కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 14

యెహోవా “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము” సమకూరుస్తున్నాడు

యెహోవా “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము” సమకూరుస్తున్నాడు

1, 2.మానవాళి పరిస్థితిని బైబిలు ఎలా వర్ణిస్తోంది, బయటపడడానికి ఉన్న ఏకైక మార్గమేమిటి?

 “సృష్టి యావత్తు . . . ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నది.” (రోమీయులు 8:22) ఆ మాటలతో అపొస్తలుడైన పౌలు మనమున్న దీనావస్థను వర్ణిస్తున్నాడు. మానవ దృక్కోణం నుండి చూస్తే బాధ నుండి, పాపమరణాల నుండి బయటపడే మార్గం లేనట్లే కనిపిస్తుంది. అయితే మానవులకున్నట్లు యెహోవాకు పరిమితులు లేవు. (సంఖ్యాకాండము 23:19) న్యాయవంతుడైన దేవుడు మన కష్టాలు తొలిగే మార్గాన్ని దయచేశాడు. అది విమోచన క్రయధనం అని పిలువబడుతోంది.

2 విమోచన క్రయధనం మానవాళికి యెహోవా ఇచ్చిన అతి గొప్ప బహుమానం. పాపమరణాల నుండి అది విమోచనను సాధ్యపరుస్తుంది. (ఎఫెసీయులు 1:7) పరలోకంలోనైనా భూపరదైసులోనైనా నిత్యజీవ నిరీక్షణకు అది పునాది. (లూకా 23:43; యోహాను 3:16; 1 పేతురు 1:5) అయితే విమోచన క్రయధనం అంటే ఏమిటి? యెహోవా సర్వోన్నత న్యాయాన్ని అది మనకెలా బోధిస్తుంది?

విమోచన క్రయధనపు అవసరం ఎలా ఏర్పడింది

3.(ఎ)విమోచన క్రయధనం ఎందుకు అవసరమైంది? (బి) ఆదాము సంతానం మీది మరణ శిక్షను మరో చిన్న శిక్షగా దేవుడు ఎందుకు మార్చలేకపోయాడు?

3 ఆదాము పాపం కారణంగా విమోచన క్రయధనపు అవసరం ఏర్పడింది. ఆదాము దేవునికి అవిధేయుడు కావడం ద్వారా, తన సంతానానికి రోగం, దుఃఖం, వేదన మరణాలను వారసత్వంగా సంక్రమింపజేశాడు. (ఆదికాండము 2:17; రోమీయులు 8:20) దేవుడు భావావేశానికి లొంగిపోయి ఆ మరణ శిక్షను మరోలా మార్చలేకపోయాడు. అలాచేస్తే “పాపమువలన వచ్చు జీతము మరణము” అనే తన సొంత నియమాన్ని తానే అలక్ష్యం చేసినట్టవుతుంది. (రోమీయులు 6:23) యెహోవా తానే తన సొంత న్యాయ కట్టడలను కాలరాస్తే ఇక విశ్వంలో అరాచకాలు, అక్రమాలే రాజ్యమేలుతాయి.

4, 5.(ఎ)సాతాను దేవునిపై ఏమని అబద్ధాలు చెప్పాడు, ఆ సవాళ్లకు జవాబుచెప్పవలసిన బాధ్యత యెహోవాకు ఎందుకుంది? (బి) యెహోవా యథార్థ సేవకుల గురించి సాతాను ఏమని ఆరోపించాడు?

4 మనం 12వ అధ్యాయంలో చూసినట్లుగా, ఏదెనులో జరిగిన తిరుగుబాటు మరిన్ని గొప్ప వివాదాంశాలను లేవదీసింది. దేవుని మంచి పేరుపై సాతాను కళంకం తీసుకొచ్చాడు. నిజానికి అతడు యెహోవా అబద్ధికుడని, తన సృష్టి ప్రాణులకు స్వేచ్ఛ ఇవ్వని క్రూరమైన నియంత అని నిందించాడు. (ఆదికాండము 3:1-5) నీతిమంతులైన మానవులతో భూమిని నింపాలనే దేవుని సంకల్పాన్ని అడ్డగిస్తున్నట్లు చేయడం ద్వారా, దేవుడు విఫలమయ్యాడని కూడా సాతాను నిందించాడు. (ఆదికాండము 1:28; యెషయా 55:10, 11) యెహోవా ఈ సవాళ్లకు జవాబులివ్వకుండా వదిలేస్తే, బుద్ధిసూక్ష్మతగల ప్రాణులనేకులు ఆయన పరిపాలనపై చాలావరకు తమ నమ్మకాన్ని పోగొట్టుకొని ఉండేవారు.

5 యెహోవా యథార్థతా సేవకులు కేవలం స్వార్థపు ఉద్దేశాలతోనే ఆయనను సేవిస్తున్నారని, వారిపైకి ఒత్తిడివస్తే వారిలో ఎవ్వరూ దేవునిపట్ల నమ్మకంగా ఉండరని కూడా సాతాను అపవాదు వేశాడు. (యోబు 1:9-11) మానవుల బాధాకర పరిస్థితికంటే ఈ వివాదాంశాలు మరింత ప్రాముఖ్యమైనవి. సాతాను చేసిన అబద్ధ ఆరోపణలకు జవాబు చెప్పవలసిన బాధ్యత తనకుందని యెహోవా న్యాయంగానే భావించాడు. అయితే దేవుడు ఈ వివాదాలను పరిష్కరించడంతో పాటు మానవాళిని కూడా ఎలా రక్షించగలడు?

విమోచన క్రయధనం​—⁠సమతుల్యమైన ఒక ఏర్పాటు

6.మానవాళిని రక్షించేందుకు దేవుడు ఏర్పాటు చేసిన మాధ్యమాన్ని వర్ణించడానికి బైబిల్లో ఉపయోగించబడిన పదాల్లో కొన్ని ఏమిటి?

6 యెహోవా ఎంచుకున్న పరిష్కారం అటు ఎంతో కనికరంతో కూడినది ఇటు ఎంతో న్యాయమైనది, అలా ఏ మానవుడూ ఎన్నటికీ పరిష్కరించలేడు. అయినా అది అత్యుత్తమ రీతిలో సరళంగా ఉంది. అది ప్రాయశ్చిత్తం, విమోచన, సమాధానపరచుకోవడం, పరిహారము అని వివిధ రీతుల్లో సూచించబడింది. (దానియేలు 9:24; గలతీయులు 3:13; కొలొస్సయులు 1:19; హెబ్రీయులు 2:17) అయితే యేసు స్వయంగా చెప్పిన మాటే ఆ విషయాన్ని శ్రేష్ఠమైన రీతిలో వివరించవచ్చు. ఆయనిలా చెప్పాడు: “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా [గ్రీకు, లీట్రాన్‌] తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.”—మత్తయి 20:28.

7, 8.(ఎ)లేఖనాల్లో “విమోచన క్రయధనం” అనే మాటకు ఎలాంటి అర్థముంది? (బి) విమోచన క్రయధనంలో సమతుల్యత ఏ విధంగా ఇమిడివుంది?

7 విమోచన క్రయధనం అంటే ఏమిటి? ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం “విముక్తి చేయు, విడుదల చేయు” అనే అర్థమున్న క్రియాపదం నుండి వచ్చింది. యుద్ధ ఖైదీలను విడుదల చేయడానికి చెల్లించబడే డబ్బును వర్ణించడానికి ఈ పదం ఉపయోగించబడేది. కాబట్టి, విమోచన క్రయధనాన్ని ప్రాథమికంగా, దేన్నైనా తిరిగి కొనడానికి చెల్లించబడేదేదైనా అని నిర్వచించవచ్చు. హీబ్రూ లేఖనాల్లో, “విమోచన క్రయధనం” (కోఫెర్‌) అనే మాట “కప్పడం” అనే అర్థమున్న క్రియాపదం నుండి వస్తోంది. విమోచన క్రయధనం చెల్లించడం అంటే పాపాలను కప్పడం అనే భావం కూడా ఉన్నట్లు అర్థంచేసుకోవడానికి ఇది మనకు సహాయం చేస్తుంది.

8 ప్రాముఖ్యంగా ఈ పదం (కోఫెర్‌) “అన్ని సందర్భాల్లో సమతుల్యతను” లేదా సరిసమానతను “సూచిస్తుంది” అని థియోలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌ పేర్కొంటోంది. అందుకే, నిబంధన మందసపు మూత ఆ మందసానికి సరిగ్గా సరిపోయే ఆకారంలో ఉండేది. అదే రీతిలో, పాపానికి తగిన విమోచన క్రయధనం చెల్లించాలంటే లేదా దాన్ని కప్పాలంటే ఆ పాపం వలన కలిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చే లేదా పూర్తిగా కప్పే క్రయధనం చెల్లించబడాలి. అందువల్లే, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఈ విధంగా తెలియజేసింది: “ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు . . . విధి.”—ద్వితీయోపదేశకాండము 19:21.

9.విశ్వసనీయులైన పురుషులు జంతు బలులు ఎందుకు అర్పించారు, అలాంటి బలులను యెహోవా ఎలా దృష్టించాడు?

9 హేబెలు మొదలుకొని విశ్వసనీయులైన పురుషులు దేవునికి జంతు బలులు అర్పించారు. అలాచేయడంలో, వారు తాము పాపులమనే సంగతి, తమకు విమోచన అవసరమనే సంగతి తెలుసని చూపిస్తూ, దేవుడు తన “సంతానము” ద్వారా విడుదల చేస్తానని చేసిన వాగ్దానంపై తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. (ఆదికాండము 3:15; 4:1-4; లేవీయకాండము 17:11; హెబ్రీయులు 11:4) అలాంటి బలులను యెహోవా ఆమోదించి, ఈ ఆరాధకులకు మంచి స్థానం అనుగ్రహించాడు. అయినప్పటికీ, జంతుబలులు ఎంత శ్రేష్ఠమైనవైనా అవి కేవలం నామమాత్రపువే. జంతువులు మానవులకంటే అధమమైనవి కాబట్టి, నిజానికి అవి మానవుని పాపాన్ని కప్పలేవు. (కీర్తన 8:​4-8) అందుకే బైబిలు ఇలా చెబుతోంది: “ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.” (హెబ్రీయులు 10:​1-4) అలాంటి బలులు రాబోయే నిజ విమోచన క్రయధన బలికి కేవలం చిత్రీకరణగా లేదా సూచనార్థకంగా మాత్రమే ఉన్నాయి.

‘సరిసమాన విమోచన క్రయధనం’

10.(ఎ)విమోచకుడు ఎవరికి సరిసమానంగా ఉండాలి, ఎందుకు? (బి) కేవలం ఒక మనిషి బలి మాత్రమే ఎందుకు అవసరం?

10 ‘ఆదామునందు అందరు మృతిపొందుచున్నారని’ అపొస్తలుడైన పౌలు అన్నాడు. (1 కొరింథీయులు 15:22) కాబట్టి విమోచన క్రయధనం చెల్లించడానికి అది ఆదాముకు సరిసమానమైన ఒక పరిపూర్ణ మనిషి మరణమై ఉండాలి. (రోమీయులు 5:14) న్యాయపు త్రాసులో ఏ ఇతర ప్రాణీ సరితూగలేదు. కేవలం ఆదాము సంక్రమిత మరణదండన క్రిందలేని పరిపూర్ణ మానవుడు మాత్రమే ‘సరిసమాన విమోచన క్రయధనం’ అంటే ఖచ్చితంగా ఆదాముకు సరిసమానమైన మూల్యం చెల్లించగలడు. (1 తిమోతి 2:6, NW) ఆదాము సంతతిలోని ప్రతీ వ్యక్తికి సరిపడా కోట్లకొలది మానవులు బలిగా అర్పించబడవలసిన అవసరముండదు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా వివరించాడు: ‘ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించెను.’ (రోమీయులు 5:12) ‘ఒక మనుష్యుని ద్వారా పాపము ప్రవేశించింది’ కాబట్టి దేవుడు ‘ఒక మనుష్యుని ద్వారానే’ మానవాళి విమోచనకు ఏర్పాటుచేశాడు. (1 కొరింథీయులు 15:21) ఏ విధంగా?

‘అందరి కోసం సరిసమానమైన విమోచన క్రయధనము’

11.(ఎ)విమోచకుడు ‘ప్రతి మనుష్యుని కొరకు’ ఎలా మరణిస్తాడు’? (బి) విమోచన క్రయధనం నుండి ఆదాము, హవ్వలు ఎందుకు ప్రయోజనం పొందగలిగేవారు కాదు? (అధస్సూచి చూడండి.)

11 ఒక పరిపూర్ణ మనిషి స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని బలిగా ఇచ్చేలా యెహోవా ఏర్పాటుచేశాడు. రోమీయులు 6:23 ప్రకారం “పాపమువలన వచ్చు జీతము మరణము.” తన ప్రాణాన్ని బలివ్వడానికి ఆ విమోచకుడు ‘ప్రతి మనుష్యుని కొరకు మరణించాలి.’ వేరే విధంగా చెప్పాలంటే ఆయన ఆదాము పాపానికి జీతం చెల్లించాలి. (హెబ్రీయులు 2:9; 2 కొరింథీయులు 5:21; 1 పేతురు 2:24) దీనివల్ల అపారమైన న్యాయసంబంధ పరిణామాలు సంభవిస్తాయి. విధేయులైన ఆదాము సంతానంపై విధించబడిన మరణ శిక్షను నిరర్థకం చేయడం ద్వారా, ఆ విమోచన క్రయధనం పాపపు నాశనకర బలాన్ని దాని మూలస్థానం నుండే సమూలంగా తొలగిస్తుంది. *రోమీయులు 5:16.

12.ఒక రుణం చెల్లించడం అనేకమందికి ఎలా ప్రయోజనం చేకూర్చగలదో సోదాహరణంగా చెప్పండి.

12 ఉదాహరణకు, మీరు నివసిస్తున్న పట్టణ నివాసుల్లో అధికశాతం ఒక పెద్ద కర్మాగారంలో ఉద్యోగం చేస్తున్నవారే అనుకోండి. మీకూ మీ పొరుగువారికి మంచి జీతం దొరుకుతుంది మీరు సుఖంగా జీవిస్తున్నారు. ఆ కర్మాగారం మూతపడేవరకే మీరలా జీవించగలరు. కానీ ఆ కర్మాగారం ఎందుకు మూతపడింది? ఆ కర్మాగార నిర్వహణాధికారి అవినీతికి పాల్పడి దానిని దివాలా తీయించాడు. ఉన్నఫళాన ఉద్యోగం పోవడంతో మీకు మీ పొరుగువారికి బిల్లులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆ ఒక్కడి అవినీతి కారణంగా వివాహిత దంపతులు, పిల్లలు, రుణదాతలతో సహా అందరు బాధలపాలయ్యారు. పరిష్కారం దొరికే మార్గమేదైనా ఉందా? ఉంది! ధనవంతుడైన ఒక దాత జోక్యం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆయనకు ఆ కర్మాగారానికి ఉన్న విలువేమిటో తెలుసు. అంతేగాక ఆయనకు దానిలో పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులపట్ల వారి కుటుంబాలపట్ల సానుభూతి కూడా ఉంది. కాబట్టి ఆయన ఆ కర్మాగార రుణం చెల్లించి, కర్మాగారం తిరిగి తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఆ ఒక్క అప్పు తీర్చడం అనేకులైన ఉద్యోగులకు, వారి కుటుంబాలకు వారి రుణదాతలకు ఉపశమనం కలిగిస్తుంది. అదేప్రకారం, ఆదాము రుణం రద్దుచేయడం కోట్లాదిమందికి ప్రయోజనం చేకూరుస్తుంది.

విమోచన క్రయధనం ఎవరు చెల్లిస్తారు?

13, 14.(ఎ)మానవాళి కొరకు యెహోవా విమోచన క్రయధనం ఎలా ఏర్పాటుచేశాడు? (బి) విమోచన క్రయధనం ఎవరికి చెల్లించబడింది, అలాంటి చెల్లింపు ఎందుకు అవసరం?

13 “లోకపాపమును మోసికొనిపోవు గొఱ్ఱెపిల్ల[ను]” ఒక్క యెహోవా మాత్రమే ఏర్పాటు చేయగలడు. (యోహాను 1:29) మానవాళిని రక్షించడానికి ఆయన ఎవరో ఒక దేవదూతను పంపించలేదు. బదులుగా, యెహోవా తన సేవకులపై సాతాను చేసిన ఆరోపణలకు తిరుగులేని అంతిమ జవాబివ్వగల ఆ అద్వితీయుణ్ణి పంపించాడు. అవును, యెహోవా ‘తన ప్రాణానికి ప్రియుడైన’ తన అద్వితీయకుమారుణ్ణి పంపిస్తూ అత్యున్నత త్యాగం చేశాడు. (యెషయా 42:1) దేవుని కుమారుడు ఇష్టపూర్వకంగా పరలోక నైజం విషయంలో “తన్ను తానే రిక్తునిగా చేసికొ[న్నాడు].” (ఫిలిప్పీయులు 2:7) అద్భుతరీతిలో, యెహోవా ఆదిసంభూతుడైన తన పరలోక కుమారుని జీవాన్ని, ఆయన వ్యక్తిత్వ విధానాన్ని మరియ అనే పేరుగల యూదా కన్యక గర్భానికి మార్చాడు. (లూకా 1:27, 35) మానవునిగా ఆయన యేసు అని పిలువబడ్డాడు. కానీ న్యాయ పరిభాషలో చెప్పాలంటే ఆయన కడపటి ఆదాము అని పిలువబడ్డాడు, ఎందుకంటే ఆయన ఆదాముకు పరిపూర్ణంగా సరిసమాన స్థాయిలో ఉన్నాడు. (1 కొరింథీయులు 15:45, 47) ఆ విధంగా పాపభరిత మానవాళి కొరకు యేసు విమోచన క్రయధన బలిగా తననుతాను అర్పించుకోగలిగాడు.

14 ఆ విమోచన క్రయధనం ఎవరికి చెల్లించబడుతుంది? ఆ విమోచన క్రయధనం ‘దేవునికి’ చెల్లించబడిందని కీర్తన 49:8 నిర్దిష్టంగా చెబుతోంది. కానీ ఆ విమోచన క్రయధనాన్ని అసలు ఏర్పాటుచేసింది యెహోవాయే గదా? అవును, అంతమాత్రాన అది డబ్బు ఒక జేబులోనుండి తీసి మరో జేబులో పెట్టుకునే విధంగా, ఆ విమోచన క్రయధనాన్ని అర్థంలేని దానిగా, యాంత్రిక మార్పిడిగా చేయదు. విమోచన క్రయధనం భౌతిక మార్పిడి కాదుగాని న్యాయపరమైన వ్యవహారమని అర్థంచేసుకోవాలి. యెహోవా తాను అంతులేని మూల్యం చెల్లించవలసి వచ్చినప్పటికీ, విమోచన క్రయధనం చెల్లించే ఏర్పాటు చేయడం ద్వారా తన సొంత పరిపూర్ణ న్యాయానికి తాను స్థిరంగా కట్టుబడి ఉంటానని నొక్కిచెప్పాడు.—ఆదికాండము 22:7, 8, 11-13; హెబ్రీయులు 11:17; యాకోబు 1:17.

15.యేసు బాధపడి మరణించడం ఎందుకు అవసరం?

15 సా.శ. 33 వసంత ఋతువులో విమోచన క్రయధనం చెల్లించడానికి చివరకు దారితీసిన విషమ పరీక్షకు యేసుక్రీస్తు తనను తాను ఇష్టపూర్వకంగా లోబరచుకున్నాడు. అబద్ధ ఆరోపణలపై బంధించబడడానికీ, దోషిగా తీర్చబడడానికీ, మరణకొయ్యకు మేకులతో కొట్టబడడానికీ ఆయన తననుతాను అనుమతించుకున్నాడు. యేసు అంతగా బాధ అనుభవించడం నిజంగా అవసరమా? అవసరమే, ఎందుకంటే దేవుని సేవకుల యథార్థతా వివాదం పరిష్కరించబడాలి. గమనార్హమైన విషయమేమిటంటే, హేరోదు పసివాడైన యేసును చంపడానికి దేవుడు అనుమతించలేదు. (మత్తయి 2:13-18) కానీ యేసు పెద్దవాడైనప్పుడు వివాదాంశాలపై పూర్తి అవగాహనతో ఆయన సాతాను శక్తిమంతమైన దాడులను తట్టుకొని నిలబడగలిగాడు. * భయంకర హింస మధ్యనూ ‘పవిత్రునిగా, నిర్దోషిగా, నిష్కల్మషునిగా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవానిగా’ కొనసాగడం ద్వారా పరీక్షల్లోను నమ్మకంగా నిలిచే సేవకులు యెహోవాకు ఉన్నారని యేసు గమనార్హంగా తిరుగులేని రీతిలో నిరూపించాడు. (హెబ్రీయులు 7:26) అందుకే యేసు తన మరణ చివరి క్షణాల్లో విజయ స్వరంతో “సమాప్తమైనది” అని బిగ్గరగా అరిచాడంటే దానిలో ఆశ్చర్యంలేదు.—యోహాను 19:30.

తన విమోచనా పని పూర్తిచేయడం

16, 17.(ఎ)యేసు తన విమోచనా పనినెలా కొనసాగించాడు? (బి) యేసు “మనకొరకు దేవుని సముఖమందు” కనబడడం ఎందుకు అవసరం?

16 యేసు తన విమోచనా పనిని ఇంకా పూర్తిచేయవలసి ఉంది. యేసు మరణించిన మూడవ రోజున యెహోవా ఆయనను మృతుల్లోనుండి లేపాడు. (అపొస్తలుల కార్యములు 3:15; 10:40) ఈ అద్భుతకార్యం ద్వారా యెహోవా యథార్థ సేవ చేసినందుకు తన కుమారునికి ప్రతిఫలమివ్వడమే కాక దేవుని ప్రధాన యాజకునిగా ఆయనకు ఇవ్వబడిన విమోచనా పని కూడా పూర్తిచేసే అవకాశమిచ్చాడు. (రోమీయులు 1:1; 1 కొరింథీయులు 15:3-8) అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: ‘క్రీస్తు ప్రధానయాజకుడుగా వచ్చినప్పుడు, తానే నిత్యమైన విమోచన సంపాదించి, . . . మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.’—హెబ్రీయులు 9:11, 12, 24.

17 క్రీస్తు అక్షరార్థంగా తన రక్తాన్ని పరలోకానికి తీసుకెళ్లలేడు. (1 కొరింథీయులు 15:50) బదులుగా, ఆ రక్తం సూచించేదాన్ని అంటే బలిగా అర్పించబడిన తన పరిపూర్ణ మానవ జీవముకున్న న్యాయపరమైన విలువను తీసుకెళ్లాడు. అక్కడ దేవుని సముఖమందు ఆయన పాపభరిత మానవాళికి ప్రతిగా తన ప్రాణ విమోచన క్రయధన విలువను న్యాయబద్ధంగా అర్పించాడు. ఆ బలిని యెహోవా స్వీకరించాడా? స్వీకరించాడు, అది సా.శ. 33 పెంతెకొస్తునాడు యెరూషలేములో దాదాపు 120 మంది శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు స్పష్టమైంది. (అపొస్తలుల కార్యములు 2:1-4) ఆ సంఘటన ఉత్కంఠభరితమైనదే అయినప్పటికీ, విమోచన క్రయధనం అప్పుడే అద్భుత ప్రయోజనాలను అందజేయడం ఆరంభించింది.

విమోచన క్రయధన ప్రయోజనాలు

18, 19.(ఎ)క్రీస్తు రక్తం ద్వారా సాధ్యపరచబడిన సమాధానం నుండి ఏ రెండు గుంపుల వ్యక్తులు ప్రయోజనం పొందుతారు? (బి) ‘గొప్పసమూహంలోని’ వారికి విమోచన క్రయధనం మూలంగా ఇప్పుడూ, భవిష్యత్తులోనూ లభించే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

18 పౌలు తాను కొలొస్సయులకు వ్రాసిన పత్రికలో, యేసు హింసా కొయ్యపై చిందించిన రక్తం ద్వారా సర్వాన్ని సంధిచేసి క్రీస్తు మూలంగా తనతో సమాధానపరచుకోవడం దేవుని అభీష్టమని వివరిస్తున్నాడు. ఈ సమాధాన ప్రక్రియలో రెండు విభిన్న గుంపులవారు ఇమిడి ఉన్నారని కూడా పౌలు వివరిస్తున్నాడు, నిర్దిష్టంగా చెప్పాలంటే, ‘పరలోకములో ఉన్నవి, భూమిమీద ఉన్నవి.’ (కొలొస్సయులు 1:19, 20; ఎఫెసీయులు 1:10) మొదటి గుంపులో యేసుక్రీస్తుతోపాటు పరలోక యాజకులుగా సేవచేసే, భూమిపై రాజులుగా పరిపాలించే నిరీక్షణ ఇవ్వబడిన 1,44,000 మంది ఉన్నారు. (ప్రకటన 5:9, 10; 7:4; 14:1-3) వారి ద్వారా విమోచన క్రయధన ప్రయోజనాలు, విధేయులైన మానవులకు వెయ్యి సంవత్సరాల కాలంలో క్రమేపీ అనువర్తించబడతాయి.—1 కొరింథీయులు 15:24-26; ప్రకటన 20:6; 21:3, 4.

19 ‘భూమి మీద ఉన్నవి’ భూపరదైసుపై పరిపూర్ణ జీవం అనుభవించడానికి ఎదురుచూసే అనేకమంది వ్యక్తులు. ప్రకటన 7:9-17 వారిని రానున్న ‘మహాశ్రమలు’ తప్పించుకునే “గొప్పసమూహము” అని వర్ణిస్తోంది. అయితే వారు విమోచన క్రయధనపు ప్రయోజనాలు అనుభవించడానికి అప్పటివరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. వారు ఇప్పటికే ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొన్నారు.’ వారు విమోచన క్రయధనంలో విశ్వాసం చూపుతున్నారు కాబట్టి, వారిప్పుడు కూడా ఆ ప్రేమపూర్వక ఏర్పాటు నుండి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందుతున్నారు. దేవుని స్నేహితులుగా వారు నీతిమంతులుగా ప్రకటించబడ్డారు. (యాకోబు 2:23) యేసు బలి ఫలితంగా వారు “ధైర్యముతో కృపాసనమునొద్దకు” చేరుకోవచ్చు. (హెబ్రీయులు 4:14-16) తప్పుచేసినప్పుడు వారు నిజమైన క్షమాపణ పొందుతారు. (ఎఫెసీయులు 1:7) అపరిపూర్ణులైనప్పటికీ, వారు నిర్మలమైన మనస్సాక్షి కలిగివుంటారు. (హెబ్రీయులు 9:9; 10:22; 1 పేతురు 3:21) కాబట్టి దేవునితో సమాధానపడడం అనేది భవిష్యత్తులో జరుగుతుందని నిరీక్షించే విషయం కాదుగాని అది ప్రస్తుత వాస్తవం. (2 కొరింథీయులు 5:19, 20) వెయ్యేండ్ల పరిపాలన కాలంలో వారు క్రమేపీ “నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి” చివరకు ‘దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుతారు.’—రోమీయులు 8:20

20.విమోచన క్రయధనాన్ని ధ్యానించడం మీపై వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది?

20 విమోచన క్రయధనం కోసం “యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు.” (రోమీయులు 7:25) అది సూత్రానుసారం సరళమే అయినా మనలో భక్తిపూర్వక భయం నింపడానికి సరిపోయేంత ప్రగాఢమైనది. (రోమీయులు 11:33) విమోచన క్రయధనం గురించి కృతజ్ఞతా పూర్వకంగా ధ్యానించినప్పుడు, అది మన హృదయాలను స్పర్శించి మనలను న్యాయవంతుడైన దేవునికి మరింత సన్నిహితులను చేస్తుంది. కీర్తనకర్త మాదిరిగా “నీతిని, న్యాయమును ప్రేమించు” యెహోవాను సన్నుతించడానికి మనకు ప్రతీ కారణముంది.—కీర్తన 33:5.

^ విమోచన క్రయధనం నుండి ఆదాము, హవ్వలు ప్రయోజనం పొందగలిగేవారు కాదు. ఉద్దేశపూర్వక నరహంతకుని విషయంలో మోషే ధర్మశాస్త్రం ఈ సూత్రం పేర్కొంది: “చావతగిన నరహంతకుని ప్రాణముకొరకు మీరు విమోచన ధనమును అంగీకరింప” కూడదు. (సంఖ్యాకాండము 35:31) ఆదాము, హవ్వలు ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయులయ్యారు కాబట్టి వారు ఖచ్చితంగా మరణార్హులే. ఆ విధంగా వారు నిత్యజీవపు ఉత్తరాపేక్షను చేజార్చుకున్నారు.

^ ఆదాము పాపాన్ని సరితూకం చేయడానికి యేసు పరిపూర్ణ పిల్లవానిగా కాదుగాని పరిపూర్ణ పురుషునిగా మరణించాలి. ఆదాము ఇష్టపూర్వకంగా, ఆ చర్య యొక్క గాంభీర్యత గురించిన, దాని పర్యవసానాల గురించిన పూర్తి అవగాహనతోనే పాపం చేశాడని గుర్తుంచుకోండి. కాబట్టి యేసు “కడపటి ఆదాము”గా మారి ఆ పాపాన్ని కప్పడానికి, యెహోవాపట్ల తన యథార్థతను కాపాడుకునేందుకు అన్ని విషయాలు తెలుసుకుని పరిణతిగల ఒక నిర్ణయం తీసుకోవాలి. (1 కొరింథీయులు 15:45, 47) ఆ విధంగా, యేసు బల్యర్పణ మరణంతోసహా ఆయన యథార్థ జీవన విధానమంతా ‘ఒక్క పుణ్య కార్యముగా’ పనిచేసింది.—రోమీయులు 5:18, 19.