కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 13

‘యెహోవా ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది’

‘యెహోవా ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది’

1, 2.అనేకమందికి చట్టమంటే ఎందుకంత చులకన భావముంది, అయితే దేవుని నియమాల గురించి మనమెలా భావించవచ్చు?

 “వ్యాజ్యమొక అగాధపు గొయ్యి, అది . . . సర్వాన్ని స్వాహా చేస్తుంది.” ఆ మాటలు ఎప్పుడో 1712లో ప్రచురించబడిన ఒక పుస్తకంలో ఉన్నాయి. న్యాయంకోసం ప్రాకులాడే వారిని దివాలాతీస్తూ న్యాయస్థానాల్లో కేసులు కొన్నిసార్లు సంవత్సరాలపాటు నత్తనడక నడిచే న్యాయ వ్యవస్థను దాని గ్రంథకర్త నిందించాడు. చాలాదేశాల్లో చట్టం మరియు న్యాయ వ్యవస్థలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయంటే, వాటిలో అన్యాయం, వివక్ష, పరస్పర విరుద్ధతలు ఎంతగా నిండిపోయాయంటే, తత్ఫలితంగా చట్టాన్ని తృణీకరించడం సర్వత్రా వ్యాపించింది.

2 దీనికి పూర్తి భిన్నంగా, దాదాపు 2,700 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ మాటల గురించి ఆలోచించండి: “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది.” (కీర్తన 119:97) కీర్తనకర్త దానిని ఎందుకంత ప్రగాఢంగా ప్రేమించాడు? ఎందుకంటే ఆయన కొనియాడిన ఆ ధర్మశాస్త్రం ఏ లౌకిక ప్రభుత్వం నుండో కాదుగానీ యెహోవా దేవుని నుండి వచ్చింది. యెహోవా నియమాలను మీరు అధ్యయనం చేస్తుండగా, మీరు కూడా అంతకంతకు కీర్తనకర్త మాదిరిగానే భావించగలరు. అలాంటి అధ్యయనం, విశ్వంలోకెల్లా అత్యంత గొప్ప శాసనకర్త ఎలా ఆలోచిస్తాడనే దాని గురించిన అంతర్దృష్టిని మీకు ఇస్తుంది.

సర్వోన్నత శాసనకర్త

3, 4.యెహోవా ఏయే విధాలుగా శాసనకర్తగా నిరూపించుకున్నాడు?

3 “ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు” అని బైబిలు మనకు చెబుతోంది. (యాకోబు 4:12) వాస్తవానికి, యెహోవా ఒక్కడే నిజమైన శాసనకర్త. ఖగోళ గ్రహాలు సైతం ఆయన పెట్టిన “ఆకాశమండలపు కట్టడల” ప్రకారమే చలిస్తున్నాయి. (యోబు 38:33) అదేవిధంగా, వేవేల పరిశుద్ధ దేవదూతలు కూడా దైవిక నియమంచేత నిర్దేశించబడుతున్నారు, అందుకే వారు వివిధ శ్రేణులుగా వ్యవస్థీకరించబడి యెహోవా ఆజ్ఞానుసారంగా ఆయన పరిచారకులుగా సేవ చేస్తుంటారు.—కీర్తన 104:4; హెబ్రీయులు 1:7, 14.

4 అలాగే మానవులకు కూడా యెహోవా నియమాలిచ్చాడు. మనలో ప్రతీ ఒక్కరికి మనస్సాక్షి ఉంది, అది న్యాయం గురించి యెహోవాకున్న భావనకు ప్రతిబింబం. ఒక విధమైన అంతరంగ ధర్మశాస్త్రంలాంటి ఆ మనస్సాక్షి మంచి చెడులను గుర్తించడానికి మనకు సహాయం చేయగలదు. (రోమీయులు 2:14) మన మొదటి తలిదండ్రులు పరిపూర్ణ మనస్సాక్షితో దీవించబడ్డారు, కాబట్టి వారికి కొన్ని నియమాలే అవసరమయ్యాయి. (ఆదికాండము 2:15-17) అయితే, దేవుని చిత్తం చేసేలా నడిపించబడడానికి అపరిపూర్ణ మానవునికి ఎక్కువ నియమాలు అవసరం. నోవహు, అబ్రాహాము, యాకోబువంటి మూలపురుషులు యెహోవా దేవుని నుండి నియమాలుపొంది వాటిని తమ కుటుంబాలకు అందజేశారు. (ఆదికాండము 6:22; 9:3-6; 18:19; 26:4, 5) మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్ర నియమావళి ఇచ్చినప్పుడు యెహోవా అపూర్వరీతిలో తానే శాసనకర్త అయ్యాడు. ఆ ధర్మశాస్త్ర నియమావళి న్యాయం గురించి యెహోవాకు ఉన్న భావనను గురించిన అంతర్దృష్టిని మనకు విస్తృతంగా అందిస్తుంది.

మోషే ధర్మశాస్త్ర సారాంశం

5.మోషే ధర్మశాస్త్రం ప్రయాసకరమైన, సంశ్లిష్టమైన నియమాల పుట్టగా ఉందా, మీరలా అనడానికి కారణమేమిటి?

5 మోషే ధర్మశాస్త్రం ప్రయాసకరమైన, సంశ్లిష్టమైన నియమాల పుట్ట అని చాలమంది ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటి ఆలోచన సత్యదూరం. ఆ నియమావళి అంతటిలో 600లకు పైగా నియమాలున్నాయి. అవి చాలా ఎక్కువ అన్నట్లు అనిపించవచ్చు, కానీ దీని గురించి ఆలోచించండి: 20వ శతాబ్దాంతానికి అమెరికా సమాఖ్య నియమాలు న్యాయశాస్త్ర పుస్తకాల్లో 1,50,000 పేజీలకు పైగా నిండాయి. ప్రతీ సంవత్సరం అదనంగా దాదాపు 600 నియమాలు చేర్చబడుతున్నాయి. పరిమాణం విషయంలో మానవ నియమాలతో పోలిస్తే మోషే ధర్మశాస్త్రం చాలా చిన్నదే. అయినప్పటికీ, దేవుని ధర్మశాస్త్రం, ఆధునిక నియమాలు ఇంకా పరిశీలించడం కూడా ఆరంభించని జీవిత రంగాల్లో సైతం ఇశ్రాయేలీయులను నడిపించింది. సంక్షిప్తంగా వాటిని పరిశీలించండి.

6, 7.(ఎ)వేరే ఇతర చట్ట నియమావళి నుండి మోషే ధర్మశాస్త్రాన్ని ఏది భిన్నంగా ఉంచింది, ఆ ధర్మశాస్త్రం యొక్క అత్యంత గొప్ప ఆజ్ఞ ఏమిటి? (బి) యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరిస్తున్నామని ఇశ్రాయేలీయులు ఎలా చూపవచ్చు?

6 ధర్మశాస్త్రం యెహోవా సర్వాధిపత్యాన్ని ఘనపరచింది. ఈ విషయంలో ఏ ఇతర చట్ట నియమావళి మోషే ధర్మశాస్త్రానికి సాటిరాదు. దానిలో అత్యంత ప్రధానమైన నియమమిదే: “ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” దేవుని ప్రజలు ఆయనపట్ల ఈ ప్రేమనెలా వ్యక్తపరచాలి? ఆయన సర్వాధిపత్యానికి లోబడుతూ వారాయనను సేవించాలి.—ద్వితీయోపదేశకాండము 6:4, 5; 11:13.

7 ప్రతీ ఇశ్రాయేలీయుడు తనపై అధికార స్థానాల్లో నియమించబడిన వారికి లోబడుతూ యెహోవా సర్వాధిపత్యాన్ని తాను అంగీకరిస్తున్నట్లు చూపించాడు. తలిదండ్రులు, ప్రధానులు, న్యాయాధిపతులు, యాజకులు, చివరకు రాజుతోసహా అందరూ దేవుని అధికారానికి ప్రాతినిధ్యం వహించారు. అధికారంలో ఉన్నవారికి విరుద్ధంగా చేసే తిరుగుబాటును తనపై తిరుగుబాటుగా యెహోవా దృష్టించాడు. మరోవైపున, అధికారంలో ఉన్నవారు యెహోవా ప్రజలతో అన్యాయంగా లేదా అహంభావంగా ప్రవర్తిస్తే వారు ఆయన కోపాగ్నికి గురయ్యే ప్రమాదంలో పడేవారు. (నిర్గమకాండము 20:12; 22:28; 1:16, 17; 17:8-20; 19:16, 17) ఆ విధంగా దేవుని సర్వాధిపత్యాన్ని సమర్థించే బాధ్యత ఇరువర్గాలపై ఉంచబడింది.

8.యెహోవా పరిశుద్ధతా ప్రమాణాన్ని ధర్మశాస్త్రమెలా సమర్థించింది?

8 ధర్మశాస్త్రం యెహోవా పరిశుద్ధతా ప్రమాణాన్ని సమర్థించింది. “పరిశుద్ధ” “పరిశుద్ధత” అనే మాటలు మోషే ధర్మశాస్త్రంలో 280సార్లకు పైగా కనిపిస్తాయి. ఒక ఇశ్రాయేలీయుణ్ణి ఆచారబద్ధంగా అపవిత్రం చేయగల వివిధరకాలైన 70 విషయాలను పేర్కొంటూ పవిత్రత అపవిత్రత, స్వచ్ఛత అస్వచ్ఛతల తారతమ్యాన్ని గుర్తించడానికి ఆ ధర్మశాస్త్రం దేవుని ప్రజలకు సహాయం చేసింది. భౌతిక పారిశుధ్యం, ఆహారాలతోపాటు వ్యర్థ విసర్జితాల విషయాలనూ ఈ నియమాలు ప్రస్తావించాయి. అలాంటి నియమాలు గమనార్హమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూర్చాయి. * అయితే వాటికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది, అదేమిటంటే ఆ ప్రజల చుట్టూ ఉన్న భ్రష్ట జనాంగాల పాపభరిత అభ్యాసాల నుండి వారు వేరుగా ఉండి యెహోవా అనుగ్రహాన్ని పొందేలా చేయడం. ఒక ఉదాహరణ పరిశీలించండి.

9, 10.లైంగిక సంబంధాలకు, పిల్లల పుట్టుకకు సంబంధించిన ఎలాంటి కట్టడలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి, అలాంటి నియమాలు ఎలాంటి ప్రయోజనాలిచ్చాయి?

9 చివరకు వివాహితుల మధ్యకూడా లైంగిక సంబంధాలకు, పిల్లల పుట్టుకకు సంబంధించి అపవిత్ర కాలాన్ని పాటించాలని ధర్మశాస్త్ర నిబంధన కట్టడలు చెప్పాయి. (లేవీయకాండము 12:2-4; 15:16-18) అయితే ఆ కట్టడలు దేవుడు అనుగ్రహించిన ఆ పవిత్ర వరాలను చులకన చేయలేదు. (ఆదికాండము 1:28; 2:18-25) బదులుగా, ఆ నియమాలు యెహోవా పరిశుద్ధతను సమర్థించి, ఆయన ఆరాధకులు కలుషితం కాకుండా చేశాయి. గమనార్హమైన విషయమేమిటంటే, ఇశ్రాయేలీయుల చుట్టూవున్న జనాంగాలు తమ ఆరాధనను లైంగిక చర్యలతో ఫలసాఫల్య ఆచారాలతో మిళితం చేసేవారు. కనానీయుల మతంలో పురుష, స్త్రీ వ్యభిచారులు ఉండేవారు. తత్ఫలితంగా వారిలో నీచాతినీచ ప్రవృత్తి వ్యాపించింది. అయితే దానికి భిన్నంగా, ధర్మశాస్త్రం యెహోవా ఆరాధనలో లైంగిక విషయాల ప్రస్తావనే లేకుండా చేసింది. * దానిలో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

10 ఆ నియమాలు చాలా ముఖ్యమైన ఒక సత్యాన్ని బోధించడానికి తోడ్పడ్డాయి. * అసలు ఆదాము చేసిన పాపం ఒక తరం నుండి మరో తరానికి ఎలా సంక్రమించింది? లైంగిక సంబంధాలు, పిల్లల పుట్టుక ద్వారా కాదా? (రోమీయులు 5:12) అవును, పాపం గురించిన ఈ కఠోర సత్యాన్ని దేవుని ధర్మశాస్త్రం ఆయన ప్రజలకు గుర్తుచేసింది. నిజానికి, మనమందరం పాపంలోనే పుట్టాము. (కీర్తన 51:5) మన పరలోకపు దేవునికి సన్నిహితమవడానికి మనకు క్షమాపణ, విమోచన అవసరం.

11, 12.(ఎ)ధర్మశాస్త్రం ఏ ఆవశ్యక న్యాయ సూత్రాన్ని సమర్థించింది? (బి) న్యాయం తప్పుదోవ పట్టకుండా కాపాడే ఎలాంటి అంశాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి?

11 యెహోవా పరిపూర్ణ న్యాయాన్ని ధర్మశాస్త్రం సమర్థించింది. న్యాయసంబంధ విషయాల్లో సమానత్వ లేదా సమతుల్య సూత్రాన్ని మోషే ధర్మశాస్త్రం సమర్థించింది. అందుకే ధర్మశాస్త్రం ఈ విధంగా తెలియజేసింది: “ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు.” (ద్వితీయోపదేశకాండము 19:21) కాబట్టి నేర సంబంధ విషయాల్లో శిక్ష నేరానికి తగ్గట్టు ఉండాలి. దైవిక న్యాయానికి సంబంధించిన ఈ అంశం ధర్మశాస్త్రమంతటా ఉండడమే కాకుండా, 14వ అధ్యాయం చూపించే విధంగా యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిని అర్థం చేసుకోవడానికి అది నేటికీ ఆవశ్యకమే.—1 తిమోతి 2:5, 6.

12 న్యాయాన్ని తప్పుదోవ పట్టించకుండా కాపాడే అంశాలు కూడా ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఉదాహరణకు, ఒక ఆరోపణ యొక్క న్యాయబద్ధతను స్థాపించడానికి కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి. అబద్ధ సాక్ష్యానికి దండన తీవ్రంగా ఉండేది. (ద్వితీయోపదేశకాండము 19:15, 18, 19) అవినీతి, లంచగొండితనం కూడా ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. (నిర్గమకాండము 23:8; ద్వితీయోపదేశకాండము 27:25) వ్యాపార లావాదేవీల్లో సైతం, దేవుని ప్రజలు ఉన్నతమైన యెహోవా న్యాయ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. (లేవీయకాండము 19:35, 36; ద్వితీయోపదేశకాండము 23:19, 20) ఆ ఉదాత్తమైన, న్యాయమైన న్యాయ నియమావళి ఇశ్రాయేలీయులకు గొప్ప ఆశీర్వాదంగా ఉండేది!

న్యాయ సంబంధిత కనికరాన్ని, నిష్పక్షపాతాన్ని నొక్కిచెప్పే నియమాలు

13, 14.దొంగను, నష్టపోయిన వ్యక్తిని చూసే విధానంలో ధర్మశాస్త్రమెలా నిష్పక్షపాతాన్ని ప్రోత్సహించింది?

13 మోషే ధర్మశాస్త్రం కఠినమైన, కనికరంలేని నియమాలతో నిండివుందా? అలా ఎంతమాత్రం లేదు! దావీదు రాజు ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: ‘యెహోవా ధర్మశాస్త్రము పవిత్రమైనది.’ (కీర్తన 19:7, NW) ఆయనకు బాగా తెలిసినట్లు, ధర్మశాస్త్రం కనికరాన్ని, నిష్పక్షపాతాన్ని సమర్థించింది. ఎలా సమర్థించింది?

14 నేడు కొన్నిదేశాల్లో చట్టం, నేరానికి బలైన వారికంటే నేరస్థులకే ఎక్కువ దయచూపేదిగా, అనుకూలంగా ఉన్నట్లనిపిస్తోంది. ఉదాహరణకు, దొంగలు జైల్లో కాలం వెళ్లబుచ్చుతుంటారు. అదే సమయంలో, పోగొట్టుకున్నవారి వస్తువులు వారికింకా అందకపోవచ్చు, అయినా వారు పన్నులు కడుతూనే ఉంటారు, ఆ డబ్బు నేరస్థులను చెరసాలలో ఉంచి పోషించేందుకు ఉపయోగించబడుతుంది. ప్రాచీన ఇశ్రాయేలులో నేడు మనకు తెలిసినటువంటి చెరసాలలు లేవు. దండన యొక్క తీవ్రతకు సంబంధించి ఖచ్చితమైన పరిమితులుండేవి. (ద్వితీయోపదేశకాండము 25:1-3) దొంగ నష్టపరిహారం చెల్లించాలి. అదనంగా ఆ దొంగ ఇంకా ఎక్కువ చెల్లించాలి. ఎంత? అది వివిధ రకాలుగా ఉండేది. పాపి చూపిన పశ్చాత్తాపం వంటి చాలా విషయాలు ఆచితూచి విలువకట్టడానికి న్యాయాధిపతులకు స్వేచ్ఛ ఇవ్వబడింది. దొంగ చెల్లించవలసిన నష్టపరిహారం నిర్గమకాండము 22:7​లో చెప్పబడిన దానికంటే లేవీయకాండము 6:1-7​లో చెప్పబడినది ఎందుకు అంత తక్కువగా ఉందో అది వివరిస్తుంది.

15.ప్రమాదవశాత్తు వేరొకరి మరణానికి కారణమైన ఒక వ్యక్తిపట్ల ధర్మశాస్త్రమెలా కనికరంచూపి, అతనికి న్యాయం జరిగేలా చూసింది?

15 తప్పులన్నీ ఉద్దేశపూర్వకంగా చేసేవి కాదని ధర్మశాస్త్రం కనికరంతో గుర్తించింది. ఉదాహరణకు, ప్రమాదవశాత్తు ఒకడు మరొకరి మరణానికి కారకుడైనప్పుడు, ఇశ్రాయేలు అంతటా ఉన్న ఆశ్రయపురాల్లో ఒక దానికి పారిపోవడం ద్వారా సరైన చర్య తీసుకున్నప్పుడు అతడు ప్రాణానికి ప్రాణం చెల్లించనక్కర్లేదు. అతని విషయాన్ని ఆ పట్టణపు అర్హతగల న్యాయాధిపతులు పరిశీలించిన తర్వాత, ప్రధాన యాజకుడు మరణించే వరకు అతడక్కడే ఉండాలి. ఆ పిమ్మట అతడు తనకు నచ్చిన చోటుకు వెళ్లి స్వేచ్ఛగా నివసించవచ్చు. ఆ విధంగా అతడు దేవుని కనికరాన్నిబట్టి ప్రయోజనం పొందాడు. అదే సమయంలో, ఈ నియమం మానవ ప్రాణానికున్న గొప్ప విలువను కూడా నొక్కిచెప్పింది.—సంఖ్యాకాండము 15:30, 31; 35:12-25.

16.వ్యక్తిగత హక్కులను కొన్నింటిని ధర్మశాస్త్రం ఎలా కాపాడింది?

16 ధర్మశాస్త్రం వ్యక్తిగత హక్కులను కాపాడింది. రుణస్థులను అది ఏ యే విధాలుగా కాపాడిందో పరిశీలించండి. రుణానికి తాకట్టుగా రుణస్థుని ఇంట్లోకి వెళ్లి ఆస్తి తీసుకోవడాన్ని ధర్మశాస్త్రం నిషేధించింది. బదులుగా రుణదాత ఇంటి బయటే నిలబడి రుణస్థుడ్ని తాకట్టు వస్తువు తీసుకురానివ్వాలి. ఆ విధంగా అతని ఇల్లు ముట్టడి కాకుండా ఉంటుంది. రుణదాత ఒకవేళ తాకట్టుగా అతని వస్త్రం తీసుకుంటే చీకటిపడకముందే దానిని అతనికి ఇచ్చివేయాలి. ఎందుకంటే రాత్రిపూట వెచ్చదనానికి అది బహుశా రుణస్థునికి అవసరం కావచ్చు.—ద్వితీయోపదేశకాండము 24:10-14.

17, 18.యుద్ధ సంబంధ విషయాల్లో ఇశ్రాయేలీయులు ఇతర జనాంగాల నుండి ఎలా భిన్నంగా ఉన్నారు, ఎందుకు?

17 ధర్మశాస్త్రం క్రింద యుద్ధం కూడా క్రమపరచబడింది. దేవుని ప్రజలు అధికార కాంక్ష లేదా యుద్ధ కాంక్ష తీర్చుకోవడానికి కాదుగానీ ‘యెహోవా యుద్ధాల్లో’ దేవుని ప్రతినిధులుగా వ్యవహరించడానికే యుద్ధం చేయాలి. (సంఖ్యాకాండము 21:14) అనేక సందర్భాల్లో ఇశ్రాయేలీయులు మొదట లొంగిపొమ్మని షరతులు ప్రతిపాదించాలి. ఏదైనా పట్టణం ఆ ప్రతిపాదనను త్రోసిపుచ్చినప్పుడే వారు దానిని ముట్టడించాలి, అదీ దేవుని నియమాల ప్రకారమే. చరిత్రంతటిలోని అనేకమంది సైనికుల్లా ఇశ్రాయేలు సైనికులు స్త్రీలను చెరచడానికి లేదా అకారణ సంహారానికి అనుమతించబడలేదు. శత్రువుల ఫల వృక్షాలను నరికివేయకుండా వారు పర్యావరణాన్ని కూడా గౌరవించాలి. * ఇతర సైన్యాలకు అలాంటి నిషేధాలు లేవు.—ద్వితీయోపదేశకాండము 20:10-15, 19, 20; 21:10-13.

18 కొన్ని దేశాల్లో ముక్కుపచ్చలారని పిల్లలకు సైనిక శిక్షణ ఇవ్వబడుతోందని విని మీరు అసహ్యించుకుంటారా? ప్రాచీన ఇశ్రాయేలులో, 20 ఏండ్లకు తక్కువున్న ఏ పురుషుడూ సైన్యంలో చేర్చుకోబడేవాడు కాడు. (సంఖ్యాకాండము 1:2, 3) అధికంగా భయపడితే ఎదిగిన పురుషుడు కూడా మినహాయించబడేవాడు. కొత్తగా వివాహమైన పురుషుడు, అలాంటి ప్రమాదకరమైన సేవలో ప్రవేశించడానికి ముందు, తనకొక వారసుడు పుట్టేంతవరకు, పూర్తిగా ఒక ఏడాదిపాటు మినహాయింపబడేవాడు. ఈ విధంగా యౌవనుడైన ఆ భర్త తన కొత్త భార్యను ‘సంతోషపెట్టడానికి’ వీలవుతుందని ధర్మశాస్త్రం వివరించింది.—ద్వితీయోపదేశకాండము 20:5, 6, 8; 24:5.

19.స్త్రీల, పిల్లల, కుటుంబాల, విధవరాండ్ర, అనాధల భద్రత కోసం ధర్మశాస్త్రంలో ఎలాంటి ఏర్పాట్లున్నాయి?

19 స్త్రీల గురించి, పిల్లల గురించి, కుటుంబాల గురించి శ్రద్ధతీసుకుంటూ ధర్మశాస్త్రం వారిని కూడా కాపాడింది. తమ పిల్లలపట్ల నిరంతరం శ్రద్ధ చూపిస్తూ, ఆధ్యాత్మిక విషయాలను ఉపదేశిస్తుండాలని ధర్మశాస్త్రం తలిదండ్రులను ఆదేశించింది. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) అది రక్తసంబంధీకుల మధ్య అన్నిరకాల లైంగిక సంబంధాలను నిషేధిస్తూ ఆ తప్పులకు మరణాన్ని శిక్షగా విధించింది. (లేవీయకాండము 18వ అధ్యాయం) అంతేగాక అది తరచూ కుటుంబాలను విచ్ఛిన్నంచేసి భద్రతను, గౌరవాన్ని నాశనం చేసే వ్యభిచారాన్ని కూడా నిషేధించింది. విధవరాండ్రకు, అనాధలకు ధర్మశాస్త్రం తగిన ఏర్పాట్లు చేయడమే గాక వారిని అనాదరణకు గురిచేయడాన్ని అది తీవ్రంగా నిషేధించింది.—నిర్గమకాండము 20:14; 22:22-24.

20, 21.(ఎ)మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల మధ్య బహుభార్యత్వాన్ని ఎందుకు అనుమతించింది? (బి) విడాకుల విషయంలో యేసు ఆ తర్వాత తిరిగి నెలకొల్పిన ప్రమాణానికి, ధర్మశాస్త్రం చెప్పినదానికి ఎందుకు తేడా ఉంది?

20 అట్లయితే, అసలు ‘ధర్మశాస్త్రం బహుభార్యత్వాన్ని ఎందుకు అనుమతించింది?’ అని కొందరు ఆశ్చర్యపోతుండవచ్చు. (ద్వితీయోపదేశకాండము 21:15-17) ఇలాంటి నియమాలను కాల సందర్భాన్నిబట్టి మనం పరిశీలించాలి. ఆధునిక కాల సంస్కృతి దృక్కోణం నుండి మోషే ధర్మశాస్త్రాన్ని చూసేవారు దానిని తప్పక అపార్థం చేసుకుంటారు. (సామెతలు 18:13) పూర్వం ఏదెనులో యెహోవా నియమించిన ప్రమాణం ఒక భార్యకు ఒక భర్తకు మధ్య వివాహాన్ని శాశ్వత బంధంగా చేసింది. (ఆదికాండము 2:18, 20-24) అయితే ఇశ్రాయేలీయులకు యెహోవా ధర్మశాస్త్రమిచ్చే సమయానికి, బహుభార్యత్వం వంటి ఆచారాలు శతాబ్దాలుగా పాతుకుపోయి ఉన్నాయి. “లోబడనొల్లని” తన ప్రజలు విగ్రహారాధనను నిషేధించే వాటి వంటి అతి ప్రధాన ఆజ్ఞలకు సైతం విధేయత చూపడంలో తరచూ విఫలమవుతారని యెహోవాకు తెలుసు. (నిర్గమకాండము 32:9) అందుకే, జ్ఞానయుక్తంగా ఆయన వారి వైవాహిక ఆచారాలను సంస్కరించే సమయంగా ఆ కాలాన్ని ఎంచుకోలేదు. అయితే, బహుభార్యత్వాన్ని యెహోవా ఏర్పాటు చేయలేదని గుర్తుంచుకోండి. కానీ ఆయన తన ప్రజల మధ్య బహుభార్యత్వాన్ని క్రమపరచి, ఆ ఆచార దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు మోషే ధర్మశాస్త్రాన్ని ఉపయోగించాడు.

21 అదేప్రకారం, మోషే ధర్మశాస్త్రం ఒక పురుషుడు చాలామేరకు వివిధ గంభీరమైన విషయాల ఆధారంగా తన భార్యకు విడాకులివ్వడాన్ని అనుమతించింది. (ద్వితీయోపదేశకాండము 24:1-4) ఇది, యూదుల “హృదయకాఠిన్యమును బట్టి” దేవుడు వారికిచ్చిన మినహాయింపు అని యేసు అన్నాడు. అయితే, అలాంటి మినహాయింపులు తాత్కాలికమే. యేసు తన అనుచరులకు, వివాహం గురించిన యెహోవా తొలి ప్రమాణాన్ని తిరిగి నెలకొల్పాడు.—మత్తయి 19:8.

ధర్మశాస్త్రం ప్రేమను ప్రోత్సహించింది

22.మోషే ధర్మశాస్త్రం ఏయే విధాలుగా ప్రేమను ప్రోత్సహించింది, ఎవరెవరిపట్ల ప్రేమ చూపించడాన్ని ప్రోత్సహించింది?

22 ప్రేమను ప్రోత్సహించే ఆధునిక న్యాయ వ్యవస్థను మీరు ఊహించుకోగలరా? మోషే ధర్మశాస్త్రం అన్నింటికంటే మిన్నగా ప్రేమను ప్రోత్సహించింది. అంతెందుకు, ఒక్క ద్వితీయోపదేశకాండములోనే “ప్రేమ” అనే మాట అనేక రూపాల్లో 20సార్లకు పైగా కనిపిస్తుంది. “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను” అనేది ధర్మశాస్త్రమంతటిలోకి ప్రధానమైన ఆజ్ఞల్లో రెండవది. (లేవీయకాండము 19:18; మత్తయి 22:37-40) ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలు అలాంటి ప్రేమను పరస్పరం చూపుకోవడమే కాదు, తాము కూడా ఒకప్పుడు పరదేశులుగా ఉన్నామనే విషయం గుర్తుంచుకొని తమ మధ్య నివసిస్తున్న పరదేశులపట్ల కూడా ప్రేమ చూపాలి. వారు బీదవారిపట్ల, బాధితులపట్ల ప్రేమ చూపించాలి, వారి దుస్థితిని ఆసరాగా తీసుకుని లాభార్జన చేయకుండా వస్తుదాయకంగా వారికి సహాయం చేయాలి. బరువులుమోసే పశువులపట్ల కూడా వారు దయ, ఆదరణ చూపాలని నిర్దేశించబడ్డారు.—నిర్గమకాండము 23:6; లేవీయకాండము 19:14, 33, 34; ద్వితీయోపదేశకాండము 22:4, 10; 24:17, 18.

23.కీర్తన 119 వ్రాసిన రచయిత ఏమి చేయడానికి పురికొల్పబడ్డాడు, మనమేమి చేయడానికి తీర్మానించుకోవచ్చు?

23 వేరే ఏ జనాంగం అటువంటి న్యాయసూత్రావళితో ఆశీర్వదించబడింది? కీర్తనకర్త ఇలా వ్రాశాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు: “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది.” అయితే ఆయన ప్రేమ కేవలమొక ఉద్వేగం కాదు. అది ఆయన చర్య తీసుకునేలా పురికొల్పింది, ఎందుకంటే ఆయన ఆ ధర్మశాస్త్రానికి లోబడేందుకు, దాని ప్రకారం జీవించేందుకు కృషిచేశాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” (కీర్తన 119:11, 97) అవును, ఆయన యెహోవా నియమాలు అధ్యయనం చేయడానికి క్రమంగా సమయం తీసుకున్నాడు. ఆయనలా చేస్తుండగా, వాటిపట్ల ఆయన ప్రేమ నిస్సందేహంగా అధికమైంది. అదే సమయంలో, శాసనకర్తయైన యెహోవా దేవునిపట్ల కూడా ఆయన ప్రేమ వృద్ధి అయింది. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరు అధ్యయనం చేస్తుండగా మీరు కూడా మహా గొప్ప శాసనకర్త, న్యాయానికి దేవుడు అయిన యెహోవాకు మరింత సన్నిహితులగుదురు గాక.

^ ఉదాహరణకు, మానవ మలాన్ని మట్టితో కప్పివేయడం, రోగులను దూరంగా ఉంచడం, మృత కళేబరాన్ని ముట్టుకున్నవారు స్నానంచేయడం వంటి ధర్మశాస్త్ర నియమాలు అనేక శతాబ్దాల తర్వాత గానీ ఇతర జనాంగాల చట్టాల్లో ఒక భాగం కాలేదు.—లేవీయకాండము 13:4-8; సంఖ్యాకాండము 19:11-13, 17-19; ద్వితీయోపదేశకాండము 23:13, 14.

^ కనానీయుల దేవాలయాల్లో లైంగిక కృత్యాలకు ప్రత్యేకంగా గదులు ఉండగా, అపవిత్ర స్థితిలో ఉన్నవారు ఆలయ ప్రవేశమే చేయకూడదని ధర్మశాస్త్రం నిర్దేశించింది. అలా లైంగిక సంబంధాల మూలంగా కొంతకాలంపాటు అపవిత్రత కలిగేది కాబట్టి యెహోవా ఆలయంలో ఎవరూ న్యాయబద్ధంగా లైంగికత్వాన్ని ఆరాధనలో ఒక భాగంగా చేయలేరు.

^ బోధించడం ధర్మశాస్త్రం యొక్క ప్రాథమిక సంకల్పం. నిజానికి, “ధర్మశాస్త్రము” అని అనువదించబడిన తోరా అనే హీబ్రూ పదానికి “బోధన” అనే అర్థముందని ఎన్‌సైక్లోపీడియా జుడైకా వ్యాఖ్యానిస్తోంది.

^ ధర్మశాస్త్రం సూటిగా ఇలా ప్రశ్నించింది: “నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా?” (ద్వితీయోపదేశకాండము 20:19) “మనుషులమీది కోపాన్ని ఏ మాత్రం కీడెరుగని అమాయక వస్తువులపై చూపడం అన్యాయమని” దేవుడు భావిస్తాడని వివరిస్తూ మొదటి శతాబ్దపు యూదా విద్వాంసుడైన ఫిలో ఈ నియమాన్ని ఉదహరించాడు.