కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 20

‘జ్ఞాన హృదయుడు’—అయినా వినయస్థుడే

‘జ్ఞాన హృదయుడు’—అయినా వినయస్థుడే

1-3.యెహోవా వినయస్థుడని మనమెందుకు నిశ్చయంగా చెప్పవచ్చు?

 ఒక తండ్రి తన బిడ్డకు చాలా ముఖ్యమైన పాఠం నేర్పించాలని కోరుకుంటున్నాడు. తన బిడ్డ హృదయాన్ని చేరాలని ఆయన ఆరాటపడుతున్నాడు. అందుకు ఆయన ఏ పద్ధతి ఉపయోగించాలి? ఆయన ఆ పిల్లవాడ్ని భయపెట్టేలా ఎదురుగా నిలబడి కఠినంగా మాట్లాడాలా? లేక ఆ బిడ్డ ఎత్తుకు తగినట్లు క్రిందికి వంగి మృదువుగా, నచ్చచెబుతున్నట్లు మాట్లాడాలా? నిశ్చయంగా జ్ఞానవంతుడైన, వినయస్థుడైన తండ్రి మృదువుగా మాట్లాడే పద్ధతే ఎంచుకుంటాడు.

2 యెహోవా ఎలాంటి తండ్రి, అహంకారా లేక వినయస్థుడా, కఠినుడా లేక మృదుస్వభావా? యెహోవాకు సర్వం తెలుసు ఆయన సర్వజ్ఞాని. అయితే విషయ పరిజ్ఞానం, బుద్ధిసూక్ష్మత ప్రజలను వినయస్థులుగా చేయవని మీరు గమనించారా? బైబిలు చెబుతున్నట్లుగా “జ్ఞానము ఉప్పొంగజేయును.” (1 కొరింథీయులు 3:19; 8:1) కానీ ‘జ్ఞాన హృదయంగల’ యెహోవా వినయస్థుడు కూడా. (యోబు 9:4, NW) అంటే ఆయన హోదా ఒక విధంగా తక్కువ స్థాయిలో ఉందనో ఆయనకు మహత్వం లోపించిందనో కాదుగాని ఆయన అహంకారం లేనివాడు. అందుకు కారణమేమిటి?

3 యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి అపవిత్రపరిచే లక్షణమైన అహంకారం ఆయనలో లేదు. (మార్కు 7:20-22) అంతేకాకుండా, యిర్మీయా ప్రవక్త యెహోవాకు ఏమిచెప్పాడో గమనించండి: ‘నీ ఆత్మ [స్వయంగా యెహోవాయే] నిశ్చయముగా జ్ఞాపకము చేసికొని నా చెంతకు దిగివచ్చును.’ * (విలాపవాక్యములు 3:20, NW) ఊహించండి! అపరిపూర్ణ మానవుడైన యిర్మీయాకు ఆదరపూర్వకమైన శ్రద్ధనివ్వడానికి విశ్వ సర్వాధిపతియైన యెహోవా దిగిరావడానికి లేక అతని స్థాయికి చేరుకోవడానికి ఇష్టపడుతున్నాడు. (కీర్తన 113:8) అవును, యెహోవా వినయస్థుడు. అయితే దేవుడు కనబరిచే వినయంలో ఏమి ఇమిడివుంది? దానికీ జ్ఞానానికీ ఏమి సంబంధముంది? అది మనకెందుకు ప్రాముఖ్యం?

యెహోవా తాను వినయస్థుణ్ణని నిరూపించుకోవడం

4, 5.(ఎ)వినయమంటే ఏమిటి, అదెలా ప్రదర్శించబడుతుంది, అది బలహీనతనో పిరికితనమనో ఎందుకు ఎప్పటికీ పొరబడకూడదు? (బి) దావీదుతో వ్యవహరించినప్పుడు యెహోవా వినయమెలా ప్రదర్శించాడు, యెహోవా వినయం మనకెంత ప్రాముఖ్యమైనది?

4 వినయమంటే దీనమనస్సనీ అహంభావం, గర్వం లేకపోవడమనీ భావం. హృదయాంతరంగ లక్షణమైన వినయం సాత్వికం, సహనం, సహేతుకత వంటి లక్షణాల్లో కనబడుతుంది. (గలతీయులు 5:22) అయితే దేవునికి ఇష్టమైన ఈ లక్షణాలను బలహీనతగా లేదా పిరికితనంగా ఎన్నడూ అపార్థం చేసుకోకూడదు. యెహోవా నీతియుక్త ఆగ్రహానికి లేదా నాశనంచేసే ఆయన శక్తికి అవి పొసగని లక్షణాలు కావు. బదులుగా, యెహోవా తన వినయం ద్వారా, సాత్వికం ద్వారా తనకున్న అపారమైన బలాన్ని అంటే, తననుతాను సమగ్రంగా అదుపులో ఉంచుకోగల తన శక్తిని ప్రదర్శిస్తున్నాడు. (యెషయా 42:14) జ్ఞానానికి వినయానికి ఎలాంటి సంబంధం ఉంది? బైబిలు సంబంధిత రెఫరెన్సు గ్రంథమొకటి ఇలా పేర్కొంటోంది: “వినయం చివరకు . . . స్వార్థరహిత పరిభాషలో నిర్వచించబడింది, అది సర్వ జ్ఞానానికి అవశ్యక ఆధారం.” కాబట్టి నిజమైన జ్ఞానం వినయం లేకుండా ఉనికిలో ఉండజాలదు. యెహోవా వినయం మనకెలా ప్రయోజనం చేకూరుస్తుంది?

జ్ఞానంగల తండ్రి తన పిల్లలతో వినయంతో, సాత్వికంతో వ్యవహరిస్తాడు

5 యెహోవాను ఉద్దేశించి దావీదు రాజు ఇలా ఆలపించాడు: “నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు, నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము [“వినయము,” NW] నన్ను గొప్పచేసెను.” (కీర్తన 18:35) నిజానికి, యెహోవా అల్పుడైన ఈ అపరిపూర్ణ మానవుణ్ణి ప్రతీ దినం కాపాడుతూ, ఆదుకుంటూ ఆయన పక్షాన చర్య తీసుకోవడానికి దిగి వచ్చాడు. తను రక్షణ పొందాలన్నా, చివరకు రాజుగా తాను ఘనత సాధించాలన్నా కూడా యెహోవా తననుతాను ఈ విధంగా వినయస్థునిగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టే అది సాధ్యమైందని దావీదు గ్రహించాడు. నిజం చెప్పాలంటే, యెహోవా వినయస్థుడు కాకపోతే, ప్రేమగల సాత్వికుడైన తండ్రిగా మనతో వ్యవహరించడానికి తనకుతాను దిగి రావడానికి ఇష్టపడకపోతే మనలో ఎవరం రక్షణ నిరీక్షణ పొంది ఉండేవాళ్ళం?

6, 7.(ఎ)యెహోవా అణకువ గలవాడని బైబిలు ఎందుకు ఎన్నడూ చెప్పదు? (బి) సాత్వికానికి జ్ఞానానికివున్న సంబంధమేమిటి, ఈ విషయంలో ఎవరు అత్యున్నత మాదిరిని ఉంచుతున్నారు?

6 వినయానికి, అణకువకు మధ్య తారతమ్యముందన్న విషయం గమనించదగినది. అణకువగల నమ్మకస్థులైన మానవులు అలవరచుకోవలసిన చక్కని లక్షణం. వినయం మాదిరిగానే దానికి జ్ఞానానికి సంబంధముంది. ఉదాహరణకు, సామెతలు 11:2 ఇలా చెబుతోంది: “వినయము [“అణకువ,” NW] గలవారియొద్ద జ్ఞానమున్నది.” అయితే, యెహోవా అణకువ గలవాడని బైబిలు ఏ సందర్భంలో కూడా చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? అణకువ, లేఖనాల్లో పేర్కొనబడిన విధంగా, సొంత పరిమితులను సరిగా తెలిసికొని ఉండడాన్ని సూచిస్తుంది. తన సొంత నీతి ప్రమాణాలనుబట్టి తానుగా విధించుకున్నవి తప్ప సర్వశక్తునికి ఏ పరిమితులూ లేవు. (మార్కు 10:27; తీతు 1:1) అంతేకాకుండా, మహోన్నతునిగా ఆయన ఎవరి అధీనంలోనూ లేడు. అందువల్ల అణకువ అనే మాట ఎట్టి పరిస్థితుల్లోను యెహోవాకు అన్వయించదు.

7 అయితే యెహోవా వినయస్థుడూ, సాత్వికుడు. నిజమైన జ్ఞానానికి సాత్వికం ఆవశ్యకమని ఆయన తన సేవకులకు బోధిస్తున్నాడు. ఆయన వాక్యం “జ్ఞానముతోకూడిన సాత్వికము” గురించి మాట్లాడుతోంది. * (యాకోబు 3:13) ఈ విషయంలో యెహోవా మాదిరిని పరిశీలించండి

యెహోవా వినయంగా బాధ్యత అప్పగిస్తాడు, వింటాడు

8-10.(ఎ)యెహోవా బాధ్యత అప్పగించడానికీ, వినడానికీ ఇష్టపడతాడనేది ఎందుకు గమనార్హమైనది? (బి) సర్వశక్తుడు తన దేవదూతలతో ఏ విధంగా వినయంతో వ్యవహరించాడు?

8 యెహోవా బాధ్యత అప్పగించడానికీ, వినడానికీ చూపించే ఇష్టత, ఆయన వినయానికి సంబంధించి ప్రోత్సాహకరమైన రుజువునిస్తోంది. ఆయన నిజంగా మాట వింటాడన్నది ఆశ్చర్యకరమైన విషయం; యెహోవాకు సహాయ సలహాలు అవసరం లేదు. (యెషయా 40:13, 14; రోమీయులు 11:34, 35) అయినప్పటికీ, ఈ విధాలుగా యెహోవా వినయంతో వింటాడని బైబిలు పదేపదే చూపిస్తోంది.

9 ఉదాహరణకు, అబ్రాహాము జీవితంలో జరిగిన ఒక అసాధారణ సంఘటన పరిశీలించండి. అబ్రాహాము దగ్గరకు ముగ్గురు సందర్శకులు వచ్చారు, వారిలో ఒకరిని ఆయన “యెహోవా” అని సంబోధించాడు. ఆ సందర్శకులు నిజానికి దేవదూతలు, అయితే వారిలో ఒకరు యెహోవా పేరటవచ్చి ఆ పేరున వ్యవహరిస్తున్నాడు. ఆ దేవదూత మాట్లాడుతూ వ్యవహరిస్తున్నప్పుడు నిజానికి యెహోవా మాట్లాడుతూ వ్యవహరిస్తున్నట్లే. ఆ దేవదూత మాధ్యమంగా తాను ‘సొదొమ గొమొఱ్ఱాల మొర’ విన్నానని యెహోవా అబ్రాహాముతో చెప్పాడు. యెహోవా ఇంకా ఇలా అన్నాడు: ‘ఆ మొర గొప్పది, వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలుసుకొందును.’ (ఆదికాండము 18:3, 20, 21) ఆ సందేశానికి అర్థం సర్వశక్తుడైన యెహోవా వ్యక్తిగతంగా “దిగి” వస్తాడని కాదు. బదులుగా, ఆయన మళ్ళీ దేవదూతలను తన ప్రతినిధులుగా పంపించాడు. (ఆదికాండము 19:1) ఎందుకు? సర్వాన్ని చూడగల యెహోవా ఆ ప్రాంతపు అసలు స్థితి ఎలా ఉందో స్వయంగా ‘తెలుసుకోలేడా’? తప్పకుండా తెలుసుకోగలడు. బదులుగా, పరిస్థితిని అంచనావేసి సొదొమలో ఉన్న లోతును ఆయన కుటుంబాన్ని సందర్శించే నియామకాన్ని యెహోవా వినయంగా ఆ దేవదూతలకు అప్పగించాడు.

10 అంతేగాక యెహోవా మనం చెప్పేది వింటాడు. దుష్ట రాజైన అహాబును కూలద్రోసేందుకు వివిధ మార్గాలు సూచించమని ఆయన ఒకసారి తన దేవదూతలను అడిగాడు. యెహోవాకు అలాంటి సహాయం అవసరం లేదు. అయినప్పటికీ ఆయన ఒక దేవదూత చేసిన సూచన అంగీకరించి ఆ పని చేయడానికి అతన్నే నియమించాడు. (1 రాజులు 22:19-22) అది వినయం కాదా?

11, 12.యెహోవా వినయాన్ని అబ్రాహాము ఎలా తెలుసుకున్నాడు?

11 తమ చింతను వ్యక్తపరచాలని కోరుకొనే అపరిపూర్ణ మానవులు చెప్పేది వినడానికి సైతం యెహోవా ఇష్టపడుతున్నాడు. ఉదాహరణకు, సొదొమ గొమొఱ్ఱాలను నాశనంచేయాలన్న తన ఉద్దేశాన్ని యెహోవా అబ్రాహాముకు మొదటిసారి చెప్పినప్పుడు, ఆ నమ్మకస్థుడు కలవరపడ్డాడు. దానితో అబ్రాహాము, ‘సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?’ అని అడిగాడు. ఆ పట్టణాల్లో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే యెహోవా వాటిని నాశనం చేయకుండా ఉంటాడా అని ఆయన అడిగాడు. నాశనం చేయనని యెహోవా హామీ ఇచ్చాడు. కానీ అబ్రాహాము మళ్లీ మళ్లీ అడుగుతూ ఆ సంఖ్యను 45 నుండి 40కి అలా తగ్గిస్తూ వెళ్లాడు. యెహోవా హామీ ఇస్తున్నప్పటికీ, అబ్రాహాము పట్టువదలకుండా ఆ సంఖ్య చివరికి పదికి చేరుకునేవరకు అడుగుతూనే ఉన్నాడు. యెహోవా ఎంత కనికరం గలవాడనేది బహుశా అబ్రాహాము ఇంకా పూర్తిగా అర్థంచేసుకోలేదు. ఏదేమైనప్పటికీ, ఈ విధంగా తన స్నేహితుడూ, సేవకుడూ అయిన అబ్రాహాము తన చింతను వ్యక్తం చేయడాన్ని యెహోవా సహనంతో, వినయంగా అనుమతించాడు.—ఆదికాండము 18:23-33.

12 ప్రజ్ఞగల, బాగా చదువుకున్న ఎంతమంది మానవులు తమకంటే చాలా తక్కువ మేధగల వ్యక్తిచెప్పేది అంత ఓపికగా వింటారు? * మన దేవుని వినయం అటువంటిది. అదే సంభాషణలో, యెహోవా “దీర్ఘశాంతము” గలవాడని కూడా అబ్రాహాము చూశాడు. (నిర్గమకాండము 34:6) సర్వోన్నతుని పనులను ప్రశ్నించే హక్కు తనకు లేదని గ్రహించినందుకు కావచ్చు అబ్రాహాము, “ప్రభువు కోపపడనియెడల” అని రెండుసార్లు యాచించాడు. (ఆదికాండము 18:30, 32) అయితే యెహోవా కోపపడలేదు. ఆయనకు నిజముగా “జ్ఞానముతోకూడిన సాత్వికము” ఉన్నది.

యెహోవా సహేతుకమైనవాడు

13.బైబిల్లో ఉపయోగించినట్లుగా “సహేతుకం” అనే పదానికి అర్థమేమిటి, ఈ పదం యెహోవాను సముచితంగా ఎందుకు వర్ణిస్తోంది?

13 మరో చక్కని లక్షణమైన సహేతుకతలో యెహోవా వినయం ప్రదర్శితమవుతోంది. విచారకరంగా ఈ లక్షణం అపరిపూర్ణ మానవుల్లో కొదువగా ఉంది. యెహోవా మానవులు చెప్పేది వినడానికి ఇష్టపడడమే కాదు తన నీతి సూత్రాలకు భిన్నంగా లేనప్పుడు తగిన విధంగా మారడానికి సైతం ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్లో ఉపయోగించినట్లుగా, “సహేతుకం” అనే పదానికి అక్షరార్థంగా ‘తగిన విధంగా మారడం’ అని అర్థం. ఈ లక్షణం కూడా దేవుని జ్ఞానానికి మచ్చుతునక. యాకోబు 3:17 ఇలా చెబుతోంది: “పైనుండివచ్చు జ్ఞానము . . . సులభముగా లోబడునది [“సహేతుకమైనది,” NW].” సర్వజ్ఞానియైన యెహోవా ఏ భావంలో సహేతుకతగలవాడు? ఒక సంగతేమంటే ఆయన పరిస్థితులకు తగ్గట్టు మారే స్వభావం గలవాడు. యెహోవా తన సంకల్ప నెరవేర్పుకు అవసరమైన రీతిలో తానే కర్త అవుతాడని ఆయన పేరు మనకు బోధిస్తున్నదని గుర్తుంచుకోండి. (నిర్గమకాండము 3:14) అది పరిస్థితులకు తగ్గట్టు మారే, సహేతుక స్వభావాన్ని సూచించడం లేదా?

14, 15.యెహెజ్కేలు చూసిన యెహోవా పరలోక రథ దర్శనం యెహోవా పరలోక సంస్థ గురించి మనకేమి బోధిస్తోంది, అది ఏవిధంగా లోక సంస్థలకు భిన్నంగా ఉంది?

14 పరిస్థితులకు తగ్గట్టు మారే యెహోవా స్వభావాన్ని కొంతమేరకు అర్థంచేసుకోవడానికి ఒక విశేషమైన బైబిలు భాగం మనకు సహాయం చేస్తుంది. యెహోవా ఆత్మసంబంధ ప్రాణులతో కూడిన పరలోక సంస్థకు సంబంధించిన దర్శనం ఒకటి యెహెజ్కేలు ప్రవక్తకు ఇవ్వబడింది. అందులో ఆయన భీతిగొలిపే కొలతలున్న ఒక రథాన్ని, అంటే అన్నివేళలా యెహోవా ఆధీనంలోవుండే ఆయన ‘వాహనాన్ని’ చూశాడు. దాని కదలిక అత్యంత ఆసక్తికరంగా ఉంది. సర్వ దిక్కులు చూడగలిగేలా, ఆగకుండా లేదా మలుపు తిరగకుండా తక్షణమే తమ దిశ మార్చుకోగలిగేలా దాని మహాచక్రాలు చతుర్ముఖంగావుండి కండ్లతో నిండివున్నాయి. అసాధారణ ఆకృతిగల ఈ రథం మానవ నిర్మిత భారీ వాహనంలా నెమ్మదిగా కదలనక్కర లేదు. అది సమకోణ మలుపులు కూడా మెరుపువేగంతో తిరుగుతూ సాగిపోగలదు. (యెహెజ్కేలు 1:1, 14-28) అవును, సర్వశక్తిగల సర్వాధిపతియైన యెహోవాలాగే, ఆయన ఆధీనంలో ఉన్న సంస్థ కూడా తాను వ్యవహరించవలసిన, సదా మారుతుండే పరిస్థితులకు, అవసరాలకు తగ్గట్టు అత్యుత్తమ రీతిలో మారుతూ ప్రతిస్పందిస్తూ ఉంది.

15 పరిస్థితులకు తగ్గట్టు మారే అలాంటి పరిపూర్ణ స్వభావాన్ని అనుకరించడానికి మానవులు కేవలం ప్రయత్నించగలరు. కానీ నిజానికి, తరచూ మానవులు వారి సంస్థలు పరిస్థితులకు తగ్గట్టు మారడానికి బదులు కఠినంగా ఉండడం, పద్ధతి మార్చుకోవడానికి బదులు అనుచితంగా ఉండడం జరుగుతోంది. ఉదాహరణకు, చమురు రవాణాచేసే పెద్ద ఓడ లేదా గూడ్సు రైలు చూడ్డానికి పరిమాణంలో, శక్తిలో భీకరంగా కనిపించవచ్చు. కానీ ఈ రెంటిలో ఏదైనా ఆకస్మిక పరిస్థితికి తగ్గట్టు గతి మార్చుకోగలదా? గూడ్సు రైలు పట్టాలకు అడ్డంగా ఏదైనావుంటే, అది మలుపు తిరిగే ప్రశ్నేలేదు. తటాలున ఆపడం కూడా అంత సులభం కాదు. బరువైన గూడ్సు రైలు బ్రేకులు వేసిన తర్వాత దాదాపు రెండు కిలోమీటర్ల దూరంవెళ్లి ఆగుతుంది. అదే ప్రకారం, చమురు రవాణాచేసే పెద్ద ఓడ ఇంజన్లు ఆపుజేసిన తర్వాత కూడా ఎనిమిది కిలోమీటర్లు వెళుతుంది. ఇంజన్లను వ్యతిరిక్త దిశకు మళ్లించినా ఆ ఓడ దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లి ఆగుతుంది. మానవ సంస్థలు కూడా అదేవిధంగా కఠినంగా, అనుచితంగా ఉండే అవకాశం ఉంది. అహంకారం కారణంగా మనుషులు తరచూ మారుతున్న అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టు మారడానికి నిరాకరిస్తారు. అలాంటి కఠినత్వం కార్పొరేషన్లు దివాలాతీసేలా చేయడమే కాక ప్రభుత్వాలు కూలిపోయేలా కూడా చేసింది. (సామెతలు 16:18) యెహోవా గానీ ఆయన సంస్థ గానీ అలా ఎంతమాత్రం లేనందుకు మనమెంత సంతోషించవచ్చో కదా!

యెహోవా సహేతుకతను ఎలా ప్రదర్శిస్తాడు?

16.సొదొమ గొమొఱ్ఱాలను నాశనం చేయడానికి ముందు లోతుతో వ్యవహరించినప్పుడు యెహోవా సహేతుకతను ఎలా చూపాడు?

16 సొదొమ గొమొఱ్ఱాల నాశనాన్ని మళ్లీ పరిశీలించండి. యెహోవా దేవదూత లోతుకూ అతని కుటుంబానికీ “పర్వతమునకు పారిపొమ్మని” స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. కానీ లోతుకు ఇది నచ్చలేదు. “ప్రభువా ఆలాగు కాదు” అని అతడు బ్రతిమాలాడు. ఆ పర్వత ప్రాంతానికి పారిపోవాల్సివస్తే తనకు చావు ఖాయమని భావిస్తూ లోతు తనను తన కుటుంబాన్ని దగ్గర్లోవున్న సోయరనే ఊరికి పారిపోయేలా అనుమతించమని వేడుకున్నాడు. యెహోవా ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించాడని గుర్తుంచుకోండి. దానికితోడు, లోతు భయానికి నిజమైన ఆధారం లేదు. యెహోవా నిశ్చయంగా ఆ పర్వత ప్రాంతంలో లోతును సజీవంగా కాపాడగలడు. అయినా, లోతు విన్నపం మన్నించి యెహోవా సోయరును నాశనం చేయలేదు. “ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని” అని ఆ దేవదూత లోతుకు చెప్పాడు. (ఆదికాండము 19:17-22) యెహోవా వైపు నుండి అది సహేతుకత కాదా?

17, 18.నీనెవె పురవాసులతో వ్యవహరించడంలో యెహోవా తాను సహేతుకత గలవాడనని ఎలా చూపించాడు?

17 యెహోవా అన్ని సందర్భాల్లో కనికరంతో కూడినదీ, సరైనదీ చేస్తూ హృదయపూర్వక పశ్చాత్తాపానికి కూడా ప్రతిస్పందిస్తాడు. హింసాత్మకమైన నీనెవె మహాపురంలోని దుష్టుల వద్దకు యోనా ప్రవక్తను పంపినప్పుడు ఏమి జరిగిందో ఆలోచించండి. నీనెవె వీధుల్లో వెళ్తూ, ఆ బలమైన నగరం 40 రోజుల్లో నాశనం చేయబడుతుందనే సరళమైన ప్రేరేపిత సందేశాన్ని యోనా ప్రకటించాడు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నీనెవె పురవాసులు పశ్చాత్తాపపడ్డారు.—యోనా 3వ అధ్యాయం.

18 పరిస్థితుల్లో వచ్చిన ఈ మార్పుకు, యోనా ఎలా ప్రతిస్పందించాడనే దానితో యెహోవా ప్రతిస్పందనను పోల్చిచూడడం ఉపదేశాత్మకంగా ఉంటుంది. ఈ సందర్భంలో, యెహోవా “యుద్ధశూరుడు” కావడానికి బదులు పరిస్థితులకు తగ్గట్టు మారి తననుతాను పాపాలను క్షమించేవానిగా చేసుకున్నాడు. * (నిర్గమకాండము 15:3) మరోవైపున, యోనా కఠినస్థునిగా, కనికరమే లేనివానిగా ఉన్నాడు. యెహోవా సహేతుకతను ప్రతిబింబించడానికి బదులు ఆయన, ముందు ప్రస్తావించబడిన గూడ్సు రైలు లేదా చమురు రవాణాచేసే పెద్ద ఓడ మాదిరిగా ప్రతిస్పందించాడు. ఆయన నాశనాన్ని ప్రకటించాడు, కాబట్టి నాశనం జరగాల్సిందే! అయితే యెహోవా ఎంతో సహనంతో, ఓర్పు లేని ఈ ప్రవక్తకు సహేతుకత కనికరాల విషయంలో మరువలేని పాఠం నేర్పించాడు.—యోనా 4వ అధ్యాయం.

యెహోవా సహేతుకతగలవాడు మన పరిమితులను అర్థంచేసుకుంటాడు

19.(ఎ)యెహోవా మననుండి అపేక్షించేదాని విషయంలో సహేతుకమైన వాడని మనమెందుకు నిశ్చయతతో ఉండవచ్చు? (బి) యెహోవా ‘మంచితనం సహేతుకత’ గలవాడు, అత్యంత అపారమైన వినయ స్వభావంగల యజమాని అని సామెతలు 19:17 ఎలా చూపిస్తోంది?

19 చివరకు, మననుండి యెహోవా అపేక్షించే విషయంలో కూడా ఆయన సహేతుకంగా ఉన్నాడు. దావీదు రాజు ఇలా చెప్పాడు: “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్తన 103:14) మన పరిమితులను, అపరిపూర్ణతలను మనకంటే ఎక్కువ యెహోవాయే అర్థంచేసుకుంటాడు. మనం చేయగల దానికంటే ఆయనెన్నడూ ఎక్కువ ఆశించడు. ‘మంచితనం, సాత్వికత [“సహేతుకత,” NW]’ గల మానవ యజమానులకు “ముష్కరులైన” యజమానులకు మధ్యనున్న తారతమ్యాన్ని బైబిలు చూపిస్తోంది. (1 పేతురు 2:18) యెహోవా ఎలాంటి యజమాని? సామెతలు 19:17 ఏమి చెబుతోందో గమనించండి: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు.” బీదల పక్షాన చేయబడిన ప్రతీ దయాక్రియను కేవలం మంచితనం, సహేతుకత గల యజమానుడు మాత్రమే గమనిస్తాడనేది స్పష్టం. అంతకంటే ఎక్కువగా, అలా కనికరించే అల్ప మానవులకు నిజానికి తాను రుణపడివున్నట్లు విశ్వ సృష్టికర్త దృష్టిస్తాడని ఈ లేఖనం సూచిస్తోంది. ఇదే అత్యంత అపారమైన వినయ స్వభావం.

20.యెహోవా మన ప్రార్థనలు విని వాటికి ప్రతిస్పందిస్తాడు అనడానికి ఏ హామీ ఉంది?

20 నేటి తన సేవకులతో వ్యవహరించే విషయంలో కూడా యెహోవా అంతే సాత్వికునిగా, సహేతుకత గలవాడిగా ఉన్నాడు. మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు. మనతో మాట్లాడేందుకు వార్తాహరులుగా దేవదూతలను పంపించకపోయినా, మన ప్రార్థనలకు ఆయన చెవియొగ్గడని మనం తలంచకూడదు. అపొస్తలుడైన పౌలు తాను చెరనుండి విడుదల పొందడానికి “ప్రార్థనచేయుడి” అని తోటి విశ్వాసులను అడుగుతూ, “నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు” అని అన్నాడని కూడా గుర్తుతెచ్చుకోండి. (హెబ్రీయులు 13:18, 19) కాబట్టి యెహోవాను మనం వేడుకోకపోతే ఆయన బహుశా చేసివుండనివి చేసేలా మన ప్రార్థనలు ఆయనను పురికొల్పవచ్చు.—యాకోబు 5:16.

 21 యెహోవా వినయానికి సంబంధించిన ఈ వ్యక్తీకరణలు, అంటే ఆయన సాత్వికం, వినడానికి ఆయన చూపే ఇష్టత, ఆయన సహనం, ఆయన సహేతుకత వంటివేవీ కూడా ఆయన తన నీతిసూత్రాల విషయంలో రాజీ పడతాడని సూచించడం లేదు. యెహోవా నైతిక ప్రమాణాలను నీరుగార్చడం ద్వారా తమ మందల చెవులకింపుగా మాట్లాడినప్పుడు తాము సహేతుకత చూపిస్తున్నామని క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు తలంచవచ్చు. (2 తిమోతి 4:3) పబ్బం గడుపుకోవడానికి రాజీపడే మానవ స్వభావంతో దేవుని సహేతుకతకు ఎటువంటి సంబంధమూ లేదు. యెహోవా పరిశుద్ధుడు; ఆయన తన నీతి ప్రమాణాలను ఎన్నటికీ కలుషితం చేయడు. (లేవీయకాండము 11:44) కాబట్టి మనం యెహోవా సహేతుకతను ప్రేమిద్దాం, ఎందుకంటే అది నిజంగా ఆయన వినయానికి ఒక రుజువుగావుంది. విశ్వంలోకెల్లా సర్వజ్ఞానియైన యెహోవా దేవుడు అత్యంత వినయస్థుడని కూడా తలంచడానికి మీరు పులకించడం లేదా? భక్తిపూర్వక భయం కలిగించే వాడే అయినా సాత్వికం, సహనం, సహేతుకత గల ఈ దేవునికి సన్నిహితం కావడం ఎంత ఆనందదాయకమో కదా!

^ ప్రాచీనకాల శాస్త్రులు లేదా సొఫరీమ్‌, యెహోవా కాదు యిర్మీయా దిగివచ్చాడని చెబుతున్నట్లుగా ఈ వచనాన్ని మార్చారు. అలాంటి వినయపూర్వక చర్యను దేవునికి ఆపాదించడం సముచితం కాదని వారు భావించారని స్పష్టమవుతోంది. దాని ఫలితంగా, అనేక తర్జుమాలు విశిష్టమైన ఈ వచన భావాన్ని సరిగ్గా వ్యక్తం చేయడంలేదు. కానీ, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌ దేవునితో యిర్మీయా ఇలా అన్నట్లు, ఖచ్చితముగా ఇలా అనువదించింది: ‘నన్ను మరువక, జ్ఞాపకముంచుకొని నా చెంతకు దిగిరమ్ము.’

^ ఇతర భాషాంతరాలు “జ్ఞానం నుండి వచ్చే వినయం” మరియు “జ్ఞానానికి సౌమ్యత ప్రామాణిక చిహ్నం” అని చెబుతున్నాయి.

^ ఆసక్తికరంగా, బైబిలు సహనం లేదా శాంతస్వభావం అహంకారానికి భిన్నమైనదని చూపుతోంది. (ప్రసంగి 7:8) యెహోవా దీర్ఘశాంతము అయన వినయానికి అదనపు రుజువునిస్తోంది.​—⁠2 పేతురు 3:9.

^ కీర్తన 86:5​లో యెహోవా ‘దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు’ అని చెప్పబడ్డాడు. ఈ కీర్తన గ్రీకులోకి అనువదించబడినప్పుడు, ‘క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడు’ అనే మాటలు ఎపీకీస్‌, లేదా “సహేతుకం” అని అనువదించబడ్డాయి.