కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 29

‘క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం’

‘క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం’

1-3.(ఎ)తన తండ్రిలానే ఉండేలా కోరుకోవడానికి యేసును ఏది పురికొల్పింది? (బి) యేసు ప్రేమకు సంబంధించిన ఏ అంశాలను మనం పరిశీలిస్తాం?

 తన తండ్రిలా ఉండడానికి ప్రయత్నించే పిల్లవాణ్ణి మీరెప్పుడైనా చూశారా? ఆ పిల్లవాడు తండ్రి నడకను, మాటను లేదా ప్రవర్తనను అనుకరిస్తుండవచ్చు. చివరకు, ఆ పిల్లవాడు తన తండ్రి నైతిక, ఆధ్యాత్మిక విలువల్ని సైతం అనుకరించవచ్చు. అవును, ప్రేమగల తండ్రిపట్ల కుమారుడు పెంచుకునే ప్రేమాగౌరవాలు ఆ పిల్లవాడు తన తండ్రిలా ఉండడానికి కోరుకొనేలా పురికొల్పుతాయి.

2 మరి యేసుకు, ఆయన పరలోకపు తండ్రికి మధ్యగల సంబంధం విషయమేమిటి? “నేను తండ్రిని ప్రేమించుచున్నాను” అని యేసు ఒక సందర్భంలో అన్నాడు. (యోహాను 14:31) మరే ప్రాణీ ఉనికిలోకి రాకముందు, ఎంతోకాలం తండ్రితోవున్న ఆ కుమారుని కంటే ఎక్కువగా వేరెవ్వరూ యెహోవాను ప్రేమించడం సాధ్యపడదు. ఆ ప్రేమే ఈ విశ్వాసపాత్ర కుమారుణ్ణి తన తండ్రిలా ఉండాలని కోరుకొనేలా ప్రేరేపించింది.—యోహాను 14:9.

3 ఈ పుస్తకపు ముందరి అధ్యాయాల్లో, యెహోవా శక్తిని, న్యాయాన్ని, జ్ఞానాన్ని యేసు పరిపూర్ణంగా ఎలా అనుకరించాడో మనం పరిశీలించాం. అయితే యేసు తన తండ్రి ప్రేమనెలా ప్రతిబింబించాడు? యేసు ప్రేమకు సంబంధించిన మూడు అంశాలను అంటే ఆయన స్వయం త్యాగ స్ఫూర్తిని, వాత్సల్యపూరిత కనికరాన్ని, క్షమించడానికి ఆయనకున్న సుముఖతను మనం పరిశీలిద్దాం.

‘ఇంతకంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు’

4.స్వయం త్యాగ ప్రేమలో మానవునిగా యేసు మహాగొప్ప మాదిరినెలా ఉంచాడు?

4 స్వయం త్యాగ ప్రేమ విషయంలో యేసు అసాధారణ మాదిరిని ఉంచాడు. స్వయం త్యాగంలో మన సొంత విషయాలకంటే ఇతరుల అవసరాలకు, చింతలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇమిడివుంది. అలాంటి ప్రేమను యేసు ఎలా ప్రదర్శించాడు? స్వయంగా ఆయనే ఇలా వివరించాడు: “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు.” (యోహాను 15:13) యేసు మనకోసం ఇష్టపూర్వకంగా తన పరిపూర్ణ జీవాన్ని ఇచ్చాడు. ఏ మానవుడు ఎన్నడూ చేయనంత మహాగొప్పగా ఆ ప్రేమ వ్యక్తమైంది. అయితే ఇతర విధాలుగా కూడా యేసు స్వయం త్యాగ ప్రేమను చూపించాడు.

5.దేవుని అద్వితీయ కుమారుడు పరలోకాన్ని విడిచి రావడం ప్రేమపూర్వక త్యాగం ఎందుకవుతుంది?

5 దేవుని అద్వితీయ కుమారునికి తన మానవపూర్వ ఉనికిలో పరలోకంలో సాటిలేని ఉన్నత స్థానముంది. యెహోవాతో, బహుళ సంఖ్యలోవున్న ఆత్మసంబంధ ప్రాణులతో ఆయనకు సన్నిహిత సహవాసముంది. ఇన్ని వ్యక్తిగత అనుకూల పరిస్థితులున్నప్పటికీ ఈ ప్రియకుమారుడు “మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.” (ఫిలిప్పీయులు 2:7) ఆయన “దుష్టునియందున్న” లోకంలో పాపులైన మానవుల మధ్య జీవించడానికి ఇష్టపూర్వకంగా వచ్చాడు. (1 యోహాను 5:19) దేవుని కుమారుని పక్షాన అది ప్రేమపూర్వక త్యాగం కాదా?

6, 7.(ఎ)యేసు తన భూపరిచర్య కాలంలో ఏయే విధాలుగా స్వయం త్యాగ ప్రేమను చూపాడు? (బి) యోహాను 19:25-27​లో నిస్వార్థ ప్రేమకు సంబంధించిన, మనస్సును తాకే ఎలాంటి ఉదాహరణ గ్రంథస్తం చేయబడింది?

6 యేసు తన భూపరిచర్య కాలమంతటిలో వివిధ రీతుల్లో స్వయం త్యాగ ప్రేమను చూపాడు. ఆయన సంపూర్ణ నిస్వార్థపరుడు. ఆయన తన పరిచర్యలో ఎంతగా మునిగిపోయాడంటే మానవులు మామూలుగా అలవాటుపడిన సాధారణ సుఖాలను సైతం ఆయన త్యాగం చేశాడు. “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని” ఆయన అన్నాడు. (మత్తయి 8:20) ప్రావీణ్యతగల వడ్రంగిగా తనకొక మంచి ఇల్లు కట్టుకోవడానికి లేదా కొంత డబ్బు కూడబెట్టుకునేందుకు చక్కని కర్రసామాను చేసి అమ్మడానికి ఆయన కొంత సమయం తీసుకోగలిగేవాడు. కానీ వస్తు సంపాదన కోసం ఆయన తన ప్రావీణ్యతలను ఉపయోగించలేదు.

7 యేసు స్వయం త్యాగ ప్రేమకు నిజంగా మనస్సును తాకే ఉదాహరణ యోహాను 19:25-27​లో గ్రంథస్తం చేయబడింది. ఆయన చనిపోయే మధ్యాహ్నం ఆయన మనస్సులో హృదయంలో ఎన్ని విషయాలు నిండివుండి ఉంటాయో ఊహించండి. ఆయన హింసాకొయ్యపై వేదనపడుతూ తన శిష్యుల గురించి, ప్రకటనా పని గురించి, ప్రత్యేకంగా తన యథార్థత గురించి, అది తన తండ్రి నామంపై ఎలా ప్రభావం చూపుతుందోనని కలతపడుతున్నాడు. నిజానికి, మానవాళి భవిష్యత్తంతా ఆయన భుజస్కంధాలపై ఉంది. చనిపోవడానికి కొద్ది సమయం ముందు, బహుశా అప్పటికే విధవరాలిగా ఉన్న తన తల్లి మరియ విషయంలో కూడా శ్రద్ధచూపాడు. మరియను తన తల్లిలా చూసుకోమని యేసు అపొస్తలుడైన యోహానును అడిగాడు, ఆ అపొస్తలుడు ఆ తర్వాత మరియను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ విధంగా యేసు తన తల్లి భౌతిక, ఆధ్యాత్మిక సంరక్షణా ఏర్పాట్లు చేశాడు. నిస్వార్థ ప్రేమకు అదెంత వాత్సల్యపూరిత వ్యక్తీకరణో గదా!

‘కనికరపడ్డాడు’

8.యేసు కనికరాన్ని వర్ణించడానికి బైబిలు ఉపయోగిస్తున్న గ్రీకు పదానికి అర్థమేమిటి?

8 యేసు తన తండ్రిలా కనికరంగలవాడు. యేసు ఇక్కట్లలో ఉన్నవారిని చూసి ఎంతో కదిలించబడి వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళిన వ్యక్తి అని లేఖనాలు వర్ణిస్తున్నాయి. యేసుచూపిన కనికరాన్ని వర్ణించడానికి ‘కనికరంతో కదిలించబడ్డాడు’ అని అనువదించబడిన గ్రీకు పదాన్ని బైబిలు ఉపయోగిస్తోంది. “అది ఒక వ్యక్తి అంతరంగ భావాలను ప్రేరేపించే భావావేశాన్ని . . . వర్ణిస్తుంది. కనికర భావానికి ఉపయోగించబడిన ఆ మాట గ్రీకులో అత్యంత శక్తిమంతమైన పదం” అని ఒక విద్వాంసుడు చెబుతున్నాడు. చర్య తీసుకొనేలా ప్రగాఢ కనికరంతో యేసు కదిలించబడిన కొన్ని పరిస్థితులను పరిశీలించండి.

9, 10.(ఎ)ఎలాంటి పరిస్థితులు యేసు ఆయన అపొస్తలులు ప్రశాంత స్థలంకోసం వెదికేలా చేశాయి? (బి) జనసమూహంవల్ల తన ఏకాంతానికి భంగం కలిగినప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు, ఎందుకలా స్పందించాడు?

9 ఆధ్యాత్మిక అవసరాలకు ప్రతిస్పందించేలా కదిలించబడ్డాడు. యేసు కనికరపడడానికి ఆయనను ముఖ్యంగా కదిలించిందేమిటో మార్కు 6:30-34​లోని వృత్తాంతం చూపిస్తోంది. ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. అపొస్తలులు ఉత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే అప్పుడే వారు విస్తృత ప్రకటనా పర్యటన ముగించుకొని వచ్చారు. ఆత్రంగా వారు యేసు దగ్గరకొచ్చి తాము చూసింది విన్నది అంతా యేసుకు నివేదించారు. అయితే యేసు, ఆయన అపొస్తలులు భోజనము చేయడానికైనా అవకాశం లేనంతగా ఒక పెద్ద జనసమూహం అక్కడ సమకూడింది. అన్ని సందర్భాల్లో శ్రద్ధగా గమనించే యేసు, అపొస్తలులు అలసిపోయారని గ్రహించాడు. “మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని” ఆయన వారికి చెప్పాడు. ఆ తర్వాత వారు ఒక పడవనెక్కి గలిలయ సముద్రానికి ఉత్తరంగా ఒక ప్రశాంత స్థలానికి ప్రయాణమయ్యారు. కానీ ఆ జనం వారు వెళ్లడాన్ని గమనించారు. ఇతరులు కూడా ఆ సంగతి విని, అందరు కలిసి ఉత్తర తీరం వెంటే పరుగెత్తి పడవకంటే ముందుగా ఆవలివైపుకు చేరుకున్నారు.

10 తన ఏకాంతానికి భంగం కలిగిందని యేసు మనస్సులో నొచ్చుకున్నాడా? ఎంతమాత్రం లేదు. వేలాదిమందిగా చేరి ఆయన రాకకోసం వేచివున్న ఆ జనసమూహాన్ని చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. మార్కు ఇలా వ్రాశాడు: “ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింపసాగెను.” యేసు ఆ ప్రజలను ఆధ్యాత్మిక అవసరత ఉన్న వ్యక్తులుగా పరిగణించాడు. వారు నడిపించేందుకు, కాపాడేందుకు కాపరిలేని దారితప్పిన నిస్సహాయ గొఱ్ఱెలవలె ఉన్నారు. శ్రద్ధచూపే గొఱ్ఱెలకాపరులుగా ఉండవలసిన జాలిలేని మతనాయకులు ఆ సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని యేసుకు తెలుసు. (యోహాను 7:47-49) అందుకని ఆయన ప్రజలపై కనికరపడి “దేవుని రాజ్యమునుగూర్చి” వారికి బోధించడం ఆరంభించాడు. (లూకా 9:11) ప్రజలు తన బోధకు ఎలా ప్రతిస్పందిస్తారో చూడకముందే యేసు వారిపై కనికరపడ్డాడని గమనించండి. వేరే మాటల్లో చెప్పాలంటే, ఆ జనసమూహానికి బోధించిన ఫలితంగా ఆయనకు వారిపై వాత్సల్యపూరిత కనికరం కలుగలేదుగానీ అలా బోధించడానికి అదే ఆయనకు ఒక ప్రేరణ అయ్యింది.

‘ఆయన చెయ్యి చాపి, అతన్ని ముట్టుకున్నాడు’

11, 12.(ఎ)బైబిలు కాలాల్లో కుష్ఠరోగులను ఎలా చూసేవారు, కానీ “కుష్ఠరోగముతో నిండిన” వ్యక్తి యేసును సమీపించినప్పుడు ఆయనెలా ప్రతిస్పందించాడు? (బి) యేసు స్పర్శ ఆ కుష్ఠరోగిపై ఎలాంటి ప్రభావం చూపివుంటుంది, దీనిని ఒక డాక్టరు అనుభవం ఎలా ఉదహరిస్తోంది?

11 బాధ తొలగించడానికి కదిలించబడ్డాడు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న ప్రజలు యేసులో కనికరం ఉందని తెలుసుకున్నారు, అందుకే వారు ఆయన దగ్గరకొచ్చారు. జనసమూహములు వెంటరాగా, “కుష్ఠరోగముతో నిండిన” ఒక వ్యక్తి యేసును సమీపించినప్పుడు ఇది ప్రత్యేకంగా స్పష్టమయ్యింది. (లూకా 5:12) బైబిలు కాలాల్లో, రోగం ఇతరులకు సోకకుండా కాపాడేందుకు కుష్ఠరోగులను దూరంగా ఉంచేవారు. (సంఖ్యాకాండము 5:1-4) కానీ రబ్బీ సంబంధ నాయకులు చివరకు కుష్ఠరోగంపట్ల నిర్దయగల దృక్కోణాన్ని వృద్ధిచేసి, వారిపై తమ సొంత కఠిన నియమాలను విధించారు. * అయితే ఒక కుష్ఠరోగి విషయంలో యేసు ప్రతిస్పందనను గమనించండి: “ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని—నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టి—నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను.” (మార్కు 1:40-42) ఆ కుష్ఠరోగి అప్పుడు అక్కడ ఉండడమే ధర్మశాస్త్ర విరుద్ధమని యేసుకు తెలుసు. అయినప్పటికీ, అతడ్ని త్రోసిపుచ్చడానికి బదులు, యేసు బహుగా కదిలించబడి ఎవరూ ఊహించని పనిచేశాడు. యేసు అతడ్ని ముట్టుకున్నాడు.

12 అలా ముట్టుకోవడం ఆ కుష్ఠరోగిపై ఎలాంటి ప్రభావం చూపివుంటుందో మీరు ఊహించగలరా? ఉదాహరణకు, ఈ అనుభవాన్ని పరిశీలించండి. కుష్ఠరోగ నిపుణుడైన డాక్టర్‌ పాల్‌ బ్రాండ్‌ ఇండియాలో తాను చికిత్సచేసిన ఒక కుష్ఠరోగి గురించి వివరిస్తున్నాడు. పరీక్షా సమయంలో డాక్టరు ఆ కుష్ఠరోగి భుజంమీద చెయ్యివేసి, అతడు పొందవలసిన చికిత్స గురించి ఒక అనువాదకురాలి ద్వారా వివరించాడు. ఆ మరుక్షణమే ఆ కుష్ఠరోగి కంటనీరు పెట్టాడు. “నేను తప్పు మాట్లాడానా?” అని డాక్టరు అడిగాడు. అనువాదకురాలు ఆ రోగి భాషలో ఆ ప్రశ్న అడిగి ఇలా జవాబిచ్చింది: “లేదు డాక్టర్‌. మీరు తన భుజంచుట్టూ చెయ్యివేసి మాట్లాడినందుకు అతడు కంటనీరు పెట్టాడు. అతను ఇక్కడకు రాకముందు చాలా సంవత్సరాలపాటు ఎవ్వరూ అతణ్ణి ముట్టుకోలేదు.” యేసు దగ్గరకొచ్చిన కుష్ఠరోగి విషయంలో, అలా ముట్టుకోవడం ఇంకా ఎక్కువ ప్రభావం చూపింది. అంటరాని వానిగాచేసిన అతని రోగాన్ని ఆ స్పర్శ మటుమాయం చేసింది.

13, 14.(ఎ)నాయీను పట్టణం సమీపిస్తుండగా యేసుకు ఏ ఊరేగింపు ఎదురయ్యింది, దానిని ప్రత్యేకంగా ఏది విషాదభరితం చేసింది? (బి) యేసు ఆ నాయీను విధవరాలి పక్షాన ఎలాంటి చర్య తీసుకోవడానికి కనికరం ఆయనను కదిలించింది?

13 దుఃఖం పోగొట్టడానికి కదిలించబడ్డాడు. ఇతరుల దుఃఖంచూసి యేసు ప్రగాఢంగా కదిలించబడ్డాడు. ఉదాహరణకు, లూకా 7:11-15​లోని వృత్తాంతాన్ని పరిశీలించండి. యేసు పరిచర్య మధ్యకాలంలో అది జరిగింది. యేసు గలిలయ పట్టణమైన నాయీను పొలిమేరలు సమీపించాడు. ఆయన ఆ ఊరి గవిని దగ్గరకొచ్చినప్పుడు, ఆయనకు అంత్యక్రియల ఊరేగింపు ఎదురయ్యింది. పరిస్థితులు ప్రత్యేకంగా చాలా విషాదకరంగా ఉన్నాయి. యౌవనుడైన ఒకే ఒక కుమారుడు చనిపోయాడు, అతని తల్లి విధవరాలు. ఆమె ముందొకసారి, తన భర్త చనిపోయినప్పుడు కూడా బహుశా అలాంటి ఊరేగింపులో ఉండి ఉండవచ్చు. ఈసారి ఆమె కుమారుడు చనిపోయాడు, బహుశా ఆమెకున్న ఆసరా అతడొక్కడే కావచ్చు. ఆమెతోపాటు ఆ ఊరేగింపులో విలాపకులు, విషాద గీతాలు వాయించే వాద్యకారులు కూడా ఉండవచ్చు. (యిర్మీయా 9:17, 18; మత్తయి 9:23) అయితే తన కుమారుని శవం ప్రక్కనే దుఃఖభారంతో నడుస్తున్న ఆ తల్లిపై యేసు తన దృష్టి నిలిపాడు.

14 వియోగంతో దుఃఖిస్తున్న ఆ తల్లిపై యేసు ‘కనికరపడ్డాడు.’ ఓదార్పు ఉట్టిపడే స్వరంతో ఆయన, “ఏడువవద్దు” అని ఆమెకు చెప్పాడు. ఎవరూ అడక్కుండానే ఆయన పాడె దగ్గరకువెళ్లి దానిని ముట్టుకున్నాడు. పాడె మోసేవారితోపాటు బహుశా మిగిలినవారు కూడా ఆగారు. అప్పుడు యేసు అధికార స్వరంతో ఆ నిర్జీవ శరీరంతో ఇలా అన్నాడు: “చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను.” ఆ తర్వాత ఏం జరిగింది? గాఢనిద్ర నుండి లేచినట్లుగా ‘ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాడు.’ ఆ పిమ్మట ఎంతో చలింపజేసే ఈ మాట చెప్పబడింది: “ఆయన [యేసు] అతనిని అతని తల్లికి అప్పగించెను.”

15.(ఎ)యేసు కనికరంతో కదిలించబడడానికి సంబంధించిన బైబిలు వృత్తాంతాలు కనికరానికీ తీసుకొనే చర్యకూ మధ్య ఎలాంటి సంబంధాన్ని చూపిస్తున్నాయి? (బి) ఈ విషయంలో మనం యేసును ఎలా అనుకరించవచ్చు?

15 ఈ వృత్తాంతాల నుండి మనమేమి నేర్చుకుంటున్నాము? ప్రతీ దానిలో కనికరానికీ, తీసుకున్న చర్యకూ మధ్య సంబంధాన్ని గమనించండి. కనికరంతో కదిలించబడకుండా యేసు ఇతరుల దురవస్థను చూడలేకపోయాడు, అలాగే ఆ మేరకు చర్య తీసుకోకుండా ఆయన అలాంటి కనికరం చూపలేకపోయాడు. ఆయన మాదిరిని మనమెలా అనుసరించవచ్చు? క్రైస్తవులుగా మనకు సువార్త ప్రకటించి ఇతరులను శిష్యులుగాచేసే బాధ్యత ఉంది. ప్రాథమికంగా మనం దేవునిపై ప్రేమతో పురికొల్పబడతాం. అయితే ఇది కనికరంతో కూడుకున్న పని అని కూడా మనం గుర్తుంచుకుందాం. యేసు మాదిరిగానే మనకూ ప్రజలపట్ల తదనుభూతి ఉన్నప్పుడు, వారితో సువార్త పంచుకోవడానికి మనకు సాధ్యమైనంతా చేయడానికి మన హృదయం మనలను పురికొల్పుతుంది. (మత్తయి 22:37-39) మరి బాధ లేదా దుఃఖం అనుభవిస్తున్న తోటి విశ్వాసులపట్ల కనికరంచూపే మాటేమిటి? మనం శారీరక రుగ్మతను అద్భుతరీతిలో స్వస్థపరచలేము లేదా మృతులను అద్భుతరీతిలో తిరిగి లేపలేము. అయితే మన చింతను వ్యక్తం చేయడం ద్వారా లేదా సముచితంగా ఆచరణాత్మక సహాయం అందించడం ద్వారా మనం కనికరాన్ని క్రియారూపంలో పెట్టవచ్చు.—ఎఫెసీయులు 4:32.

‘తండ్రీ, వీరిని క్షమించుము’

16.యేసు హింసాకొయ్యపై ఉన్నప్పుడు కూడా క్షమించేందుకు ఆయనకున్న సుముఖత ఎలా స్పష్టమయ్యింది?

16 మరో ప్రాముఖ్యమైన విధానంలో అంటే ‘క్షమించడానికి సిద్ధమైన మనస్సుతో’ ఉండడం ద్వారా యేసు తన తండ్రి ప్రేమను సంపూర్ణంగా ప్రతిబింబించాడు. (కీర్తన 86:5) ఆయన హింసాకొయ్యపై ఉన్నప్పుడు సైతం ఈ ఇష్టత స్పష్టమయింది. చేతులు, పాదాలు మేకులతో చీల్చబడి అవమానకరంగా మరణిస్తూ కూడా యేసు దేని గురించి మాట్లాడాడు? తనను చంపుతున్న వారిని శిక్షించమని ఆయన యెహోవాకు మొరపెట్టాడా? దానికి భిన్నంగా ఆయన పలికిన చివరి మాటల్లో, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” అనే మాటలు కూడా ఉన్నాయి.—లూకా 23:34. *

17-19.మూడుసార్లు తనను నిరాకరించినందుకు అపొస్తలుడైన పేతురును తాను క్షమించానని యేసు ఏయే విధాలుగా చూపించాడు?

17 అపొస్తలుడైన పేతురుతో ఆయన వ్యవహరించిన విధానంలో యేసు క్షమాపణకు బహుశా మరింత ప్రభావవంతమైన ఉదాహరణ చూడవచ్చు. పేతురు యేసును ప్రియాతి ప్రియంగా ప్రేమించాడని చెప్పడంలో సందేహమే లేదు. నీసాను 14న, యేసు భూజీవితపు చివరి రాత్రి, పేతురు ఆయనతో ఇలా అన్నాడు: “ప్రభువా, నీతో కూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నాను.” కానీ ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే యేసు తనకు తెలుసనే విషయాన్ని పేతురు మూడుసార్లు నిరాకరించాడు. పేతురు మూడవసారి నిరాకరించినప్పుడు ఏమి జరిగిందో బైబిలు మనకిలా తెలియజేస్తోంది: “ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను.” తన పాపపు భారం భరించలేక పేతురు “వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.” యేసు ఆ పిమ్మట అదే రోజు చనిపోయినప్పుడు, ‘నా ప్రభువు నన్ను క్షమించి ఉంటాడా?’ అని ఆ అపొస్తలుడు గాఢంగా ఆలోచించి ఉండవచ్చు.—లూకా 22:33, 61, 62.

18 జవాబుకోసం పేతురు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడలేదు. నీసాను 16 ఉదయాన యేసు పునరుత్థానం చేయబడ్డాడు, అదే రోజు ఆయన పేతురును సందర్శించాడని తెలుస్తోంది. (లూకా 24:34; 1 కొరింథీయులు 15:4-8) తనను అంతగా నిరాకరించిన ఆ అపొస్తలునికి యేసు ఎందుకంత ప్రత్యేక శ్రద్ధనిచ్చాడు? పశ్చాత్తాపపడుతున్న పేతురుకు, ప్రభువు ఆయనను ఇంకా ప్రేమిస్తున్నాడనీ విలువైనవానిగా పరిగణిస్తున్నాడనీ హామీ ఇవ్వాలని యేసు కోరుకుని ఉండవచ్చు. అయితే పేతురును ప్రోత్సహించడానికి యేసు ఇంకా ఎక్కువే చేశాడు.

19 ఆ తర్వాత కొంత సమయానికి, యేసు గలిలయ సముద్రం దగ్గర శిష్యులకు కనిపించాడు. ఆ సందర్భంలో, (మూడుసార్లు తన ప్రభువును నిరాకరించిన) పేతురుకు తన పట్ల ఉన్న ప్రేమ విషయంలో ఆయనను యేసు మూడుసార్లు ప్రశ్నించాడు. మూడవసారి అడిగిన తర్వాత, పేతురు ఇలా జవాబిచ్చాడు: “ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువు.” వాస్తవానికి, హృదయాలను చదవగల యేసుకు తనపట్ల పేతురుకున్న ప్రేమానురాగాల గురించి పూర్తిగా తెలుసు. అయినప్పటికీ తన ప్రేమను స్థిరంగా చెప్పే అవకాశం యేసు పేతురుకిచ్చాడు. అంతకంటే ఎక్కువగా తన “గొఱ్ఱె పిల్లలను” “మేపుమని,” “కాయుమని” యేసు పేతురుకు ఆజ్ఞాపించాడు. (యోహాను 21:15-17) అంతకుముందు, పేతురు ప్రకటించే నియామకం పొందాడు. (లూకా 5:10) ఇప్పుడైతే, అతనిపై అసాధారణ నమ్మకానికి రుజువుగా యేసు అతనికి మరింత బరువైన బాధ్యతను అంటే క్రీస్తు అనుచరులయ్యే వారిపట్ల శ్రద్ధచూపే బాధ్యతను ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దికాలానికే, యేసు శిష్యుల కార్యకలాపాల్లో పేతురుకు ప్రధాన పాత్ర అప్పగించాడు. (అపొస్తలుల కార్యములు 2:1-41) యేసు తనను క్షమించాడనీ తననింకా నమ్ముతున్నాడనీ తెలుసుకొన్న పేతురు మనస్సు ఎంత కుదుటపడి ఉంటుందో గదా!

“క్రీస్తు ప్రేమ” మీకు తెలుసా?

20, 21.మనం ‘క్రీస్తు ప్రేమను’ పూర్తిగా ఎలా ‘తెలుసుకోగలం’?

20 నిజానికి యెహోవా వాక్యం, క్రీస్తు ప్రేమను రమ్యంగా వర్ణిస్తోంది. కానీ యేసు ప్రేమకు మనమెలా ప్రతిస్పందించాలి? ‘జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోమని’ బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. (ఎఫెసీయులు 3:19) మనం చూసినట్లుగా, యేసు జీవితానికి, పరిచర్యకు సంబంధించిన సువార్త వృత్తాంతాలు క్రీస్తు ప్రేమ గురించి మనకెంతో బోధిస్తాయి. అయితే, “క్రీస్తు ప్రేమను” పూర్తిగా ‘తెలుసుకోవడం’ అంటే బైబిలు ఆయన గురించి ఏమిచెబుతోందో తెలుసుకోవడం మాత్రమే కాదు.

21 ‘తెలుసుకొను’ అని అనువదించబడిన గ్రీకు పదానికి “ఆచరణాత్మకంగా, అనుభవపూర్వకంగా” తెలుసుకోవడమని అర్థం. ఇతరుల కోసం నిస్వార్థంగా శ్రమించడం ద్వారా, వారి అవసరతలపట్ల కనికరంతో ప్రతిస్పందించడం ద్వారా, వారిని మనస్ఫూర్తిగా క్షమించడం ద్వారా మనం యేసు చూపినట్లుగా ప్రేమ చూపినప్పుడు మనమాయన భావాలను నిజంగా అర్థంచేసుకోగలం. ఇలా అనుభవపూర్వకంగా మనం ‘జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొంటాము.’ మనమెంత ఎక్కువగా క్రీస్తులా తయారవుతామో, అంత ఎక్కువగా మనం క్రీస్తు సంపూర్ణంగా అనుకరించిన మన ప్రేమగల దేవుడైన యెహోవాకు సన్నిహితులమవుతామని ఎన్నటికీ మరచిపోకుండా ఉందాం.

^ రబ్బీ సంబంధ నియమాల ప్రకారం ఎవరైనాసరే కుష్ఠరోగికి నాలుగు మూరలకు మించి (1.8 మీటర్లకంటే) దగ్గరకు రాకూడదు. ఒకవేళ గాలివీస్తుంటే ఆ కుష్ఠరోగి 100 మూరల (45 మీటర్ల) దూరంలో ఉండాలి. ఒక రబ్బీ కుష్ఠరోగులకు దూరంగా దాక్కున్నాడని, మరొక రబ్బీ కుష్ఠరోగులను దూరంగా ఉంచడానికి వారిపై రాళ్లు విసిరేవాడని మిద్రాష్‌ రబ్బా చెబుతోంది. అందువల్ల తిరస్కారం, ఈసడింపు, తాము అక్కర్లేదనే భావాల బాధ కుష్ఠరోగులకు తెలుసు.

^ లూకా 23:34​లోని మొదటి భాగం కొన్ని ప్రాచీన ప్రతుల్లో చేర్చబడలేదు. అయితే, ఈ మాటలు ఇతర అనేక అధికారిక చేవ్రాత ప్రతుల్లో ఉన్నాయి కాబట్టి అవి నూతనలోక అనువాదములోను, అనేక ఇతర అనువాదాల్లోను చేర్చబడ్డాయి. యేసు తనను వ్రేలాడదీసిన రోమా సైనికుల గురించి మాట్లాడుతున్నాడని స్పష్టమవుతోంది. నిజానికి యేసు ఎవరో వారికి తెలియదు కాబట్టి, వారేమి చేస్తున్నారో వారికి తెలియదు. ఆ మరణాన్ని పురికొల్పిన మతనాయకులు నిస్సందేహంగా నిందార్హులే, ఎందుకంటే వారు బుద్ధిపూర్వకంగా కీడు తలపెట్టారు. వారిలో అనేకులకు క్షమాపణ దొరకడం అసాధ్యం.—యోహాను 11:45-53.