కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 25

“మన దేవుని మహా వాత్సల్యము”

“మన దేవుని మహా వాత్సల్యము”

1, 2.(ఎ)పాప ఏడ్చినప్పుడు తల్లి సహజంగానే ఎలా ప్రతిస్పందిస్తుంది? (బి) తల్లిచూపే వాత్సల్యం కంటే ఏ అనుభూతి మరింత ప్రగాఢమైనది?

 అర్థరాత్రి బిడ్డ ఏడ్పువిని, తల్లి దిగ్గున లేస్తుంది. బిడ్డ పుట్టినప్పటి నుండి ఆమె ఇదివరకటిలా నిశ్చింతగా నిద్రపోవడం లేదు. తన బిడ్డ వివిధ రకాల ఏడుపుల భావమేమిటో ఆమెకు తెలుసు. కాబట్టి తన బిడ్డకు పాలు పట్టాలా, జోల పాడాలా లేక మరో విధంగా బుజ్జగించాలా ఆమె చెప్పగలదు. బిడ్డ ఏడుపుకు కారణమేదైనా తల్లి తప్పక ప్రతిస్పందిస్తుంది. తన బిడ్డ అవసరాన్ని పెడచెవిన పెట్టడానికి ఆమె హృదయం ఒప్పుకోదు.

2 తల్లి తన గర్భాన పుట్టిన బిడ్డపట్ల చూపే వాత్సల్యం, మానవులకు తెలిసిన అతి మృదువైన భావాల్లో ఒకటి. అయితే అత్యంత ప్రగాఢమైన అనుభూతి మరొకటి ఉంది, అదే మన దేవుడైన యెహోవాచూపే వాత్సల్యం. ఈ ప్రియ లక్షణాన్ని పరిశీలించడం మనం యెహోవాకు సన్నిహితం కావడానికి మనకు సహాయం చేయగలదు. కాబట్టి వాత్సల్యమంటే ఏమిటో, దానిని మన దేవుడెలా చూపిస్తాడో మనం పరిశీలిద్దాం.

వాత్సల్యమంటే ఏమిటి?

3.“కరుణచూపు” లేదా “జాలిపడు” అని అనువదించబడిన హీబ్రూ క్రియా పదానికి అర్థమేమిటి?

3 బైబిల్లో వాత్సల్యానికి, జాలికి దగ్గర సంబంధముంది. హీబ్రూ, గ్రీకు పదాలనేకం వాత్సల్యపూరిత భావాన్ని అందిస్తున్నాయి. ఉదాహరణకు, హీబ్రూ క్రియా పదమైన రాకామ్‌ను పరిశీలించండి, అది తరచూ “కరుణచూపు” లేదా “జాలిపడు” అని అనువదించబడుతుంది. రాకామ్‌ అనే క్రియా పదం “మనకు ప్రియమైన లేదా మన సహాయం అవసరమైన వారి దౌర్భల్యాన్ని లేదా బాధను చూసినప్పుడు కలిగే లోతైన వాత్సల్యపూరిత భావాన్ని వ్యక్తం చేస్తుంది” అని ఒక కోశ గ్రంథం వివరిస్తోంది. యెహోవా తనకుతాను అనువర్తించుకొనే ఈ హీబ్రూ పదానికి “గర్భాశయం” కోసం ఉపయోగించబడే మాటతో సంబంధం ఉంది. కాబట్టి అది “మాతృవాత్సల్యం” అని కూడా వర్ణించబడగలదు. *నిర్గమకాండము 33:19; యిర్మీయా 33:26.

“స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను . . . మరచునా?”

4, 5.యెహోవా వాత్సల్యం గురించి మనకు బోధించడానికి ఒక తల్లికి తన బిడ్డపట్ల ఉండే అనుభూతులను బైబిలు ఎలా ఉపయోగిస్తోంది?

4 యెహోవా వాత్సల్యం గురించి మనకు బోధించడానికి, తల్లికి తన బిడ్డపట్ల ఉండే భావాలను బైబిలు ఉపయోగిస్తోంది. యెషయా 49:15​లో మనమిలా చదువుతాం: “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డపై వాత్సల్యం చూపకుండ [రాకామ్‌] తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.” (ది ఆంప్లిఫైడ్‌ బైబిల్‌) మనస్సును స్పృశించే ఆ వర్ణన తన ప్రజలపట్ల యెహోవాకున్న ప్రగాఢ వాత్సల్యాన్ని నొక్కిచెబుతోంది. ఎలా?

5 ఒక తల్లి పాలు తాగే తన పసిబిడ్డకు పాలివ్వడాన్ని, శ్రద్ధగా చూసుకోవడాన్ని మరచిపోతుందని ఊహించడమే కష్టం. నిజానికి, ఒక పసిబిడ్డ నిస్సహాయ స్థితిలోవుంటుంది; ఆ పసిబిడ్డకు రాత్రనక పగలనక తల్లి శ్రద్ధానురాగాలు అవసరం. అయితే విచారకరమైన విషయమేమిటంటే, ముఖ్యంగా ‘అనురాగరాహిత్యంతో’ గుర్తించబడుతున్న ఈ “అంత్యదినములలో” తల్లుల నిర్లక్ష్యం గురించి వినడం కొత్తేమీకాదు. (2 తిమోతి 3:1, 3) అయినా “నేను నిన్ను మరువను” అని యెహోవా వెల్లడిచేస్తున్నాడు. తన సేవకులపట్ల యెహోవాకున్న మహా వాత్సల్యం విఫలం కానిది. అది మనం ఊహించగల అత్యంత మృదువైన సహజ భావనకన్నా అంటే ఒక తల్లికి తన పసిబిడ్డపట్ల సహజంగావుండే వాత్సల్యంకన్నా ఎన్నోరెట్లు బలంగా ఉంటుంది. యెషయా 49:15 గురించి “ఇదే అత్యంత బలమైన వ్యక్తీకరణ, అలాకాని పక్షంలో, పాతనిబంధనలో దేవుని ప్రేమను అత్యంత బలంగా వ్యక్తంచేసిన మాటల్లో ఇదొకటి” అని ఒక వ్యాఖ్యాత అన్నాడంటే దానికి ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.

6.చాలామంది అపరిపూర్ణ మానవులు వాత్సల్యాన్ని ఎలా దృష్టించారు, అయితే యెహోవా మనకు ఏమని హామీ ఇస్తున్నాడు?

6 మహా వాత్సల్యం బలహీనతకు చిహ్నమా? అపరిపూర్ణ మానవులు చాలామంది అలాంటి అభిప్రాయంతో ఉన్నారు. ఉదాహరణకు, యేసు సమకాలీనుడు, రోమ్‌లో ప్రముఖ మేధావి, రోమా తత్వవేత్త అయిన సెనెకా “జాలిపడడం ఒక మానసిక బలహీనత” అని బోధించాడు. అనుభూతిలేని ప్రశాంతతను నొక్కితెలిపే తత్వమైన స్తోయికువాదాన్ని సెనెకా ప్రచారం చేశాడు. జ్ఞానంగల వ్యక్తి కృంగిన వారికి సహాయం చేయవచ్చు అయితే అతడు జాలిపడడానికి తననుతాను అనుమతించుకోకూడదు, ఎందుకంటే అలాంటి అనుభూతి అతనికి ప్రశాంతత లేకుండా చేస్తుంది అని సెనెకా అన్నాడు. జీవితాన్ని గురించిన అలాంటి స్వార్థపూరిత దృక్కోణం హృదయపూర్వక వాత్సల్యానికి తావివ్వదు. అయితే యెహోవా ఎంతమాత్రం అలాంటివాడు కాదు. యెహోవా తన వాక్యమైన బైబిల్లో, తాను “ఎంతో జాలియు కనికరమును [“వాత్సల్యము,” NW] గలవాడను” అని మనకు హామీ ఇస్తున్నాడు. (యాకోబు 5:11) వాత్సల్యం ఒక బలహీనత కాదుగానీ బలమైన ఆవశ్యకమైన ఒక లక్షణం అని మనం చూడబోతున్నాం. యెహోవా ప్రేమగల తండ్రిగా దానినెలా కనబరుస్తాడో మనం పరిశీలిద్దాం.

యెహోవా ఓ జనాంగానికి వాత్సల్యం చూపిన సమయం

7, 8.ప్రాచీన ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఏ విధంగా కష్టం అనుభవించారు, వారి కష్టాలకు యెహోవా ఎలా ప్రతిస్పందించాడు?

7 యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో వ్యవహరించిన విధానంలో ఆయన వాత్సల్యం స్పష్టంగా కనిపిస్తుంది. సా.శ.పూ. 16వ శతాబ్దాంతానికల్లా లక్షలాదిమంది ఇశ్రాయేలీయులు ప్రాచీన ఐగుప్తులో బానిసలుగా ఉండి అక్కడ తీవ్రంగా అణగదొక్కబడుతున్నారు. ఐగుప్తీయులు ‘జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, వారితో కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.’ (నిర్గమకాండము 1:11, 14) ఇశ్రాయేలీయులు ఆ విపద్దశలో సహాయంకోసం యెహోవాకు మొరపెట్టారు. దానికి మహా వాత్సల్యంగల దేవుడెలా ప్రతిస్పందించాడు?

8 యెహోవా హృదయం ద్రవించగా, ఆయనిలా అన్నాడు: “నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్ట పెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.” (నిర్గమకాండము 3:7) యెహోవా తన ప్రజల కష్టాలను చూడలేకపోయాడు లేదా ఎలాంటి అనుభూతి చెందకుండా వారి మొరలు పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. ఈ పుస్తకంలోని 24వ అధ్యాయంలో మనం చూసినట్లుగా, యెహోవా తదనుభూతిగల దేవుడు. ఇతరుల వేదనను గుర్తించే సామర్థ్యమైన తదనుభూతికి వాత్సల్యంతో దగ్గర సంబంధం ఉంది. అయితే యెహోవా తన ప్రజల బాధలను చూసి కేవలం బాధపడడమే కాదు, ఆయన వారి పక్షాన చర్యతీసుకోవడానికి పురికొల్పబడ్డాడు. యెషయా 63:9 ఇలా చెబుతోంది: “ప్రేమచేతను, తాలిమిచేతను [“వాత్సల్యంతోను,” NW] వారిని విమోచించెను.” యెహోవా “తన బాహుబలముతో” ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి రక్షించాడు. (ద్వితీయోపదేశకాండము 4:34) ఆ తర్వాత ఆయన వారికి అద్భుతమైన రీతిలో ఆహారాన్నిచ్చి, వారిని తమ సొంత ఫలభరితమైన దేశంలోకి విమోచించాడు.

9, 10.(ఎ)ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత యెహోవా వారిని పదేపదే ఎందుకు విమోచించాడు? (బి) యెఫ్తా కాలంలో, యెహోవా ఇశ్రాయేలీయులను ఎలాంటి అణచివేత నుండి విడిపించాడు, అలాచేయడానికి ఆయనను ఏది పురికొల్పింది?

9 యెహోవా కనికరం అంతటితోనే ఆగిపోలేదు. వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత, ఇశ్రాయేలీయులు పదేపదే నమ్మకద్రోహానికి పాల్పడి తత్ఫలితంగా బాధలు అనుభవించారు. అయితే ఆ తర్వాత ప్రజలు తమ తప్పు తెలుసుకొని యెహోవాకు మొరపెట్టేవారు. అనేకమార్లు ఆయన వారికి విముక్తినిచ్చాడు. ఎందుకు? ‘తన జనులయందు కటాక్షము [“వాత్సల్యం,” NW] గలవాడై’ ఆయనలా చేశాడు.—2 దినవృత్తాంతములు 36:15; న్యాయాధిపతులు 2:11-16.

10 యెఫ్తా కాలంలో ఏమి జరిగిందో పరిశీలించండి. ఇశ్రాయేలీయులు అబద్ధ దేవతలను సేవించడానికి మళ్లినందుకు, 18 సంవత్సరాలపాటు అమ్మోనీయులు వారిని అణచివేసేలా యెహోవా అనుమతించాడు. చివరకు, ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడ్డారు. బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.” * (న్యాయాధిపతులు 10:6-16) తన ప్రజలు నిజమైన పశ్చాత్తాపం కనబరచినప్పుడు, వారింకా బాధపడడం యెహోవా చూడలేకపోయేవాడు. కాబట్టి మహా వాత్సల్యంగల దేవుడు ఇశ్రాయేలీయులను తమ శత్రువుల చేతుల్లో నుండి విడిపించేందుకు యెఫ్తాను బలపరిచాడు.—న్యాయాధిపతులు 11:30-33.

11.యెహోవా ఇశ్రాయేలీయులతో వ్యవహరించిన విధానం నుండి మనం వాత్సల్యం గురించి ఏమి నేర్చుకొంటాము?

11 ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా వ్యవహారాలు ఆయన మహా వ్యాత్సల్యం గురించి మనకేమి బోధిస్తున్నాయి? ఒక విషయమేమిటంటే, అది ప్రజలు అనుభవిస్తున్న ప్రతికూల పరిస్థితులను సానుభూతిగా ఎరిగి ఉండడం మాత్రమే కాదని మనం చూశాము. తన బిడ్డ ఏడుపుకు ప్రతిస్పందించేలా తన వాత్సల్యం తనను పురికొల్పే ఒక తల్లి ఉదాహరణను గుర్తుతెచ్చుకోండి. అదేప్రకారం, యెహోవా తన ప్రజల మొర వినకుండా తన చెవులు మూసుకోడు. వారిని బాధావిముక్తులను చేయడానికి ఆయన మహా వాత్సల్యం ఆయనను పురికొల్పుతుంది. దానికితోడు, యెహోవా ఇశ్రాయేలీయులతో వ్యవహరించిన విధానం, వాత్సల్యం ఎంతమాత్రం ఒక బలహీనత కాదుగానీ తన ప్రజల పక్షాన బలమైన, నిర్ణయాత్మకమైన చర్య తీసుకోవడానికి ఈ లక్షణం ఆయనను పురికొల్పుతుందని మనకు బోధిస్తోంది. అలాగని యెహోవా తన ప్రజలపట్ల ఒక గుంపుగా మాత్రమే కనికరం చూపిస్తాడా?

ఆయావ్యక్తులపట్ల యెహోవా చూపించిన వాత్సల్యం

12.ఆయావ్యక్తులపట్ల యెహోవా వాత్సల్యాన్ని ధర్మశాస్త్రమెలా ప్రతిబింబించింది?

12 ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఆయావ్యక్తులపట్ల ఆయనకున్న వాత్సల్యాన్ని తెలియజేస్తోంది. ఉదాహరణకు, బీదలపట్ల ఆయన చూపిన కనికరాన్నే తీసుకోండి. ఒక ఇశ్రాయేలీయుణ్ణి బీదరికంలో పడవేయగల ఎదురుచూడని పరిస్థితులు తలెత్తవచ్చని యెహోవాకు తెలుసు. ఈ బీదలను ఎలా చూసుకోవాలి? యెహోవా ఇశ్రాయేలీయులకు ఈ ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు: “బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీవు నిశ్చయముగా వాని కియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును.” (ద్వితీయోపదేశకాండము 15:7, 10) అదనంగా ఇశ్రాయేలీయులు తమ పొలాల ఓరలు పూర్తిగా కోయకూడదనీ లేదా ఏదైనా మిగిలిపోతే దానిని ఏరుకోకూడదనీ యెహోవా ఆజ్ఞాపించాడు. అలాంటి పరిగె బీదలకోసం విడిచిపెట్టాలి. (లేవీయకాండము 23:22; రూతు 2:2-7) ఆ జనాంగం తమ మధ్య ఉన్న బీదలపట్ల ఈ దయాపూర్వక శాసనాన్ని పాటించినప్పుడు, ఇశ్రాయేలులో దీనావస్థలో ఉన్న ఆయావ్యక్తులు అన్నంకోసం అర్థించవలసిన అవసరం ఏర్పడలేదు. యెహోవా మహా వాత్సల్యాన్ని అది ప్రతిబింబించడంలేదా?

13, 14.(ఎ)యెహోవాకు ఆయావ్యక్తులుగా మనపై మిక్కిలి శ్రద్ధవుందని దావీదు మాటలు మనకు ఎలా హామీ ఇస్తున్నాయి? (బి) ‘విరిగిన హృదయంతో’ లేదా ‘నలిగిన మనస్సుతో’ ఉన్నవారికి యెహోవా ‘ఆసన్నునిగా’ ఉంటాడని సోదాహరణంగా ఎలా చెప్పవచ్చు?

13 నేడు కూడా, మన ప్రేమగల దేవునికి ఆయావ్యక్తులుగా మనపట్ల మిక్కిలి శ్రద్ధవుంది. మనం అనుభవించే ఎలాంటి కష్టమైనా ఆయనకు బాగా తెలుసని మనం నమ్మకంతో ఉండవచ్చు. కీర్తనకర్త దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” (కీర్తన 34:15, 18) ఈ మాటలు వర్ణించిన వారి గురించి ఒక బైబిలు వ్యాఖ్యాత ఇలా వ్రాస్తున్నాడు: “వారు హృదయం విరిగి మనస్సు కృంగినవారు అంటే పాపాన్నిబట్టి అణిగి ఆత్మ గౌరవం పోగొట్టుకున్నవారు; తమ దృష్టిలో తామే అథములు, తమ సొంత విలువపై వారికి నమ్మకం లేదు.” అలాంటి వారు యెహోవా తమకు దూరంగా ఉన్నాడనీ తమపై శ్రద్ధచూపడానికి తాము అత్యల్పులమని వారు భావించవచ్చు. అయితే అది నిజం కాదు. “తమ దృష్టిలో తామే అథములము” అని భావించే వారిని యెహోవా ఎడబాయడని దావీదు మాటలు మనకు హామీ ఇస్తున్నాయి. అలాంటి సమయాల్లోనే మునుపటికంటే ఎక్కువగా ఆయన అవసరం మనకుంటుందని వాత్సల్యంగల మనదేవునికి తెలుసు.

14 ఈ అనుభవాన్ని పరిశీలించండి. అమెరికాలోని ఒక తల్లి తన రెండేళ్ల కుమారుణ్ణి తీసుకొని ఆసుపత్రికి పరుగెత్తింది ఎందుకంటే వాడు ఒక విధమైన కింకవాయువనే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. డాక్టర్లు పిల్లవాణ్ణి పరీక్షించి, అతణ్ణి ఆ రాత్రికి అక్కడే ఉంచాలని ఆమెకు చెప్పారు. ఆ తల్లి ఆ రాత్రంతా ఎక్కడ గడిపింది? ఆసుపత్రి గదిలో తన కుమారుని పక్క దగ్గరే కుర్చీలో. తన బిడ్డకు బాగోలేదు కాబట్టి అతని దగ్గరే తనుండాలి. మన ప్రేమగల పరలోకపు తండ్రినుండి మనం అంతకంటే ఎక్కువే ఆశించవచ్చనడంలో సందేహం లేదు. ఎంతైనా, మనం ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం. (ఆదికాండము 1:26) మనం ‘విరిగిన హృదయంతో’ లేదా ‘నలిగిన మనస్సుతో’ ఉన్నప్పుడు యెహోవా ఒక ప్రేమగల తండ్రిలా వాత్సల్యంతో సహాయం చేయడానికి సిద్ధంగా మనకు ‘ఆసన్నునిగా’ ఉంటాడని కీర్తన 34:18​లోని భావగర్భితమైన మాటలు మనకు చెబుతున్నాయి.

15.యెహోవా ఆయావ్యక్తులుగా మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తున్నాడు?

15 అయితే యెహోవా ఆయావ్యక్తులుగా మనకు ఎలా సహాయం చేస్తాడు? ఆయన మన బాధకుగల కారణాన్ని తీసివేయవలసిన అవసరం లేదు. అయితే సహాయార్థం తనకు మొరపెట్టేవారి కోసం ఆయన విస్తారమైన ఏర్పాట్లు చేశాడు. ఆయన వాక్యమైన బైబిలు, విజయం సాధించడానికి తోడ్పడగల ఆచరణాత్మక సలహా అందిస్తోంది. సంఘంలో తోటి ఆరాధకులకు సహాయం చేయడంలో ఆయన వాత్సల్యాన్ని ప్రతిబింబించడానికి కృషిచేసే ఆధ్యాత్మిక అర్హతలున్న పైవిచారణకర్తలను యెహోవా దయచేశాడు. (యాకోబు 5:14, 15) ‘ప్రార్థన ఆలకించువానిగా’ ఆయన “తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను” అనుగ్రహిస్తాడు. (కీర్తన 65:2; లూకా 11:13) ఆ ఆత్మ ఒత్తిడి కలిగించే సమస్యలన్నింటినీ దేవుని రాజ్యం తొలగించేంత వరకు మనలో సహించడానికి కావలసిన ‘బలాధిక్యాన్ని’ నింపగలదు. (2 కొరింథీయులు 4:7) అలాంటి ఏర్పాట్లన్నింటిని బట్టి మనకు కృతజ్ఞత లేదా? అవి యెహోవా మహా వాత్సల్యంతో చేసిన ఏర్పాట్లని మనం మరచిపోకూడదు.

16.యెహోవా వాత్సల్యానికి మహాగొప్ప ఉదాహరణ ఏది, ఆయావ్యక్తులుగా మనపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది?

16 వాస్తవానికి, తనకు ప్రియాతి ప్రియమైన వ్యక్తిని మనకోసం విమోచన క్రయధనంగా ఇవ్వడమే యెహోవా వాత్సల్యానికి అత్యున్నత ఉదాహరణ. అది యెహోవా తరఫున ప్రేమపూర్వక బలి, అది మనకు రక్షణ మార్గం తెరచింది. విమోచన క్రయధన ఏర్పాటు మనకు వ్యక్తిగతంగా అనువర్తిస్తుందని మరచిపోకండి. అందుకే మంచి కారణంతోనే, బాప్తిస్మమిచ్చే యోహాను తండ్రియైన జెకర్యా ఈ ఏర్పాటు ‘మన దేవుని మహా వాత్సల్యాన్ని’ శ్లాఘిస్తుందని అన్నాడు.—లూకా 1:79.

యెహోవా వాత్సల్యం చూపని సమయం

17-19.(ఎ)యెహోవా వాత్సల్యం హద్దులు లేనిదికాదని బైబిలు ఎలా చూపిస్తోంది? (బి) యెహోవాకు తన ప్రజలపట్లవున్న వాత్సల్యం, దాని హద్దును చేరుకునేలా చేసినదేమిటి?

17 యెహోవా మహా వాత్సల్యానికి ఏ హద్దులూ ఉండవని మనం అనుకోవాలా? దానికి భిన్నంగా, యెహోవా తన నీతి మార్గాలను వ్యతిరేకించే వ్యక్తుల విషయంలో న్యాయంగానే వాత్సల్యం చూపించకుండా ఉంటాడని బైబిలు స్పష్టంగా చూపిస్తోంది. (హెబ్రీయులు 10:28) ఆయనలా ఎందుకు చేస్తాడో చూసేందుకు ఇశ్రాయేలు జనాంగపు ఉదాహరణను గుర్తుతెచ్చుకోండి.

18 యెహోవా ఇశ్రాయేలీయులను వారి శత్రువుల నుండి పదేపదే విడుదలచేసినా, చివరికి ఆయన వాత్సల్యం దాని హద్దును చేరుకుంది. మొండివారైన ఈ ప్రజలు తమ హేయమైన విగ్రహాలను తిన్నగా యెహోవా ఆలయంలోకే తీసుకువస్తూ విగ్రహారాధన చేశారు. (యెహెజ్కేలు 5:11; 8:17, 18) మనకు ఇంకా ఇలా చెప్పబడింది: “వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.” (2 దినవృత్తాంతములు 36:16) ఇశ్రాయేలీయులు చివరికి వారిపట్ల వాత్సల్యం చూపడానికి సరైన ఆధారంలేని పరిస్థితికి చేరుకొని యెహోవా నీతియుక్త కోపం రగులుకొనేలా చేశారు. దాని ఫలితమేమిటి?

19 యెహోవా తన ప్రజలపట్ల ఇక ఎంతమాత్రం వాత్సల్యం చూపలేకపోయాడు. ఆయనిలా ప్రకటించాడు: “వారిని కరుణింపను [“వాత్సల్యం చూపను,” NW] శిక్షింపకపోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింపజేసెదను.” (యిర్మీయా 13:14) ఆ విధంగా యెరూషలేము, దానిలోని దేవాలయం నాశనం చేయబడి ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగా తీసుకుపోబడ్డారు. పాపులైన మానవులు దేవుని వాత్సల్యం దాని హద్దును చేరుకునే వరకు తిరుగుబాటుచేయడం ఎంత విషాదకరమో గదా!—విలాపవాక్యములు 2:21.

20, 21.(ఎ)మనకాలంలో దేవుని వాత్సల్యం దాని హద్దును చేరుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? (బి) తర్వాతి అధ్యాయంలో యెహోవా వాత్సల్యంతో చేసిన ఏ ఏర్పాటు పరిశీలించబడుతుంది?

20 మరి నేటి విషయమేమిటి? యెహోవా మారలేదు. ఆయన తన వాత్సల్యాన్నిబట్టి లోకమందంతట “రాజ్య సువార్త” ప్రకటించమని తన సాక్షులను ఆజ్ఞాపించాడు. (మత్తయి 24:14) సరైన హృదయంగల ప్రజలు ప్రతిస్పందించినప్పుడు, రాజ్య సందేశాన్ని గ్రహించడానికి యెహోవా వారికి సహాయం చేస్తాడు. (అపొస్తలుల కార్యములు 16:14) కానీ ఈ పని ఎల్లకాలం కొనసాగదు. ఈ దుష్ట ప్రపంచం దాని సమస్త బాధలు కష్టాలతో యుగయుగాలు కొనసాగేలా వదిలేయడం యెహోవా పక్షాన వాత్సల్యం అనిపించుకోదు. దేవుని వాత్సల్యం దాని హద్దును చేరుకున్నప్పుడు, ఈ విధానంపై యెహోవా తన తీర్పును అమలుచేస్తాడు. అప్పుడు కూడా ఆయన తన “పరిశుద్ధ నామము” పట్ల, భక్తిగల తన సేవకుల పట్ల వాత్సల్యంతోనే చర్య తీసుకుంటాడు. (యెహెజ్కేలు 36:20-23) యెహోవా దుష్టత్వాన్ని తొలగించి, నీతియుక్త నూతనలోకాన్ని ప్రవేశపెడతాడు. దుష్టుల గురించి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “కటాక్షముంచకయు కనికరము [“వాత్సల్యం,” NW] చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారనుభవింపజేసెదను.”—యెహెజ్కేలు 9:10.

21 అప్పటివరకు, యెహోవా నాశనం ఎదుర్కోబోయే వారితోసహా ప్రజలందరిపై వాత్సల్యం చూపిస్తాడు. యథార్థంగా పశ్చాత్తాపపడే పాపులైన మానవులు, యెహోవా ఎంతో వాత్సల్యంతో చేసిన ఏర్పాట్లలో ఒకటైన క్షమాపణ నుండి ప్రయోజనం పొందుతారు. తర్వాతి అధ్యాయంలో, మనం యెహోవా క్షమాపణా సంపూర్ణతను తెలిపే కొన్ని చక్కని బైబిలు దృష్టాంతాలను పరిశీలిస్తాం.

^ అయితే ఆసక్తికరంగా, కీర్తన 103:13​లో హీబ్రూ క్రియా పదమైన రాకామ్‌ తండ్రి తన పిల్లలపట్ల చూపే జాలి లేదా వాత్సల్యం అనే భావమిస్తోంది.

^ ‘ఆయన ఆత్మ సహింపలేక పోయెను’ అనే మాటకు అక్షరార్థంగా “ఆయన ఆత్మ కురచయింది; ఆయన ఓపిక నశించింది” అని అర్థం. ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌లో అది ఇలా ఉంది: “ఇశ్రాయేలు దురవస్థను ఆయన ఇంకెంతమాత్రం చూడలేకపోయాడు.” టనాక్‌​—⁠ఎ న్యూ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ ఆ వచనాన్ని ఇలా అనువదిస్తోంది: “ఇశ్రాయేలు దీనావస్థలను ఆయన భరించలేకపోయాడు.”