కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 3

“యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు”

“యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు”

1, 2.యెషయా ప్రవక్తకు ఎలాంటి దర్శనం ఇవ్వబడింది, అది యెహోవా గురించి మనకేమి బోధిస్తోంది?

 యెషయా తన కళ్లెదుట దృశ్యాన్ని అంటే దేవుడిచ్చిన దర్శనాన్ని చూసి భక్తిపూర్వక భయంతో నిండిపోయాడు. ఆయనకు అదెంత వాస్తవికంగా తోచిందో గదా! ఆ తర్వాత ఆయన, అత్యున్నత సింహాసనంపై ‘యెహోవా ఆసీనుడై ఉండగా చూశాను’ అని వ్రాశాడు. యెహోవా చొక్కాయి అంచులు యెరూషలేము మహా దేవాలయాన్ని నిండుకొన్నాయి.—యెషయా 6:1, 2.

2 ఆలయ పునాదులు కదిలేలా చేసిన గీతాల మహాశబ్దం విని కూడా యెషయా భక్తిపూర్వక భయంతో నిండిపోయాడు. ఉన్నతశ్రేణికి చెందిన ఆత్మసంబంధ ప్రాణులైన సెరాపులు ఆ గీతం పాడుతున్నారు. వారు గౌరవపూర్వకంగా సులభమైన పదాలతో “సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది” అని శ్రావ్యంగా పాడుతున్నారు. (యెషయా 6:3, 4) “పరిశుద్ధుడు” అనే మాటను మూడుసార్లు పాడడం దానికి ప్రత్యేక గుర్తింపునిస్తోంది. అది సబబే, ఎందుకంటే యెహోవా సర్వోన్నత స్థాయిలో పరిశుద్ధుడు. (ప్రకటన 4:8) యెహోవా పరిశుద్ధత బైబిలంతటా నొక్కిచెప్పబడింది. వందలాది లేఖనాల్లో “పరిశుద్ధుడు” లేదా “పరిశుద్ధత” అనే పదాలు ఆయన పేరుతో కలిపి చెప్పబడ్డాయి.

3.యెహోవా పరిశుద్ధత గురించిన తప్పుడు దృక్పథాలు చాలామంది దేవునికి సన్నిహితమవడానికి బదులు ఆయనకు దూరమవడానికి ఎలా దారితీస్తాయి?

3 దీనినిబట్టి, ప్రాథమికంగా మనం యెహోవా గురించి తెలుసుకోవాలని ఆయన కోరేవాటిలో ఆయన పరిశుద్ధుడు అని గ్రహించడం ఒకటని స్పష్టమవుతోంది. కానీ నేడు చాలామంది ఆ తలంపునే దగ్గరకు రానివ్వరు. కొందరు పరిశుద్ధతను స్వనీతికి లేదా బూటకపు దైవభక్తికి తప్పుగా ముడిపెడుతున్నారు. ఆత్మాభిమాన లోపంతో సంఘర్షించే మరి కొందరికి దేవుని పరిశుద్ధత ఆకట్టుకునేదిగా కాకుండా భయపెట్టేదిగా ఉండవచ్చు. ఈ పరిశుద్ధ దేవునికి సన్నిహితమవడానికి తామెన్నటికీ అర్హులం కాలేమని వారు భయపడవచ్చు. ఆ కారణంగా, చాలామంది దేవుని పరిశుద్ధతనుబట్టి ఆయనకు దూరమవుతున్నారు. అది విచారకరం, ఎందుకంటే దేవునికి సన్నిహితమవడానికి నిజానికి ఆయన పరిశుద్ధతే ఒక బలమైన కారణం. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఆ ప్రశ్నకు జవాబివ్వడానికి ముందు మనం నిజమైన పరిశుద్ధత అంటే ఏమిటో పరిశీలిద్దాం.

పరిశుద్ధత అంటే ఏమిటి?

4, 5.(ఎ)పరిశుద్ధత అంటే ఏమిటి, ఏది దానర్థం కాదు? (బి) ప్రాముఖ్యమైన ఏ రెండు విధాలుగా యెహోవా “వేరుగా” ఉన్నాడు?

4 దేవుడు పరిశుద్ధుడు అంటే దానర్థం ఆయన అతిగా ఆత్మసంతృప్తి గలవాడని, అహంకారియని లేదా ఇతరులను ఏవగించుకొనేవాడని కాదు. దానికి భిన్నంగా ఆయన అలాంటి లక్షణాలను అసహ్యించుకుంటాడు. (సామెతలు 16:5; యాకోబు 4:6) అట్లయితే, “పరిశుద్ధత” అనేమాటకు నిజమైన అర్థమేమిటి? బైబిలు సంబంధిత హీబ్రూలో ఆ మాట “వేరైన” అనే భావమున్న పదం నుండి వచ్చింది. ఆరాధనలో “పరిశుద్ధత,” సాధారణ వాడుకకు వేరుగా ఉన్నదానికి లేదా పవిత్రమని పరిగణించే దానికి అన్వయిస్తుంది. పరిశుభ్రత, స్వచ్ఛత అనే భావాన్ని కూడా పరిశుద్ధత బలంగా అందజేస్తోంది. ఈ మాట యెహోవాకు ఎలా అన్వయిస్తుంది? అంటే ఆయన అపరిపూర్ణ మానవుల నుండి వేరుగా, మనకు దూరంగా ఉంటాడని దానర్థమా?

5 ఎంతమాత్రమూ కాదు. ‘ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునిగా’ యెహోవా తన ప్రజలు పాపులే అయినప్పటికీ వారి ‘మధ్య’ తాను నివసిస్తున్నట్లు తనను తాను వర్ణించుకున్నాడు. (యెషయా 12:6; హోషేయ 11:9) కాబట్టి ఆయన పరిశుద్ధత ఆయనను దూరంగా ఉంచదు. అలాగైతే ఆయన ఏ భావంలో “వేరుగా” ఉన్నాడు? రెండు ప్రాముఖ్యమైన విధాలుగా అని చెప్పవచ్చు. మొదటిగా, ఆయన సర్వసృష్టికి వేరుగా ఉన్నాడు అంటే ఆయన మాత్రమే మహోన్నతుడు. ఆయన స్వచ్ఛత, పరిశుభ్రత సంపూర్ణమైనది, అపరిమితమైనది. (కీర్తన 40:5; 83:18) రెండవదిగా, సమస్త పాపంనుండి యెహోవా పూర్తిగా వేరుగా ఉన్నాడు, అలా ఉండడం మనకు ఓదార్పుకరం. ఎందుకు?

6.పాపం నుండి యెహోవా మొత్తానికే వేరుగా ఉండడంలో మనమెందుకు ఓదార్పు పొందవచ్చు?

6 నిజమైన పరిశుద్ధత అరుదుగా కనబడే లోకంలో మనం జీవిస్తున్నాం. దేవునినుండి దూరమైన మానవ సమాజంలో ప్రతీదీ ఏదోకరీతిలో కలుషితమై, పాపంతోనూ అపరిపూర్ణతతోనూ మలినమై ఉంది. మనమందరం మనలోని పాపానికి వ్యతిరేకంగా పోరు సాగించాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పాపం మనల్ని కబళించే ప్రమాదంలో మనమందరం ఉన్నాము. (రోమీయులు 7:15-25; 1 కొరింథీయులు 10:12) యెహోవాకు అలాంటి ప్రమాదం సంభవించే అవకాశం ఎంతమాత్రం లేదు. పాపానికి ఆయన పూర్తిగా వేరుగా ఉండడంవల్ల ఆయనలో లేశమాత్రమైనా పాప మాలిన్యపు జాడ కనబడదు. ఇది యెహోవా ఆదర్శప్రాయుడైన తండ్రి అనే మన నమ్మకాన్ని ధృవీకరిస్తుంది, ఎందుకంటే ఆయన సంపూర్ణంగా నమ్మదగినవాడని దీనర్థం. పాపులైన అనేకమంది మానవ తండ్రుల్లా యెహోవా ఎన్నడూ అవినీతిపరునిగా, అనైతిక వ్యక్తిగా లేదా హానికారకునిగా తయారుకాడు. ఆయన పరిశుద్ధత, అలాంటి వాటిని చేయడం అసాధ్యమయ్యేలా చేస్తుంది. ఆయా సందర్భాల్లో యెహోవా తన సొంత పరిశుద్ధతతోడని ప్రమాణం కూడా చేశాడు, ఎందుకంటే అంతకంటే నమ్మకమైనది మరొకటి ఉండజాలదు. (ఆమోసు 4:1) అది అభయమిచ్చేదిగా లేదా?

7.పరిశుద్ధత యెహోవా సహజసిద్ధ స్వభావమని ఎందుకు చెప్పవచ్చు?

7 పరిశుద్ధత యెహోవా సహజసిద్ధ స్వభావం. దానర్థమేమిటి? ఉదాహరణకు, “మానవుడు,” “అపరిపూర్ణత” అనే మాటల్ని పరిశీలించండి. అపరిపూర్ణత ప్రస్తావన లేకుండా మానవుడిని మీరు వర్ణించలేరు. అపరిపూర్ణత మన అణువణువునా అలుముకొని మనం చేసే ప్రతీ పనిపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు దీనికి పూర్తిగా భిన్నమైన రెండు పదాలను అంటే “యెహోవా,” “పరిశుద్ధత” అనేవాటిని పరిశీలించండి. పరిశుద్ధత యెహోవాలో వ్యాపించివుంది. ఆయన గురించిన ప్రతీది పరిశుభ్రం, స్వచ్ఛం, గౌరవనీయం. “పరిశుద్ధత” అనే ఈ గంభీర పదాన్ని లోతుగా పరిశీలించి గ్రహించకుండా యెహోవా నిజంగా ఎలాంటివాడో మనం తెలుసుకోలేము.

“యెహోవా పరిశుద్ధుడు”

8, 9.పరిమిత భావంలో పరిశుద్ధులుగా ఉండేలా యెహోవా అపరిపూర్ణ మానవులకు సహాయం చేస్తాడని ఏది చూపిస్తోంది?

8 పరిశుద్ధతా లక్షణానికే యెహోవా ప్రతిరూపం కాబట్టి, ఆయనే సమస్త పరిశుద్ధతకు మూలాధారమని సరిగా చెప్పవచ్చు. స్వార్థబుద్ధితో ఆయన ఈ ప్రశస్త లక్షణాన్ని దాచుకోవడం లేదు; దానిని ఆయన ఉదారంగా ఇతరులకు పంచుతున్నాడు. మండుతున్న పొదదగ్గర దేవదూత ద్వారా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, యెహోవానుబట్టి ఆ చుట్టుప్రక్కల ప్రదేశం సైతం పరిశుద్ధంగా తయారైంది.—నిర్గమకాండము 3:5.

9 యెహోవా సహాయంతో అపరిపూర్ణ మానవులు పరిశుద్ధులు కాగలరా? కావచ్చు, కానీ పరిమిత భావంలోనే. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు “పరిశుద్ధమైన జనముగా” తయారుకాగల ఉత్తరాపేక్షను వారి ఎదుట ఉంచాడు. (నిర్గమకాండము 19:6) ఆయన ఆ జనాంగానికి పరిశుద్ధమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన ఆరాధనా విధానాన్నిచ్చి వారిని ఆశీర్వదించాడు. కాబట్టి పరిశుద్ధత మోషే ధర్మశాస్త్రంలో పదే పదే ప్రస్తావించబడిన అంశం. నిజానికి, ప్రధాన యాజకుడు బంగారు రేకు తగిలించిన పాగా ధరించేవాడు, వెలుగులో అది మెరుస్తుండడాన్ని అందరూ చూడగలిగేవారు. “యెహోవా పరిశుద్ధుడు” అని చెక్కబడిన మాటలు దానిమీద ఉండేవి. (నిర్గమకాండము 28:36) కాబట్టి పరిశుభ్రత, స్వచ్ఛతల ఉన్నత ప్రమాణం వారి ఆరాధనను, నిజానికి వారి జీవన విధానాన్ని భిన్నంగా ఉంచింది. యెహోవా వారికిలా చెప్పాడు: “మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.” (లేవీయకాండము 19:2) అపరిపూర్ణ మానవులుగా తమకు సాధ్యమైనంత మేరకు ఇశ్రాయేలీయులు దేవుని ఉపదేశం ప్రకారం జీవించినంత కాలం, వారు పరిమిత భావంలో పరిశుద్ధులుగానే ఉన్నారు.

10.పరిశుద్ధతకు సంబంధించి ప్రాచీన ఇశ్రాయేలుకు దాని చుట్టుప్రక్కల జనాంగాలకు ఎలాంటి భిన్నత్వం ఉంది?

10 పరిశుద్ధతకు ఇవ్వబడిన ఈ ప్రాధాన్యత, ఇశ్రాయేలీయుల చుట్టుప్రక్కల జనాంగాల ఆరాధనకు పూర్తి భిన్నంగా ఉంది. ఆ అన్యజనాంగాలు బలత్కారులుగా, దురాశపరులుగా, దుర్నీతిపరులుగా చిత్రీకరించబడిన దేవతలను, ఉనికిలేని నకిలీ దేవతలను ఆరాధించాయి. ప్రతీ విషయంలో వారు అశుద్ధులుగా ఉన్నారు. అలాంటి దేవతల ఆరాధన ప్రజలను అశుద్ధులుగా చేసింది. అందుకే, యెహోవా తన సేవకులను అన్య ఆరాధకుల నుండి, వారి కలుషిత మత అభ్యాసాల నుండి వేరుగా ఉండమని హెచ్చరించాడు.—లేవీయకాండము 18:24-28; 1 రాజులు 11:1, 2.

11.యెహోవా పరలోక సంస్థ పరిశుద్ధత (ఎ) దేవదూతల్లో (బి) సెరాపుల్లో (సి) యేసులో ఎలా స్పష్టమవుతోంది?

11 ఎంత చేసినా, యెహోవా ఎంచుకున్న ఆ ప్రాచీన ఇశ్రాయేలు జనాంగం దేవుని పరలోక సంస్థ పరిశుద్ధతను ఆవగింజంత మాత్రమే ప్రతిబింబించగలిగింది. యథార్థంగా దేవుని సేవిస్తున్న లక్షలాది ఆత్మసంబంధ ప్రాణులు “వేవేల పరిశుద్ధ సమూహములు” అని పిలువబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 33:2; యూదా 14) దేవుని పరిశుద్ధత యొక్క ప్రకాశవంతమైన, స్వచ్ఛమైన సౌందర్యాన్ని వారు పరిపూర్ణంగా ప్రతిబింబిస్తారు. యెషయా తన దర్శనంలో చూసిన సెరాపులను జ్ఞాపకం తెచ్చుకోండి. విశ్వమంతటిలో యెహోవా పరిశుద్ధతను తెలియజేయడంలో ఈ బలమైన ఆత్మసంబంధ ప్రాణులు ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని వారి పాటలోని పదాలు సూచిస్తున్నాయి. అయితే, ఆత్మసంబంధమైన ఒక ప్రాణి మాత్రం వారందరికంటే పైగా ఉన్నాడు ఆయనే దేవుని అద్వితీయకుమారుడు. యెహోవా పరిశుద్ధతకు యేసు సర్వోన్నత ప్రతిబింబంగా ఉన్నాడు. సముచితంగానే, ఆయన ‘దేవుని పరిశుద్ధునిగా’ తెలియబడ్డాడు.—యోహాను 6:68, 69.

పరిశుద్ధ నామం, పరిశుద్ధాత్మ

12, 13.(ఎ)దేవుని నామం యుక్తంగానే పరిశుద్ధమని ఎందుకు వర్ణించబడింది? (బి) దేవుని నామం ఎందుకు పరిశుద్ధపరచబడాలి?

12 దేవుని నామం విషయమేమిటి? మొదటి అధ్యాయంలో మనం చూసినట్లుగా, ఆ పేరు కేవలం ఒక బిరుదు లేదా లేబులు కాదు. అది యెహోవా దేవునికి ప్రతీకగా ఆయన లక్షణాలన్నింటిని వర్ణిస్తుంది. కాబట్టే ఆయన “నామము పరిశుద్ధమైనది” అని బైబిలు మనకు తెలియజేస్తోంది. (కీర్తన 111:9) మోషే ధర్మశాస్త్రం దేవుని పేరును దూషించడం మరణ శిక్షార్హమైన నేరంగా పేర్కొంది. (లేవీయకాండము 24:16) ప్రార్థనలో యేసు దేనిని ప్రధమాంశంగా పేర్కొన్నాడో గమనించండి: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్తయి 6:9) దేనినైనా పరిశుద్ధం చేయడమంటే దానిని పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా ప్రత్యేకించడమని భావం. అయితే సంపూర్ణ స్వచ్ఛతగల దేవుని సొంత పేరు ఎందుకు పరిశుద్ధపరచబడాలి?

13 దేవుని పరిశుద్ధ నామం అబద్ధాలతో, అపనిందతో ముట్టడించబడి మలినపరచబడింది. ఏదెనులో సాతాను, యెహోవా గురించి అబద్ధాలుచెప్పి ఆయన అన్యాయపు సర్వాధిపతి అని సూచించాడు. (ఆదికాండము 3:1-5) అప్పటినుండి, ఈ అపరిశుద్ధ లోకానికి పాలకుడైన సాతాను దేవుని గురించి అబద్ధాలు ఎక్కువయ్యేటట్లు చేశాడు. (యోహాను 8:44; 12:31; ప్రకటన 12:9) మతాలు దేవుణ్ణి నిరంకుశునిగా, దూరంగా ఉండేవానిగా లేదా క్రూరునిగా చిత్రించాయి. తాముచేసిన రక్తపాత యుద్ధాల్లో తమకు దేవుని మద్దతు ఉన్నట్లు వారు చెప్పుకున్నారు. దేవుని అద్భుత సృష్టికార్యాల ఘనతను వారు తరచూ గుడ్డిగా జరిగిన యాదృచ్ఛిక సంఘటనకు లేదా పరిణామానికి ఇవ్వడం జరుగుతోంది. అవును, ద్రోహబుద్ధితో దేవుని పేరు అపరిశుద్ధం చేయబడుతోంది. అది పరిశుద్ధపరచబడాలి; దాని న్యాయమైన మహిమ పునరుద్ధరించబడాలి. ఆయన నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన సర్వాధిపత్య సత్యసంధత నిరూపించబడాలని మనం కోరుకుంటాం, అలాగే ఆ మహిమాన్విత సంకల్పంలో ఏ పాత్ర పోషించడానికైనా మనం సంతోషిస్తాం.

14.దేవుని ఆత్మ పరిశుద్ధమని ఎందుకు పిలువబడింది, పరిశుద్ధాత్మను దూషించడం ఎందుకు మరణకరం?

14 యెహోవాతో విడదీయరాని విధంగా జతచేయబడినదీ ఇంచుమించు ఎల్లప్పుడూ పరిశుద్ధమని పిలువబడేదీ ఒకటుంది, అదే ఆయన ఆత్మ లేదా చురుకైన శక్తి. (ఆదికాండము 1:2) యెహోవా తన సంకల్పాలు నెరవేర్చడానికి ఈ తిరుగులేని శక్తిని ఉపయోగిస్తాడు. దేవుడు తాను చేసే సమస్తాన్ని పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, పరిశుభ్రమైన రీతిలో జరిగిస్తాడు, అందుకే ఆయన చురుకైన శక్తికి సముచితంగానే పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధమైన ఆత్మ అనే పేరు పెట్టబడింది. (లూకా 11:13; రోమీయులు 1:1-7) దేవుని పరిశుద్ధాత్మను దూషించడం, అంటే బుద్ధిపూర్వకంగా యెహోవా సంకల్పాలకు వ్యతిరేకంగా పనిచేయడం క్షమార్హంకాని పాపమవుతుంది.—మార్కు 3:29.

యెహోవా పరిశుద్ధత మనల్ని ఆయనవద్దకు ఎందుకు ఆకర్షిస్తుంది

15.యెహోవా పరిశుద్ధతకు, దైవ భయం కలిగివుండడం ఎందుకు సరైన ప్రతిస్పందనగా ఉంది, అలాంటి భయంలో ఏమి ఇమిడివుంది?

15 కాబట్టి దేవుని పరిశుద్ధతకు, మానవులు చూపాల్సిన దైవ భయానికి బైబిలు ఎందుకు సంబంధం కలుపుతుందో గ్రహించడం కష్టం కాదు. ఉదాహరణకు, కీర్తన 99:3 ఇలా చెబుతోంది: “భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు.” కానీ ఈ భయం అనారోగ్యకరమైన భీతి కాదు. బదులుగా, అది లోతైన భక్తిపూర్వక భయం, అత్యున్నత రీతిలోచూపే గౌరవం. దేవుని పరిశుద్ధత మనకంటే ఎంతో ఎత్తులో ఉన్నందున, అలా భావించడం యుక్తమే. అది ప్రకాశవంతమైన పరిశుభ్రతతో, మహిమతో ఉంది. అయినాసరే, అది మనల్ని పారద్రోలకూడదు. దానికి భిన్నంగా, దేవుని పరిశుద్ధత గురించిన సరైన దృష్టి మనల్ని ఆయనకు సన్నిహితం చేస్తుంది. కారణమేమిటి?

సౌందర్యం ఆకర్షించినట్లుగానే, పరిశుద్ధత మనల్ని ఆకర్షించాలి

16.(ఎ)పరిశుద్ధతకు సౌందర్యం ఎలా జతచేయబడింది? ఒక ఉదాహరణ చెప్పండి. (బి) దర్శన సంబంధమైన వర్ణనలు యెహోవా పరిశుభ్రతను, స్వచ్ఛతను, వెలుగును ఎలా నొక్కిచెబుతున్నాయి?

16 ఒక సంగతేమిటంటే, బైబిలు పరిశుద్ధతను సౌందర్యంతో జతచేస్తోంది. దేవుని పరిశుద్ధ స్థలం గురించి కీర్తన 96:6​లో మనమిలా చదువుతాం: “బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి.” సౌందర్యం మనల్ని ఆకర్షిస్తుంది. ఉదాహరణకు, 33వ పేజీలో ఉన్న చిత్రాన్ని చూడండి. ఆ సుందరమైన దృశ్యంవైపు మీరు ఆకర్షించబడడం లేదా? దానిని అంత ఆకర్షణీయంగా చేసిందేమిటి? ఆ నీరు ఎంత స్వచ్ఛంగా కనబడుతోందో చూడండి. ఆకాశం నీలిరంగులో ఉంది కాబట్టి గాలి కూడా స్వచ్ఛంగానే ఉండవచ్చు, వెలుగు విరబూసినట్టుగా ఉంది. ఇప్పుడు అదే దృశ్యాన్ని సవరిస్తే అంటే ప్రవహించే ఆ నీరు చెత్తాచెదారంతో నిండిపోయి, వృక్షాలు కొండలు వాటిపై వ్రాయబడిన పిచ్చి పిచ్చి రాతలతో వికృతమైపోయి, గాలిలో పొగ వ్యాపించినట్లుగా ఉంటే మనమేమాత్రం దానికి ఆకర్షితులం కాము; మనం దాన్ని చూడడానికే ఇష్టపడం. మనం సహజంగానే పరిశుభ్రతను, స్వచ్ఛతను, వెలుగును సౌందర్యంతో జతచేస్తాం. ఇవే మాటల్ని యెహోవా పరిశుద్ధతను వర్ణించడానికి ఉపయోగించవచ్చు. యెహోవా గురించిన ఆ దర్శన సంబంధమైన వర్ణనలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయంటే అందులో ఆశ్చర్యం లేదు. మన పరిశుద్ధ దేవుని సౌందర్యం కాంతి పుంజంలా, ప్రకాశవంతమైన రత్నాల కాంతిలా, కణకణలాడే నిప్పులా లేదా స్వచ్ఛమైన, తళతళ మెరిసే ప్రశస్తమైన లోహంలా ఉంది.—యెహెజ్కేలు 1:25-28; ప్రకటన 4:2, 3.

17, 18.(ఎ)యెషయాకు కలిగిన దర్శనం, మొదట్లో ఆయనపై ఎలాంటి ప్రభావం చూపింది? (బి) యెషయాను ఊరడించడానికి యెహోవా సెరాపును ఎలా ఉపయోగించాడు, సెరాపు చేసినపనికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది?

17 అయితే, దేవుని పరిశుద్ధతకు పోల్చుకున్నప్పుడు అది మనం అధములమని భావించేలా చెయ్యాలా? దానికి అవుననే జవాబు చెప్పాలి. నిజంగానే మనం యెహోవా కంటే తక్కువస్థాయిలోనే ఉన్నాము—అలా చెప్పడం ఉన్న నిజాన్ని ఒప్పుకోవడమే తప్ప మరేమీ కాదు. ఆ విషయం తెలుసుకోవడం మనల్ని ఆయననుండి దూరం చెయ్యాలా? సెరాపులు యెహోవా పరిశుద్ధతను ప్రకటించడం విన్నప్పుడు యెషయా ప్రతిస్పందన ఎలావుందో పరిశీలించండి. ఆయనిలా అన్నాడు: “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యముల కధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితి[ని].” (యెషయా 6:5) అవును, యెహోవా అపార పరిశుద్ధత యెషయా ఎంత పాపిగా అపరిపూర్ణుడిగా ఉన్నాడో అతనికి గుర్తుచేసింది. మొదట్లో, ఆ నమ్మకస్థునికి దిక్కుతోచలేదు. అయితే యెహోవా అతడ్ని ఆ స్థితిలోనే విడిచిపెట్టలేదు.

18 ఒక సెరాపు వెంటనే ఆ ప్రవక్తను ఊరడించాడు. ఎలా? బలిష్ఠుడైన ఆ సెరాపు బలిపీఠం దగ్గరకు ఎగిరివెళ్లి, దానినుండి ఒక నిప్పు కణిక తీసుకొనివచ్చి యెషయా పెదవులకు తగిలించాడు. ఊరడించడం కంటే అది మరింత బాధకలిగించి ఉంటుందని అనిపించవచ్చు. అయితే అది పూర్తిగా సూచనార్థక భావమున్న దర్శనమని గుర్తుంచుకోండి. పాపపరిహారార్థమై దేవాలయపు బలిపీఠంపై ప్రతీరోజు బలులు అర్పించబడతాయని నమ్మకమైన యూదుడగు యెషయాకు బాగా తెలుసు. ఆ ప్రవక్త నిజంగానే “అపవిత్రమైన పెదవులుగల” అపరిపూర్ణుడైనప్పటికీ, దేవుని ఎదుట పరిశుభ్రమైన స్థానంలో నిలబడగల అవకాశముందని ఆ సెరాపు ప్రేమ పూర్వకంగా ఆయనకు గుర్తుచేశాడు. * పాపియైన అపరిపూర్ణ మానవుణ్ణి, కనీసం పరిమిత భావంలోనైనా, పరిశుద్ధునిగా దృష్టించడానికి యెహోవా ఇష్టపడ్డాడు.—యెషయా 6:6, 7.

19.మనం అపరిపూర్ణులమైనప్పటికీ పరిమిత భావంలో పరిశుద్ధంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది?

19 నేడూ అలాగే జరుగుతోంది. యెరూషలేము బలిపీఠంపై అర్పించబడిన ఆ బలులన్నీ మరింత గొప్పదైన అంటే సా.శ. 33లో యేసుక్రీస్తు అర్పించిన పరిపూర్ణ బలికి ఛాయగా మాత్రమే ఉన్నాయి. (హెబ్రీయులు 9:11-14) మనం మన పాపాల విషయమై నిజంగా పశ్చాత్తాపపడి, మన తప్పు మార్గాన్ని మార్చుకొని ఆ బలియందు విశ్వాసం ఉంచితే మనం క్షమించబడతాం. (1 యోహాను 2:2) అప్పుడు మనం కూడా దేవుని ఎదుట పరిశుభ్రమైన స్థానంలో ఉండవచ్చు. అందుకే, అపొస్తలుడైన పేతురు మనకిలా జ్ఞాపకం చేస్తున్నాడు: “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.” (1 పేతురు 1:14) మనం తనంత పరిశుద్ధులుగా ఉండాలని యెహోవా చెప్పలేదని గమనించండి. అసాధ్యమైనది ఆయనెన్నడూ మననుండి ఆశించడు. (కీర్తన 103:13, 14) బదులుగా, తాను పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని యెహోవా మనకు చెబుతున్నాడు. “ప్రియులైన పిల్లలవలె” అపరిపూర్ణ మానవులుగా మనకు సాధ్యమైనంత శ్రేష్ఠంగా ఆయనను అనుకరించడానికి ప్రయత్నిస్తాము. (ఎఫెసీయులు 5:1) అందువల్ల పరిశుద్ధత సాధించడమనేది కొనసాగే ప్రక్రియ. మనం ఆధ్యాత్మికంగా ఎదిగేకొద్దీ, “పరిశుద్ధతను సంపూర్తి” చేసుకోవడానికి ప్రతీదినం కృషిచేస్తాం.—2 కొరింథీయులు 7:1.

20.(ఎ)మన పరిశుద్ధ దేవుని దృష్టిలో మనం పరిశుభ్రంగా ఉండవచ్చని అర్థంచేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) యెషయా తన పాపాలకు ప్రాయశ్చిత్తమయ్యిందని తెలుసుకున్నప్పుడు అది ఆయనపై ఎలాంటి ప్రభావం చూపింది?

20 యెహోవా న్యాయబద్ధతను, స్వచ్ఛతను ప్రేమిస్తాడు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. (హబక్కూకు 1:13) కానీ ఆయన మనల్ని ద్వేషించడు. పాపాన్ని మనమూ ఆయనలాగే దృష్టించినప్పుడు అంటే దుర్నీతిని ద్వేషిస్తూ మేలును ప్రేమిస్తూ క్రీస్తు యేసు పరిపూర్ణ అడుగుజాడల్లో నడుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు యెహోవా మన పాపాలను క్షమిస్తాడు. (ఆమోసు 5:15; 1 పేతురు 2:21) మన పరిశుద్ధ దేవుని దృష్టిలో మనం పరిశుభ్రంగా ఉండవచ్చని మనం అర్థంచేసుకున్నప్పుడు, దాని ప్రభావం మెండుగా ఉంటుంది. యెహోవా పరిశుద్ధత మొదట యెషయా అపవిత్రతను అతనికి గుర్తుచేసిందని జ్ఞాపకముంచుకోండి. “అయ్యో” అని ఆయన విలపించాడు. అయితే, తన పాపాలకు ప్రాయశ్చిత్తమయ్యిందని తెలుసుకున్నప్పుడు, ఆయన దృష్టికోణమే మారిపోయింది. ఒక పని చేయడానికి స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొస్తారా అని యెహోవా అడిగినప్పుడు, ఆ పనేమిటో తెలియకపోయినా యెషయా వెంటనే ప్రతిస్పందించాడు. ఆయనిలా అన్నాడు: “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము.”—యెషయా 6:5-8.

21.పరిశుద్ధతా లక్షణాన్ని మనం పెంపొందించుకోవచ్చని నమ్మడానికి మనకెలాంటి ఆధారముంది?

21 మనం పరిశుద్ధ దేవుని స్వరూపంలో చేయబడ్డాము, మనకు నైతిక లక్షణాలు, ఆధ్యాత్మిక సామర్థ్యం అనుగ్రహించబడ్డాయి. (ఆదికాండము 1:26) మనందరిలో పరిశుద్ధతను ఫలించగల చేవవుంది. మనం పరిశుద్ధతను నిరంతరం పెంపొందించుకొంటుండగా, సహాయం చేయడానికి యెహోవా సంతోషిస్తాడు. ఆ ప్రక్రియలో మనం మన పరిశుద్ధ దేవునికి మరింత సన్నిహితమవుతాం. అంతేకాకుండా, రాబోయే అధ్యాయాల్లో యెహోవా లక్షణాలను మనం పరిశీలిస్తుండగా, ఆయనకు సన్నిహితమవడానికి అనేక శక్తిమంతమైన కారణాలున్నాయని మనం చూస్తాం.

^ “అపవిత్రమైన పెదవులు” అనేమాట తగినదే, ఎందుకంటే పెదవులు తరచూ బైబిల్లో అలంకారార్థంగా సంభాషణకు లేదా భాషకు ప్రతీకగా ఉపయోగించబడ్డాయి. అపరిపూర్ణ మానవులందరిలో, మనం చేసే పాపాల్లో అధికశాతం పాపాలకు కారణం మనకున్న సంభాషణా సామర్థ్యాన్ని మనమెలా ఉపయోగిస్తామనేదే.—సామెతలు 10:19; యాకోబు 3:2, 6.