కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2వ అధ్యాయం

ప్రేమించే దేవుని నుండి వచ్చిన ఉత్తరం

ప్రేమించే దేవుని నుండి వచ్చిన ఉత్తరం

మీకు అన్నిటికన్నా ఏ పుస్తకం ఎక్కువ ఇష్టం?— కొంతమంది పిల్లలకు జంతువుల పుస్తకాలంటే ఇష్టం. ఇంకొందరు బొమ్మలు ఎక్కువగా ఉన్న పుస్తకాలను ఇష్టపడతారు. అలాంటి పుస్తకాలు చదువుతుంటే చాలా సరదాగా ఉంటుంది.

అయితే దేవుని గురించి సత్యం చెప్పే పుస్తకాలే అన్నిటికన్నా మంచి పుస్తకాలు. వాటిలో ఒకటి మిగతా అన్ని పుస్తకాలకన్నా ప్రాముఖ్యమైనది. అదేంటో తెలుసా?— బైబిలు.

బైబిలు ఎందుకంత ప్రాముఖ్యమైనది?— ఎందుకంటే దాన్ని దేవుడు మనకిచ్చాడు. అది దేవుని గురించి, ఆయన మనకోసం చేసే ఎన్నో మంచి పనుల గురించి చెప్తోంది. ఆయన మనల్ని ఇష్టపడాలంటే మనమేమి చేయాలో వివరిస్తోంది. అది మనకు దేవుని నుండి వచ్చిన ఉత్తరం లాంటిది.

దేవుడు మొత్తం బైబిలును పరలోకంలోనే రాయించి మనకు ఇచ్చివుండొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. బైబిల్లో దేవుని ఆలోచనలే ఉన్నాయి. వాటిని ఆయన భూమ్మీదున్న తన సేవకులకు చెప్పి రాయించాడు.

దేవుడు వాళ్లకు ఎలా చెప్పాడు?— దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చూడండి. ఎవరో ఎక్కడో ఉండి మాట్లాడేది రేడియోలో మనం వినగలుగుతున్నాం. అలాగే ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నవాళ్లను టీవీలో చూడగల్గుతున్నాం, వాళ్లు మాట్లాడేది వినగల్గుతున్నాం.

మనుషులు అంతరిక్షనౌకలో (స్పేస్‌షిప్‌లో) చంద్రుని దగ్గరకు వెళ్లి అక్కడి నుండి భూమ్మీద ఉన్నవాళ్లకు సందేశాలు పంపిస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసా?— మనుషులు అలా చేయగల్గినప్పుడు, దేవుడు పరలోకం నుండి సందేశాలు పంపించలేడా?— ఖచ్చితంగా పంపించగలడు! మనుషులు రేడియోలు, టీవీలు కనిపెట్టడానికి ఎంతోకాలం ముందే దేవుడు సందేశాలు పంపించాడు.

దేవుడు ఎంతో దూరంలో ఉన్నా మనతో మాట్లాడగలడని ఎలా చెప్పవచ్చు?

మోషే అనే వ్యక్తి దేవుడు మాట్లాడడం నిజంగా విన్నాడు. మోషే దేవుణ్ణి చూడలేకపోయాడు కానీ ఆయన స్వరాన్ని మాత్రం వినగల్గాడు. దేవుడు అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ లక్షలాదిమంది ఉన్నారు. ఆ రోజు దేవుడు ఒక పర్వతం కంపించేలా చేశాడు, అప్పుడు ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి. దేవుడు మాట్లాడాడని ప్రజలకు అర్థమైంది, కానీ వాళ్ళు చాలా భయపడిపోయారు. అందుకే వాళ్లు మోషేతో, ‘నువ్వు మాతో మాట్లాడు. దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాం’ అని చెప్పారు. ఆ తర్వాత దేవుడు చెప్పిన విషయాలు మోషే రాసిపెట్టాడు. ఆయన రాసిపెట్టినవి బైబిల్లో ఉన్నాయి.—నిర్గమకాండము 20:18-21.

బైబిల్లోవున్న మొదటి ఐదు పుస్తకాలను మోషే రాశాడు. అయితే అన్ని పుస్తకాలు ఆయనే రాయలేదు. బైబిల్లోవున్న పుస్తకాలను దేవుడు దాదాపు 40 మంది పురుషులతో రాయించాడు. వీళ్లు చాలాచాలా సంవత్సరాల క్రితం జీవించారు, బైబిల్లోని పుస్తకాలన్నీ రాయడానికి చాలాకాలమే పట్టింది. అంటే దాదాపు 1,600 సంవత్సరాలు పట్టింది! ఆశ్చర్యమనిపించే విషయం ఏమిటంటే, బైబిలు రాసినవాళ్లలో కొంతమంది ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు, అయినా వాళ్లు రాసినవన్నీ ఒకదానితో ఒకటి పొందికగా ఉన్నాయి.

బైబిలు రాయడానికి దేవుడు ఉపయోగించుకున్నవాళ్లలో కొందరు పేరుప్రఖ్యాతులు ఉన్నవాళ్లు. మోషే ఒకప్పుడు గొర్రెలను కాసినా ఆ తర్వాత ఆయన ఇశ్రాయేలీయులకు నాయకుడయ్యాడు. సొలొమోను రాజు, తను జీవించిన కాలంలో ప్రపంచంలోకెల్లా తెలివైనవాడు, ధనవంతుడు. కానీ బైబిలు రాసినవాళ్లలో మిగతావాళ్లు అంత పేరుప్రఖ్యాతులు ఉన్నవాళ్లు కాదు. ఆమోసు మేడిపండ్ల చెట్లను చూసుకొనేవాడు.

బైబిల్లోని పుస్తకాలు రాసిన వీళ్ల పేర్లు ఏమిటి?

బైబిల్లోని పుస్తకాలను రాసినవాళ్లలో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు. ఆయన పేరేమిటో తెలుసా?— లూకా. మరొకరు సుంకరి, అంటే పన్ను వసూలు చేసేవాడు. ఆయన పేరు మత్తయి. బైబిలు రాసిన వాళ్లలో యూదా మతంలోని చట్టాలు బాగా తెలిసిన ఒక న్యాయవాది కూడా ఉన్నాడు. ఈయన అందరికన్నా ఎక్కువ బైబిలు పుస్తకాలు రాశాడు. ఈయన పేరేమిటో తెలుసా?— పౌలు. యేసు శిష్యుల్లో పేతురు, యోహాను కూడా బైబిలు పుస్తకాలు రాశారు. వాళ్లు చేపలు పట్టుకునేవాళ్లు.

వీళ్లలో చాలామంది దేవుడు చేయబోయే వాటి గురించి రాశారు. అవి జరగడానికి ముందే వాటి గురించి వాళ్లకు ఎలా తెలిసింది?— దేవుడే వాళ్లకు ఆ విషయాలను తెలియజేశాడు. ఏమి జరగబోతుందో దేవుడే వాళ్లకు చెప్పాడు.

గొప్ప బోధకుడైన యేసు భూమ్మీదకు వచ్చేసరికి, బైబిల్లోని చాలా పుస్తకాలు రాయడం పూర్తయ్యింది. ఒకసారి గుర్తుచేసుకోండి, యేసు పరలోకంలో ఉండేవాడు. కాబట్టి దేవుడు ఏమేమి చేశాడో ఆయనకు తెలుసు. బైబిలును దేవుడే రాయించాడని ఆయన నమ్మాడా?— అవును, నమ్మాడు.

యేసు, ప్రజలకు దేవుని గురించి చెప్తున్నప్పుడు బైబిలు నుండి చదివి వినిపించేవాడు. కొన్నిసార్లు ఆయన అందులోవున్నది చూడకుండానే చెప్పేవాడు. దేవుని నుండి నేర్చుకున్న ఇంకా ఎన్నో విషయాలు యేసు మనకు చెప్పాడు. ‘నేను ఆయన దగ్గర విన్న సంగతులే లోకానికి బోధిస్తున్నాను’ అని ఆయన అన్నాడు. (యోహాను 8:26) యేసు పరలోకంలో దేవునితో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. యేసు చెప్పిన విషయాలు ఎందులో ఉన్నాయి?— బైబిల్లో ఉన్నాయి. అవన్నీ మనం చదువుకోవడానికే రాయబడ్డాయి.

దేవుడు మనుషులతో బైబిలు రాయించినప్పుడు వాళ్లు ఆ రోజుల్లో ప్రజలు సాధారణంగా మాట్లాడుకున్న భాషలో రాశారు. కాబట్టి బైబిల్లో చాలాభాగం హీబ్రూలో, కొంతవరకు అరామిక్‌లో, చాలా పుస్తకాలు గ్రీకులో రాయబడ్డాయి. ఇప్పుడున్న చాలామందికి ఆ భాషలు చదవడం రాదు కాబట్టి, బైబిలును వేరే భాషల్లోకి తర్జుమా చేశారు. ప్రస్తుతం పూర్తి బైబిలు గానీ, అందులోని కొన్ని పుస్తకాలు గానీ 2,260 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఎన్ని భాషలో! ప్రజలు ప్రపంచంలో ఏ మూలవున్నా దేవుడు రాసిన ఈ ఉత్తరం వాళ్లు చదువుకోవచ్చు. దాన్ని ఎన్ని భాషల్లోకి తర్జుమా చేసినా దానిలోని సందేశం మాత్రం దేవునిదే.

బైబిలు చెప్తున్నది మనకెంతో ప్రాముఖ్యమైనది. నిజమే అది చాలాకాలం క్రితం రాయబడింది. అయినా లోకంలో ఇప్పుడు జరుగుతున్న సంగతుల గురించి అది వివరిస్తోంది. అంతేగాక త్వరలో దేవుడు ఏమి చేయబోతున్నాడో చెప్తోంది. అది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది! మనకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని బైబిలు చూపిస్తోంది.

బైబిలు చదివితే మీరు ఏయే విషయాలు తెలుసుకుంటారు?

మనం ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడో కూడా బైబిలు చెప్తోంది. ఏది మంచో ఏది చెడో అది చెప్తోంది. దాన్ని మీరూ నేనూ తెలుసుకోవాలి. కొందరు చెడ్డ పనులు చేసి ఎలాంటి సమస్యల్లో పడ్డారో అది చెప్తోంది. అవి చదివితే, మనం అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తపడవచ్చు. అంతేగాక మంచి పనులు చేసి ప్రయోజనం పొందిన వాళ్ల గురించి కూడా అది చెప్తోంది. అవన్నీ మన మంచి కోసమే రాసిపెట్టి ఉన్నాయి.

బైబిలు నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే, అసలు మనకు బైబిలును ఎవరు ఇచ్చారో తెలుసుకోవాలి. మరి మనకు బైబిలును ఎవరిచ్చారో తెలుసా?— అవును, పూర్తి బైబిలును దేవుడే మనకు ఇచ్చాడు. మనం నిజంగా జ్ఞానవంతులమైతే ఏంచేస్తాం?— దేవుని మాట విని, ఆయన చెప్పిన పనులు చేస్తాం.

కాబట్టి, మనం కలిసి బైబిలు చదవడానికి సమయం కేటాయించాలి. మనకెంతో ఇష్టమైన వాళ్ల నుండి ఉత్తరం వస్తే దాన్ని పదేపదే చదువుకుంటాం. ఆ ఉత్తరం మనకొచ్చిన గొప్ప బహుమతి. అలాగే బైబిలును కూడా మనకు దొరికిన గొప్ప బహుమతిగా ఎంచాలి. ఎందుకంటే, మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు మనకు ఆ ఉత్తరాన్ని బహుమతిగా ఇచ్చాడు.

బైబిలు నిజంగా మన ప్రయోజనం కోసం రాయబడిన దేవుని వాక్యమని చూపించే, రోమీయులు 15:4; 2 తిమోతి 3:16, 17; 2 పేతురు 1:20, 21 వచనాలను కూడా చదవండి.