కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 16

మీ కుటుంబం కొరకు నిత్య భవిష్యత్తును సంపాదించుకోండి

మీ కుటుంబం కొరకు నిత్య భవిష్యత్తును సంపాదించుకోండి

1. కుటుంబ ఏర్పాటు ఎడల యెహోవా సంకల్పం ఏమిటి?

 యెహోవా ఆదాము హవ్వలను వివాహం ద్వారా ఐక్యపరచినప్పుడు, లిఖితమైన తొలి హెబ్రీ కవిత చెప్పి ఆదాము తన ఆనందాన్ని వ్యక్తపర్చాడు. (ఆదికాండము 2:22, 23) అయితే, సృష్టికర్త మనస్సులో తన మానవ పిల్లలకు ఉల్లాసాన్ని కలిగించడం కంటే ఇంకా ఎక్కువే ఉండినది. వివాహ దంపతులు, వారి కుటుంబాలు ఆయన చిత్తాన్ని చేయాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మొదటి జతకు ఇలా చెప్పాడు: “మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలు”డి. (ఆదికాండము 1:28) అదెంతటి గొప్ప, ప్రతిఫలదాయకమైన నియామకమో కదా! ఆదాము హవ్వలు యెహోవా చిత్తాన్ని పూర్తి విధేయతతో నెరవేర్చి ఉంటే వారు, వారి భవిష్యత్‌ సంతానం ఎంత సంతోషంగా ఉండగలిగే వారో కదా!

2, 3. నేడు కుటుంబాలు అతి గొప్ప సంతోషాన్ని ఎలా కనుగొనగలవు?

2 దేవుని చిత్తాన్ని చేసేందుకు కుటుంబాలు కలిసి కృషి చేస్తే అవి నేడు కూడా సంతోషంగా ఉండగలవు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.” (1 తిమోతి 4:8) దైవభక్తితో జీవించే మరియు బైబిలులో కనుగొనబడే యెహోవా నడిపింపును అనుసరించే కుటుంబం “యిప్పటి జీవము విషయములో” సంతోషాన్ని కనుగొంటుంది. (కీర్తన 1:1-3; 119:105; 2 తిమోతి 3:16) కుటుంబంలో కేవలం ఒకే వ్యక్తి బైబిలు సూత్రాలను అనుసరించినప్పటికీ, అసలు ఎవరూ అనుసరించనప్పటికంటే పరిస్థితులు ఎంతో మెరుగుగా ఉంటాయి.

3 కుటుంబ సంతోషానికి దోహదపడే అనేక బైబిలు సూత్రాలను గురించి ఈ పుస్తకం చర్చించింది. వాటిలో కొన్ని ఈ పుస్తకంలో పదే పదే కనిపించినట్టుగా ఉండటాన్ని బహుశా మీరు గమనించి ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే, కుటుంబ జీవితం యొక్క వివిధ అంశాల్లోని వారందరి మంచి కొరకు పని చేసే శక్తివంతమైన సత్యాలను అవి సూచిస్తాయి. ఈ బైబిలు సూత్రాలను అన్వయించుకునేందుకు కృషి చేసే కుటుంబం, దైవభక్తి వాస్తవంగా ‘ఇప్పటి జీవం విషయంలో వాగ్దానంతో కూడినదై’ ఉందని గ్రహిస్తుంది. ఆ ప్రాముఖ్యమైన సూత్రాల్లోని నాలుగింటిని మనం మళ్లీ పరిశీలిద్దాము.

ఆశానిగ్రహం యొక్క విలువ

4. వివాహంలో ఆశానిగ్రహం ఎందుకు ప్రాముఖ్యం?

4 రాజైన సొలొమోను ఇలా చెప్పాడు: “ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేని వాడును అంతే.” (సామెతలు 25:28; 29:11) సంతోషభరితమైన వివాహాన్ని కోరుకునే వారు, ‘మనస్సును అణచుకొనడం’ అంటే, ఆశానిగ్రహాన్ని ప్రదర్శించడం అత్యంత ప్రాముఖ్యం. ఆగ్రహం లేక అనైతిక లైంగిక తృష్ణ వంటి వినాశకర భావోద్రేకాలకు లొంగిపోవడం ఎంతో తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఆ నష్టాన్ని పూరించలేము. ఒకవేళ ఆ నష్టాన్ని పూరించగల్గినా, అందుకు ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు.

5. ఒక అపరిపూర్ణ మానవుడు ఆశానిగ్రహాన్ని ఎలా వృద్ధి చేసుకోగలడు మరి ఏ ప్రయోజనాలతో?

5 ఆదాము యొక్క సంతానంలో ఎవరూ కూడా తమ అసంపూర్ణ శరీరాన్ని పూర్తిగా అదుపుచేసుకోలేరు అన్నది వాస్తవమే. (రోమీయులు 7:21, 22) అయినా, ఆశానిగ్రహం ఆత్మ ఫలాల్లో ఒకటి. (గలతీయులు 5:22, 23) కాబట్టి, మనం ఆశానిగ్రహం కొరకు ప్రార్థిస్తే, లేఖనాల్లో కనుగొనబడే సరైన సలహాలను మనం అన్వయించుకుంటే, దాన్ని ప్రదర్శించే వారితో సహవసిస్తే మరియు దాన్ని ప్రదర్శించని వారిని నివారిస్తే, అప్పుడు దేవుని ఆత్మ మనలో ఈ లక్షణాన్ని ఉత్పన్నం చేస్తుంది. (కీర్తన 119:100, 101, 130; సామెతలు 13:20; 1 పేతురు 4:7) అలాంటి ప్రవర్తన మనం శోధింపబడినప్పుడు కూడా “జారత్వమునకు దూరముగా పారిపో”డానికి సహాయం చేస్తుంది. (1 కొరింథీయులు 6:18) మనం దౌర్జన్యాన్ని త్యజించి, మద్యపానాసక్తిని నివారిస్తాం లేక జయిస్తాం. రెచ్చగొట్టబడినప్పుడు మరియు కష్టతరమైన పరిస్థితులతో మరింత నెమ్మదిగా వ్యవహరిస్తాము. పిల్లలతో సహా అందరమూ ఈ ప్రాముఖ్యమైన ఆత్మఫలాన్ని వృద్ధి చేసుకోడాన్ని నేర్చుకుందాము.—కీర్తన 119:1, 2.

శిరస్సత్వాన్ని గూర్చిన సరైన దృష్టి

6. (ఎ) శిరస్సత్వాన్ని గురించి దైవికంగా స్థాపించబడిన క్రమం ఏమిటి? (బి) తన శిరస్సత్వం తన కుటుంబానికి సంతోషాన్ని తీసుకురావాలంటే ఒక పురుషుడు ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి?

6 రెండవ ప్రాముఖ్యమైన సూత్రం ఏమంటే శిరస్సత్వాన్ని గుర్తించడం. పౌలు ఇలా చెప్పినప్పుడు విషయాల సరైన క్రమాన్ని వివరించాడు: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.” (1 కొరింథీయులు 11:3) అంటే, కుటుంబంలో పురుషుడు నాయకత్వం వహిస్తాడని, ఆయన భార్య యథార్థంగా మద్దతునిస్తుందని మరి పిల్లలు తమ తలిదండ్రులకు విధేయులౌతారని దానర్థం. (ఎఫెసీయులు 5:22-25, 28-33; 6:1-4) అయితే, శిరస్సత్వాన్ని సరైన పద్ధతిలో నిర్వహించినప్పుడే అది సంతోషానికి దారి తీస్తుందని గమనించండి. శిరస్సత్వమంటే నిరంకుశత్వం కాదని దైవభక్తితో జీవించే భర్తలు గుర్తిస్తారు. తమ శిరస్సైన యేసును వారు అనుకరిస్తారు. యేసు ‘సమస్తముపైన శిరస్సుగా’ ఉండవలసి ఉన్నప్పటికీ, ఆయన “పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు” వచ్చాడు. (ఎఫెసీయులు 1:22; మత్తయి 20:28) అదే విధంగా, ఒక క్రైస్తవ పురుషుడు స్వప్రయోజనం కొరకు కాక, తన భార్యా పిల్లల క్షేమం కొరకే శిరస్సత్వాన్ని నిర్వహిస్తాడు.—1 కొరింథీయులు 13:4, 5.

7. కుటుంబంలో దేవుడు తనకు నియమించిన పాత్రను నెరవేర్చేందుకు భార్యకు ఏ లేఖనాధార సూత్రాలు సహాయపడతాయి?

7 తన మటుకు తాను, దైవభక్తితో జీవించే భార్య తన భర్తతో పోటీపడదు లేక ఆయనపై పెత్తనం చెలాయించాలని ప్రయత్నించదు. ఆయనకు మద్దతు ఇచ్చేందుకు, ఆయనతోపాటు పని చేసేందుకు ఆమె ఎంతో సంతోషిస్తుంది. భార్య తన భర్తకు “చెందినది” అని బైబిలు కొన్నిసార్లు అంటోంది, అలా ఆయన ఆమె శిరస్సనే విషయంలో అది ఎలాంటి సందేహాన్నీ మిగల్చలేదు. (ఆదికాండము 20:3, NW) వివాహం ద్వారా ఆమె తన “భర్త విషయమైన ధర్మశాస్త్రము” క్రిందికి వస్తుంది. (రోమీయులు 7:2) అదే సమయంలో, బైబిలు ఆమెను “సహాయకారి” మరియు “సాటియైన సహాయము” అని పిలుస్తుంది. (ఆదికాండము 2:20) తన భర్తలో లేని లక్షణాలను, సామర్థ్యాలను ఆమె ఆయనకు సమకూర్చుతుంది, ఆయనకు అవసరమైన మద్దతును ఇస్తుంది. (సామెతలు 31:10-31) భార్య తన జతతోపాటు కలిసి పని చేసే “భాగస్వామి” అని కూడా బైబిలు చెబుతోంది. (మలాకీ 2:14, NW) భార్యాభర్తలు తమ స్థానాలను పరస్పరం గుణగ్రహించి, ఒకరికొకరు తగిన గౌరవాన్ని, ఘనతను ఇచ్చుకునేందుకు ఈ లేఖనాధార సూత్రాలు వారికి సహాయం చేస్తాయి.

‘వినుటకు వేగిరపడుడి’

8, 9. తమ సంభాషణా కౌశలాలను మెరుగుపరచుకోడానికి కుటుంబంలోని వారందరికీ సహాయం చేయగల కొన్ని సూత్రాలను వివరించండి.

8 ఈ పుస్తకంలో, సంభాషణ యొక్క అవసరత తరచూ ఉన్నతపర్చబడింది. ఎందుకు? ఎందుకంటే మాట్లాడుకునే ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని, ఒకరి మాటలు మరొకరు వాస్తవంగా వింటే సమస్యలు సులభంగా పరిష్కారమౌతాయి. ఇరువైపుల వారు పరస్పరం మాట్లాడుకోవడం అంటేనే సంభాషణ అనే వాస్తవం పదేపదే నొక్కిచెప్పబడింది. శిష్యుడైన యాకోబు దాన్ని ఇలా వ్యక్తపర్చాడు: “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించు . . . వాడునై యుండవలెను.”—యాకోబు 1:19.

9 మనం ఎలా మాట్లాడతాము అనే విషయంలో జాగ్రత్తగా ఉండటం కూడా ప్రాముఖ్యమే. అనాలోచితమైన, కలహించే లేక అత్యంత విమర్శనాత్మక మాటలు విజయవంతమైన సంభాషణ అనిపించుకోదు. (సామెతలు 15:1; 21:9; 29:11, 20) మనం చెప్పేది సరైనదైనప్పటికీ, దాన్ని కఠినంగా, గర్వంగా, లేక ఆప్యాయత లేని విధంగా వ్యక్తం చేస్తే, అది మంచికన్నా చెడునే ఎక్కువ చేస్తుంది. మన సంభాషణ “ఉప్పు వేసినట్టు” ఎల్లప్పుడు రుచికరంగా ఉండాలి. (కొలొస్సయులు 4:6) మన మాటలు “చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్ల” వలె ఉండాలి. (సామెతలు 25:11) సరిగ్గా సంభాషించుకోవడాన్ని నేర్చుకున్న కుటుంబాలు, సంతోషాన్ని సాధించే మార్గంలో ముందడుగు వేశాయి.

ప్రేమ యొక్క ప్రాముఖ్యమైన పాత్ర

10. వివాహంలో ఏ విధమైన ప్రేమ ప్రాముఖ్యమైనది?

10 “ప్రేమ” అనే పదం ఈ పుస్తకమంతటిలో అనేకసార్లు కనిపిస్తుంది. ఏ విధమైన ప్రేమ మొదట సూచింపబడిందో మీకు జ్ఞాపకముందా? భావాత్మక ప్రేమ (గ్రీకు, ఎʹరోస్‌) వివాహమందు ఒక ప్రముఖ పాత్ర వహిస్తుందనుట నిజమే, విజయవంతమైన వివాహాల్లో ప్రగాఢమైన అనురాగం, స్నేహభావం (గ్రీకు, ఫి·లిʹయా) భార్యాభర్తల మధ్య విరాజిల్లుతుంది. అయితే, అ·గాʹపె అనే గ్రీకు పదం ద్వారా సూచింపబడిన ప్రేమ ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా ఎడల, యేసు ఎడల మరియు మన పొరుగువారి ఎడల మనం వృద్ధిపర్చుకునే ప్రేమ ఇదే. (మత్తయి 22:37-39) మానవజాతి ఎడల యెహోవా ప్రేమను వ్యక్తపర్చుతున్నాడు. (యోహాను 3:16) అదే విధమైన ప్రేమను మనం మన వివాహజత ఎడల మరియు పిల్లల ఎడల కనుపర్చగలమనే విషయం ఎంత అద్భుతం!—1 యోహాను 4:19.

11. వివాహం యొక్క ప్రయోజనానికి ప్రేమ ఎలా దోహదపడగలదు?

11 వివాహంలో ఈ సమున్నతమైన ప్రేమ వాస్తవంగా ‘పరిపూర్ణతకు అనుబంధమైనది.’ (కొలొస్సయులు 3:14) అది దంపతులను దగ్గరకు తెస్తుంది, తమ ఇరువురికి, తమ పిల్లలకు ఏది మంచిదో అది చేయడాన్ని వారు ఇష్టపడేలా చేస్తుంది. కుటుంబాలు కష్టతరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు, వారు విషయాల ఎడల ఐకమత్యంతో వ్యవహరించేలా ప్రేమ వారికి సహాయం చేస్తుంది. దంపతులు వృద్ధులౌతుండగా, వారు పరస్పరం మద్దతును ఇచ్చుకునేందుకు, గుణగ్రహించడంలో కొనసాగేందుకు ప్రేమ వారికి సహాయం చేస్తుంది. “ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు; . . . అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.”—1 కొరింథీయులు 13:4-8.

12. వివాహ దంపతులు దేవుని ఎడల ప్రేమను కలిగి ఉండటం వారి వివాహన్ని ఎందుకు పటిష్టం చేస్తుంది?

12 వివాహ కలయిక, వివాహ భాగస్వాముల మధ్యగల ప్రేమ చేతనేకాక ప్రాథమికంగా యెహోవా ఎడల గల ప్రేమ ద్వారా అది ప్రాముఖ్యంగా పటిష్టమౌతుంది. (ప్రసంగి 4:9-12) ఎందుకు? అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.” (1 యోహాను 5:3) కాబట్టి, దంపతులు తమ పిల్లలకు దైవభక్తితో కూడిన తర్ఫీదునివ్వాలి, అయితే వారు తమ పిల్లలను ప్రగాఢంగా ప్రేమిస్తున్నందుకు మాత్రమే కాక అలా తర్ఫీదునివ్వాలని యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు గనుక వారలా చేస్తారు. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నందుకు మాత్రమే కాక ప్రాముఖ్యంగా ‘వేశ్యాసంగులకును వ్యభిచారులకును . . . తీర్పు తీర్చే’ యెహోవాను వారు ప్రేమిస్తున్నారు గనుక వారు అనైతికతను తృణీకరిస్తారు. (హెబ్రీయులు 13:4) వివాహంలో ఒక జత తీవ్రమైన సమస్యలను కలిగించినా, ఇంకొక జత బైబిలు సూత్రాలను అనుసరించడంలో కొనసాగేందుకు యెహోవా ఎడల గల ప్రేమ ఆ వ్యక్తిని పురికొల్పుతుంది. యెహోవా కొరకైన ప్రేమ ద్వారా దృఢపర్చబడిన, ఒకరినొకరు ప్రేమించుకునే వారి కుటుంబాలు వాస్తవంగా ధన్యతగలవి!

దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుటుంబం

13. దేవుని చిత్తాన్ని చేయాలన్న తీర్మానం, వాస్తవంగా ప్రాముఖ్యమైన సంగతులపై తమ దృష్టిని నిలిపేందుకు వ్యక్తులకు ఎలా సహాయం చేస్తుంది?

13 ఒక క్రైస్తవుని జీవితమంతా కూడా దేవుని చిత్తాన్ని చేయడంపై కేంద్రీకరించబడి ఉంది. (కీర్తన 143:10) దైవభక్తి అంటే అర్థం వాస్తవంగా ఇదే. కుటుంబాలు దేవుని చిత్తాన్ని చేయడం, వాస్తవంగా ప్రాముఖ్యమైన విషయాలపై వారు తమ దృష్టిని నిలిపేందుకు వారికి సహాయం చేస్తుంది. (ఫిలిప్పీయులు 1:9-11) ఉదాహరణకు, యేసు ఇలా హెచ్చరించాడు: “ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.” (మత్తయి 10:35, 36) యేసు హెచ్చరించిన విధంగానే, ఆయన అనుచరులలో అనేకులు తమ కుటుంబ సభ్యుల ద్వారా హింసింపబడ్డారు. అందెంతటి దుఃఖకరమైన, బాధాకరమైన పరిస్థితియో కదా! అయిననూ కుటుంబ బంధాలు యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తు ఎడల మనకు గల ప్రేమను బలహీనం చేయకూడదు. (మత్తయి 10:37-39) కుటుంబ వ్యతిరేకత వచ్చినప్పటికినీ ఒకరు సహిస్తే, వ్యతిరేకించేవారు దైవభక్తి యొక్క మంచి ప్రభావాలను చూసినప్పుడు వారు మారవచ్చు. (1 కొరింథీయులు 7:12-16; 1 పేతురు 3:1, 2) ఒకవేళ అది జరగక పోయినా, వ్యతిరేకత మూలంగా దేవుని సేవించడాన్ని మానుకోవడం ద్వారా నిత్యం నిలిచే ప్రయోజనాన్ని ఎంత మాత్రం సాధించలేము.

14. దేవుని చిత్తాన్ని చేయాలన్న కోరిక, తమ పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైనవి చేసేందుకు తలిదండ్రులకు ఎలా సహాయం చేస్తుంది?

14 దేవుని చిత్తాన్ని చేయడం సరైన నిర్ణయం తీసుకునేందుకు తలిదండ్రులకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, కొన్ని సమాజాల్లో తలిదండ్రులు పిల్లలను తమ పెట్టుబడిగా భావించి, తమ వృద్ధాప్యంలో తమ ఎడల వారు శ్రద్ధ వహిస్తారని తమ పిల్లలపై ఆధారపడతారు. ఎదిగిన పిల్లలు తమ వృద్ధ తలిదండ్రుల ఎడల శ్రద్ధ వహించడం సరియైనది, మంచిదీ అయినప్పటికినీ అలాంటి పరిస్థితి తలిదండ్రులు తమ పిల్లలను వస్తు సంపద ఎడల మక్కువగల జీవిత విధానం వైపుకు నడుపకూడదు. ఆత్మీయ సంగతులకంటే వస్తు సంపదను విలువైనదానిగా ఎంచేలా పిల్లలను పెంచితే తలిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మేలునూ చేసినవారు కారు.—1 తిమోతి 6:9.

15. తిమోతి తల్లి అయిన యునీకే, దేవుని చిత్తాన్ని చేసిన తల్లి యొక్క అత్యంత శ్రేష్ఠమైన ఉదాహరణగా ఎలావుంది?

15 పౌలు యొక్క యౌవన స్నేహితుడైన తిమోతి తల్లి యునీకే ఈ విషయంలో ఒక చక్కని ఉదాహరణ. (2 తిమోతి 1:5) ఆమెకు ఒక అవిశ్వాసితో వివాహం అయినప్పటికీ, తిమోతి అమ్మమ్మ అయిన లూయితో సహా యునీకే, దైవభక్తిని కలిగి ఉండేలా తిమోతిని విజయవంతంగా పెంచింది. (2 తిమోతి 3:14, 15) తిమోతి పెద్దవాడైనప్పుడు, ఆయన ఇల్లు వదలి వెళ్లి పౌలు యొక్క మిషనరీ సహవాసిగా రాజ్య ప్రచార పనిని చేపట్టేందుకు యునీకే అనుమతించింది. (అపొస్తలుల కార్యములు 16:1-5) తన కుమారుడు ఓ శ్రేష్ఠమైన మిషనరీ అయినప్పుడు ఆమె ఎంతగా పులకించి ఉంటుందో కదా! ఒక యుక్త వయస్కునిగా ఆయనకున్న దైవభక్తి ఆయన తొలికాల తర్ఫీదును చక్కగా ప్రతిబింబించింది. తిమోతి సాన్నిధ్యం యొక్క కొరతను యునీకే చవిచూసినప్పటికీ, ఆయన నమ్మకమైన పరిచర్యను గూర్చిన నివేదికలను ఆమె విన్నప్పుడు నిశ్చయంగా ఆమె సంతృప్తిని, ఆనందాన్ని పొందింది.—ఫిలిప్పీయులు 2:19, 20.

కుటుంబం మరియు మీ భవిష్యత్తు

16. ఒక కుమారునిగా, ఏ సరైన శ్రద్ధను యేసు చూపాడు, అయితే ఆయన ముఖ్య లక్ష్యం ఏమైవుంది?

16 యేసు దైవిక కుటుంబంలో పెంచబడ్డాడు, ఒక ఎదిగిన వ్యక్తిగా, తన తల్లి ఎడల ఒక కొడుకు కలిగి ఉండవలసిన సరైన శ్రద్ధను చూపించాడు. (లూకా 2:51, 52; యోహాను 19:26) అయితే, యేసు యొక్క ప్రధాన లక్ష్యం దేవుని చిత్తాన్ని చేయడమే, మరి మానవులకొరకు ఆనందమయ నిత్య జీవితానికి మార్గాన్ని తెరవడంకూడా ఆయన దేవుని చిత్తాన్ని చేయడంలో ఇమిడి ఉండినది. పాపభరితులైన మానవజాతి కొరకు విమోచన క్రయధనంగా తన పరిపూర్ణ మానవ జీవితాన్ని అర్పించడం ద్వారా ఆయన దాన్ని నెరవేర్చాడు.—మార్కు 10:45; యోహాను 5:28, 29.

17. యేసు యొక్క నమ్మకమైన నడవడి దేవుని చిత్తాన్ని చేసే వారి కొరకు ఏ అద్భుతమైన ఉత్తరాపేక్షలను అందించింది?

17 యేసు మరణం తర్వాత, యెహోవా ఆయనను పరలోక జీవితం కొరకు పునరుత్థానం చేసి, ఆయనకు గొప్ప అధికారాన్ని ఇచ్చి తుదకు పరలోక రాజ్యం యొక్క రాజుగా ఆయనను నియుక్తి చేశాడు. (మత్తయి 28:18; రోమీయులు 14:9; ప్రకటన 11:15) యేసుతో పాటు రాజ్యంలో పరిపాలించేందుకు కొందరు మానవులను ఎంపిక చేసేందుకు ఆయన బలి తోడ్పడింది. యథార్థ హృదయంగల మానవజాతిలోని మిగిలిన వారు, పరదైసు పరిస్థితులకు పునరుద్ధరించబడిన భూమిపై పరిపూర్ణ జీవితాన్ని ఆనందించేందుకు కూడా ఇది మార్గాన్ని తెరిచింది. (ప్రకటన 5:9, 10; 14:1, 4; 21:3-5; 22:1-4) నేడు మనకున్న అతి గొప్ప ఆధిక్యతల్లో ఒకటి ఏమంటే, మన పొరుగు వారికి ఈ మహిమగల సువార్తను చెప్పడమే.—మత్తయి 24:14.

18. కుటుంబాలకు అలాగే వ్యక్తులకు ఏ జ్ఞాపిక మరియు ప్రోత్సాహం ఇవ్వబడ్డాయి?

18 అపొస్తలుడైన పౌలు చూపినట్లు, దైవభక్తిగల జీవితాన్ని జీవించడం, “రాబోవు” జీవితంలో ఆ దీవెనలను స్వంతం చేసుకొనగలరనే వాగ్దానాన్ని ప్రజలకు అందిస్తోంది. సంతోషాన్ని కనుగొనేందుకు కచ్చితంగా ఇదే అతి శ్రేష్ఠమైన మార్గం! “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని జ్ఞాపకముంచుకోండి. (1 యోహాను 2:17) కాబట్టి, మీరు పిల్లలైనా లేక తలిదండ్రులైనా, భర్తయినా లేక భార్యయినా, పిల్లలుగల లేక పిల్లలులేని ఒంటరి తల్లి/తండ్రి అయినా మీరు దేవుని చిత్తాన్ని చేసేందుకు కృషి చేయండి. మీరు ఒత్తిడులను అనుభవిస్తున్నా లేక తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్నా మీరు సజీవుడైన దేవుని యొక్క సేవకులన్న విషయాన్ని ఎన్నటికీ మర్చిపోకండి. అలా, మీ క్రియలు యెహోవాకు ఆనందాన్ని కలిగించును గాక. (సామెతలు 27:11) అలా మీ ప్రవర్తన మీకు ప్రస్తుతం సంతోషాన్ని, రాబోయే నూతన లోకంలో నిత్యజీవాన్ని అందించును గాక!