కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 4

“యెహోవా . . . మహాబలము గలవాడు”

“యెహోవా . . . మహాబలము గలవాడు”

1, 2.ఏలీయా తన జీవితంలో ఎలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగడం చూశాడు, కానీ హోరేబు పర్వతం మీద ఒక గుహలో నుండి ఆయన ఎలాంటి అద్భుత సంఘటనలు కళ్లారా చూశాడు?

 ఏలీయా అంతకుముందే ఆశ్చర్యకరమైన సంగతులను చూశాడు. ఆయన దాగివున్నప్పుడు, రోజుకు రెండుసార్లు కాకోలములు ఆయనకు ఆహారం తేవడాన్ని చూశాడు. పిండి, నూనెవున్న రెండు పాత్రలు కరవు కాలమంతా ఖాళీకాకుండా ఉండడాన్ని చూశాడు. తన ప్రార్థనకు ప్రతిస్పందనగా ఆకాశంనుండి అగ్ని దిగడాన్ని కూడా ఆయన చూశాడు. (1 రాజులు 17, 18 అధ్యాయాలు) అయినప్పటికీ, ఏలీయా ఇంతకంటే ఆశ్చర్యకరమైనది ఏదీ ఎన్నడూ చూడలేదు.

2 ఆయన హోరేబు పర్వతం మీదున్న ఒక గుహ ద్వారం దగ్గర నిలబడి బయటకు వంగి చూస్తున్నప్పుడు, అద్భుతమైన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరగడాన్ని కళ్లారా చూశాడు. మొదట గాలివీచింది. అది విపరీతమైన శబ్దంతో చెవులు చిల్లులు పడేలా వీచి ఉంటుంది, ఎందుకంటే దాని బలమైన తాకిడికి పర్వతాలు బద్దలయ్యాయి, శిలలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఆ తర్వాత, భూపొరల్లో దాగిన శక్తి అంతా ఒక్కసారిగా బయటపడుతూ భూమి కంపించింది. ఆ పిమ్మట అగ్నిపుట్టింది. అది ఆ ప్రాంతమంతా వ్యాపిస్తుండగా, ఒళ్లు కాలిపోయే వేడిగాలి బహుశా ఏలీయాకు తగిలేవుంటుంది.—1 రాజులు 19:8-12.

‘యెహోవా ఆ వైపుగా సంచరిస్తున్నాడు’

3.దేవుని ఏ లక్షణపు రుజువును ఏలీయా కళ్లారా చూశాడు, ఇదే లక్షణానికి రుజువును మనమెక్కడ చూడగలము?

3 ఏలీయా కళ్లారా చూసిన ఈ బహువిధ సంఘటనలన్నింటిలోనూ యెహోవా దేవుని మహాగొప్ప శక్తి ప్రదర్శించబడడం కనబడుతోంది. దేవునికి ఈ శక్తి ఉందని గ్రహించడానికి మనమొక అద్భుతాన్ని కళ్లారా చూడాల్సిన అవసరం లేదు. అది స్పష్టంగా కనబడుతూనే ఉంది. సృష్టి, యెహోవా ‘నిత్యశక్తికి దేవత్వానికి’ రుజువుగా ఉందని బైబిలు మనకు తెలియజేస్తోంది. (రోమీయులు 1:20) భయంకరమైన ఉరుములు మిరుమిట్లుగొలిపే మెరుపులతో కురిసే జడివాన గురించి, గగుర్పాటు కలిగించే మహా జలపాతం గురించి, నక్షత్రాలు నిండిన సువిశాల ఆకాశం గురించి ఒకసారి ఆలోచించండి. అలాంటివాటిలో దేవుని శక్తి ప్రదర్శించబడడాన్ని మీరు చూడ్డం లేదా? అయినప్పటికీ, నేటి ప్రపంచంలో కేవలం కొద్దిమందే దేవుని శక్తిని నిజంగా గుర్తిస్తారు. అంతకంటే తక్కువమందే దానిని సరిగా దృష్టిస్తారు. అయితే యెహోవా దేవుని ఈ లక్షణాన్ని అర్థంచేసుకోవడం, ఆయనకు సన్నిహితమవడానికి మనకు అనేక కారణాలు ఇస్తుంది. ఈ భాగంలో మనం యెహోవా తిరుగులేని శక్తి గురించి వివరంగా అధ్యయనం చేస్తాం.

యెహోవా ప్రముఖ లక్షణం

4, 5.(ఎ)యెహోవా పేరుకు ఆయన శౌర్యానికి లేదా శక్తికి ఎలాంటి సంబంధముంది? (బి) తన శక్తికి సూచనార్థంగా యెహోవా ఎద్దును ఎంచుకోవడం ఎందుకు యుక్తం?

4 శక్తిలో యెహోవా సాటిలేనివాడు. యిర్మీయా 10:6 ఇలాచెబుతోంది: “యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను.” శౌర్యము లేదా శక్తి యెహోవా పేరుకు ముడిపెట్టబడడాన్ని గమనించండి. ఈ పేరుకు అర్థం, “తానే కర్త అవుతాడు” అయివుండవచ్చని జ్ఞాపకముంచుకోండి. తాను అనుకున్న దేన్నైనా సృష్టించడానికి, తాను ఎలా అవ్వాలనుకుంటే అలా అవ్వడానికి యెహోవాకు ఏవి తోడ్పడతాయి? వాటిలో ఒకటి శక్తి. అవును, తన చిత్తం నెరవేర్చడానికి చర్య గైకొనేందుకు యెహోవాకున్న సామర్థ్యం అపరిమితం. అలాంటి శక్తి ఆయనకున్న ప్రముఖ లక్షణాల్లో ఒకటి.

5 యెహోవా శక్తిని మనం పూర్తిగా ఆకళింపు చేసుకోవడం ఎన్నటికీ సాధ్యంకాదు కాబట్టి, మనకు సహాయం చేయడానికి ఆయన ఉపమానాలు ఉపయోగిస్తున్నాడు. మనం చూసినట్లుగా, ఆయన తన శక్తికి సూచనార్థంగా ఎద్దును ఉపయోగిస్తున్నాడు. (యెహెజ్కేలు 1:4-10) అది సరైన ఉదాహరణ, ఎందుకంటే ఇళ్లల్లో పెంచే ఎద్దుకూడా భారీగావుండే మహాబలమైన పశువు. బైబిలు కాలాల్లోని పాలస్తీనా ప్రజలకు, ఒకవేళ ఎప్పుడైనా కనిపించినా, ఎప్పుడో గానీ అంతకంటే బలమైన జంతువు కనబడేది కాదు. అయితే వారికి మరింత భీకరమైన మరో రకమైన ఎద్దు గురించి అంటే ప్రస్తుతం అంతరించిపోయిన ఒక ప్రత్యేక తరహా అడవిదున్న లేదా గురుపోతు గురించి తెలుసు. (యోబు 39:9-12) ఈ దున్నలు దాదాపు ఏనుగులంత పెద్దవిగా ఉండేవని రోమా చక్రవర్తి జూలియస్‌ సీజర్‌ ఒకసారి వ్యాఖ్యానించాడు. “వాటి బలం వాటి వేగం మహాగొప్పవి” అని ఆయన వ్రాశాడు. అలాంటి జంతువు ప్రక్కన నిలబడితే మీరెంత చిన్నగా, బలహీనంగా ఉన్నట్లు భావిస్తారో ఊహించుకోండి.

6.“సర్వశక్తిగల దేవుడు” అని యెహోవా మాత్రమే ఎందుకు పిలువబడ్డాడు?

6 అదే ప్రకారం, శక్తిగల దేవుడైన యెహోవాతో పోల్చినప్పుడు మానవుడు అల్పునిగా, శక్తిహీనునిగా ఉంటాడు. యెహోవాకు బలమైన జనాంగాలు సైతం కేవలం త్రాసుమీది ధూళివలే ఉన్నాయి. (యెషయా 40:15) ఇతరత్రా ఏ ప్రాణికి లేనివిధంగా, యెహోవాకు అపరిమితమైన శక్తివుంది, ఆయన మాత్రమే “సర్వశక్తిగల దేవుడు” అని పిలువబడ్డాడు. * (నిర్గమకాండము 6:3) యెహోవా ‘బలాతిశయము’ గలవాడు, ఆయనకు ‘అధికశక్తి’ ఉంది. (యెషయా 40:26) ఎప్పటికీ విశృంఖలంగా ఉండే, తరిగిపోని శక్తికి ఆయన మూలాధారుడు. శక్తికోసం ఆయన మరెవరిపైనా ఆధారపడడు, ఎందుకంటే ‘బలము తనది.’ (కీర్తన 62:11) అయితే యెహోవా తన శక్తిని దేని ద్వారా ప్రయోగిస్తాడు?

యెహోవా తన శక్తిని ఉపయోగించే విధానం

7.యెహోవా పరిశుద్ధాత్మ అంటే ఏమిటి, బైబిల్లో ఉపయోగించబడిన ఆదిమ భాషా పదాలు సూచించేదేమిటి?

7 యెహోవా తన పరిశుద్ధాత్మను అపరిమితంగా కుమ్మరిస్తాడు. అది కార్యాచరణలో ఉన్న దేవుని శక్తి. నిజానికి, ఆదికాండము 1:2​లో NW, బైబిలు దానిని దేవుని “చురుకైన శక్తి” అని సూచిస్తోంది. “ఆత్మ” అని తర్జుమా చేయబడిన ఆదిమ హీబ్రూ, గ్రీకు పదాలను ఇతర సందర్భాల్లో, “గాలి,” “శ్వాస,” “గాలిహోరు” అని అనువదించవచ్చు. నిఘంటుకారుల ఉద్దేశం ప్రకారం, ఆదిమ భాషాపదాలు కార్యాచరణలోవున్న ఒక అదృశ్య శక్తిని సూచిస్తున్నాయి. గాలిలాగే దేవుని ఆత్మ మన కన్నులకు అదృశ్యంగా ఉంటుంది, కానీ దాని ప్రభావాలు వాస్తవం, వాటిని గ్రహించడం సుసాధ్యం.

8.బైబిల్లో దేవుని ఆత్మ అలంకారార్థంగా ఏమని పిలువబడింది, ఈ పోలికలు ఎందుకు యుక్తమైనవి?

8 దేవుని పరిశుద్ధాత్మ అంతులేని ఒక బహుళార్థక శక్తి. తన మనస్సులో ఉన్న ఎలాంటి సంకల్ప నెరవేర్పుకైనా యెహోవా దానిని ఉపయోగించగలడు. అందుకే, బైబిల్లో దేవుని ఆత్మ అలంకారార్థంగా ఆయన “వ్రేలు,” ఆయన “బాహుబలము,” లేదా ఆయన ‘చాచిన చెయ్యి’ అని యుక్తంగానే పిలువబడింది. (లూకా 11:20; ద్వితీయోపదేశకాండము 5:15) వివిధ స్థాయిల్లో బలం లేదా సూక్ష్మ కౌశలం అవసరమయ్యే వివిధరకాల పనులు జరిగించడానికి ఒక మనిషి ఎలా తన చేతిని ఉపయోగిస్తాడో, అదేవిధంగా అతిసూక్ష్మ పరమాణువులను సృష్టించడానికి లేదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడానికి లేదా మొదటి శతాబ్దపు క్రైస్తవులు విదేశీ భాషలు మాట్లాడేలా చేయడంవంటి ఎలాంటి సంకల్పం నెరవేర్చడానికైనా దేవుడు తన ఆత్మను ఉపయోగించగలడు.

9.యెహోవా పరిపాలనా శక్తి ఎంత విస్తారమైనది?

9 విశ్వ సర్వాధిపతిగా యెహోవా తనకున్న అధికారాన్ని బట్టి కూడా తన శక్తిని ఉపయోగిస్తాడు. లక్షలకు లక్షలుగావున్న బుద్ధిసూక్ష్మతగల సమర్థవంతులైన ప్రజలు మీ ఆజ్ఞాపాలనకు ఆత్రంగా ఎదురుచూడ్డాన్ని మీరు ఊహించుకోగలరా? యెహోవా వద్ద అలాంటి పరిపాలనా శక్తి ఉంది. ఆయనకు మానవ సేవకులున్నారు, వీరు లేఖనాల్లో తరచూ సైన్యంతో పోల్చబడ్డారు. (కీర్తన 68:11; 110:3) అయితే ఒక దేవదూతతో పోల్చినప్పుడు, మనిషి కేవలం ఒక బలహీనమైన ప్రాణి. ఉదాహరణకు, అష్షూరీయుల సైన్యం దేవుని ప్రజలను ముట్టడించినప్పుడు, ఒకేఒక దేవదూత ఒక్క రాత్రిలో ఆ సైనికుల్లో 1,85,000 మందిని హతమార్చాడు. (2 రాజులు 19:35) దేవదూతలు ‘బలశూరులై’ ఉన్నారు.—కీర్తన 103:19, 20.

10.(ఎ)సర్వశక్తిమంతుడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఎందుకు పిలువబడ్డాడు? (బి) యెహోవా సమస్త సృష్టికార్యాల్లో ఎవరికి అత్యధిక బలముంది?

10 ఎంతమంది దేవదూతలున్నారు? దానియేలు ప్రవక్త తను చూసిన పరలోక దర్శనంలో యెహోవా సింహాసనం ఎదుట వేవేలకొలది ఆత్మ సంబంధ ప్రాణులు నిలబడి ఉండడం చూశాడు, అయితే ఆయన దేవుడు సృష్టించిన దేవదూతలందరినీ చూశాడనే సూచనేదీ లేదు. (దానియేలు 7:10) కాబట్టి కోటానుకోట్ల దేవదూతలు ఉండి ఉండవచ్చు. అందుకే దేవుడు సైన్యములకధిపతియగు యెహోవా అని పిలువబడ్డాడు. ఈ బిరుదు వ్యవస్థీకృత బలశూరులైన దేవదూతల విస్తార సైన్యానికి సైనికాధిపతిగా ఆయన శక్తిమంతమైన స్థానాన్ని వర్ణిస్తోంది. ఈ ఆత్మ సంబంధ ప్రాణులమీద అధికారిగా ఆయన “సర్వసృష్టికి ఆదిసంభూతుడై[న]” తన సొంత కుమారుణ్ణి నియమించాడు. (కొలొస్సయులు 1:15) దేవదూతలు, సెరాపులు, కెరూబులు వంటివారందరిమీది ప్రధానదూతగా యేసు, యెహోవా సమస్త సృష్టికార్యాల్లో అత్యధిక బలంగలవాడు.

11, 12.(ఎ)దేవుని వాక్యము తన శక్తిని ఏయే విధాలుగా చూపిస్తుంది? (బి) యెహోవా శక్తి విస్తీర్ణతను యేసు ఎలా ధృవీకరించాడు?

11 యెహోవాకు తన శక్తిని ఉపయోగించగల మరో మార్గం ఉంది. హెబ్రీయులు 4:12 ఇలా చెబుతోంది: “దేవుని వాక్యము సజీవమై బలముగలది.” ఇప్పుడు బైబిల్లో భద్రపరచబడిన దేవుని వాక్యపు లేదా ఆత్మ ప్రేరేపిత సందేశపు అద్భుతశక్తిని మీరు గమనించారా? అది మనల్ని బలపరచి, మన విశ్వాసాన్ని ధృడపరుస్తూ మనలో మనం గణనీయమైన మార్పులు చేసుకోవడానికి మనకు సహాయం చేయగలదు. విపరీతమైన లైంగిక జీవన పద్ధతుల్లో మునిగిన ప్రజల విషయమై అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులను హెచ్చరించిన తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మీలో కొందరు అట్టివారై యుంటిరి.” (1 కొరింథీయులు 6:9-11) అవును, “దేవుని వాక్యము” వారిపై తన శక్తి చూపి, మారడానికి వారికి సహాయం చేసింది.

12 యెహోవా శక్తి ఎంత అపారమైనది, ఆయన దానిని ఉపయోగించే కార్యపద్ధతి ఎంత అమోఘమైనది అంటే, ఆయన దారికి అడ్డంగా ఏదీ నిలబడలేదు. యేసు ఇలా అన్నాడు: “దేవునికి సమస్తమును సాధ్యము.” (మత్తయి 19:26) ఏ సంకల్పాల కోసం యెహోవా తన శక్తిని నిర్దేశిస్తాడు?

ఒక సంకల్పంతో నిర్దేశింపబడిన శక్తి

13, 14.(ఎ) యెహోవా వ్యక్తిత్వంలేని శక్తి ఉత్పాదక కేంద్రంగా లేడని మనమెందుకు చెప్పవచ్చు? (బి) యెహోవా తన శక్తిని ఏయే విధాలుగా ఉపయోగిస్తాడు?

13 యెహోవా ఆత్మ ఏ ఇతర భౌతిక శక్తికంటే కూడా ఎంతో బలమైనది; యెహోవా వ్యక్తిత్వంలేని శక్తిగా, కేవలం శక్తి ఉత్పాదక కేంద్రంగా లేడు. ఆయన వ్యక్తిత్వమున్న దేవుడు, ఆయన సొంత శక్తి ఆయన అదుపులో ఉంది. అయితే దానిని ఉపయోగించడానికి ఆయనను ఏమి పురికొల్పుతుంది?

14 మనం చూడబోతున్నట్లుగా, సృష్టించడానికి, నాశనం చేయడానికి, కాపాడడానికి, పునరుద్ధరించడానికి ఒక్క మాటలో చెప్పాలంటే, తన పరిపూర్ణ సంకల్పాలకు సరిపోయే దేన్ని చేయడానికైనా దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు. (యెషయా 46:10) కొన్ని సందర్భాల్లో, తన వ్యక్తిత్వం గురించిన, నియమాల గురించిన ప్రాముఖ్యాంశాలను బయలుపరచడానికి యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. అన్నింటికంటే ఎక్కువగా ఆయన తన చిత్తం నెరవేర్చుకోవడానికి అంటే మెస్సీయ రాజ్యం ద్వారా తన సర్వాధిపత్య సత్యసంధతను నిరూపించుకోవడానికి, తన పరిశుద్ధ నామమును పవిత్రపరచుకోవడానికి ఆయన తన శక్తిని నిర్దేశిస్తాడు. ఆ సంకల్పాన్ని ఎప్పటికీ ఏదీ అడ్డగించలేదు.

15.యెహోవా తన సేవకులకు సంబంధించి ఏ సంకల్పంతో తన శక్తిని ఉపయోగిస్తాడు, ఏలీయా విషయంలో ఇదెలా ప్రదర్శించబడింది?

15 వ్యక్తిగతంగా మన ప్రయోజనార్థం కూడా యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. 2 దినవృత్తాంతములు 16:9 ఏమి చెబుతోందో గమనించండి: “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” ఆరంభంలో ప్రస్తావించబడిన ఏలీయా అనుభవం దానికొక ఉదాహరణ. దైవశక్తి యొక్క ఆ భీకర ప్రదర్శనను యెహోవా ఆయనకెందుకు చూపించాడు? దుష్టరాణియైన యెజెబెలు ఏలీయాను హతమార్చాలని ఒట్టుపెట్టుకుంది. ఆ ప్రవక్త ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయాడు. తను ఏకాకినయ్యాననే భావనతో, భయపడి ఆయన తను కష్టపడి చేసిందంతా వ్యర్థమైందన్నట్లుగా నిరుత్సాహపడ్డాడు. దుఃఖంలో ఉన్న ఏలీయాను ఊరడించడానికి, యెహోవా ప్రచండ రూపాల్లో తన శక్తిని ఆయనకు జ్ఞాపకం చేశాడు. విశ్వంలో అత్యంత శక్తిమంతుడు ఏలీయాకు తోడుగా ఉన్నాడని గాలి, భూకంపం, అగ్ని చూపించాయి. సర్వశక్తిగల దేవుడే తన పక్షాన ఉండగా, ఆయనిక ఏ విషయంలో యెజెబెలుకు భయపడాలి?—1 రాజులు 19:1-12. *

16.యెహోవా గొప్పశక్తిని ధ్యానించడంలో మనమెందుకు ఓదార్పుపొందవచ్చు?

16 ఇది యెహోవా అద్భుతాలుచేసే కాలం కాకపోయినా, ఏలీయా కాలంనుండి ఇప్పటి వరకు ఆయన ఏమీ మారలేదు. (1 కొరింథీయులు 13:8) తనను ప్రేమించేవారి పక్షాన తన శక్తిని ఉపయోగించడానికి ఆయన నేడు కూడా అదే ఆకాంక్షతో ఉన్నాడు. నిజమే, ఆయన మహోన్నత ఆత్మసంబంధ సామ్రాజ్యంలో నివసిస్తున్నా, ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండడు. ఆయన శక్తి అపరిమితం కాబట్టి దూరం అవరోధం కాదు. బదులుగా, ‘తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.’ (కీర్తన 145:18) ఒకసారి సహాయం కోసం దానియేలు ప్రవక్త యెహోవాకు ప్రార్థించినప్పుడు, ఆయన ప్రార్థన ఇంకా ముగించకముందే దేవదూత ఆయనముందు ప్రత్యక్షమయ్యాడు. (దానియేలు 9:20-23) తాను ప్రేమించేవారికి సహాయంచేయకుండా, వారిని బలపరచకుండా యెహోవాను ఏదీ అడ్డగించలేదు.—కీర్తన 118:6.

దేవుని శక్తి ఆయనను సమీపించరానివానిగా చేస్తోందా?

17.ఏ భావంలో యెహోవా శక్తి మనలో భయాన్ని పురికొల్పుతుంది, అయితే ఎలాంటి భయాన్ని అది పురికొల్పడం లేదు?

17 దేవుని శక్తి మనం ఆయనకు భయపడేలా చేయాలా? దానికి మనం అవుననీ, కాదనీ జవాబు చెప్పాలి. దీని ముందరి అధ్యాయంలో మనం క్లుప్తంగా పరిశీలించిన ప్రగాఢ భక్తిపూర్వక భయం, గౌరవం అనే పూజనీయ భయం ఉండడానికి ఈ లక్షణం మనకు తగిన కారణాన్నే ఇస్తుంది కాబట్టి మనం అవుననే చెప్పాలి. అలాంటి భయం, “జ్ఞానమునకు మూలము” అని బైబిలు మనకు చెబుతోంది. (కీర్తన 111:10) అయితే, ఆయన గురించిన మరణకర భయానికి లేదా ఆయనను సమీపించకుండా పోవడానికి దేవుని శక్తి మనకు ఏ కారణమూ ఇవ్వడంలేదు కాబట్టి మనం కాదని కూడా చెప్పాలి.

18.(ఎ)అధికారంగల ప్రజలను చాలామంది ఎందుకు నమ్మరు? (బి) యెహోవా తన అధికారాన్నిబట్టి అవినీతిపరుడు కాలేడని మనకెలా తెలుసు?

18 చరిత్ర పదేపదే ధృవీకరించినట్లు, అపరిపూర్ణ మానవులు తరచూ అధికార దుర్వినియోగం చేస్తారు. అధికారం ప్రజలను అవినీతిపరులను చేస్తున్నట్లు, కొందరు పరిపాలకులకు ఎంత ఎక్కువ అధికారముంటే అంత ఎక్కువ అవినీతిపరులుగా అవుతున్నట్లు కనిపిస్తోంది. (ప్రసంగి 4:1; 8:9) ఈ కారణంచేత, చాలామంది అధికారంలో ఉన్నవారిని నమ్మకుండా, వారికి దూరంగా ఉంటారు. యెహోవాకు తిరుగులేని అధికారముంది. అది ఆయనను ఏ విధంగానైనా అవినీతిపరుడిని చేసిందా? ఎంతమాత్రం లేదు. మనం చూసినట్లుగా, ఆయన పరిశుద్ధుడు, ఖచ్చితంగా ఆయన అక్షయుడు. ఆయన ఈ అవినీతి లోకంలో అధికారంలోవున్న అపరిపూర్ణ స్త్రీపురుషుల మాదిరిగా లేడు. ఆయన ఎన్నడూ అధికార దుర్వినియోగం చేయలేదు, ఎప్పటికీ చేయడు కూడా.

19, 20.(ఎ) యెహోవా ఎల్లప్పుడూ తన ఏ ఇతర లక్షణాలకు అనుగుణంగా తన శక్తిని ఉపయోగిస్తాడు, అది ఎందుకు అభయమిచ్చేదిగా ఉంది? (బి) యెహోవా ఆశానిగ్రహాన్ని మీరెలా ఉదహరించవచ్చు, మీకెందుకు అది ఆకర్షణీయంగా ఉంది?

19 శక్తి ఒక్కటే యెహోవా లక్షణం కాదని గుర్తుంచుకోండి. మనమింకా ఆయన న్యాయము, జ్ఞానము, ప్రేమల గురించి అధ్యయనం చేయాలి. అయితే, తడవకు ఒక లక్షణం మాత్రమే ఆయన ప్రదర్శిస్తాడన్నట్లు యెహోవా లక్షణాలు కఠినంగా, యాంత్రికంగా కనబరచబడతాయని మనం తలంచకూడదు. దానికి భిన్నంగా, యెహోవా ఎల్లప్పుడూ తన న్యాయం, తన జ్ఞానం, తన ప్రేమలకు అనుగుణంగా తన శక్తిని ప్రదర్శిస్తాడని రాబోయే అధ్యాయాల్లో మనం చూస్తాం. దేవునికున్న మరో లక్షణం గురించి అంటే ప్రస్తుత లోకపాలకుల్లో అరుదుగా కనబడే ఆశానిగ్రహం గురించి ఆలోచించండి.

20 చూస్తే మీకు భయమనిపించే ఓ భారీకాయుణ్ణి, మహాబలంగల వ్యక్తిని కలవడాన్ని ఊహించుకోండి. అయితే ఆయన మృదు స్వభావి అని మీరు కొంత సమయంలోనే గమనించారు. ఆయన ప్రజలకు, ప్రత్యేకించి రక్షణలేని బలహీనులకు సహాయంచేసి వారిని కాపాడేందుకే తన బలాన్ని ప్రయోగించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా, ఆకాంక్షతో ఉంటాడు. ఆయన తన బలాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయడు. అకారణంగా ఆయనమీద అపవాదు మోపినా, తన ప్రవర్తనలో నిశ్చలంగా, హుందాగా, దయామయునిగా ఉన్నా, ఆయన స్థిరంగా ఉండడాన్ని మీరు చూశారు. ప్రత్యేకంగా నాకే అంత బలముంటే, నేనూ అదే మృదుత్వాన్ని, నిగ్రహాన్ని చూపించగలనా అని మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి వ్యక్తి గురించి మీరు తెలుసుకున్నకొద్దీ, ఆయనవైపు మీరు ఆకర్షించబడుతున్నట్లు భావించరా? సర్వశక్తిగల యెహోవాకు సన్నిహితం కావడానికి మనకు మరెన్నో కారణాలు ఉన్నాయి. ఈ అధ్యాయపు శీర్షికకు ఆధారమైన ఈ పూర్తి వాక్యాన్ని పరిశీలించండి: ‘యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలముగలవాడు.’ (నహూము 1:3) ప్రజలమీద, చివరికి దుష్టులమీద సైతం యెహోవా తొందరపడి తన శక్తిని ప్రయోగించడు. ఆయన సాత్వికుడు, దయామయుడు. రెచ్చగొట్టబడిన అనేక సందర్భాల్లో కూడా తాను ‘దీర్ఘశాంతుడని’ ఆయన నిరూపించుకున్నాడు.—కీర్తన 78:37-41.

21.తన చిత్తం చేయమని ప్రజలను యెహోవా ఎందుకు ఒత్తిడిచేయడు, ఆయన గురించి ఇది మనకేమి బోధిస్తోంది?

21 యెహోవా ఆశానిగ్రహాన్ని మరో కోణం నుండి పరిశీలించండి. మీకే అపరిమితమైన శక్తివుంటే, మీరు చెప్పిన పద్ధతిలోనే ప్రజల్ని పనిచేయించాలనే శోధనకు కొన్నిసార్లు గురికావచ్చని మీరు భావిస్తారా? తనకు సమస్త శక్తివున్నా ప్రజలు తనను సేవించాలని యెహోవా బలవంతపెట్టడు. నిత్యజీవానికి దేవుణ్ణి సేవించడమే ఏకైక మార్గమైనా, అలా సేవించాలని యెహోవా మనలను ఒత్తిడిచేయడు. బదులుగా, ఆయన దయాపూర్వకంగా ప్రతీ వ్యక్తికి ఎంచుకునే స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన చెడు ఎంపికల పర్యవసానాల గురించి హెచ్చరిస్తూనే, మంచి ఎంపికల ప్రతిఫలాలను చెబుతాడు. అయితే ఎంపికచేసుకొనే అవకాశాన్ని ఆయన ఆ వ్యక్తికే వదిలేస్తాడు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20) బలిమిచేత లేదా తన భీకరశక్తిని బట్టి మరణకర భయంతోచేసే సేవలో యెహోవాకు ఆసక్తిలేదు. ప్రేమనుబట్టి ఇష్టపూర్వకంగా తనను సేవించేవారికోసమే ఆయన వెదకుతున్నాడు.—2 కొరింథీయులు 9:7.

22, 23.(ఎ)ఇతరులకు అధికారమివ్వడంలో యెహోవా సంతోషిస్తాడని ఏది చూపిస్తోంది? (బి) తర్వాతి అధ్యాయంలో మనమేమి పరిశీలిస్తాం?

22 సర్వశక్తిగల దేవుని పట్ల మనం బెదురుతో జీవించవలసిన అవసరం ఎందుకు లేదో తెలిపే చివరి కారణాన్ని మనం చూద్దాం. అధికారంగల మానవులు ఇతరులతో తమ అధికారం పంచుకోవడానికి భయపడతారు. కానీ యెహోవా తన యథార్థ ఆరాధకులకు అధికారమివ్వడానికి సంతోషిస్తాడు. తన కుమారునివంటి ఇతరులకు ఆయన చెప్పుకోదగిన అధికారం అప్పగిస్తున్నాడు. (మత్తయి 28:18) మరోరీతిలో కూడా యెహోవా తన సేవకులకు అధికారమిస్తున్నాడు. బైబిలు ఇలా వివరిస్తోంది: “యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; . . . బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే.”—1 దినవృత్తాంతములు 29:11, 12.

23 అవును, యెహోవా సంతోషంగా మీకు బలమిస్తాడు. ఆయన తనను సేవించాలని కోరుకునే వారికి “బలాధిక్యము” సైతం కలుగజేస్తాడు. (2 కొరింథీయులు 4:7) అంత దయాపూర్వకంగా, సూత్రబద్ధంగా తన శక్తిని ఉపయోగించే అధికశక్తిమంతుడైన ఈ దేవునివైపుకు మీరు ఆకర్షించబడడంలేదా? తర్వాతి అధ్యాయంలో, సృష్టించడానికి యెహోవా తన శక్తినెలా ఉపయోగిస్తాడనేదానిమీద మన దృష్టిసారిద్దాం.

^ “సర్వశక్తిగల” అని తర్జుమా చేయబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “సర్వ పరిపాలకుడు; సర్వాధికారం ఉన్నవాడు” అని అర్థం.

^ ‘యెహోవా ఆ గాలి దెబ్బయందు . . . , భూకంపమునందు . . . , మెరుపునందు ప్రత్యక్షము కాలేదు’ అని బైబిలు చెబుతోంది. పుక్కిటి పురాణాల ప్రకృతి దేవతారాధకుల మాదిరిగా యెహోవా సేవకులు ఈ ప్రకృతి శక్తుల్లో ఆయనకోసం వెదకరు. ఆయన సృష్టించినదేదీ ఆయనను పట్టజాలదు.—1 రాజులు 8:27.