కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 23

“ఆయనే మొదట మనలను ప్రేమించెను”

“ఆయనే మొదట మనలను ప్రేమించెను”

1-3.యేసు మరణాన్ని, చరిత్రలో విశేషమైనదిగా చేసిన కొన్ని వాస్తవాలు ఏమిటి?

 దాదాపు 2,000 సంవత్సరాల క్రితం వసంత ఋతువులో ఒక రోజు ఓ అమాయకుడు న్యాయవిచారణకు గురై తానెన్నడూ చేయని నేరాలకు అపరాధిగా తీర్పుతీర్చబడి, ఆ తర్వాత క్రూరంగా చంపబడ్డాడు. అది చరిత్రలో మొట్టమొదటిగా విధించబడిన క్రూరమైన, అన్యాయమైన శిక్షేమీ కాదు; విచారకరంగా అది చివరిదీ కాదు. అయినప్పటికీ, ఆయన మరణం విశేషమైనది.

2 ఆయన తన చివరి ఘడియల్లో తీవ్ర యాతన అనుభవిస్తుండగా, ఆకాశం ఆ సంఘటన ప్రాముఖ్యతను సూచించింది. అది మధ్యాహ్నమే అయినా, అకస్మాత్తుగా ఆ ప్రాంతమంతా చీకటి కమ్మింది. ఒక చరిత్రకారుడు తెలియజేసినట్లుగా, ‘సూర్యుడు అదృశ్యమయ్యాడు.’ (లూకా 23:44, 45) ఆ పిమ్మట ఆయన తన చివరిశ్వాస విడవడానికి కాస్త ముందు ఈ మరువరాని మాటలు పలికాడు: “సమాప్తమైనది.” నిజానికి ఆయన తన ప్రాణం అప్పగించడం ద్వారా, ఒక అద్భుతమైన కార్యం నెరవేర్చాడు. ఆయన త్యాగం ఏ మనిషీ ఎన్నడూ చేయని అతిగొప్ప ప్రేమ కార్యం.—యోహాను 15:13; 19:30.

3 ఆ మహామనీషే యేసుక్రీస్తు. సా.శ. 33 నీసాను 14న ఆ చీకటి రోజున ఆయన పడినబాధ, మరణం చిరస్మరణీయం. అయితే ఒక ప్రాముఖ్యమైన వాస్తవం తరచూ అలక్ష్యం చేయబడుతోంది. యేసు తీవ్రబాధకు గురైనా మరోవ్యక్తి అంతకంటే ఎక్కువ బాధననుభవించాడు. నిజానికి, ఆ రోజున ఆ మరోవ్యక్తి విశ్వంలో ఎవరూ చేయని అపూర్వ త్యాగం చేశాడు అంటే ఎంతో గొప్ప ప్రేమ కార్యాన్ని జరిగించాడు. ఆ కార్యమేమిటి? దాని జవాబు అత్యంత ప్రాముఖ్యమైన అంశానికి అంటే యెహోవా ప్రేమకు సరైన ఉపోద్ఘాతాన్నిస్తుంది.

అతిగొప్ప ప్రేమ కార్యం

4.యేసు సాధారణ వ్యక్తి కాదని ఓ రోమా సైనికుడు ఎలా తెలుసుకున్నాడు, ఆ సైనికుడు చివరికి ఏ ముగింపుకొచ్చాడు?

4 యేసు మరణశిక్షను పర్యవేక్షించిన రోమా శతాధిపతి యేసు మరణానికి ముందు ఏర్పడిన చీకటిని, దాని తర్వాత సంభవించిన భీకర భూకంపాన్ని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. “నిజముగా ఈయన దేవుని కుమారుడు” అని ఆయన అన్నాడు. (మత్తయి 27:54) నిస్సందేహంగా, యేసు సాధారణ వ్యక్తి కాదు. ఆ సైనికుడు సర్వోన్నత దేవుని అద్వితీయకుమారునికి విధించబడిన మరణశిక్షను అమలు చేయడానికి తోడ్పడ్డాడు! ఈ కుమారుడు తన తండ్రికి ఎంత ప్రియమైనవాడు?

5.పరలోకంలో యెహోవా ఆయన కుమారుడూ కలిసి గడిపిన అపరిమితమైన కాలాన్ని సోదాహరణంగా ఎలా చెప్పవచ్చు?

5 బైబిలు యేసును, “సర్వసృష్టికి ఆదిసంభూతుడు” అని పిలుస్తోంది. (కొలొస్సయులు 1:15) కాస్త ఆలోచించండి​—⁠యెహోవా కుమారుడు భౌతిక విశ్వానికి ముందే ఉనికిలో ఉన్నాడు. ఆ తండ్రీ కుమారులు ఎంతకాలం కలిసివున్నారు? కొందరు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ఈ విశ్వం వయస్సు 13 శతకోట్ల సంవత్సరాలు. అంతకాలాన్ని మీరు కనీసం ఊహించగలరా? శాస్త్రజ్ఞులు అంచనావేసిన ఈ విశ్వ వయస్సును ప్రజలు అర్థంచేసుకోవడానికి సహాయం చేసేందుకు, ఒక నక్షత్రశాలలో 110 మీటర్ల పొడవైన ఒక కాలవృత్తాంత రేఖ ఏర్పాటు చేయబడింది. సందర్శకులు ఆ రేఖ వెంబడి నడిచినప్పుడు వారి ప్రతి అడుగు విశ్వ వయస్సులో దాదాపు 7 కోట్ల 50 లక్షల సంవత్సరాలను సూచిస్తుంది. ఆ రేఖ చివర, మానవ చరిత్రంతా కలిపి మనిషి వెంట్రుక మందంలో గీయబడిన ఒక సన్నని గీతగా సూచించబడింది. ఒకవేళ ఈ అంచనా సరైనప్పటికీ, యెహోవా కుమారుని జీవితకాల నిడివిని సూచించడానికి ఆ కాలవృత్తాంత రేఖ యొక్క మొత్తం పొడవు కూడా సరిపోదు. ఆ యుగాలన్నింటిలో ఆయన ఏమి చేశాడు?

6.(ఎ)యెహోవా కుమారుడు తన మానవపూర్వ ఉనికిలో ఏ పనిలో నిమగ్నమై ఉన్నాడు? (బి) యెహోవాకు, ఆయన కుమారునికి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది?

6 ఆ కుమారుడు తన తండ్రి దగ్గర “ప్రధానశిల్పి”గా సంతోషంగా సేవ చేశాడు. (సామెతలు 8:30) బైబిలు ఇలా చెబుతోంది: “కలిగియున్న దేదియు ఆయన [కుమారుడు] లేకుండ కలుగలేదు.” (యోహాను 1:3) కాబట్టి మిగిలిన సమస్తాన్ని ఉనికిలోకి తీసుకు రావడానికి యెహోవా ఆయన కుమారుడు కలిసి పనిచేశారు. వారు ఎంత ఉత్కంఠభరితమైన, సంతోషభరితమైన సమయాలు గడిపారో గదా! ఇక తండ్రీ బిడ్డలకు, తల్లీ బిడ్డలకు మధ్యవుండే ప్రేమ ఆశ్చర్యపడేంత బలంగా ఉంటుందని చాలామంది అంగీకరిస్తారు. అంతేకాదు ప్రేమ “పరిపూర్ణతకు అనుబంధమైనది.” (కొలొస్సయులు 3:14) అందువల్ల, అంతటి అపార కాలనిడివిలో నెలకొన్న అనుబంధ బల బాహుళ్యతను గ్రహించాలంటే మనలో ఎవరికి సాధ్యమవుతుంది? ఖచ్చితంగా యెహోవా దేవుడు ఆయన కుమారుడు అత్యంత బలమైన అపూర్వ అనుబంధంలో ఐక్యంగా ఉన్నారు.

7.యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, యెహోవా తన కుమారుని గురించి తన భావాలను ఎలా వ్యక్తపరిచాడు?

7 అయినప్పటికీ, మానవ శిశువుగా జన్మించడానికి ఆ తండ్రి తన కుమారుణ్ణి భూమికి పంపించాడు. అలా చేయడమంటే పరలోకంలో తన ప్రియకుమారుని సన్నిహిత సాంగత్యాన్ని కొన్ని దశాబ్దాలపాటు వదులుకోవడమని అర్థం. యేసు పరిపూర్ణ మానవునిగా ఎదుగుతున్నప్పుడు పరలోకం నుండి ఆయన మిక్కిలి శ్రద్ధతో పరికించాడు. రమారమి 30 సంవత్సరాల వయస్సులో యేసు బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన గురించి యెహోవా ఎలా భావించి ఉంటాడో మనం ఊహించనక్కర్లేదు. పరలోకం నుండి తండ్రి స్వయంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.” (మత్తయి 3:17) ప్రవచించబడిన సమస్తాన్నీ, ఆయన నుండి అపేక్షించిన యావత్తును యేసు నమ్మకంగా నెరవేర్చడం చూసి ఆయన తండ్రి ఎంతో మురిసిపోయి ఉంటాడు.—యోహాను 5:36; 17:4.

8, 9.(ఎ)సా.శ. 33 నీసాను 14న యేసు ఏమేమి అనుభవించాడు, వాటినిబట్టి ఆయన పరలోకపు తండ్రి ఎలా ప్రభావితుడయ్యాడు? (బి) తన కుమారుడు బాధపడి మరణించడానికి యెహోవా ఎందుకు అనుమతించాడు?

8 అయితే, సా.శ. 33 నీసాను 14న యెహోవా ఎలా భావించాడు? యేసు అప్పగించబడి, రాత్రి సమయంలో ఒక గుంపుగా వచ్చిన మూకచేత చెరపట్టబడినప్పుడు ఆయనెలా భావించాడు? యేసు శిష్యులు ఆయనను విడిచి పారిపోయినప్పుడు, ఆయనపై అన్యాయమైన విచారణ జరిపించబడినప్పుడు? ఆయనను ఎగతాళిచేసి, మీద ఉమ్మివేసి, పిడికిళ్లతో గుద్దినప్పుడు? ఆయన వీపు చిట్లి పీలికలయ్యేలా ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు? మ్రానుకువేసి చేతుల్లో పాదాల్లో మేకులు దిగ్గొట్టి, ప్రజలు దూషిస్తుండగా ఆయనను వ్రేలాడదీసినప్పుడు? తన కుమారుడు విపరీత యాతనతో బిగ్గరగా కేకవేసినప్పుడు ఆ తండ్రి ఎలా భావించాడు? సృష్ట్యారంభం నుండి ఉన్న యేసు మొదటిసారిగా తన తుదిశ్వాస విడిచినప్పుడు, తన ప్రియకుమారుడిక ఉనికిలో లేకుండా పోయినప్పుడు యెహోవా ఎలా భావించాడు?—మత్తయి 26:14-16, 46, 47, 56, 59, 67; 27:38-44, 46; యోహాను 19:1.

‘దేవుడు తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను’

9 మనకు మాటలు చాలవు. యెహోవాకు భావాలున్నాయి కాబట్టి, తన కుమారుడు మరణించినప్పుడు ఆయన అనుభవించిన వేదనను మన మాటల్లో వర్ణించడం అసాధ్యం. కానీ అలా జరిగేందుకు యెహోవా అనుమతించడంలోని ఉద్దేశాన్ని వ్యక్తం చేయడం సాధ్యమే. ఆ తండ్రి తనకంత బాధ కలిగేలా ఎందుకు అనుమతించుకున్నాడు? దానికి గల కారణం, సూక్ష్మరూపంలో ఉన్న సువార్త అని పిలువబడిన యోహాను 3:16​లో ఉంది.ఆ వాక్యం ఇలా చెబుతోంది: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” దీన్నిబట్టి చూస్తే ప్రేమ మూలంగానే యెహోవా అవన్నీ అనుమతించాడని స్పష్టమవుతోంది. యెహోవా ఇచ్చిన బహుమానం అంటే మనకోసం బాధపడి మరణించడానికి తన కుమారుణ్ణి పంపించడం అత్యంత గొప్ప ప్రేమపూర్వక చర్య.

దేవుని ప్రేమ నిర్వచించబడింది

10.మానవులకు దేని అవసరత ఉంది, “ప్రేమ” అనే మాట అర్థానికి ఏమి జరిగింది?

10 “ప్రేమ” అనే ఈ మాటకు అర్థమేమిటి? ప్రేమ మానవులకున్న అతిగొప్ప అవసరత అని వర్ణించబడుతోంది. పుట్టింది మొదలు చనిపోయే వరకు మనుష్యులు ప్రేమకోసం తాపత్రయపడతారు, దాని స్నేహంలో వికసిస్తారు, దానికోసం పరితపిస్తారు, అది లేకపోతే మరణిస్తారు. అయినాసరే, ఆశ్చర్యకరంగా ప్రేమను నిర్వచించడం కష్టం. నిజమే ప్రేమ గురించి ప్రజలు చాలా మాట్లాడతారు. దాని సంబంధిత పుస్తకాల, పాటల, పద్యాల ప్రవాహానికి అంతులేదు. అన్ని సందర్భాల్లో వాటి ఫలితాలు ప్రేమార్థాన్ని స్పష్టంచేయవు. వాస్తవానికి, ఆ పదం ఎంత విస్తృతంగా వాడబడుతోందంటే దాని నిజమైన భావం మునుపటికంటే మరెక్కువగా అస్పష్టమైపోతున్నట్టు అనిపిస్తోంది.

11, 12.(ఎ)ప్రేమ గురించి మనం అధికంగా ఎక్కడ నేర్చుకోగలము, అక్కడే ఎందుకు? (బి) ప్రాచీన గ్రీకు భాషలో ఏయే విధాల ప్రేమ నిర్దిష్టంగా పేర్కొనబడింది, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “ప్రేమను” సూచించేందుకు అతి తరచుగా ఏ పదం ఉపయోగించబడింది? (అధస్సూచి కూడా చూడండి.) (సి) అగాపే అంటే ఏమిటి?

11 అయితే బైబిలు ప్రేమ గురించి స్పష్టంగా బోధిస్తోంది. వైన్‌ యొక్క ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ ఇలా చెబుతోంది: “ప్రేమ, అది పురికొల్పే క్రియలతో మాత్రమే స్పష్టమవుతుంది.” యెహోవా కార్యాల బైబిలు వృత్తాంతం ఆయన ప్రేమ గురించి—తన ప్రాణులపట్ల ఆయనకున్న దయార్ద్ర అనురాగం గురించి మనకు అమితంగా బోధిస్తోంది. ఉదాహరణకు, ఇంతకు ముందు వర్ణించబడిన యెహోవా యొక్క అత్యంత గొప్ప ప్రేమపూర్వక చర్యకంటే వేరే ఏ చర్య ఈ లక్షణం గురించి ఎక్కువ వెల్లడిచేయగలదు? తర్వాతి అధ్యాయాల్లో, కార్యరూపంలో ఉన్న యెహోవా ప్రేమకు అనేక ఇతర ఉదాహరణలు మనం చూస్తాం. అంతేగాక, “ప్రేమకు” బైబిల్లో ఉపయోగించబడిన ఆదిమ పదాలనుండి మనం కొంత అంతర్దృష్టిని పొందవచ్చు. ప్రాచీన గ్రీకు భాషలో, “ప్రేమకు” నాలుగు పదాలున్నాయి. * వీటిలో క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో అతి తరచుగా ఉపయోగించబడిన పదం అగాపే. ఒక బైబిలు నిఘంటువు దీనిని “ప్రేమను వర్ణించడానికి ఈ పదం ఊహకందనంతటి గొప్ప బలంగల పదం” అని వర్ణిస్తోంది. ఎందుకు వర్ణిస్తోంది?

12 అగాపే అనే పదం సూత్రబద్ధమైన ప్రేమను సూచిస్తుంది. కాబట్టి అది వేరొక వ్యక్తి చేసినదానికి కేవలం భావావేశంతో ప్రతిస్పందించడం మాత్రమే కాదు. అది విస్తృత పరిధిలో, ఎంతో ఆలోచనతో, ఉద్దేశపూర్వకంగా చూపించబడుతుంది. అన్నింటికంటే ఎక్కువగా, అగాపే పూర్తిగా నిస్వార్థమైనది. ఉదాహరణకు, మరొకసారి యోహాను 3:16​ను చూడండి. దేవుడు తన అద్వితీయకుమారుడ్ని ఇచ్చేంతగా ప్రేమించిన “లోకము” ఏది? అది విమోచనార్హమైన మానవుల లోకము. జీవితంలో పాప విధానాన్ని వెంబడిస్తున్న అనేకమంది ప్రజలు దానిలో భాగమై ఉన్నారు. యెహోవా తాను నమ్మకమైన అబ్రాహామును ప్రేమించిన విధంగా ఈ లోకంలో ప్రతీ ఒక్కరిని తన వ్యక్తిగత స్నేహితునిగా ప్రేమిస్తాడా? (యాకోబు 2:23) లేదు, అయితే యెహోవా తాను అధిక మూల్యం చెల్లించవలసివచ్చినా, ప్రేమతో తన మంచితనాన్ని అందరికీ విస్తరింపజేస్తున్నాడు. అందరూ పశ్చాత్తాపపడి తమ మార్గాలను మార్చుకోవాలని ఆయన ఇచ్ఛయిస్తున్నాడు. (2 పేతురు 3:9) అనేకులు అలా చేస్తున్నారు. అలాంటి వారిని ఆయన సంతోషంగా తన స్నేహితులుగా స్వీకరిస్తున్నాడు.

13, 14.అగాపేలో తరచూ అప్యాయతా అనురూగం ఇమిడివుంటాయని ఏది చూపిస్తోంది?

13 అయితే కొందరికి అగాపే గురించి తప్పుడు భావన ఉంది. అది భావశూన్యమైన, కేవలం తత్వసంబంధమైన ప్రేమ అని వారు భావిస్తారు. వాస్తవానికి అగాపేలో ఆప్యాయతతో కూడిన వ్యక్తిగత అనురాగం ఇమిడివుంది. ఉదాహరణకు, “తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు” అని యేసు అనప్పుడు అగాపేకు సారూప్య పదాన్ని ఆయన ఉపయోగించాడు. (యోహాను 3:35) ఆ ప్రేమలో ఆప్యాయతతో కూడిన అనురాగం లేదా? యేసు కూడా యోహాను 5:20​లో “తండ్రి కుమారుని ప్రేమించుచు[న్నాడు]” అన్నప్పుడు ఫిలియో అనేదానికి సారూప్య పదాన్ని ఉపయోగించాడని గమనించండి. యెహోవా ప్రేమలో తరచూ వాత్సల్యపూరిత అనురాగం ఉంటుంది. అయితే, ఆయన ప్రేమ కేవలం భావానుబంధంతో ఎన్నడూ ప్రభావితం కాదు. అది అన్ని సందర్భాల్లో ఆయన జ్ఞానయుక్తమైన, న్యాయబద్ధమైన సూత్రాలచే నిర్దేశించబడుతుంది.

14 మనం చూసినట్లుగా, యెహోవా లక్షణాలన్నీ ఉన్నతమైనవి, పరిపూర్ణమైనవి, ఆకర్షణీయమైనవి. కానీ ఆ లక్షణాలన్నింటిలోకి ప్రేమ అత్యంత ప్రీతికరమైనది. అదితప్ప ఇంకేదీ అంత బలంగా మనలను ఆయన వద్దకు ఆకర్షించదు. సంతోషదాయకంగా, ప్రేమ ఆయన ప్రధాన లక్షణం కూడా. అది మనకెలా తెలుసు?

“దేవుడు ప్రేమాస్వరూపి”

15.యెహోవా ప్రేమ గుణం గురించి బైబిలు ఏ మాట చెబుతోంది, ఆ మాట ఏ విధంగా అసమానమైనది? (అధస్సూచి కూడా చూడండి.)

15 యెహోవా ఇతర ప్రధాన గుణాల గురించి ఎన్నడూ చెప్పని ఒక విశేషమైన విషయాన్ని బైబిలు ప్రేమకు సంబంధించి చెబుతోంది. దేవుడు శక్తి అని, దేవుడు న్యాయం అని, చివరికి దేవుడు జ్ఞానం అని కూడా లేఖనాలు చెప్పడం లేదు. ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయి, వాటికి ఆయనే మూలాధారం, ఆ మూడింటికి సంబంధించి ఆయన సాటిలేనివాడు. అయితే నాల్గవ లక్షణం గురించి మరింత ప్రగాఢమైన విషయం, ఇలా చెప్పబడుతోంది: “దేవుడు ప్రేమాస్వరూపి.” * (1 యోహాను 4:8) దాని అర్థమేమిటి?

16-18.(ఎ)“దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు ఎందుకు చెబుతోంది? (బి) భూమ్మీది సకల జీవరాసుల్లో యెహోవా ప్రేమ లక్షణానికి మనిషే ఎందుకు సరైన చిహ్నం?

16 “దేవుడు ప్రేమతో సమానం” అన్నట్లు, “దేవుడు ప్రేమాస్వరూపి” అనే మాట సాధారణ సమీకరణం కాదు. ఆ మాటను తిరగేసి సరిగ్గా “ప్రేమే దేవుడు” అని మనం చెప్పలేము. యెహోవా ఒక నిగూఢ లక్షణం కంటే ఎంతో ఉన్నతుడు. ఆయన ప్రేమతోపాటు విస్తారమైన అనుభూతులు, విశిష్ట లక్షణాలు గల సంపన్నుడు. అయినప్పటికీ, యెహోవా ప్రేమామయుడు. అందుకే ఈ వచనం గురించి ఒక కోశ గ్రంథం ఇలా చెబుతోంది: “దేవుని సారమే లేదా స్వభావమే ప్రేమ.” దాని గురించి మనమిలా తలంచవచ్చు: యెహోవా శక్తి ఆయన చర్య తీసుకోవడాన్ని సాధ్యపరుస్తుంది. ఆయన న్యాయం, జ్ఞానం ఆయన చర్య తీసుకొనే విధానాన్ని నిర్దేశిస్తాయి. కానీ యెహోవా ప్రేమ, చర్య తీసుకొనేలా ఆయనను ప్రేరేపిస్తుంది. ఆయన తన ఇతర గుణాలను ఉపయోగించే విధానంలో అన్ని సందర్భాల్లో ఆయన ప్రేమ తప్పక ఉంటుంది.

17 మూర్తీభవించిన ప్రేమే యెహోవా అని తరచూ చెప్పబడింది. కాబట్టి సూత్రానుసారమైన ప్రేమ గురించి మనం నేర్చుకోవాలంటే, మనం యెహోవా గురించి తప్పకుండా తెలుసుకోవాలి. నిజమే, ఈ మనోహరమైన లక్షణాన్ని మనం మనుష్యుల్లో కూడా చూడవచ్చు. అయితే అది వారిలో ఎందుకుంది? వారిని సృష్టించే సమయంలో యెహోవా తన కుమారునితో ఈ మాటలు పలికాడని స్పష్టమవుతోంది: “మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము.” (ఆదికాండము 1:26) ఈ భూమ్మీది జీవరాసుల్లో కేవలం స్త్రీపురుషులు మాత్రమే ప్రేమించడానికి ఎంపిక చేసుకొని తద్వారా తమ పరలోకపు తండ్రిని అనుకరించగలరు. యెహోవా తన ప్రధాన లక్షణాలను సూచించడానికి విభిన్న ప్రాణులను ఉపయోగించాడని గుర్తుతెచ్చుకోండి. అయితే, తన ప్రబల లక్షణమైన ప్రేమకు చిహ్నంగా ఆయన భూమ్మీది అత్యున్నత సృష్టికార్యమైన మనిషిని ఎన్నుకున్నాడు.—యెహెజ్కేలు 1:10.

18 మనం నిస్వార్థంగా, సూత్రానుసారంగా ప్రేమించినప్పుడు, మనం యెహోవా ప్రబల లక్షణాన్ని ప్రతిబింబిస్తున్న వారిగా ఉంటాము. అది “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము” అని అపొస్తలుడైన యోహాను వ్రాసినట్లుగా ఉంటుంది. (1 యోహాను 4:19) అయితే ఏయే విధాలుగా యెహోవా మనలను మొదట ప్రేమించాడు?

యెహోవా చొరవ తీసుకున్నాడు

19.యెహోవా సృష్టికార్యంలో ప్రేమ కీలకపాత్ర పోషించిందని ఎందుకు చెప్పవచ్చు?

19 ప్రేమ కొత్తదేమీ కాదు. నిజానికి, సృష్టి మొదలుపెట్టడానికి యెహోవాను ప్రేరేపించినదేమిటి? ఆయనేదో ఒంటరిగా ఉన్నందువల్లో, సహవాసం అవసరమైనందువల్లో కాదు. యెహోవా పరిపూర్ణుడు, తనలోనే సమస్తం ఉన్నవాడు, వేరొకరు తోడ్పడవలసినట్లుగా ఆయనలో ఏ కొరతా లేదు. అయితే, జీవవరాన్ని ప్రశంసించే బుద్ధిసూక్ష్మతగల ప్రాణులతో జీవితపు ఆనందాలు పంచుకొనేలా కోరుకోవడానికి సహజంగానే క్రియాశీలక లక్షణమైన ఆయన ప్రేమ ఆయనను ప్రేరేపించింది. “దేవుని సృష్టికి ఆది” ఆయన అద్వితీయకుమారుడే. (ప్రకటన 3:14) ఆ పిమ్మట దేవదూతలతో మొదలుపెట్టి మిగతావన్నీ ఉనికిలోకి తీసుకురావడానికి ఈ ప్రధాన శిల్పిని యెహోవా ఉపయోగించాడు. (యోబు 38:4, 7; కొలొస్సయులు 1:16) స్వేచ్ఛ, తెలివి, అనుభూతులతో దీవించబడిన ఈ బలమైన ఆత్మసంబంధ ప్రాణులకు పరస్పరమూ, అలాగే అన్నింటికంటే మిన్నగా యెహోవా దేవునితో ప్రేమపూర్వక సంబంధం ఏర్పరచుకొనే అవకాశం ఉంది. (2 కొరింథీయులు 3:17) ఆ విధంగా, వారు మొదట ప్రేమించబడ్డారు కాబట్టే వారూ ప్రేమించారు.

20, 21.ఆదాము హవ్వలు యెహోవా తమను ప్రేమించాడనటానికి ఎలాంటి రుజువును స్వయంగా చూశారు, కానీ వారెలా ప్రతిస్పందించారు?

20 మానవాళి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆరంభం నుండి, ఆదాము హవ్వలు ప్రేమలో మునిగితేలారు. ఏదెనులో తమ పరదైసు గృహంలో ఎటుచూసినా వారు తమపట్ల తండ్రికి ఉన్న ప్రేమకు రుజువును చూశారు. బైబిలు ఏమి చెబుతున్నదో గమనించండి: “దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.” (ఆదికాండము 2:8) మీరెప్పుడైనా అందంగావున్న తోటకు లేదా ఉద్యానవనానికి వెళ్లారా? మీకు ఏది ఎక్కువ సంతోషాన్నిచ్చింది? దట్టమైన చెట్ల ఆకుల సందుల్లోంచి జాలువారే సూర్యకిరణాలా? కనులకింపుగా విరబూసిన వివిధరకాల పువ్వుల రంగులా? సెలయేటి గలగలలా, పక్షుల కిలకిలరావాలా లేదా కీటకాల ఝంకారాలా? చెట్ల, ఫలాల, పుష్పాల పరిమళాల సంగతేమిటి? ఏదెలావున్నా, ఈనాటి ఏ తోట కూడా ఏదెను తోటకు సాటిరాదు. ఎందుకు?

21 ఎందుకంటే, ఆ తోటను యెహోవాయే స్వయంగా నాటాడు. దాని అందం తప్పకుండా వర్ణనాతీతంగా ఉండవచ్చు. అందమైన ప్రతీ చెట్టు లేదా రుచికరమైన ఫలాలున్న ప్రతీ చెట్టు అక్కడ ఉంది. ఆ తోటలో నీటి కొరతలేదు, అది సువిశాలమైనది, అది పరవశం కలిగించే వివిధ రకాల జంతువులతో సందడిగా ఉండేది. సంతృప్తికరమైన పని పరిపూర్ణమైన సహచర్యంతోపాటు ఆదాము హవ్వల జీవితాలకు సంతోషాన్ని, పరిపూర్ణతను ఇచ్చే సర్వం దానిలో ఉన్నాయి. యెహోవా వారిని మొదట ప్రేమించాడు, అదే ప్రకారం వారూ ప్రతిస్పందించే ప్రతీ కారణం వారికుంది. కానీ వారలా ప్రతిస్పందించడంలో విఫలులయ్యారు. వారు తమ పరలోకపు తండ్రికి ప్రేమపూర్వకంగా విధేయులు కావడానికి బదులు, స్వార్థంతో ఆయనపై తిరుగుబాటు చేశారు.—ఆదికాండము 2వ అధ్యాయం.

22.ఏదెనులో జరిగిన తిరుగుబాటుకు యెహోవా ప్రతిస్పందించిన తీరు ఆయన ‘ప్రేమ శాశ్వతకాలం ఉంటుంది’ అని ఎలా నిరూపించింది?

22 అది యెహోవాకు ఎంత బాధ కలిగించి ఉంటుందో గదా! అయితే ఈ తిరుగుబాటు ఆయన ప్రేమగల హృదయాన్ని కఠినపరచిందా? లేదు. “ఆయన కృప [లేదా ‘యథార్థ ప్రేమ,’ NW] నిరంతరముండును.” (కీర్తన 136:1) అందువల్ల ఆదాము హవ్వల సంతానంలో సరైన మనోవైఖరిగల వారెవరైనా ఉంటే వారిని విమోచించడానికి ఆయన వెంటనే ప్రేమపూర్వకమైన ఏర్పాటు చేయడానికి సంకల్పించాడు. మనం చూసినట్లుగా, ఆ ఏర్పాట్లలో ఆయన ప్రియమైన కుమారుని విమోచన క్రయధన బలి కూడా ఉంది, దాని కోసం ఆ తండ్రి అపరిమితమైన మూల్యం చెల్లించాల్సి వచ్చింది.—1 యోహాను 4:10.

23.యెహోవా “సంతోషంగల దేవుడు” అనడానికి ఒక కారణమేమిటి, తర్వాతి అధ్యాయంలో ఏ ఆవశ్యకమైన ప్రశ్న పరిశీలించబడుతుంది?

23 అవును, ఆరంభం నుండే మానవాళిపట్ల ప్రేమ చూపడంలో యెహోవా చొరవ తీసుకున్నాడు. అసంఖ్యాక రీతుల్లో “ఆయనే మొదట మనలను ప్రేమించెను.” ప్రేమ సామరస్యాన్ని, ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి యెహోవా “సంతోషంగల దేవుడు” అని వర్ణించబడడంలో ఆశ్చర్యం లేదు. (1 తిమోతి 1:11, NW) కానీ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. యెహోవా మనలను ఆయా వ్యక్తులుగా నిజంగా ప్రేమిస్తాడా? ఆ విషయాన్ని తర్వాతి అధ్యాయం పరిశీలిస్తుంది.

^ ఫిలియో అనే క్రియా పదం క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో తరచూ ఉపయోగించబడింది, “(ఒక వ్యక్తికి సన్నిహిత స్నేహితునిపట్ల లేదా సోదరునిపట్ల) ఉండే అనురాగం, మక్కువ లేదా ఇష్టత” అని దాని అర్థం. దీనికి సారూప్య పదమైన స్టోర్‌గీ, సొంత కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమను సూచిస్తుంది, ఈ పదం 2 తిమోతి 3:3​లో ఉపయోగించబడింది, అంత్యదినాల్లో అలాంటి ప్రేమ చల్లారిపోతుందని చూపించడానికి అది అక్కడ ఉపయోగించబడింది. ఎరోస్‌ అనే పదం స్త్రీపురుషుల మధ్య ఉండే ప్రేమను సూచిస్తుంది, బైబిల్లో ఇలాంటి ప్రేమ చర్చించబడినప్పటికీ, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఈ పదం ఉపయోగించబడలేదు.—సామెతలు 5:15-20.

^ ఈ రెండు లేఖన భాగాల్లో అలాంటి వాక్య నిర్మాణమే ఉంది : “దేవుడు వెలుగై యున్నాడు,” “దేవుడు దహించు అగ్నియై యున్నాడు.” (1 యోహాను 1:5; హెబ్రీయులు 12:28) అయితే వీటిని రూపకాలంకారాలుగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అవి యెహోవాను భౌతికమైనవాటితో పోలుస్తున్నాయి. యెహోవా వెలుగును పోలి ఉన్నాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు. ఆయనలో “చీకటి” లేదా అపవిత్రత లేదు. ఆయన నాశక శక్తిని ఉపయోగిస్తాడు కాబట్టి ఆయనను అగ్నితో పోల్చవచ్చు.