కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 31

‘దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు’

‘దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు’

1-3.(ఎ)తలిదండ్రులకు వారి పాపకు మధ్య పరస్పర ప్రతిస్పందనలు గమనించడం ద్వారా మానవ నైజం గురించి మనమేమి తెలుసుకోవచ్చు? (బి) మనపట్ల ఎవరైనా ప్రేమ చూపిస్తే సహజంగానే ఎలాంటి ప్రక్రియ మొదలవుతుంది, మనకు మనం ఎలాంటి ప్రాముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి?

 తమ పసిపాప బోసినవ్వులు చూసి తలిదండ్రులు సంబరపడతారు. వారు తరచూ ఆ పాప ముఖానికి తమ ముఖం ఆనించి కూనిరాగాలు తీస్తూ, భావయుక్తంగా నవ్వుతూ, ఆ పాపలో ప్రతిస్పందన చూడాలని ఉవ్విళ్లూరుతారు. ఎక్కువ రోజులు గడవకముందే సొట్ట బుగ్గలతో పెదవులు వంకీలు తిప్పుతూ ఆ పాప ఆనందంగా నవ్వడం మొదలుపెడుతుంది. ఆ చిరునవ్వు తలిదండ్రుల అనురాగానికి ప్రతిస్పందనగా ఆ పాప తనదైన రీతిలో వ్యక్తం చేస్తున్న చిరుప్రేమను సూచిస్తుంది.

2 ఆ పాప చిరునవ్వు మానవ నైజం గురించి ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనకు గుర్తుచేస్తుంది. ప్రేమకు మన సహజ స్పందన ప్రేమే. మనం రూపొందించబడిన తీరే అలాంటిది. (కీర్తన 22:9) మనం పెరిగేకొలది ప్రేమకు ప్రతిస్పందించే సామర్థ్యంలో మనం పరిణతి చెందుతాము. మీ చిన్నతనంలో మీ తలిదండ్రులు, బంధువులు, స్నేహితులు మీపట్ల ప్రేమనెలా చూపించేవారో బహుశా మీరు గుర్తుతెచ్చుకోవచ్చు. మీ హృదయంలో ఆప్యాయతా భావం మొలకెత్తి, వికసించి క్రియారూపం దాల్చింది. మీరు తిరిగి మీ ప్రేమను వ్యక్తం చేశారు. యెహోవా దేవునితో మీ సంబంధంలో అలాంటి విధానమే వికసిస్తోందా?

3 బైబిలు ఇలా చెబుతోంది: “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.” (1 యోహాను 4:19) ఈ పుస్తకంలో 1 నుండి 3 విభాగాల్లో మీ ప్రయోజనం నిమిత్తం యెహోవా దేవుడు ప్రేమపూర్వకంగా తన శక్తిని, తన న్యాయాన్ని, తన జ్ఞానాన్ని వినియోగించాడని మీకు గుర్తుచేయబడింది. 4వ భాగంలో, ఆయన మానవాళిపట్ల, వ్యక్తిగతంగా మీపట్ల గమనించదగ్గ రీతిలో తన ప్రేమను సూటిగా ఎలా వ్యక్తపరిచాడో మీరు చూశారు. ఇప్పుడొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక విధంగా అది మీకైమీరు వేసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న, అదేమిటంటే, ‘యెహోవా ప్రేమకు నేనెలా ప్రతిస్పందిస్తాను?’

దేవుణ్ణి ప్రేమించడమంటే అర్థమేమిటి?

4.దేవుణ్ణి ప్రేమించడమంటే ఏమిటనే విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళంలో ఉన్నారు?

4 ఇతరుల్లోని శ్రేష్ఠమైన లక్షణాలను బయటకు తీసుకురాగల శక్తి ప్రేమకు ఉందని ప్రేమకు మూలకర్తయైన యెహోవాకు తెలుసు. అందుకే అవిశ్వాస మానవాళి పదే పదే తిరుగుబాటుచేసినా, తన ప్రేమకు మానవుల్లో కొందరైనా ప్రతిస్పందిస్తారనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. నిజానికి, లక్షలాదిమంది ప్రతిస్పందించారు. అయితే ఈ అవినీతికర లోకపు మతాలు దేవుణ్ణి ప్రేమించడమంటే ఏమిటనే విషయంలో ప్రజలను గందరగోళంలో పడేశాయి. అసంఖ్యాకులు తాము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటారు కానీ అలాంటి ప్రేమ మాటల్లో మాత్రమే వ్యక్తం చేయవలసిన భావమని వారనుకుంటున్నట్లుంది. ఒక పాప తలిదండ్రులపట్ల తనతొలి ప్రేమను చిరునవ్వులో చూపినట్లు, దేవునిపట్ల మన ప్రేమ అలాగే ఆరంభంకావచ్చు. అయితే ఎదిగిన వారి ప్రేమలో ఇంకా ఎక్కువ ఉంటుంది.

5.దేవుని ప్రేమను బైబిలు ఎలా నిర్వచిస్తోంది, ఆ నిర్వచనం మనకెందుకు ఆకర్షణీయంగా ఉండాలి?

5 తనను ప్రేమించడం అంటే ఏమిటో యెహోవా నిర్వచిస్తున్నాడు. ఆయన వాక్యమిలా చెబుతోంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట.” కాబట్టి దేవుని పట్ల ప్రేమను క్రియల్లో వ్యక్తపరచాలి. నిజమే, చాలామందికి విధేయత అనే ఆలోచన ఆకర్షణీయంగా ఉండదు. అయితే అదే వచనం దయాపూర్వకంగా ఇంకా ఇలా చెబుతోంది: “ఆయన [దేవుని] ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) యెహోవా నియమాలు సూత్రాలు మనలను అణగద్రొక్కడానికి కాదుగానీ మనకు ప్రయోజనం చేకూర్చడానికే రూపొందించబడ్డాయి. (యెషయా 48:17,18) దేవుని వాక్యం నిండా మనమాయనకు సన్నిహితం కావడానికి సహాయపడే సూత్రాలు ఉన్నాయి. అలాగని ఎలా చెప్పవచ్చు? దేవునితో మన సంబంధం గురించిన మూడు అంశాలను మనం పరిశీలిద్దాం. అవేమిటంటే, సంభాషణ, ఆరాధన, అనుకరణ.

యెహోవాతో సంభాషించడం

6-8.(ఎ)దేని మాధ్యమంగా మనం యెహోవా చెప్పేది వినవచ్చు? (బి) మనం లేఖనాలు చదివేటప్పుడు వాటినెలా సజీవంగా చేసుకోవచ్చు?

6 మొదటి అధ్యాయం “దేవునితో సంభాషించడాన్ని మీరు ఊహించుకోగలరా?” అనే ప్రశ్నతో ఆరంభమయింది. అది ఊహాజనిత తలంపుకాదని మనం చూశాము. మోషే నిజానికి అలాగే సంభాషించాడు. మన విషయమేమిటి? ఇది మానవులతో మాట్లాడేందుకు యెహోవా తన దేవదూతలను పంపించే కాలం కాదు. అయితే నేడు మనతో సంభాషించేందుకు యెహోవాకు అత్యుత్తమ మాధ్యమముంది. యెహోవా చెప్పేది మనమెలా వినవచ్చు?

7 ‘ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది’ కాబట్టి యెహోవా వాక్యమైన బైబిలు చదవడం ద్వారా మనమాయన చెప్పేది వింటాము. (2తిమోతి 3:16) “దివారాత్రము” అలా చదవాలని కీర్తనకర్త యెహోవా సేవకులకు ఉద్బోధించాడు. (కీర్తన 1:1, 2) అలా చదవడానికి మన తరఫు నుండి తగిన ప్రయత్నం అవసరం. అయితే అలాచేసే ప్రయత్నాలన్నీ విలువైనవిగానే ఉంటాయి. మనం 18వ అధ్యాయంలో చూసినట్లుగా బైబిలు మన పరలోకపు తండ్రినుండి మనకొచ్చిన ప్రశస్తమైన ఉత్తరంలాంటిది. కాబట్టి దానిని చదవడం ఏదో రోజువారీ దినచర్యగా ఉండకూడదు. లేఖనాలు చదివేటప్పుడు అవి మనకు సజీవంగా ఉండేలా చేసుకోవాలి. మనం అలా ఎలా చేసుకోవచ్చు?

8 మీరు బైబిలు వృత్తాంతాలను చదివేటప్పుడు వాటిని దృశ్యీకరించుకోండి. బైబిలు పాత్రలను నిజవ్యక్తులుగా మనస్సులో ఊహించుకోవడానికి ప్రయత్నించండి. వారి నేపథ్యాన్ని, పరిస్థితులను, ఉద్దేశాలను గ్రహించడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత, మీకైమీరు ‘ఈ వృత్తాంతం యెహోవా గురించి నాకేమి బోధిస్తోంది? దీనిలో ఆయన ఏ లక్షణాలు నొక్కిచెప్పబడ్డాయి? ఏ సూత్రం నేను నేర్చుకోవాలని యెహోవా కోరుతున్నాడు, జీవితంలో నేను ఈ సూత్రాన్ని ఎలా అనువర్తించుకోగలను?’ అనే ప్రశ్నలు వేసుకుంటూ మీరు చదివేదాని గురించి లోతుగా ఆలోచించండి. చదవండి, ధ్యానించండి, అనువర్తించుకోండి. మీరలా చేస్తున్నప్పుడు దేవుని వాక్యం మీకు సజీవంగా ఉంటుంది.—కీర్తన 77:12; యాకోబు 1:23-25.

9.“నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఎవరు, ఆ “దాసుడు” చెప్పేది మనం శ్రద్ధగా వినడం ఎందుకు ప్రాముఖ్యం?

9నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా కూడా యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. యేసు ముందే చెప్పినట్లుగా, వేదనభరితమైన ఈ అంత్యదినాల్లో ఆధ్యాత్మిక ‘అన్నము తగినవేళ పెట్టడానికి’ అభిషిక్త క్రైస్తవ పురుషుల చిన్న గుంపు ఒకటి నియమించబడింది. (మత్తయి 24:45-47) మనం బైబిలు ప్రామాణిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సిద్ధం చేయబడిన సాహిత్యాలు చదివినప్పుడు, క్రైస్తవ కూటాలకు, సమావేశాలకు హాజరైనప్పుడు ఆ దాసుని ద్వారా మనం ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందుతున్నాం. ఆ తరగతి క్రీస్తుకు దాసుడు కాబట్టి మనం యేసు చెప్పిన ఈ మాటలను జ్ఞానయుక్తంగా అన్వయించుకుంటాము: ‘మీరు ఎలా వింటున్నారో చూచుకోండి.’ (లూకా 8:18) మనం శ్రద్ధగా వింటాం, ఎందుకంటే యెహోవా మనతో సంభాషించడానికి ఉపయోగించే మాధ్యమాల్లో ఒకటి నమ్మకమైన దాసుడని మనం గుర్తిస్తాం.

10-12.(ఎ)ప్రార్థన ఎందుకు యెహోవా ఇచ్చిన అద్భుత వరం? (బి) యెహోవాకు సంతోషం కలిగించేలా మనమెలా ప్రార్థించవచ్చు, మన ప్రార్థనలను ఆయన విలువైనవిగా పరిగణిస్తాడని మనమెందుకు నమ్మకంతో ఉండవచ్చు?

10 అయితే దేవునితో సంభాషించే మాటేమిటి? మనం యెహోవాతో మాట్లాడగలమా? ఆ తలంపే మనలో భక్తిపూర్వక భయం కలిగిస్తుంది. మీ వ్యక్తిగత చింతల్లో కొన్నింటి గురించి చెప్పుకునేందుకు మీరు మీ దేశంలో అత్యున్నత అధికారంలో ఉన్న ఒక పాలకుని దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తే అది ఎంతవరకు సఫలమయ్యే అవకాశముంటుంది? కొందరి విషయంలో ఆ ప్రయత్నమే ప్రమాదకరం కావచ్చు! ఎస్తేరు మొర్దెకైల కాలంలో, రాజు నుండి ఆహ్వానంలేకుండా పారసీక చక్రవర్తి దగ్గరకు వెళ్లే వ్యక్తి సంహరించబడే ప్రమాదముండేది. (ఎస్తేరు 4:10,11) ఇప్పుడు, విశ్వ సర్వాధిపతిని సమీపించడాన్ని ఊహించండి, ఆయనతో పోలిస్తే మానవుల్లో అత్యధిక అధికారంగలవారు సైతం “మిడతలవలె” కనబడతారు. (యెషయా 40:22) ఆయనను సమీపించడానికి మనం భయపడాలా? ఎంతమాత్రం భయపడాల్సిన అవసరం లేదు.

11 తనను సమీపించడానికి యెహోవా బాహాటమైన, సుళువైన మాధ్యమాన్ని ఏర్పాటుచేశాడు, అదే ప్రార్థన. చిన్నపిల్లవాడు సైతం యేసు నామమున విశ్వాసంతో యెహోవాకు ప్రార్థించవచ్చు. (యోహాను 14:6; హెబ్రీయులు 11:6) అంతేకాదు ప్రార్థన మన అత్యంత సంశ్లిష్టమైన, ఆంతరంగిక తలంపులను, భావాలను, చివరకు మాటల్లో పెట్టడానికి కష్టమయ్యే బాధాకర విషయాలను సైతం ఆయనకు చెప్పుకోగలిగేలా చేస్తుంది. (రోమీయులు 8:26) భాషాపాఠవాన్ని ఉపయోగిస్తూ రమ్యమైన పదాలను వాడుతూ సుదీర్ఘంగా, అనేకమాటలు వల్లిస్తూ ప్రార్థించి యెహోవాను ముగ్ధుణ్ణి చేయాలని ప్రయత్నించడంలో ప్రయోజనం ఏమీలేదు. (మత్తయి 6:7, 8) మరో వైపున, యెహోవా తనతో మనం ఎంతసేపు లేదా ఎంత తరచుగా మాట్లాడవచ్చుననే దానికి పరిమితులను పెట్టలేదు. “యెడతెగక ప్రార్థనచేయుడి” అని కూడా ఆయన వాక్యం మనలను ఆహ్వానిస్తోంది.—1 థెస్సలొనీకయులు 5:17.

12 యెహోవా మాత్రమే “ప్రార్థన ఆలకించువాడు” అని పిలువబడ్డాడని, ఆయన నిజమైన తదనుభూతితో వింటాడని గుర్తుంచుకోండి. (కీర్తన 65:2) ఆయన తన నమ్మకమైన సేవకుల ప్రార్థనలు తప్పదన్నట్లు వింటాడా? లేదు, నిజానికి ఆయన వాటినిబట్టి సంతోషిస్తాడు. అలాంటి ప్రార్థనలను ఆయన వాక్యం ధూపద్రవ్యాలతో పోలుస్తోంది, ఆ ధూపద్రవ్యాలు కాల్చడంవల్ల సువాసనగల, సేదనిచ్చే పొగ పైకి లేస్తుంది. (కీర్తన 141:2; ప్రకటన 5:8; 8:4) నిష్కపటమైన మన ప్రార్థనలు కూడా పైకి వెళ్లి సర్వాధికారియైన ప్రభువుకు సంతోషం కలిగిస్తాయని ఆలోచించడం ఓదార్పుకరంగా లేదా? కాబట్టి మీరు యెహోవాకు సన్నిహితం కావాలని కోరుకుంటే ప్రతీ రోజు వినయంతో ఆయనకు తరచూ ప్రార్థనచేయండి. ఏదీ దాచుకోకుండా మీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించండి. (కీర్తన 62:8) మీ పరలోకపు తండ్రితో మీ చింతలను, మీ ఆనందాన్ని, మీ కృతజ్ఞతను, మీ స్తుతులను పంచుకోండి. దాని ఫలితంగా మీకూ ఆయనకూ మధ్య అనుబంధం అంతకంతకు బలోపేతమవుతుంది.

యెహోవాను ఆరాధించడం

13, 14.యెహోవాను ఆరాధించడమంటే దాని అర్థమేమిటి, మనం ఆయనను ఆరాధించడం ఎందుకు సరైనది?

13 మనం యెహోవా దేవునితో సంభాషించడమంటే ఒక స్నేహితునితోనో బంధువుతోనో మాట్లాడుతున్నట్లు, వాళ్ళు చెప్పేది వింటున్నట్లు కాదు. నిజానికి మనం, మన భక్తి గౌరవాలను పొందడానికి ఎంతో అర్హుడైన ఆయనకు వాటిని చెల్లిస్తూ ఆయనను ఆరాధిస్తున్నట్లే. సత్యారాధనచే మన యావత్‌ జీవితం నడిపించబడుతుంది. ఈ ఆరాధనా విధానంలో మనం యెహోవాపట్ల మన పూర్ణాత్మ ప్రేమను, భక్తిని వ్యక్తపరుస్తాము, అంతేకాదు సత్యారాధన యెహోవా నమ్మకమైన ప్రాణులు పరలోకంలోవున్నా లేక భూమ్మీదవున్నా వారందరినీ ఐక్యపరుస్తుంది. ఒక దర్శనంలో అపొస్తలుడైన యోహాను ఒక దేవదూత ఈ ఆజ్ఞను ప్రకటించడాన్ని విన్నాడు: “ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము [‘ఆరాధన,’ NW] చేయుడి.”—ప్రకటన 14:7.

14 మనం యెహోవాను ఎందుకు ఆరాధించాలి? మనం పరిశీలించిన పరిశుద్ధత, శక్తి, ఆత్మ నిగ్రహం, న్యాయం, ధైర్యం, కరుణ, జ్ఞానం, వినయం, ప్రేమ, కనికరం, విశ్వసనీయత, మంచితనం వంటి లక్షణాల గురించి ఆలోచించండి. ప్రశస్తమైన ప్రతీ గుణానికి సంబంధించి సాధ్యమైనంత సర్వోత్తమ ప్రమాణ శిఖరాగ్రానికి యెహోవా ప్రతీకగా ఉన్నాడని మనం చూశాము. ఆయన లక్షణాలన్నింటిని గ్రహించడానికి మనం ప్రయత్నించినప్పుడు, ఆయన గొప్పవాడైన ఒక శ్లాఘనీయ వ్యక్తికంటే మరెంతో ఘనుడని గ్రహిస్తాం. ఆయన మహిమాన్వితా ప్రభావం అపరిమిత స్థాయిలో మనకు అందనంత ఎత్తులో ఉంది. (యెషయా 55:9) కాబట్టి నిస్సందేహంగా, యెహోవాయే న్యాయంగా మన సర్వాధిపతి, నిశ్చయంగా ఆయన మన ఆరాధనకు అర్హుడు. కానీ యెహోవాను మనమెలా ఆరాధించాలి?

15.యెహోవాను “ఆత్మతోను సత్యముతోను” మనమెలా ఆరాధించవచ్చు, క్రైస్తవ కూటాలు మనకెలాంటి అవకాశమిస్తాయి?

15 యేసు ఇట్లన్నాడు: “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.” (యోహాను 4:24) దేవుణ్ణి “ఆత్మతో” ఆరాధించాలంటే, మనం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అలాగే మన ఆరాధన దేవుని వాక్యంలో ఉన్న సత్యానికి, అంటే ప్రామాణిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉండాలి. మనం తోటి ఆరాధకులతో సమావేశమైన ప్రతీసారీ యెహోవాను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించే ప్రశస్తమైన అవకాశం మనకుంది. (హెబ్రీయులు 10:24, 25) యెహోవాకు మనం స్తుతి గీతాలు పాడినప్పుడు, ఐక్యంగా ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయన వాక్య చర్చలను విన్నప్పుడు వాటిలో భాగం వహించినప్పుడు సత్యారాధనలో ఆయనపట్ల మనం మన ప్రేమను వ్యక్తం చేస్తాం.

16.నిజ క్రైస్తవులకు అప్పగించబడిన మహాగొప్ప ఆజ్ఞల్లో ఒకటి ఏమిటి, దానికి లోబడడానికి మనమెందుకు పురికొల్పబడతాము?

16 ఆయన గురించి ఇతరులతో మాట్లాడుతూ బహిరంగంగా ఆయనను సన్నుతించినప్పుడు కూడా మనం యెహోవాను ఆరాధిస్తున్నట్లే. (హెబ్రీయులు 13:15) అవును, నిజ క్రైస్తవులకు అప్పగించబడిన మహాగొప్ప ఆజ్ఞల్లో యెహోవా రాజ్య సువార్త ప్రకటించడం ఒకటి. (మత్తయి 24:14) మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి మనం ఆ ఆజ్ఞకు అత్యాకాంక్షతో విధేయులమవుతాం. యెహోవా గురించి హానికరమైన అబద్ధాలు ప్రబలింపజేస్తూ “ఈ యుగ సంబంధమైన దేవత” అయిన అపవాదియగు సాతాను “అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము” కలుగజేస్తున్న విధానం గురించి మనం ఆలోచించినప్పుడు, అలాంటి అపవాదును సరిదిద్దేందుకు మన దేవుని పక్షాన సాక్షులుగా పనిచేయాలని మనం ఎంతో ఆకాంక్షించమా? (2 కొరింథీయులు 4:4; యెషయా 43:10-12) యెహోవా ఆశ్చర్యకరమైన లక్షణాలను మనం తలపోసినప్పుడు, ఆయన గురించి ఇతరులకు చెప్పాలనే కోరిక మనలో ఉప్పొంగడం లేదా? నిజానికి, మనలాగే ఇతరులు కూడా మన పరలోకపు తండ్రిని తెలుసుకొని, ఆయనను ప్రేమించేలా వారికి సహాయం చేయడంకంటే ఎక్కువైన ఆధిక్యత మరొకటి ఉండనేరదు.

17.యెహోవాకు మనం చేసే ఆరాధనలో ఏమేమి ఉన్నాయి, మనం యథార్థంగా ఎందుకు ఆరాధించాలి?

17 యెహోవాకు మనం చేసే ఆరాధనలో అంతకంటే ఎక్కువే ఇమిడివుంది. అది మన జీవిత ప్రతీ అంశాన్ని ప్రభావితం చేస్తుంది. (కొలొస్సయులు 3:23) యెహోవాను మనం నిజంగా మన సర్వాధిపత్య ప్రభువుగా అంగీకరిస్తే, ప్రతీ విషయంలో అంటే మన కుటుంబ జీవితంలో, మన లౌకిక ఉద్యోగంలో, ఇతరులతో మన వ్యవహారాలలో, మన విశ్రాంతి సమయాల్లో మనమాయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. యథార్థతతో “హృదయపూర్వకముగా” యెహోవాను సేవించడానికి మనం ప్రయత్నిస్తాం. (1 దినవృత్తాంతములు 28:9) అలాంటి ఆరాధనలో విభాగిత హృదయానికి లేదా ద్వంద జీవితానికి అంటే రహస్యంగా గంభీరమైన పాపాలు చేస్తూనే యెహోవాను సేవిస్తున్నట్లుగా కనిపించే వేషధారణా విధానానికి చోటులేదు. యథార్థత అలాంటి వేషధారణకు అవకాశమివ్వదు; ప్రేమ దానిని ప్రతిఘటిస్తుంది. దేవుని భయం కూడా మనకు సహాయం చేస్తుంది. బైబిలు అలాంటి పూజ్యభావాన్ని యెహోవాతో మనకుండే నిరంతర సాన్నిహిత్యంతో ముడిపెడుతోంది.—కీర్తన 25:14.

యెహోవాను అనుకరించడం

18, 19.అపరిపూర్ణ అల్ప మానవులు యెహోవా దేవుణ్ణి అనుకరించగలరని ఆలోచించడం ఎందుకు వాస్తవికమే?

18 ఈ పుస్తకంలోని ప్రతీ భాగం ‘ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకోవడం’ ఎలాగో తెలియజేసే అధ్యాయంతో ముగిసింది. (ఎఫెసీయులు 5:1) మనం అపరిపూర్ణులమైనప్పటికీ, శక్తిని ఉపయోగించడంలో, న్యాయం అనుసరించడంలో, జ్ఞానయుక్తంగా ప్రవర్తించడంలో, ప్రేమ చూపడంలో యెహోవా పరిపూర్ణ విధానాన్ని నిజంగా అనుకరించగలమని మనం గుర్తుంచుకోవడం ఆవశ్యకం. సర్వశక్తుని అనుకరించడం నిజంగా సాధ్యమేనని మనకెలా తెలుసు? యెహోవా తన సంకల్పాలు నెరవేర్చడానికి తానెలా అనుకుంటే ఆ విధమైన కర్తగా అవగలడని ఆయన పేరుకున్న భావం మనకు బోధిస్తుందని గుర్తుంచుకోండి. ఆ సామర్థ్యం మనలో సహజంగానే భక్తిపూర్వక భయాన్ని నింపుతుంది, అంతమాత్రాన యెహోవాను అనుకరించడం మనకు అసాధ్యమా? కాదు.

19 మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం. (ఆదికాండము 1:26) కాబట్టి, మానవులు భూమ్మీది వేరే ఏ ప్రాణుల్లా లేరు. మనం కేవలం సహజ జ్ఞానం, జన్యుపరమైన లేదా పర్యావరణ పరిస్థితుల ప్రభావంతో ప్రవర్తించం. యెహోవా మనకు ఒక ప్రశస్త వరాన్ని అంటే స్వేచ్ఛాచిత్తాన్ని అనుగ్రహించాడు. మనకు పరిమితులు, అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ మనమెలాంటి వ్యక్తిగా తయారుకావాలనేది ఎన్నుకొనే స్వేచ్ఛ మనకుంది. అధికారాన్ని చక్కగా ఉపయోగించే ప్రేమగల, జ్ఞానయుక్తమైన, న్యాయమైన వ్యక్తిగా తయారుకావాలని మీరు కోరుకుంటున్నారా? యెహోవా ఆత్మ సహాయంతో మీరు ఖచ్చితంగా అలాంటి వ్యక్తిగా తయారుకాగలరు! అలా తయారు కావడం ద్వారా మీరు సాధించగల మేలు గురించి ఆలోచించండి.

20.మనం యెహోవాను అనుకరించినప్పుడు మనమెలాంటి మంచిని సాధిస్తాం?

20 మీ పరలోక తండ్రి హృదయానికి సంతోషం కలిగిస్తూ మీరాయనను సంతోషపెడతారు. (సామెతలు 27:11) మీ పరిమితులను యెహోవా అర్థం చేసుకుంటాడు కాబట్టి మీరాయనను ‘అన్నివిషయాల్లో సంతోషపెట్టడం’ కూడా సాధ్యమవుతుంది. (కొలొస్సయులు 1:9,10) మీరు మీ ప్రియ తండ్రిని అనుకరిస్తూ మంచి లక్షణాలు అలవరచుకోవడంలో కొనసాగుతుండగా, మరింత గొప్ప ఆధిక్యతతో ఆశీర్వదించబడతారు. దేవునికి దూరమైన ఈ అంధకార లోకంలో మీరు వెలుగు ప్రకాశకులుగా ఉంటారు. (మత్తయి 5:1, 2,14) అలా భూమ్మీది సుదూర ప్రాంతాలకు యెహోవా మహిమాన్విత వ్యక్తిత్వ ప్రతిబింబాలను వ్యాప్తిచేయడంలో మీరు తోడ్పడతారు. అదెంతటి ఘనతో గదా!

‘దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు’

యెహోవాకు మీరు నిరంతరం సన్నిహితమగుదురు గా

21, 22.యెహోవాను ప్రేమించే వారందరి ముందు ఎలాంటి అంతులేని ప్రస్థానం వేచివుంది?

21 యాకోబు 4:8, NWలో గ్రంథస్తం చేయబడిన ఆ సరళమైన వినతి ఒక లక్ష్యం మాత్రమే కాదు. అదొక ప్రయాణం. మనం నమ్మకంగా నిలిచినంత కాలం, ఆ ప్రస్థానం ఎన్నడూ ఆగదు. అంతకంతకు యెహోవాకు సన్నిహితం కావడం మనమెన్నడూ మానుకోము. నిజానికి, ఆయన గురించి తెలుసుకోవలసింది ఎల్లప్పుడూ ఎంతో ఉంటుంది. యెహోవా గురించి తెలుసుకోవలసినదంతా ఈ పుస్తకం మనకు బోధించిందని మనం అనుకోకూడదు. అంతెందుకు, దేవుని గురించి బైబిలు చెబుతున్న సమస్తంలో మనం కేవలం కొద్దిగా పరిశీలించడం మాత్రమే ఆరంభించాం. అసలు, యెహోవా గురించి మనం తెలుసుకోగల సర్వాన్ని స్వయంగా బైబిలు కూడా మనకు చెప్పడం లేదు. యేసు తన భూపరిచర్యలో చేసినదంతా వ్రాతపూర్వకంగా పెట్టాలంటే “వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని” తనకు అనిపిస్తున్నదని అపొస్తలుడైన యోహాను అన్నాడు. (యోహాను 21:25) కుమారుని గురించే అలా చెప్పబడితే, ఆయన తండ్రి గురించి చెప్పడానికి ఇంకెంత ఉంటుందో గదా!

22 మనం యెహోవా గురించి తెలుసుకోవడం ముగించాలంటే నిత్యజీవం కూడా సరిపోదు. (ప్రసంగి 3:11) కాబట్టి మనముందున్న ఉత్తరాపేక్ష గురించి ఆలోచించండి. వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు జీవించిన తర్వాత యెహోవా దేవుని గురించి మనకిప్పుడు తెలిసిన దానికంటే మరెంతో ఎక్కువ తెలుసుకుంటాము. అయినాసరే, నేర్చుకోవలసిన అద్భుతమైన సంగతులు ఇంకా అసంఖ్యాకంగా ఉన్నట్లు మనం భావిస్తాం. మరింత నేర్చుకోవడానికి మనం అత్యాకాంక్షతో ఉంటాము, ఎందుకంటే కీర్తనకర్త భావించినట్లే భావించడానికి మనకు కారణముంటుంది. ఆయనిలా పాడాడు: ‘దేవునికి సన్నిహితమవడమే నాకు మేలు.’ (కీర్తన 73:28, NW) నిత్యజీవం ఊహించలేని రీతిలో అర్థవంతంగా, భిన్నంగా ఉంటుంది, యెహోవాకు సన్నిహితం కావడం అన్ని సమయాల్లోను ప్రతిఫలదాయకంగా ఉంటుంది.

23.మీరేమి చేయడానికి ప్రోత్సహించబడుతున్నారు?

23 మీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, వివేకముతో, బలంతో యెహోవాను ప్రేమిస్తూ ఆయన ప్రేమకు ఇప్పుడు మీరు ప్రతిస్పందించుదురు గాక. (మార్కు 12:29,30) మీ ప్రేమ విశ్వసనీయంగా, సుస్థిరంగా ఉండునుగాక. చిన్న చిన్న నిర్ణయాల నుండి పెద్ద పెద్ద నిర్ణయాల వరకు, మీరు ప్రతీ దినం తీసుకొనే నిర్ణయాలన్నీ, అన్ని సందర్భాల్లోను మీ పరలోకపు తండ్రితో మీ సంబంధాన్ని బలపరిచే మార్గాన్నే మీరు ఎంచుకోవడమనే ఒకే నిర్దేశక సూత్రాన్ని ప్రతిబింబించునుగాక. అన్నింటికంటే మిన్నగా, యుగయుగాలన్నింటిలో సదా మీరాయనకు సన్నిహితులగుదురు గాక, ఆయన మీకు సన్నిహితమవును గాక.