కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన గ్రంథం

ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన గ్రంథం

ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన గ్రంథం

సలహాలిచ్చే పుస్తకాలు నేటి ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. కానీ అవి వ్యవహారంలో లేకుండాపోయి, త్వరలోనే సవరించబడతాయి లేక మార్చబడతాయి. మరి బైబిలు సంగతేంటి? అది దాదాపు 2,000 సంవత్సరాల క్రిందటే పూర్తిచేయబడింది. అయినా, దాని ఆది సందేశాన్ని మెరుగుపర్చడంగానీ లేక కాలానుగుణంగా మార్చడంగానీ ఎన్నడూ జరగలేదు. మన కాలానికి అవసరమైన ఆచరణాత్మకమైన నడిపింపు అలాంటి గ్రంథంలో ఉండడం సాధ్యమేనా?

సాధ్యంకాదని కొంతమంది చెబుతారు. డా. ఈలై. ఎస్‌. చెసన్‌ తాను బైబిల్ని వ్యవహారంలోలేని పుస్తకంగా ఎందుకు భావిస్తున్నాడో వివరిస్తూ, “ఆధునిక కెమిస్ట్రీ తరగతిలో ఉపయోగించేందుకు 1924 నాటి కెమిస్ట్రీ టెక్ట్స్‌[బుక్‌]ను ఎవ్వరూ సిఫారసు చేయరు” అని రాశాడు.1 ఇది సరియైన వాదంలానే కనబడుతోంది. బైబిలు రాయబడిన కాలంనుండి ఇప్పటి వరకూ మానసిక ఆరోగ్యం గురించీ, మానవ ప్రవర్తన గురించీ మానవుడు ఎంతో నేర్చుకున్నాడు. కాబట్టి అలాంటి ప్రాచీన గ్రంథం ఆధునిక జీవనానికి సంబంధించినదిగా ఎలా ఉండగలదు?

కాల పరిమితిలేని సూత్రాలు

కాలాలు మారిపోవడం నిజమే అయినప్పటికీ, మానవుని కనీసావసరతలు మాత్రం అలానే ఉన్నాయి. చరిత్రయందంతటిలోనూ ప్రజలకు ప్రేమానురాగాల అవసరత ఉంది. సంతోషంగా ఉండాలనే, అర్థవంతమైన జీవితాన్ని గడపాలనే కోరికవుంది. ఆర్థిక ఒత్తిళ్లను ఎలా తాళుకోవాలి, వివాహ జీవితాన్ని ఎలా సఫలీకృతం చేసుకోవాలి, తమ పిల్లల్లో మంచి నైతిక విలువల్నీ మానవతా విలువల్నీ ఎలా నాటాలి అనే విషయాలపై సలహాలు వారికి అవసరం. అలాంటి ప్రాథమిక అవసరతల కొరకైన సలహాలు బైబిల్లో ఉన్నాయి.—ప్రసంగి 3:12, 13; రోమీయులు 12:10; కొలొస్సయులు 3:18-21; 1 తిమోతి 6:6-10.

బైబిలు సలహా మానవ నైజాన్ని బాగా ఎరిగివున్నట్లు సూచిస్తుంది. ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన, కాల పరిమితిలేని నిర్దిష్టమైన దాని సూత్రాల్లో కొన్నింటిని పరిశీలించండి.

వివాహ జీవితానికి ఆచరణాత్మకమైన నడిపింపు

కుటుంబం “మానవ వ్యవస్థలో అతి ప్రాచీనమైన, అత్యంత ప్రాముఖ్యమైన భాగం; తరాల మధ్య అత్యంత ప్రధానమైన అనుసంధానం” అని యుఎన్‌ క్రానికల్‌ చెబుతోంది. అయితే, ఈ “ప్రధానమైన అనుసంధానం” ప్రమాదకరమైన రీతిలో గాడి తప్పుతోంది. “నేటి ప్రపంచంలో అనేక కుటుంబాలు కొనసాగే సామర్థ్యానికీ, వాస్తవానికి నిలిచి ఉండడానికైన సామర్థ్యానికీ ముప్పుతెస్తున్న క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి” అని క్రానికల్‌ తెలియజేస్తోంది.2 కుటుంబ వ్యవస్థ నిలిచివుండడానికి సహాయపడేందుకు బైబిలు ఏ సలహాల్ని ఇస్తోంది?

మొట్ట మొదటిగా, భార్యాభర్తలిరువురూ ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించాలనే దాని గురించి బైబిలు ఎంతో చెబుతోంది. ఉదాహరణకు, భర్తల్ని గురించి అదిలా చెబుతుంది: “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.” (ఇటాలిక్కులు మావి.) (ఎఫెసీయులు 5:28, 29) “తన భర్త ఎడల ప్రగాఢమైన గౌరవాన్ని కల్గి”వుండాలని భార్యకు ఉపదేశించబడింది.—ఎఫెసీయులు 5:33, NW.

అలాంటి బైబిలు సలహాను అన్వయించుకోవడంలో చేరివున్న విషయాల్ని పరిశీలించండి. తన భార్యను ‘తన స్వంత శరీరంలా’ ప్రేమించే ఓ భర్త ఆమెను ద్వేషించడు లేక ఆమె ఎడల క్రూరంగా ప్రవర్తించడు. ఆమెను కొట్టడు లేక ఆమెను దూషించడు, మానసికంగా బాధపెట్టడు. బదులుగా, ఆయన తన ఎడల తాను చూపుకునే గౌరవాన్నీ శ్రద్ధనూ ఆమె ఎడలా చూపిస్తాడు. (1 పేతురు 3:7) ఆ విధంగా, తాను ప్రేమించబడుతుందనీ, తన వివాహ జీవితంలో తాను భద్రంగావుందనీ ఆయన భార్య భావిస్తుంది. అలా, స్త్రీలతో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఆయన తన పిల్లల ఎదుట మంచి మాదిరిని ఉంచుతాడు. మరోవైపున, తన భర్త ఎడల ‘ప్రగాఢమైన గౌరవం’గల భార్య ఆయన్ని అదే పనిగా విమర్శించడం ద్వారా లేక ఆయన్ని చిన్నబుచ్చడం ద్వారా ఆయన గౌరవానికి భంగం కలిగించదు. ఆమె ఆయన్ని గౌరవిస్తుంది గనుక ఆమె తనను నమ్ముతుందనీ, స్వీకరిస్తోందనీ, ఉన్నతంగా ఎంచుతోందనీ ఆయన భావిస్తాడు.

అలాంటి సలహా ఈ ఆధునిక ప్రపంచంలో ఆచరణాత్మకమైనదేనా? కుటుంబాల్ని గూర్చిన అధ్యయనాన్ని ఈనాడు తమ కెరీర్‌గా చేసుకున్న వాళ్లు కూడా అదే విధమైన నిర్ధారణలకు రావడం ఆసక్తికరమైన విషయం. కుటుంబ సలహా కార్యక్రమ నిర్వాహకురాలు ఇలా అభిప్రాయపడింది: “నాకు తెల్సిన అత్యంత స్థిరమైన సఫలీకృతమైన కుటుంబాలు ఏవంటే తల్లిదండ్రులిరువురి మధ్యా పటిష్ఠమైన ప్రేమపూర్వకమైన బంధమున్న కుటుంబాలే. . . . ఈ పటిష్ఠమైన ప్రధాన సంబంధం, పిల్లల్లో భద్రతా భావాన్ని కలిగిస్తున్నట్లు కనబడుతుంది.”3

సంవత్సరాలుగా, వివాహ జీవితంపై బైబిలు ఇచ్చిన సలహాలు సదుద్దేశంగల అనేకమంది కుటుంబ సలహాదార్లు ఇచ్చే సలహాలకన్నా ఎంతో విశ్వసనీయమైనవని రుజువయ్యాయి. అసంతోషకరమైన వివాహ జీవితానికి విడాకులే త్వరితమైన, సులభమైన పరిష్కారమని అనేకమంది నిపుణులు సమర్థించి ఎంతో కాలంకాలేదు. నేడు వారిలో అనేకులు, వీలైనంతవరకూ వివాహ జీవితాన్ని శాశ్వతమైనదిగా చేసుకోమని ప్రజలకు ఉద్బోధిస్తున్నారు. కానీ, కుటుంబాలకు ఎంతో నష్టం వాటిల్లిన తర్వాతనే ఈ మార్పు తలంపుల్లోకి వచ్చింది.

దానికి భిన్నంగా, బైబిలు వివాహ జీవితాన్ని గూర్చిన అంశంపై విశ్వసనీయమైన, సమతూకంగల సలహాను ఇస్తోంది. కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో విడాకులు ఆమోదయోగ్యమేనని అది అంగీకరిస్తోంది. (మత్తయి 19:9) అదే సమయంలో, అసంబద్ధమైన కారణాల్నిబట్టి విడాకులు తీసుకోవడాన్ని అది ఖండిస్తోంది. (మలాకీ 2:14-16) అది వైవాహిక విద్రోహాన్ని కూడా ఖండిస్తోంది. (హెబ్రీయులు 13:4) వివాహ జీవితంలో పరస్పరం కట్టుబడివుండడం చేరివుంది. అదిలా చెబుతోంది: “కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.” * (ఇటాలిక్కులు మావి.)—ఆదికాండము 2:24; మత్తయి 19:5, 6.

వివాహ జీవితం విషయంలో బైబిలు ఇచ్చే సలహా, బైబిలు రాయబడిన కాలంలో ఎంత సమంజసమైందో నేడూ అంతే సమంజసమైనదిగావుంది. భార్యా భర్తలిరువురూ పరస్పరం ప్రేమా గౌరవాలతో వ్యవహరించుకున్నప్పుడూ, వివాహాన్ని అనితరబంధంగా దృష్టించినప్పుడూ, వివాహ జీవితమూ—మరి దానితోపాటూ కుటుంబ జీవితమూ నిలిచే సాధ్యతవుంది.

తల్లిదండ్రులకు ఆచరణాత్మకమైన నడిపింపు

అనేక దశాబ్దాల క్రిందట, పిల్లల శిక్షణ విషయంలో “అధునాతన భావాల”చే ప్రేరేపించబడ్డ తల్లిదండ్రుల్లో అనేకమంది—దాన్ని “నిషేధించడం నిషేధం” అని తలంచారు.8 పిల్లలకు హద్దుల్ని నియమించడమనేది ఉద్వేగాఘాతాన్నీ, నిరాశనూ కల్గిస్తుందని వాళ్లు భయపడ్డారు. పిల్లల్ని తల్లిదండ్రులు మృదువుగా సరిదిద్దడం మినహా ఇంకేమీ చేయకూడదని పిల్లల పెంపకం విషయంలో సలహాల్నిచ్చే సహృద్భావంగల సలహాదార్లు పదే పదే తెలియజేసేవారు. కానీ అలాంటి నిపుణుల్లో అనేకమంది క్రమశిక్షణ పాత్రను ఇప్పుడు పునఃపరిశీలిస్తున్నారు, మరి శ్రద్ధగల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గురించి కొంత స్పష్టంగా తెల్సుకునేందుకు పరిశోధన చేస్తున్నారు.

అయితే, పిల్లల పెంపకం విషయంలో ఎల్లవేళలా బైబిలు స్పష్టమైన, సహేతుకమైన సలహాను ఇచ్చింది. దాదాపు 2,000 సంవత్సరాల క్రిందట అదిలా తెలియజేసింది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) “శిక్ష” అని అనువదించబడిన గ్రీకు నామవాచకానికి “పెంచడం, తర్ఫీదునివ్వడం, ఉపదేశించడం” అని అర్థం.9 అలాంటి శిక్ష లేక ఉపదేశం తల్లిదండ్రుల ప్రేమకు నిదర్శనమని బైబిలు చెబుతోంది. (సామెతలు 13:24) పిల్లలు స్పష్టమైన నైతిక నియమాల మూలంగానూ తప్పొప్పుల్ని గూర్చిన పరిణతిచెందిన వివేకం మూలంగానూ వర్థిల్లుతారు. తమ తల్లిదండ్రులు తమ ఎడలా అలాగే తామెలాంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలనే విషయం ఎడలా శ్రద్ధ కల్గివున్నారని క్రమశిక్షణ వారికి తెలియజేస్తుంది.

కానీ తల్లిదండ్రుల అధికారాన్ని—‘శిక్షాదండాన్ని’—ఎన్నడూ దుర్వినియోగం చేయకూడదు. * (సామెతలు 22:15; 29:15) తల్లిదండ్రుల్ని బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “మీ పిల్లలను అతిగా సరిదిద్దకండి లేకపోతే వాళ్ల ధైర్యం నిర్వీర్యమైపోయేలా చేస్తారు.” (కొలొస్సయులు 3:21, ఫిలిప్స్‌) భౌతికంగా శిక్షించడమనేది సాధారణంగా ప్రతిభావంతమైన బోధనా పద్ధతి కాదని కూడా అది అంగీకరిస్తోంది. సామెతలు 17:10 ఇలా చెబుతోంది: “బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.” అంతేగాక, నివారణా శిక్షణను బైబిలు సిఫారసు చేస్తోంది. ద్వితీయోపదేశకాండము 11:19 నందు, తమ పిల్లల్లో నైతిక విలువల్ని నాటేందుకు తల్లిదండ్రులు మామూలు సమయాల్ని ఉపయోగించుకోవాలని వారికి ఉపదేశించబడింది.—ద్వితీయోపదేశకాండము 6:6, 7 కూడా చూడండి.

తల్లిదండ్రులకు బైబిలు ఇచ్చే కాల పరిమితిలేని సలహా సుస్పష్టంగా ఉంది. పిల్లలకు అభిన్నమైన, ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ అవసరం. అలాంటి సలహా నిజంగా పనిచేస్తుందని ఆచరణాత్మకమైన అనుభవం చూపిస్తోంది. *

ప్రజల్ని విభజించే అడ్డుగోడల్ని అధిగమించడం

నేడు ప్రజలు జాతి దేశ భాషా అడ్డుగోడలచే విభజించబడ్డారు. ఇలాంటి కృత్రిమమైన అడ్డుగోడలు, ప్రపంచవ్యాప్తంగా నిర్దోషులైన మానవులు యుద్ధాల్లో వధించబడ్డానికి దోహదపడ్డాయి. గత చరిత్రను పరిశీలించి చూస్తే, వేర్వేరు జాతులకూ దేశాలకూ చెందిన స్త్రీ పురుషులు ఒకరినొకరు సమానమైన వారిగా దృష్టించుకుంటూ, ఒకరితో ఒకరు అలాగే వ్యవహరిస్తూ ఉండే ఉత్తరాపేక్ష నిస్తేజంగా ఉంది. “పరిష్కారం మన హృదయాల్లోనే ఉంది” అని ఒక ఆఫ్రికన్‌ రాజనీతిజ్ఞుడు చెబుతున్నాడు.11 కానీ మానవ హృదయాల్ని మార్చడం అంత సులభమైన పనేమీకాదు. అయితే, బైబిలు సందేశం హృదయాన్ని ఎలా ఆకట్టుకుంటుందో, అందరూ సమానులేనన్న దృక్పథాన్ని ఎలా పెంపొందింపజేస్తుందో పరిశీలించండి.

దేవుడు ‘ఒకనినుండి ప్రతిజాతి మనుష్యులను సృష్టించాడు’ అనే బైబిలు బోధ, జాతి ఉన్నతత్వాన్ని గూర్చిన ఏ తలంపునైనా తీసివేస్తుంది. (అపొస్తలుల కార్యములు 17:26) నిజానికి ఉన్నదొకే ఒక జాతి అనీ అదే మానవ జాతి అనీ ఇది చూపిస్తోంది. అంతేగాక, బైబిలు “దేవునిపోలి నడుచుకొనుడి” అని మనల్ని ప్రోత్సహిస్తూ, ఆ దేవుని గురించి ఇలా చెబుతోంది: “[ఆయన] పక్షపాతి కా[డు] . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (ఎఫెసీయులు 5:1; అపొస్తలుల కార్యములు 10:34, 35) బైబిల్ని గంభీరంగా తీసుకునే వారిపై, దాని బోధల ప్రకారంగా జీవించేందుకు నిజంగా ప్రయత్నించే వారిపై ఈ జ్ఞానం ఐక్యపరిచే ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది, ప్రజలను విభజించే మానవ నిర్మిత అడ్డుగోడల్ని తొలగిస్తూ, మానవ హృదయాంతరాళాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక ఉదాహరణను పరిశీలించండి.

హిట్లర్‌ యూరప్‌ అంతటిలో యుద్ధం చేసినప్పుడు, నిర్దోషులైన మానవుల్ని వధించేపనిలో చేరడాన్ని దృఢంగా తిరస్కరించిన క్రైస్తవుల—యెహోవాసాక్షుల—ఒక గుంపు ఉండేది. వాళ్లు తమ పొరుగువారిపై ‘ఖడ్గమెత్తలేదు.’ దేవున్ని ప్రీతిపర్చాలనే తమ అభిలాషనుబట్టే వాళ్లీ నిర్ణయాన్ని తీసుకున్నారు. (యెషయా 2:3, 4; మీకా 4:3, 5) ఏ దేశమూ లేక ఏ జాతీ ఒకదానికన్నా మరొకటి శ్రేష్ఠమైనది కాదని బైబిలు బోధించేదాన్ని వారు నిజంగా విశ్వసించారు. (గలతీయులు 3:28) శాంతియుతంగా ఉండాలనే తమ నిశ్చయతనుబట్టి, నిర్బంధ శిబిరాల్లో వేయబడిన మొదటి వారిలో యెహోవాసాక్షులు ఉన్నారు.—రోమీయులు 12:18.

బైబిల్ని అనుసరిస్తున్నామని చెప్పుకున్న వాళ్లందరూ అలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం త్వరలోనే జర్మన్‌ ప్రొటెస్టంట్‌ మతగురువైన మార్టిన్‌ నీమోల్లర్‌ ఇలా రాశాడు: “[యుద్ధాల్ని]బట్టి దేవున్ని నిందించాలని అనుకునే వారెవరైనా, వారికి దేవుని వాక్యాన్ని గురించి తెలియదు లేక వారు తెల్సుకోవాలని అనుకోరు. . . . చరిత్రయందంతటా క్రైస్తవ చర్చీలు యుద్ధాల్నీ, సైన్యాల్నీ, ఆయుధాల్నీ ఆశీర్వదించడానికి ఇష్టపడ్డారు. అలాగే . . . యుద్ధంలో తమ శత్రువుల వినాశనం కోసం క్రైస్తవులకు తగని రీతిలో ప్రార్థించారు. ఇదంతా మన తప్పు, మన పితరుల తప్పే కానీ దేవుని నిందించడానికి ఏ విధమైన అవకాశమూ లేదు. యుద్ధంలో సేవచేయడాన్నీ, మనుష్యుల్ని కాల్చి చంపడాన్నీ తిరస్కరించినందుకు వందల వేల సంఖ్యలో నిర్బంధ శిబిరాలకు వెళ్లి, చివరకు మరణించిన ఆసక్తిపరులైన బైబిలు విద్యార్థులు [యెహోవాసాక్షులు] అని పిలువబడినటువంటి మతశాఖ ముందు ఈనాటి క్రైస్తవులమైన మనం సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది.”12

ఈరోజు వరకూ, యెహోవాసాక్షులు తమ సహోదరత్వాన్నిబట్టి—అరబ్బుల్ని, యూదుల్ని, క్రొయెటిషియన్లనూ, సెర్బ్‌లనూ, హుటూలనూ, టుట్సీలనూ ఐక్యపరుస్తున్న సహోదరత్వాన్నిబట్టి—పేరుగాంచారు. అయితే, తాము ఇతరులకన్నా శ్రేష్ఠులైనందున కాదుగానీ తాము బైబిలు సందేశానికున్న శక్తి వలన ప్రేరేపించబడినందుననే అలాంటి ఐక్యత సాధ్యమౌతుందని సాక్షులు వెంటనే అంగీకరిస్తారు.—1 థెస్సలొనీకయులు 2:13.

మంచి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆచరణాత్మకమైన నడిపింపు

ఒకరి మానసిక భావోద్రేక ఆరోగ్యస్థితి అతని భౌతిక ఆరోగ్యాన్ని తరచూ ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, కోపంవల్ల హానికరమైన ప్రభావాలు కల్గుతాయని విజ్ఞానశాస్త్ర అధ్యయనాలు నిర్ధారించాయి. “లభ్యమవుతున్న రుజువులో అధికభాగం సూచించేదేంటంటే త్వరగా కోప్పడే ప్రజలు అనేక కారణాల్నిబట్టి జీర్ణాశయరక్తసంబంధిత రోగాలకు (అలాగే మరితర బలహీనతలకు) గురయ్యే తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారు. ఆ కారణాల్లో స్నేహితుల మద్దతు తగ్గిపోవడమూ, కోప్పడ్డప్పుడు జీవరసాయనక ప్రతిచర్యలు పెరిగిపోవడమూ, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడవేసే ప్రవర్తనల్లో మక్కువ పెరగడమూ వంటివి కూడా ఇమిడి ఉన్నాయి” అని డ్యూక్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌లో బిహేవియరల్‌ రీసెర్చ్‌ డైరెక్టరైన డా. రెడ్‌పోర్డ్‌ విలియమ్స్‌, ఆయన భార్య వర్జీన్యా విలియమ్స్‌ కోపం చంపుతుంది (ఆంగ్లం) అనే తమ పుస్తకంలో చెబుతున్నారు.13

అలాంటి విజ్ఞానశాస్త్ర అధ్యయనాలు చేయడానికి వేలాది సంవత్సరాల మునుపు, బైబిలు సరళంగానే అయినా స్పష్టమైన పదాల్లో మన భావోద్రేక స్థితికీ భౌతిక ఆరోగ్యానికీ మధ్య సంబంధముందని తెలియజేసింది: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్లు.” (సామెతలు 14:30; 17:22) బైబిలు జ్ఞానయుక్తంగా ఇలా సలహా ఇచ్చింది: “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము” మరియు “ఆత్రపడి కోపపడవద్దు.”—కీర్తన 37:8; ప్రసంగి 7:9.

కోపాన్ని అదుపులో పెట్టుకునే విషయంలో బైబిలు సహేతుకమైన సలహాను ఇస్తుంది. ఉదాహరణకు, సామెతలు 19:11 వ వచనం ఇలా తెలియజేస్తోంది: “ఒకని సుబుద్ధి [“అంతర్దృష్టి,” NW] వానికి దీర్ఘశాంతము నిచ్చును. తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” “అంతర్దృష్టి” కొరకు ఉపయోగించే హెబ్రీ పదం, ఏదొక విషయం ఎడలగల “తార్కిక జ్ఞానం”వైపు అవధానాన్ని ఆకట్టుకొనే క్రియాపదం నుండి వచ్చింది.14 “చేయడానికి ముందు ఆలోచించండి” అనేది జ్ఞానయుక్తమైన సలహా. ఇతరులు ఓ నిర్దిష్టమైన విధానంలో మాట్లాడ్డానికీ లేక ప్రవర్తించడానికీ గల అంతర్గత కారణాల్ని గ్రహించేందుకు కృషిచేయడం, ఒకడు తాను మరింత సహించుకోడానికీ అంటే కోపపడకుండా నిదానించేందుకు సహాయపడుతుంది.—సామెతలు 14:29.

కొలొస్సయులు 3:13 వ వచనంలో మరొక ఆచరణాత్మకమైన సలహా ఉంది. అదిలా చెబుతుంది: “ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.” చిన్న చిన్న చికాకులు జీవితంలో ఓ భాగమే. “సహించుచు” అనే పదబంధం, ఇతరుల్లో మనం ఇష్టపడని వాటిని సహించాలని సూచిస్తోంది. ‘క్షమించడం’ అంటే ఆగ్రహాన్ని విడిచిపెట్టడమని అర్థం. కొన్నిసార్లు శత్రుత్వ భావాల్ని మనస్సులో ఉంచుకోవడానికి బదులు వాటిని విడిచిపెట్టడమే జ్ఞానయుక్తమైన పని; కోపాన్ని ఉంచుకోవడం, మన భారాన్ని పెంచుతుందంతే.—“మానవ సంబంధాల విషయంలో ఆచరణాత్మకమైన నడిపింపు” అనే బాక్సును చూడండి.

నేడు, సలహా నడిపింపులు అనేకచోట్ల లభ్యమౌతాయి. కానీ బైబిలు నిజంగా అసమానమైనది. దాని సలహా కేవలం సిద్ధాంతపరమైంది కాదు, దాని సలహా ఎన్నడూ మనకు హానిచేసేదీ కాదు. బదులుగా, దాని జ్ఞానం “ఎంతో విశ్వసనీయమైనది” అని రుజువైంది. (కీర్తన 93:5, NW) అంతేకాకుండా, బైబిలు సలహా కాల పరిమితిలేనిది. దాదాపు 2,000 సంవత్సరాల క్రిందటే దాన్ని రాయడం పూర్తైనప్పటికీ, దాని మాటలు ఇప్పటికీ అన్వయించదగినవే. మన శరీరఛాయ ఏదైనప్పటికీ లేక మనం జీవించే దేశం ఏదైనప్పటికీ అవి సమానమైన ప్రభావంతో వర్తిస్తాయి. బైబిలు మాటలకు శక్తి కూడా ఉంది, అంటే ప్రజల్ని మంచిగా మార్చే శక్తి ఉంది. (హెబ్రీయులు 4:12) ఆ విధంగా, ఆ గ్రంథాన్ని చదవడమూ దాని సూత్రాల్ని అన్వయించుకోవడమూ మీ జీవితాన్ని మెరుగుపర్చగలవు.

[అధస్సూచి]

^ పేరా 13 ‘హత్తుకోవడం’ అని ఇక్కడ అనువదించబడిన దావక్‌ అనే హెబ్రీ పదం “అనురాగ నమ్మకాలతో ఒకరిని అంటిపెట్టుకోవడం అనే భావాన్నిస్తోంది.”4మత్తయి 19:5 వ వచనంలో “హత్తుకొనును” అని అనువదించబడిన గ్రీకు పదానికి “అంటించడం” “అతికించడం” “గట్టిగా కలిపివుంచడం” అనే భావాన్నిచ్చే పదంతో సంబంధంవుంది.5

^ పేరా 18 బైబిలు కాలాల్లో, “దండము” అనే పదానికి (హెబ్రీ షీవత్‌) గొఱ్ఱెల కాపరి ఉపయోగించేలాంటి “కర్ర” లేక “చేతికర్ర” అని భావం ఉండేది.10 ఈ సందర్భంలో శిక్షాదండం, ప్రేమపూర్వకమైన నడిపింపును సూచిస్తుందిగానీ కఠినమైన క్రూరత్వాన్ని కాదు.—కీర్తన 23:4 పోల్చండి.

^ పేరా 19 వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకంలోని “పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి,” “మీ యౌవనులు వర్థిల్లేందుకు సహాయపడండి,” “ఇంట్లో తిరుగుబాటుదారుడు ఉన్నాడా?”, “మీ కుటుంబాన్ని వినాశకర ప్రభావాలనుండి కాపాడండి” అనే అధ్యాయాల్ని చూడండి.

[24వ పేజీలోని బ్లర్బ్‌]

బైబిలు కుటుంబ జీవితాన్ని గూర్చి స్పష్టమైన, సహేతుకమైన సలహాను ఇస్తోంది

[23వ పేజీలోని బ్లర్బ్‌]

హితకరమైన కుటుంబాల లక్షణాలు

అనేక సంవత్సరాల క్రిందట, విద్యావేత్తా కుటుంబ స్పెషలిష్టూ అయిన ఒకామె విస్తృతమైన సర్వే జరిపింది. ఆ సర్వేలో, కుటుంబ సలహాదారులుగా పనిచేస్తున్న 500 కన్నా ఎక్కువమంది నిపుణుల్ని “హితకరమైన” కుటుంబాల్లో వాళ్లు గమనించిన లక్షణాలపై వ్యాఖ్యానించమని ఆమె అడిగింది. వాళ్లు తెలియజేసిన అతి సాధారణమైన లక్షణాలు, బైబిలు చాలా కాలం క్రిందటే సిఫారసు చేసిన లక్షణాలే కావడం ఆసక్తికరమైన విషయం.

పరస్పరసంభాషణా అలవాట్లు, వాళ్లు సిఫారసు చేసిన లక్షణాల్లో ప్రధానమైనవి. అందులో విభేధాల్ని సమన్వయపర్చుకునే ప్రతిభావంతమైన పద్ధతులు చేరివున్నాయి. హితకరమైన కుటుంబాల్లోవున్న సాధారణమైన విజ్ఞత ఏమిటంటే “ఏ వ్యక్తీ మరొకరి ఎడల కోపంగా ఉండి నిద్రపోడు” అని ఆ సర్వే రచయిత్రి తెలియజేసింది.6 కానీ, 1,900 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితమే బైబిలు ఇలా సలహా ఇచ్చింది: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.” (ఎఫెసీయులు 4:26) బైబిలు కాలాల్లో దినాలు ఒక సూర్యాస్తమయం నుండి మరొక సూర్యాస్తమయానికి లెక్కించబడేవి. కాబట్టి, ఆధునిక నిపుణులు కుటుంబాల్ని గురించి అధ్యయనం చేయడానికి ఎంతో కాలం మునుపే బైబిలు జ్ఞానయుక్తంగా ఇలా సలహా ఇచ్చింది: ఆ రోజు ముగిసి మరోరోజు ప్రారంభమవ్వక ముందే విభేదాల్ని త్వరగా పరిష్కరించుకోండి.

హితకరమైన కుటుంబాలు “తాము బయటకు వెళ్లే ముందుగానీ లేక నిద్రపోయే ముందుగానీ వాగ్వివాదానికి దారితీసే స్వభావంగల విషయాల్ని చర్చించవు” అని రచయిత్రి తెలుసుకుంది. “ ‘తగిన సమయం’ అనే పదబంధాన్ని నేను పదే పదే విన్నాను” అని ఆమె తెలియజేసింది.7 అలాంటి కుటుంబాలు తమకు తెలియకుండానే, 2,700 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం క్రిందట రాయబడిన బైబిల్లోని ఈ సామెతను ప్రతిధ్వనింపజేశాయి: “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.” (ఇటాలిక్కులు మావి.) (సామెతలు 15:23; 25:11) ఈ ఉపమానాలంకారం, నగిషీలతోవున్న వెండి పళ్లాలపై పండ్ల ఆకారంలోవున్న బంగారు ఆభరణాలను సూచించవచ్చు. అవి బైబిలు కాలాల్లో విలువైనవిగానూ, అందమైన సంపదలుగానూ దృష్టించబడేవి. ఇది తగిన సమయంలో పల్కిన మాటల సౌందర్యాన్నీ, విలువనూ తెలియజేస్తోంది. ఒత్తిడిగల పరిస్థితుల్లో, తగిన సమయంలో చెప్పబడిన తగిన మాటలు అమూల్యమైనవి.—సామెతలు 10:19.

[26వ పేజీలోని బాక్సు]

మానవ సంబంధాల విషయంలో ఆచరణాత్మకమైన నడిపింపు

“భయమునొంది [“ఆందోళనపడుడి కానీ,” NW] పాపముచేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి.” (కీర్తన 4:4) కోపం పుట్టించే చిన్న చిన్న విషయాలు ఇమిడివున్న అనేకమైన సందర్భాల్లో, మీ మాటల్ని అదుపులో ఉంచుకోవడం జ్ఞానయుక్తం కావొచ్చు, ఆ విధంగా భావోద్రేక దాడిని నివారించవచ్చు.

“కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” (సామెతలు 12:18) మాట్లాడ్డానికి ముందు ఆలోచించండి. అనాలోచితమైన మాటలు ఇతరుల్ని గాయపర్చవచ్చు, స్నేహాన్ని నాశనం చేయవచ్చు.

“మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:1) సాత్వికంతో ప్రతిస్పందించేందుకు ఆశానిగ్రహం అవసరం. అయితే, అది సమస్యల్ని తగ్గించి, శాంతియుతమైన సంబంధాల్ని పెంపొందిస్తుంది.

“కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట; వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.” (సామెతలు 17:14) మీకు కోపం రావడానికి మునుపే అస్థిరమైన పరిస్థితి నుండి మీరు తప్పుకోవడం జ్ఞానయుక్తం.

“ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.” (ప్రసంగి 7:9) క్రియలకన్నా ముందు తరచూ భావోద్రేకాలు కల్గుతాయి. త్వరగా అభ్యంతరపడేవాడు బుద్ధిహీనుడు ఎందుకంటే అది అతడు దురుసుగా మాట్లాడ్డానికి లేక దురుసుగా ప్రవర్తించడానికి కారణంకావచ్చు.

[25వ పేజీలోని చిత్రం]

నిర్బంధ శిబిరాల్లో వేయబడిన మొదటి వారిలో యెహోవాసాక్షులు ఉన్నారు