కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రవచన గ్రంథం

ప్రవచన గ్రంథం

ప్రవచన గ్రంథం

ప్రజలు భవిష్యత్తు గురించి శ్రద్ధ కల్గివున్నారు. వాళ్లు ఆర్థిక సూచనలు మొదలుకొని వాతావరణ సూచనల వరకు అనేకమైన విషయాలకు సంబంధించిన విశ్వసనీయమైన భవిష్యద్‌ నిర్ధారణల కోసం వెదుకుతున్నారు. అయితే, వాళ్లు అలాంటి భవిష్యద్‌ సూచనలకు అనుగుణంగా పనిచేసి, తరచూ నిరుత్సాహానికి గురౌతున్నారు. బైబిల్లో భవిష్యత్తును తెలియజేసే విషయాలుగానీ, ప్రవచనాలుగానీ అనేకం ఉన్నాయి. అలాంటి ప్రవచనాలు ఎంత కచ్చితమైనవి? అవి జరుగక ముందే రాయబడిన సంఘటనలా? లేక జరిగిపోయిన తర్వాత రాయబడిన ప్రవచనాలా?

రోమన్‌ రాజనీతిజ్ఞుడైన కటో (సా.శ.పూ. 234-149) ఇలా అన్నట్లు తెలియజేయబడింది: “ఒక భవిష్యద్‌కారుడు మరొక భవిష్యద్‌కారున్ని చూసి నవ్వకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.”1 నిజానికి, ఈనాటివరకూ అనేకమంది ప్రజలు సోదెగాండ్రనీ, జ్యోతిష్యుల్నీ, మరితర భవిష్యద్‌కారుల్నీ అనుమానిస్తున్నారు. తరచూ వాళ్ల భవిష్యద్‌ వాణులు అనిర్థిష్టమైన పదాల్లో ఉంటాయి. అవి రకరకాల భావాల్ని చెప్పుకోడానికి వీలయ్యే అంశాలుగా ఉంటాయి.

అయితే, బైబిలు ప్రవచనాల విషయమేంటి? వాటిని అనుమానించడానికి కారణముందా? లేక నమ్మడానికి ఆధారముందా?

తెల్సిన సమాచారంపై ఆధారపడిన అంచనాలుకావు

జ్ఞానవంతులైన ప్రజలు భవిష్యత్తును గూర్చి కచ్చితమైన అంచనాలను వేసేందుకు గమనార్హమైన ధోరణుల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ వాళ్లు చెప్పేవన్నీ అన్నివేళలా సరియైనవి కావు. ఫ్యూచర్‌ షాక్‌ అనే పుస్తకం ఇలా తెలియజేస్తోంది: “ప్రతీ సమాజమూ సంభవనీయమైన భావిసంఘటనల పరంపరను మాత్రమేగాక సాధ్యనీయమైన అసంఖ్యాక భావిసంఘటనల్నీ అలాగే ఏవి కోరదగిన సంఘటనలో ఆ భావిసంఘటనలను గూర్చిన వివాదాన్నీ ఎదుర్కొంటున్నాయి.” అది ఇంకా ఇలా తెలియజేసింది: “నిజమే, భవిష్యత్తును గూర్చి పూర్తిగా ఎవ్వరికీ ‘తెలియదు.’ భవిష్యత్తును గూర్చిన మన ఊహల్ని మనం కేవలం క్రమంలో పెట్టగలం, వాటికి మరిన్ని వివరణల్ని ఇవ్వగలం, వాటికి సంభవనీయతను ఆపాదించడానికి ప్రయత్నించగలం.”2

కానీ బైబిలు రచయితలు, భవిష్యత్తును గూర్చిన ‘ఊహలకు’ కేవలం ‘సంభవనీయతను ఆపాదించలేదు.’ లేక భవిష్యత్తును గూర్చిన వ్యాఖ్యానాల్ని, రకరకాల భావాల్ని చెప్పుకోవడానికి ఆస్కారం కల్పించే అనిర్దిష్టమైన కథనాలుగా త్రోసిపుచ్చలేము. దానికి భిన్నంగా, వారి ప్రవచనాల్లో అనేకం ఎంతో స్పష్టంగానూ అసాధారణమైన నిర్దిష్టతతోనూ వచించబడ్డాయి. తరచూ జరిగే అవకాశమున్న వాటికి భిన్నంగా ప్రవచించబడ్డాయి. ప్రాచీన బబులోను పట్టణాన్ని గురించి బైబిలు ముందుగా తెలియజేసినదాన్ని ఒక ఉదాహరణగా తీసుకోండి.

‘నాశనమను చీపురుకట్టతో తుడిచివేయబడడం

ప్రాచీన బబులోను “రాజ్యములకు భూషణము” అయ్యింది. (యెషయా 13:19) అడ్డదిడ్డంగా విస్తరించిన ఈ నగరం, పర్షియన్‌ సింధుశాఖ నుండి మధ్యదరా సముద్రం వరకూవున్న వర్తక మార్గంపై ప్రాముఖ్యమైన స్థలంలో నెలకొల్పబడివుంది. అది తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య భూమిపై చేసే వర్తకాలకూ, సముద్రంపై చేసే వర్తకాలకూ ఓ వాణిజ్య కేంద్రంగా పనిచేస్తూండేది.

బబులోను సా.శ.పూ. ఏడవ శతాబ్దంనాటికి, బబులోను సామ్రాజ్యపు అభేద్యమైన రాజధానిగా కన్పించేది. ఆ నగరం యూఫ్రటీసు నదికి ఇరువైపులా వ్యాపించివుంది. ఆ నదీ జలాలు విశాలమైన లోతైన కందకంగానూ ఒకదానితో మరొకటి కలుపబడిన కాలువలుగానూ రూపొందించబడ్డాయి. అంతేగాకుండా, పటిష్ఠమైన అనేక రక్షణసౌధాలతో కూడిన రెండు వరుసల గోడల సముదాయంతో ఆ నగరం భద్రపరచబడింది. అందులో నివసించేవాళ్లు తాము భద్రంగా ఉన్నామని తలంచడంలో ఆశ్చర్యమేమీలేదు.

అయినప్పటికీ, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో అంటే బబులోను దాని ఉన్నతమైన కీర్తి శిఖరాలకు చేరుకోక మునుపు, బబులోను ‘నాశనమను చీపురుకట్టతో తుడిచివేయబడుతుందని’ ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు. (యెషయా 13:19; 14:22, 23) బబులోను కూలిపోయే తీరును కూడా యెషయా వర్ణించాడు. ముట్టడిదార్లు ఆ నగరాన్ని ముట్టడిచేసేందుకు వీలయ్యేలా దాని నదులను అంటే కందకం వంటి దాని రక్షణ వ్యవస్థకు ఆధారమైన నదులను ‘ఎండిపోయేలా’ చేస్తారు. యెషయా, విజేత పేరు పర్షియా యొక్క గొప్ప రాజైన “కోరెషు” అనీ, “ఆయన ఎదుట ద్వారములు తీయబడతాయి, ఏ తలుపులూ మూయబడవు” అనీ తెలియజేశాడు.—యెషయా 44:27–45:2, ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌.

ఇవి నిర్భయంగా తెలియజేయబడిన భవిష్యద్‌ విషయాలు. కానీ అవి సంభవించాయా? చరిత్ర జవాబు ఇస్తుంది.

‘యుద్ధం లేకుండానే’

యెషయా తన ప్రవచనాన్ని రాసిన రెండు శతాబ్దాల తర్వాత, గొప్పవాడైన కోరెషు ఆధ్వర్యంలో సా.శ.పూ. 539 అక్టోబరు 5న, రాత్రివేళ మాదీయ పారశీక సైన్యాలు బబులోనువద్ద శిబిరం వేశాయి. అయితే, బబులోనీయులు నిర్భయంగా ఉన్నారు. (సా.శ.పూ. ఐదవ శతాబ్దానికి చెందిన) గ్రీకు చరిత్రకారుడైన హెరొడటస్‌ అభిప్రాయం ప్రకారం, అనేక సంవత్సరాల వరకూ సరిపడే పదార్థాలను వాళ్లు భద్రపర్చుకున్నారు.3 వాళ్లను కాపాడేందుకు యూఫ్రటీసు నదీ, పటిష్ఠమైన బబులోను గోడలూ ఉన్నాయి. అయినప్పటికీ, నబొనిడస్‌ వృత్తాంతం చెబుతున్నట్లుగా అదే రాత్రి “కోరెషు సైన్యాలు యుద్ధం లేకుండానే బబులోనులోనికి ప్రవేశించాయి.”4 అదెలా సాధ్యమైంది?

ఆ నగరంలోపల ప్రజలు “నాట్యంచేస్తూ, పండుగ దినాన వేడుక చేసుకుంటున్నారు” అని హెరొడటస్‌ వివరిస్తున్నాడు.5 అయితే, బయట కోరెషు యూఫ్రటీసు నదీ జలాల్ని ప్రక్కకు మళ్లించాడు. నీటి మట్టం తగ్గిపోగానే, అతని సైన్యాలు తొడల వరకూ నీళ్లున్న నదీతలంగుండా ప్రవేశించాయి. వాళ్లు రక్షణ సౌధాలతో కూడిన ఎత్తైన గోడల్ని దాటి, “నదిలోకి తెరుచుకునే ద్వారాలు” అని హెరొడటస్‌ పిలిచిన ద్వారాలలో నుండి, అంటే నిర్లక్ష్యంగా తెరిచివుంచబడిన ద్వారాలలో నుండి ప్రవేశించారు.6 (దానియేలు 5:1-4; యిర్మీయా 50:24; 51:31, 32 పోల్చండి.) (దాదాపు సా.శ.పూ. 431-352 నాటికి చెందిన) జెనొఫొన్‌తోపాటూ ఇతర చరిత్రకారులూ, పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్న శరాకారలిపి పలకలూ కోరెషు చేతిలో బబులోను ఆకస్మికంగా కూలిపోవడాన్ని ధ్రువపరుస్తున్నాయి.7

బబులోనును గూర్చిన యెషయా ప్రవచనం అలా నెరవేరింది. లేక ఇది నిజంగా నెరవేరిన ప్రవచనం కాదంటారా? ఇది ఓ ప్రవచనంగాక, బబులోను కూలిపోయిన తర్వాత వ్రాయబడిన చరిత్రకావడం సాధ్యమేనా? వాస్తవానికి, బైబిల్లోని ఇతర ప్రవచనాల గురించీ ఇదే విధంగా అడుగవచ్చు.

చరిత్ర ప్రవచనపు ముసుగు వేసుకుందా?

యెషయాతోసహా బైబిలు ప్రవక్తలు, జరిగిపోయిన చారిత్రక సంఘటనల్ని గనుక ప్రవచనంలా కన్పించేందుకు అవి జరిగిన తర్వాత వాటిని రాసినట్లైతే, వాళ్లు తెలివైన మోసగాండ్రవుతారంతే. కానీ అలాంటి కుయుక్తిని పన్నడానికి వాళ్ల మనో దృక్పథం ఏమైవుండవచ్చు? నిజమైన ప్రవక్తలు తాము లంచానికి లొంగిపోమని నిస్సంకోచంగా తెలియజేశారు. (1 సమూయేలు 12:3; దానియేలు 5:17) బైబిలు రచయితలు (వీరిలో అనేకులు ప్రవక్తలు) కలవరపరిచే తమ స్వంత తప్పుల్ని కూడా బయల్పర్చుకోవడానికి సిద్ధపడిన విశ్వసనీయులైన పురుషులనే శక్తివంతమైన రుజువును మనం ఇప్పటికే పరిశీలించాం. ఇలాంటి మనుష్యులు, చరిత్రను ప్రవచనంలా రాసే భారీఎత్తు మోసాలు చేయడానికి మ్రొగ్గుచూపుతారనే విషయం అనుచితమైనదిగా కనబడుతోంది.

మరొకటి కూడా పరిశీలించాల్సివుంది. బైబిల్లోని అనేక ప్రవచనాల్లో ప్రవక్తల స్వంత జనాంగాన్ని గూర్చిన కటువైన అధిక్షేపణలు ఉన్నాయి. అలా అధిక్షేపించబడిన జనాంగంలో యాజకులూ, పాలకులూ చేరివున్నారు. ఉదాహరణకు, యెషయా తన కాలంలోని ఇశ్రాయేలీయుల యొక్క—నాయకుల యొక్క, ప్రజల యొక్క—దిగజారిపోయిన నైతిక పరిస్థితిని ఖండించాడు. (యెషయా 1:2-10) యాజకుల పాపాల్ని ఇతర ప్రవక్తలు శక్తివంతంగా బయల్పర్చారు. (జెఫన్యా 3:4; మలాకీ 2:1-9) తమ స్వంత ప్రజలకు వ్యతిరేకంగా ఊహించదగినంత కఠోరమైన అభిశంసనను కల్గివున్న ప్రవచనాల్ని వాళ్లు ఎందుకు రూపొందిస్తారు, మరి అలాంటి కుతంత్రంలో యాజకులు ఎందుకు సహకరిస్తారు అనే విషయాన్ని ఊహించడమే కష్టం.

అంతేకాకుండా, ఆ ప్రవక్తలు గనుక నయవంచకులే అయితే, అటువంటి కూటరచన చేయడంలో వాళ్లెలా సఫలీకృతులయ్యేవారు? ఇశ్రాయేలీయుల్లో అక్షరాస్యత ప్రోత్సహించబడింది. చిన్నప్పటినుండీ పిల్లలకు ఎలా చదవాలో, రాయాలో బోధించబడేది. (ద్వితీయోపదేశకాండము 6:6-9) లేఖనాల్ని వ్యక్తిగతంగా చదువుకోవాలని ఉద్బోధించబడింది. (కీర్తన 1:2) ప్రతీ వారం విశ్రాంతి దినాన సమాజమందిరంలో లేఖనాల్ని బహిరంగంగా చదివేవారు. (అపొస్తలుల కార్యములు 15:21) అక్షరాస్యులునూ లేఖనాలను బాగా ఎరిగివున్న వారూ అయిన యావత్‌ జనాంగాన్నీ అలాంటి వంచనతో మోసగించడం అసంభవంగా కనబడుతోంది.

అంతేగాక, బబులోను కూలిపోవడాన్ని గూర్చిన యెషయా ప్రవచనంలో ఇంకా ఎంతోవుంది. సంఘటన జరిగిపోయిన తర్వాత రాసివుండే సాధ్యతలేని ఓ వివరణ కూడా ఆ ప్రవచనంలో చేరివుంది.

“అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు”

బబులోను కూలిపోయిన తర్వాత దాని గతి ఏమౌతుంది? యెషయా ఇలా ప్రవచించాడు: “అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు. తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు. అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు.” (యెషయా 13:20) అలాంటి అనుకూల పరిస్థితిగల నగరం ఎన్నటికీ నివాసయోగ్యంగా ఉండదని ప్రవచించడం వింతగా కన్పించవచ్చు. బబులోను నాశనాన్ని చూసిన తర్వాతనే యెషయా ఆ మాటలు రాసివుంటాడా?

కోరేషు ఆక్రమించిన తర్వాత, బబులోను అధమస్థాయిలో ఉన్నప్పటికీ, అనేక శతాబ్దాల వరకూ అది నివాసయోగ్యంగానే ఉంది. మృత సముద్రపు గ్రంథపు చుట్టలలో, సా.శ.పూ. రెండవ శతాబ్దంనాటిదని తేలిన యెషయా గ్రంథం యొక్క పూర్తి చుట్ట ప్రతి కూడా ఉందని జ్ఞాపకం చేసుకోండి. ఆ గ్రంథపు చుట్ట నకలుచేయబడుతున్న కాలంలో బబులోను పార్తీయుల ఆధీనంలోవుంది. సా.శ. మొదటి శతాబ్దంలో, యూదులు బబులోనులో నివసిస్తూండేవారు. బైబిలు రచయితయైన పేతురు అక్కడకు వెళ్లాడు. (1 పేతురు 5:13) అప్పటికి దాదాపు రెండు శతాబ్దాలనుండి మృత సముద్రపు యెషయా గ్రంథపు చుట్ట ఉనికిలోవుంది. కాబట్టి, సా.శ. మొదటి శతాబ్దం నాటికి బబులోను పూర్తిగా నాశనం చేయబడలేదు, కానీ యెషయా గ్రంథం అంతకు మునుపే పూర్తి చేయబడింది. *

ప్రవచించబడినట్లుగానే, బబులోను కేవలం “కసువు దిబ్బలుగా” మారింది. (యిర్మీయా 51:37) (సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన) హెబ్రీ పండితుడైన జెరోమ్‌ అభిప్రాయం ప్రకారం, బబులోను ఆయన కాలానికెల్లా వేటాడే స్థలంగా మారింది. అందులో “సకల మృగాలు” తిరిగేవి.9 బబులోను ఈనాటి వరకూ నిర్మానుష్యంగానే ఉంది.

నిర్మానుష్యంగా తయారైన బబులోనును చూడ్డానికి యెషయా జీవించిలేడు. కానీ ఆధునిక ఇరాక్‌ దేశంలో బాగ్దాద్‌ నగరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరానవున్న ఒకప్పటి అతి శక్తివంతమైన నగరపు శిథిలాలు, “అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు” అని యెషయా చెప్పిన మాటల నెరవేర్పుకు మౌనసాక్ష్యంగా ఉన్నాయి. పర్యటనకు ఆకర్షణీయమైన స్థలంగా బబులోనును తీర్చిదిద్దేందుకు చేసే పునరుద్ధరణలు ఏవైనా సందర్శకుల్ని ఆకట్టుకోవచ్చేమో కానీ బబులోను ‘కుమారుడూ మనుమడూ’ శాశ్వతంగా గతించిపోయారు.—యెషయా 13:20; 14:22, 23.

ఆ విధంగా, ప్రవక్తయైన యెషయా భవిష్యత్తులో జరగబోయే దేనికైనా సరిగ్గా అతికినట్లుండే అస్పష్టమైన ప్రవచనాల్ని ప్రవచించలేదు. లేక చరిత్రను ప్రవచనంలా కన్పించే విధంగా ఆయన తిరగరాయనూ లేదు. దీన్ని గురించి ఆలోచించండి: తనకు బొత్తిగా పట్టులేని విషయంపై—శక్తివంతమైన బబులోను మరెన్నడూ నివాసయోగ్యంగా ఉండదనే విషయంపై—“ప్రవచించేందుకు” ఓ మోసగాడు ఎందుకు తెగిస్తాడు?

బబులోను కూలిపోవడాన్ని గూర్చిన ఈ ప్రవచనం, బైబిల్లోని ఒక ఉదాహరణ మాత్రమే. * బైబిలు మానవుని కన్నా ఉన్నతమైన మూలం నుండి వచ్చిందనే ఓ సూచనను దాని ప్రవచన నెరవేర్పుల్లో అనేకమంది ప్రజలు చూస్తారు. ఈ ప్రవచన గ్రంథం కనీసం పరిశీలనకు యోగ్యమైందని బహుశా మీరు అంగీకరించవచ్చు. ఒక విషయం మాత్రం స్పష్టం: భవిష్యత్తును తెలియజేసే ఆధునికదిన వ్యక్తుల అస్పష్టమైన, సంచలనాత్మకమైన భవిష్యద్‌ వాణులకూ, స్పష్టమైన, తేటతెల్లమైన నిర్దిష్టమైన బైబిలు ప్రవచనాలకూ మధ్య ఎంతో తేడావుంది.

[అధస్సూచీలు]

^ పేరా 24 యెషయా గ్రంథంతోపాటూ హెబ్రీ లేఖన గ్రంథాలన్నీ సా.శ. మొదటి శతాబ్దానికి ఎంతోకాలం ముందుగానే రాయడం పూర్తయ్యాయి అని అనడానికి బలమైన రుజువుంది. (సా.శ. మొదటి శతాబ్దానికి చెందిన) చరిత్రకారుడైన జోసీఫస్‌ తాను జీవించిన కాలానికన్నా ఎంతో ముందుగానే హెబ్రీ లేఖనాల ప్రామాణిక గ్రంథ సంగ్రహణ జరిగిందని సూచించాడు.8 అంతేగాక, గ్రీకు సెప్టాజింట్‌—గ్రీకులోనికి హెబ్రీ లేఖనాల అనువాదం—సా.శ.పూ. మూడవ శతాబ్దంలో ఆరంభమై, సా.శ.పూ. రెండవ శతాబ్దంనాటికి పూర్తిచేయబడింది.

^ పేరా 28 బైబిలు ప్రవచనాల్ని గూర్చిన, మరి వాటి నెరవేర్పును రుజువుపరుస్తున్న చారిత్రాత్మక వాస్తవాల్ని గూర్చిన మరింత చర్చ కొరకు, వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) పుస్తకంలోని 117-33 పేజీలను దయచేసి చూడండి.

[28వ పేజీలోని చిత్రం]

బైబిలు రచయితలు యథార్ధవంతులైన ప్రవక్తలా లేక తెలివైన మోసగాండ్రా?

[29వ పేజీలోని చిత్రం]

ప్రాచీన బబులోను శిథిలాలు