కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 10

మీ బలాన్ని ఉపయోగించడంలో ‘దేవునిపోలి నడుచుకోండి’

మీ బలాన్ని ఉపయోగించడంలో ‘దేవునిపోలి నడుచుకోండి’

1.అపరిపూర్ణ మానవులు ఎలాంటి మోసపూరితమైన ప్రమాదపు ఉరిలో సులభంగా పడతారు?

 “సాధారణంగా అధికారంలో ఉన్న ఎవరికైనా ఒక నిగూఢ ప్రమాదపు ఉరి పొంచి ఉంటుంది.” 19వ శతాబ్దానికి చెందిన ఒక కవయిత్రి వ్రాసిన ఆ మాటలు ఒక మోసపూరితమైన ప్రమాదాన్ని మన దృష్టికి తీసుకువస్తాయి, అదేమిటంటే అధికార దుర్వినియోగం. విచారకరంగా, అపరిపూర్ణ మానవులందరూ ఈ అధికార దుర్వినియోగ ఉరిలో సులభంగా పడిపోతుంటారు. అవును, చరిత్రంతటిలో “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” (ప్రసంగి 8:9) ప్రేమలేని అధికారం చెప్పలేని మానవ బాధలకు కారణమైంది.

2, 3.(ఎ)యెహోవా శక్తిని ఉపయోగించడానికి సంబంధించి ఏది గమనార్హమైనది? (బి) మన శక్తిలో ఏమి ఇమిడివుండవచ్చు, అలాంటి శక్తినంతా మనమెలా ఉపయోగించాలి?

2 అయితే అంతులేని శక్తిగల యెహోవా దేవుడు తన అధికారాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయకపోవడం గమనార్హం కాదా? మనం ముందటి అధ్యాయాల్లో గమనించినట్లుగా, ఎల్లప్పుడూ ఆయన తన శక్తిని, అది సృష్టి శక్తే అయినా, నాశక శక్తే అయినా, రక్షణ శక్తే అయినా లేదా పునరుద్ధరణ శక్తే అయినా ఆయన దాన్ని తన ప్రేమపూర్వక సంకల్పాలకు అనుగుణంగానే ఉపయోగిస్తాడు. ఆయన తన శక్తిని ఉపయోగించే విధానాన్ని మనం ధ్యానించినప్పుడు మనమాయనకు సన్నిహితం కావడానికి పురికొల్పబడతాం. అది, తిరిగి మనం మన శక్తిని ఉపయోగించడంలో ‘దేవునిపోలి నడుచుకోవడానికి’ మనల్ని ప్రోత్సహిస్తుంది. (ఎఫెసీయులు 5:1) అయితే అల్పమానవులమైన మనకెలాంటి శక్తివుంది?

3 మానవుడు “దేవుని స్వరూపమందు,” ఆయన పోలికగా సృష్టించబడ్డాడని గుర్తుంచుకోండి. (ఆదికాండము 1:26, 27) కాబట్టి మనకు కూడా కనీసం కొంతలో కొంత శక్తి ఉంది. మన శక్తిలో పనులుచేసే సామర్థ్యం, ఇతరులపై పెత్తనం లేదా అధికారంచేసే బలం, ఇతరులను ప్రత్యేకంగా మనల్ని ప్రేమించేవారిని ప్రభావితం చేయగల సామర్థ్యం, శారీరక బలం లేదా వస్తుసంపదలు వంటివి ఇమిడి ఉండవచ్చు. యెహోవా గురించి కీర్తనకర్త ఇలా చెప్పాడు: “నీయొద్ద జీవపు ఊట కలదు.” (కీర్తన 36:9) అందువల్ల, పత్యక్షంగా లేదా పరోక్షంగా మనకు న్యాయబద్ధంగా ఉన్న ఏ శక్తికైనా దేవుడే మూలాధారం. కాబట్టి మనం దానిని ఆయనను సంతోషపెట్టే రీతిలో ఉపయోగించాలని కోరుకుంటాం. ఆ విధంగా మనమెలా ఉపయోగించగలము?

ప్రేమే కీలకమైనది

4, 5.(ఎ)అధికారాన్ని సరిగా ఉపయోగించడానికి కీలకమైనది ఏమిటి, దేవుని సొంత మాదిరి దీనినెలా ప్రదర్శిస్తోంది? (బి) మన అధికారాన్ని సరిగా ఉపయోగించడానికి ప్రేమ మనకెలా సహాయం చేస్తుంది?

4 అధికారాన్ని సరిగా ఉపయోగించడానికి కీలకమైనది ప్రేమ. దేవుని సొంత మాదిరే దీనిని ప్రదర్శించడం లేదా? మొదటి అధ్యాయంలో దేవుని నాలుగు ప్రధాన లక్షణాలు అంటే శక్తి, న్యాయము, జ్ఞానము, ప్రేమ గురించిన చర్చను గుర్తుతెచ్చుకోండి. ఆ నాలుగు లక్షణాల్లో ఏది ప్రబలంగా ఉంటుంది? ప్రేమ. “దేవుడు ప్రేమాస్వరూపి” అని 1 యోహాను 4:8 చెబుతోంది. అవును, యెహోవా తత్వసారాంశమే ప్రేమ; అది ఆయన చేసే సర్వాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆయన అధికారాన్ని ప్రదర్శించే ప్రతీపని ప్రేమచే పురికొల్పబడుతుంది, చివరకది ఆయనను ప్రేమించే వారందరి మేలుకోసమే ప్రదర్శించబడుతుంది.

5 మన అధికారాన్ని సరిగా ఉపయోగించడానికి కూడా ప్రేమ మనకు సహాయం చేస్తుంది. నిజానికి ప్రేమ “దయ చూపించును,” “స్వప్రయోజనమును విచారించుకొనదు” అని బైబిలు మనకు చెబుతోంది. (1 కొరింథీయులు 13:4, 5) కాబట్టి, ఎవరిపై మనకు అధికారం ఉంటుందో వారిపట్ల కఠినంగా లేదా క్రూరంగా ప్రవర్తించడానికి ప్రేమ మనల్ని అనుమతించదు. బదులుగా, మనం ఇతరులను గౌరవంగా చూస్తూ మన సొంత అవసరాలు, భావాలకంటే వారి అవసరాలకు భావాలకు ప్రాధాన్యతనిస్తాము.—ఫిలిప్పీయులు 2:3, 4.

6, 7.(ఎ)దేవుని భయమంటే ఏమిటి, మనం అధికార దుర్వినియోగం చేయకుండా ఉండడానికి ఈ లక్షణమెందుకు మనకు సహాయం చేస్తుంది? (బి) దేవుని నొప్పించడానికీ, దేవునిపట్ల ప్రేమకూ మధ్యవున్న సంబంధాన్ని ఉదహరించండి.

6 అధికార దుర్వినియోగం చేయకుండా ఉండడానికి మనకు సహాయంచేసే మరో లక్షణానికి ప్రేమ ముడిపడివుంది: అదే దేవుని భయం. ఈ లక్షణానికున్న విలువేమిటి? “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు” అని సామెతలు 16:6 చెబుతోంది. అధికార దుర్వినియోగం నిశ్చయంగా మనం దూరంగా ఉండవలసిన చెడుతనంలో ఓ భాగమే. మనకు ఎవరిపై అధికారం ఉందో వారిని బాధపెట్టకుండా దేవుని భయం మనల్ని అడ్డుకుంటుంది. ఎందుకు? దానికి ఒక కారణమేమిటంటే, మనం వారిని చూసే విషయంలో మనం దేవునికి జవాబుదారులమని మనకు తెలుసు. (నెహెమ్యా 5:1-7, 15) అయితే దేవుని భయంలో అంతకంటే ఇంకా ఎక్కువే ఇమిడివుంది. “భయము” అనే పదం కోసం ఉపయోగించబడిన ఆదిమ భాషా పదాలు దేవునిపట్ల ప్రగాఢ భక్తిని, భక్తిపూర్వక భయాన్ని సూచిస్తున్నాయి. అలా బైబిలు, భయాన్ని దేవునిపట్లవున్న ప్రేమకు ముడిపెడుతోంది. (ద్వితీయోపదేశకాండము 10:12, 13) ఈ భక్తిపూర్వక భయంలో యెహోవాను నొప్పించకూడదని అంటే కలిగే పర్యవసానాల భయం వల్ల కాదుగాని ఆయనను నిజంగా ప్రేమిస్తున్న కారణంగా మనకుండే ఆరోగ్యకరమైన భయం ఇమిడివుంది.

7 ఉదాహరణకు, ఒక చిన్నపిల్లవానికి అతని తండ్రికి మధ్యవుండే ఆరోగ్యకరమైన బాంధవ్యం గురించి ఆలోచించండి. తండ్రిచూపే వాత్సల్యాన్ని, ప్రేమపూర్వక శ్రద్ధను పిల్లవాడు గ్రహిస్తాడు. అలాగే తండ్రి తననుండి కోరేదీ అతడికి తెలుసు, ఒకవేళ తప్పుచేస్తే తండ్రి దండిస్తాడనీ అతనికి తెలిసివుంటుంది. కానీ ఆ పిల్లవాడు తండ్రి అంటే మరణకర భయంతో జీవించడు. దానికి భిన్నంగా, అతడు తన తండ్రిని ప్రియాతి ప్రియంగా ప్రేమిస్తాడు. ఆ బాలుడు ఆ తండ్రి ఆమోదించే పనులు చేయడానికి ఆనందిస్తాడు. దైవభయమూ అంతే. మన పరలోకపు తండ్రియైన యెహోవాను మనం ప్రేమిస్తాం కాబట్టి ఆయన ‘హృదయంలో నొచ్చుకొనే’ పని చేయడానికి భయపడతాం. (ఆదికాండము 6:6) బదులుగా, మనమాయన హృదయాన్ని సంతోషపరచాలని కోరుకుంటాం. (సామెతలు 27:11) అందువల్లే మన అధికారాన్ని సరిగా ఉపయోగించడానికి మనం ఇష్టపడతాం. మనం ఆ విధంగా ఎలాచేయవచ్చో నిశితంగా పరిశీలిద్దాం.

కుటుంబంలో

8.(ఎ)కుటుంబంలో భర్తలకు ఎలాంటి అధికారముంది, అదెలా చూపించబడాలి? (బి) తాను తన భార్యను సన్మానిస్తున్నానని ఒక భర్త ఎలా ప్రదర్శించగలడు?

8 మొదట కుటుంబ విధానాన్నే పరిశీలించండి. “పురుషుడు భార్యకు శిరస్సు” అని ఎఫెసీయులు 5:23 చెబుతోంది. దేవుడిచ్చిన ఈ అధికారాన్ని భర్త ఎలా ఉపయోగించాలి? ‘ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, జ్ఞానముచొప్పున ఆమెతో కాపురము’ చేయాలని బైబిలు భర్తకు చెబుతోంది. (1 పేతురు 3:7) “సన్మానము” అనే గ్రీకు నామవాచకానికి “వెల, విలువ, . . . గౌరవం” అని అర్థం. ఈ పదం యొక్క వివిధ రూపాలు “సత్కారములు,” “అమూల్యము” అని అనువదించబడ్డాయి. (అపొస్తలుల కార్యములు 28:10; 1 పేతురు 2:7) భార్యను సన్మానించే భర్త ఎన్నటికీ ఆమెపై శారీరకంగా దాడి చేయడు; లేదా తనకేమీ విలువలేదని భావించేలా ఆమెను అవమానించడు, తృణీకారంగా చూడడు. బదులుగా, అతడామె విలువను గుర్తిస్తూ గౌరవంతో ఆమెను చూసుకుంటాడు. ఇంటా బయటా ఆమె తనకు అమూల్యమైనదని ఆయన తన మాటలద్వారా, క్రియలద్వారా చూపిస్తాడు. (సామెతలు 31:28, 29) అలాంటి భర్త తన భార్య ప్రేమ, గౌరవాలను పొందడమే కాక మరింత ప్రాముఖ్యంగా దేవుని ఆమోదాన్ని పొందుతాడు.

పరస్పరం ప్రేమాగౌరవాలు చూపుకోవడం ద్వారా భార్యాభర్తలు తమ అధికారాన్ని సరిగా ఉపయోగిస్తారు

9.(ఎ)కుటుంబంలో భార్యలకెలాంటి అధికారముంది? (బి) భర్తకు మద్దతిచ్చేలా తన సామర్థ్యాలను ఉపయోగించడానికి భార్యకు ఏమి సహాయం చేయగలదు, దాని ఫలితమెలా ఉంటుంది?

9 కుటుంబంలో భార్యలకూ కొంత అధికారముంది. సరైన శిరస్సత్వపు పరిధిలో దైవభక్తిగల స్త్రీలు తమ భర్తలపై అనుకూల ప్రభావం చూపడానికి లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వారికి సహాయం చేయడానికి చొరవ తీసుకున్నారని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 21:9-12; 27:46-28:2) భర్తకంటే భార్యకు మరింత సూక్ష్మబుద్ధి లేదా ఆయనకులేని ఇతర సామర్థ్యాలు ఉండవచ్చు. అయినప్పటికీ, ‘ప్రభువునకువలె’ ఆయనకు ‘లోబడి ఉండడానికి’ ఆయనపట్ల ఆమెకు ‘భయం’ ఉండాలి. (ఎఫెసీయులు 5:22, 33) దేవుణ్ణి సంతోషపరచాలనే ఆలోచన తన భర్తను చులకన చేయడానికి లేదా ఆయనపై పెత్తనం చేయడానికి బదులు ఆయనకు మద్దతిచ్చేలా తన సామర్థ్యాలు ఉపయోగించడానికి భార్యకు సహాయం చేయవచ్చు. అలాంటి “జ్ఞానవంతురాలు” కుటుంబాన్ని కట్టడంలో తన భర్తకు చక్కగా సహకరించేదిగా ఉంటుంది. ఆ విధంగా ఆమె దేవునితో సమాధానాన్ని కాపాడుకుంటుంది.—సామెతలు 14:1.

10.(ఎ)తల్లిదండ్రులకు దేవుడెలాంటి అధికారమిచ్చాడు? (బి) “శిక్ష” అనే మాటకు అర్థమేమిటి, దానినెలా ఇవ్వాలి? (అధస్సూచి కూడా చూడండి.)

10 తల్లిదండ్రులకు కూడా దేవుడిచ్చిన అధికారముంది. బైబిలిలా ప్రబోధిస్తోంది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) బైబిల్లో “శిక్ష” అనే మాటకు “పెంచడం, శిక్షణ ఇవ్వడం, ఉపదేశించడం” అనే భావాలున్నాయి. పిల్లలకు క్రమశిక్షణ అవసరం; ఖచ్చితమైన నిర్దేశాలు, హద్దులు, పరిమితులుంటే వారు వర్ధిల్లుతారు. అలాంటి క్రమశిక్షణను లేదా ఉపదేశాన్ని బైబిలు ప్రేమకు ముడిపెడుతోంది. (సామెతలు 13:24) అందువల్ల, ఆ ‘శిక్షాదండాన్ని’ భావోద్వేగపరంగా లేదా శారీరకంగా ఎన్నటికీ దుర్వినియోగం చెయ్యకూడదు. * (సామెతలు 22:15; 29:15) ప్రేమ అనేదే లేకుండా కఠినంగా లేదా క్రూరంగా శిక్షించడం తల్లిదండ్రులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది, అంతేకాక అది పిల్లవాని మనస్సును గాయపరుస్తుంది. (కొలొస్సయులు 3:21) మరోవైపున, సరైన రీతిలో సమతుల్యంగా ఇవ్వబడే క్రమశిక్షణ తల్లిదండ్రులు తమను ప్రేమిస్తున్నారనీ తామెలాంటివారిగా తయారుకావాలనే విషయంలో వారు శ్రద్ధ చూపిస్తున్నారనీ పిల్లలు గ్రహించేలా చేస్తుంది.

11.పిల్లలు తమ బలాన్ని సరిగా ఎలా ఉపయోగించగలరు?

11 మరి పిల్లల విషయమేమిటి? వారెలా తమ బలాన్ని సరిగా ఉపయోగించవచ్చు? “యౌవనస్థుల బలము వారికి అలంకారము” అని సామెతలు 20:29 చెబుతోంది. యౌవనులు తమ బలాన్ని, శక్తిని మన “సృష్టికర్తను” సేవించడంలో ఉపయోగించడంకంటే ఉత్తమమైన మార్గం వారికి నిశ్చయంగా మరొకటి లేదు. (ప్రసంగి 12:1-2) తమ పనులు తమ తల్లిదండ్రుల భావాలపై ప్రభావం చూపగలవని యౌవనులు గుర్తుంచుకోవాలి. (సామెతలు 23:24, 25) పిల్లలు దేవుని భయంగల తమ తల్లిదండ్రులకు విధేయులై సరైన మార్గాన్ని అవలంబించినప్పుడు, వారు తమ తల్లిదండ్రుల హృదయాలను సంతోషపరుస్తారు. (ఎఫెసీయులు 6:1) అలాంటి ప్రవర్తన “ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.”—కొలొస్సయులు 3:20.

సంఘంలో

12, 13.(ఎ)సంఘంలో తమ అధికారం గురించి పెద్దలకు ఎలాంటి దృక్కోణం ఉండాలి? (బి) పెద్దలు మందను ఎందుకు వాత్సల్యపూరితంగా చూసుకోవాలో సోదాహరణంగా చెప్పండి.

12 క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహించడానికి యెహోవా పైవిచారణకర్తలను అనుగ్రహించాడు. (హెబ్రీయులు 13:17) యోగ్యులైన ఈ పురుషులు దేవుడు తమకిచ్చిన అధికారాన్ని అవసరమైన సహాయం అందజేయడానికి, మంద సంక్షేమానికి దోహదపడడానికి ఉపయోగించాలి. పెద్దలుగా వారి స్థానం తమ తోటి విశ్వాసులపై ప్రభుత్వం చేయడానికి వారికి అధికారమిస్తోందా? ఎంతమాత్రం ఇవ్వదు. సంఘంలో తమ పాత్ర విషయంలో పెద్దలకు సమతుల్యమైన, వినయపూర్వకమైన దృక్కోణం ఉండాలి. (1 పేతురు 5:2, 3) పైవిచారణకర్తలకు బైబిలిలా చెబుతోంది: ‘దేవుడు తన స్వరక్తమిచ్చి [“తన కుమారుని రక్తమిచ్చి,” NW] సంపాదించిన తన సంఘాన్ని కాయండి.’ (అపొస్తలుల కార్యములు 20:28) అందులో, మంద సభ్యుల్లో ప్రతీ ఒక్కరిని వాత్సల్యంతో చూడడానికి శక్తిమంతమైన కారణం ఉంది.

13 దానిని మనం ఈ విధంగా ఉదహరించవచ్చు: తానెంతో విలువైనదిగా ఎంచే ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవల్సిందిగా మీ సన్నిహిత స్నేహితుడు మిమ్మల్ని కోరాడు. దానికోసం మీ స్నేహితుడు చాలా మూల్యం చెల్లించాడని మీకు తెలుసు. దానిని మీరు అపురూపంగా అత్యంత శ్రద్ధతో చూసుకోరా? అదేప్రకారంగా, నిజంగా అమూల్యమైన ఆస్తిని అంటే గొఱ్ఱెలతో పోల్చబడిన సభ్యులుగల సంఘ బాధ్యతను దేవుడు పెద్దలకు అప్పగించాడు. (యోహాను 21:16, 17) యెహోవా గొఱ్ఱెలు ఆయనకెంతో ప్రియమైనవి, వాస్తవానికి, ఆయనకు అవి ఎంత ప్రియమంటే ఆయన తన అద్వితీయకుమారుడైన యేసుక్రీస్తు అమూల్య రక్తంతో వాటిని కొన్నాడు. యెహోవా తన గొఱ్ఱెలకోసం సాధ్యమైనంత అత్యధిక మూల్యం చెల్లించాడు. వినయస్థులైన పెద్దలు ఆ విషయం మనస్సులో ఉంచుకొని తదనుగుణంగా యెహోవా గొఱ్ఱెలను చూసుకుంటారు.

“నాలుక” శక్తి

14.నాలుకకు ఎలాంటి శక్తి ఉంది?

14 “జీవమరణములు నాలుక వశము” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 18:21) నిజానికి, నాలుక చాలా నష్టం కలిగించగలదు. అనాలోచితంగా లేదా తృణీకారంగా మాట్లాడిన మాటలవల్ల ఎన్నడూ బాధపడని వారు మనలో ఎవరున్నారు? అయితే పరిస్థితిని చక్కబరచగల శక్తికూడా నాలుకకు ఉంది. “జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము” అని సామెతలు 12:18 చెబుతోంది. అవును, అనుకూలమైన, ఆరోగ్యదాయకమైన మాటలు హృదయానికి ఉపశమనమిస్తూ, స్వస్థపరిచే పరిమళ తైలముగా ఉండగలవు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

15, 16.ఇతరులను ప్రోత్సహించేందుకు మనం మన నాలుకను ఏయే విధాలుగా ఉపయోగించవచ్చు?

15 “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి” అని 1 థెస్సలొనీకయులు 5:14 ఉద్బోధిస్తోంది. అవును, యెహోవా నమ్మకమైన సేవకులు సైతం కొన్నిసార్లు కృంగుదలతో పోరాడుతుంటారు. అలాంటివారికి మనమెలా సహాయం చేయవచ్చు? యెహోవా దృష్టిలో వారెంత ప్రశస్తమైనవారో గ్రహించేలా సహాయం చేయడానికి నిర్దిష్టంగా, యథార్థంగా వారిని మెచ్చుకోండి. ‘విరిగిన హృదయముగలవారిని’ “నలిగిన మనస్సుగలవారిని” యెహోవా ప్రేమిస్తాడనీ, వారంటే ఆయనకు నిజమైన శ్రద్ధ ఉందనీ చూపించే శక్తిమంతమైన బైబిలు వచనాల మాటలు వారితో పంచుకోండి. (కీర్తన 34:18) ఇతరులను ఓదార్చేందుకు మన నాలుక బలాన్ని మనం ఉపయోగించినప్పుడు, “దీనులను ఆదరించు” మన ఆదరణకర్తయైన దేవుణ్ణి మనం అనుకరిస్తున్నామని చూపిస్తాం.—2 కొరింథీయులు 7:6.

16 ఇతరులకు ఎంతో అవసరమైన ప్రోత్సాహమిచ్చేందుకు కూడా మన నాలుక బలాన్ని మనం ఉపయోగించవచ్చు. తోటి విశ్వాసి ఒకరు తమ ప్రియమైన వ్యక్తిని మరణంద్వారా పోగొట్టుకున్నారా? మన శ్రద్ధను, పట్టింపును వ్యక్తంచేసే సానుభూతితో కూడిన మన మాటలు దుఃఖ హృదయానికి ఓదార్పునివ్వగలవు. ఒక వృద్ధ సహోదరుడు లేదా సహోదరి తాము విలువలేనివారమని భావిస్తున్నారా? దాక్షిణ్యతగల మాట, తాము విలువైనవారమనీ, తాము ప్రశంసించబడుతున్నామనీ వృద్ధులకు నమ్మకం కలిగిస్తుంది. ఎవరైనా దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతున్నారా? ఫోనులో లేదా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే దయగల మాటలు వ్యాధిగ్రస్తుల ప్రాణాన్ని ఎంతగానో తెప్పరిల్లజేస్తాయి. “క్షేమాభివృద్ధికరమైన” మాటలు పలకడానికి మన సంభాషణా బలాన్ని ఉపయోగించినప్పుడు మన సృష్టికర్త ఎంతగా సంతోషిస్తాడో గదా!—ఎఫెసీయులు 4:29.

సువార్త పంచుకోవడం —మన బలాన్ని ఉపయోగించగల ఉత్తమ విధానం

17.మనం మన నాలుకను ఇతరుల ప్రయోజనార్థమై ఏ ప్రాముఖ్యమైన విధానంలో ఉపయోగించవచ్చు, మనమలా ఎందుకు ఉపయోగించాలి?

17 ఇతరులకు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి మన నాలుక బలాన్ని ఉపయోగించడంకంటే ప్రాముఖ్యమైన మార్గం మరొకటి లేదు. “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము” అని సామెతలు 3:27 చెబుతోంది. ఇతరులకు ప్రాణ రక్షణ సువార్త ప్రకటించే బాధ్యత మనపై ఉంది. యెహోవా ఎంతో ఔదార్యంతో మనకిచ్చిన అత్యవసర సందేశాన్ని మన దగ్గరే ఉంచుకోవడం సరికాదు. (1 కొరింథీయులు 9:16, 22) అయితే మనమీ పనిలో ఎంత మేరకు పాలుపంచుకోవాలని యెహోవా ఎదురుచూస్తున్నాడు?

మన “పూర్ణబలముతో” యెహోవాను సేవించడం

18.యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడు?

18 యెహోవాపట్ల మన ప్రేమ క్రైస్తవ పరిచర్యలో పూర్తిగా భాగం వహించేలా మనల్ని పురికొల్పుతుంది. ఈ విషయంలో యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడు. జీవితంలో మన పరిస్థితి ఏదైనా మనమందరం చేయగలిగినది ఏమిటంటే: “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” (కొలొస్సయులు 3:23) ప్రధానమైన ఆజ్ఞను వివరిస్తూ యేసు ఇలా అన్నాడు: “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” (మార్కు 12:30) అవును, మనలో ప్రతీ ఒక్కరు పూర్ణాత్మతో తనను సేవించాలని యెహోవా ఎదురుచూస్తున్నాడు.

19, 20.(ఎ)ఆత్మలోనే హృదయం, వివేకం, బలం ఉన్నాయి కాబట్టి, మార్కు 12:30​లో ఈ సామర్థ్యాలు విడిగా ఎందుకు ప్రస్తావించబడ్డాయి? (బి) పూర్ణాత్మతో యెహోవాను సేవించడమంటే ఏమిటి?

19 పూర్ణాత్మతో దేవుణ్ణి సేవించడమంటే ఏమిటి? తెలుగు బైబిల్లో ఆత్మ అని తర్జుమా చేయబడిన గ్రీకు పదమైన సైఖే ఒక వ్యక్తి యొక్క భౌతిక, మానసిక సామర్థ్యాలన్నిటితో సహా మొత్తం వ్యక్తినే సూచిస్తోంది. ఈ ఆత్మలోనే హృదయం, వివేకం, బలం ఉన్నట్లయితే, మార్కు 12:30లో ఈ సామర్థ్యాలు విడిగా ఎందుకు పేర్కొనబడ్డాయి? ఈ దృష్టాంతాన్ని పరిశీలించండి. బైబిలు కాలాల్లో, ఒక వ్యక్తి తనను తాను (తన ఆత్మను) దాసత్వానికి అమ్ముకోవచ్చు. అయినప్పటికీ, ఆ దాసుడు తన యజమానికి పూర్ణహృదయంతో సేవచేయకపోవచ్చు; తన యజమాని ప్రయోజనార్థం అతడు తన పూర్ణబలాన్ని లేదా తన మానసిక సామర్థ్యాలను పూర్ణంగా ఉపయోగించకపోవచ్చు. (కొలొస్సయులు 3:22) అందువల్లే, దేవుని సేవలో మనం దేనినీ మినహాయించకూడదని నొక్కిచెప్పేందుకు యేసు ఈ సామర్థ్యాలను ప్రస్తావించాడని రుజువు అవుతోంది. పూర్ణాత్మతో దేవుని సేవించడమంటే ఆయన సేవలో సాధ్యమైనంత పూర్ణంగా మన బలాన్ని, శక్తిసామర్థ్యాలను ఉపయోగిస్తూ మనల్ని మనం అప్పగించుకోవడమని దానర్థం.

20 పూర్ణాత్మతో సేవించడమంటే మనమందరం పరిచర్యలో ఒకే పరిమాణంలో సమయాన్ని, శక్తిసామర్థ్యాల్ని ఉపయోగించడమని దాని భావమా? అది అసాధ్యం, ఎందుకంటే మన పరిస్థితులు, సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు, మంచి ఆరోగ్యం శరీర సామర్థ్యంగల యువకుడు, ప్రకటనా పనిలో, వృద్ధాప్యంతో శక్తి ఉడిగిన వ్యక్తికంటే ఎక్కువ సమయం గడపగలుగుతాడు. కుటుంబ బాధ్యతల్లేని అవివాహిత వ్యక్తి, కుటుంబాన్ని చూసుకునే వ్యక్తికంటే ఎక్కువ చేయగలుగుతాడు. పరిచర్యలో ఎక్కువ చేయగల బలం, పరిస్థితులు మనకు ఒకవేళ ఉంటే మనమెంత కృతజ్ఞులమో గదా! అయితే ఈ విషయంలో మనల్ని ఇతరులతో పోల్చుకొనే విమర్శనాత్మక స్వభావం మనకు ఉండాలని మనమెన్నటికీ కోరుకోము. (రోమీయులు 14:10-12) బదులుగా, ఇతరులను ప్రోత్సహించడానికి మన బలాన్ని ఉపయోగించాలని మనం కోరుకుంటాం.

21.మన బలాన్ని శ్రేష్ఠంగా, మరింత ప్రాముఖ్యమైన విధంగా ఉపయోగించగల మార్గమేది?

21 తన శక్తిని సరిగా ఉపయోగించడంలో యెహోవా పరిపూర్ణ మాదిరినుంచాడు. అపరిపూర్ణ మానవులుగా మనం మన శక్తిమేరకు ఆయనను అనుకరించాలని కోరుకుంటాం. ఎవరిపై మనకు అధికారముందో వారిని గౌరవంగా చూడడం ద్వారా మన శక్తిని మనం సరిగా ఉపయోగించవచ్చు. దానికితోడు, నెరవేర్చడానికి యెహోవా మనకు అప్పగించిన ప్రాణ రక్షణ ప్రకటనా పని చేయడంలో పూర్ణాత్మతో ఉండాలని మనం కోరుకుంటాం. (రోమీయులు 10:13, 14) మీరు అంటే మీ ఆత్మ ఇవ్వగల శ్రేష్ఠమైనది మీరిచ్చినప్పుడు యెహోవా సంతోషిస్తాడని గుర్తుంచుకోండి. అంతగా అర్థం చేసుకునే ప్రేమగల దేవుని సేవలో మీరు చేయగలిగినంతా చేయాలని కోరుకోవడానికి మీ హృదయం మిమ్మల్ని ప్రేరేపించడం లేదా? మీ బలాన్ని మరింత శ్రేష్ఠంగా, మరింత ప్రాముఖ్యమైన విధంగా ఉపయోగించగల మార్గం మరొకటి లేదు.

^ బైబిలు కాలాల్లో, “దండము” అని అనువదించబడిన హీబ్రూ పదానికి గొఱ్ఱెలు తోలడానికి గొఱ్ఱెలకాపరి చేతిలో ఉండేటువంటి దుడ్డుకఱ్ఱ లేదా కొయ్య అని అర్థం. (కీర్తన 23:4) అదే ప్రకారంగా, తల్లిదండ్రుల అధికార “దండము” ప్రేమపూర్వక నిర్దేశాన్ని సూచిస్తుందే తప్ప క్రూరమైన, పశుప్రాయమైన శిక్షను సూచించడం లేదు.