కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 18

‘దేవుని వాక్యంలోని’ జ్ఞానము

‘దేవుని వాక్యంలోని’ జ్ఞానము

1, 2.యెహోవా మనకెలాంటి “ఉత్తరం” వ్రాశాడు, ఎందుకు వ్రాశాడు?

 ఎక్కడో దూరాన నివసించే మీ ప్రియమైన వ్యక్తి దగ్గరనుండి చివరిసారిగా ఉత్తరం ఎప్పుడు అందుకున్నారో మీకు గుర్తుందా? మనకెంతో ప్రియమైన వ్యక్తి నిండుమనస్సుతో వ్రాసిన ఉత్తరం కలిగించేంతటి సంతోషాన్ని చాలా కొన్ని విషయాలే కలిగిస్తాయి. అతని క్షేమసమాచారం, అనుభవాలు, పథకాలు తెలుసుకొని మనం ఆనందిస్తాం. అలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు, ప్రియమైన వారు భౌతికంగా దూరంగా ఉన్నాసరే వారిని సన్నిహితం చేస్తాయి.

2 అలాంటప్పుడు మనం ప్రేమించే దేవుని నుండి లిఖిత సందేశం కంటే మనకు ఎక్కువ సంతోషాన్ని ఏది తీసుకురాగలదు? ఒక విధంగా, యెహోవా మనకు తన వాక్యమైన బైబిలు అనే “ఉత్తరం” వ్రాశాడు. అందులో ఆయన మనకు తానెవరు, ఏమి చేశాడు, ఏమి చేయడానికి ఉద్దేశించాడు అనేవే గాక ఇంకా చాలా విషయాలు చెబుతున్నాడు. మనం తనకు సన్నిహితంగా ఉండాలని కోరుతున్నాడు కాబట్టే యెహోవా మనకు తన వాక్యాన్నిచ్చాడు. సర్వ జ్ఞానియైన మన దేవుడు మనతో సంభాషించడానికి సర్వోత్తమ మార్గాన్ని ఎంచుకున్నాడు. బైబిలు వ్రాయబడిన విధానంలో, అందులోని విషయాల్లో సాటిలేని జ్ఞానముంది.

లిఖిత వాక్యమే ఎందుకు?

3.ధర్మశాస్త్రాన్ని యెహోవా మోషేకు ఏ విధంగా అందించాడు?

3 ‘మానవులతో సంభాషించడానికి మరింత నాటకీయ పద్ధతిని అంటే పరలోకం నుండి స్వరం వినిపించడాన్ని యెహోవా ఎందుకు ఉపయోగించలేదు?’ అని కొందరు ఆలోచించవచ్చు. నిజానికి, యెహోవా కొన్ని సందర్భాల్లో దేవదూత ప్రతినిధుల ద్వారా పరలోకం నుండి మాట్లాడాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయన అలాగే మాట్లాడాడు. (గలతీయులు 3:19) పరలోకం నుండి వచ్చిన ఆ స్వరమెంత భీకరంగా ఉందంటే ఇశ్రాయేలీయులు ఠారెత్తి తమతో ఈ రీతిగా మాట్లాడవద్దనీ మోషే ద్వారా సమాచారం అందించమనీ యెహోవాను వేడుకున్నారు. (నిర్గమకాండము 20:18-20) అందువల్ల, దాదాపు 600 నియమాలున్న ధర్మశాస్త్రంలోని ప్రతీమాట మోషేకు మౌఖికంగా అందజేయబడింది.

4.దేవుని నియమాలను అందజేయడానికి నోటిమాటల విధానం ఎందుకు నమ్మదగినదిగా ఉండదో వివరించండి.

4 అయితే ఆ ధర్మశాస్త్రాన్ని ఎన్నటికీ లిఖిత రూపంలో పెట్టకపోయివుంటే పరిస్థితి ఎలా ఉండేది? ఆ వివరణాత్మక నియమావళి మాటల్ని మోషే స్పష్టంగా గుర్తుంచుకొని, మిగతా జనాంగానికి వాటిని ఆయన తప్పుల్లేకుండా అందజేయడం సాధ్యమయ్యేదా? ఆ తర్వాతి తరాలవారి మాటేమిటి? వారు కేవలం నోటి మాటమీదే ఆధారపడవలసి వచ్చేదా? అలాగయితే అది దేవుని నియమాలను అందించగల ఒక నమ్మదగిన విధానంగా ఉండేది కాదు. ఒక పెద్ద వరుసలో ఉన్న మొదటి వ్యక్తికి మీరొక కథచెప్పి ఆ తర్వాత ఒకరినుండి మరొకరికి దానిని వివరించే ఏర్పాటుచేస్తే ఏమి జరుగుతుందో ఊహించండి. వరుసలోని చివరి వ్యక్తి విన్నదానికి అసలు కథకు బహుశా చాలా తేడా ఉండవచ్చు. దేవుని ధర్మశాస్త్ర వాక్కులు అలాంటి ప్రమాదంలో పడలేదు.

5, 6.యెహోవా తన మాటల విషయంలో ఏమిచేయాలని మోషేను ఆదేశించాడు, యెహోవా వాక్యం లిఖితరూపంలో ఉండడం మనకెందుకు ఆశీర్వాదకరం?

5 జ్ఞానయుక్తంగా యెహోవా తన వాక్కులను లిఖిత రూపంలో పెట్టడాన్ని ఎన్నుకున్నాడు. ఆయన మోషేను ఇలా ఆదేశించాడు: “ఈ వాక్యములను వ్రాసికొనుము; ఏలయనగా ఈ వాక్యములనుబట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసియున్నాను.” (నిర్గమకాండము 34:27) ఆ విధంగా సా.శ.పూ. 1513లో బైబిలు వ్రాసే కాలం ఆరంభమైంది. ఆ తర్వాతి 1,610 సంవత్సరాల్లో బైబిలు వ్రాసిన దాదాపు 40 మంది మానవ రచయితలతో యెహోవా ‘నానాసమయములలో నానా విధములుగా మాట్లాడాడు.’ (హెబ్రీయులు 1:1) ఈ మధ్యకాలంలో లేఖనాలను భద్రపరిచేందుకు ఖచ్చితమైన నకలు ప్రతులు తయారుచేసేందుకు అంకితభావంగల శాస్త్రులు అత్యంత శ్రద్ధ వహించారు.—ఎజ్రా 7:6; కీర్తన 45:1.

6 లిఖిత రూపంలో మనతో సంభాషించడం ద్వారా యెహోవా మనల్ని నిజంగా ఆశీర్వదించాడు. మీకు అతి ప్రియమైన ఉత్తరాన్ని అంటే బహుశా మీకు అవసరమైన ఓదార్పు ఇచ్చిన ఉత్తరాన్ని, దాచిపెట్టుకొని మళ్లీ మళ్లీ చదవాలనిపించే ఉత్తరాన్ని మీరెప్పుడైనా అందుకున్నారా? యెహోవా మనకు వ్రాసిన “ఉత్తరం” కూడా అలాంటిదే. యెహోవా తన మాటలను లిఖిత రూపంలో పెట్టాడు కాబట్టే మనం వాటిని క్రమంగా చదివి, అవి చెప్పేవాటిని ధ్యానించగలుగుతున్నాం. (కీర్తన 1:2) అవసరమైనప్పుడల్లా మనం “లేఖనములవలని ఆదరణ” పొందవచ్చు.—రోమీయులు 15:4.

మానవ రచయితలే ఎందుకు?

7.మానవ రచయితలను ఉపయోగించడంలో యెహోవా జ్ఞానమెలా స్పష్టమవుతోంది?

7 యెహోవా తన జ్ఞానాన్నిబట్టి, తన వాక్యాన్ని గ్రంథస్తం చేసేందుకు మానవులను ఉపయోగించాడు. దీనిని ఆలోచించండి: ఒకవేళ బైబిలు వ్రాయడానికి యెహోవా దేవదూతలను వాడుకొనివుంటే, అది ఇప్పుడున్నంత ఆకర్షణీయంగా ఉండేదా? నిజమే, దేవదూతలు తమ ఉన్నతమైన దృష్టికోణం నుండి యెహోవాను వర్ణించి, ఆయనపట్ల తమ భక్తిని వ్యక్తపరచి, దేవుని నమ్మకస్థులైన మానవ సేవకుల గురించి నివేదించి ఉండేవారు. కానీ మనకంటే ఎంతో ఉన్నతమైన జ్ఞానం, అనుభవం, బలం గల పరిపూర్ణ ఆత్మసంబంధ ప్రాణుల దృష్టికోణాన్ని మనం నిజంగా అర్థంచేసుకొని ఉండేవాళ్లమా?—హెబ్రీయులు 2:6,7.

‘ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది’

8.బైబిలు రచయితలు ఏ విధంగా తమ సొంత మానసిక సామర్థ్యాలు ఉపయోగించడానికి అనుమతించబడ్డారు? (అధస్సూచి కూడా చూడండి.)

8 యెహోవా మానవ రచయితలను ఉపయోగించడం ద్వారా ఖచ్చితంగా మనకు అవసరమైనదాన్నే, అంటే ‘దైవావేశమువలన కలిగినదే’ అయినా మానవాంశగల గ్రంథాన్ని మనకు దయచేశాడు. (2 తిమోతి 3:16) ఆయన దీనినెలా సాధించాడు? చాలా సందర్భాల్లో, ఆ రచయితలు ‘ఇంపైన మాటలను, సత్యమునుగూర్చిన యథార్థభావముగల మాటలను’ ఎంపిక చేసుకోవడానికి తమ సొంత మానసిక సామర్థ్యాలను ఉపయోగించేందుకు ఆయన అనుమతించాడని స్పష్టమవుతోంది. (ప్రసంగి 12:10, 11) బైబిలులో అంత వైవిధ్యభరితమైన శైలి ఎందుకుందో ఇది వివరిస్తోంది, ఆయా రచయితల నేపథ్యం, వ్యక్తిత్వం వారి రచనల్లో ప్రతిబింబిస్తుంది. * అయినప్పటికీ ఆ మనుష్యులు “పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” (2 పేతురు 1:21) అందువల్ల, చివరికది నిజంగా ‘దేవుని వాక్యమయింది.’—1 థెస్సలొనీకయులు 2:13.

9, 10.మానవ రచయితలను ఉపయోగించడం బైబిలుయొక్క వాత్సల్యతను, ఆకర్షణీయతను ఎందుకు ఇనుమడింపజేస్తోంది?

9 బైబిలు రచనకు మానవ లేఖికులను ఉపయోగించడం దానిలో అత్యద్భుత వాత్సల్యం, ఆకర్షణ ఉండేలా చేసింది. దాని రచయితలు మనలాంటి భావాలున్న మానవులే. అపరిపూర్ణులైన వారు కూడా మనలాగే కష్టాలు, ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తమ సొంత భావాలు, సంఘర్షణల గురించి వ్రాసేలా యెహోవా ఆత్మ వారిని ప్రేరేపించింది. (2 కొరింథీయులు 12:7-10) అందువల్ల వారు ఏ దేవదూతా వ్యక్తపరచలేని మాటలను తమసొంత పరిభాషలో వ్రాశారు.

10 ఉదాహరణకు, ఇశ్రాయేలు రాజైన దావీదునే తీసుకోండి. దావీదు కొన్ని గంభీరమైన పాపాలు చేసిన తర్వాత ఒక కీర్తన కూర్చాడు, దానిలో ఆయన దేవుని క్షమాపణ యాచిస్తూ తన హృదయాన్ని కుమ్మరించాడు. ఆయనిలా వ్రాశాడు: “నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది. నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు; దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్తన 51:2, 3, 5, 11, 17) రచయిత మనోవేదన మీకు తెలియడం లేదా? అలాంటి మనోభావాలను అపరిపూర్ణ మానవుడు కాక మరింకెవరు వ్యక్తం చేయగలరు?

ప్రజల గురించి చెప్పే పుస్తకమే ఎందుకు?

11.“మనకు బోధ కలుగు నిమిత్తము” ఎలాంటి నిజ జీవిత ఉదాహరణలు బైబిల్లో చేర్చబడ్డాయి?

11 బైబిలును ఆకర్షణీయం చేయడానికి దోహదపడే మరో సంగతి కూడా ఉంది. ఇది చాలామేరకు నిజమైన ప్రజలను గురించి అంటే దేవుని సేవించే, సేవించని ప్రజల గురించి చెప్పే పుస్తకం. మనం వారి అనుభవాలు, కష్టాలు, ఆనందాల గురించి చదువుతాం. జీవితంలో వారు చేసుకున్న ఎంపికల ఫలితమెలా ఉందో మనం చూస్తాం. అలాంటి వృత్తాంతాలు “మనకు బోధ కలుగు నిమిత్తము” అందులో చేర్చబడ్డాయి. (రోమీయులు 15:4) ఈ నిజ జీవిత ఉదాహరణల ద్వారా మన హృదయాలను సృశించే విధంగా యెహోవా మనకు బోధిస్తున్నాడు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

12.నమ్మకద్రోహులైన మానవుల గురించిన బైబిలు వృత్తాంతాలు మనకెలా సహాయం చేస్తాయి?

12 అవిశ్వాసులైన, చివరికి దుష్టులైన మానవుల గురించి, అలాగే వారికి జరిగినదాని గురించి బైబిలు మనకు తెలియజేస్తోంది. ఈ వృత్తాంతాల్లో, మనం సులభంగా గ్రహించేలా చేస్తూ, వారి కోరదగని లక్షణాలు కార్యరూపంలో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు, నమ్మకద్రోహానికి పాల్పడకూడదని ఇవ్వబడే ఆజ్ఞ విషయంలో, యేసుపట్ల తన దుష్ట పన్నాగం అమలుపరచిన యూదాలో ప్రస్ఫుటంగా కనబడిన ఆ లక్షణపు సజీవ నమూనా కంటే ఏ ఆజ్ఞ శక్తిమంతంగా ఉండగలదు? (మత్తయి 26:14-16, 46-50; 27:3-10) ఇలాంటి వృత్తాంతాలు, జుగుప్సాకరమైన లక్షణాలను గుర్తించి, వాటిని తిరస్కరించేలా మనకు సహాయంచేస్తూ మరింత ప్రభావవంతంగా మన హృదయాలను చేరతాయి.

13.కోరదగిన లక్షణాలను గ్రహించడానికి మనకు బైబిలు ఏ విధంగా సహాయం చేస్తోంది?

13 దేవుని నమ్మకమైన చాలామంది సేవకులను కూడా బైబిలు వర్ణిస్తోంది. మనం వారి భక్తి విశ్వాస్యతల గురించి చదువుతాం. దేవునికి సన్నిహితమవడానికి మనం పెంపొందించుకోవలసిన లక్షణాల సజీవ ఉదాహరణలు మనం చూస్తాం. ఉదాహరణకు, విశ్వాసమనే లక్షణాన్నే తీసుకోండి. బైబిలు విశ్వాసాన్ని నిర్వచిస్తూ, మనం దేవుణ్ణి సంతోషపరచడానికి అది మనకెంత ఆవశ్యకమైనదో చెబుతోంది. (హెబ్రీయులు 11:1, 6) విశ్వాసాన్ని ప్రదర్శించిన వారి స్పష్టమైన ఉదాహరణలు కూడా బైబిల్లో ఉన్నాయి. అబ్రాహాము ఇస్సాకును అర్పించడానికి ప్రయత్నించినప్పుడు చూపిన విశ్వాసం గురించి ఆలోచించండి. (ఆదికాండము 22వ అధ్యాయం; హెబ్రీయులు 11:17-19) అలాంటి వృత్తాంతాల ద్వారా “విశ్వాసము” అనే మాట అదనపు అర్థాన్ని సంతరించుకుంటుంది, దాన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుంది. కోరదగిన లక్షణాలను పెంపొందించుకోమని బోధించడమే గాక అవి కార్యాచరణలో ఉన్న ఉదాహరణలు కూడా దయచేస్తున్న యెహోవా ఎంతటి జ్ఞానవంతుడో కదా!

14, 15.దేవాలయానికి వచ్చిన ఒకానొక స్త్రీ గురించి బైబిలు మనకేమి చెబుతోంది, ఈ వృత్తాంతం నుండి యెహోవా గురించి మనమేమి నేర్చుకుంటాము?

14 బైబిల్లోవున్న నిజ జీవిత వృత్తాంతాలు తరచూ మనకు యెహోవా ఎలాంటి వ్యక్తి అనే దాని గురించి కొంత బోధిస్తాయి. దేవాలయంలో యేసు గమనించిన ఒక స్త్రీ గురించి మనం చదివే విషయమే పరిశీలించండి. యేసు కానుకల పెట్టెల సమీపంగా కూర్చొని ప్రజలు కానుకలు వేయడాన్ని గమనిస్తున్నాడు. చాలామంది ధనవంతులు వచ్చి ‘తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు.’ అయితే యేసు దృష్టి ఒక బీద విధవరాలి మీద నిలిచింది. ఆమె అల్ప విలువగల “రెండు కాసులు” కానుకగా వేసింది. * అదే ఆమె దగ్గర మిగిలివున్న కొంచెం డబ్బు. యెహోవా దృక్కోణాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించిన యేసు, “కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని” అన్నాడు. ఆ మాటల ప్రకారంగా, ఆమె ఇతరులందరు వేసినదాని మొత్తం కంటే ఎక్కువ వేసింది.—మార్కు 12:41-44; లూకా 21:1-4; యోహాను 8:28.

15 ఆ రోజున దేవాలయానికి వచ్చిన వారందరిలోకి ఈ విధవరాలు బైబిల్లో ప్రత్యేకంగా పేర్కొనబడడం విశేషం కాదా? ఈ ఉదాహరణ ద్వారా యెహోవా తాను ప్రశంసా గుణంగల దేవుడనని మనకు బోధిస్తున్నాడు. ఇతరులు ఇవ్వగల వాటితో పోలిస్తే మనమిచ్చేది ఎంత తక్కువగా ఉన్నా మనం పూర్ణాత్మతో ఇచ్చే కానుకలను ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు. ఈ ఉత్తేజకరమైన సత్యాన్ని మనకు బోధించడానికి యెహోవాకు ఇంతకంటే ఉత్తమ మార్గం ఇంకేముంది!

బైబిల్లో ఎలాంటి విషయాలు లేవు

16, 17.యెహోవా తన వాక్యంలో పొందుపరచకుండా విడిచిపెట్టడానికి ఎంపిక చేసుకున్న దానిలో కూడా ఆయన జ్ఞానం ఎలా కనబడుతుంది?

16 ప్రియమైన వారికి మీరు ఉత్తరం వ్రాసేటప్పుడు మీరు వ్రాయగల విషయాలకు పరిమితి ఉంటుంది. కాబట్టి ఏమి వ్రాయాలో ఎంచుకోవడానికి మీరు వివేచన ఉపయోగిస్తారు. అదేవిధంగా, యెహోవా తన వాక్యంలో ఆయా వ్యక్తులను, సంఘటనలను ప్రస్తావించాలని ఎంచుకున్నాడు. అయితే ఈ వివరణాత్మక వృత్తాంతాల్లో, బైబిలు అన్నిసార్లూ అన్ని వివరాలను సవివరంగా పేర్కొనడం లేదు. (యోహాను 21:25) ఉదాహరణకు, దేవుని తీర్పు గురించి బైబిలు మాట్లాడినప్పుడు, ఇవ్వబడిన సమాచారం మన ప్రతీ ప్రశ్నకు జవాబివ్వకపోవచ్చు. యెహోవా తన వాక్యంలో పొందుపరచకుండా విడిచిపెట్టడానికి ఎంపిక చేసుకున్న దానిలో కూడా ఆయన జ్ఞానం కనబడుతుంది. ఏ విధంగా?

17 బైబిలు వ్రాయబడిన విధానం మన హృదయంలో ఏముందో పరీక్షించడానికి ఉపకరిస్తుంది. హెబ్రీయులు 4:12 ఇలా చెబుతోంది: “దేవుని వాక్యము [లేదా, సందేశం] సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను . . . విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” బైబిలు సందేశం లోతుగా చొచ్చుకుపోయి, మన నిజ ఆలోచనను, ఉద్దేశాలను బయటపెడుతుంది. విమర్శనాత్మక హృదయంతో దానిని చదివేవారు తమను సంతృప్తిపరిచేంత సమాచారంలేని వృత్తాంతాలనుబట్టి తరచూ అభ్యంతరపడతారు. అలాంటివారు యెహోవా నిజంగా ప్రేమ, జ్ఞానం, న్యాయం గలవాడేనా అని కూడా ప్రశ్నించవచ్చు.

18, 19.(ఎ)ఒకానొక బైబిలు వృత్తాంతం మనకు జవాబులు వెంటనే దొరకని ప్రశ్నలు లేవదీస్తే మనమెందుకు కలత చెందకూడదు? (బి) దేవుని వాక్యాన్ని అవగతం చేసుకోవడానికి ఏమి అవసరం, ఇది యెహోవా మహాగొప్ప జ్ఞానానికి రుజువుగా ఎలావుంది?

18 దానికి భిన్నంగా, యథార్థ హృదయంతో మనం జాగ్రత్తగా బైబిలు అధ్యయనం చేసినప్పుడు, మొత్తం బైబిలు యెహోవాను ఎలా చూపిస్తుందో తెలుసుకోవడం ద్వారా మనం ఆయన గురించి నేర్చుకుంటాము. కాబట్టి, ఏదైనా ఒక వృత్తాంతం లేవదీసే కొన్ని ప్రశ్నలకు మనకు వెంటనే జవాబులు లభించకపోయినా మనం కలతచెందం. మనం బైబిలు అధ్యయనం చేసేటప్పుడు యెహోవా ఎలాంటి దేవుడో కొద్ది కొద్దిగా తెలుసుకుంటాము, దానితో ఒక నిర్దిష్ట అవగాహన ఏర్పడుతుంది. ఒక వృత్తాంతం మనకు మొదట అర్థం కాకపోయినా లేదా ఆ వృత్తాంతం దేవుని వ్యక్తిత్వానికెలా సరిపోతుందో మనం గ్రహించకపోయినా, యెహోవా ఎల్లప్పుడూ ప్రేమ, నిష్పక్షపాతం, న్యాయం చూపించే దేవుడని గ్రహించేందుకు మనకు మన బైబిలు అధ్యయనం ఎంతో బోధించింది.

19 కాబట్టి దేవుని వాక్యాన్ని అవగతం చేసుకోవడానికి, యథార్థ హృదయంతో, నిష్పక్షపాత మనస్సుతో మనం దానిని చదివి అధ్యయనం చేయాలి. ఇది యెహోవా మహాగొప్ప జ్ఞానానికి రుజువు కాదా? ప్రజ్ఞగల మానవులు “జ్ఞానవంతులు, మేధావులు” మాత్రమే అర్థం చేసుకోగల పుస్తకాలు రచించగలరు. అయితే సరైన హృదయ ప్రేరణగల వారు మాత్రమే అర్థంచేసుకోగల పుస్తకాన్ని రచించాలంటే దానికి దేవుని జ్ఞానమే కావాలి.—మత్తయి 11:25.

‘లెస్సయైన జ్ఞానముగల’ పుస్తకము

20.ఉత్తమ జీవ మార్గాన్ని మనకు ఒక్క యెహోవా మాత్రమే ఎందుకు చెప్పగలడు, మనకు సహాయపడగల ఏ విషయాలు బైబిల్లో ఉన్నాయి?

20 యెహోవా తన వాక్యంలో మనం జీవించగల ఉత్తమ మార్గాన్ని చెబుతున్నాడు. మన సృష్టికర్తగా, ఆయనకు మన అవసరాల గురించి మనకంటే ఎక్కువ తెలుసు. ప్రేమించబడడం, సంతోషంగా ఉండడం, మంచి సంబంధాలు కాపాడుకోవడం వంటి మానవుని ప్రాథమిక అవసరాలు మారకుండా అలాగే ఉన్నాయి. అర్థవంతమైన జీవితాలు జీవించేందుకు మనకు సహాయపడగల ‘లెస్సయైన జ్ఞాన’ సంపద బైబిల్లో ఉంది. (సామెతలు 3:21) ఈ అధ్యయన సహాయక పుస్తకంలోని ప్రతీ భాగం జ్ఞానవంతమైన బైబిలు సలహాను ఎలా అన్వయించుకోవచ్చో చూపిస్తుంది, అయితే మనం కేవలం ఒక ఉదాహరణను ఇక్కడ పరిశీలిద్దాం.

21-23.మనస్సులో కోపం, పగ పెట్టుకోకుండా మనకు ఏ జ్ఞానయుక్తమైన సలహా సహాయపడగలదు?

21 మనస్సులో కోపం, పగ పెట్టుకొనే వారు తరచూ తమకే హాని తెచ్చుకోవడం మీరు గమనించారా? జీవితంలో పగ మోయలేని ఒక భారం వంటిది. మనం దానిని పెంచుకుంటూపోతే అది పూర్తిగా మన తలంపుల్లో నిండిపోయి, మనకు మనశ్శాంతి లేకుండాచేస్తుంది, మన ఆనందాన్ని పోగొడుతుంది. కోపం పెట్టుకోవడం హృద్రోగ ప్రమాదాన్నీ, అనేక ఇతర దీర్ఘకాల వ్యాధుల ప్రమాదాన్నీ పెంచుతుందని విజ్ఞానశాస్త్ర అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాంటి విజ్ఞానశాస్త్ర అధ్యయనాలకు ఎంతోకాలం ముందే బైబిలు జ్ఞానయుక్తంగా ఇలా తెలియజేసింది: “కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము.” (కీర్తన 37:8) కానీ దానిని మనమెలా చేయవచ్చు?

22 దేవుని వాక్యం జ్ఞానయుక్తమైన ఈ సలహా ఇస్తోంది: “ఒకని సుబుద్ధి [“అంతర్దృష్టి,” NW] వానికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” (సామెతలు 19:11) ఉపరితలాన్ని మించి లోతుగా పరికించే సామర్థ్యమే అంతర్దృష్టి. ఇది అవగాహనను పెంచుతుంది, ఎందుకంటే అది అవతలి వ్యక్తి ఎందుకలా మాట్లాడాడో ప్రవర్తించాడో వివేచించడానికి మనకు సహాయం చేస్తుంది. అతని నిజ ఉద్దేశాలను, భావాలను, పరిస్థితులను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించడం ఆ వ్యక్తిపట్ల ప్రతికూల తలంపులను, భావాలను పారద్రోలడానికి మనకు సహాయం చేయవచ్చు.

23 బైబిల్లో ఇంకొక సలహా ఈ విధంగా ఉంది: “ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.” (కొలొస్సయులు 3:13) “ఒకని నొకడు సహించుచు” అనే మాట ఇతరులపట్ల ఓర్పు కలిగివుండడాన్ని, మనల్ని చికాకుపరిచే లక్షణాలను సహించడాన్ని సూచిస్తోంది. అలాంటి దీర్ఘశాంతం చిన్న విషయాలకు పగ పెంచుకోకుండా ఉండడానికి మనకు సహాయం చేయగలదు. “క్షమించుడి” అనే మాట పగ పెట్టుకోకూడదనే తలంపునిస్తోంది. క్షమించడానికి తగిన ఆధారమున్నప్పుడు ఇతరులను మనం క్షమించాలనే సంగతి జ్ఞానవంతుడైన మన దేవునికి తెలుసు. ఇది వారి ప్రయోజనం కోసమే కాదు మన సొంత మానసిక, హృదయ ప్రశాంతతకు కూడా ప్రయోజనకరమే. (లూకా 17:3, 4) దేవుని వాక్యంలో ఎంతటి జ్ఞానమున్నదో కదా!

24.దేవుని జ్ఞానానుసారంగా మన జీవితాలు మలుచుకున్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

24 తన అపరిమిత ప్రేమచేత పురికొల్పబడిన యెహోవా మనతో సంభాషించాలని కోరుకున్నాడు. దానికి ఆయనొక ఉత్తమ మార్గాన్ని అంటే పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద మానవ రచయితలచే వ్రాయబడిన లిఖిత “ఉత్తరాన్ని” ఆయన ఎంచుకున్నాడు. ఫలితంగా, యెహోవా సొంత జ్ఞానం దాని పుటల్లో కనబడుతుంది. ఈ జ్ఞానం ‘ఎన్నడు తప్పిపోదు.’ (కీర్తన 93:5) దానికి అనుగుణంగా మనం మన జీవితాలను మలుచుకొంటూ, దానిని ఇతరులతో పంచుకుంటుండగా మనం సహజంగానే సర్వ జ్ఞానియైన మన దేవునికి సన్నిహితులమవుతాం. తర్వాతి అధ్యాయంలో, యెహోవా దూరదృష్టిగల జ్ఞానానికి అంటే భవిష్యత్తును ముందేచెప్పి తన సంకల్పాన్ని నెరవేర్చే ఆయన సామర్థ్యపు మరో అసాధారణమైన ఉదాహరణను మనం పరిశీలిస్తాం.

^ ఉదాహరణకు, గొఱ్ఱెల కాపరైన దావీదు గొల్లవారి జీవితానికి సంబంధించిన ఉదాహరణలు ఉపయోగించాడు. (కీర్తన 23) సుంకరి అయిన మత్తయి అనేకమార్లు సంఖ్యల్ని, డబ్బువిలువను పేర్కొన్నాడు. (మత్తయి 17:27; 26:15; 27:3) వైద్యుడైన లూకా తన వైద్య నేపథ్యాన్ని ప్రతిబింబించే మాటలు ఉపయోగించాడు.—లూకా 4:38; 14:2; 16:20.

^ ఈ కాసుల్లో ఒక్కొక్కటి ఒక లెప్టాన్‌, అది ఆ కాలంలో యూదాలో చెలామణిలో ఉన్న అత్యల్ప విలువగల నాణెం. రెండు లెప్టాలు ఒక రోజు బత్తెంలో 1/64వ వంతుకు సమానం. ఈ రెండు కాసులు ఒక పిచ్చుకను అంటే బీదవారు ఆహారంగా ఉపయోగించే అతి చవకైన పక్షిని కొనడానికి కూడా సరిపోవు.