కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 8

పునరుద్ధరణ శక్తి—యెహోవా “సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు”

పునరుద్ధరణ శక్తి—యెహోవా “సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు”

1, 2.నేడు మానవ కుటుంబాన్ని ఎలాంటి నష్టాలు బాధిస్తున్నాయి, అవి మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

 ఒక పిల్లవాడు తనకు ఎంతో ఇష్టమైన ఆటబొమ్మ పోగొట్టుకునో, విరగ్గొట్టుకునో పెద్దపెట్టున ఏడుపు మొదలుపెట్టాడని అనుకుందాం. అప్పుడు ఆ పిల్లవాని ఏడుపు ఎంత హృదయవిదారకంగా ఉంటుందో గదా! అయితే పోయిన ఆ బొమ్మను అతని తల్లి/తండ్రి తిరిగి తెచ్చి ఇచ్చినప్పుడు లేదా దాన్ని బాగుచేసినప్పుడు ఆ పిల్లవాడి ముఖం ఎలా వెలిగిపోతుందో మీరెప్పుడైనా చూశారా? ఆ తల్లి/తండ్రికి బొమ్మను వెదకడం లేదా బాగుచేయడం చిన్న విషయమే కావచ్చు. అయితే పిల్లవాడి ముఖంనిండా నవ్వు, ఆనందాశ్చర్యాలే ఉంటాయి. ఇక దొరకదని ఆశవదులుకున్న బొమ్మ తిరిగి దొరికింది!

2 సర్వోన్నత తండ్రియైన యెహోవాకు తన భూసంబంధ పిల్లలు ఇక ఆశలేదని దృష్టించే వాటిని పునరుద్ధరించే శక్తి ఉంది. మనమిక్కడ పిల్లల ఆటబొమ్మలను సూచించడం లేదు. ‘అపాయకరమైన ఈ కాలాల్లో’ అంతకంటే మరి తీవ్రమైన నష్టాలను మనమెదుర్కోవాలి. (2 తిమోతి 3:1-5) ప్రజలు అపురూపంగా చూసుకునే అనేకం అంటే ఇల్లు, వస్తుసంపద, ఉద్యోగం, చివరకు ఆరోగ్యం కూడా ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తోంది. పర్యావరణ నాశనం గురించి, తత్ఫలితంగా కలుగుతున్న నష్టం గురించి, అనేక జీవజాతులు అంతరించిపోవడం గురించి ఆలోచించినప్పుడు మనం కూడా దిగులుపడుతుండవచ్చు. అయితే, మనం ప్రేమించినవారు మరణించినప్పుడు కలిగే బాధే మనపై అన్నింటికంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. పోగొట్టుకున్నామనే, ఏమీ చేయలేకపోయామనే భావాలు కృంగదీసేవిగా ఉండగలవు.—2 సమూయేలు 18:33.

3.అపొస్తలుల కార్యములు 3:21​లో ఎలాంటి ఓదార్పుకరమైన ఉత్తరాపేక్ష పేర్కొనబడింది, యెహోవా దానిని దేని ద్వారా నెరవేరుస్తాడు?

3 కాబట్టి యెహోవా పునరుద్ధరణ శక్తిని గురించి తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో గదా! మనం పరిశీలించబోతున్నట్లు, దేవుడు భూమ్మీదున్న తన పిల్లల కోసం ఎన్నింటినో పునరుద్ధరించగల, పునరుద్ధరించే అవకాశం ఉంది. వాస్తవానికి, ‘అన్నిటికి కుదురుబాటు’ చేయాలని యెహోవా సంకల్పిస్తున్నాడని బైబిలు చూపిస్తోంది. (అపొస్తలుల కార్యములు 3:21) దీనిని సాధించడానికి, యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిపాలించబడే మెస్సీయ రాజ్యాన్ని ఉపయోగిస్తాడు. ఈ రాజ్యం 1914లో పరలోకంలో పాలన ప్రారంభించిందని సాక్ష్యాధారాలు చూపిస్తున్నాయి. * (మత్తయి 24:3-14) ఏమి పునరుద్ధరించబడుతుంది? యెహోవా మహత్తరమైన పునరుద్ధరణా కార్యాలను కొన్నింటిని మనం పరిశీలిద్దాం. వీటిలో ఒకదానిని మనమిప్పటికే చూసి, అనుభవించవచ్చు. మిగతావి విస్తృత స్థాయిలో భవిష్యత్తులో జరుగుతాయి.

స్వచ్ఛారాధన పునరుద్ధరించబడడం

4, 5.సా.శ.పూ. 607లో దేవుని ప్రజలకు ఏమి సంభవించింది, యెహోవా వారికెలాంటి నిరీక్షణనిచ్చాడు?

4 యెహోవా ఇప్పటికే పునరుద్ధరించిన ఒక విషయం ఏమిటంటే సత్యారాధన. దీని అర్థమేమిటో గ్రహించేందుకు, మనం యూదా రాజ్య చరిత్రను క్లుప్తంగా పరిశీలిద్దాం. అలాచేయడం యెహోవా ఇప్పుడు తన పునరుద్ధరణ శక్తిని ఎలా ఉపయోగిస్తున్నాడనే దానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన అంతర్దృష్టిని మనకిస్తుంది.—రోమీయులు 15:4.

5 సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడినప్పుడు నమ్మకస్థులైన యూదులెలా భావించారో ఒకసారి ఊహించండి. వారి ప్రియతమ నగరం నాశనమైంది, దాని ప్రాకారాలు కూలద్రోయబడ్డాయి. అంతకంటే ఘోరంగా, యావత్‌ భూమిపై యెహోవా స్వచ్ఛారాధనకు ఏకైక కేంద్రమైన సొలొమోను కట్టిన మహిమాన్విత దేవాలయం శిథిలంగా మిగిలింది. (కీర్తన 79:1) తప్పించుకొన్నవారు బబులోనుకు చెరగా తీసుకుపోబడ్డారు, వారి స్వస్థలం పాడుబడిన అడవి మృగాల నెలవుగా వదిలేయబడింది. (యిర్మీయా 9:11) మానవ దృక్కోణం నుండి చూస్తే, సర్వం చేజారిపోయినట్లు అనిపించింది. (కీర్తన 137:1) అయితే ఈ నాశనం గురించి ఎంతోకాలం ముందే చెప్పిన యెహోవా, పునరుద్ధరణ కాలం రాబోతోందనే నిరీక్షణనిచ్చాడు.

6-8.(ఎ)హెబ్రీ ప్రవక్తల వ్రాతల్లో పదే పదే ఏ మూలాంశం కనబడుతుంది, అలాంటి ప్రవచనాలు మొదట ఎలా నెరవేరాయి? (బి) ఆధునిక కాలాల్లో, దేవుని ప్రజలెలా అనేక పునరుద్ధరణ ప్రవచనాల నెరవేర్పును అనుభవించారు?

6 వాస్తవానికి పునరుద్ధరణ హెబ్రీ ప్రవక్తల వ్రాతల్లో పదే పదే కనబడే మూలాంశంగా ఉంది. * వారి ద్వారా యెహోవా, పునరుద్ధరించబడి తిరిగి ప్రజలతో నింపబడే ఫలవర్ధకమైన, అడవి మృగాల దాడులు, శత్రువుల దాడులు లేని దేశాన్ని వాగ్దానం చేశాడు. వారి పునరుద్ధరించబడిన దేశాన్ని ఆయన ఒక నిజమైన పరదైసుగా వర్ణించాడు. (యెషయా 65:25; యెహెజ్కేలు 34:25; 36:35) అన్నింటికంటే మిన్నగా, స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడుతుంది, ఆలయం తిరిగి కట్టబడుతుంది. (మీకా 4:1-5) ఈ ప్రవచనాలు చెరలోవున్న యూదులకు నిరీక్షణనిచ్చి, బబులోనులో 70 సంవత్సరాల నిర్బంధాన్ని వారు సహించడానికి సహాయపడ్డాయి.

7 చివరకు పునరుద్ధరణ కాలం రానేవచ్చింది. బబులోను నుండి విడిపించబడిన యూదులు యెరూషలేముకు తిరిగివచ్చి అక్కడ యెహోవా ఆలయాన్ని పునర్నిర్మించారు. (ఎజ్రా 1:1, 2) వారు స్వచ్ఛారాధనకు హత్తుకొని ఉన్నంత కాలం, యెహోవా వారిని ఆశీర్వదించి వారి దేశాన్ని ఫలవర్ధకంచేసి వర్ధిల్లజేశాడు. దశాబ్దాలపాటు ఆక్రమించుకున్న అడవి మృగాల, శత్రువుల బారినుండి ఆయన వారిని కాపాడాడు. యెహోవా పునరుద్ధరణ శక్తినిబట్టి వారెంతగా ఆనందించి ఉంటారో గదా! కానీ ఆ సంఘటనలు కేవలం పునరుద్ధరణ ప్రవచనాల ప్రారంభపు, పరిమిత నెరవేర్పును మాత్రమే సూచించాయి. మరింత గొప్ప నెరవేర్పు, బహుకాలంగా వాగ్దానం చేయబడ్డ దావీదు వారసుడు సింహాసనాన్ని అధిష్ఠించే “అంత్యదినములలో” అంటే మన కాలంలో జరుగనుంది.—యెషయా 2:2-4; 9:6, 7.

8 పరలోక రాజ్యంలో 1914లో యేసు సింహాసనం అధిష్ఠించిన కొద్దికాలానికే ఈ భూమ్మీది దేవుని నమ్మకమైన ప్రజల ఆధ్యాత్మిక అవసరతలవైపు తన అవధానం మళ్లించాడు. సా.శ.పూ. 537లో పారసీక విజయసారధి కోరెషు బబులోను నుండి కొంతమంది యూదులను విడిపించినట్లే, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన ఆధునికదిన బబులోను ప్రభావాల నుండి యేసు తన అడుగుజాడల్లో నడుస్తున్న అనుచరులైన ఆధ్యాత్మిక యూదుల శేషాన్ని విడిపించాడు. (రోమీయులు 2:29; ప్రకటన 18:1-5) స్వచ్ఛారాధన 1919 మొదలుకొని, నిజ క్రైస్తవుల జీవితాల్లో దాని సరైన స్థానంలోకి పునరుద్ధరించబడింది. (మలాకీ 3:1-5) అప్పటి నుండి, యెహోవా ప్రజలు శుభ్రపర్చబడిన ఆధ్యాత్మిక ఆలయంలో అంటే దేవుని స్వచ్ఛారాధన ఏర్పాటులో ఆయనను ఆరాధించారు. నేడు మనకిది ఎందుకు ప్రాముఖ్యం?

ఆధ్యాత్మిక పునరుద్ధరణ—అదెందుకు ప్రాముఖ్యం

9.అపొస్తలుల కాలం తర్వాత దేవుని ఆరాధనకు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు ఏమిచేశాయి, అయితే మన కాలంలో యెహోవా ఏమిచేశాడు?

9 చారిత్రక దృష్టికోణాన్ని పరిశీలించండి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అనేక ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అనుభవించారు. అయితే స్వచ్ఛారాధన భ్రష్టుపట్టి, అదృశ్యమవుతుందని యేసు, అపొస్తలులు ముందేచెప్పారు. (మత్తయి 13:24-30; అపొస్తలుల కార్యములు 20:29, 30) అపొస్తలుల కాలం ముగిసిన తర్వాత, క్రైస్తవమత సామ్రాజ్యం ఉద్భవించింది. దాని మతనాయకులు అన్యమతాల బోధలను, ఆచారాలను స్వీకరించారు. దేవుణ్ణి అర్థంకాని త్రిత్వంగా చిత్రీకరిస్తూ, ప్రీస్టులముందు తప్పులు ఒప్పుకోవాలంటూ, యెహోవాకు బదులు మరియకూ వివిధ “పరిశుద్ధులకూ” ప్రార్థించాలని బోధిస్తూ వారు ఆయనను సమీపించడాన్ని పూర్తిగా అసాధ్యం చేశారు. అలాంటి భ్రష్టత్వం అనేక శతాబ్దాలపాటు కొనసాగిన తర్వాత ఇప్పుడు యెహోవా ఏమిచేశాడు? మతసంబంధమైన అబద్ధాలతో, భక్తిహీన ఆచారాలతో అసహ్యంగా తయారైన నేటి లోక పరిస్థితుల మధ్యన ఆయన కలుగజేసుకొని స్వచ్ఛారాధనను పునరుద్ధరించాడు. అతిశయోక్తిగా చెప్పడం కాదుగాని ఆధునికకాల సంఘటనల్లో ఈ పునరుద్ధరణ అత్యంత ప్రాముఖ్యమైనది.

10, 11.(ఎ)ఆధ్యాత్మిక పరదైసులో ఏ రెండు అంశాలు ఇమిడివున్నాయి, వీటినిబట్టి మీరెలా ప్రభావితులయ్యారు? (బి) యెహోవా ఆధ్యాత్మిక పరదైసులోకి ఎలాంటి ప్రజలను సమకూర్చాడు, వారికి దేనిని కళ్లారాచూసే ఆధిక్యత లభిస్తుంది?

10 ఆ కారణంగానే నిజ క్రైస్తవులు నేడు ఆధ్యాత్మిక పరదైసును అనుభవిస్తున్నారు. ఈ పరదైసులో ఏమేమి ఇమిడివున్నాయి? అందులో ప్రాథమికంగా రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది, సత్యదేవుడైన యెహోవా స్వచ్ఛారాధన. అబద్ధాలు, అపార్థాలు లేని ఆరాధనా విధానంతో ఆయన మనల్ని దీవించాడు. ఆధ్యాత్మిక ఆహారంతో ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఇది మన పరలోకపు తండ్రి గురించి తెలుసుకోవడానికి, ఆయనను సంతోషపరచడానికి, ఆయనకు సన్నిహితమవడానికి మనకు సహాయం చేస్తుంది. (యోహాను 4:24) ఆధ్యాత్మిక పరదైసు యొక్క రెండవ అంశంలో ప్రజలు ఇమిడివున్నారు. యెషయా ముందే చెప్పినట్లు, “అంత్యదినములలో” యెహోవా తన సమాధాన మార్గాల గురించి తన ఆరాధకులకు బోధించాడు. ఆయన మనలో యుద్ధాలు రూపుమాపాడు. మనకు అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ మనం “నవీనస్వభావమును” ధరించుకోవడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. మనలో చక్కని లక్షణాలు ఉత్పన్నం చేసే తన పరిశుద్ధాత్మనిచ్చి ఆయన మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్నాడు. (ఎఫెసీయులు 4:22-24; గలతీయులు 5:22) దేవుని ఆత్మానుసారంగా మీరు పనిచేసినప్పుడు, మీరు నిజంగా ఆధ్యాత్మిక పరదైసులో భాగమవుతారు.

11 యెహోవా ఈ ఆధ్యాత్మిక పరదైసులోకి, తాను ప్రేమించే ప్రజలను అంటే తనను ప్రేమించేవారిని, సమాధానాన్ని ప్రేమించేవారిని, “తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారిని” సమకూర్చాడు. (మత్తయి 5:3, NW) అలాంటి ప్రజలకే అత్యద్భుత పునరుద్ధరణ అంటే మానవాళి, యావత్‌ భూమి పునరుద్ధరించబడడాన్ని కళ్లారా చూసే ఆధిక్యత లభిస్తుంది.

“ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”

12, 13.(ఎ)పునరుద్ధరణ ప్రవచనాలు మరోవిధంగా కూడా ఎందుకు నెరవేరాలి? (బి) ఏదెనులో చెప్పబడినట్లుగా భూమిపట్ల యెహోవా సంకల్పమేమిటి, ఇది మనకు భవిష్యత్తు గురించి నిరీక్షణను ఎందుకివ్వాలి?

12 అనేక పునరుద్ధరణ ప్రవచనాలు కేవలం ఆధ్యాత్మిక పరదైసుకంటే ఇంకా ఎక్కువే సూచిస్తున్నట్లున్నాయి. ఉదాహరణకు, వ్యాధిగ్రస్తులు, కుంటివారు, గ్రుడ్డివారు, చెవిటివారు స్వస్థపరచబడే, చివరకు మరణం శాశ్వతంగా మ్రింగివేయబడే కాలం గురించి యెషయా వ్రాశాడు. (యెషయా 25:8; 35:1-7) అలాంటి వాగ్దానాలు ప్రాచీన ఇశ్రాయేలులో అక్షరార్థ నెరవేర్పును చూడలేదు. మన కాలంలో ఈ వాగ్దానాల ఆధ్యాత్మిక నెరవేర్పును మనం చూసినప్పటికీ, భవిష్యత్తులో వాటికి పూర్తి స్థాయిలో అక్షరార్థ నెరవేర్పు ఉంటుందని నమ్మడానికి మనకు ప్రతీ కారణం ఉంది. ఆ విషయం మనకెలా తెలుసు?

13 పూర్వకాలమే, ఏదెనులో భూమిపట్ల తన సంకల్పమేమిటో యెహోవా స్పష్టంచేశాడు, సంతోషభరితమైన, ఆరోగ్యదాయకమైన, ఐక్య మానవ కుటుంబంతో భూమి నివాసభరితం కావాలనేదే ఆ సంకల్పం. ఆ స్త్రీపురుషులు ఈ భూమిని, దీనిమీది సమస్త ప్రాణులను శ్రద్ధగా చూసుకుంటూ, ఈ గ్రహాన్నంతా పరదైసుగా మార్చవలసింది. (ఆదికాండము 1:28) అయితే ప్రస్తుతమున్న పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అయిననూ యెహోవా సంకల్పాలు ఎన్నటికీ అడ్డగింపబడవనే నమ్మకంతో ఉండండి. (యెషయా 55:10, 11) యెహోవా నియమిత మెస్సీయ రాజుగా యేసు ఈ భౌగోళిక పరదైసును తీసుకువస్తాడు.—లూకా 23:43.

14, 15.(ఎ)యెహోవా “సమస్తమును నూతనమైనవిగా” ఎలా చేస్తాడు? (బి) పరదైసులో జీవితమెలా ఉంటుంది, మీకు ఏ అంశం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది?

14 భూమంతా పరదైసుగా మారడం చూస్తున్నట్లు ఒక్కసారి ఊహించుకోండి! ఆ కాలం గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు: “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను.” (ప్రకటన 21:5) దీని భావమేమిటో ఆలోచించండి. ఈ పాత దుష్టవిధానంపై యెహోవా తన నాశక శక్తిని ప్రయోగించడం ముగించిన తర్వాత, ‘క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి’ నిలిచివుంటాయి. అంటే యెహోవాను ప్రేమిస్తూ ఆయన చిత్తంచేసే వారితో నిండిన క్రొత్త భూసమాజంపై పరలోకం నుండి ఒక క్రొత్త ప్రభుత్వం పరిపాలిస్తుందని దీనర్థం. (2 పేతురు 3:13) సాతాను అతని దయ్యాలు కార్యశూన్యులుగా చేయబడతారు. (ప్రకటన 20:2, 3) వేలాది సంవత్సరాల్లో మొదటిసారిగా మానవాళికి అవినీతి, ద్వేషం, ప్రతికూల ప్రభావాలనుండి స్వేచ్ఛ లభిస్తుంది. నిస్సందేహంగా ఆ స్వేచ్ఛాభావం చాలా గొప్పగా ఉంటుంది.

15 చివరకు, మనమందరం తొలి ఉద్దేశం చొప్పున ఈ అందమైన గ్రహాన్ని శ్రద్ధగా చూసుకోగలుగుతాము. భూమికి సహజ పునరుద్ధరణ శక్తివుంది. కాలుష్యానికి కారణమైనవి తొలగించబడినప్పుడు కలుషిత సరస్సులు, నదులు వాటంతటవే పరిశుభ్రం అవుతాయి; యుద్ధాలు లేనప్పుడు యుద్ధం కారణంగా పాడైన స్థలాలు చక్కని ప్రాంతాలయ్యే అవకాశముంది. ఈ భూమిని ఒక ఉద్యానవనంగా అంటే, వివిధ రకాల మొక్కలు జంతువులు గల భౌగోళిక ఏదెనులా మార్చడానికి సహాయపడుతూ, దాని సహజ శక్తులకు తగ్గట్టుగా పనిచేయడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో గదా! బాధ్యతారహితంగా జంతు, వృక్షజాతులను నాశనం చేయడానికి బదులు మానవుడు భూమ్మీది సమస్త సృష్టితో శాంతియుతంగా జీవిస్తాడు. పిల్లలు సైతం అడవి మృగాల భయం ఏమాత్రం లేకుండా ఉంటారు.—యెషయా 9:6, 7; 11:1-9.

16.పరదైసులో నమ్మకస్థుడైన ప్రతీ వ్యక్తిపై ఏ పునరుద్ధరణ ప్రభావం చూపుతుంది?

16 మనం ఈ పునరుద్ధరణను వ్యక్తిగత స్థాయిలో కూడా అనుభవిస్తాం. అర్మగిద్దోను తర్వాత, రక్షించబడినవారు భూవ్యాప్తంగా అద్భుతరీతిలో స్వస్థతలు కలగడం చూస్తారు. యేసు తాను ఈ భూమ్మీద ఉన్నప్పుడు చేసినట్లే, దేవుడిచ్చిన శక్తితో గ్రుడ్డివారికి చూపును, చెవిటివారికి వినికిడిని, కుంటి వారికి, బలహీనులకు ఆరోగ్యవంతమైన శరీరాలను పునరుద్ధరిస్తాడు. (మత్తయి 15:30) వృద్ధులు తాము తిరిగిపొందిన యౌవన బలం, ఆరోగ్యం, శక్తి వల్ల వారి ఆనందానికి అవధులుండవు. (యోబు 33:25) చర్మపు ముడతలు మటుమాయమౌతాయి, కాళ్లు చేతులకు సత్తువ వస్తుంది, నూతనోత్తేజంతో కండరాలు బలపడతాయి. యథార్థ మానవులందరూ క్రమేపి పాప అపరిపూర్ణతల ప్రభావాలు తగ్గిపోతూ, తొలగిపోవడం గమనిస్తారు. యెహోవాకున్న అద్భుతమైన పునరుద్ధరణ శక్తినిబట్టి ఆయనకు మనమెంతగా కృతజ్ఞతలు చెబుతామో గదా! ఉత్కంఠభరితమైన ఈ పునరుద్ధరణ కాలంలో ప్రత్యేకంగా హృదయాన్ని పులకింపజేసే మరో అంశంపై మనమిప్పుడు దృష్టి కేంద్రీకరిద్దాం.

మృతులకు జీవ పునరుద్ధరణ

17, 18.(ఎ)యేసు సద్దూకయ్యులను ఎందుకు గద్దించాడు? (బి) పునరుత్థానం చేయమని ఏలీయా యెహోవాను వేడుకోవడానికి ఎలాంటి పరిస్థితులు దారితీసాయి?

17 సా.శ. మొదటి శతాబ్దంలో, సద్దూకయ్యులనబడిన కొందరు మతనాయకులు పునరుత్థానాన్ని నమ్మలేదు. యేసు వారినిలా గద్దించాడు: “లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.” (మత్తయి 22:29) అవును, యెహోవాకు అలాంటి పునరుద్ధరణ శక్తివుందని లేఖనాలు వెల్లడిస్తున్నాయి. ఎలా?

18 ఏలీయా కాలంలో ఏమి జరిగిందో చిత్రీకరించుకోండి. ఒక విధవరాలి చేతుల్లో తన ఏకైక కుమారుని నిర్జీవ శరీరం వ్రేలాడుతోంది. ఆ పిల్లవాడు చనిపోయాడు. కొంతకాలం ఆ విధవరాలి అతిథిగావున్న ఏలీయా ప్రవక్త అదిచూసి నిర్ఘాంతపోయి ఉంటాడు. అంతకుముందు, ఆకలిచావునుండి ఆయన ఆ పిల్లవాణ్ణి ఆదుకోవడంలో సహాయపడ్డాడు. ఏలీయా బహుశా ఆ పిల్లవాడికి బాగా దగ్గరయ్యుంటాడు. దుఃఖంతో ఆ తల్లి గుండె పగిలింది. ఆమెకు ఆ పిల్లవాడే, మరణించిన తన భర్త జ్ఞాపకాలకు ఏకైక సజీవరూపం. తన వృద్ధాప్యంలో ఆ కుమారుడే తనను ఆదుకుంటాడని ఆమె ఆశలు పెట్టుకుని ఉంటుంది. దుఃఖాక్రాంతురాలైన, ఆ విధవరాలు తన గత దోషాన్నిబట్టి తాను శిక్షించబడుతున్నానని భయపడింది. ఇంత ఘోరమైన ఈ విషాద సంఘటనను ఏలీయా చూడలేకపోయాడు. నెమ్మదిగా ఆయన ఆ తల్లి ఒడినుండి శవాన్ని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి ఆ పిల్లవాడికి తిరిగి ప్రాణమిమ్మని యెహోవా దేవుణ్ణి వేడుకున్నాడు.—1 రాజులు 17:8-21.

19, 20.(ఎ)యెహోవా పునరుద్ధరణ శక్తిపై తనకు విశ్వాసముందని అబ్రాహాము ఎలా చూపించాడు, అలాంటి విశ్వాసానికి ఆధారమేమిటి? (బి) ఏలీయా చూపిన విశ్వాసానికి యెహోవా ఏ విధంగా ప్రతిఫలమిచ్చాడు?

19 పునరుత్థానాన్ని నమ్మిన ప్రథమ వ్యక్తి ఒక్క ఏలీయా మాత్రమే కాదు. శతాబ్దాలకు పూర్వమే, యెహోవాకు అలాంటి పునరుద్ధరణ శక్తి ఉందని అబ్రాహాము నమ్మాడు, అలా నమ్మడానికి ఆయనకు మంచి కారణమే ఉంది. అబ్రాహాముకు 100 సంవత్సరాల వయస్సు, శారాకు 90 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు శారా కుమారుణ్ణి కనేందుకు గాను, వారిలో ఉడిగిపోయిన పునరుత్పాదక శక్తులను యెహోవా అద్భుత రీతిలో పునరుద్ధరించాడు. (ఆదికాండము 17:17; 21:2, 3) ఆ తర్వాత, పిల్లవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ కుమారుణ్ణి బలి ఇవ్వాల్సిందిగా యెహోవా అబ్రాహామును కోరాడు. ఆయన తన ప్రియకుమారుణ్ణి యెహోవా తిరిగి బ్రతికించగలడనే నమ్మకంతో తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. (హెబ్రీయులు 11:17-19) అబ్రాహాము తన కుమారుని అర్పించడానికి కొండమీదికి ఎక్కిపోకముందు తాను ఇస్సాకు తిరిగి వారియొద్దకు వస్తామని తన సేవకులకు ఎందుకు నమ్మకంగా చెప్పాడో అలాంటి బలమైన విశ్వాసం వివరిస్తుంది.—ఆదికాండము 22:5.

‘ఇదిగో నీ కుమారుడు బ్రదికాడు’!

20 యెహోవా ఇస్సాకును తప్పించాడు కాబట్టి ఆ కాలంలో పునరుత్థాన అవసరం ఏర్పడలేదు. అయితే ఏలీయా కాలంలో ఆ విధవరాలి కుమారుడు అప్పటికే చనిపోయాడు, అయితే అతడు చనిపోయి ఎక్కువ సమయం గడవలేదు. ఆ పిల్లవాణ్ణి పునరుత్థానం చేయడం ద్వారా యెహోవా ఆ ప్రవక్త విశ్వాసానికి ప్రతిఫలమిచ్చాడు. అప్పుడు ఏలీయా ఆ పిల్లవాణ్ణి తల్లికప్పగిస్తూ మరువరాని ఈ మాటలు పలికాడు: ‘ఇదిగో నీ కుమారుడు బ్రదికాడు.’—1 రాజులు 17:22-24.

21, 22.(ఎ)లేఖనాల్లో గ్రంథస్తం చేయబడ్డ పునరుత్థానాల ఉద్దేశమేమిటి? (బి) పరదైసులో పునరుత్థానమెంత విస్తృతంగా జరుగుతుంది, ఎవరు పునరుత్థానం చేస్తారు?

21 ఆ విధంగా బైబిలు చరిత్రలో మొదటిసారిగా, మానవ ప్రాణాన్ని పునరుద్ధరించడానికి యెహోవా తన శక్తిని ఉపయోగించడం మనం చూస్తాం. ఆ తర్వాత యెహోవా మృతులను పునరుత్థానం చేయడానికి ఎలీషా, యేసు, పౌలు, పేతురులకు కావలసిన బలాన్నిచ్చాడు. నిజమే, అలా పునరుత్థానం చేయబడినవారు చివరకు మరణించారు. అయితే అలాంటి బైబిలు వృత్తాంతాలు రానున్న సంగతుల అద్భుత ముంగుర్తును మనకిస్తాయి.

22 పరదైసులో, యేసు ‘పునరుత్థానముగా, జీవముగా’ తన పాత్రను నెరవేరుస్తాడు. (యోహాను 11:25) పరదైసు భూమిపై నిత్యం జీవించే అవకాశమిస్తూ ఆయన లక్షలాది మందిని పునరుత్థానం చేస్తాడు. (యోహాను 5:28, 29) మరణంలో దీర్ఘకాలంగా విడిపోయిన తమ ప్రియతమ స్నేహితులను, బంధువులను తిరిగి కలుసుకొని పరస్పరం కౌగిలించుకుంటూ వారు ఆనందంగా తమ దగ్గరే ఉండడాన్ని ఊహించుకోండి. యెహోవా పునరుద్ధరణ శక్తినిబట్టి యావత్‌ మానవాళి ఆయనను స్తుతిస్తుంది.

23.యెహోవా శక్తి ప్రదర్శనల్లోకెల్లా విశిష్టమైనదేది, ఇది మన భవిష్యత్తు నిరీక్షణకెలా హామీ ఇస్తోంది?

23 అలాంటి నిరీక్షణలు నమ్మదగినవే అనడానికి యెహోవా సుస్థిరమైన హామీ ఇస్తున్నాడు. యెహోవా తన శక్తి ప్రదర్శనలన్నింటిలోకీ విశిష్టమనే రీతిలో, తన కుమారుడైన యేసును గొప్పబలంగల ఆత్మసంబంధ ప్రాణిగా పునరుత్థానంచేసి ఆయనను తన తర్వాత తనంతటివాణ్ణి చేశాడు. పునరుత్థానం చేయబడిన యేసు వందలాదిమంది ప్రత్యక్షసాక్షులకు కనబడ్డాడు. (1 కొరింథీయులు 15:5, 6) సంశయవాదులకు సైతం అలాంటి సాక్ష్యం సరిపోతుంది. జీవాన్ని పునరుద్ధరించే శక్తి యెహోవాకు ఉంది.

24.యెహోవా మృతులను పునరుత్థానం చేస్తాడని మనమెందుకు నమ్మకంతో ఉండవచ్చు, మనలో ప్రతీ ఒక్కరం ఏ నిరీక్షణను విలువైనదిగా ఎంచాలి?

24 యెహోవాకు కేవలం మృతులను పునరుద్ధరించే శక్తి ఉండడం మాత్రమే కాదు, ఆయనకు అలాచేయాలనే కోరిక కూడా ఉంది. యెహోవాకు నిజానికి మృతులను తిరిగి జీవానికి తెచ్చే ఇష్టత ఉందని చెప్పేలా నమ్మకస్థుడైన యోబు ప్రేరేపించబడ్డాడు. (యోబు 14:15) తన పునరుద్ధరణ శక్తిని అంత ప్రేమపూర్వకమైన విధంగా ఉపయోగించడానికి అత్యాకాంక్షగల మన దేవునివైపు మీరు ఆకర్షించబడడం లేదా? అయితే పునరుత్థానం, యెహోవా చేయనున్న గొప్ప పునరుద్ధరణ పనిలో కేవలం ఒక భాగం మాత్రమేనని గుర్తుంచుకోండి. యెహోవాకు ముందటికంటే మరెక్కువ సన్నిహితమవుతుండగా, ఆయన “సమస్తమును నూతనమైనవిగా” చేస్తుండగా చూడడానికి మీరు ఉండగలరనే ఆ అమూల్య నిరీక్షణను అన్ని సమయాల్లో విలువైనదిగా ఎంచండి.—ప్రకటన 21:5.

^ నమ్మకస్థుడైన దావీదు రాజు వారసుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టి మెస్సీయ రాజ్యం స్థాపించబడినప్పుడు “అన్నిటికి కుదురుబాటు కాలములు” ఆరంభమయ్యాయి. దావీదు వారసుడు నిరంతరం పరిపాలిస్తాడని యెహోవా ఆయనకు వాగ్దానం చేశాడు. (కీర్తన 89:35-37) అయితే సా.శ.పూ. 607లో బబులోను యెరూషలేమును నాశనం చేసిన తర్వాత, దావీదు మానవ సంబంధ వంశస్థులెవ్వరూ దేవుని సింహాసనంపై కూర్చోలేదు. దావీదు వారసునిగా భూమిపై జన్మించిన యేసు, పరలోకంలో సింహాసనం అధిష్ఠించినప్పుడు ఎంతోకాలం క్రితం వాగ్దానం చేయబడిన రాజయ్యాడు.

^ ఉదాహరణకు, మోషే, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, హోషేయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, మీకా, జెఫన్యా వీరందరూ ఈ మూలాంశాన్నే ప్రకటించారు.