడటంలో నిరూపించ బడుతుంది. గొప్ప సమూహములోని నీవు, మరణించనవసరంలేని “లక్షలాదిమంది” మానవుల్లో ఓ ప్రత్యేకమైన వ్యక్తివైయుంటావు! సంపూర్ణ భావంలో నీనుండి ప్రతి బాష్పబిందువు తీసివేయబడుతుంది.—ప్రకటన 21:4.

పిలుపును నిశ్చయపరచుట

30. యోహాను దర్శనంలో మనకు ఎటువంటి మహిమాన్విత మార్గం తెరువబడుతుంది, మరి “తాళజాలిన” వారెవరు?

30 ఎంతటి మహిమాన్విత నిరీక్షణాద్వారం మనకొరకు తెరువబడివుంది! యెహోవా తన సింహాసనంమీద ఆసీనుడైయున్నాడు, మరి పరలోక, భూలోక సేవకులంతా ఆయనకు స్తుతులు చెల్లించడంలో ఏకమైయున్నారు. ఈ గొప్పస్తుతి గీతంలో పాల్గొనడమెంతటి ఘనమైన ఆధిక్యతో తన భూలోక సేవకులు గుణగ్రహిస్తున్నారు. అతి త్వరలోనే, యెహోవా మరియు క్రీస్తుయేసు తీర్పుతీర్చనైయున్నారు, అప్పుడు యిలాంటి కేక వినబడును: “ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు?” (ప్రకటన 6:17) జవాబేమిటి? మానవజాతిలో కొద్దిమంది మాత్రమే, అంటే, ముద్రింపబడిన 1,44,000 మందిలో యింకనూ బ్రతికియున్న వారితోపాటు, వేరేగొఱ్ఱెలకు సంబంధించిన గొప్పసమూహములో “నిలుచు”వారు తప్పించుకుంటారు.—యిర్మీయా 35:19; 1 కొరింథీయులు 16:13 పోల్చండి.

31. అభిషక్తులు, గొప్పసమూహం, వీరిద్దరికి చెందిన క్రైస్తవులపై యోహాను దర్శనపు నెరవేర్పు ఎలాంటి ప్రభావం చూపాలి?

31 ఈ వాస్తవం దృష్ట్యా, యోహాను తరగతికిచెందిన అభిషక్త క్రైస్తవులు “క్రీస్తుయేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తు”టలో ఎంతో ప్రయాసపడుతున్నారు. (ఫిలిప్పీయులు 3:14) ఈ కాలంలో సంభవించే సంఘటనలనుబట్టి వారు ప్రత్యేక సహనం కనబరచవలసి యున్నారని వారికి బాగాతెలుసు. (ప్రకటన 13:10) అనేక సంవత్సరాలుగా యెహోవాను యథార్థంగా సేవించిన తర్వాత వారు తమ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టియున్నారు, వారి పేర్లు “పరలోకమందు వ్రాయబడి యున్నవని” సంతోషిస్తున్నారు. (లూకా 10:20; ప్రకటన 3:5) “అంతమువరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును” అనే సంగతి గొప్పసమూహానికి కూడ తెలుసు. (మత్తయి 24:13) మహాశ్రమలు తప్పించు కోవడానికి గొప్పసమూహము ఒక గుంపుగా గుర్తింప బడినప్పటికిని, అందులోని వ్యక్తులు చురుకుగా పరిశుద్ధులుగా ఉండడానికి స్వయంగా కృషిచేయాలి.

32. యెహోవా ఉగ్రత దినమున రెండు గుంపులు మాత్రమే “నిలుచు”ననే వాస్తవం ఏ అత్యవసర పరిస్థితిని గూర్చి ప్రాముఖ్యంగా తెలియజేస్తుంది?

32 ఈ రెండు గుంపుల్లో ఏ ఒక్కటికూడ దేవుని ఉగ్రతయెదుట “నిలబడ”వలసి వస్తుందనడానికి ఏ సాక్ష్యాధారం లేదు. అయితే ప్రతిసంవత్సరం యేసు మరణ జ్ఞాపకార్థదిన ఆచరణకు హాజరౌతూ, యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం పొంది, ఆయన సేవలో చురుకుగా పాల్గొనేంతగా యేసు బలియందు విశ్వాసాన్ని ప్రదర్శించని లక్షలాదిమంది విషయంలో దీనర్థమేమిటి? ఇంకా, ఒకనాడు చురుకుగా ఉండి, యిప్పుడు “ఐహిక విచారముల వలన . . . మందముగా” ఉన్నవారి సంగతేమిటి? “జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు,” అంటే యేసుక్రీస్తు యెదుట నిలువబడడానికి అట్టివారంతా అప్రమత్తంగా, మెలకువగా ఉండాలి. సమయం కొంచెమే ఉంది.—లూకా 21:34-36.

[అధస్సూచీలు]

^ పేరా 1 న్యూవర్‌ల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి చూడండి.

^ పేరా 3 ది వాచ్‌టవర్‌, ఏప్రిల్‌ 1, 1918, పుట 98.

^ పేరా 13 అక్షరార్థంగా, “ఆయన ముందర,” ది కింగ్‌డం ఇంటర్లీనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది గ్రీక్‌ స్క్రిప్చర్స్‌.

[అధ్యయన ప్రశ్నలు]

[119వ పేజీలోని బాక్సు]

భావములు చెప్పుట దేవుని అధీనమే

అనేక దశాబ్దాలుగా యోహాను తరగతి, గొప్పసమూహమును గుర్తించడానికి విచారణచేసింది గానీ సంతృప్తికరమైన వివరణ లభించలేదు. ఎందుకు? నమ్మకస్థుడైన యోసేపు చెప్పిన యీ మాటల్లో మనకు సమాధానం ఉంది: “భావములు చెప్పుట దేవుని అధీనమే గదా?” (ఆదికాండము 40:8) దేవుడు తన ప్రవచనాల నెరవేర్పు భావాన్ని ఎప్పుడు, ఎలా చెప్తాడు? సాధారణంగా, ఆ ప్రవచనాలనుగూర్చి వెదకే తన సేవకులు వాటి సమాచారాన్ని స్పష్టంగా గ్రహించగలిగేలాగున అవి నెరవేరుతున్నప్పుడు లేక నెరవేరవలసి యున్నప్పుడు తెలియజేస్తాడు. “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై . . . మనకు బోధకలుగు నిమిత్తము” యీ వివరణ యివ్వబడింది.—రోమీయులు 15:4.

[124వ పేజీలోని బాక్సు]

గొప్పసమూహపు సభ్యులు

▪ ప్రతిజనము, జాతి, ప్రజలు, భాషల్లోనుండి వస్తున్నారు

▪ యెహోవా సింహాసనము యెదుట నిల్చున్నారు

▪ గొఱ్ఱెపిల్ల రక్తమందు వారి వస్త్రాలను తెల్లగా ఉదుకుకొని యున్నారు

▪ యెహోవాకు, యేసునకు వారి రక్షణకై స్తుతులు చెల్లిస్తున్నారు

▪ మహాశ్రమలనుండి తప్పించుకుంటారు

▪ రాత్రింబగళ్లు యెహోవా ఆలయములో ఆయన్ను సేవిస్తున్నారు

▪ యెహోవా ప్రేమపూర్వక రక్షణను కాపుదలను పొందుతున్నారు

▪ యేసు వారిని జీవజలముల బుగ్గలయొద్దకు నడిపిస్తున్నాడు

121వ పేజీలోని చిత్రం]

[127వ పేజీలోని చిత్రం]

గొప్పసమూహము తమ రక్షణకై దేవునికి గొఱ్ఱెపిల్లకు స్తోత్రం చెల్లిస్తున్నారు

[128వ పేజీలోని చిత్రం]

గొఱ్ఱెపిల్ల గొప్పసమూహాన్ని జీవజలముల బుగ్గలయొద్దకు నడిపిస్తుంది