కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ అధ్యాయం

అన్నిటినీ చేసిన దేవుడు

అన్నిటినీ చేసిన దేవుడు

ప్రాణమున్న వాటన్నిటినీ ఎవరు చేశారు?

మీచేయి ఎంత అద్భుతంగా చేయబడిందో తెలుసా? దాంతో ఎన్ని పనులు చేయవచ్చో మీకు తెలుసా?— మీ చేతిని ఒకసారి చూసుకోండి. వేళ్లు కదిపి చూడండి. ఏదైనా వస్తువును చేతితో పట్టుకోండి. మీ చేతితో మీరు ఎన్నో పనులను చక్కగా చేయవచ్చు. మన చేతులను ఎవరు చేశారో తెలుసా?—

మన నోటిని, ముక్కును, కళ్లను చేసిన దేవుడే వాటిని కూడా చేశాడు. ఆయనే మన గొప్ప బోధకుని తండ్రి. దేవుడు మనకు కళ్లను ఇచ్చినందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం, అవునా?— మనం వాటితో ఎన్నో చూడవచ్చు. పువ్వుల్ని చూడవచ్చు. పచ్చని గడ్డిని చూడవచ్చు. నీలంగావున్న ఆకాశాన్ని చూడవచ్చు. ఆకలితోవున్న చిన్న పిచ్చుకలను కూడా చూడవచ్చు. అలాంటివే ఈ చిత్రంలో ఉన్నాయి చూడండి. మనం ఇలాంటివి చూడగల్గడం ఎంత అద్భుతమో! మీకు కూడా అలాగే అనిపిస్తోందా?—

కానీ వీటిని ఎవరు చేశారు? మనుషులు చేశారా? కాదు. మనుషులు ఇళ్లు కట్టగలరు, కానీ గడ్డిని చేయలేరు. పిట్టలను, పువ్వులను, ప్రాణమున్న దేన్నీ చేయలేరు. మీకు ఆ విషయం తెలుసా?—

దేవుడే వీటన్నిటినీ చేశాడు. ఆయనే ఈ భూమిని, ఆకాశాన్ని చేశాడు. మనుషుల్ని అంటే మొదటి పురుషుణ్ణి, స్త్రీని చేసింది కూడా ఆయనే. ఈ విషయాన్ని గొప్ప బోధకుడైన యేసు బోధించాడు.—మత్తయి 19:4-6.

దేవుడు పురుషుణ్ణి, స్త్రీని చేశాడని యేసుకెలా తెలుసు? దేవుడు వాళ్లను చేయడం యేసు చూశాడా?— అవును చూశాడు. దేవుడు పురుషుణ్ణి, స్త్రీని చేసినప్పుడు యేసు ఆయనతో ఉన్నాడు. ఎందుకంటే, దేవుడు మొట్టమొదట సృష్టించింది యేసునే. ఆయన ఒక దేవదూత, కాబట్టి ఆయన పరలోకంలో తన తండ్రితో పాటు ఉన్నాడు.

‘మనం మనిషిని చేద్దాం’ అని దేవుడు అన్నట్లు బైబిలు చెప్తోంది. (ఆదికాండము 1:26) దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో మీకు తెలుసా?— తన కుమారునితో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడే ఆ తర్వాత భూమ్మీదకు వచ్చాడు. భూమ్మీద ఉన్నప్పుడు ఆయన పేరు యేసు.

ఒక్కసారి ఆలోచించండి! దేవుడు భూమిని, దానిలో ఉన్నవాటన్నిటినీ సృష్టిస్తున్నప్పుడు ఆయనతోపాటు ఉన్న యేసు మనకు బోధించడం నిజంగా ఎంత గొప్ప విషయమో కదా! యేసు పరలోకంలో తన తండ్రితోపాటు పనిచేస్తూ ఆయన నుండి ఎంతో నేర్చుకున్నాడు. అందుకే యేసు అంత గొప్ప బోధకుడయ్యాడు!

దేవుడు తన కుమారుణ్ణి చేయక ముందు అంటే ఆయన ఒక్కడే ఉన్నప్పుడు సంతోషంగా లేడా?— కాదు, ఆయన సంతోషంగానే ఉన్నాడు. మరైతే దేవుడు వేరే దేవదూతలను, మనుషులను, జంతువులను ఎందుకు చేశాడు?— ఆయన ప్రేమగల దేవుడు కాబట్టి అలా చేశాడు. ఇతరులు కూడా జీవించాలని, సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేవుడు మనకు జీవం ఇచ్చినందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి అంటే థాంక్స్‌ చెప్పాలి.

దేవుడు చేసిన ప్రతీ దానిలో ఆయన ప్రేమ కనిపిస్తుంది. ఆయన సూర్యుణ్ణి చేశాడు. సూర్యుని వల్ల మనకు వెలుగు వస్తోంది, వెచ్చదనం కలుగుతోంది. సూర్యుడే లేకపోతే అంతా చల్లగా అయిపోతుంది, భూమ్మీద మనుషులు బ్రతకలేరు, జంతువులు, మొక్కలు చచ్చిపోతాయి. దేవుడు సూర్యుణ్ణి చేసినందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం, అవునా?—

దేవుడు వర్షం కూడా కురిపిస్తాడు. వర్షం పడుతున్నప్పుడు మీరు బయటకు వెళ్లి ఆడుకోలేరు కాబట్టి కొన్నిసార్లు మీకు వర్షమంటే ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వర్షం పడితే పూలు పూస్తాయి. కాబట్టి అందమైన పువ్వులను చూసినప్పుడు మనం ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి?— దేవునికి. అలాగే మంచి కూరగాయలు, రుచికరమైన పండ్లు తిన్నప్పుడు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి?— దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన సూర్యుని వల్లే, ఆయన కురిపించే వర్షం వల్లే అవి పండుతున్నాయి.

‘మనుషులను, జంతువులను దేవుడే చేశాడా?’ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు?— “అవును, దేవుడే చేశాడు” అని చెప్పడం సరైనది. ఒకవేళ ఎవరైనా, మనుషులను దేవుడే చేశాడని నమ్మకపోతే అప్పుడేం చేయాలి? మనుషులు జంతువుల నుండి వచ్చారని వాళ్లు అంటే అప్పుడేమిటి? అయితే, బైబిలు అలా చెప్పడం లేదు. మనుషులను, జంతువులను దేవుడే సృష్టించాడని అది చెప్తోంది.—ఆదికాండము 1:26-31.

ఆ ఇంటిని ఎవరో ఒకరు కట్టారు కదా, మరి పువ్వుల్ని, చెట్లను, జంతువుల్ని ఎవరు చేశారు?

కానీ కొంతమంది దేవుడు లేడు అంటారు. అప్పుడు మీరేమి చెప్తారు?— అప్పుడు ఏదైనా ఒక ఇంటిని చూపించి, “ఆ ఇంటిని ఎవరు కట్టారు?” అని అడగండి. ఎవరో ఒకరు కట్టనిదే అది అక్కడ ఉండదని అందరికీ తెలుసు. ఆ ఇల్లు దానంతట అదే వచ్చేయలేదు!—హెబ్రీయులు 3:3, 4.

ఆ తర్వాత వాళ్లను తోటలోకి తీసుకువెళ్లి ఏదైనా ఒక పువ్వును చూపించండి. “ఈ పువ్వును ఎవరు చేశారు?” అని అడగండి. దాన్ని మనుషులెవ్వరూ తయారుచేయలేదు. ఆ ఇల్లు దానంతట అదే రానట్లే ఈ పువ్వు కూడా దానంతట అదే రాలేదు. దేవుడే దాన్ని చేశాడు.

ఒక్కక్షణం ఆగి, వాళ్లను పక్షుల కిలకిలరావాలను వినమనండి. ఆ తర్వాత వాళ్లను ఇలా అడగండి, “ఆ పక్షుల్ని చేసినది ఎవరు? వాటికి పాడడం నేర్పింది ఎవరు?” దేవుడే! భూమిని, ఆకాశాన్ని, జీవించే ప్రతీ దాన్ని దేవుడే చేశాడు. అన్నిటికీ జీవాన్ని ఇచ్చింది ఆయనే!

అయినా కొంతమంది తాము చూసేవాటినే నమ్ముతామని అంటారు. ‘నాకు కనిపించని దాన్ని నేను నమ్మను?’ అని వాళ్లు అనవచ్చు. అందుకే కొంతమంది, దేవుడు తమకు కనపడడం లేదు కాబట్టి ఆయనను నమ్మమంటారు.

నిజమే, మనం దేవుణ్ణి చూడలేం. ‘ఎవరూ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు’ అని బైబిలు చెప్తోంది. భూమ్మీదున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు. కాబట్టి దేవుని చిత్రపటాలను, విగ్రహాలను తయారుచేయడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. తనకు ఎలాంటి రూపమూ కల్పించవద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి, అలాంటివేవైనా మన ఇంట్లో పెట్టుకోవడం దేవునికి ఇష్టముండదు.—నిర్గమకాండము 20:4, 5; 33:20; యోహాను 1:18.

కానీ మనం దేవుణ్ణి చూడలేం. అలాంటప్పుడు, ఆయన ఉన్నాడని మనకెలా తెలుస్తుంది? ఒక ఉదాహరణ చూద్దాం. మీరు గాలిని చూడగలరా?— చూడలేరు. గాలిని ఎవరూ చూడలేరు. కానీ గాలి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గాలి వీస్తున్నప్పుడు చెట్ల ఆకులు, కొమ్మలు కదులుతాయి, కాబట్టి గాలి ఉందని నమ్మవచ్చు.

గాలి ఉందని మనకు ఎలా తెలుస్తుంది?

అలాగే దేవుడు చేసిన వాటిని మనం చూడవచ్చు. మనం చూసే పువ్వులు, పక్షులు ఆయన చేసినవే. కాబట్టి దేవుడు ఉన్నాడని మనం నమ్మవచ్చు.

‘సూర్యుణ్ణి, భూమిని ఎవరు చేశారు?’ అని ఎవరైనా మిమ్మల్ని అడగవచ్చు. ‘దేవుడు భూమిని, ఆకాశాన్ని సృజించాడు’ అని బైబిలు చెప్తోంది. (ఆదికాండము 1:1) ఈ అద్భుతమైన వాటన్నిటినీ దేవుడే చేశాడు! ఇప్పుడు, దేవుని గురించి మీకు ఏమనిపిస్తోంది?—

మనం ప్రాణంతో ఉన్నందుకు ఎంత సంతోషించాలో కదా? మనం పక్షుల కిలకిలరావాలను వినవచ్చు. పువ్వుల్నీ, దేవుడు చేసిన వేరే వాటన్నిటినీ చూసి ఆనందించవచ్చు. దేవుడు ఇచ్చిన ఆహారాన్ని తృప్తిగా తినవచ్చు.

ఇవన్నీ ఇచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు ప్రాణం ఇచ్చినందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. మనకు నిజంగా కృతజ్ఞత ఉంటే, మనం ఏంచేస్తాం?— దేవుని మాట వింటాం, బైబిల్లో ఆయన మనకు చెప్పినవాటిని చేస్తాం. అలా, అన్నిటినీ చేసిన దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చూపిస్తాం.

దేవుడు మన కోసం చేసిన వాటన్నిటికీ మనం ఆయనకు కృతజ్ఞత చూపించాలి. ఎలా చూపించవచ్చు? కీర్తన 139:14; యోహాను 4:23, 24; 1 యోహాను 5:21; ప్రకటన 4:10, 11 వచనాల్లో ఏముందో చదవండి.