కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 7

ఇంట్లో తిరుగుబాటుదారుడు ఉన్నాడా?

ఇంట్లో తిరుగుబాటుదారుడు ఉన్నాడా?

1, 2. (ఎ) యూదా మత నాయకుల విశ్వాస లోపాన్ని నొక్కి చెప్పేందుకు యేసు ఏ ఉపమానాన్ని చెప్పాడు? (బి) యేసు ఉపమానంనుండి మనం యౌవనస్థులను గూర్చిన ఏ విషయాన్ని నేర్చుకుంటాం?

 తన మరణానికి కొన్ని దినాలకు ముందు యేసు, యూదా మతనాయకుల గుంపును ఒక ఆలోచింపజేసే ప్రశ్నను అడిగాడు. ఆయనిలా చెప్పాడు: “మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చి—కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా వాడు—పోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు—అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను.” యూదా నాయకులు ఇలా సమాధానమిచ్చారు: “మొదటివాడే.”—మత్తయి 21:28-31.

2 యూదా నాయకుల విశ్వాస లోపాన్ని యేసు ఇక్కడ నొక్కి చెబుతున్నాడు. వారు రెండవ కుమారునివలె ఉన్నారు, వారు దేవుని చిత్తాన్ని చేస్తామని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలుపుకోలేదు. అయితే యేసు ఉపమానం కుటుంబ జీవితం యొక్క చక్కని అవగాహనపై ఆధారపడి ఉందని అనేకమంది తలిదండ్రులు గుర్తిస్తారు. ఆయన చక్కగా చూపించిన విధంగా, యౌవనస్థులు ఏమి ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవడం లేక వారేమి చేస్తారు అనేది అంచనావేయడం తరచూ చాలా కష్టతరమౌతుంది. ఒక యౌవనస్థుడు తన యౌవనకాలంలో అనేక సమస్యలు కలిగించవచ్చు మరి తర్వాత బాధ్యతగల, ఎంతో గౌరవింపబడే పెద్దవానిగా మారవచ్చు. యౌవన కాల తిరుగుబాటు యొక్క సమస్యను గురించి మనం చర్చించేటప్పుడు ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలి.

తిరుగుబాటుదారుడు అంటే ఏమిటి?

3. తలిదండ్రులు తమ పిల్లవాడు తిరుగుబాటుదారుల జాబితాలోకి వస్తాడు అని తేల్చేసేందుకు ఎందుకు త్వరపడకూడదు?

3 అప్పుడప్పుడూ, తమ తలిదండ్రులకు పూర్తిగా తిరుగుబాటు చేసే యౌవనుల గురించి మీరు వినవచ్చు. ఒక యౌవనున్ని అదుపు చేయడం మరీ అసాధ్యంలా కనిపించే పరిస్థితి ఉన్న కుటుంబాన్ని గురించి కూడా మీకు వ్యక్తిగతంగా తెలిసివుండవచ్చు. అయితే, ఒక పిల్లవాడు వాస్తవంగా తిరుగుబాటుదారుడా కాదా అనేది తెలుసుకోవడం ఎల్లప్పుడూ సులభం కాదు. అంతేకాకుండా, ఒకే కుటుంబానికి చెందిన వారిలో కూడా కొందరు పిల్లలే ఎందుకు తిరగబడతారు మరి ఇతరులు ఎందుకు తిరగబడరు అనేది తెలుసుకోవడం కూడా కష్టంగా ఉండగలదు. తమ పిల్లల్లో ఒకరు మరీ విపరీతమైన తిరుగుబాటుదారునిగా వృద్ధి చెందుతున్నాడని ఒకవేళ తలిదండ్రులు పసిగడితే, వారేమి చేయాలి? దీనికి జవాబు చెప్పాలంటే, తిరుగుబాటుదారుడంటే ఏమిటో దాని గురించి మనం మొదట మాట్లాడాలి.

4-6. (ఎ) తిరుగుబాటుదారుడు అంటే ఏమిటి? (బి) తమ యౌవనులు అప్పుడప్పుడూ అవిధేయత చూపితే తలిదండ్రులు ఏమి మనస్సులో ఉంచుకోవాలి?

4 క్లుప్తంగా చెప్పాలంటే, ఇష్టపూర్వకంగా మరియు ఎడతెగక అవిధేయత చూపే లేక ధిక్కరించే మరియు ఉన్నత అధికారాన్ని నిరాకరించే వ్యక్తియే తిరుగుబాటుదారుడు. ‘బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును’ అన్నది వాస్తవమే. (సామెతలు 22:15) కాబట్టి పిల్లలందరు తలిదండ్రుల మరియు ఇతరుల అధికారాన్ని ఎప్పుడో ఒకసారి ధిక్కరిస్తారు. శారీరక మరియు భావోద్రేక అభివృద్ధి జరిగే సమయమైన, యౌవనమని పిలువబడే దశలో ఇది ప్రాముఖ్యంగా సత్యం. ఏ వ్యక్తి జీవితంలోనైనా మార్పు అనేది ఒత్తిడిని సృష్టిస్తుంది, అయితే యౌవనంలో అనేక మార్పులు జరుగుతాయి. మీ యౌవన కుమారుడు లేక కుమార్తె చిన్నతనం నుండి పెద్ద వారయ్యే దిశకు పయనిస్తున్నారు. ఈ కారణం చేతనే, యౌవనకాలపు సంవత్సరాలలో కొంతమంది తలిదండ్రులకు మరియు పిల్లలకు సర్దుకుపోవడం కష్టంగా ఉంటుంది. తరచూ, తలిదండ్రులు యథేచ్ఛగా ఆ మార్పు యొక్క వేగాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తారు, అయితే యౌవనులు దాన్ని త్వరితం చేయాలని కోరుకుంటారు.

5 తిరుగుబాటుదారుడైన యౌవనుడు తలిదండ్రుల విలువలను నిరాకరిస్తాడు. అయితే, కొన్ని అవిధేయతా క్రియలనుబట్టి తిరుగుబాటుదారుడని చెప్పలేమని జ్ఞాపకముంచుకోండి. ఆత్మీయ విషయాలకొస్తే, కొందరు పిల్లలు మొదట బైబిలు సత్యంలో చాలా తక్కువ ఆసక్తి చూపవచ్చు లేక అసలు చూపకపోవచ్చు, అయితే వారు తిరుగుబాటుదారులు కాకపోవచ్చు. తలిదండ్రులుగా, మీరు మీ పిల్లవాడు ఫలానా జాబితాలోకి వస్తాడని తేల్చేసేందుకు త్వరపడకండి.

6 యువజనులు అందరు యౌవన కాల సంవత్సరాల్లో, తలిదండ్రుల అధికారానికి తిరుగుబాటు చేయడం జరుగుతుందా? అలా జరుగనే జరుగదు. వాస్తవానికి, యౌవనుల్లో కేవలం కొంతమంది మాత్రమే యౌవనకాలంలో గంభీరంగా తిరుగుబాటు చేస్తారని రుజువులు చూపుతున్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ, పూర్తిగా మరియు ఎడతెగక తిరుగుబాటు చేసే పిల్లవాని సంగతేమిటి? అలాంటి తిరుగుబాటును ఏది పురికొల్పవచ్చు?

తిరుగుబాటుకు కారణాలు

7. సాతాను సంబంధ పర్యావరణం ఒక పిల్లవాడు తిరుగుబాటు చేసేలా ఎలా ప్రభావితం చేయగలదు?

7 తిరుగుబాటుకుగల ముఖ్య కారణం లోకం యొక్క సాతాను సంబంధ పర్యావరణం. ‘లోకమంతయు దుష్టునియందున్నది.’ (1 యోహాను 5:19) సాతానుయందున్న లోకం ఒక హానికరమైన సంస్కారాన్ని వృద్ధి చేసుకుంది, క్రైస్తవులు దానితో పోరాడవలసి ఉన్నారు. (యోహాను 17:15) ఆ సంస్కృతిలో చాలా భాగం, గతంలోకంటే నేడు మరీ మొరుటైనది, ఎక్కువ ప్రమాదకరమైనది మరియు ఎక్కువ చెడు ప్రభావాలతో నిండివుంది. (2 తిమోతి 3:1-5, 13) ఒకవేళ తలిదండ్రులు తమ పిల్లలకు బోధించి, హెచ్చరించి, వారిని కాపాడకపోతే, “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి” ద్వారా యౌవనస్థులు సులభంగా ప్రభావితం చెందవచ్చు. (ఎఫెసీయులు 2:2) దానికి సంబంధించినదే స్నేహితుల ఒత్తిడి. బైబిలు ఇలా చెబుతుంది: “మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) అదే విధంగా, ఈ లోకాత్మ చేత నింపబడిన వారితో సహవసించే వ్యక్తి అదే ఆత్మ చేత ప్రభావితం చేయబడే అవకాశం ఉంది. దైవిక సూత్రాలకు విధేయత చూపడం ఎంతో శ్రేష్ఠమైన జీవిత విధానానికి పునాదియని యౌవనస్థులు గుణగ్రహించాలంటే, వారికి తదేకమైన సహాయం అవసరం.—యెషయా 48:17, 18.

8. పిల్లలు తిరుగుబాటు చేసేందుకు ఏ కారకాలు నడుపవచ్చు?

8 గృహంలోని వాతావరణం, తిరుగుబాటుకుగల మరొక కారణం కావచ్చు. ఉదాహరణకు, యౌవనుని తలిదండ్రులలో ఒకరు మద్యం సేవిస్తూ, మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేస్తూ లేక తన జత ఎడల దౌర్జన్యపూరితంగా ఉంటే, జీవితాన్ని గూర్చిన ఆ యౌవనుని దృక్కోణం చెడిపోగలదు. సారూప్యంగా నిశ్చలంగా ఉండే గృహాల్లో కూడా, తన తలిదండ్రులకు తన ఎడల ఎలాంటి ఆసక్తీ లేదని పిల్లవాడు భావిస్తే తిరుగుబాటు మొదలవ్వవచ్చు. అయితే, యౌవనుల తిరుగుబాటు ఎల్లప్పుడూ బాహ్య ప్రభావాలవలననే మొదలుకాదు. దైవిక సూత్రాలను అన్వయించి, వారి చుట్టూవున్న ప్రపంచంనుండి వారికి ఎంతో మేరకు రక్షణ కలిగించే తలిదండ్రులు ఉన్నప్పటికీ కొందరు పిల్లలు తమ తలిదండ్రుల విలువలను నిరాకరిస్తారు. ఎందుకు? మన సమస్యలకుగల మరొక కారణమైన మానవ అపరిపూర్ణత మూలంగా కూడా కావచ్చు. పౌలు ఇలా చెప్పాడు: “ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) ఆదాము స్వార్థపూరిత తిరుగుబాటుదారుడు, అతను తన సంతానానికంతటికీ చెడ్డ వారసత్వాన్ని మిగిల్చాడు. వారి పూర్వికుడు చేసినట్లు కొందరు యౌవనులు తిరుగుబాటు చేయాలనే ఎంపిక చేసుకుంటారు.

అదుపుచేయని ఏలీ మరియు ప్రతిరోధించిన రెహబాము

9. పిల్లలను పెంచడంలో ఏ విపరీతాలు పిల్లల తిరుగుబాటును పురికొల్పవచ్చు?

9 పిల్లల పెంపకం ఎడల తలిదండ్రులకు సమతూకమైన దృష్టి లేకపోవడం, యౌవనుల తిరుగుబాటుకు దారితీసిన మరొక విషయం. (కొలొస్సయులు 3:21) అతి జాగ్రత్తగల తలిదండ్రులు కొంతమంది తమ పిల్లలను మరీ కట్టుదిట్టం చేసి క్రమశిక్షణనిస్తారు. మరి ఇతరులు అదుపు చేయకుండా, అనుభవరహితులైన తమ యౌవనస్థులను కాపాడగల్గే నడిపింపు సూత్రాలను అందించకుండా ఉంటారు. ఈ రెండు విపరీతమైన దృక్పథాలకు మధ్య సమతూకాన్ని కలిగివుండటం ఎల్లవేళలా సులభంకాదు. వేర్వేరు పిల్లలకు వేర్వేరు అవసరాలు ఉంటాయి. ఒకరికంటే మరొకరికి ఎక్కువ పర్యవేక్షణ అవసరం కావచ్చు. అయినప్పటికీ, మరీ విచ్ఛలవిడిగా వదిలేయడంలోని లేక విపరీతంగా ప్రతిరోధించడంలోని ప్రమాదాలను చూపేందుకు రెండు బైబిలు ఉదాహరణలు సహాయపడతాయి.

10. ఏలీ నమ్మకస్థుడైన ప్రధాన యాజకుడైనప్పటికీ, ఎందుకు ఒక నిరుపయుక్తమైన తండ్రి అయ్యాడు?

10 ప్రాచీన ఇశ్రాయేలు యొక్క ప్రధానయాజకుడైన ఏలీ ఒక తండ్రి. ఆయన 40 సంవత్సరాలు సేవ చేశాడు, దేవుని ధర్మశాస్త్రంలో ఎంతో ప్రవీణుడై ఉంటాడు అనడంలో సందేహంలేదు. ఏలీ తన క్రమమైన యాజక ధర్మాలను నమ్మకంగా నెరవేర్చి ఉండవచ్చు మరియు తన కుమారులైన హోఫ్నీ ఫీనెహాసులకు దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా బోధించి ఉండవచ్చు. అయితే, ఏలీ తన కుమారులను మరీ అలక్ష్యం చేశాడు. హోఫ్నీ ఫీనెహాసులు అధికారిక యాజకులుగా సేవ చేశారు, అయితే వారు “మిక్కిలి దుర్మార్గులైయుండి” తమ ఆకలిని మరియు అవినీతి కోరికలను తీర్చుకోవడంలో మాత్రమే ఆసక్తి కలిగివుండిరి. అయినప్పటికీ, వారు పవిత్ర భూమిపై నీచమైన క్రియలు చేసినప్పుడు, వారిని యాజక పదవి నుండి తొలగించే ధైర్యం ఏలీకి లేకుండినది. ఆయన వారికి కేవలం ఒక నిస్సత్తువైన గద్దింపునిచ్చాడు. ఏలీ అలా అదుపు చేయకపోవడం ద్వారా తాను దేవునికంటే తన కుమారులను ఎక్కువగా ఘనపర్చాడు. తత్ఫలితంగా, ఆయన కుమారులు యెహోవా యొక్క శుభ్రమైన ఆరాధనకు విరుద్ధంగా తిరుగబడ్డారు, ఏలీ పూర్తి కుటుంబం నాశనమైంది.—1 సమూయేలు 2:12-17, 22-25, 29; 3:13, 14; 4:11-22.

11. ఏలీ యొక్క తప్పు మాదిరి నుండి తలిదండ్రులు ఏమి నేర్చుకోగలరు?

11 ఈ సంఘటనలు జరిగినప్పుడు ఏలీ పిల్లలు అప్పటికే పెద్దవారు, అయితే ఈ చరిత్ర క్రమశిక్షణను ఇవ్వకపోవడం యొక్క ప్రమాదాన్ని నొక్కిచెబుతుంది. (సామెతలు 29:21 పోల్చండి.) స్పష్టమైన, అనుగుణ్యమైన మరియు సహేతుకమైన నియమాలను స్థాపించి, అమలుపర్చడంలో విఫలమౌతూ, కొందరు తలిదండ్రులు ప్రేమనూ విచ్ఛలవిడిగా వదిలేయడాన్నీ కలగాపులగం చేస్తారు. ప్రేమపూర్వక క్రమశిక్షణనివ్వడాన్ని వారు అలక్ష్యం చేస్తారు, చివరికి దైవిక సూత్రాలను ఉల్లంఘించినప్పుడు కూడా వారు క్రమశిక్షణనివ్వలేరు. అలా విచ్ఛలవిడిగా వదిలేయడం వలన, వారి పిల్లలు తలిదండ్రులకు లేక వేరే ఇతర అధికారాలకు లోబడకుండా ఉండేవారిగా మారవచ్చు.—ప్రసంగి 8:11 పోల్చండి.

12. అధికారాన్ని నిర్వహించడంలో రెహబాము ఏ పొరపాటు చేశాడు?

12 అధికారాన్ని నిర్వహించడంలోని మరో విపరీత ధోరణికి రెహబాము ఉదాహరణ. అతను ఐక్య ఇశ్రాయేలు రాజ్యానికి చివరి రాజు, అయితే అతను మంచి రాజు కాదు. అతని తండ్రియైన సొలొమోను పెట్టిన భారాలవలన అసంతృప్తి చెందిన ప్రజలు నివసించే దేశాన్ని రెహబాము పరిపాలిస్తున్నాడు. రెహబాము అవగాహనను చూపాడా? లేదు. కొన్ని అణచివేసే కార్యభారాలను తీసేయమని ఒక ప్రతినిధి వర్గం అడిగినప్పుడు, పెద్ద వయస్సుగల తన సలహాదారులు ఇచ్చిన పరిపక్వత చెందిన సలహాను వినడంలో విఫలుడై, ప్రజల కాడిని మరింత భారం చేయమని ఆజ్ఞాపించాడు. అతని అహంకారం పది ఉత్తర గోత్రాల తిరుగుబాటును రేకెత్తించింది, రాజ్యం రెండుగా చీలింది.—1 రాజులు 12:1-21; 2 దినవృత్తాంతములు 10:19.

13. తలిదండ్రులు రెహబాము తప్పిదాన్ని ఎలా నివారించగలరు?

13 రెహబామును గూర్చిన బైబిలు వృత్తాంతం నుండి తలిదండ్రులు కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలను నేర్చుకోగలరు. వారు ప్రార్థనలో ‘యెహోవాను వెదక’ వలసిన మరియు బైబిలు సూత్రాల వెలుగులో పిల్లలను పెంచే తమ పద్ధతిని పరీక్షించవలసిన అవసరత వారికి ఉంది. (కీర్తన 105:4) “అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు” అని ప్రసంగి 7:7 చెబుతుంది. సరిగ్గా ఆలోచించి నియమించబడిన కట్టుబాట్లు, యౌవనస్థులు తమకు హాని కలుగకుండా కాపాడబడుతూ పెరిగేందుకు అవకాశాన్నిస్తాయి. అయితే, స్వయం నిర్భరత్వాన్ని మరియు ధైర్యాన్ని సహేతుకమైన పాళ్లలో వృద్ధిపర్చుకోవడం నుండి వారిని నిరాకరించేంత కఠినమైన మరియు సంకుచితమైన వాతావరణంలో పిల్లలు పెరుగకూడదు. సరైన స్వాతంత్ర్యం మరియు కట్టుదిట్టమైన నియమాలు స్పష్టంగా సూచింపబడి మరియు వాటి రెండిటి మధ్య తలిదండ్రులు సమతూకాన్ని సాధించగల్గితే, అనేకమంది యౌవనులు తిరుగుబాటు చేసేందుకు ఎక్కువ మొగ్గు చూపరు.

కనీసావసరాలనుతీర్చడం తిరుగుబాటును నివారించగలదు

తమ యౌవన కాలపు సమస్యలతో వ్యవహరించడంలో తలిదండ్రులు తమ పిల్లలకు సహాయపడితే, వారు స్థిరమైన వారిగా పెరిగి పెద్దౌతారు

14, 15. తలిదండ్రులు తమ పిల్లవాని అభివృద్ధిని ఎలా దృష్టించాలి?

14 తమ యౌవనుడు పిల్లవానిగా ఉండటంనుండి పెద్దవానిగా శారీరకంగా పెరగడాన్ని చూసి తలిదండ్రులు ఆనందించినప్పటికీ, తమ యౌవన పిల్లవాడు ఆధారపడటం నుండి సరైన స్వయం నిర్భరత్వం వైపుకు పయనిస్తుంటే వారు కలత చెందవచ్చు. ఈ మార్పు సమయంలో, మీ యౌవనుడు అప్పుడప్పుడూ కొంత మొండిగా లేక సహకరించకుండా ఉంటే ఆశ్చర్యపోకండి. పరిపక్వమైన, స్థిరమైన మరియు బాధ్యతగల క్రైస్తవులనుగా తమ పిల్లలను పెంచడమే, క్రైస్తవ తలిదండ్రుల ధ్యేయమనే విషయాన్ని మనస్సులో ఉంచుకోండి.—1 కొరింథీయులు 13:11; ఎఫెసీయులు 4:13, 14, పోల్చండి.

15 తమ యౌవనస్థులు ఎక్కువ స్వేచ్ఛను అడిగితే ప్రతికూలంగా ప్రతిస్పందించే అలవాటును తలిదండ్రులు మానుకోవలసిన అవసరత ఉంది, అలా మానుకోవడం చాలా కష్టంకావచ్చు. ఒక ఆరోగ్యదాయకమైన పద్ధతిలో, ఒక పిల్లవాడు వ్యక్తిగా పెరగవలసిన అవసరముంది. వాస్తవానికి, చాలా చిన్న వయస్సులోనే, కొందరు యౌవనులు పరిపక్వ దృక్కోణాన్ని వృద్ధి చేసుకుంటారు. ఉదాహరణకు, యౌవన రాజైన యోషీయాను గురించి బైబిలు ఇలా చెబుతుంది: “తానింకను బాలుడైయుండగానే [దాదాపు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు] అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూను”కొనెను. ఈ విశిష్ఠమైన యౌవనుడు స్పష్టంగా ఒక బాధ్యతగల వ్యక్తి.—2 దినవృత్తాంతములు 34:1-3.

16. పిల్లలకు అధిక బాధ్యతలు ఇవ్వబడుతుండగా, వారు దేన్ని తెలుసుకోవాలి?

16 అయితే, స్వేచ్ఛ దానితోపాటు నిబద్ధతను తెస్తుంది. కాబట్టి, ఇప్పుడే పెద్దవాడౌతున్న మీ అబ్బాయి, తన నిర్ణయాలు మరియు చర్యల యొక్క పర్యవసానాలను అనుభవించేలా చూడండి. “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అనే సూత్రం యౌవనులకు అలాగే పెద్దవారికి కూడా అన్వయిస్తుంది. (గలతీయులు 6:7) పిల్లలను ఎప్పుడూ కాపుదలలో ఉంచలేము. పూర్తిగా అనంగీకారమైన దాన్ని మీ పిల్లాడు చేయాలని ఇష్టపడితే అప్పుడేమిటి? బాధ్యతగల తల్లి/తండ్రిగా మీరు “వద్దు” అని చెప్పాలి. దానికి కారణాలను మీరు వివరిస్తుండగా, మీ వద్దును ఏది కూడా సరేగా మార్చకూడదు. (మత్తయి 5:37 పోల్చండి.) అయినప్పటికీ, “మృదువైన మాట క్రోధమును చల్లార్చును” గనుక నిమ్మలమైన, సహేతుకమైన పద్ధతిలో “వద్దు” అని చెప్పేందుకు ప్రయత్నించండి.—సామెతలు 15:1.

17. యౌవనుల ఏ కొన్ని అవసరాలను తల్లి/తండ్రి పూరించాలి?

17 యౌవన ప్రజలకు ఎడతెగని క్రమశిక్షణ యొక్క భద్రత కావాలి, వారు కట్టుబాట్లను మరియు నియమాలను ఎల్లవేళలా వెంటనే అంగీకరించక పోయినప్పటికీ, అది అవసరం. ఆయా సమయాల్లో తల్లి/తండ్రికి అనిపించే దాన్నిబట్టి సూత్రాలను మార్చుతుంటే అది విసుగు పుట్టించవచ్చు. ఇబ్బందిపడటం, సిగ్గుపడటం లేక ధైర్యం లోపించడం వంటివాటిని ఎదిరించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని సహాయాన్ని యౌవనులు అందుకుంటే, వారు స్థిరమైన వారిగా పెరిగి పెద్దవ్వగలరు. వారు సంపాదించిన నమ్మకాన్ని వారిపై నిలిపితే యౌవనులు ఎంతో సంతోషిస్తారు.—యెషయా 35:3, 4; లూకా 16:10; 19:17 పోల్చండి.

18. యౌవనులను గూర్చిన కొన్ని ప్రోత్సాహకరమైన సత్యాలు ఏమిటి?

18 శాంతి, స్థిరత మరియు ప్రేమ కుటుంబంలో ఉన్నప్పుడు, సాధారణంగా పిల్లలు వర్ధిల్లుతారని తెలుసుకుని తలిదండ్రులు నిశ్చింతగా ఉండవచ్చు. (ఎఫెసీయులు 4:31, 32; యాకోబు 3:17, 18) అంతెందుకు, మద్యపానం, దౌర్జన్యం లేక ఇతర హానికరమైన ప్రభావాలుగల కుటుంబాలలో ఉన్నవారైనా అనేకమంది యౌవనులు గృహంలోని చెడు వాతావరణాన్ని అధిగమించి చక్కని వ్యక్తులుగా పెరిగి పెద్దయ్యారు. కాబట్టి, ప్రేమ, అనురాగం మరియు అవగాహనను తాము పొందగలమని మీ యౌవనులు తెలుసుకుని నిశ్చింతగా భావించే గృహాన్ని మీరు వారికి ఇవ్వగల్గినప్పుడు, మీరు వారిని చూసి సగర్వంగా భావించగల పెద్దవారిగా వారు వృద్ధిచెందగలరు. అయితే ఆ మద్దతుతోపాటు, లేఖన సూత్రాలకు అనుగుణంగా ఉండే సహేతుకమైన కట్టుబాట్లు మరియు క్రమశిక్షణ ఇవ్వబడినప్పటికీ పరిస్థితి అలాగే ఉండగలదు.—సామెతలు 27:11 పోల్చండి.

పిల్లలు కష్టాలపాలైనప్పుడు

19. పిల్లవాడు నడువవలసిన త్రోవను వానికి తలిదండ్రులు నేర్పాల్సివుండగా, పిల్లలపై ఏ బాధ్యత ఉంటుంది?

19 మంచి తలిదండ్రులుగా పిల్లలను పెంచడం ఎంతో వ్యత్యాసాన్ని చూపుతుంది. సామెతలు 22:6 ఇలా చెబుతుంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” అయితే, మంచి తలిదండ్రులను కలిగివున్ననూ గంభీరమైన సమస్యలుగల పిల్లల సంగతేమిటి? ఇది సాధ్యమా? అవును. తన తలిదండ్రులకు విధేయత చూపి, వారు చెప్పేది “విన” వలసిన బాధ్యత పిల్లవానికి ఉందని నొక్కిచెప్పే ఇతర లేఖనాల వెలుగులో ఆ సామెతలోని మాటలను అర్థం చేసుకోవాలి. (సామెతలు 1:8) కుటుంబ అనుగుణ్యత ఉండాలంటే, లేఖనాధార సూత్రాలను అన్వయించుకోవడంలో తలిదండ్రులు అలాగే పిల్లలు కూడా సహకరించాలి. తలిదండ్రులు, పిల్లలు కలిసి కృషిచేయక పోతే కష్టాలు మొదలౌతాయి.

20. పిల్లలు అనాలోచితంగా తప్పు చేసినప్పుడు, తలిదండ్రులు తీసుకోవలసిన జ్ఞానయుక్తమైన చర్య ఏమిటి?

20 యౌవనులు తప్పుచేసి ఇక్కట్ల పాలౌతే తలిదండ్రులు ఎలా ప్రతిస్పందించాలి? ప్రాముఖ్యంగా అప్పుడే యౌవనస్థులకు సహాయం అవసరమౌతుంది. తాము ఒక అనుభవరహితుడైన అబ్బాయితో వ్యవహరిస్తున్నామని తలిదండ్రులు గనుక జ్ఞాపకం ఉంచుకుంటే, అతిగా ప్రతిస్పందించే దృక్పథాన్ని సులభంగా ప్రతిరోధించగల్గుతారు. సంఘంలోని పరిపక్వతగల వారికి పౌలు ఇలా సలహా ఇచ్చాడు: “ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు . . . సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.” (గలతీయులు 6:1) అనాలోచితంగా తప్పిదం చేసిన యౌవనునితో వ్యవహరించేటప్పుడు తలిదండ్రులు కూడా ఇదే పద్ధతిని అనుసరించగలరు. అతని ప్రవర్తన ఎందుకు తప్పైనది, ఆ తప్పిదాన్ని మళ్లీ చేయకుండా అతను ఎలా నివారించగలడు అనేది వివరిస్తున్నప్పుడు, ఆ తప్పుడు ప్రవర్తనే చెడ్డది గానీ యౌవనుడు చెడ్డవాడు కాదని తలిదండ్రులు స్పష్టంగా చూపించాల్సి ఉంది.—యూదా 22, 23 పోల్చండి.

21. క్రైస్తవ సంఘం యొక్క మాదిరిని అనుసరిస్తూ, తమ పిల్లలు గంభీరమైన తప్పిదం చేస్తే తలిదండ్రులు ఎలా ప్రతిస్పందించాలి?

21 యౌవనస్థుని పొరపాటు మరీ గంభీరమైనదైతే అప్పుడేమిటి? అలాంటి సందర్భంలో పిల్లవానికి ప్రత్యేక సహాయం మరియు నిపుణతతో కూడిన నడిపింపు అవసరం. ఒక సంఘ సభ్యుడు గంభీరమైన పాపం చేసినప్పుడు, అతను పశ్చాత్తాపపడి సహాయం కొరకు పెద్దలను సమీపించేందుకు ప్రోత్సహింపబడతాడు. (యాకోబు 5:14-16) అతను పశ్చాత్తాపం చూపినప్పుడే, అతన్ని ఆత్మీయంగా పునరుద్ధరించేందుకు పెద్దలు అతనితో కలిసి పని చేస్తారు. పెద్దలతో వారు విషయం చర్చించాల్సిన అవసరమున్ననూ కుటుంబంలో తప్పుచేసిన యౌవనునికి సహాయంచేసే బాధ్యత తలిదండ్రులదే. తమ పిల్లల్లో ఒకరు చేసిన గంభీరమైన తప్పును పెద్దలసభకు తెలియకుండా కప్పిప్పుచ్చాలని వారు ఎంతమాత్రం ప్రయత్నించకూడదు.

22. తమ పిల్లలు గంభీరమైన తప్పిదం చేస్తే తలిదండ్రులు యెహోవాను అనుకరిస్తూ, ఏ దృక్పథాన్ని కలిగివుండేందుకు ప్రయత్నిస్తారు?

22 ఒకరి స్వంత పిల్లవాన్ని గూర్చిన గంభీరమైన సమస్య ఎంతో కష్టతరంగా ఉండవచ్చు. భావోద్రేకంగా కలతచెంది ఉండిన తలిదండ్రులకు దారితప్పిన పిల్లవాన్ని కోపంగా బెదిరించాలని అనిపించవచ్చు, అయితే ఇది వానికి మరింత దుఃఖం కలిగించవచ్చు. ఈ క్లిష్ట సమయంలో అతనితో ఎలా వ్యవహరించడం జరుగుతుందో దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మనస్సులో ఉంచుకోండి. తన ప్రజలు సరైన దానినుండి తప్పిపోయినప్పుడు—వారు కేవలం పశ్చాత్తాపం చూపితే—వారిని క్షమించేందుకు యెహోవా సిద్ధంగా ఉండెనని జ్ఞాపకముంచుకోండి. ఆయన ప్రేమపూర్వకమైన మాటలను వినండి: “యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు—రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లనివగును.” (యెషయా 1:18) తలిదండ్రులకు ఎంత చక్కని మాదిరో కదా!

23. తమ పిల్లల్లో ఒకరు గంభీరమైన పాపం చేసిన సందర్భంలో, తలిదండ్రులు ఎలా ప్రవర్తించాలి, వారు దేనిని నివారించాలి?

23 కాబట్టి, దారితప్పిన పిల్లవాన్ని తన మార్గాన్ని మార్చుకోమని ప్రోత్సహించేందుకు ప్రయత్నించండి. అనుభవజ్ఞులైన ఇతర తలిదండ్రులు మరియు సంఘ పెద్దలనుండి మంచి సలహాను కోరండి. (సామెతలు 11:14) విపరీతంగా ప్రవర్తించకుండా మరియు మీ పిల్లవాడు మళ్లీ మీ వద్దకు రాకుండా నివారించే విషయాలను మాట్లాడకుండా లేక చేయకుండా ఉండేందుకు ప్రయత్నించండి. మీ కోపం మరియు దుఃఖం అదుపు తప్పకుండా జాగ్రత్తపడండి. (కొలొస్సయులు 3:8) త్వరగా నిరాశచెందకండి. (1 కొరింథీయులు 13:4, 7) చెడుతనాన్ని ద్వేషిస్తున్నప్పుడు, మీ పిల్లవాని ఎడల కర్కశంగా మరియు విముఖంగా ఉండటాన్ని నివారించండి. అత్యంత ప్రాముఖ్యంగా, తలిదండ్రులు చక్కని మాదిరిని ఉంచేందుకు మరియు దేవునియందు తమ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

యథేచ్ఛగా తిరుగబడే వానితో వ్యవహరించడం

24. ఒక క్రైస్తవ కుటుంబంలో కొన్నిసార్లు ఏ దుఃఖకరమైన పరిస్థితి తలెత్తుతుంది, ఒక తల్లి/తండ్రి ఎలా ప్రతిస్పందించాలి?

24 ఒక యౌవనుడు తిరుగబడాలని మరియు క్రైస్తవ విలువలను పూర్తిగా నిరాకరించాలని నిశ్చయించుకున్నట్లు కొన్ని సందర్భాలలో స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు, మిగతా పిల్లల కుటుంబ జీవితాన్ని నియంత్రించడం లేక పునఃనిర్మించడం వైపుకు అవధానం మరలాలి. మీరు ఇతర పిల్లలను అలక్ష్యం చేసేంతగా, మీ శక్తిసామర్థ్యాలను అన్నింటినీ తిరుగుబాటుదారుని వైపుకు మరల్చకుండా మీరు జాగ్రత్త వహించండి. ఆ కష్టాన్ని మిగతా కుటుంబం నుండి దాచే బదులు, ఆ విషయాన్ని సరైనంత మేరకు మరియు నిశ్చయతనిచ్చే పంధాలో వారితో చర్చించండి.—సామెతలు 20:18 పోల్చండి.

25. (ఎ) ఒక పిల్లవాడు యథేచ్ఛగా తిరుగుబాటు చేస్తే, క్రైస్తవ సంఘం యొక్క మాదిరిని అనుసరిస్తూ తలిదండ్రులు ఎలా చర్య గైకొనాలి? (బి) తమ పిల్లల్లో ఒకరు తిరుగుబాటు చేస్తే తలిదండ్రులు ఏ విషయాలను మనస్సులో ఉంచుకోవాలి?

25 సంఘంలో మళ్లీ చేర్చుకోలేని తిరుగుబాటు దారునిగా మారిన ఒక వ్యక్తిని గురించి చెబుతూ అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: “వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.” (2 యోహాను 10) తమ పిల్లవాడు మైనారిటీ తీరినవాడై, పూర్తిగా తిరుగుబాటు చేస్తే, తలిదండ్రులు వాని ఎడల కూడా అలాంటి చర్యలను గైకొనడం అవసరమని భావించవచ్చు. అలాంటి చర్య గైకొనడం ఎంత కష్టాన్ని కలిగించేది మరియు దుఃఖపెట్టేది అయినా, మిగతా కుటుంబాన్ని కాపాడేందుకు కొన్నిసార్లు అది ప్రాముఖ్యం కావచ్చు. మీ కుటుంబానికి మీ కాపుదల మరియు ఎడతెగని పర్యవేక్షణ అవసరం. కాబట్టి, స్పష్టంగా నిర్వచింపబడినవి అయిననూ సహేతుకమైనవగు ప్రవర్తనా హద్దులను కలిగివుండటంలో కొనసాగండి. ఇతర పిల్లలతో సంభాషించండి. వారు పాఠశాలలో మరియు సంఘంలో ఎలా పురోభివృద్ధి చెందుతున్నారో దానిలో ఆసక్తిని కలిగివుండండి. ఇంకా, తిరుగుబాటు చేసిన పిల్లవాని క్రియలను మీరు అంగీకరించనప్పటికీ, మీరు వాన్ని ద్వేషించడం లేదని వారు తెలుసుకునేలా చేయండి. ఆ పిల్లవాన్ని కాదుగానీ చెడు క్రియను ఖండించండి. యాకోబు ఇద్దరు కుమారులు తమ క్రూర క్రియలద్వారా తమ కుటుంబం బహిష్కరింపబడేలా చేసినప్పుడు, యాకోబు వారి దౌర్జన్యపూరిత కోపాన్ని శపించాడు గానీ కుమారులనే శపించలేదు.—ఆదికాండము 34:1-31; 49:5-7.

26. తమ పిల్లల్లో ఒకరు తిరుగుబాటు చేస్తే, మనస్సాక్షిగల తలిదండ్రులు దేనినుండి ఆదరణను పొందగలరు?

26 మీ కుటుంబంలో జరిగిన దానికి మీరే బాధ్యులని మీరు భావించవచ్చు. యెహోవా సలహాలను మీకు వీలైనంత శ్రేష్ఠంగా అనుసరించి, మీరు చేయగల్గినదంతా ప్రార్థనా పూర్వకంగా మీరు చేసినట్లయితే, మిమ్మల్ని మీరు నిర్హేతుకంగా విమర్శించుకోవలసిన అవసరం లేదు. ఎవరూ పరిపూర్ణ తల్లి/తండ్రి కాదని, అయితే మీరు మంచి తల్లి/తండ్రిగా ఉండేందుకు మనస్సాక్షి పూర్వకంగా ప్రయత్నించారనే వాస్తవాన్నిబట్టి ఆదరణను పొందండి. (అపొస్తలుల కార్యములు 20:26 పోల్చండి.) యథేచ్ఛగా తిరుగుబాటు చేసే వాన్ని కుటుంబంలో కలిగివుండటం హృదయవిదారకంగా ఉంటుంది, అయితే అది గనుక మీకు సంభవిస్తే దేవుడు అర్థం చేసుకుంటాడని తన సమర్పిత సేవకులను ఆయన ఎన్నడూ ఎడబాయడని నిశ్చయతను కలిగివుండండి. (కీర్తన 27:10) కాబట్టి మిగిలిన పిల్లలకు మీ గృహాన్ని ఒక శుభ్రమైన, ఆత్మీయ ఆశ్రయంగా ఉంచాలని తీర్మానించుకోండి.

27. తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని జ్ఞాపకముంచుకుని, తిరుగుబాటు దారుడైన పిల్లవాని తలిదండ్రులు ఎల్లప్పుడూ దేని కొరకు నిరీక్షించగలరు?

27 అంతేకాక, మీరు ఎన్నటికీ ఆశలు వదులుకోకూడదు. సరైన తర్ఫీదు ఇవ్వడంలో మీరు ముందు చేసిన ప్రయత్నాలు మీ పిల్లవాన్ని తుదకు ప్రభావితం చేసి వాని బుద్ధి పని చేసేలా చేయవచ్చు. (ప్రసంగి 11:6) మీ వంటి పరిస్థితినే అనేక కుటుంబాలు కూడా అనుభవించాయి, తప్పిపోయిన కుమారున్ని గూర్చిన యేసు ఉపమానంలో ఆ తండ్రి చూసినట్లే, వారిలో కొందరు తమ దారితప్పిన పిల్లలు తిరిగి రావడాన్ని చూశారు. (లూకా 15:11-32) అదే విధంగా మీకు కూడా జరుగవచ్చు.