కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 13

ఒకవేళ వివాహం విచ్ఛిన్నం కాబోయే స్థితిలో ఉంటే

ఒకవేళ వివాహం విచ్ఛిన్నం కాబోయే స్థితిలో ఉంటే

1, 2. ఒక వివాహం ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, ఏ ప్రశ్నను అడగాలి?

 ఇటలీ దేశస్థురాలైన, లూఛియా అనే ఒక స్త్రీ 1988లో ఎంతో మానసిక కృంగుదలకు గురైంది. a పది సంవత్సరాల తర్వాత ఆమె వివాహం ముగింపుకొచ్చింది. అనేకసార్లు ఆమె తన భర్తతో విషయాలను సరిచేసుకోవాలని ప్రయత్నించింది, కానీ అది పనిచేయలేదు. కాబట్టి సహజీవన సామర్థ్యం లోపించడం మూలాన ఆమె విడిపోయింది, అయితే ఇప్పుడు ఆమె తన ఇద్దరు కుమార్తెలను తానే స్వయంగా పెంచాల్సి ఉంది. ఆ సమయాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ, లూఛియా ఇలా మననం చేసుకుంటోంది: “మా వివాహాన్ని ఏదీ కాపాడలేదని నేను కచ్చితంగా అనుకున్నాను.”

2 ఒకవేళ మీకు వైవాహిక సమస్యలు ఉన్నట్లయితే, లూఛియా భావాలను మీరు అర్థం చేసుకోగలరు. మీ వైవాహిక జీవితం కష్టతరంగా ఉండవచ్చు మరి నేను దాన్ని కాపాడుకోగలనా అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఒకవేళ పరిస్థితి అలా ఉంటే, ఈ ప్రశ్నను పరిశీలించడం సహాయకరంగా ఉంటుందని మీరు కనుగొంటారు: ‘వివాహాన్ని విజయవంతం చేయడానికి సహాయంచేసేందుకు బైబిలునందు దేవుడిచ్చిన మంచి సలహాలను అన్నింటినీ నేను పాటించానా?’—కీర్తన 119:105.

3. విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయినప్పటికీ, విడాకులు తీసుకున్న వ్యక్తులు, వారి కుటుంబాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయని నివేదించబడుతుంది?

3 భార్యాభర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పుడు, వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమే సులభమైన చర్యగా కనిపించవచ్చు. అయితే, అత్యధిక శాతం కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడాన్ని అనేక దేశాలు చూసినప్పటికీ, విడాకులు తీసుకున్న స్త్రీపురుషుల్లో అధికశాతం మంది అలా విడిపోయినందుకు చింతిస్తున్నారని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీరిలో కొందరు, విడాకులు తీసుకోని వారికంటే ఎక్కువ శారీరక, మానసిక సంబంధమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. విడాకులు తీసుకున్న వారి పిల్లల్లో గందరగోళం, అసంతోషం ఏళ్ల తరబడి కొనసాగుతుంది. విడిపోయిన వారి తలిదండ్రులు, స్నేహితులు కూడా బాధపడతారు. వివాహానికి ఆరంభకుడైన దేవుడు ఈ పరిస్థితిని ఎలా దృష్టిస్తుండవచ్చు?

4. వివాహ సమస్యలతో ఎలా వ్యవహరించాలి?

4 మునుపటి అధ్యాయాల్లో పేర్కొన్న విధంగా, వివాహం జీవితపర్యంత బంధంగా ఉండాలని దేవుడు సంకల్పించాడు. (ఆదికాండము 2:24) అలాంటప్పుడు, ఎన్నో వివాహాలు ఎందుకు విచ్ఛిన్నమౌతున్నాయి? అవి అకస్మాత్తుగా సంభవించవు. సాధారణంగా హెచ్చరికా సంకేతాలు ముందు వస్తాయి. వివాహంలోని సమస్యలు చిన్నవైనప్పటికీ, తుదకు పరిష్కరించ లేనంత పెద్దవిగా పెరుగుతూపోగలవు. అయితే బైబిలు సహాయంతో ఈ సమస్యల విషయమై తగినకాలంలో చర్య గైకొంటే, అనేక వివాహాలు విచ్ఛిన్నం కావడాన్ని నివారించవచ్చు.

వాస్తవికంగా ఉండండి

5. ఏ వివాహంలోనైనా ఏ వాస్తవిక పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది?

5 కొన్నిసార్లు సమస్యలకు దారితీసే ఒక మూలకారణం, వివాహ భాగస్వాముల్లో ఒకరు లేక ఇద్దరు అవాస్తవిక అపేక్షలను కలిగివుండటమే. ప్రేమ కథలు, జన సమ్మతమైన పత్రికలు, దూరదర్శిని కార్యక్రమాలు మరియు చలనచిత్రాలు అవాస్తవికమైన ఆశలను స్వప్నాలను సృష్టించగలవు. ఈ స్వప్నాలు నెరవేరనప్పుడు, ఒకవ్యక్తి మోసగింపబడినట్లు అసంతృప్తిగా భావించవచ్చు, చివరకు కఠినంగా కూడా మారవచ్చు. అయితే, ఇద్దరు అసంపూర్ణ వ్యక్తులు వివాహంలో ఆనందాన్ని ఎలా కనుగొనగలరు? విజయవంతమైన సంబంధాన్ని సాధించేందుకు కృషి అవసరం.

6. (ఎ) వివాహాన్ని గూర్చిన ఏ సమతూక దృక్కోణాన్ని బైబిలు అందిస్తోంది? (బి) వివాహంలో అభిప్రాయ భేదాలు వచ్చేందుకుగల కొన్ని కారణాలు ఏవి?

6 బైబిలు ఆచరణాత్మకమైనది. వైవాహిక ఆనందాలను గురించి అది చెబుతుంది, అయితే వివాహం చేసుకునే వారికి “శరీరసంబంధమైన శ్రమలు కలుగును” అని కూడా అది హెచ్చరిస్తుంది. (1 కొరింథీయులు 7:28) ముందే పేర్కొనబడినట్లు, భాగస్వాములిద్దరు అపరిపూర్ణులు, పాపం చేసే స్వభావం కలవారు. ప్రతీ భాగస్వామి మానసిక, భావోద్రేక నిర్మాణం, వారు పెంచబడిన తీరు భిన్నంగా ఉంటాయి. దంపతులకు కొన్నిసార్లు డబ్బు, పిల్లలు, అత్తింటి వారు ఇత్యాథి విషయాల్లో అభిప్రాయభేదాలు వస్తాయి. కలిసి పనులు చేసుకునేందుకు తగినంత సమయం లేకపోవడం, లైంగిక సమస్యలు కూడా కలతలకు కారణం కాగలవు. b అలాంటి విషయాలను సరిచేసుకోడానికి సమయం అవసరం, అయితే ధైర్యంగా ఉండండి! వివాహిత దంపతులు అనేకమంది అలాంటి సమస్యలను ఎదుర్కొని, పరస్పరం అంగీకారమైన పరిష్కారాలను కనుగొనగలుగుతున్నారు.

తేడాలను గురించి చర్చించండి

7, 8. వివాహ భాగస్వాముల మధ్య గాయపడిన భావాలు లేక అభిప్రాయ భేదాలు ఉంటే, వాటితో వ్యవహరించవలసిన లేఖనాధార మార్గం ఏమిటి?

7 గాయపడిన భావాలు, అపార్థాలు లేక వ్యక్తిగత లోపాలను గురించి చర్చించేటప్పుడు నెమ్మదిగా ఉండటం కష్టమని అనేకమంది భావిస్తారు. “మీరు నన్ను అపార్థం చేసుకున్నట్లు నేను భావిస్తున్నాను” అని ముక్కుసూటిగా చెప్పే బదులు ఒక వివాహ జత భావోద్రేకంగా కలత చెంది సమస్యను పెద్దది చేయవచ్చు. “మీకు మీ మీదనే ఎక్కువ శ్రద్ధ ఉంది” లేక “మీకు నా మీద ప్రేమ లేదు” అని చాలామంది అంటారు. వాదనకు దిగకూడదని మరొక జత ప్రత్యుత్తరం ఇచ్చేందుకు నిరాకరించవచ్చు.

8 “కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు” అని చెబుతున్న బైబిలు సలహాను వినడమే అనుసరించవలసిన మేలైన మార్గం. (ఎఫెసీయులు 4:26) ఆనందమయ వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న దంపతులను, వారి విజయవంతమైన వివాహం యొక్క రహస్యమేమిటో, వారి 60వ వివాహ వార్షికోత్సవం నాడు అడగటం జరిగింది. ఆ భర్త ఇలా చెప్పాడు: “మా మధ్యనున్న విభేదాలు ఎంత చిన్నవైనప్పటికీ వాటిని పరిష్కరించుకోకుండా మేము నిద్రపోకూడదని నేర్చుకున్నాం.”

9. (ఎ) సంభాషణలోని ముఖ్య భాగంగా లేఖనాల్లో ఏది సూచింపబడింది? (బి) అది చేయాలంటే ధైర్యం మరియు దీనత్వం అవసరమైనప్పటికీ, వివాహమైన వారు తరచూ ఏది చేస్తుండాల్సిన అవసరముంది?

9 భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరు ‘వినుటకు వేగిరపడుతూ, మాటలాడుటకు నిదానించుచూ, కోపించుటకు నిదానించుచూ’ ఉండాలి. (యాకోబు 1:19) జాగ్రత్తగా వినిన తర్వాత, భాగస్వాములు ఇరువురూ క్షమాపణ చెప్పుకునే అవసరతను గమనిస్తుండవచ్చు. (యాకోబు 5:16) “నిన్ను బాధపెట్టినందుకు దయచేసి క్షమించు” అని యథార్థంగా చెప్పేందుకు దీనత్వం మరియు ధైర్యం కావాలి. అయితే, విభేదాలతో ఈ విధంగా వ్యవహరించడం, వివాహ దంపతులు తమ సమస్యలను పరిష్కరించుకోడానికి మాత్రమే కాక వారు పరస్పరం ఒకరి సాన్నిధ్యంలో మరొకరు ఆనందాన్ని కనుగొనేలా చేసే ఆప్యాయతను, సన్నిహితత్వాన్ని వృద్ధిపర్చుకోడానికి కూడా సహాయం చేయడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది.

వివాహ ధర్మాన్ని నెరవేర్చడం

10. కొరింథులోని క్రైస్తవుల కొరకు పౌలు సిఫారసు చేసిన ఏ రక్షణను నేడు క్రైస్తవునికి కూడా అన్వయించవచ్చు?

10 అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసినప్పుడు, “జారత్వములు జరుగుచున్నందున” వివాహాన్ని సిఫారసు చేశాడు. (1 కొరింథీయులు 7:2) నేటి ప్రపంచం ప్రాచీన కొరింథు వలెనే, లేదా అంతకంటే ఎక్కువగానే కూడా చెడిపోయింది. ఈ లోకస్థులు బాహాటంగా చర్చించే అనైతిక అంశాలు, అసభ్యకరంగా వస్త్రాలు ధరించడం మరియు పత్రికలు, పుస్తకాలు, దూరదర్శిని మరియు సినిమాలలో చూపించే అశ్లీల కథలు, ఇవన్నీ అనైతిక లైంగిక ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇటువంటి విధమైన పర్యావరణంలో జీవిస్తున్న కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “కామతప్తులగుట కంటె పెండ్లి చేసికొనుట మేలు.”—1 కొరింథీయులు 7:9.

11, 12. (ఎ) భార్యాభర్తలు ఒకరికొకరు ఏమి రుణపడి ఉన్నారు, దీన్ని ఏ దృక్పథంతో నెరవేర్చాల్సి ఉంది? (బి) వివాహ ధర్మాన్ని తాత్కాలికంగా నెరవేర్చకుండా ఉండాల్సిన పరిస్థితితో ఎలా వ్యవహరించాల్సి ఉంది?

11 కాబట్టి, వివాహిత క్రైస్తవులకు బైబిలు ఇలా చెబుతుంది: “భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.” (1 కొరింథీయులు 7:3) ఇక్కడ ఇవ్వడం గురించే నొక్కి చెప్పబడింది కానీ బలవంతంగా అడగటం గురించి కాదని గమనించండి. ప్రతి భాగస్వామి ఎదుటి వ్యక్తి మంచి ఎడల శ్రద్ధ కలిగి ఉన్నప్పుడే వివాహంలోని భౌతిక సన్నిహితత్వం వాస్తవంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు బైబిలు, తమ భార్యలతో “జ్ఞానము చొప్పున” వ్యవహరించాలని భర్తలకు ఆజ్ఞాపిస్తుంది. (1 పేతురు 3:7) వివాహ ధర్మాన్ని పరస్పరం నెరవేర్చడంలో ఇది ప్రాముఖ్యంగా వాస్తవం. భార్యను ఆప్యాయంగా చూసుకోకపోతే, వివాహంలోని ఈ అంశాన్ని ఆనందించడం ఆమెకు కష్టతరం కావచ్చు.

12 భార్యాభర్తలు ఇరువురూ వివాహ ధర్మాన్ని నెరవేర్చకుండా ఉండాల్సిన సమయాలు కొన్ని ఉన్నాయి. నెలలోని కొన్ని సమయాల్లో లేక భార్య మరీ అలసిపోయినట్లు భావిస్తున్నప్పుడు ఆమె విషయంలో ఇది వాస్తవం కావచ్చు. (లేవీయకాండము 18:19 పోల్చండి.) భర్త పని వద్ద గంభీరమైన సమస్యతో వ్యవహరిస్తూ భావోద్రేకంగా కృంగినట్లు భావిస్తున్నప్పుడు ఆయన విషయంలో ఇది వాస్తవం కావచ్చు. భాగస్వాములు ఇరువురూ నిస్సంకోచంగా చర్చించి, “ఉభయుల సమ్మతి చొప్పున” ఒక అంగీకారానికి రావడం ద్వారా, వివాహ ధర్మాన్ని నెరవేర్చకుండా తాత్కాలికంగా మానుకోవలసిన అటువంటి సందర్భాలతో చక్కగా వ్యవహరించవచ్చు. (1 కొరింథీయులు 7:5) భాగస్వాములు ఇరువురూ తప్పుడు ముగింపులకు రాకుండా ఇది నివారిస్తుంది. అయితే, ఒకవేళ భార్య ఉద్దేశపూర్వకంగా తన భర్త ఎడల వివాహ ధర్మాన్ని నెరవేర్చేందుకు నిరాకరిస్తే లేక భర్త వివాహ ధర్మాన్ని ప్రేమపూర్వక పద్ధతిలో నెరవేర్చడంలో యథేచ్ఛగా విఫలమైతే, ఎదుటి వ్యక్తికి శోధన కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో, వివాహంలో సమస్యలు తలెత్తవచ్చు.

13. తమ ఆలోచనా విధానాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు క్రైస్తవులు ఎలా కృషి చేయగలరు?

13 అశుద్ధమైన, అస్వాభావికమైన కోరికలను సృష్టించగల అశ్లీలతను, క్రైస్తవులందరి వలెనే దేవుని యొక్క వివాహిత సేవకులు కూడా విసర్జించాలి. (కొలొస్సయులు 3:5) వారు వ్యతిరేక లింగ వ్యక్తులందరితో వ్యవహరించేటప్పుడు తమ ఆలోచనలను క్రియలను అదుపు చేసుకోవాలి. యేసు ఇలా హెచ్చరించాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును.” (మత్తయి 5:28) లైంగికతను గూర్చిన బైబిలు సలహాను అన్వయించుకోవడం ద్వారా, దంపతులు శోధనలోపడి వ్యభిచారాన్ని చేయకుండా నివారించగలరు. వివాహానికి ఆరంభకుడైన యెహోవా ఇచ్చిన అతి చక్కని బహుమతిగా లైంగికత పరిగణింపబడిన వివాహంలోనే వారు ఆహ్లాదకరమైన సన్నిహితత్వాన్ని ఆనందించడంలో కొనసాగగలరు.—సామెతలు 5:15-19.

విడాకులకు బైబిలునందున్న ఆధారాలు

14. కొన్నిసార్లు ఏ దుఃఖకరమైన పరిస్థితి ఉండవచ్చు? ఎందుకు?

14 సంతోషకరంగా, అనేక క్రైస్తవ వివాహాల్లో, తలెత్తే ఏ సమస్యలైనా పరిష్కరించబడగలవు. అయితే, కొన్నిసార్లు పరిస్థితి అలా ఉండదు. మానవులు అసంపూర్ణులు మరియు సాతాను అధీనంలో ఉన్న పాపభరిత లోకంలో జీవిస్తున్నారు గనుక, కొన్ని వివాహాలు విచ్ఛిన్నమయ్యే స్థితికి వస్తాయి. (1 యోహాను 5:19) అలాంటి కష్టతర పరిస్థితితో క్రైస్తవులు ఎలా వ్యవహరించాలి?

15. (ఎ) మళ్లీ వివాహం చేసుకునే సాధ్యతతో విడాకులు తీసుకునేందుకుగల ఏకైక లేఖనాధారం ఏమిటి? (బి) విశ్వాస ఘాతుకానికి పాల్పడిన వివాహ జతనుండి విడాకులు తీసుకోవద్దని కొందరు ఎందుకు నిర్ణయించుకున్నారు?

15 ఈ పుస్తకం యొక్క 2వ అధ్యాయంలో ప్రస్తావించబడినట్టు, విడాకులు తీసుకుని మళ్లీ వివాహం చేసుకోగల సాధ్యత ఉన్న ఏకైక లేఖనాధారం జారత్వమే. c (మత్తయి 19:9) మీ వివాహ భాగస్వామి విశ్వాసఘాతుకానికి పాల్పడినట్లు మీకు కచ్చితమైన రుజువులు ఉంటే, అప్పుడు మీరు కష్టతరమైన ఓ తీర్మానాన్ని ఎదుర్కొంటారు. మీరు వివాహ బంధంలో కొనసాగుతారా లేక విడాకులు తీసుకుంటారా? ఈ విషయంలో ఎలాంటి నియమాలూ లేవు. కొందరు క్రైస్తవులు యథార్థంగా పశ్చాత్తాపాన్ని కనుపర్చిన భాగస్వామిని పూర్తిగా క్షమించారు, అలా కాపాడబడిన వివాహబంధం మంచికి దారి తీసింది. ఇతరులు పిల్లల కోసం విడాకులు తీసుకోకూడదని తీర్మానించుకున్నారు.

16. (ఎ) తప్పిదం చేసిన తమ వివాహ భాగస్వామికి విడాకులు ఇచ్చేలా కొందరిని ప్రేరేపించిన కొన్ని కారకాలు ఏవి? (బి) ఒక నిర్దోషియైన జత విడాకులు తీసుకోవాలని లేక తీసుకోకూడదని నిర్ణయించుకుంటే, ఆ వ్యక్తి నిర్ణయాన్ని ఎవరూ కూడా ఎందుకు విమర్శించకూడదు?

16 మరో వైపు, ఆ పాపిష్ఠి క్రియ గర్భం ధరించడానికి లేక లైంగికంగా సంక్రమించే వ్యాధులకు దారి తీసి ఉండవచ్చు. లేక బహుశా పిల్లలను అట్టి లైంగిక అకృత్యాలు చేసే తల్లి/తండ్రి నుండి కాపాడవలసిన అవసరం ఉండవచ్చు. కాబట్టి, ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాల గురించి ఆలోచించాల్సి ఉందన్నది స్పష్టం. అయితే, మీ వివాహభాగస్వామి యొక్క ద్రోహాన్ని గురించి మీరు తెలుసుకుని ఆ తర్వాత మీ భాగస్వామితో లైంగిక సంబంధాలను కొనసాగిస్తే, మీ భాగస్వామిని మీరు క్షమించారన్న విషయాన్ని, వివాహ బంధంలో కొనసాగాలన్న మీ కోరికను తద్వారా మీరు సూచిస్తారు. లేఖనాధారంగా మళ్లీ వివాహం చేసుకునే సాధ్యతతో విడాకులు తీసుకునేందుకు ఆధారం ఇక ఎంతమాత్రం ఉండదు. ఇతరుల విషయాల్లో అతిగా జోక్యం చేసుకునే వారెవరైనా మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయకూడదు, లేదా మీ నిర్ణయాన్ని ఆ పిదప ఎవరూ విమర్శించకూడదు. మీరు తీసుకున్న నిర్ణయాల వలన వచ్చే పర్యవసానాలతో మీరు జీవించాల్సి ఉంటుంది. “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను.”—గలతీయులు 6:5.

విడిపోయేందుకుగల ఆధారాలు

17. జారత్వం జరుగనప్పుడు, విడిపోవడం లేక విడాకులు తీసుకోవడంపై లేఖనాలు ఏ హద్దులను నియమిస్తున్నాయి?

17 వివాహ భాగస్వామి జారత్వం చేయక పోయినప్పటికీ ఆ వ్యక్తి నుండి విడిపోడాన్ని లేక బహుశా విడాకులు తీసుకోడాన్ని సమర్థించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అయితే అలాంటి సందర్భంలో, ఆ క్రైస్తవ వ్యక్తికి మళ్లీ వివాహం చేసుకొనే తలంపుతో మూడవ వ్యక్తితో పరిచయాన్ని పెంచుకునే స్వాతంత్ర్యం లేదు. (మత్తయి 5:32) బైబిలు అలా విడిపోవడానికి వీలు కల్గించినా, విడిపోయిన వారు “పెండ్లిచేసికొనకుండవలెను; లేదా . . . సమాధానపడవలెను” అని కచ్చితంగా చెబుతోంది. (1 కొరింథీయులు 7:11) విడిపోవడమే యుక్తమని అనిపించే కొన్ని తీవ్రమైన సందర్భాలు ఏవి?

18, 19. తిరిగి వివాహం చేసుకునే సాధ్యత లేకపోయినప్పటికీ చట్టపరంగా విడిపోవడం లేక విడాకులు తీసుకోవడం యొక్క ఆచరణయోగ్యతను పరిగణించేందుకు ఒక భాగస్వామిని ప్రేరేపించే కొన్ని తీవ్రమైన పరిస్థితులు ఏవి?

18 భర్త యొక్క విపరీతమైన బద్ధకం వలన, ఇతర చెడు అలవాట్ల వలన కుటుంబమంతా దారిద్ర్యానికి గురికావచ్చు. d అతను కుటుంబ ఆదాయాన్ని జూదంలో ఖర్చు చేయడం లేదా మాదక ద్రవ్యాలకు లేక మత్తు పానీయానికి తాను అలవాటు పడిపోయి దాని కొరకు ఉపయోగించడం వంటివి చేస్తుండవచ్చు. బైబిలు ఇలా పేర్కొంటోంది: “ఎవడైనను . . . తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:8) ఒకవేళ అలాంటి వ్యక్తి తన మార్గాలను మార్చుకునేందుకు నిరాకరిస్తే, బహుశా అతని భార్య సంపాదించిన డబ్బును అతడు తన చెడు పనుల కొరకు ఉపయోగించేందుకు తీసేసుకుంటుంటే, చట్టబద్ధంగా విడిపోవడం ద్వారా తన, తన పిల్లల సంక్షేమాన్ని కాపాడాలని భార్య తీర్మానించుకోవచ్చు.

19 ఒక భాగస్వామి మరో భాగస్వామిపట్ల మరీ దౌర్జన్యపూరితంగా ఉంటూ, బహుశా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం, చివరకు ప్రాణం కూడా అపాయంలో పడేంతగా ఆ వ్యక్తిని పదే పదే కొడుతూ ఉంటే, అలాంటి పరిస్థితిలో చట్టపరంగా విడిపోవడం గురించి ఆలోచించవచ్చు. దానికి తోడు, ఒక వ్యక్తి తన వివాహ భాగస్వామి దేవుని ఆజ్ఞలను ఏదో ఒక విధంగా అతిక్రమించేలా ఒత్తిడి చేసేందుకు ఎడతెగక ప్రయత్నిస్తుంటే, ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితం ప్రమాదంలో పడే స్థితికి విషయాలు చేరుకుంటే అప్పుడు, బాధింపబడుతున్న భాగస్వామి విడిపోవడాన్ని గురించి ఆలోచించవచ్చు. ‘మనుష్యులకు కాక దేవునికే లోబడేందుకు’ గల ఏకైక మార్గం చట్టపరంగా విడిపోవడమేనని ప్రమాదంలోవున్న భాగస్వామి భావించవచ్చు.—అపొస్తలుల కార్యములు 5:29.

20. (ఎ) కుటుంబం విచ్ఛిన్నమైనప్పుడు, పరిపక్వతగల స్నేహితులూ సంఘ పెద్దలు ఏమి అందించవచ్చు మరియు ఏమి అందించకూడదు? (బి) వివాహమైన వ్యక్తులు విడిపోయేందుకు, విడాకులు తీసుకునేందుకు ఉన్న బైబిలు ఉదాహరణలను దేనికి సాకుగా ఉపయోగించుకోకూడదు?

20 భాగస్వామిని విపరీతంగా బాధించే అన్ని సందర్భాల్లో, అమాయకమైన భాగస్వామి తన జతనుండి విడిపోవాలని లేక కలిసి జీవించాలని ఆ వ్యక్తిపై ఎవరూ ఒత్తడి తీసుకురాకూడదు. పరిపక్వత చెందిన స్నేహితులు లేక సంఘ పెద్దలు మద్దతును మరియు బైబిలు ఆధారిత సలహాలను ఇచ్చినప్పటికీ, భార్యాభర్తల మధ్య జరుగుతున్న విషయాల వివరాలను అన్నింటినీ వీరు తెలుసుకోలేరు. యెహోవా మాత్రమే దాన్ని చూడగలడు. ఒక క్రైస్తవ స్త్రీ వివాహబంధాన్ని తెంచేసుకోడానికి అల్పమైన కారణాలను ఉపయోగిస్తుంటే ఆమె దేవుని వివాహ ఏర్పాటును ఘనపర్చడం లేదన్నది వాస్తవం. అయితే, మరీ ప్రమాదకరమైన పరిస్థితి ఉండి, ఆమె విడిపోవాలని తీర్మానించుకుంటే ఆమెను ఎవరూ విమర్శించ కూడదు. విడిపోవాలని అనుకుంటున్న క్రైస్తవ భర్త విషయంలో కూడా కచ్చితంగా ఈ విషయాలనే చెప్పవచ్చు. “మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము.”—రోమీయులు 14:10.

విచ్ఛిన్నమైన ఒక వివాహం ఎలా కాపాడబడింది

21. వివాహాన్ని గురించిన బైబిలు సలహాలు పని చేస్తాయని ఏ అనుభవం చూపుతుంది?

21 ముందు ప్రస్తావించబడిన లూఛియా తన భర్త నుండి విడిపోయిన మూడు నెలల తర్వాత, యెహోవాసాక్షులను కలిసింది, వారితో కలిసి బైబిలును పఠించడం ప్రారంభించింది. ఆమె ఇలా వివరిస్తుంది: “బైబిలు నా సమస్యకు ఆచరణాత్మకమైన పరిష్కారాన్ని అందజేసింది. పఠనం ప్రారంభించిన కేవలం ఒక వారానికే నేను నా భర్తతో సమాధానపడాలని అనుకున్నాను. భాగస్వాములు ఒకరి ఎడల ఒకరు గౌరవాన్ని ఎలా కలిగి ఉండాలో నేర్చుకునేందుకు యెహోవా బోధలు భాగస్వాములకు సహాయం చేస్తాయి గనుక ఆపదల్లో ఉన్న వివాహాలను ఎలా రక్షించాలో ఆయనకు తెలుసు అని నేడు నేను చెప్పగలను. యెహోవాసాక్షులు కుటుంబాలను విభజిస్తారని కొందరు వాదిస్తారు, అయితే అది సత్యం కాదు. నా విషయంలో, పూర్తిగా దానికి విరుద్ధమైనది వాస్తవమైంది.” తన జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడాన్ని లూఛియా నేర్చుకుంది.

22. వివాహిత దంపతులందరికీ దేనియందు నమ్మకం ఉండాలి?

22 లూఛియాది ఏకైక ఉదాహరణ కాదు. వివాహమనేది ఆశీర్వాదకరంగా ఉండాలే గాని భారంగా కాదు. ఆ విషయంలో, ఇంతవరకూ వ్రాయబడిన వివాహ సలహాల్లోకెల్లా అతి చక్కని మూలాన్ని యెహోవా అందజేశాడు, అదే ఆయన అమూల్యమైన వాక్యం. బైబిలు “బుద్ధిహీనులకు జ్ఞానము” పుట్టించగలదు. (కీర్తన 19:7-11) విచ్ఛిన్నం కాబోతుండిన అనేక వివాహాలను అది కాపాడింది, మరి గంభీరమైన సమస్యలుగల అనేక వివాహాలను అది మెరుగుపరిచింది. యెహోవా దేవుడు అందజేస్తున్న వివాహ సలహాలపై వివాహిత దంపతులందరికీ పూర్తి నమ్మకం కలుగును గాక. అది ఎంతో ఆచరణయోగ్యమైనది!

a పేరు మార్చబడింది.

b మునుపటి అధ్యాయాల్లో ఈ అంశాలలో కొన్నింటితో వ్యవహరించడం జరిగింది.

c “జారత్వం” అని అనువదింపబడిన బైబిలు పదంలో వ్యభిచారం, స్వలింగసంయోగం, మృగసంయోగం మరియు లైంగిక అంగాలను ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా చేసే మరితర అకృత్యాలు ఏవైనా ఇమిడివున్నాయి.

d భర్త మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పటికీ, అనారోగ్యం లేక ఉద్యోగ అవకాశాల లేమి వంటి, తాను అదుపుచేయలేని కారణాల వలన తన కుటుంబాన్ని సంరక్షించలేకపోతున్న సందర్భాలు ఇందులో ఇమిడిలేవు.