కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆ గ్రంథంలో ఏమివుంది

ఆ గ్రంథంలో ఏమివుంది

ఆ గ్రంథంలో ఏమివుంది

మొట్టమొదటి సారిగా గ్రంథాలయంలోనికి అడుగుపెడుతున్న ఓ వ్యక్తికి, చక్కగా అమర్చబడిన పుస్తకాలు తికమకపెడ్తున్నట్టు అన్పించవచ్చు. కానీ ఆ పుస్తకాలు అమర్చబడిన తీరును గురించి కాస్త వివరిస్తే, కావాల్సిన పుస్తకాల్ని ఎలా తీయవచ్చో అతడు త్వరలోనే నేర్చుకుంటాడు. అదే విధంగా, బైబిలులో పుస్తకాలు ఎలా అమర్చబడ్డాయో మీరు అర్థంచేసుకుంటే దానిలో మీకు కావాల్సినదానిని మీరు సులభంగా వెతుక్కోగల్గుతారు.

“బైబిలు” అనే పదం, బిబ్లియా అనే గ్రీకు పదంనుండి వచ్చింది. “పపైరస్‌ చుట్టలు” లేక “పుస్తకాలు” అని దీని భావం.1 బైబిలు, సా.శ.పూ. 1513 నుండి దాదాపు సా.శ. 98 వరకు సుమారు 1,600 సంవత్సరాల కాలంలో రాయబడిన పుస్తకాల సేకరణ. అంటే అది 66 వేర్వేరు పుస్తకాలుగల ఓ గ్రంథాలయం.

బైబిల్లో దాదాపు మూడొంతులున్న మొదటి 39 పుస్తకాలు ప్రధానంగా హెబ్రీ భాషలోనే రాయబడ్డాయి గనుక అవి హెబ్రీ లేఖనాలుగా ప్రసిద్ధిగాంచాయి. ఈ పుస్తకాల్ని సాధారణంగా మూడు వర్గాలుగా విభజించవచ్చు: (1) చారిత్రాత్మకమైనవి. ఆదికాండము నుండి ఎస్తేరు వరకూ ఉన్న 17 పుస్తకాలు; (2) పద్యరూపమైనవి. యోబు నుండి పరమగీతములు వరకూ ఉన్న 5 పుస్తకాలు; (3) ప్రవచనాత్మకమైనవి. యెషయా నుండి మలాకీ వరకూ ఉన్న 17 పుస్తకాలు. భూమిని గూర్చిన, మానవజాతిని గూర్చిన తొలి చరిత్రనూ అలాగే ప్రాచీన ఇశ్రాయేలు జనాంగ ఉద్భవం మొదలుకొని సా.శ.పూ. ఐదవ శతాబ్దం వరకూవున్న దాని చరిత్రనూ హెబ్రీ లేఖనాలు వివరిస్తున్నాయి.

మిగిలిన 27 పుస్తకాలు ఆ కాలంనాటి అంతర్జాతీయ భాషయైన గ్రీకులో రాయబడినందున, అవి క్రైస్తవ గ్రీకు లేఖనాలుగా పేరుగాంచాయి. అవి ప్రధానంగా విషయాంశ ప్రకారంగా అమర్చబడ్డాయి: (1) 5 చారిత్రక పుస్తకాలు అంటే సువార్తలు, అపొస్తలుల కార్యములు (2) 21 పత్రికలు, (3) ప్రకటన గ్రంథము. యేసుక్రీస్తూ, సా.శ. మొదటి శతాబ్దంలోని ఆయన శిష్యులూ చేసిన భోదలపైనా, వారి కార్యకలాపాలపైనా క్రైస్తవ గ్రీకు లేఖనాలు కేంద్రీకరించబడ్డాయి.