కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 17

‘ఆహా, దేవుని జ్ఞాన బాహుళ్యమెంత గంభీరము!’

‘ఆహా, దేవుని జ్ఞాన బాహుళ్యమెంత గంభీరము!’

1, 2.ఏడవ దినం కొరకు యెహోవా సంకల్పమేమిటి, ఈ దినారంభంలో దేవుని జ్ఞానమెలా పరీక్షించబడింది?

 సర్వనాశనం! ఆరవ సృష్టి దినానికే మకుటంగా నిలిచిన మానవజాతి ఎంతో ఉన్నత స్థితి నుండి ఒక్కసారిగా అగాధంలోకి పడిపోయింది. మానవులతోపాటు తాను “చేసినది యావత్తు . . . చాలమంచిదిగ” ఉందని యెహోవా ప్రకటించాడు. (ఆదికాండము 1:31) కానీ ఏడవ దినారంభంలో ఆదాము, హవ్వలు సాతానును అనుసరించి తిరుగుబాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఫలితంగా వారు పాపం, అపరిపూర్ణత, మరణంవంటి వాటిలో కూరుకుపోయారు.

2 ఏడవ దినం కోసం యెహోవా సంకల్పించింది పూర్తిగా తప్పుదారి పట్టినట్లు కనిపించి ఉండవచ్చు. దానికి ముందున్న ఆరు దినాల మాదిరిగానే ఆ దినం కూడా వేల సంవత్సరాల నిడివి కలిగి ఉండాలి. యెహోవా అది పరిశుద్ధమైనదని ప్రకటించాడు, అందువల్ల ఆ దినం చివరికి ఈ భూమి అంతా పరిపూర్ణ మానవ కుటుంబంతో నిండిన పరదైసుగా మారడాన్ని సూచిస్తుంది. (ఆదికాండము 1:28; 2:3) కానీ ఆ విపత్కర తిరుగుబాటు తర్వాత, ఆ సంకల్పమెలా నెరవేరగలదు? దేవుడేమి చేస్తాడు? ఇది యెహోవా జ్ఞానానికి ఓ విషమ పరీక్ష, బహుశా అతి గొప్ప పరీక్షే.

3, 4.(ఎ)ఏదెనులో జరిగిన తిరుగుబాటుకు యెహోవా ప్రతిస్పందించిన తీరు, ఆయన జ్ఞానానికి సంబంధించి భక్తిపూర్వక భయాన్ని రేకెత్తించే మాదిరిగా ఎందుకు ఉంది? (బి) యెహోవా జ్ఞానాన్ని మనం అధ్యయనం చేస్తుండగా ఏ సత్యాన్ని మదిలో ఉంచుకోవడానికి వినయం మనలను ప్రేరేపించాలి?

3 యెహోవా తక్షణమే ప్రతిస్పందించాడు. ఏదెనులోని ఆ తిరుగుబాటుదారులపై శిక్షావిధిని ప్రకటిస్తూనే, ఆయన ఓ అద్భుతమైన విషయాన్ని అంటే అప్పటికే వారు ప్రవేశపెట్టిన ఇక్కట్లను తొలగించే తన సంకల్పాన్ని ముందే చూఛాయగా చూసే అవకాశాన్నిచ్చాడు. (ఆదికాండము 3:15) దూరదృష్టిగల యెహోవా సంకల్పం ఏదెను మొదలుకొని మానవ చరిత్రలోని వేలాది సంవత్సరాలతోపాటు సుదూర భవిష్యత్తు వరకు కొనసాగుతుంది. అది ఎంతో సరళమైనదే అయినా ఎంత గంభీరమైనదంటే, బైబిలు చదివే ఒక వ్యక్తి దానిని అధ్యయనం చేయడంలో, ధ్యానించడంలో సంతృప్తికరమైన ఓ జీవితకాలాన్ని గడిపేయవచ్చు. అంతేకాదు, యెహోవా సంకల్పం ఖచ్చితంగా విజయవంతమై తీరుతుంది. సమస్త దుష్టత్వాన్ని, పాపమరణాలను అది అంతమొందిస్తుంది. అది నమ్మకమైన మానవాళికి పరిపూర్ణత చేకూరుస్తుంది. ఇదంతా ఆ ఏడవ దినం ముగియక ముందే జరుగుతుంది, అందువల్ల ఏమి జరిగినా సరే యెహోవా భూమిపట్ల, మానవాళిపట్ల తన సంకల్పాన్ని సరిగ్గా సమయానికి నెరవేర్చి తీరుతాడు.

4 అలాంటి జ్ఞానం మనలో భక్తిపూర్వక భయాన్ని రేకెత్తిస్తుంది, కాదంటారా? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాయడానికి కదిలించబడ్డాడు: ‘ఆహా, దేవుని జ్ఞాన బాహుళ్యము ఎంతో గంభీరము.’ (రోమీయులు 11:33) మనం దేవుని ఈ లక్షణపు వివిధ అంశాల అధ్యయనం చేపట్టినప్పుడు, ఒక ఆవశ్యకమైన సత్యాన్ని మదిలో ఉంచుకొనేలా వినయం మనలను ప్రేరేపించాలి, అదేమిటంటే, మనం ఎంత ప్రయాసపడినా యెహోవా అపరిమిత జ్ఞాన సంపత్తిలో కేవలం రవ్వంతే గ్రహించగలం. (యోబు 26:14) మొదట, మనం మనలో భక్తిపూర్వక భయాన్ని రేకెత్తించే ఈ లక్షణాన్ని నిర్వచించుకుందాం.

దేవుని జ్ఞానమంటే ఏమిటి?

5, 6.విషయ పరిజ్ఞానానికీ, జ్ఞానానికీ ఉన్న సంబంధమేమిటి, యెహోవా విషయ పరిజ్ఞానమెంత విస్తారమైనది?

5 జ్ఞానానికీ విషయ పరిజ్ఞానానికీ తేడా ఉంది. కంప్యూటర్లు అపారమైన విషయ పరిజ్ఞానాన్ని నిలువజేయగలవు, కానీ ఆ యంత్రాలు జ్ఞానవంతమైనవని ఎవరైనా అంటారని మనం ఊహించలేము. అయినప్పటికీ, విషయ పరిజ్ఞానానికీ జ్ఞానానికీ సంబంధముంది. (సామెతలు 9:9) ఉదాహరణకు, ప్రమాదకరమైన అనారోగ్యానికి సంబంధించిన చికిత్సకోసం మీకు జ్ఞానవంతమైన సలహా అవసరమైతే మీరు వైద్యం గురించి ఏదో కొద్దిగా తెలిసిన లేదా తత్సంబంధిత విషయ పరిజ్ఞానమే లేని వ్యక్తిని సంప్రదిస్తారా? ఎంతమాత్రం సంప్రదించరు! కాబట్టి నిజమైన జ్ఞానానికి ఖచ్చితమైన పరిజ్ఞానం ఆవశ్యకం.

6 యెహోవా దగ్గర అంతులేని విషయ పరిజ్ఞాన సంపద ఉంది. ‘యుగములకు రాజుగా’ ఆయన మాత్రమే చిరకాలం సజీవునిగా ఉన్నాడు. (ప్రకటన 15:3) ఆ అసంఖ్యాక యుగాల్లో సమస్తం ఆయనకు తెలుసు. బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.” (హెబ్రీయులు 4:13; సామెతలు 15:3) సృష్టికర్తగా యెహోవాకు తాను సృష్టించిన వాటి గురించి పూర్తి అవగాహన ఉంది, ఆయన ఆరంభం నుండి మానవ కార్యకలాపాలన్నింటిని గమనించాడు. ఆయన ప్రతీ మానవుని హృదయాన్ని పరిశీలిస్తాడు, దేన్నీ విడిచిపెట్టడు. (1 దినవృత్తాంతములు 28:9) మనలను స్వేచ్ఛా చిత్తంగల వారిగా సృష్టించాడు కాబట్టి, జీవితంలో మనం జ్ఞానవంతమైన ఎంపికలు చేసుకుంటున్నట్లు చూసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ‘ప్రార్థన ఆలకించువానిగా’ ఆయన అసంఖ్యాక భావవ్యక్తీకరణలను ఏకకాలంలో వింటాడు. (కీర్తన 65:2) యెహోవాకు పరిపూర్ణ జ్ఞాపకశక్తి ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

7, 8.యెహోవా అవగాహనను, వివేచనను, జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తాడు?

7 యెహోవాకు విషయ పరిజ్ఞానం కంటే ఎక్కువే ఉంది. వాస్తవాలు ఒకదానితో ఒకటి ఎలా పరస్పర సంబంధం కలిగివున్నాయో కూడా ఆయన చూస్తాడు, వేవేల వివరాలతో సృష్టించబడిన సంపూర్ణ చిత్రాన్ని కూడా ఆయన గ్రహిస్తాడు. ఆయన మంచి చెడుకు, ప్రాముఖ్య అప్రాముఖ్య విషయాలకు మధ్య తేడాను గుర్తిస్తూ విలువ కట్టి తీర్పు తీరుస్తాడు. అంతేకాకుండా, ఆయన బాహ్యరూపం కంటే ఎక్కువగా హృదయంలో ఏముందో నిశితంగా పరిశీలిస్తాడు. (1 సమూయేలు 16:7) కాబట్టి, ఆయనకు విషయ పరిజ్ఞానాన్ని మించిన ఉన్నత లక్షణాలైన గ్రహింపు, వివేచనా ఉన్నాయి. అయితే జ్ఞానం మరింత ఉన్నత స్థాయికి చెందినది.

8 విషయ పరిజ్ఞానాన్ని, వివేచనను, అవగాహనను ఒకచోట చేర్చి జ్ఞానం వాటిని ఆచరణలో పెడుతుంది. వాస్తవానికి, “జ్ఞానము” అని అనువదించబడిన ఆదిమ బైబిలు పదాల్లో కొన్నింటికి అక్షరార్థంగా “ఫలితార్థక పని” లేదా “ఆచరణాత్మక జ్ఞానం” అని అర్థం. కాబట్టి యెహోవా జ్ఞానం కేవలం సిద్ధాంతపరమైనది కాదు. అది ఆచరణాత్మకమైనది, అది పనిచేస్తుంది. యెహోవా తన అపార విషయ పరిజ్ఞానాన్ని, లోతైన అవగాహనను ప్రయోగించి అన్ని సమయాల్లో సాధ్యమైనంత శ్రేష్ఠమైన నిర్ణయాలు తీసుకుని, వాటిని ఊహించదగినంత ఉత్తమ మార్గంలో నెరవేరుస్తాడు. అదే నిజమైన జ్ఞానం! “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందును” అని యేసు చెప్పిన మాటల సత్యాన్ని యెహోవా ప్రదర్శిస్తాడు. (మత్తయి 11:19) విశ్వమందంతటాగల యెహోవా కార్యాలు ఆయన జ్ఞానానికి శక్తిమంతమైన రుజువునిస్తున్నాయి.

దేవుని జ్ఞానానికి రుజువులు

9, 10.(ఎ)యెహోవా ఎలాంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు, ఆయన దానినెలా కనబరిచాడు? (బి) జీవకణం యెహోవా జ్ఞానం గురించి ఎలా సాక్ష్యమిస్తోంది?

9 చక్కగా పనిచేసే సుందరమైన వస్తువులు తయారుచేసే పనివాని నేర్పుచూసి మీరెప్పుడైనా ఆశ్చర్యపోయారా? అది గమనార్హమైన జ్ఞానం. (నిర్గమకాండము 31:1-3) అలాంటి జ్ఞానానికి యెహోవాయే మూలాధారం, అతిగొప్ప స్థాయిలో అది ఆయన వశంలో ఉంది. యెహోవా గురించి దావీదు రాజు ఇలా అన్నాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.” (కీర్తన 139:14) అవును, మనం మానవ శరీరం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, యెహోవా జ్ఞానాన్ని బట్టి భక్తిపూర్వక భయం అంత ఎక్కువగా మనలో కలుగుతుంది.

10 ఉదాహరణకు, ఒకే జీవకణంతో అంటే మీ తండ్రి శుక్లం ద్వారా ఫలదీకరణం చెందిన మీ తల్లి అండాణువుతో మీ జీవితం ఆరంభమయ్యింది. వెంటనే ఆ జీవకణం విభజన చెందడం ఆరంభించింది. దాని ఫలితంగా మీరు దాదాపు 100 ట్రిలియన్‌ జీవకణాలతో ఒక వ్యక్తిగా తయారయ్యారు. ఆ జీవకణాలు చాలాచిన్నవిగా ఉంటాయి. సగటు పరిమాణంగల దాదాపు 10,000 జీవకణాలు ఒక సూది మొన మీద ఇమిడిపోగలవు. అయినప్పటికీ, ఒక్కో జీవకణం మేధకు అంతుబట్టనంత సంశ్లిష్టంగా ఉంటుంది. అది, మానవ నిర్మిత ఏ యంత్రం లేదా కర్మాగారం కంటే ఎంతో చిక్కైనది. ఒక జీవకణం రాకపోకల నియంత్రణ, రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ, విద్యుత్‌ ఉత్పాదక కేంద్రాలు, కర్మాగారాలు, వ్యర్థపదార్థాల తొలగింపు, పునరుత్పాదక వసతులు, స్వీయరక్షక వ్యవస్థ, చివరికి దాని న్యూక్లియస్‌లో ఓ విధమైన కేంద్ర ప్రభుత్వం వంటి వాటితో ప్రాకారంగల నగరంలా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతారు. అంతేకాదు, కేవలం కొద్దిగంటల్లోనే ఆ జీవకణం దానికి సంపూర్ణ నకలులా ఉండే మరో జీవకణాన్ని దానంతటదే తయారుచేయగలదు.

11, 12.(ఎ)పెరుగుతున్న పిండ జీవకణాలు విభిన్నరీతుల్లో తయారుకావడానికి ఏది కారణమవుతోంది, ఇది కీర్తన 139:16కు ఎలా అనుగుణంగా ఉంది? (బి) మనం ‘అద్భుతరీతిలో చేయబడ్డామని’ మానవ మెదడు ఎలా చూపిస్తోంది?

11 అలాగని జీవకణాలన్నీ ఒకే విధంగా ఉండవు. పిండ జీవకణాల విభజన జరుగుతున్నప్పుడే అవి ఎంతో విభిన్నమైన పనులు చేయడం మొదలుపెడతాయి. కొన్ని నాడీ కణాలుగా, మరికొన్ని అస్థికల, కండరాల, రక్తపు లేదా నేత్ర కణాలుగా తయారవుతాయి. ఆ వైవిధ్యాలన్నీ ఆ జీవకణ జన్యు నమూనాల “గ్రంథాలయంలో” అంటే దాని డిఎన్‌ఎలో ప్రోగ్రాం చేయబడతాయి. ఆసక్తికరమైన సంగతేమిటంటే, దావీదు యెహోవాతో ఇలా అనడానికి ప్రేరేపించబడ్డాడు: “నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను . . . నా దినములన్నియు [“భాగములన్నియు,” NW] నీ గ్రంథములో లిఖితము లాయెను.”—కీర్తన 139:16.

12 శరీర భాగాలు కొన్ని అంతుబట్టని సంశ్లిష్టతతో ఉంటాయి. ఉదాహరణకు, మానవ మెదడును పరిశీలించండి. కొందరు దీనిని విశ్వంలో ఇంతవరకు కనిపెట్టబడనంత అతి చిక్కైన వస్తువని పిలుస్తారు. దీనిలో దాదాపు నూరు శతకోట్ల నాడీ కణాలుంటాయి, ఇది దాదాపు మన నక్షత్రవీధిలో ఉన్న నక్షత్రాల సంఖ్యకు సమానం. ఆ కణాల్లో ప్రతీ దానికి ఇతర కణాలతో వేలసంఖ్యలో కనెక్షన్‌లుంటాయి. ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాల్లో ఉన్న సమాచారాన్నంతటిని మానవ మెదడులో పెట్టవచ్చనీ, నిజం చెప్పాలంటే దాని నిల్వ సామర్థ్యం గ్రహించనశక్యమైనదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ‘అద్భుతరీతిలో చేయబడిన’ ఈ అవయవాన్ని దశాబ్దాలపాటు అధ్యయనం చేసి కూడా, అది పనిచేసే విధానాన్ని పూర్తిగా ఎన్నటికీ అర్థంచేసుకోలేమని శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు.

13, 14.(ఎ)చీమలు, ఇతర ప్రాణులు “మిక్కిలి జ్ఞానముగలవి” అని అవి ఎలా చూపిస్తున్నాయి, అవి తమ సృష్టికర్త గురించి మనకు ఏమి బోధిస్తున్నాయి? (బి) సాలెగూడు వంటి సృష్టికార్యాలు ‘జ్ఞానముచేత’ చేయబడ్డాయని మనమెందుకు చెప్పవచ్చు?

13 అయితే యెహోవా సృజనాత్మక జ్ఞానానికి మానవులు కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. కీర్తన 104:24 ఇలా చెబుతోంది: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.” (కీర్తన 104:24) మనచుట్టూ ఉన్న ప్రతీ సృష్టికార్యంలో యెహోవా జ్ఞానం స్పష్టమవుతుంది. ఉదాహరణకు, చీమ ‘మిక్కిలి జ్ఞానముగలది.’ (సామెతలు 30:24) నిజానికి చీమల కాలనీలు ఉత్తమస్థాయిలో వ్యవస్థీకరించబడి ఉంటాయి. కొన్ని చీమల కాలనీలు ఏఫిడ్స్‌ అనే కీటకాలను తమ సాధు క్రిములుగా పెంచుకుంటాయి, వాటికి రక్షణ ఏర్పాటు చేస్తాయి, వాటి నుండి పోషణ పొందుతాయి. మరికొన్ని చీమలు ఫంగస్‌ “పంటలను” పండిస్తూ, సేద్యం చేస్తూ వ్యవసాయదారులుగా వ్యవహరిస్తాయి. అనేక ఇతర ప్రాణులు సహజ జ్ఞానంతో అసాధారణ పనులు చేసేలా రూపొందించబడ్డాయి. మానవుని అత్యాధునిక విమానం గాలిలో నకలు చేయలేని అద్భుత విన్యాసాలను ఒక సాధారణ ఈగ చేస్తుంది. వలస పక్షులు నక్షత్రాల ఆధారంగా, భూమియొక్క అయస్కాంత క్షేత్ర విధానాన్నిబట్టి లేదా మరొక రకమైన అంతర్నిహిత రేఖాపటంతో తమ దిశ మార్చుకుంటాయి. ఈ ప్రాణుల్లో నిక్షిప్తమై ఉన్న అత్యాధునిక క్రియా విధానం గురించి అధ్యయనం చేస్తూ జీవశాస్త్రజ్ఞులు సంవత్సరాలు గడుపుతున్నారు. అలాంటప్పుడు ఆ కార్య ప్రణాళిక గీసిన దేవుడెంత జ్ఞానవంతుడై ఉండాలో కదా!

14 యెహోవా సృష్టి జ్ఞానాన్నుండి శాస్త్రజ్ఞులెంతో నేర్చుకున్నారు. ప్రకృతిలో కనిపించే రూపకల్పనలను నకలుచేయడానికి ప్రయత్నించే, బయోమిమెటిక్స్‌ అనే ఇంజనీరింగ్‌ రంగం కూడా ఉంది. ఉదాహరణకు, ఒక సాలెగూడు అందాన్ని చూసినప్పుడు మీరెంతో ఆశ్చర్యపోయి ఉంటారు. అయితే ఒక ఇంజనీరు దానినొక పరికల్పనా అద్భుతంగా పరిగణిస్తాడు. బలహీనంగా కనబడే సాలెగూడు దారాలు కొన్ని ఉక్కుకన్నా బలంగా, బులెట్‌ ప్రూఫ్‌ కోటు పోగులకన్నా దృఢంగా ఉంటాయి. అంటే అవెంత దృఢంగా ఉంటాయి? చేపలు పట్టే నావలో ఉపయోగించే పెద్దవల సైజుకు విస్తరింపజేయబడిన సాలెగూడును ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి సాలెగూడు ఆకాశంలో వెళ్లే విమానాన్ని సైతం నిలిపివేసేంత బలంగా ఉంటుంది! అవును, అలాంటివన్నీ యెహోవా తన ‘జ్ఞానముచేత’ చేశాడు.

భూసంబంధ ప్రాణుల్లో “మిక్కిలి జ్ఞానము” ఉండేలా వాటిని ఎవరు రూపించారు?

భూపరిధికి మించి కనిపించే జ్ఞానం

15, 16.(ఎ)నక్షత్ర ఖచిత ఆకాశాలు యెహోవా జ్ఞానానికి ఎలాంటి రుజువునిస్తున్నాయి? (బి) విస్తార సంఖ్యలోవున్న దేవదూతలపై సర్వ సైన్యాధ్యక్షునిగా యెహోవా స్థానం కార్యనిర్వాహకునిగా ఆయన జ్ఞానాన్ని ఎలా రుజువుచేస్తోంది?

15 యెహోవా జ్ఞానం ఆయన విశ్వవ్యాప్త క్రియల్లో వ్యక్తమవుతోంది. కొంతమేరకు 5వ అధ్యాయంలో పరిశీలించబడిన నక్షత్ర ఖచిత ఆకాశాలు అంతరిక్షమంతటా యాదృచ్ఛికంగా వెదజల్లినట్లుగా లేవు. యెహోవా “ఆకాశమండలపు కట్టడల” జ్ఞానం మూలంగా, ఆకాశాలు సమగ్ర నక్షత్రవీధుల్లా, ఆ నక్షత్రవీధులు గుత్తులుగా, ఆ గుత్తులు మహాగుచ్ఛాలుగా మనోహరంగా వ్యవస్థీకరించబడ్డాయి. (యోబు 38:33) అలాంటి ఆకాశ నక్షత్ర సముదాయాలను “సమూహములు” అని యెహోవా ఉదహరించడంలో ఆశ్చర్యం లేదు. (యెషయా 40:26) అయితే యెహోవా జ్ఞానాన్ని మరింత ప్రకాశమానంగా ప్రదర్శించే మరో సైన్యం కూడా ఉంది.

16 మనం 4వ అధ్యాయంలో గమనించినట్లుగా, కోటానుకోట్ల ఆత్మ సంబంధ ప్రాణుల విస్తార సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షునిగా తనకున్న స్థానాన్నిబట్టి దేవుడు “సైన్యముల కధిపతియగు యెహోవా” అనే బిరుదు ధరిస్తున్నాడు. ఇది యెహోవా శక్తికి రుజువు. కానీ దీనిలో ఆయన జ్ఞానమెలా ఇమిడివుంది? దీనిని ఆలోచించండి, యెహోవా, యేసుక్రీస్తు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. (యోహాను 5:17) కాబట్టి సర్వోన్నతుని పరిచారక దేవదూతలు కూడా అదేవిధంగా అన్ని సమయాల్లో పనిచేస్తూ ఉంటారని చెప్పడం సహేతుకం. వారు మానవులకంటే ఉన్నతులు, అధిక బుద్ధిసూక్ష్మతగలవారు, అధిక బలంగలవారు అని గుర్తుంచుకోండి. (హెబ్రీయులు 1:7; 2:7) అయినాసరే, యెహోవా ఆ దేవదూతలందరూ శతకోట్ల సంవత్సరాలుగా ‘ఆయన వాక్యం నెరవేరుస్తూ,‘ ‘ఆయన చిత్తము చేస్తూ’ సంతృప్తికరమైన పనిలో సంతోషంగా పాల్గొనేలా చూశాడు. (కీర్తన 103:20, 21) ఈ కార్యనిర్వాహకుని జ్ఞానం ఎంతగా భక్తిపూర్వక భయం కలిగిస్తున్నదో గదా!

యెహోవాయే “అద్వితీయ జ్ఞానవంతుడు”

17, 18.యెహోవాయే “అద్వితీయ జ్ఞానవంతుడు” అని బైబిలు ఎందుకు చెబుతోంది, ఆయన జ్ఞానం మనలో ఎందుకు భక్తిపూర్వక భయం పుట్టించాలి?

17 అలాంటి రుజువు దృష్ట్యా, యెహోవా జ్ఞానం సర్వోన్నతం అని బైబిలు చూపించడంలో ఆశ్చర్యమేమైనా ఉందా? ఉదాహరణకు, అది యెహోవాయే “అద్వితీయ జ్ఞానవంతుడు” అని చెబుతోంది. (రోమీయులు 16:25) యెహోవాకు మాత్రమే సంపూర్ణ భావంలో జ్ఞానముంది. నిజమైన సమస్త జ్ఞానానికి ఆయనే మూలాధారుడు. (సామెతలు 2:6) అందుకే యెహోవా సృష్టి ప్రాణులందరిలో యేసు అత్యంత జ్ఞానవంతుడే అయినప్పటికీ, ఆయన తన సొంత జ్ఞానంపై ఆధారపడక తన తండ్రి నిర్దేశించినట్లే మాట్లాడాడు.—యోహాను 12:48-50.

18 యెహోవా జ్ఞాన ఉత్కృష్టతను అపొస్తలుడైన పౌలు ఎలా వ్యక్తం చేశాడో గమనించండి: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు.” (రోమీయులు 11:33) “ఆహా” అనే ఆశ్చర్యార్థకంతో ఆ వచనాన్ని ఆరంభించడం ద్వారా పౌలు లోతైన భావావేశాన్ని ప్రదర్శించాడు, ఈ సందర్భంలో ఆయన ప్రగాఢమైన భక్తిపూర్వక భయాన్ని ప్రదర్శించాడు. “బాహుళ్యము” అని అనువదించబడిన పదం కోసం ఆయన ఎంచుకున్న గ్రీకు పదానికి “అగాధము” అని అనువదించబడే పదానికి దగ్గర సంబంధముంది. కాబట్టి, ఆయన మాటలు ప్రకాశమానమైన మానసిక చిత్రం మెదిలేలా చేస్తాయి. యెహోవా జ్ఞానాన్ని మనం తలపోసినప్పుడు అది ఎంతోలోతైన, అంతుచిక్కని పరిధిగల, అడుగు కనిపించని, మహాగాధాన్ని మనం చూస్తున్నట్టే, దాని అపారతను గ్రహించడం ఎన్నటికీ మనవల్ల కాదు ఇక దాని జాడతీయడాన్ని లేదా దాని సవివర చిత్రాన్ని గీయడాన్ని గురించి మనం ఇంకెక్కడ ఆలోచిస్తాం. (కీర్తన 92:5) అది వినయ స్వభావం కలిగించే తలంపు కాదా?

19, 20.(ఎ)దైవిక జ్ఞానానికి పక్షిరాజు ఎందుకు సముచితమైన చిహ్నం? (బి) భవిష్యత్తు చూడగల తన సామర్థ్యాన్ని యెహోవా ఎలా ప్రదర్శించాడు?

19 మరో భావంలో కూడా యెహోవా “అద్వితీయ జ్ఞానవంతుడు,” అదెలాగంటే ఆయన మాత్రమే భవిష్యత్తు చూడగలడు. దైవిక జ్ఞానానికి సూచనగా యెహోవా దూరదృష్టిగల పక్షిరాజును ఉపయోగిస్తున్నాడని గుర్తుంచుకోండి. గోల్డెన్‌ ఈగల్‌ అనే పక్షిరాజు బరువు కేవలం 5 కేజీలే ఉంటుంది, అయితే దాని కళ్లు పూర్తిగా ఎదిగిన మనిషి కళ్లకంటే పెద్దవిగా ఉంటాయి. ఈ గద్ద కనుచూపు ఆశ్చర్యపరిచే రీతిలో ఎంత తీక్షణంగా ఉంటుందంటే అది వందల మీటర్లకంటే బహుశా ఎన్నో కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం నుండి కూడా చిన్న ఎరను కనిపెడుతుంది. ఒకసారి యెహోవాయే స్వయంగా పక్షిరాజు గురించి ఇలా చెప్పాడు: “దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.” (యోబు 39:29) ఆ భావంలోనే యెహోవా కాలాన్ని అంటే భవిష్యత్తును ‘దూరమునుండి కనిపెట్టగలడు.’

20 ఇది సత్యమనే రుజువు బైబిలంతటా కనబడుతుంది. దానిలో వందలాది ప్రవచనాలు లేదా ముందే వ్రాయబడిన చరిత్ర ఉంది. యుద్ధ ఫలితాలు, ప్రపంచ ఆధిపత్యాల ఉత్థానపతనాలు, సైనికాధికారుల నిర్దిష్టమైన యుద్ధతంత్రాలు, అన్నీ బైబిల్లో ప్రవచించబడ్డాయి, అదీ కొన్ని సందర్భాల్లో వందలాది సంవత్సరాల ముందే ప్రవచించబడ్డాయి.—యెషయా 44:25-45:4; దానియేలు 8:2-8, 20-22.

21, 22.(ఎ)జీవితంలో మీరు చేసుకునే ఎంపికలన్నింటిని యెహోవా ముందే చూశాడని తేల్చిచెప్పడానికి ఎందుకు ఎలాంటి ఆధారమూ లేదు? సోదాహరణంగా చెప్పండి. (బి) యెహోవా జ్ఞానం ఉద్రేకరహితమైనది లేక భావరహితమైనది కాదని మనమెలా చెప్పవచ్చు?

21 అంటే జీవితంలో మీరు చేసుకునే ఎంపికలను దేవుడు ముందే చూసేశాడని దీనర్థమా? విధిరాత సిద్ధాంతం ప్రచారంచేసే కొందరు దీనికి జవాబు అవుననే మొండిగా వాదిస్తారు. అయితే అలాంటి ఆలోచన వాస్తవానికి యెహోవా జ్ఞానాన్ని బలహీనపరుస్తుంది. ఎందుకంటే అది భవిష్యత్తు చూడగల తన సామర్థ్యాన్ని ఆయన నియంత్రించుకోలేడనే భావమిస్తుంది. ఉదాహరణకు, మీకు శ్రావ్యంగా ఆలపించగల స్వరముంటే, ఇక మీరు ఎప్పుడూ ఆలపిస్తూనే ఉండాలా? అలాంటి ఆలోచనే హాస్యాస్పదంగా ఉంటుంది! అదేవిధంగా, భవిష్యత్తును ముందే తెలుసుకునే సామర్థ్యం యెహోవాకు ఉంది, అయితే ఆయన దానిని అన్ని సమయాల్లో ఉపయోగించడు. అలాచేయడం మన సొంత స్వేచ్ఛాచిత్తాన్నే ఉల్లంఘించవచ్చు, ఈ ప్రశస్త వరాన్ని యెహోవా ఎన్నడూ మన నుండి తీసివేయడు.—ద్వితీయోపదేశకాండము 30:19, 20.

22 అంతకంటే ఘోరంగా విధిరాత అనే ఆలోచన, యెహోవా జ్ఞానం భావరహితమైనదని, ప్రేమ, సహానుభూతి, కనికరం లేనిదని సూచిస్తుంది. అయితే ఇది ఎంతమాత్రం సత్యం కాదు. ఎందుకంటే యెహోవా ‘జ్ఞాన హృదయుడు’ అని బైబిలు బోధిస్తోంది. (యోబు 9:4, NW) అంటే ఆయనకు అక్షరార్థ హృదయముందని కాదుగాని, బైబిలు తరచూ ఆ పదాన్ని ప్రేమ వంటి ప్రేరణలు, భావాలు భాగమైయున్న అంతరంగానికి సంబంధించి ఉపయోగిస్తుంది. కాబట్టి యెహోవా జ్ఞానం ఆయన ఇతర లక్షణాల మాదిరిగానే ప్రేమచే నడిపించబడుతుంది.​—1 యోహాను 4:8.

23.యెహోవా జ్ఞాన ఉన్నతి, మనమేమి చేయడానికి మనలను పురికొల్పాలి?

23 సహజంగానే యెహోవా జ్ఞానం సంపూర్ణంగా నమ్మదగినది. మన జ్ఞానంకంటే అది ఎంత ఉన్నతమైనదంటే దేవుని వాక్యం ప్రేమతో మనకిలా ఉద్బోధిస్తోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:5, 6) సర్వజ్ఞానియైన మన దేవునికి సన్నిహితమయ్యేలా యెహోవా జ్ఞానాన్ని ఇప్పుడు మనం పరికించి చూద్దాం.