కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 21

యేసు ‘దేవుని జ్ఞానమును’ వెల్లడిచేయడం

యేసు ‘దేవుని జ్ఞానమును’ వెల్లడిచేయడం

1-3.యేసు బోధకు ఆయన మునుపటి పొరుగువారు ఎలా ప్రతిస్పందించారు, వారు ఆయన విషయంలో ఏమి గుర్తించడంలో విఫలమయ్యారు?

 ఆ శ్రోతలు ఆశ్చర్యపోయారు. యువకుడైన యేసు సమాజమందిరంలో వారి ఎదురుగా నిలబడి బోధిస్తున్నాడు. ఆయన వారికి క్రొత్తవాడేమీ కాదు, ఆయన వారి ఊరిలోనే పెరిగాడు, సంవత్సరాలుగా వారి మధ్య వడ్రంగిగా పనిచేశాడు. బహుశా వారిలో కొందరు యేసు నిర్మించడానికి సహాయం చేసిన ఇళ్లలో నివసిస్తున్నవారు లేదా ఆయన స్వహస్తాలతో చేసిన నాగళ్లను, కాడిమానులను తమ పొలాలు దున్నడానికి ఉపయోగిస్తున్నవారు ఉండవచ్చు. * అయితే గతంలోని ఈ వడ్రంగి బోధకు వారెలా ప్రతిస్పందిస్తారు?

2 శ్రోతల్లో చాలామంది “ఈ జ్ఞానము . . . ఇతని కెక్కడనుండి వచ్చినది?” అంటూ ఆశ్చర్యపోయారు. అంతేగాక వారింకా ఇలా అన్నారు: “ఇతడు మరియ కుమారుడు కాడా? వడ్లవాడు కాడా?” (మత్తయి 13:54-58; మార్కు 6:1-3) విచారకరంగా, యేసు ఒకప్పటి పొరుగువారు, ‘ఈ వడ్లవాడు మనవంటి స్థానికుడే కదా’ అని తర్కించుకున్నారు. ఆయన మాటల్లో ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ వారు ఆయనను నిరాకరించారు. ఆయన వారితో పంచుకున్న జ్ఞానం ఆయన సొంత జ్ఞానంకాదని వారు గ్రహించలేదు.

3 యేసుకు ఆ జ్ఞానం నిజంగా ఎక్కడనుండి వచ్చింది? “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే” అని ఆయన అన్నాడు. (యోహాను 7:16) యేసు ‘దేవుని మూలముగా మనకు జ్ఞానము ఆయెను’ అని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (1 కొరింథీయులు 1:31) యెహోవా సొంత జ్ఞానం ఆయన కుమారుడైన యేసు ద్వారా వెల్లడిచేయబడింది. ఇది ఎంతమేరకు వాస్తవమంటే యేసు ఇలా చెప్పగలిగాడు: “నేనును తండ్రియును ఏకమై యున్నాము.” (యోహాను 10:30) ‘దేవుని జ్ఞానాన్ని’ యేసు ప్రదర్శించిన మూడు రంగాలను మనం పరిశీలిద్దాం.

ఆయన ఏమి బోధించాడు?

4.(ఎ)యేసు సందేశపు మూలాంశమేమిటి, అది ఎందుకు అత్యంత ప్రాముఖ్యమైనది? (బి) యేసు ఉపదేశం అన్ని సందర్భాల్లో ఎందుకు ఆచరణాత్మకంగా, తన శ్రోతలకు అత్యంత ప్రయోజనార్థంగా ఉంది?

4 మొదట, యేసు ఏమి బోధించాడో పరిశీలించండి. ఆయన సందేశ మూలాంశం “దేవుని రాజ్య సువార్త.” (లూకా 4:43) అది అత్యంత ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ఆ రాజ్యం యెహోవా సర్వాధిపత్య సత్యనిరూపణలో, మానవాళికి శాశ్వత ఆశీర్వాదాలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. యేసు తన బోధలో దైనందిన జీవితానికి అవసరమయ్యే జ్ఞానయుక్త ఉపదేశం ఇచ్చాడు. ప్రవచించబడిన “ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త” తానే అని ఆయన నిరూపించుకున్నాడు. (యెషయా 9:6) నిజానికి, ఆయన ఉపదేశం ఆశ్చర్యకరంగా ఎందుకుండదు? ఆయనకు దేవుని వాక్యం గురించి, చిత్తం గురించి లోతైన పరిజ్ఞానం, మానవ స్వభావం గురించి నిశిత అవగాహన, మానవాళిపట్ల ప్రగాఢమైన ప్రేమ ఉన్నాయి. కాబట్టి, ఆయన ఉపదేశం అన్ని సందర్భాల్లోను ఆచరణాత్మకంగా, తన శ్రోతలకు అత్యంత ప్రయోజనార్థంగా ఉండేది. యేసు “నిత్యజీవపు మాటలు” పలికాడు. అవును, యేసు ఉపదేశాన్ని అనుసరిస్తే అది రక్షణకు నడిపిస్తుంది.​—యోహాను 6:68.

5. కొండమీది ప్రసంగంలో యేసు బోధించిన విషయాల్లో కొన్ని ఏమిటి?

5 కొండమీది ప్రసంగం, యేసు బోధల్లోని అపూర్వ జ్ఞానానికి అసాధారణ ఉదాహరణ. మత్తయి 5:3-7:27​లో నమోదైన ఈ ప్రసంగం ఇవ్వడానికి బహుశా 20 నిమిషాలు పడుతుంది. కానీ ఆ ఉపదేశానికి కాలపరిమితిలేదు అంటే అది మొదట ఇవ్వబడినప్పుడు ఎంత ఆచరణాత్మకంగా ఉందో నేటికీ అలాగే ఉంది. యేసు విభిన్న అంశాల గురించి మాట్లాడాడు వాటిలో, ఇతరులతో సంబంధాలు ఎలా మెరుగుపరచుకోవాలి (5:23-26, 38-42; 7:1-512), నైతికంగా ఎలా పరిశుభ్రంగా ఉండాలి (5:27-32), సంకల్పవంతమైన జీవితం ఎలా జీవించాలి (6:19-24; 7:24-27) అనేవి కొన్ని. యేసు తన శ్రోతలకు కేవలం జ్ఞానయుక్త విధానమేమిటో చెప్పడం కంటే ఎక్కువే చేశాడు; ఆయన వివరించడం ద్వారా, తర్కించడం ద్వారా, నిదర్శనాలివ్వడం ద్వారా వారికి చూపించాడు.

6-8.(ఎ)చింతను దూరంగా ఉంచడానికి ఏ శక్తివంతమైన కారణాలను యేసు చూపించాడు? (బి) యేసు ఉపదేశం పైనుండి వచ్చిన జ్ఞానాన్ని ప్రతిబింబించిందని ఏది చూపిస్తోంది?

6 ఉదాహరణకు, మత్తయి 6వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా, వస్తుపర సంగతులకు సంబంధించిన చింతతో ఎలా వ్యవహరించాలనే దాని గురించి యేసు చేసిన ఉపదేశాన్ని పరిశీలించండి. “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి” అని యేసు మనకు సలహా ఇస్తున్నాడు. (25వ వచనం) ఆహారం, వస్త్రాలు ప్రాథమిక అవసరాలు కాబట్టి వాటిని సంపాదించుకోవాలనే ఆతురత ఉండడం సహజమే. అయితే అలాంటి సంగతుల గురించి “చింతింపకుడి” అని యేసు మనకు చెబుతున్నాడు. * ఎందుకు చెబుతున్నాడు?

7 యేసు ఒప్పిస్తూ చేస్తున్న తర్కాన్ని ఆలకించండి. యెహోవాయే మనకు జీవాన్ని, శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ జీవాన్ని కాపాడే ఆహారాన్ని, శరీరాన్ని కప్పే వస్త్రాలను ఆయన ఇవ్వలేడా? (25వ వచనం) దేవుడు పక్షులకు ఆహారమిస్తూ, పువ్వులను అందంగా అలంకరిస్తున్నప్పుడు, తన మానవ ఆరాధకులపట్ల ఆయన ఇంకా ఎంత శ్రద్ధ వహిస్తాడో గదా! (26, 28-30 వచనాలు) నిజంగా, మోతాదుకు మించిన చింత ఏ విధంగా చూసినా అర్థరహితమే. అది వీసమంతైనా మన జీవితాన్ని పొడిగించలేదు. * (27వ వచనం) మరి మనం చింతనెలా తప్పించుకోవచ్చు? జీవితంలో దేవుని ఆరాధనకు ఎల్లప్పుడూ ప్రథమ స్థానమిస్తూ ఉండమని యేసు మనకు ఉపదేశిస్తున్నాడు. అలా చేసేవారు తమ దైనందిన అవసరాలన్నీ తమ పరలోక తండ్రిచే “అనుగ్రహింపబడును” అనే నమ్మకంతో ఉండవచ్చు. (33వ వచనం) చివరగా యేసు అత్యంత ఆచరణాత్మక సూచననిస్తున్నాడు, అంటే ఏ రోజు సంగతి ఆ రోజుకే వదిలివేయమని చెబుతున్నాడు. నేటి చింతలకు రేపటివెందుకు చేర్చుకోవడం? (34వ వచనం) అంతేగాక, అసలు ఎప్పటికీ జరగని సంగతుల గురించి అనవసరంగా ఎందుకు కలతచెందడం? అలాంటి జ్ఞానయుక్త ఉపదేశాన్ని అన్వయించుకోవడం ఒత్తిడిగల ఈ లోకంలో మనకు మనోవ్యథ లేకుండా చేయగలదు.

8 యేసు దాదాపు 2,000 సంవత్సరాల పూర్వం ఇచ్చిన ఆ ఉపదేశం ఆనాడు ఇవ్వబడినప్పుడు ఎంత ఆచరణాత్మకంగా ఉందో నేడూ అంతే ఆచరణాత్మకంగా ఉందని స్పష్టమవుతోంది. అది పైనుండి వచ్చిన జ్ఞానానికి రుజువు కాదా? మానవ ఉపదేశకులు ఇచ్చే శ్రేష్ఠమైన సలహా సైతం పాతబడి ఆ తర్వాత సరిచేయబడే లేదా వేరొకటి దాని స్థానాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉంది. అయితే యేసు బోధలు కాలపరీక్షను తట్టుకొని నిలిచాయి. అది మనలను ఆశ్చర్యపరచకూడదు, ఎందుకంటే ఈ ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త ‘దేవుని మాటలే పలికాడు.’—యోహాను 3:33.

ఆయన బోధనా విధానం

9.యేసు బోధ గురించి కొందరు సైనికులు ఏమన్నారు, ఇది ఎందుకు అతిశయోక్తికాదు?

9 దేవుని జ్ఞానాన్ని యేసు ప్రతిబింబించిన రెండవ రంగం ఆయన బోధనా విధానం. ఒక సందర్భంలో, ఆయనను బంధించడానికి పంపబడిన కొంతమంది సైనికులు వట్టిచేతులతో తిరిగివచ్చి ఇలా అన్నారు: “ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు.” (యోహాను 7:45, 46) ఇది అతిశయోక్తి కాదు. ఇంతవరకు జీవించిన మనుష్యులందరిలోకెల్లా ‘పైనుండి’ వచ్చిన యేసుకు అపారమైన జ్ఞానం, అనుభవం ఉన్నాయి, వాటిని ఆయన ఇతరులతో ధారాళంగా పంచుకున్నాడు. (యోహాను 8:23) నిజంగా, ఏ మానవుడూ బోధించలేని రీతిలో ఆయన బోధించాడు. ఈ జ్ఞానవంతుడైన బోధకుని పద్ధతుల్లో కేవలం రెండింటిని పరిశీలించండి.

“జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి”

10, 11.(ఎ)యేసు ఉపమానాలు ఉపయోగించిన విధానంచూసి మనమెందుకు ఆశ్చర్యపోక తప్పదు? (బి) దృష్టాంతాలంటే ఏమిటి, యేసు ఉపయోగించిన దృష్టాంతాలు బోధకు ఎందుకంత ప్రభావవంతమైనవో ఏ ఉదాహరణ చూపిస్తోంది?

10 ఉపమానాలను ఫలవంతంగా ఉపయోగించడం. “యేసు . . . జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు” అని మనకు చెప్పబడింది. (మత్తయి 13:35) ప్రతిదిన సంగతుల ద్వారా లోతైన సత్యాలను బోధించగల ఆయన సాటిలేని సామర్థ్యానికి మనం ఆశ్చర్యపోక తప్పదు. రైతులు విత్తనాలు జల్లడం, స్త్రీలు రొట్టె చేయడానికి సిద్ధపడడం, పిల్లలు సంతవీధిలో ఆడుకోవడం, జాలర్లు వలలు లాగడం, కాపరులు తప్పిపోయిన గొర్రెల కోసం వెదకడం వంటి దృశ్యాలను ఆయన శ్రోతలు అనేకమార్లు చూశారు. ప్రాముఖ్యమైన సత్యాలను పరిచయమున్న సంగతులకు ముడిపెట్టినప్పుడు, ఆ సత్యాలు మనస్సులోకి, హృదయంలోకి త్వరగా, లోతుగావెళ్లి ముద్రవేస్తాయి.—మత్తయి 11:16-19; 13:3-8, 33, 47-50; 18:12-14.

11 యేసు తరచూ దృష్టాంతాలు, చిన్నకథలు ఉపయోగించి నైతిక లేదా ఆధ్యాత్మిక సత్యాలను బోధించాడు. గూఢార్థ తలంపుల కంటే కథలను సులభంగా అర్థంచేసుకొని గుర్తుంచుకోవచ్చు కాబట్టి, యేసు బోధలు భద్రంగా నిలిచి ఉండడానికి దృష్టాంతాలు దోహదపడ్డాయి. అనేక దృష్టాంతాల్లో, త్వరగా మరచిపోలేని విధంగా యేసు తన తండ్రి గురించి వివరించాడు. ఉదాహరణకు, తప్పిపోయిన కుమారుని దృష్టాంతంలోని అంశాన్ని అంటే దారితప్పిన వ్యక్తి నిజమైన పశ్చాత్తాపం చూపినప్పుడు యెహోవా అతనిపై కనికరపడి వాత్సల్యపూరితంగా అతణ్ణి తిరిగి అంగీకరిస్తాడని ఎవరు మాత్రం అర్థంచేసుకోలేరు?—లూకా 15:11-32.

12.(ఎ)యేసు తన బోధలో ఏ విధంగా ప్రశ్నలు ఉపయోగించాడు? (బి) యేసు తన అధికారాన్ని ప్రశ్నించిన వారి నోరు ఎలా మూయించాడు?

12 ప్రశ్నలను నైపుణ్యంగా ఉపయోగించడం. శ్రోతలు తమ సొంత నిర్ణయాలకు వచ్చేలా, తమ ఉద్దేశాలను పరిశీలించుకొనేలా లేదా తీర్మానాలు చేసుకునేలా చేయడానికి యేసు ప్రశ్నలు ఉపయోగించాడు. (మత్తయి 12:24-30; 17:24-27; 22:41-46) ఆయనకు దేవుడిచ్చిన అధికారం ఉందా అని మతనాయకులు ప్రశ్నించినప్పుడు, జవాబుగా యేసు వారినిలా అడిగాడు: “యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా?” ఆ ప్రశ్నకు వారు నిర్ఘాంతపోయి, ‘మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయన—ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును; మనుష్యులవలన కలిగినదని చెప్పుదుమా, అందరు యోహాను నిజముగా ప్రవక్తయని యెంచిరి కాబట్టి మనకు ప్రజల భయమున్నది’ అని తమలోతాము తర్కించుకొని చివరకు, “ఆ సంగతి మాకు తెలియదు” అని ఉత్తరమిచ్చారు. (మార్కు 11:27-33; మత్తయి 21:23-27) యేసు చిన్న ప్రశ్నతో వారినోరు కట్టేసి వారి హృదయాల్లోవున్న కపటం బయటపెట్టాడు.

13-15.పొరుగువాడైన సమరయుని దృష్టాంతం యేసు జ్ఞానాన్ని ఎలా ప్రతిబింబించింది?

13 యేసు కొన్నిసార్లు తన ఉపమానాల్లో ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు చొప్పించే పద్ధతులను ఉపయోగించాడు. నిత్యజీవం పొందడానికి ఏమి అవసరమని ఒక యూదా ధర్మశాస్త్రోపదేశకుడు యేసును అడిగినప్పుడు, దేవుణ్ణి, పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రాన్ని యేసు సూచించాడు. తాను నీతిమంతుడనని నిరూపించుకోవాలనే కోరికతో అతను, ‘నా పొరుగువాడెవడు?’ అని అడిగాడు. యేసు ఒక కథ చెప్పడం ద్వారా దానికి జవాబిచ్చాడు. ఒక యూదుడు ఒంటరిగా ప్రయాణిస్తుండగా దొంగలు దాడిచేసి అతన్ని కొరప్రాణంతో వదిలివెళ్లారు. ఆ దారిలోనే ఇద్దరు యూదులు మొదట ఒక యాజకుడు ఆ తర్వాత ఒక లేవీయుడు ప్రయాణిస్తూవచ్చారు. ఆ ఇద్దరూ అతణ్ణి పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ దారిలోనే ఒక సమరయుడు వచ్చాడు. ఇతడు కనికరపడి, అతని గాయాలకు మెల్లగా కట్లుకట్టి, అతను కోలుకోగలిగేలా ప్రేమపూర్వకంగా ఒక పూటకూళ్లవాని ఇంటికి భద్రంగా చేర్చాడు. ఆ కథ ముగిస్తూ, యేసు తన దగ్గరకొచ్చిన వ్యక్తిని ఇలా అడిగాడు: “ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది?” అందుకతడు, “అతనిమీద జాలిపడినవాడే” అని చెప్పక తప్పలేదు.—లూకా 10:25-37.

14 ఆ దృష్టాంతం యేసు జ్ఞానాన్నెలా ప్రతిబింబించింది? యేసు కాలంలో యూదులు “పొరుగువాడు” అనే మాటను కేవలం తమ ఆచారాలు పాటించిన వారికే అన్వయించేవారు కానీ సమరయులకు అన్వయించేవారు కాదు. (యోహాను 4:9) గాయపడ్డవాడు సమరయుడని సహాయం చేసినవాడు యూదుడని యేసు కథ చెప్పివుంటే అది వివక్షను తొలగించివుండేదా? యేసు జ్ఞానయుక్తంగా, సమరయుడు యూదునిపై దయార్ద్రహృదయంతో శ్రద్ధచూపాడన్నట్లుగా కథ అల్లాడు. అలాగే కథ చివర్లో యేసువేసిన ప్రశ్న కూడా గమనించండి. ఆయన “పొరుగువాడు” అనే పదభావాన్ని మరో కోణం నుండి చూపించాడు. నిజం చెప్పాలంటే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఇలా ప్రశ్నించాడు: ‘నేను ఎవరిని నా పొరుగువారిగా భావించి ప్రేమ చూపించాలి?’ కానీ యేసు ఇలా అడిగాడు: “ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది?” యేసు, గాయపడి దయ పొందిన వ్యక్తిపై కాదుగానీ దయ చూపిన వ్యక్తిపై అంటే సమరయునిపై దృష్టి నిలిపాడు. నిజమైన పొరుగువాడు ఇతరుల జాతి నేపథ్యమేదైనా వారిపట్ల ప్రేమ చూపడానికి చొరవ తీసుకుంటాడు. యేసు తన అంశాన్ని ఇంతకంటే ప్రభావితంగా వివరించి ఉండగలిగేవాడు కాదు.

15 యేసు “బోధకు” ప్రజలు ఆశ్చర్యపోయి ఆయనవైపు ఆకర్షించబడ్డారంటే అందులో వింతేమన్నా ఉందా? (మత్తయి 7:28, 29) ఒక సందర్భంలో, “బహు జనులు” ఆహారం కూడా తినకుండా మూడు రోజులపాటు ఆయన దగ్గరే ఉండిపోయారు.—మార్కు 8:1, 2.

ఆయన జీవన విధానం

16.తాను దేవుని జ్ఞానంతో నిర్దేశించబడ్డాడని యేసు ఏ విధంగా ‘ఆచరణాత్మక రుజువునిచ్చాడు’?

16 యెహోవా జ్ఞానాన్ని యేసు ప్రతిబింబించిన మూడవ రంగం ఆయన జీవన విధానం. జ్ఞానం ఆచరణాత్మకమైనది; అది పనిచేస్తుంది. ‘మీలో జ్ఞానము గలవాడెవడు?’ అని శిష్యుడైన యాకోబు ప్రశ్నించాడు. ఆ తర్వాత తన ప్రశ్నకు తానే జవాబిస్తూ ఆయనిలా అన్నాడు: “అతని యోగ్య ప్రవర్తన దానికి ఆచరణాత్మక రుజువునివ్వాలి.” (యాకోబు 3:13, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) యేసు ప్రవర్తించిన విధానం ఆయన దేవుని జ్ఞానంతో నిర్దేశించబడ్డాడనే ‘ఆచరణాత్మక రుజువునిచ్చింది.’ ఆయన ఇటు తన జీవన విధానంలో అటు ఇతరులతో తన వ్యవహారాల్లో యుక్తాయుక్త పరిజ్ఞానమెలా ప్రదర్శించాడో మనం పరిశీలిద్దాం.

17.యేసు తన జీవితంలో పరిపూర్ణ సమతుల్యం కలిగి ఉండేవాడనడానికి ఎలాంటి సూచనలున్నాయి?

17 యుక్తాయుక్త పరిజ్ఞానం లేనివారు తరచూ విపరీతాలకు వెళ్లడాన్ని మీరు గమనించారా? అవును, సమతుల్యంగా ఉండాలంటే దానికి జ్ఞానం అవసరం. దేవుని జ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ యేసు పరిపూర్ణ సమతుల్యత కలిగివుండేవాడు. అన్నింటికంటే మిన్నగా, ఆయన తన జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమ స్థానమిచ్చాడు. సువార్త ప్రకటనా పనిలో ఆయన పూర్తిగా నిమగ్నమైపోయి ఉండేవాడు. “ఇందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితిని” అని ఆయన అన్నాడు. (మార్కు 1:38) నిజానికి, వస్తుపర విషయాలు ఆయనకు ప్రాముఖ్యం కాదు; ఆయనకు వస్తుపరంగా ఎక్కువేమీ లేవన్నట్లే కనిపిస్తోంది. (మత్తయి 8:20) అంతమాత్రాన, ఆయన సన్యాసిగా జీవించలేదు. ‘సంతోషంగల దేవుడైన’ తన తండ్రివలెనే ఆయన ఆనందంగా ఉంటూ ఇతరుల ఆనందాన్ని ఇనుమడింపజేశాడు. (1 తిమోతి 1:11; 6:15, NW) సాధారణంగా గానాభజానాలూ, ఆనందోత్సాహాలు ఉండే సమయమైన వివాహ వేడుకకు ఆయనొకసారి హాజరైనప్పుడు, ఆయన అక్కడికి ఆ సందర్భపు ఉత్సాహం తగ్గించేందుకు వెళ్ళలేదు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు, ఆయన నీటిని, “నరుల హృదయమును సంతోషపెట్టు” చక్కని ద్రాక్షారసంగా మార్చాడు. (కీర్తన 104:15; యోహాను 2:1-11) భోజనానికి రమ్మని ఇవ్వబడిన అనేక ఆహ్వానాలను యేసు అంగీకరించి, తరచూ అలాంటి సందర్భాలను బోధించడానికి ఉపయోగించుకున్నాడు.—లూకా 10:38-42; 14:1-6.

18.యేసు తన శిష్యులతో వ్యవహరించేటప్పుడు దోషరహిత యుక్తాయుక్త పరిజ్ఞానాన్ని ఎలా కనబరిచాడు?

18 యేసు ఇతరులతో వ్యవహరించేటప్పుడు దోషంలేని యుక్తాయుక్త పరిజ్ఞానాన్ని కనబరిచాడు. మానవ స్వభావం గురించి తనకున్న అంతర్దృష్టి మూలంగా ఆయన తన శిష్యులకు సంబంధించి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోగలిగాడు. వారు పరిపూర్ణులు కారని ఆయనకు బాగా తెలుసు. అయినప్పటికీ, ఆయన వారి మంచి లక్షణాలను గుర్తించాడు. యెహోవా ఆకర్షించిన ఈ మనుష్యుల్లోవున్న అంతర్నిహిత శక్తిని ఆయన చూశాడు. (యోహాను 6:44) వారిలో లోపాలు ఉన్నప్పటికీ వారిని నమ్మడానికి ఆయన సుముఖత చూపాడు. ఆ నమ్మకాన్ని ప్రదర్శిస్తూ, ఆయన తన శిష్యులకు బరువైన బాధ్యతను అప్పగించాడు. సువార్త ప్రకటించమని వారికి ఆజ్ఞాపించడమే కాదు ఆ ఆజ్ఞను నెరవేర్చే సామర్థ్యం వారిలో ఉందని కూడా ఆయన నమ్మాడు. (మత్తయి 28:19, 20) ఆయన చేయమని వారికాజ్ఞాపించిన పనిని వారు నమ్మకంగా చేశారని అపొస్తలుల కార్యముల పుస్తకం రుజువుచేస్తోంది. (అపొస్తలుల కార్యములు 2:41, 42; 4:33; 5:27-32) కాబట్టి, వారిని నమ్మడంలో యేసు జ్ఞానయుక్తంగా ఉన్నాడని స్పష్టమవుతోంది.

19.తను ‘సాత్వికుడను దీనమనస్సు గలవాడను’ అని యేసు ఎలా ప్రదర్శించాడు?

19 మనం 20వ అధ్యాయంలో గమనించినట్లుగా బైబిలు, జ్ఞానాన్ని వినయంతో, సాత్వికంతో ముడిపెడుతోంది. ఈ విషయంలో యెహోవా శ్రేష్ఠమైన మాదిరి ఉంచాడనుకోండి. కాని యేసు మాటేమిటి? యేసు తన శిష్యులతో వ్యవహరించేటప్పుడు చూపిన వినయం, మన హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది. పరిపూర్ణ మానవునిగా ఆయన వారికంటే ఉన్నతుడు. అయినప్పటికీ, ఆయన తన శిష్యులను చిన్నచూపు చూడలేదు. తాము అల్పులమని, అసమర్థులమని వారు భావించేలా చేయడానికి ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదు. దానికి భిన్నంగా, ఆయన వారి పరిమితులను అర్థంచేసుకొని వారి లోపాలను ఓపికగా భరించాడు. (మార్కు 14:34-38; యోహాను 16:12) పిల్లలు సైతం యేసు దగ్గరకు రావడానికి ఇష్టపడ్డారన్నది గమనార్హమైన విషయం కాదా? ఆయన ‘సాత్వికుడు దీనమనస్సు గలవాడు’ అని వారు గ్రహించారు కాబట్టే వారాయన వైపుకు ఆకర్షించబడ్డారు.—మత్తయి 11:29; మార్కు 10:13-16.

20.దయ్యంపట్టిన కూతురున్న అన్యురాలైన స్త్రీతో వ్యవహరించడంలో యేసు సహేతుకతను ఎలా ప్రదర్శించాడు?

20 మరో ప్రాముఖ్యమైన రీతిలో కూడా యేసు దైవిక వినయాన్ని ప్రదర్శించాడు. కనికరం మూలంగా సహేతుకంగా లేదా పరిస్థితులకు తగిన విధంగా ఉండడం సముచితమైనప్పుడు ఆయన అలాగే ఉన్నాడు. ఉదాహరణకు, దయ్యంపట్టి బహు బాధపడుతున్న తన కూతుర్ని బాగుచేయమని అన్యురాలైన ఓ స్త్రీ ఆయనను బ్రతిమాలిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. మూడు విభిన్న రీతుల్లో యేసు తానామెకు సహాయం చేయబోవడం లేదని తొలుత సూచించాడు, అవేమిటంటే మొదటిది, ఆమెకు జవాబివ్వడానికి నిరాకరించడం; రెండవది, తాను యూదుల కోసమే గానీ అన్యుల కోసం పంపబడలేదని సూటిగా చెప్పడం; మూడవది, అదే విషయాన్ని సౌమ్యంగా తెలియజేసే ఉపమానాన్ని చెప్పడం. అయినా, అసాధారణ విశ్వాసానికి రుజువునిస్తూ ఆ స్త్రీ పట్టినపట్టు విడువలేదు. ఈ అసాధారణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొంటూ యేసు ఎలా ప్రతిస్పందించాడు? తానేమి చేయనని చెప్పాడో సరిగ్గా అదే చేశాడు. ఆయన ఆ స్త్రీ కుమార్తెను బాగుచేశాడు. (మత్తయి 15:21-28) అది అసాధారణమైన వినయం, కాదంటారా? నిజమైన జ్ఞానానికి వినయం ఆధారమని గుర్తుంచుకోండి.

21.యేసు వ్యక్తిత్వాన్ని, సంభాషణను, విధానాలను అనుకరించడానికి మనమెందుకు కృషిచేయాలి?

21 జీవించిన వారిలోకెల్లా జ్ఞానవంతుడైన వాని మాటలను, క్రియలను సువార్తలు మనకు వెల్లడిచేసినందుకు మనమెంత కృతజ్ఞతతో ఉండవచ్చో గదా! యేసు తన తండ్రి పరిపూర్ణ ప్రతిబింబమని మనం గుర్తుంచుకుందాం. యేసు వ్యక్తిత్వాన్ని, సంభాషణను, విధానాలను అనుకరించడం ద్వారా మనం పైనుండి వచ్చు జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. తర్వాతి అధ్యాయంలో, దేవుని జ్ఞానాన్ని మనం మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం.

^ బైబిలు కాలాల్లో, ఇళ్లు నిర్మించడానికీ, కర్ర సామాను చేయడానికీ, పొలం పనిముట్లు చేయడానికీ వడ్రంగులు పనిచేసేవారు. సా.శ. రెండవ శతాబ్దపు జస్టిన్‌ మార్టిర్‌ యేసు గురించి ఇలా వ్రాశాడు: “ప్రజలమధ్య జీవించినప్పుడు ఆయన వాడుకచొప్పున నాగళ్లు, కాడిమానులు చేస్తూ ఉండేవాడు.”

^ ‘చింతించడం’ అని అనువదించబడిన గ్రీకు క్రియాపదానికి “పరధ్యాన మనస్సుతో ఉండడం” అని అర్థం. మత్తయి 6:25లో ఉపయోగించబడినట్లుగా, జీవితానందాన్ని పాడుచేస్తూ మనస్సును పరధ్యానంలో పడవేసే లేదా మనస్సును విడదీసే వ్యథాభరిత భయాన్ని ఆది సూచిస్తోంది.

^ వాస్తవానికి, మితిమీరిన కలత, ఒత్తిడి హృదయ సంబంధ వ్యాధికి, జీవితకాలాన్ని తగ్గించే అనేక ఇతర రుగ్మతలకు మనల్ని గురిచేసే ప్రమాదం ఉందని విజ్ఞానశాస్త్ర అధ్యయనాలు వెల్లడించాయి.