కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ అధ్యాయం

దేవునికి ఒక పేరు ఉంది

దేవునికి ఒక పేరు ఉంది

మీరు ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు వాళ్లను ఏమి అడుగుతారు?— అవును, వాళ్ల పేరు అడుగుతాం. మనందరికీ పేర్లున్నాయి. మొదటి మనిషికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. అతని భార్య పేరు హవ్వ.

పేర్లు ఉండేది మనుషులకు మాత్రమే కాదు. ఇంకా వేటికి కూడా పేర్లు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. మీకు ఎవరైనా ఒక బొమ్మనిస్తే లేదా మీరు ఒక కుక్కపిల్లను పెంచుకుంటుంటే దానికి పేరు పెట్టరా?— అవును, పేరు ఉండడం చాలా ముఖ్యం.

రాత్రిపూట ఆకాశంలో కనిపించే ఎన్నో చుక్కల్ని చూడండి. వాటికి కూడా పేర్లు ఉంటాయా?— అవును, ఆకాశంలోవున్న ప్రతీ నక్షత్రానికి దేవుడు పేరు పెట్టాడు. ‘నక్షత్రాల లెక్క ఆయనకు తెలుసు. వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టాడు’ అని బైబిలు చెప్తోంది.—కీర్తన 147:4.

నక్షత్రాలన్నిటికీ పేర్లు ఉన్నాయని మీకు తెలుసా?

ఈ విశ్వం మొత్తం మీద అందరికన్నా గొప్ప వ్యక్తి ఎవరు?— అవును, దేవుడే. ఆయనకు పేరుందా?— ఉందని యేసు చెప్పాడు. ఒకసారి దేవునికి ప్రార్థన చేస్తూ, యేసు ఇలా అన్నాడు, ‘నా శిష్యులకు నీ పేరు తెలియజేశాను.’ (యోహాను 17:26) దేవుని పేరు మీకు తెలుసా?— తన పేరేమిటో దేవుడే చెప్పాడు. ‘నేను యెహోవాను; ఇదే నా పేరు’ అని ఆయన అన్నాడు. కాబట్టి, దేవుని పేరు యెహోవా.—యెషయా 42:8.

ఎవరైనా మిమ్మల్ని పేరుతో పిలిస్తే మీకెలా అనిపిస్తుంది?— చాలా ఆనందంగా ఉంటుంది కదా?— ప్రజలందరూ తన పేరు కూడా తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే మనం యెహోవా దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పేరును ఉపయోగించాలి. గొప్ప బోధకుడైన యేసు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు యెహోవా పేరు ఉపయోగించాడు. ఒకసారి యేసు, ‘నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి’ అని చెప్పాడు.—మార్కు 12:30.

“యెహోవా” అనే పేరు ఎంతో ముఖ్యమైనదని యేసుకు తెలుసు. అందుకే ఆయన యెహోవా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పేరును వాడాలని తన శిష్యులతో చెప్పాడు. ప్రార్థనలో కూడా దేవుని పేరు వాడాలని నేర్పించాడు. ప్రజలందరూ తన పేరు తెలుసుకోవాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నట్లు యేసుకు తెలుసు.

దేవుడు చాలాకాలం క్రితం, తన పేరు ఎంత ముఖ్యమైనదో మోషేకు వివరించాడు. ఈయన ఒక ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలు అనే ఒకాయన పిల్లలను ఇశ్రాయేలీయులు అనేవాళ్లు. వీళ్లు ఐగుప్తు దేశంలో ఉండేవాళ్లు. ఆ దేశ ప్రజలను ఐగుప్తీయులు అనేవాళ్లు. వీళ్లు ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకుని, చాలా బాధపెట్టేవాళ్లు. మోషే పెద్దవాడైనప్పుడు, తన ప్రజల్లో ఒకరికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. దానితో ఆ దేశ రాజైన ఫరోకు చాలా కోపం వచ్చింది. అతడు మోషేను చంపెయ్యాలని అనుకున్నాడు! అందుకే మోషే ఐగుప్తు నుండి పారిపోయాడు.

మోషే వేరే దేశానికి వెళ్లిపోయాడు. దాని పేరు మిద్యాను. మోషే అక్కడికి వెళ్లాక పెళ్లి చేసుకున్నాడు, అక్కడ ఆయనకు పిల్లలు పుట్టారు. ఆయన గొర్రెల కాపరిగా పనిచేసేవాడు. ఒకరోజు మోషే ఒక కొండ దగ్గర గొర్రెల్ని కాస్తుండగా ఒక వింత చూశాడు. ఒక ముళ్ల పొద మండుతోందిగానీ అది కాలిపోవడం లేదు! అసలు ఏం జరుగుతుందో చూద్దామని దాని దగ్గరకు వెళ్లాడు.

అప్పుడు ఏం జరిగిందో తెలుసా?— మండుతున్న ఆ పొదలో నుండి ఒక స్వరం, “మోషే! మోషే!” అని పిలవడం ఆయనకు వినిపించింది. అలా పిలిచింది ఎవరు?— దేవుడు! ఆయన మోషేకు చాలా పని అప్పగించాలనుకున్నాడు. అందుకే ఆయన మోషేతో, ‘నిన్ను ఫరో దగ్గరకు పంపిస్తాను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నువ్వు ఐగుప్తులో నుండి తీసుకుని రావాలి’ అని చెప్పాడు. ఈ పని చేయడానికి తప్పక సహాయం చేస్తానని కూడా దేవుడు మోషేకు చెప్పాడు.

మండుతున్న పొద దగ్గర మోషే తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏమిటి?

కానీ మోషే, ‘నేను ఐగుప్తులో ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారితో, దేవుడు నన్ను పంపించాడు అని చెప్తాను. ఒకవేళ వాళ్లు ఆయన పేరు ఏమిటని అడిగితే నేనేం చెప్పాలి?’ అని దేవుణ్ణి అడిగాడు. దానికి దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పమని మోషేతో అన్నాడు, ‘యెహోవా మీ దగ్గరకు నన్ను పంపాడు. నిరంతరం తన పేరు యెహోవాయే అని ఆయన చెప్పాడు.’ (నిర్గమకాండము 3:1-15) యెహోవా దేవుడు ఎప్పటికీ అదే పేరు ఉంచుకుంటాడని తెలుస్తోంది. ఆయన తన పేరు ఎప్పటికీ మార్చుకోడు. ప్రజలందరికీ తాను యెహోవా అనే పేరుతోనే తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు.

తన పేరు ఎంత గొప్పదో ప్రజలు తెలుసుకునేలా దేవుడు ఎర్రసముద్రం దగ్గర ఏమి చేశాడు?

మోషే ఐగుప్తుకు వెళ్లి యెహోవా గురించి చెప్పినప్పుడు, ఆయన ఇశ్రాయేలీయులు ఆరాధించే చిన్న దేవుడని ఐగుప్తీయులు అనుకున్నారు. కానీ ఆయన లోకమంతటికీ దేవుడని వాళ్లకు తెలీదు. అందుకే యెహోవా ఐగుప్తు రాజుకు ఇలా చెప్పాడు, ‘లోకమంతటా నా పేరు ప్రచురం చేస్తాను.’ (నిర్గమకాండము 9:16) యెహోవా తను చెప్పినట్లే, తన పేరు అందరికీ తెలిసేలా చేశాడు. ఆయన అది ఎలా చేశాడో తెలుసా?—

మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించేలా యెహోవా చూశాడు. వాళ్లు ఎర్రసముద్రం దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా ఆ సముద్రాన్ని రెండు పాయలుగా విడదీశాడు. అప్పుడు మధ్యలో ఆరిన నేల ఏర్పడింది. వాళ్లు దానిమీద నడుచుకుంటూ సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. కానీ ఫరో, అతని మొత్తం సైన్యం ఆ ఆరిన నేలమీదకు రాగానే రెండువైపులా గోడలా ఉన్న నీళ్లు ఒక్కసారిగా వాళ్లమీద పడ్డాయి. దానితో ఐగుప్తీయులందరూ చనిపోయారు.

ఆ వెంటనే, యెహోవా దేవుడు ఎర్రసముద్రం దగ్గర చేసిన అద్భుతం గురించి భూమి అంతటా ఉన్న ప్రజలకు తెలిసింది. దాని గురించి వాళ్లు విన్నారని మనకెలా తెలుసు?— అది జరిగిన దాదాపు 40 సంవత్సరాల తర్వాత, ఇశ్రాయేలీయులు యెహోవా వాళ్లకు ఇస్తానని చెప్పిన కనాను దేశానికి వచ్చారు. అక్కడ రాహాబు అనే స్త్రీ ఇద్దరు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, ‘మీరు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పుడు, మీ ఎదుట యెహోవా ఎర్రసముద్రంలోని నీటిని ఆరిపోయేలా చేశాడన్న సంగతి మేము విన్నాము’ అని చెప్పింది.—యెహోషువ 2:10.

ఇప్పుడు కూడా చాలామంది ఆ ఐగుప్తీయుల్లాగే ఉన్నారు. యెహోవా ఈ లోకమంతటికీ దేవుడని వాళ్లు నమ్మరు. అందుకే యెహోవా తన ప్రజలు తన గురించి అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాడు. యెహోవా కోరుకున్నదే యేసు చేశాడు. యేసు భూమ్మీద ఉన్న చివరి రాత్రి, ‘వారికి నీ పేరును తెలియజేసితిని’ అని ప్రార్థనలో యెహోవాకు చెప్పాడు.—యోహాను 17:26.

దేవుని పేరు ఏమిటో యేసు తెలియజేశాడు. బైబిల్లో దేవుని పేరు ఎక్కడుందో మీరు చూపించగలరా?

మీరు కూడా యేసులా ఉండాలని అనుకుంటున్నారా? అలాగైతే దేవుని పేరు యెహోవా అని వేరేవాళ్లకు చెప్పండి. చాలామందికి ఆ పేరు తెలిసివుండకపోవచ్చు. అలాంటి వాళ్లకు బైబిల్లోవున్న కీర్తన 83:18వ వచనం తీసి చూపించవచ్చు. ఇప్పుడే మనం బైబిలు తీసి ఆ వచనం చదువుదాం. అక్కడిలా ఉంది, “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.”

ఇది చదివితే మీకు ఏమి అర్థమైంది?— అవును, యెహోవా అనేది అన్నిటికన్నా గొప్ప పేరు అని అర్థమవుతోంది. అది సర్వశక్తిగల దేవుని పేరు. ఆయనే యేసు తండ్రి, అన్నిటినీ చేసిన దేవుడు. మన పూర్ణ హృదయంతో యెహోవా దేవుణ్ణి ప్రేమించాలని యేసు చెప్పాడని మీకు గుర్తుందా? మరి మీరు యెహోవాను ప్రేమిస్తున్నారా?—

యెహోవాను ప్రేమిస్తున్నామని మనం ఎలా చూపించవచ్చు?— మనం ఆయనతో స్నేహం చేసి, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంతేకాకుండా, ఆయన పేరు ఏమిటో ఇతరులకు చెప్పాలి. ఆయన పేరు యెహోవా అని బైబిల్లో నుండే వాళ్లకు చూపించవచ్చు. యెహోవా చేసిన అద్భుతమైన సృష్టి గురించి, ఆయన మనకోసం చేసిన మంచివాటి గురించి కూడా చెప్పవచ్చు. అలా చేస్తే యెహోవా ఎంతో సంతోషిస్తాడు, ఎందుకంటే ప్రజలు తన గురించి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం ఆయన గురించి ఇతరులు తెలుసుకోవడానికి సహాయం చేయవచ్చు, అవునా?—

మనం యెహోవా గురించి చెప్తున్నప్పుడు కొంతమంది వినకపోవచ్చు. గొప్ప బోధకుడైన యేసు, యెహోవా గురించి చెప్తున్నప్పుడు కూడా చాలామంది వినలేదు. అలా అని ఆయన యెహోవా గురించి చెప్పడం మానేయలేదు.

కాబట్టి మనం కూడా యేసులా ఉందాం. యెహోవా గురించి వేరేవాళ్లకు చెప్తూనే ఉందాం. మనం అలా చేస్తే, మనం ఆయన పేరును ప్రేమిస్తున్నామని చూపిస్తాం. అప్పుడు ఆయన సంతోషిస్తాడు.

దేవుని పేరు ఎంత గొప్పదో చూపించే, యెషయా 12:4, 5; యోవేలు 2:32; మత్తయి 6:9, 10; యోహాను 17:6 వచనాలను కలిసి చదువుదాం.