కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దుఃఖంతో నేనెలా జీవించగలను?

దుఃఖంతో నేనెలా జీవించగలను?

నా భావాలను అణచుకోవాలనే ఒత్తిడి నాలో ఎక్కువగా ఉన్నట్లు భావించాను,” అని మైక్‌ తన తండ్రి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వివరిస్తున్నాడు. దుఃఖాన్ని ఆపుకోవడం పురుష లక్షణమని మైక్‌ అనుకున్నాడు. కానీ తాను పొరబడ్డానని ఆ తరువాత గ్రహించాడు. కాబట్టి, తన స్నేహితుని తాతయ్య చనిపోయినప్పుడు, ఏమి చేయాలో మైక్‌కు తెలుసు. ఆయన ఇలా అంటున్నాడు: “కొన్ని సంవత్సరాల క్రితమైతే, నేను అతని భుజం తట్టి ‘మగాడిలా ఉండు’ అని చెప్పేవాడినే. కానీ ఇప్పుడు నేను ఆయన చేయిపట్టుకొని ‘నీవు నీ దుఃఖాన్ని ఎలా వ్యక్తం చేయాలనుకుంటే అలా చెయ్యి. అలా దుఃఖించడం బాధను తట్టుకోవడానికి నీకు సహాయం చేస్తుంది. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళమంటే వెళ్తాను, ఉండమంటే ఉంటాను. కానీ నీ దుఃఖాన్ని వ్యక్తం చేయడానికి నీవు భయపడవద్దు’” అని చెప్పాను.

మేరియేన్‌ కూడా తన భర్త మరణించినప్పుడు తన భావాలను అణచుకోవాలనే ఒత్తిడికి లోనైనట్లు భావించింది. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “నాలో కలుగుతున్న సహజ భావాలను బయటకు వ్యక్తం చేయకుండా ఇతరులకు ఆదర్శంగా ఉండడం గురించే నేను ఎక్కువగా చింతించాను. అయితే అలా ఇతరులకు ఒక ఆసరాగా ఉండడానికి ప్రయత్నించడం నాకు సహాయం చేయడం లేదని చివరకు నేను గ్రహించాను. నా పరిస్థితిని విశ్లేషించుకుంటూ, ‘నీకు ఏడవాలనిపిస్తే ఏడువు. మరీ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించకు. నీ మనస్సు కుదుటపడాలంటే నీ భావాలను బయటకు వెళ్ళగ్రక్కు’ అని నాకు నేను చెప్పుకున్నాను.”

కాబట్టి మైక్‌ మరియు మేరియేన్‌ ఇలా సిఫారసు చేస్తున్నారు: మీకెంతగా దుఃఖించాలనిపిస్తే అంతగా దుఃఖించండి! వాళ్లు చెప్పింది సరైనదే. ఎందుకు? ఎందుకంటే భావోద్వేగ ఉపశమనానికి దుఃఖించడం అవసరం. మీ భావాలను వెళ్లగ్రక్కడం మీకున్న ఒత్తిడిని తగ్గించగలదు. భావాలను సహజంగా వ్యక్తం చేయడానికి సరైన అవగాహన, ఖచ్చితమైన సమాచారం తోడైతే, అది మీ భావాలను సరైన దృష్టితో చూడడానికి మీకు సహాయం చేస్తుంది.

నిజమే, ప్రతి ఒక్కరూ ఒకే విధంగా దుఃఖించరు. ప్రియమైనవారు హఠాత్తుగా చనిపోయారా లేక చాలాకాలంగా వ్యాధితో బాధపడి చనిపోయారా అనేది బ్రతికివున్నవారి భావోద్వేగ ప్రతిస్పందనపై ప్రభావం చూపుతుంది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం: మీ భావాలను అణచుకోవడం అటు భౌతికంగా ఇటు భావోద్రేకంగా హానికరం కాగలదు. దుఃఖాన్ని వ్యక్తపరచడం ఆరోగ్యదాయకం. అదెలా? లేఖనాల్లో కొన్ని అభ్యాససిద్ధమైన సలహాలు ఉన్నాయి.

దుఃఖం నుండి ఉపశమనం పొందడం—ఎలా?

దుఃఖం నుండి ఉపశమనం పొందడంలో మాట్లాడడం మీకు సహాయకరంగా ఉండవచ్చు. ప్రాచీనకాల పితరుడైన యోబు తన పదిమంది పిల్లలను కోల్పోవడంతోపాటు వ్యక్తిగతంగా ఇతర విషాదాలనూ అనుభవించిన తర్వాత, ఇలా అన్నాడు: “నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నేను అడ్డులేకుండ అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను.” (యోబు 1:2, 18, 19; 10:1) యోబు తన వ్యాకులతను అణచుకోలేకపోయాడు. ఆయన దానిని అడ్డులేకుండా బయటికి వెళ్ళగ్రక్కాలి; ఆయన ‘పలకాలి,’ అంటే మాట్లాడాలి. అదే రీతిలో, ఆంగ్ల నాటక రచయిత షేక్స్‌పియర్‌ మాక్‌బెత్‌లో ఇలా వ్రాశాడు: “దుఃఖాన్ని వ్యక్తం చేయండి; లేకపోతే అది నెమ్మదిగా మనిషినే కబళిస్తుంది.”

కాబట్టి మీ భావాలను, సహనంతో కనికరంతో వినే ‘నిజమైన స్నేహితునితో’ పంచుకోవడం ద్వారా చాలావరకు ఉపశమనం పొందవచ్చు. (సామెతలు 17:17) భావాలను, అనుభవాలను మాటల్లో వ్యక్తం చేస్తే వాటిని అర్థంచేసుకోవడం, వాటితో వ్యవహరించడం సులభమవుతుంది. ఒకవేళ వినే వ్యక్తి కూడా తన ప్రియమైన వారిని పోగొట్టుకొని, దాన్ని నిబ్బరంగా తట్టుకొని వ్యవహరించిన వ్యక్తి అయితే, మీ దుఃఖాన్ని అధిగమించేందుకు వారినుండి ఆచరణాత్మకమైన సలహాలను పొందవచ్చు. ఒక తల్లి తన బిడ్డ చనిపోయినప్పుడు, తనలాగే బిడ్డను కోల్పోయిన మరొక స్త్రీతో మాట్లాడడం ఎందుకు సహాయపడిందో ఇలా వివరించింది: “ఆమెకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యిందనీ, ఆ తర్వాత ఆమె మామూలు స్థితికి చేరుకుందనీ, తత్ఫలితంగా ప్రస్తుతం ఆమె సాధారణ జీవితమే గడుపుతోందనీ తెలుసుకోవడం నన్ను చాలా బలపరిచింది.”

మీ భావాలను వ్రాసిపెట్టుకోవడం, మీకున్న దుఃఖాన్ని వ్యక్తంచేయడానికి మీకు సహాయపడుతుందని బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి

మీ భావాలను వ్యక్తం చేయడం మీకు ఇబ్బందికరంగా ఉంటే అప్పుడెలా? సౌలు, యోనాతాను మరణించిన తర్వాత దావీదు భావోద్వేగం నిండిన ఒక ప్రలాపగీతాన్ని కూర్చి, అందులో తన దుఃఖాన్ని వ్యక్తంచేశాడు. ఈ దుఃఖభరిత ప్రలాపగీతం చివరకు లిఖితవాక్యమైన బైబిలులోని రెండవ సమూయేలు గ్రంథంలో ఒక భాగమైంది. (2 సమూయేలు 1:17-27; 2 దినవృత్తాంతములు 35:25) అలాగే కొందరికి తమ దుఃఖాన్ని వ్రాతపూర్వకంగా వ్యక్తంచేయడం సులభంగా ఉంటుంది. ఒక విధవరాలు తన భావాలను వ్రాసిపెట్టుకొని, కొన్ని రోజుల తర్వాత తాను వ్రాసినదాన్ని తిరిగి చదువుతానని చెప్పింది. అది చాలా సహాయకరంగా ఉన్నట్లు ఆమె గ్రహించింది.

మాట్లాడడం ద్వారానైనా వ్రాయడం ద్వారానైనా మీ భావాలను వ్యక్తంచేయడం దుఃఖం నుండి ఉపశమనం పొందడానికి మీకు సహాయపడవచ్చు. అది అపార్థాలను తొలగించుకోవడానికి కూడా సహాయపడవచ్చు. బిడ్డను పోగొట్టుకున్న ఒక తల్లి ఇలా వివరిస్తోంది: “ఒక బిడ్డను కోల్పోయిన తర్వాత కొంతమంది దంపతులు విడాకులు తీసుకున్నారని నేను, నా భర్త విన్నాము, అలాంటి పరిస్థితి మాకు రాకూడదని మేము కోరుకున్నాము. కాబట్టి ఎప్పుడైనా మాకు కోపమొచ్చి ఒకరినొకరు నిందించుకొనే పరిస్థితి వస్తే, మేము దాని గురించి మాట్లాడి పరిష్కరించుకుంటాం. అలా చేయడం ద్వారా మేమిద్దరం నిజంగా ఒకరికొకరం దగ్గరయ్యామని నేననుకుంటున్నాను.” కాబట్టి మీ భావాలను వ్యక్తంచేయడం, మీరు అనుభవిస్తున్నలాంటి బాధనే ఇతరులు కూడా అనుభవిస్తున్నప్పటికీ వారు భిన్నంగా అంటే తమదైన రీతిలో, పద్ధతిలో దుఃఖిస్తారని అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

దుఃఖం నుండి ఉపశమనం పొందడానికి ఏడవడం కూడా సహాయపడవచ్చు. ఏడవడానికి లేదా ‘దుఃఖించడానికి సమయము’ కలదని బైబిలు చెబుతోంది. (ప్రసంగి 3:1, 4) ప్రియమైనవారు చనిపోయినప్పుడు మనకు అలాంటి సమయం వస్తుంది. దుఃఖంతో కన్నీళ్లు కార్చడం, కోలుకునే ప్రక్రియలో ఒక అవసరమైన భాగమనిపిస్తోంది.

ఒక యౌవనస్థురాలు తన తల్లి మరణించినప్పుడు దాన్ని తట్టుకోవడానికి తన ప్రాణస్నేహితురాలు ఎలా సహాయం చేసిందో వివరిస్తోంది. ఆమె ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “నా స్నేహితురాలు నాకెప్పుడూ ఆసరాగా ఉంది. ఆమె నాతోపాటు ఏడ్చింది. నాతో మాట్లాడింది. అందువల్ల నేను నా భావాలను దాచుకోకుండా వ్యక్తపరచగలిగాను, అది నాకెంతో తోడ్పడింది. ఏడవడానికి నేనేమాత్రం ఇబ్బందిపడలేదు.” (రోమీయులు 12:15, 16 చూడండి.) మీరు కన్నీరు కార్చడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం చూసినట్లుగా, ఏ మాత్రం ఇబ్బందిపడకుండా బాహాటంగా కన్నీళ్లు విడిచిన యేసుక్రీస్తుతో సహా అనేకమంది స్త్రీపురుషుల ఉదాహరణలు బైబిలులో ఉన్నాయి.—ఆదికాండము 50:3; 2 సమూయేలు 1:11, 12; యోహాను 11:33, 35.

అన్ని సాంప్రదాయాల్లోను, దుఃఖించే ప్రజలు ఓదార్పు పొందడానికి ఇష్టపడతారు

కొంతకాలం వరకు, మీ భావాలు ఎప్పుడెలా మారతాయో మీకే తెలియని విధంగా ఉండవచ్చు. మీకు తెలియకుండానే కన్నీళ్లు కారవచ్చు. ఒక విధవరాలు సూపర్‌మార్కెట్‌కు వెళ్లి (ఈ విధంగా ఆమె తరచూ తన భర్తతోపాటు వెళ్లేది) వస్తువులను కొంటున్నప్పుడు, ప్రాముఖ్యంగా, తన భర్త ఇష్టపడిన వస్తువులను అలవాటు చొప్పున తీసుకున్నప్పుడు, తన కన్నీళ్ళను ఆపుకోవడం కష్టంగా ఉన్నట్లు గ్రహించింది. కాబట్టి అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే కంగారు పడకండి. వచ్చే కన్నీటిని ఆపుకోవాలని మీరు అనుకోవద్దు. కన్నీళ్ళు రావడం సహజమనీ, దుఃఖించడంలో అవి ఒక భాగమనీ గుర్తుంచుకోండి.

అపరాధభావాలతో వ్యవహరించడం

ముందు మనం చూసినట్లుగా, ప్రియమైన వారిని కోల్పోయిన తర్వాత కొందరిలో అపరాధభావాలు కలుగుతాయి. ఈ విషయం, నమ్మకస్థుడైన యాకోబు తన కుమారుడైన యోసేపు “దుష్ట మృగము” చేత చంపబడ్డాడని నమ్మించబడినప్పుడు ఆయనకు ఎందుకంత విపరీతమైన దుఃఖం కలిగిందో అర్థం చేసుకోవడానికి సహాయం చేయవచ్చు. యాకోబు తానే యోసేపును తన అన్నల యోగక్షేమాలు తెలిసికొని రావడానికి పంపించాడు. కాబట్టి ‘అసలు యోసేపును నేనెందుకు ఒంటరిగా పంపాను? క్రూరమృగాలు ఎక్కువగా తిరిగే ప్రాంతానికి అతన్ని నేనెందుకు పంపాను?’ అనే అపరాధభావాలతో యాకోబు విపరీతంగా బాధపడి ఉండవచ్చు.—ఆదికాండము 37:33-35.

కొంతవరకు మీ నిర్లక్ష్యం కారణంగానే మీ ప్రియమైనవారు చనిపోయారని మీరు భావిస్తుండవచ్చు. అలాంటి అపరాధభావం వాస్తవమైనదే అయినా లేదా ఊహాజనితమైనదే అయినా అది, దుఃఖంవల్ల సహజంగా కలుగుతుందని గ్రహించడం సహాయకరంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా, ఆ భావాలను మీలోనే ఉంచుకోవలసిన అవసరం లేదు. అపరాధభావాలతో మీరెంతగా బాధపడుతున్నారో ఇతరులతో మాట్లాడడం ఎంతో అవసరమైన ఉపశమనాన్ని మీకివ్వగలదు.

అయితే, ఒక వ్యక్తిని మనమెంతగా ప్రేమించినా, మనం అతని లేదా ఆమె జీవితాన్ని నియంత్రించలేమనీ, “కాలవశముచేతను, అనూహ్యంగాను” జరిగేవాటి నుండి మన ప్రియమైనవారిని తప్పించలేమనీ గ్రహించండి. (ప్రసంగి 9:11, NW) అంతేకాకుండా, మీలో అప్పుడు చెడు ఉద్దేశాలు ఉన్నాయని కాదు. ఉదాహరణకు, డాక్టరును త్వరగా కలిసే ఏర్పాటు చేయనంత మాత్రాన మీరు మీ ప్రియమైనవారు జబ్బుపడి మరణించాలని ఉద్దేశించినట్లవుతుందా? ఎంత మాత్రం కాదు! అలాంటప్పుడు ఆ వ్యక్తి మరణానికి నిజంగా మీరే కారణమా? కానేకాదు.

ఒక తల్లి తన కుమార్తె కారు ప్రమాదంలో చనిపోయిన తర్వాత తన అపరాధభావాలతో ఎలా వ్యవహరించాలో తెలుసుకుంది. ఆమె ఇలా వివరిస్తోంది: “నేనామెను బయటకు పంపించి పొరపాటు చేశానని భావించాను. కానీ ఆ విధంగా భావించడం హాస్యాస్పదమని ఆ తర్వాత నేను గ్రహించాను. ఏదో కొనుక్కురావడానికి ఆమెను ఆమె తండ్రితో బయటకు పంపడంలో తప్పులేదు. జరిగింది ఒక ఘోరమైన ప్రమాదం మాత్రమే.”

‘కానీ నేనిలా చెప్పి ఉంటే బావుండేది, అలా చేసి ఉంటే బావుండేది అనిపించిన విషయాలు చాలా ఉన్నాయి,’ అని మీరనవచ్చు. నిజమే, కానీ పరిపూర్ణమైన తండ్రిగా, తల్లిగా, లేదా బిడ్డగా ఉన్నామని మనలో ఎవరు చెప్పగలరు? బైబిలు మనకు ఇలా గుర్తుచేస్తోంది: “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడు.” (యాకోబు 3:2; రోమీయులు 5:12) కాబట్టి మీరు లోపము లేనివారు లేదా పరిపూర్ణులు కాదనే వాస్తవాన్ని అంగీకరించండి. “నేను ఇలా చేసుంటే బాగుండేది, అలా చేసుంటే బాగుండేది,” అంటూ అధికంగా ఆలోచించడం దేన్నీ మార్చలేదు, అది మీరు కోలుకోవడాన్ని కుంటుపరచగలదు.

మీరు చేసిన పొరపాటు ఊహ కాదనీ అది వాస్తవమేననీ మీరనుకోవడానికి సరైన కారణాలున్నట్లైతే, మీ దోషనివృత్తికి అతి ప్రాముఖ్యంగా దేవుని క్షమాభిక్ష పొందడం గురించి ఆలోచించండి. బైబిలు మనకిలా అభయమిస్తోంది: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.” (కీర్తన 130:3, 4) మీరు గతంలోకి వెళ్లి దేనినీ మార్చలేరు. అయితే మీరు గతంలో చేసిన పొరపాట్ల నిమిత్తం దేవున్ని క్షమాపణ అడగవచ్చు. ఆ తర్వాత? దేవుడు మీరు చేసిన పొరపాట్లను క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు క్షమించుకోవద్దా?—సామెతలు 28:13; 1 యోహాను 1:9.

కోపాన్ని నియంత్రించుకోవడం

మీకు డాక్టర్ల మీద, నర్సుల మీద, స్నేహితుల మీద, చివరికి చనిపోయిన వ్యక్తి మీద కోపం కూడా వస్తోందా? ఇది కూడా, కలిగిన లోటుకు సాధారణ స్పందనే అని గ్రహించండి. మీ కోపం, బహుశా మీకు కలిగిన బాధతోపాటు సహజంగా వచ్చేదే కావచ్చు. ఒక రచయిత ఇలా చెప్పాడు: “కోపం వచ్చినప్పుడు దానికి తగ్గట్టు ప్రవర్తించడం ద్వారా కాదుగానీ కోపం వస్తోందని పసిగట్టడం ద్వారానే మీరు దాని నాశనకరమైన ప్రభావం నుండి తప్పించుకోగలుగుతారు.”

కోపాన్ని వ్యక్తం చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం కూడా సహాయం చేయవచ్చు. ఎలా? అదుపులేని కోపాన్ని వ్యక్తంచేయడం ద్వారా మాత్రం కాదు. ఎక్కువసేపు కోపంగా ఉండడం అపాయకరమని బైబిలు హెచ్చరిస్తోంది. (సామెతలు 14:29, 30) అయితే అర్థంచేసుకునే స్నేహితులతో దాని గురించి మాట్లాడడం మీకు ఓదార్పుకరంగా ఉండవచ్చు. కోపం వచ్చినప్పుడు ఎక్కువగా వ్యాయామం చేయడం ఉపశమనమిస్తుందని కొందరు తెలుసుకున్నారు.—ఎఫెసీయులు 4:25, 26, కూడా చూడండి.

మీరు మీ భావాలను స్వేచ్ఛగా, నిజాయితీగా వ్యక్తంచేయడం ప్రాముఖ్యమే అయినప్పటికీ, ఈ విషయంలో కాస్త జాగ్రత్త పాటించడం కూడా అవసరమే. మీ భావాలను వ్యక్తంచేయడానికీ ఇతరులపై విరుచుకుపడడానికీ చాలా తేడావుంది. మీ కోపానికి, నిరాశకు ఇతరులను నిందించాల్సిన అవసరంలేదు. కాబట్టి మీ భావాలను జాగ్రత్తగా వ్యక్తం చేయండి, అంతేగానీ వాటిని శత్రుభావంతో వ్యక్తంచేయవద్దు. (సామెతలు 18:21) దుఃఖంతో వ్యవహరించడానికి ఒక సర్వశ్రేష్ఠమైన సహాయకం ఉంది, ఇప్పుడు దానిని పరిశీలిద్దాం.

దేవుని నుండి సహాయం

బైబిలు మనకిలా అభయమిస్తోంది: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు; నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” (కీర్తన 34:18) అవును, మీ ప్రియమైనవారు చనిపోవడం వల్ల కలిగిన బాధను తట్టుకోవాలంటే, అన్నిటికంటే ఎక్కువగా, దేవునితో మీకున్న సంబంధమే మీకు సహాయం చేయగలదు. ఎలా? ఇప్పటి వరకూ సూచించబడిన ఆచరణాత్మక సలహాలన్నీ దేవుని వాక్యమైన బైబిలుపై ఆధారపడినవి లేదా బైబిలుకు అనుగుణంగా ఉన్నవే. వాటిని అన్వయించుకోవడం దుఃఖాన్ని తట్టుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

అంతేకాకుండా, ప్రార్థనకున్న విలువను తక్కువ అంచనా వేయకండి. బైబిలు మనకిలా ఉద్బోధిస్తోంది: “నీ భారము యెహోవా మీద మోపుము; ఆయనే నిన్ను ఆదుకొనును.” (కీర్తన 55:22) సానుభూతిగల స్నేహితునితో మీ భావాలను పంచుకోవడం సహాయం చేయగలిగితే, “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని” ఎదుట మీ హృదయాన్ని కుమ్మరించడం మీకు ఇంకెంత సహాయకరంగా ఉంటుందో కదా!—2 కొరింథీయులు 1:3.

ప్రార్థన చేయగానే పరిస్థితి మారిపోతుందని కాదు. యథార్థంగా అడిగే తన సేవకులకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని ‘ప్రార్థన ఆలకించువాడు’ వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 65:2; లూకా 11:13) దేవుని పరిశుద్ధాత్మ లేదా చురుకైన శక్తి రోజులు గడిచేకొద్దీ మీలో ‘బలాధిక్యాన్ని’ అధికం చేయగలదు. (2 కొరింథీయులు 4:7) దేవుడు తన నమ్మకమైన సేవకులు ఎదుర్కొనే ప్రతీ సమస్యనూ సహించడానికి సహాయం చేయగలడని గుర్తుంచుకోండి.

తన బిడ్డను కోల్పోయిన ఒక తల్లి, ప్రార్థనా శక్తి తనకు, తన భర్తకు తమ బాధలో ఎలా సహాయపడిందో జ్ఞాపకం చేసుకుంటోంది. “మేము రాత్రుళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాకు ఆపుకోలేని దుఃఖం కలిగితే మేమిద్దరం కలిసి బిగ్గరగా ప్రార్థించేవాళ్లం,” అని ఆమె వివరిస్తోంది. “మొదటిసారిగా మా బిడ్డ లేకుండా దేన్నైనా చేయవలసివచ్చినప్పుడు అంటే మేము మొదటిసారి సంఘకూటానికి వెళ్లినప్పుడు, మొదటిసారి సమావేశానికి హాజరైనప్పుడు—మాకు శక్తినిమ్మని ప్రార్థన చేసేవాళ్ళం. మేము ఉదయాన్నే లేచినప్పుడు వాస్తవాన్ని తట్టుకోలేనంత బాధ కలిగితే, మాకు సహాయం చేయమని మేము యెహోవాకు ప్రార్థించేవాళ్లం. ఎందుకో గానీ, ఒంటరిగా ఇంట్లోకి అడుగుపెట్టాలంటే నాకు చెప్పలేనంత బాధగా ఉండేది. అందువల్ల నేను ఒంటరిగా ఇంటికి వచ్చిన ప్రతీసారి, ప్రశాంతంగా ఉండడానికి నాకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించేదాన్ని.” ఆ ప్రార్థనలు తమకు సహాయం చేశాయని ఆ విశ్వాసురాలు దృఢంగా నమ్ముతోంది, ఆమె అలా నమ్మడం సరైనదే. మీరు కూడా నిరంతరం చేసే మీ ప్రార్థనలకు జవాబుగా ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును’ అని తెలుసుకోవచ్చు.—ఫిలిప్పీయులు 4:6, 7; రోమీయులు 12:12.

దేవుడు అనుగ్రహించే సహాయం తప్పకుండా మార్పును తెస్తుంది. ‘ఎలాంటి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిగలవారమయ్యేలా దేవుడు మన శ్రమ అంతటిలో మనల్ని ఆదరిస్తున్నాడు’ అని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. దేవుని సహాయం బాధను పూర్తిగా తొలగించదనే మాట నిజమే, కాని దాన్ని సులభంగా తట్టుకునేలా చేస్తుంది. అంటే మీరిక ఎప్పటికీ ఏడవరనో మీ ప్రియమైనవారిని మరచిపోతారనో దానర్థం కాదు. అయితే మీరు కోలుకోవచ్చు. మీరలా చేస్తుండగా, మీరు పొందిన అనుభవం, మీలాగే బాధ అనుభవిస్తున్న ఇతరులకు సహాయం చేయడంలో మీరు ఎక్కువ అర్థంచేసుకునేవారిగాను, సానుభూతి గలవారిగాను ఉండేలా చేస్తుంది.—2 కొరింథీయులు 1:4.