కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 7

రక్షణ శక్తి—“దేవుడు మనకు ఆశ్రయము”

రక్షణ శక్తి—“దేవుడు మనకు ఆశ్రయము”

1, 2.సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలీయులు సీనాయి ప్రాంతానికి చేరుకుంటుండగా వారికెలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురయ్యింది, యెహోవా వారికెలా అభయమిచ్చాడు?

 సా.శ.పూ. 1513 తొలి భాగంలో ఇశ్రాయేలీయులు సీనాయి ప్రాంతానికి చేరుకుంటుండగా వారికి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురయ్యింది. ‘తాపకరమైన పాములు, తేళ్లతో నిండిన ఆ భయంకరమైన గొప్ప అరణ్యములో’ భయం గొలిపే ప్రయాణం వారి ఎదుట ఉంది. (ద్వితీయోపదేశకాండము 8:15) శత్రు జనాంగాలు దాడిచేస్తాయనే భయాన్ని కూడా వారు ఎదుర్కొన్నారు. యెహోవాయే తన ప్రజలను ఈ పరిస్థితిలోకి తెచ్చాడు. మరి వారి దేవునిగా, ఆయన వారిని కాపాడగలడా?

2 యెహోవా పలికిన ఈ మాటలు వారికెంతో అభయమిచ్చాయి: “నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి.” (నిర్గమకాండము 19:4) యెహోవా తాను తన ప్రజలను ఐగుప్తీయుల నుండి విడిపించానని, అలంకారార్థ భావంలో గద్దలనుపయోగించి వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చానని వారికి గుర్తుచేశాడు. దేవుని రక్షణను “గద్ద రెక్కలు” ఎందుకు యుక్తంగా ఉదహరిస్తాయో చెప్పడానికి ఇతర కారణాలున్నాయి.

3.“గద్ద రెక్కలు” ఎందుకు యుక్తంగా దైవిక రక్షణను ఉదహరిస్తున్నాయి?

3 గద్దలు తమ విశాలమైన, బలమైన రెక్కల్ని ఎంతో ఎత్తున ఎగరడానికే కాక ఇతర పనులకు కూడా ఉపయోగిస్తాయి. ఎండ ఎక్కువగా ఉన్న రోజు తల్లి గద్ద ఏడడుగులకంటే పొడవుగా విచ్చుకునే తన రెక్కల్ని రక్షణ ఇచ్చే గొడుగులా చాపి తన పిల్లలకు సూర్యుని ఎండ తగలకుండా చేస్తుంది. ఇతర సమయాల్లో, చలిగాలి తగలకుండా పిల్లలచుట్టూ తన రెక్కలు కప్పుతుంది. గద్ద తన పిల్లలను కాపాడినట్లే, అప్పుడే ఎదుగుతున్న ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా కాపాడి రక్షించాడు. ఇప్పుడు ఈ అరణ్యంలో ఆయన ప్రజలు నమ్మకంగా ఉన్నంతవరకు వారికి ఆయన బలమైన రెక్కల నీడలో ఆశ్రయం లభిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 32:9-11; కీర్తన 36:7) కానీ నేడు మనం దేవుని రక్షణను న్యాయంగా అపేక్షించగలమా?

దైవిక రక్షణకు సంబంధించిన వాగ్దానం

4, 5.కాపాడతాననే దేవుని వాగ్దానాన్ని మనమెందుకు ఖచ్చితంగా నమ్మవచ్చు?

4 యెహోవా నిశ్చయంగా తన సేవకులను కాపాడగల సమర్థుడే. ఆయన “సర్వశక్తిగల దేవుడు,” ఆయన ప్రబలశక్తిని ఆ బిరుదు సూచిస్తోంది. (ఆదికాండము 17:1) అడ్డుకోలేని తరంగంలాగ, యెహోవా ప్రయోగించే శక్తిని అడ్డగించడం అసాధ్యం. తన చిత్త ప్రకారం ఏది చేయడానికైనా ఆయన సమర్థుడు కాబట్టి, మనమిలా ప్రశ్నించవచ్చు, ‘తన ప్రజలను కాపాడ్డానికి తన శక్తిని ఉపయోగించడం యెహోవా చిత్తమేనా?’

5 దానికి ఒక్కమాటలో అవును అనేదే జవాబు. తన ప్రజలను కాపాడతానని యెహోవా మనకు హామీ ఇస్తున్నాడు. “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు” అని కీర్తన 46:1 చెబుతోంది. దేవుడు “అబద్ధమాడనేర[డు]” కాబట్టి కాపాడతాననే ఆయన వాగ్దానాన్ని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. (తీతు 1:2-4) యెహోవా తన రక్షణ శక్తిని వర్ణించడానికి ఉపయోగించే వివిధ ఉదాహరణల్లో కొన్నింటిని మనం పరిశీలిద్దాం.

6, 7.(ఎ)బైబిలు కాలాల గొఱ్ఱెలకాపరి తన గొఱ్ఱెలకు ఎలాంటి రక్షణ ఇచ్చేవాడు? (బి) తన గొఱ్ఱెలను రక్షించి, కాపాడాలని యెహోవాకున్న హృదయపూర్వక కోరికను బైబిలెలా ఉదహరిస్తోంది?

6 యెహోవా గొఱ్ఱెల కాపరి, “మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.” (కీర్తన 23:1; 100:3) చాలా కొన్ని జంతువులు పెంపుడు గొఱ్ఱెలంత నిస్సహాయంగా ఉంటాయి. బైబిలు కాలాల గొఱ్ఱెల కాపరి తన గొఱ్ఱెలను సింహాలు, తోడేళ్ళు, ఎలుగుబంట్ల నుండి అలాగే దొంగలనుండి కాపాడ్డానికి ఎంతో ధైర్యంగా ఉండాలి. (1 సమూయేలు 17:34, 35; యోహాను 10:12, 13) అయితే గొఱ్ఱెలను కాపాడేటప్పుడు లాలనగా చూసుకోవలసిన సందర్భాలూ ఉండేవి. ఒక గొఱ్ఱె మందకు దూరంగా ఈనినప్పుడు, శ్రద్ధచూపే గొఱ్ఱెల కాపరి ఆ నిస్సహాయ క్షణాల్లో తల్లి గొఱ్ఱెకు సంరక్షణగా నిలబడి అప్పుడే పుట్టిన ఆ గొఱ్ఱెపిల్లను ఎత్తుకొని మంద దగ్గరకు మోసుకెళతాడు.

‘ఆయన తన రొమ్మున ఆనించుకొని మోయును’

7 యెహోవా తనను గొఱ్ఱెల కాపరితో పోల్చుకుంటూ మనల్ని కాపాడే హృదయపూర్వకమైన కోరిక తనకుందని మనకు హామీ ఇస్తున్నాడు. (యెహెజ్కేలు 34:11-16) ఈ పుస్తకంలోని 2వ అధ్యాయంలో పరిశీలించబడిన యెషయా 40:11​లోని యెహోవాను గురించిన వర్ణనను గుర్తుతెచ్చుకోండి: “గొఱ్ఱెల కాపరివలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును.” అయితే ఆ చిన్న గొఱ్ఱెపిల్ల గొఱ్ఱెల కాపరి రొమ్మునకు అంటే అతని పై వస్త్రపు మడతల్లోకి ఎలా చేరుకొంటుంది? ఆ గొఱ్ఱెపిల్ల గొఱ్ఱెల కాపరి దగ్గరకొచ్చి ముట్టెతో అతని కాలిని మెల్లగా తట్టవచ్చు. అయితే, ఆ గొఱ్ఱెలకాపరే స్వయంగా క్రిందికివంగి ఆ గొఱ్ఱెపిల్లనెత్తుకుని దాన్ని భద్రంగా తన రొమ్మున ఆనించుకోవలసి ఉంటుంది. మనల్ని రక్షించి, కాపాడ్డానికి మన గొప్ప గొఱ్ఱెల కాపరికున్న సంసిద్ధతకు అదెంతటి వాత్సల్యపూరిత చిత్రీకరణో గదా!

8.(ఎ)కాపాడతాననే దేవుని వాగ్దానం ఎవరికి ఇవ్వబడుతోంది, ఇది సామెతలు 18:10​లో ఎలా సూచించబడింది? (బి) దేవుని నామాన్నిబట్టి సురక్షితంగా ఉండడంలో ఏమి ఇమిడివుంది?

8 కాపాడతానని దేవుడు చేస్తున్న వాగ్దానానికి ఒక షరతు ఉంది, దానిని ఆయనకు సన్నిహితమైనవారు మాత్రమే గ్రహిస్తారు. సామెతలు 18:10 ఇలా చెబుతోంది: “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.” బైబిలు కాలాల్లో, ఆశ్రయ స్థానాలుగా అరణ్యాల్లో కొన్నిసార్లు దుర్గాలు నిర్మించబడేవి. అయితే రక్షణకోసం అక్కడికి పరుగెత్తడమనేది అపాయంలో ఉన్న వ్యక్తి బాధ్యత. దేవుని నామంలో ఆశ్రయం పొందడం విషయంలో కూడా అంతే. అంటే దీనర్థం కేవలం దేవుని పేరు వల్లెవేస్తే చాలని కాదు; దేవుని పేరు మాంత్రిక తాయెత్తుకాదు. బదులుగా, ఆ పేరు ధరించిన దేవుణ్ణి తెలుసుకొని ఆయనపై నమ్మకముంచి ఆయన నీతికట్టడలకు అనుగుణంగా జీవించాలి. విశ్వాసంతో తనవైపు తిరిగితే, తాను ఆశ్రయదుర్గముగా ఉంటానని మనకు హామీయిచ్చే యెహోవా ఎంత దయామయుడో గదా!

“దేవుడు . . . మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు”

9.యెహోవా కాపాడతానని కేవలం వాగ్దానం చేయడంకంటే ఇంకా ఎక్కువే ఏ విధంగా చేశాడు?

9 యెహోవా కాపాడతానని కేవలం వాగ్దానం చేయడంతో ఊరుకోలేదు. బైబిలు కాలాల్లో, తాను తన ప్రజల్ని కాపాడగల సమర్థుడనని ఆయన అద్భుతరీతుల్లో ప్రదర్శించాడు. ఇశ్రాయేలీయుల చరిత్రలో యెహోవా అధిక బలంగల “చెయ్యి” తరచూ బలమైన శత్రువులను నిలువరించింది. (నిర్గమకాండము 7:4) అయితే, ఆయావ్యక్తుల పక్షాన కూడా యెహోవా తన రక్షణ శక్తిని ఉపయోగించాడు.

10, 11.ఆయా వ్యక్తుల పక్షాన యెహోవా తన రక్షణ శక్తిని ఎలా ఉపయోగించాడో ఏ బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి?

10 ముగ్గురు హెబ్రీయులు అంటే షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజైన నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు ప్రతిమకు సాగిలపడ్డానికి నిరాకరించినప్పుడు, అత్యాగ్రహుడైన రాజు వారిని మిగులవేడిగల అగ్నిగుండంలో వేస్తానని బెదిరించాడు. “నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?” అని భూమ్మీద అధిక శక్తిగల చక్రవర్తియైన ఆ నెబుకద్నెజరు దెప్పిపొడిచాడు. (దానియేలు 3:15) తమను కాపాడే దేవుని శక్తిపై ఆ ముగ్గురు యౌవనులకు పూర్తి నమ్మకముంది, అయితే ఆయనలా కాపాడతాడని వారు ముందుగానే అనుకోలేదు. అందుకే వారిలా సమాధానమిచ్చారు: “మేము సేవించుచున్న దేవుడు . . . మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు.” (దానియేలు 3:17) మామూలుకన్నా ఏడింతలు ఎక్కువ వేడిచేయబడిన ఆ అగ్నిగుండం నిజానికి వారి సర్వశక్తిగల దేవునికి ఒక పెద్ద లెక్కకాదు. ఆయన వారిని కాపాడాడు, చివరకు ఆ రాజు ఇలా అంగీకరించక తప్పలేదు: “ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు.”—దానియేలు 3:29.

11 తన జనితైక కుమారుని ప్రాణాన్ని యూదా కన్యయైన మరియ గర్భానికి మార్చినప్పుడు కూడా యెహోవా తన రక్షణ శక్తిని నిజంగా అసాధారణరీతిలో ప్రదర్శించాడు. మరియ ‘గర్భం ధరించి కుమారుని కంటుందని’ ఒక దేవదూత ఆమెకు చెప్పాడు. ఆ దేవదూత ఇలా వివరించాడు: “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును.” (లూకా 1:31, 35) దేవుని కుమారుడు ఇంతకు ముందెన్నడూ అంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు కనబడలేదు. మానవ తల్లి యొక్క పాపము, అపరిపూర్ణత ఆ గర్భస్థ పిండాన్ని కళంకితం చేస్తుందా? ఆ కుమారుడు పుట్టకముందే సాతాను అతనికి హానిచేయగలడా లేదా చంపగలడా? అసాధ్యం! నిజానికి, యెహోవా మరియ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు. అందువల్లనే ఏ అపరిపూర్ణతా, హానికర శక్తీ, హత్యచేయగల ఏ మానవుడూ లేదా ఏ దయ్యమైనా గర్భధారణ మొదలుకొని పెరుగుతున్న ఆ గర్భస్థ పిండానికి హాని చేయడం అసాధ్యం. యెహోవా యేసును ఆయన యౌవనకాలంలో సైతం ఎడతెగక కాపాడాడు. (మత్తయి 2:1-15) దేవుని నియమిత సమయం వరకు ఆయన ప్రియ కుమారుడు సురక్షితంగా ఉన్నాడు.

12.బైబిలు కాలాల్లో యెహోవా కొంతమందిని అద్భుతరీతుల్లో ఎందుకు కాపాడాడు?

12 యెహోవా కొంతమందిని అలాంటి అద్భుత రీతుల్లో ఎందుకు కాపాడాడు? చాలామంది విషయంలో మరింత ప్రాముఖ్యమైన దానికోసం అంటే తన సంకల్ప నెరవేర్పు కోసం యెహోవా ఆయా వ్యక్తులను కాపాడాడు. ఉదాహరణకు, శిశువైన యేసు ప్రాణాలతో ఉండడం, చివరకు యావత్‌ మానవాళికి ప్రయోజనం చేకూర్చే దేవుని సంకల్ప నెరవేర్పుకు ఆవశ్యకం. రక్షణ శక్తిని ప్రదర్శించిన అనేక ఘట్టాల వివరాలు ప్రేరేపిత లేఖనాల్లో ఒక భాగం, అవి “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై . . . మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.” (రోమీయులు 15:4) అవును, ఈ ఉదాహరణలు సర్వశక్తిగల మన దేవునిపట్ల మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. అయితే దేవుని నుండి నేడు మనమెలాంటి రక్షణను ఎదురుచూడవచ్చు?

దైవిక రక్షణ అంటే ఏదికాదని అర్థం

13.మన పక్షాన యెహోవా అద్భుతాలు చేయ బద్ధుడై ఉన్నాడా? వివరించండి.

13 రక్షణకు సంబంధించి దేవుని వాగ్దానమంటే దానర్థం, యెహోవా మన పక్షాన అద్భుతరీతిలో పనిచేయ బద్ధుడై ఉన్నాడని కాదు. మన దేవుడు ఈ పాత విధానంలో సమస్యల్లేని జీవితాన్ని ససేమిరా హామీ ఇవ్వడం లేదు. యెహోవా నమ్మకమైన సేవకులు చాలామంది బీదరికం, యుద్ధం, వ్యాధి, మరణంవంటి తీవ్ర విపత్తుల్ని ఎదుర్కొంటున్నారు. ఆయా వ్యక్తులుగా తన శిష్యులు తమ విశ్వాసాన్నిబట్టి చంపబడవచ్చని యేసు వారికి స్పష్టంగా చెప్పాడు. ఆ కారణంగానే అంతం వరకు సహించమని యేసు నొక్కిచెప్పాడు. (మత్తయి 24:9, 13) అద్భుతరీతిలో అందరినీ విడుదల చేయడానికి యెహోవా తన శక్తిని ఉపయోగిస్తే, యెహోవాను నిందించడానికి, దేవునిపట్ల మనకున్న నిజమైన భక్తిని ప్రశ్నించడానికి సాతానుకు ఆధారముండే అవకాశముంది.—యోబు 1:9, 10.

14.యెహోవా తన సేవకులందరినీ అన్ని సందర్భాల్లో ఒకే పద్ధతిలో కాపాడడని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

14 బైబిలు కాలాల్లో సైతం, తన సేవకులు అకాల మరణం చెందకుండా వారిలో ప్రతీ ఒక్కరిని సంరక్షించేందుకు యెహోవా తన రక్షణ శక్తిని ఉపయోగించలేదు. ఉదాహరణకు, రమారమి సా.శ. 44లో అపొస్తలుడైన యాకోబును హేరోదు చంపించాడు; కానీ, ఆ తర్వాత కొద్దికాలానికే “హేరోదు చేతిలోనుండి” పేతురు విడుదల చేయబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 12:1-11) యాకోబు సోదరుడైన యోహాను పేతురు యాకోబులకంటే ఎక్కువ కాలం జీవించాడు. కాబట్టి, దేవుడు తన సేవకులందరినీ ఒకే పద్ధతిలో కాపాడతాడని మనం నిశ్చయంగా ఎదురుచూడలేము. దానికితోడు, ‘కాలవశానికీ, అనూహ్య సంఘటనలకూ’ మనమందరమూ గురవుతామని మనకు తెలుసు. (ప్రసంగి 9:11, NW) అట్లయితే, నేడు యెహోవా మనల్నెలా కాపాడతాడు?

యెహోవా భౌతిక రక్షణ ఇస్తాడు

15, 16.(ఎ)యెహోవా తన ఆరాధకులకు సామూహికంగా భౌతిక రక్షణ ఇచ్చాడనేందుకు ఎలాంటి రుజువుంది? (బి) యెహోవా తన సేవకులను ఇప్పుడూ, ‘మహాశ్రమలలోనూ’ రక్షిస్తాడని మనమెందుకు గట్టి నమ్మకంతో ఉండవచ్చు?

15 మొదట భౌతిక రక్షణను పరిశీలించండి. యెహోవా ఆరాధకులమైన మనం, సామూహికంగా అలాంటి రక్షణను ఎదురుచూడవచ్చు. లేనట్లయితే, మనం సులభంగా సాతానుకు ఎర అవుతాము. సత్యారాధనను తుడిచిపెట్టడమే ‘ఈ లోకాధికారియైన’ సాతానుకు అతి ప్రియమనే సంగతి ఆలోచించండి. (యోహాను 12:31; ప్రకటన 12:17) భూమ్మీది అతి శక్తిమంతమైన ప్రభుత్వాలు కొన్ని మన ప్రకటనా పనిని నిషేధించి మనల్ని నామరూపాల్లేకుండా తుడిచివేయడానికి ప్రయత్నించాయి. అయినప్పటికీ, యెహోవా ప్రజలు స్థిరంగా నిలబడి నిరాటంకంగా ప్రకటనా పనిలో కొనసాగారు. సాపేక్షికంగా చిన్నదిగా, నిస్సహాయమైనదిగా కనిపిస్తున్న ఈ క్రైస్తవ గుంపు యొక్క కార్యకలాపాలను బలమైన దేశాలు ఎందుకు ఆపుజేయలేకపోయాయి? ఎందుకంటే యెహోవా తన బలమైన రెక్కలతో మనల్ని కాపాడాడు కాబట్టే.—కీర్తన 17:7, 8.

16 రాబోయే “మహాశ్రమల” కాలంలో భౌతిక రక్షణ విషయమేమిటి? యెహోవా తీర్పుల అమలును గురించి మనం భయపడనక్కర్లేదు. నిజానికి, ‘భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు.’ (ప్రకటన 7:14; 2 పేతురు 2:9) ఈ మధ్యకాలంలో మనం రెండు విషయాల గురించి ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉండవచ్చు. మొదటిది, ఈ భూమ్మీది నుండి విశ్వసనీయులైన తన సేవకులు తుడిచిపెట్టబడడాన్ని యెహోవా ఎన్నటికీ అనుమతించడు. రెండవది, అవసరమైతే పునరుత్థానం చేయడం ద్వారా యథార్థపరులకు తన నీతియుక్త నూతనలోకంలో నిత్యం జీవించే ప్రతిఫలమిస్తాడు. చనిపోయిన వారికి దేవుని జ్ఞాపకంలో ఉండడంకంటే సురక్షితమైన ప్రదేశం మరొకటి లేదు.—యోహాను 5:28, 29.

17.యెహోవా తన వాక్యము ద్వారా మనల్నెలా సంరక్షిస్తున్నాడు?

17 ఇప్పుడు కూడా, హృదయాలను స్వస్థపరిచే, జీవితాలను సంస్కరించుకొనేలా పురికొల్పే శక్తిగల తన సజీవ “వాక్యము” ద్వారా యెహోవా మనల్ని సంరక్షిస్తున్నాడు. (హెబ్రీయులు 4:12) దాని సూత్రాలు అన్వయించుకోవడం ద్వారా కొన్ని విషయాల్లో మనం భౌతిక హానినుండి కాపాడబడతాము. “నీకు ప్రయోజనము కలుగునట్లు . . . యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును” అని యెషయా 48:17 చెబుతోంది. దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించడం నిస్సందేహంగా మన ఆరోగ్యాన్ని కాపాడి మన ఆయుష్షు పెంచుతుంది. ఉదాహరణకు, జారత్వాన్ని విసర్జించి కల్మషం తొలగించుకోవాలనే బైబిలు సూత్రాన్ని అన్వయించుకోవడంవల్లే, భక్తిహీనులైన అనేకుల జీవితాలను సర్వనాశనం చేసే అపవిత్ర, హానికర అలవాట్లకు మనం దూరంగా ఉంటాము. (అపొస్తలుల కార్యములు 15:28, 29; 2 కొరింథీయులు 7:1) దేవుని వాక్య సంరక్షణకు మనమెంత కృతజ్ఞులమో గదా!

యెహోవా మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడతాడు

18.యెహోవా మనకెలాంటి ఆధ్యాత్మిక రక్షణ దయచేస్తున్నాడు?

18 అన్నింటికంటే ప్రాముఖ్యంగా, యెహోవా ఆధ్యాత్మిక రక్షణ ఇస్తున్నాడు. మన ప్రేమగల దేవుడు మనం పరీక్షలు తట్టుకోవడానికీ, ఆయనతో మన సంబంధం భద్రపరచుకోవడానికీ మనకు అవసరమైనదానితో మనల్ని ఆయత్తపరుస్తూ మనల్ని ఆధ్యాత్మిక హానినుండి కాపాడుతున్నాడు. ఆ విధంగా యెహోవా మన ప్రాణాలను కేవలం కొద్ది సంవత్సరాల కోసం కాదుగాని నిరంతరం కాపాడేందుకు చర్య తీసుకుంటాడు. మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడగల దేవుని ఏర్పాట్లలో కొన్నింటిని పరిశీలించండి.

19.మనకెదురయ్యే ఎలాంటి పరీక్షనైనా ఎదుర్కోవడానికి యెహోవా ఆత్మ మనకెలా సహాయం చేయగలదు?

19 యెహోవా “ప్రార్థన ఆలకించువాడు.” (కీర్తన 65:2) జీవన ఒత్తిళ్లు ముంచెత్తుతున్నట్లు అనిపించినప్పుడు, ఆయన ఎదుట మన హృదయాన్ని కుమ్మరించడం మనకెంతో ఉపశమనం కలిగిస్తుంది. (ఫిలిప్పీయులు 4:6, 7) ఆయన అద్భుతరీతిలో మన పరీక్షల్ని తొలగించకపోవచ్చు, కానీ మన హృదయపూర్వక ప్రార్థనలకు ప్రతిస్పందనగా ఆయన వాటితో వ్యవహరించగల జ్ఞానాన్ని మనకిస్తాడు. (యాకోబు 1:5, 6) అంతకంటే ఎక్కువగా, తనను అడిగేవారికి యెహోవా తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. (లూకా 11:13) ఆ శక్తిగల ఆత్మ మనకెదురయ్యే ఎలాంటి పరీక్షనైనా లేదా సమస్యనైనా ఎదుర్కోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఇప్పుడెంతో సమీపంగావున్న నూతనలోకంలో బాధాకరమైన సమస్యలన్నీ యెహోవా తొలగించేంతవరకు మనం సహించగల ‘బలాధిక్యాన్ని’ అది మనకిస్తుంది.—2 కొరింథీయులు 4:7.

20.యెహోవా రక్షణ శక్తి తోటి ఆరాధకుల ద్వారా ఎలా వ్యక్తం చేయబడవచ్చు?

20 కొన్నిసార్లు, యెహోవా రక్షణ శక్తి మన తోటి ఆరాధకుల ద్వారా వ్యక్తంచేయబడవచ్చు. యెహోవా తన ప్రజలను ప్రపంచవ్యాప్త ‘సహోదరత్వానికి’ ఆకర్షించాడు. (1 పేతురు 2:17; యోహాను 6:44) ఆప్యాయతగల ఆ సహోదరత్వంలో, ప్రజలు సజ్జనులుగా మారేలా దేవుని పరిశుద్ధాత్మ శక్తి వారిపై ప్రభావం చూపిస్తోందనడానికి సజీవ సాక్ష్యాన్ని మనం చూస్తాము. ఆ పరిశుద్ధాత్మ మనలో ఆత్మఫలాన్ని అంటే ప్రేమ, దయాళుత్వం, మంచితనంతోపాటు ఆకర్షణీయమైన, అమూల్యమైన లక్షణాలను ఉత్పన్నం చేస్తుంది. (గలతీయులు 5:22) కాబట్టి, మనం విపద్దశలో ఉన్నప్పుడు తోటి విశ్వాసి ఒకరు సహాయకరమైన సలహా ఇచ్చినప్పుడు లేదా ఎంతో అవసరమైన ప్రోత్సాహాన్నిచ్చే మాటలు పంచుకున్నప్పుడు యెహోవా దయచేసిన అలాంటి శ్రద్ధాపూర్వక రక్షణకు మనమాయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చు.

21.(ఎ)‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా యెహోవా తగినవేళ ఎలాంటి ఆధ్యాత్మిక ఆహారం దయచేస్తున్నాడు? (బి) మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడేందుకు యెహోవా దయచేస్తున్న ఏర్పాట్లనుండి వ్యక్తిగతంగా మీరెలా ప్రయోజనం పొందారు?

21 మనల్ని కాపాడేందుకు యెహోవా మరొకటి కూడా దయచేస్తున్నాడు, అదే తగినవేళ ఇవ్వబడే ఆధ్యాత్మిక ఆహారం. తన వాక్యంనుండి బలం పుంజుకొనేలా మనకు సహాయం చేయడానికి, ఆధ్యాత్మిక ఆహారం ఇవ్వాల్సిందిగా యెహోవా ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి’ ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ నమ్మకమైన దాసుడు “తగినవేళ అన్నము,” అంటే మనకు ఏది అవసరమో అది, ఎప్పుడు అవసరమో అప్పుడు అందజేయడానికి కావలికోట, తేజరిల్లు! పత్రికలతోపాటు ఇతర ముద్రిత సాహిత్యాలను, కూటాలను, వివిధ సమావేశాలను ఉపయోగిస్తున్నాడు. (మత్తయి 24:45) మీరెప్పుడైనా క్రైస్తవ కూటంలో ఒక వ్యాఖ్యానంలో, ప్రసంగంలో లేదా చివరికి ప్రార్థనలో సరిగ్గా మీకు అవసరమైన బలం, ప్రోత్సాహం ఇచ్చిన మాటలు ఎప్పుడైనా విన్నారా? మన పత్రికల్లో ఒకదానిలో ప్రచురించబడిన ఒకానొక ప్రత్యేక ఆర్టికల్‌ మీ జీవితంపై ఎప్పుడైనా ప్రభావం చూపిందా? మనల్ని ఆధ్యాత్మికంగా కాపాడేందుకే యెహోవా ఇవన్నీ దయచేస్తున్నాడని గుర్తుంచుకోండి.

22.యెహోవా ఎల్లప్పుడూ తన శక్తిని ఏ విధంగా ఉపయోగిస్తాడు, ఆయన అలా ఉపయోగించడం మనకు ఎందువల్ల ప్రయోజనార్థమవుతుంది?

22 “తన శరణుజొచ్చు వారికందరికి” యెహోవా నిశ్చయంగా ఒక కేడెము. (కీర్తన 18:30) ఆయన తన శక్తిని, ప్రస్తుత ప్రతీ విపత్తునుండి మనల్ని కాపాడేందుకు ఉపయోగించడని మనకు అర్థమవుతోంది. అయితే ఆయన తన సంకల్పం తప్పక నెరవేరడానికి అన్ని సందర్భాల్లో తన రక్షణ శక్తిని ఉపయోగిస్తాడు. అదీ, ఆయన తన ప్రజల ప్రయోజనార్థమే అలా చేస్తాడు. మనం యెహోవాకు సన్నిహితమై ఆయన ప్రేమలో నిలిచివుంటే, ఆయన మనకు పరిపూర్ణ నిత్యజీవమిస్తాడు. ఆ ఉత్తరాపేక్షను మనస్సులో ఉంచుకొని, ఈ విధానంలో కలిగే ఎలాంటి బాధనైనా నిజానికి ‘క్షణమాత్రముండే చులకని శ్రమగా’ దృష్టించుదము గాక.—2 కొరింథీయులు 4:18.