కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 27

‘ఆహా, ఆయన మంచితనం ఎంత గొప్పది!’

‘ఆహా, ఆయన మంచితనం ఎంత గొప్పది!’

1, 2.దేవుని మంచితనం ఎంత విస్తారమైనది, ఈ లక్షణాన్ని బైబిలు ఏ విధంగా నొక్కిచెబుతోంది?

 పాత స్నేహితులు కొందరు సంధ్యవెలుగులో ఆరుబయట కూర్చొని సూర్యాస్తమయ సుందర దృశ్యాన్ని తిలకిస్తూ భోంచేస్తూ ఉల్లాసంగా మాట్లాడుకుంటున్నారు. దూరాన ఒక రైతు తన పొలాలమీదుగా కారు మబ్బులు కమ్ముకుపోయి చినుకులు పడడాన్ని చూసి తృప్తిగా నవ్వుకుంటున్నాడు. మరోచోట, తమ బిడ్డ తప్పటడుగులు వేయడాన్ని చూసి ఆ దంపతులు సంబరపడిపోతున్నారు.

2 వారు గ్రహించినా, గ్రహించకపోయినా వారందరూ ఒకే విషయం నుండి అంటే యెహోవా దేవుని మంచితనం నుండి ప్రయోజనం పొందుతున్నారు. భక్తిగల ప్రజలు “దేవుడు మంచివాడు” అనే మాటను తరచూ వల్లిస్తుంటారు. కానీ బైబిలు అంతకంటే ఎక్కువగా నొక్కిచెబుతోంది. అదిలా అంటోంది, “ఆహా ఆయన మంచితనం ఎంత గొప్పది!” (జెకర్యా 9:17, NW) అయితే ఆ మాటల భావమేమిటో నేడు కొద్దిమందికే నిజంగా తెలుసన్నట్టు అనిపిస్తోంది. దేవుని మంచితనంలో నిజానికి ఏమి ఇమిడివుంది, దేవుని ఈ లక్షణం మనలో ప్రతీ ఒక్కరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

దేవుని ప్రేమలో ఒక ప్రముఖ భాగం

3, 4.మంచితనం అంటే ఏమిటి, యెహోవా మంచితనాన్ని దైవ ప్రేమ యొక్క వ్యక్తీకరణగా వర్ణించడం ఎందుకు అత్యుత్తమంగా ఉంటుంది?

3 బైబిల్లో వెల్లడిచేయబడిన విధంగా మంచితనం సద్గుణాన్ని, నైతిక ఉత్కృష్టతను సూచిస్తుంది. కాబట్టి ఒక విధంగా, యెహోవాలో మంచితనం నిండి ఉందని మనం చెప్పవచ్చు. ఆయన శక్తి, న్యాయం, జ్ఞానంతో సహా ఆయన లక్షణాలన్నీ సంపూర్ణంగా మంచివే. అయినప్పటికీ మంచితనాన్ని యెహోవా ప్రేమ యొక్క వ్యక్తీకరణగా వర్ణించడమే అత్యుత్తమంగా ఉంటుంది. ఎందుకు?

4 మంచితనం చురుకైన, కార్యసాధకమైన లక్షణం. మానవుల్లో అది నీతికంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుందని అపొస్తలుడైన పౌలు సూచించాడు. (రోమీయులు 5:7) నీతిమంతుడు ధర్మశాస్త్ర నియమాలను నిష్ఠగా పాటిస్తాడని నమ్మవచ్చు, అయితే మంచి వ్యక్తి అంతటితోనే ఆగిపోడు. అతను చొరవ తీసుకుంటాడు, ఇతరుల ప్రయోజనార్థం చురుకుగా పనిచేస్తాడు. మనం చూడబోతున్నట్లుగా, యెహోవా ఆ భావంలో నిశ్చయంగా మంచివాడు. అలాంటి మంచితనం యెహోవా అపరిమిత ప్రేమనుండి ఉద్భవిస్తుందన్నది సుస్పష్టం.

5-7.“మంచి బోధకుడా” అని పిలిపించుకోవడానికి యేసు ఎందుకు నిరాకరించాడు, తద్వారా ఆయన ఏ ప్రగాఢమైన సత్యాన్ని స్థిరపరిచాడు?

5 యెహోవా మంచితనంలో కూడా ఉత్తమోత్తముడు. యేసు మరణించడానికి కొద్దికాలం ముందు ఒక ప్రశ్న అడగడానికి ఒక వ్యక్తి ఆయన దగ్గరకొచ్చి “మంచి బోధకుడా” అని ఆయనను సంబోధించాడు. అందుకు యేసు “నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు. దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు” అని జవాబిచ్చాడు. (మార్కు 10:17, 18, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆ జవాబు మిమ్ములను దిగ్భ్రమపరచవచ్చు. యేసు ఆ వ్యక్తిని ఎందుకు సరిదిద్దాడు? నిజానికి యేసు ‘మంచి బోధకుడు’ కాడా?

6 వాస్తవానికి ఆ వ్యక్తి “మంచి బోధకుడా” అనే మాటను పొగడ్తగా ఉపయోగించాడు. యేసు వినయంతో ఆ మహిమను సర్వోన్నత భావంలో మంచివాడైన తన పరలోక తండ్రికే ఆపాదించాడు. (సామెతలు 11:2) అయితే యేసు ప్రగాఢమైన సత్యాన్ని కూడా స్థిరంగా చెబుతున్నాడు. యెహోవా మాత్రమే మంచితనానికి ఒక ప్రమాణం. మంచిచెడులను నిర్ణయించే సర్వాధికార హక్కు ఆయనకు మాత్రమే ఉంది. ఆదాము హవ్వలు తిరుగుబాటు స్వభావంతో మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తీసుకొని తినడం ద్వారా, ఆ హక్కును తమ కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారు. వారికి భిన్నంగా యేసు, ప్రమాణాలు నిర్ణయించడాన్ని వినయంతో తన తండ్రికే వదిలేస్తున్నాడు.

7 అంతేకాకుండా, నిజమైన మంచితనమంతటికీ యెహోవాయే మూలాధారమని యేసుకు తెలుసు. ఆయనే “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” దయచేయువాడు. (యాకోబు 1:17) యెహోవా ఔదార్యమందు ఆయన మంచితనమెలా రుజువవుతుందో మనం పరిశీలిద్దాం.

యెహోవా విస్తారమైన మంచితనానికి రుజువు

8.యావత్‌ మానవాళిపట్ల యెహోవా తన మంచితనాన్ని ఎలా చూపించాడు?

8 ఇంత వరకు జీవించిన ప్రతీ వ్యక్తీ యెహోవా మంచితనం నుండి ప్రయోజనం పొందినవాడే. కీర్తన 145:9 (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఇలా చెబుతోంది: ‘యెహోవా, అందరి యెడలా మంచివాడు.’ అందరిపట్ల ఆయన చూపించే మంచితనానికి కొన్ని ఉదాహరణలేమిటి? బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదు.” (అపొస్తలుల కార్యములు 14:17) రుచికరమైన భోజనం చేస్తూ మీరెప్పుడైనా హృదయపూర్వకంగా సంతోషించారా? యెహోవా తన మంచితనంతో, ఎల్లప్పుడూ తాజా నీరు పునరుత్పత్తి చేసేలా ఈ భూమిని, సమృద్ధిగా ఆహారం ఉత్పత్తిచేసేలా “ఫలవంతములైన రుతువులను” రూపించి ఉండకపోతే భోజనమే ఉండేదికాదు. యెహోవా తన మంచితనాన్ని తనను ప్రేమించే కొందరిపట్ల మాత్రమే కాదు ప్రతీ ఒక్కరిపట్ల చూపించాడు. యేసు ఇలా అన్నాడు: “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.”—మత్తయి 5:45.

యెహోవా ‘ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచున్నాడు’

9.ఆపిల్‌ చెట్టు యెహోవా మంచితనాన్ని ఎలా ఉదహరిస్తోంది?

9 సూర్యరశ్మి, వర్షం, ఫలవంతమైన రుతువుల కొనసాగే చర్య మూలంగా మానవజాతిపై కురిపించబడుతున్న అత్యధిక ఔదార్యాన్ని చాలామంది తేలికగా తీసుకుంటారు. ఉదాహరణకు, ఆపిల్‌ పండునే తీసుకోండి. భూమియంతటా సమశీతోష్ణ ప్రాంతాల్లో అది సర్వసామాన్య ఫలం. అయినా నిండుగా పునరుత్సాహం కలిగించే రసంతో, ఆవశ్యక పోషకపదార్థాలతో అది అందంగా, తినడానికి రుచికరంగా ఉంటుంది. ఎరుపు రంగు నుండి బంగారు వన్నె వరకు, పసుపు రంగు నుండి ఆకుపచ్చ వర్ణం వరకు ఇలా వివిధ రంగుల్లో, ద్రాక్ష పండు పరిమాణం నుండి దొబ్బనారింజ పండు పరిమాణం వరకు వివిధ పరిమాణాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 రకాల ఆపిల్‌ పండ్లు ఉన్నట్లు మీకు తెలుసా? మీరు చిన్నగావుండే ఆపిల్‌ విత్తనాన్ని వేళ్లతో పట్టుకుంటే అది చాలా అల్పంగా కనిపిస్తుంది. కానీ అందులోనుండే చూడముచ్చటైన చక్కని వృక్షం మొలుస్తుంది. (పరమగీతము 2:3) ప్రతీ వసంత రుతువులో ఆపిల్‌ చెట్టు గుత్తులు గుత్తులుగా పూతకొచ్చి, శరదృతువుకల్లా కాపుకాస్తుంది. ప్రతీ సంవత్సరం అలా దాదాపు 75 సంవత్సరాలపాటు సగటున ప్రతీచెట్టు 19 కేజీలు పట్టే 20 అట్టపెట్టెలకు సరిపడా కాయలు కాస్తుంది.

ఈ చిన్న విత్తనం నుండి దశాబ్దాలపాటు ప్రజలకు ఆహారమిచ్చి వారిని ఆనందపరిచే వృక్షం మొలకెత్తుతుంది

10, 11.జ్ఞానేంద్రియాలు యెహోవా మంచితనాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాయి?

10 యెహోవా తన అపరిమిత మంచితనాన్నిబట్టి, తన కార్యాలు గ్రహించడానికి, వాటినిబట్టి ఆనందించడానికి మనకు సహాయంచేసే జ్ఞానేంద్రియాలతో ‘ఆశ్చర్యకరంగా చేయబడిన’ శరీరాన్ని మనకిచ్చాడు. (కీర్తన 139:14) ఈ అధ్యాయం ఆరంభంలో వర్ణించబడిన ఆ దృశ్యాల గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఎలాంటి దృశ్యాలు ఆ క్షణాల్లో ఆనందం తీసుకొస్తాయి? బోసినవ్వులు వెదజల్లే చంటిబిడ్డ గులాబీ బుగ్గలు. పంటపొలాలపై జోరుగా కురుస్తున్న వర్షం. ఎరుపు, బంగారు, ఊదారంగుల సూర్యాస్తమయం. మానవుని నేత్రం 3,00,000 రకాల రంగులు పసిగట్టే విధంగా రూపించబడింది! మన వినికిడి శక్తి మనం అభిమానించే కంఠస్వరంలో వినబడే భేదాలను, చెట్లమధ్యగా వీచే గాలి సవ్వళ్లు, తప్పటడుగులు వేసే పిల్లవాడి కేరింతలను గ్రహిస్తుంది. అలాంటి దృశ్యాలను, శబ్దాలను మనమెందుకు ఆనందించగలుగుతున్నాము? బైబిలు ఇలా చెబుతోంది: “వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.” (సామెతలు 20:12) అయితే జ్ఞానేంద్రియాల్లో అవి కేవలం రెండు మాత్రమే.

11 వాసనచూసే శక్తి యెహోవా మంచితనానికి మరో రుజువు. మానవుని ముక్కు దాదాపు 10,000 రకాల వాసనలు పసిగట్టగలదు. వాటిలో కేవలం కొన్నింటి గురించి ఆలోచించండి, అవి మీ కిష్టమైన వంట వండడం, పువ్వులు, రాలిపడిన ఆకులు, వెచ్చని మంట నుండి వచ్చే పొగ. మీ ర్శ జ్ఞానం మీ ముఖానికి తగిలే గాలిని, ఓదార్పునిచ్చే ప్రియమైన వారి ఆలింగనాన్ని, మీ చేతిలో ఉన్న పండు యొక్క సంతృప్తికరమైన మృదుత్వాన్ని గ్రహించేలా చేస్తుంది. పండు నోట్లో పెట్టుకోగానే రుచిచూసే శక్తి తన పని ప్రారంభిస్తుంది. పండులోని సంశ్లిష్టమైన రసాయనాలు కలిగించే రుచులను నోటిలోని రస గ్రంథులు పసిగట్టి మీరు సమ్మిళిత రుచులను ఆస్వాదించేలా చేస్తాయి. అవును, యెహోవా గురించి మనమిలా ఉల్లాసంగా చెప్పడానికి మనకు ప్రతీ కారణముంది: “నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు [“మంచితనం,” NW] యెంతో గొప్పది.” (కీర్తన 31:19) అయితే దైవభయం గలవారి కోసం యెహోవా మంచితనాన్ని ఎలా ‘దాచివుంచాడు’?

నిత్య ప్రయోజనాలతో మంచితనం

12.యెహోవా చేసిన ఎలాంటి ఏర్పాట్లు అత్యంత ప్రాముఖ్యమైనవి, ఎందుకు?

12 యేసు ఇలా అన్నాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది.” (మత్తయి 4:4) అవును, యెహోవా ఆధ్యాత్మిక ఏర్పాట్లు భౌతికమైన వాటికంటే ఎక్కువ మేలుచేస్తాయి, ఎందుకంటే అవి నిత్యజీవానికి నడిపిస్తాయి. ఈ పుస్తకంలోని 8వ అధ్యాయంలో, ఆధ్యాత్మిక పరదైసును తీసుకురావడానికి యెహోవా తన పునరుద్ధరించే శక్తిని ఉపయోగించాడని మనం గమనించాము. ఆ పరదైసులో సమృద్ధియైన ఆధ్యాత్మిక ఆహారం ఒక కీలకాంశం.

13, 14.యెహెజ్కేలు ప్రవక్త దర్శనంలో ఏమి చూశాడు, నేడు మనకు దాని భావమేమిటి? (బి) యెహోవా తన నమ్మకమైన సేవకుల కోసం ఎలాంటి జీవదాయక ఆధ్యాత్మిక ఏర్పాట్లు చేశాడు?

13 బైబిలు గొప్ప పునరుద్ధరణా ప్రవచనాల్లో ఒకదానియందు పునరుద్ధరించబడి మహిమపరచబడిన దేవాలయ దర్శనం యెహెజ్కేలు ప్రవక్తకు ఇవ్వబడింది. ఆ దేవాలయం నుండి ప్రవహించే నీటి కాలువ క్రమేణా వెడల్పుగా, లోతుగా తయారవుతూ చివరకు “వడిగా పారు” నదిగా మారింది. ఆ నది పారినచోటల్లా ఆశీర్వాదాలు తెచ్చింది. ఆ నదీతీరం వెంబడి ఏపుగా పెరిగిన వృక్షాలు ఆహారం, స్వస్థపరిచే ఔషధాలు ఇచ్చాయి. ఆ నది ఉప్పుతో పేరుకుపోయిన నిర్జీవ మృతసముద్రానికి జీవాన్ని, ఫలసాధ్యాన్ని తెచ్చింది. (యెహెజ్కేలు 47:1-12) అయితే దీనంతటి భావమేమిటి?

14 ఆ దర్శనం, యెహెజ్కేలు చూసిన దేవాలయం ద్వారా చిత్రీకరించబడినట్లుగా, యెహోవా తన సత్యారాధనా ఏర్పాటును పునరుద్ధరిస్తాడనే భావాన్నిచ్చింది. దర్శనంలోని ఆ నదిలానే జీవం కొరకైన దేవుని ఆశీర్వాదాలు మరింత సమృద్ధిగా ఆయన ప్రజలకు చేరతాయి. 1919లో స్వచ్ఛారాధన పునరుద్ధరించబడిన దగ్గరనుండి యెహోవా తన ప్రజలకు జీవమిచ్చే వరాలిచ్చి ఆశీర్వదించాడు. ఎలా? బైబిళ్లు, బైబిలు సాహిత్యాలు, కూటాలు, సమావేశాలు ఇవన్నీ లక్షలాదిమందికి ప్రాణాధార సత్యాలను చేరవేయడానికి దోహదపడ్డాయి. అలాంటి మాధ్యమాల ద్వారా తన అత్యంత ప్రాముఖ్యమైన ఏర్పాటు గురించి అంటే క్రీస్తు విమోచన క్రయధన బలి గురించి ప్రజలకు బోధించాడు. అది దేవుణ్ణి నిజంగా ప్రేమించి ఆయనకు భయపడే వారందరికీ యెహోవా ఎదుట పవిత్ర స్థానాన్ని, నిత్యజీవ నిరీక్షణను ఇస్తుంది. * కాబట్టి ఈ అంత్యదినాల కాలమంతటిలో లోకం ఆధ్యాత్మిక కరవు అనుభవిస్తుండగా, యెహోవా ప్రజలు ఆధ్యాత్మిక విందును ఆస్వాదిస్తున్నారు.—యెషయా 65:13.

15.క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో యెహోవా మంచితనం విశ్వాస మానవాళికి ఏ భావంలో విస్తరించబడుతుంది?

15 అయితే యెహెజ్కేలు దర్శనంలోని నదీ ప్రవాహం ఈ పాత విధానం ముగియడంతోనే ఆగిపోదు. దానికి భిన్నంగా, అది క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో మరింత సమృద్ధిగా ప్రవహిస్తుంది. అప్పుడు మెస్సీయా రాజ్యం ద్వారా యెహోవా విశ్వసనీయమైన మానవాళిని క్రమేణా పరిపూర్ణతకు తెస్తూ క్రీస్తు బలి విలువను వారికి పూర్తిగా అనువర్తిస్తాడు. అప్పుడు యెహోవా మంచితనాన్నిబట్టి మనమెంతగా ఉల్లసిస్తామో కదా!

యెహోవా మంచితనం యొక్క అదనపు ముఖరూపాలు

16.యెహోవా మంచితనంలో ఇతర లక్షణాలూ ఉన్నాయని బైబిలు ఎలా చూపిస్తోంది, వాటిలో కొన్ని ఏమిటి?

16 యెహోవా మంచితనంలో కేవలం ఔదార్యం మాత్రమే లేదు. దేవుడు మోషేకు ఇలా చెప్పాడు: “నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను; యెహోవా అను నామమును నీ యెదుట ప్రకటించెదను.” ఆ పిమ్మట ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు—యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా . . . అని ప్రకటించెను.” (నిర్గమకాండము 33:19; 34:6, 7) కాబట్టి యెహోవా మంచితనంలో అనేక చక్కని లక్షణాలున్నాయి. వీటిలో కేవలం రెండింటిని మనం పరిశీలిద్దాం.

17.దయాళుత్వమంటే ఏమిటి, అపరిపూర్ణ మానవులపట్ల యెహోవా దీనినెలా ప్రదర్శించాడు?

17 ‘దయాళుడు.’ యెహోవా తన ప్రాణులతో వ్యవహరించే విధానం గురించి ఈ లక్షణం మనకెంతో చెబుతోంది. అధికారంగలవారు తరచూ ఉండే విధంగా యెహోవా కఠోరంగా, మొండిగా లేదా నిరంకుశంగా ఉండడానికి బదులు ఉదార స్వభావంగల, దయామయునిగా ఉన్నాడు. ఉదాహరణకు, యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “ఇదిగో [“దయచేసి,” NW] నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము.” (ఆదికాండము 13:14) అనేక అనువాదాలు ‘దయచేసి’ అనే మాటను వదిలేస్తున్నాయి. కానీ ఆ మాటలను ఆజ్ఞాపూర్వక విధానం నుండి సభ్యతగల విన్నపంగా మార్చే ఒక అక్షరభాగం ఆదిమ హీబ్రూ పదాల్లో ఉన్నట్లు బైబిలు విద్వాంసులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాలే వేరేవి కూడా ఉన్నాయి. (ఆదికాండము 31:12; యెహెజ్కేలు 8:5) విశ్వ సర్వాధిపతి అల్పమానవులతో ‘దయచేసి’ అని మాట్లాడడం ఊహించండి! కఠినత్వం, ఉగ్ర ప్రవర్తన, మొరటుతనం సర్వసాధారణంగా ఉన్న ఈ లోకంలో మన దేవుడైన యెహోవా దయాళుత్వాన్ని తలపోయడం ఉత్తేజపరిచేదిగా లేదా?

18.యెహోవా ఏ భావంలో ‘విస్తారమైన సత్యము గలవాడు,’ ఆ మాటలు ఎందుకు ఓదార్పుకరమైనవి?

18 ‘విస్తారమైన సత్యము గలవాడు.’ మోసం నేటి లోక విధానమైపోయింది. కానీ బైబిలు మనకిలా గుర్తుచేస్తోంది: “దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు.” (సంఖ్యాకాండము 23:19) వాస్తవానికి, ఆయన ‘అబద్ధమాడనేరని దేవుడని’ తీతు 1:1 చెబుతోంది. అబద్ధమాడేందుకు ఆయన మంచితనం అనుమతించదు. అందువల్ల యెహోవా వాగ్దానాలు పూర్తిగా నమ్మదగినవి. ఆయన వాక్కులు అన్ని సందర్భాల్లో తప్పక నెరవేరతాయి. యెహోవా ‘సత్యదేవుడని’ కూడా పిలువబడ్డాడు. (కీర్తన 31:5) ఆయన అబద్ధాలు చెప్పకుండా ఉండడమే కాదుగానీ ఆయన సమృద్ధిగా సత్యం పంచేవానిగా ఉన్నాడు. ఆయన సంకుచిత స్వభావంతో, ఎవరికీ ఏదీ చెప్పకుండా లేదా రహస్యంగా ఉండడు, బదులుగా ఆయన ఔదార్య స్వభావంతో తన అపరిమిత జ్ఞానసంపత్తి నుండి తన నమ్మకమైన సేవకులకు జ్ఞానం పంచుతున్నాడు. * ‘సత్యం అనుసరించి నడుచుకొనేలా’ తాను పంచే సత్యం ప్రకారం ఎలా జీవించాలో కూడా ఆయన వారికి బోధిస్తున్నాడు. (3 యోహాను 3) సాధారణంగా, యెహోవా మంచితనం ఆయావ్యక్తులుగా మనపై ఎలాంటి ప్రభావం చూపాలి?

‘యెహోవా మంచితనాన్నిబట్టి సంతోషించండి’

19, 20.(ఎ)యెహోవా మంచితనంలో హవ్వకున్న నమ్మకాన్ని బలహీనపరచడానికి సాతానెలా ప్రయత్నించాడు, దాని ఫలితమేమిటి? (బి) యెహోవా మంచితనం మనపై సరిగానే ఎలాంటి ప్రభావం చూపాలి, ఎందుకు?

19 ఏదెను వనంలో సాతాను హవ్వను శోధించినప్పుడు, అతడు యెహోవా మంచితనంపై ఆమెకున్న నమ్మకాన్ని మోసపూరితంగా బలహీనపరచడం ఆరంభించాడు. యెహోవా ఆదాముకు ఇలా చెప్పాడు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును.” ఆ తోటను అలంకరించిన వేలాది వృక్షాల్లో కేవలం ఒక వృక్షాన్ని మాత్రమే యెహోవా మినహాయించాడు. అయినప్పటికీ, సాతాను హవ్వపై తన మొదటి ప్రశ్నను ఎలా సంధించాడో గమనించండి: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” (ఆదికాండము 2:9, 16; 3:1) యెహోవా వారికి మంచి కలిగించేదేదో దక్కకుండా నిరోధిస్తున్నాడని హవ్వ ఆలోచించేలా సాతాను యెహోవా మాటలను వక్రీకరించాడు. విచారకరంగా, అతని కుయుక్తిపారింది. ఆ తర్వాత చాలామంది స్త్రీపురుషులు చేసినట్లుగానే, హవ్వ కూడా ఆమెకున్న సమస్తాన్ని దయచేసిన దేవుని మంచితనాన్నే శంకించడం ఆరంభించింది.

20 అలాంటి సందేహాలు తెచ్చిన దుఃఖం, విషాదం ఎంత తీవ్రమైనవో మనకు తెలుసు. కాబట్టి యిర్మీయా 31:12 NWలోని ఈ మాటలను మనం లక్ష్యపెడదాం: ‘వారు యెహోవా మంచితనాన్ని బట్టి తప్పక సంతోషిస్తారు.’ యెహోవా మంచితనం నిజంగా మన ముఖాలు ప్రజ్వలించేలా చేయాలి. మంచితనం నిండిన మన దేవుని ఉద్దేశాలను మనమెన్నడూ సందేహించవలసిన అవసరం లేదు. తనను ప్రేమించేవారి మేలుతప్ప ఆయన మరేమీ కోరడు కాబట్టి మనం ఆయనపై పూర్తి నమ్మకం ఉంచవచ్చు.

21, 22.(ఎ)యెహోవా మంచితనానికి మీరు ప్రతిస్పందించాలని ఇష్టపడే కొన్ని మార్గాలేమిటి? (బి) తర్వాతి అధ్యాయంలో మనమే లక్షణాన్ని పరిశీలిస్తాం, అది మంచితనానికి ఎలా భిన్నంగా ఉంది?

21 అంతేకాకుండా దేవుని మంచితనం గురించి ఇతరులతో మాట్లాడే అవకాశం మనకు లభించినప్పుడు, మనం సంతోషిస్తాం. యెహోవా ప్రజల గురించి కీర్తన 145:7 ఇలా చెబుతోంది: “నీ మహా దయాళుత్వమును [‘మంచితనం,’ NW] గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు.” మనం జీవించే ప్రతీ దినం యెహోవా మంచితనం నుండి ఏదోక రీతిలో ప్రయోజనం పొందుతాము. సాధ్యమైనంత ప్రత్యేకంగా సంబంధిత విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రతీరోజూ యెహోవా మంచితనంపట్ల ఆయనకు కృతజ్ఞతలు చెప్పడాన్ని ఎందుకు అలవాటు చేసుకోకూడదు? ఆ లక్షణం గురించి ఆలోచించడం, దానికొరకు ప్రతీ దినం ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం, దాని గురించి ఇతరులకు చెప్పడం మన మంచి దేవుణ్ణి అనుకరించడానికి మనకు సహాయం చేస్తుంది. అలాగే యెహోవా మాదిరిగానే మేలుచేయడానికి మార్గాలకోసం మనం ప్రయత్నిస్తుండగా మనమాయనకు మరింత సన్నిహితులమవుతాం. వృద్ధ అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి.”—3 యోహాను 11.

22 యెహోవా మంచితనం ఇతర లక్షణాలకు కూడా ముడిపెట్టబడింది. ఉదాహరణకు, దేవుడు “విస్తారమైన కృప” లేదా యథార్థమైన ప్రేమ గలవాడు. (నిర్గమకాండము 34:6) ప్రత్యేకంగా ఈ లక్షణం మంచితనం కంటే మరింత నిర్దిష్టంగా ఉంటుంది, ఎందుకంటే యెహోవా దీనిని విశేషంగా తన నమ్మకమైన సేవకులపట్ల మాత్రమే వ్యక్తపరుస్తాడు. దీన్ని ఆయన ఎలా వ్యక్తపరుస్తాడో తర్వాతి అధ్యాయంలో మనం తెలుసుకుంటాం.

^ యెహోవా మంచితనానికి విమోచన క్రయధనానికి మించిన గొప్ప ఉదాహరణ మరొకటి ఉండనేరదు. మన పక్షాన చనిపోవడానికి ఎన్నుకునేందుకు లక్షలాదిమంది ఆత్మసంబంధ ప్రాణులుండగా, వారిలో తన అద్వితీయ ప్రియకుమారుడ్నే యెహోవా ఎంచుకున్నాడు.

^ బైబిలు మంచి కారణంతోనే సత్యాన్ని వెలుగుతో ముడిపెడుతోంది. “నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము” అని కీర్తనకర్త ఆలపించాడు. (కీర్తన 43:3) యెహోవా ద్వారా బోధించబడడానికి లేదా జ్ఞానం పొందడానికి ఇష్టపడే వారికి యెహోవా సమృద్ధిగా ఆధ్యాత్మిక వెలుగు ప్రకాశింపజేస్తున్నాడు.—2 కొరింథీయులు 4:6; 1 యోహాను 1:5.