కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

13వ అధ్యాయం

యేసు శిష్యులు

యేసు శిష్యులు

ఇక్కడున్నది ఎవరు, ఈయన ఎలా యేసు శిష్యుడయ్యాడు?

దేవుని సేవకుల్లో అందరికన్నా మంచి సేవకుడు ఎవరు?— సరిగ్గా చెప్పారు, యేసుక్రీస్తు. మనం కూడా ఆయనలా ఉండవచ్చా?— యేసు మనకు ఆదర్శంగా ఉన్నాడని బైబిలు చెప్తోంది. అందుకే ఆయన, తన శిష్యులుగా ఉండమని మనకు చెప్తున్నాడు.

యేసు శిష్యులుగా ఉండడం అంటే ఏమిటో తెలుసా?— దానికి మనం ఎన్నో చేయాలి. ముందు, మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. అంతేకాదు, ఆయన చెప్పింది నమ్మాలి. మనం ఆయన చెప్పింది నమ్మితే, ఆయన చెప్పినట్లు చేస్తాం.

యేసును నమ్ముతున్నామని చాలామంది చెప్తారు. వాళ్లంతా నిజంగా యేసు శిష్యులని మీరు అనుకుంటున్నారా?— కాదు, వాళ్లలో చాలామంది ఆయన శిష్యులు కాదు. వాళ్లు చర్చికి వెళ్తుండవచ్చు. కానీ వాళ్లల్లో చాలామంది యేసు ఏమి బోధించాడో తెలుసుకోవడానికి సమయం తీసుకోలేదు. యేసు చేసినట్లు చేసేవాళ్లే నిజంగా ఆయన శిష్యులు.

యేసు ఈ భూమ్మీద మనిషిగా జీవించినప్పుడు, ఆయనకు శిష్యులుగా ఉన్న కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యేసుకు మొట్టమొదట శిష్యులైన వాళ్లలో ఫిలిప్పు ఒకడు. ఫిలిప్పు తన స్నేహితుడైన నతనయేలు (ఇంకో పేరు బర్తొలొమయి) కోసం బయలుదేరాడు. ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టు, అప్పుడు నతనయేలు చెట్టు కింద కూర్చునివున్నాడు. నతనయేలు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, ‘ఇదిగో, ఈయన నిజంగా ఇశ్రాయేలీయుడు, ఈయనలో ఏ కపటమూ లేదు’ అని యేసు అన్నాడు. దానికి నతనయేలు ఆశ్చర్యపోతూ, ‘నీకు నేను ఎలా తెలుసు?’ అని యేసును అడిగాడు.

తన శిష్యులుగా ఉండమని యేసు ఎవరిని పిలుస్తున్నాడు?

దానికి యేసు, ‘ఫిలిప్పు నిన్ను పిలవకముందు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను’ అన్నాడు. తాను ఎక్కడున్నది యేసు అంత ఖచ్చితంగా చెప్పడం విని నతనయేలు చాలా ఆశ్చర్యపోయాడు. దాంతో ఆయన, ‘నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుకు రాజువు’ అని యేసుతో అన్నాడు.—యోహాను 1:49.

ఇస్కరియోతు యూదా, యూదా (ఇంకో పేరు తద్దయి)

ఫిలిప్పు, నతనయేలు యేసు శిష్యులు కావడానికి ముందురోజు, వేరేవాళ్లు ఆయనకు శిష్యులయ్యారు. వాళ్లు అంద్రెయ, ఆయన అన్న పేతురు, ఇంకా యోహాను. యోహాను వాళ్ల అన్న యాకోబు కూడా ఆ రోజే శిష్యుడైవుంటాడు. (యోహాను 1:35-51) అయితే, ఆ తర్వాత ఈ నలుగురూ మళ్లీ చేపలు పట్టి అమ్మే వ్యాపారం చేసుకోవడానికి వెళ్లారు. ఒకరోజు యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు, అంద్రెయ సముద్రంలో వల వేయడం చూసి, ‘నా వెంట రండి’ అని వాళ్లను పిలిచాడు.

యాకోబు (అల్ఫయి కుమారుడు), తోమా, మత్తయి

యేసు ఇంకాస్త ముందుకు వెళ్లాక యాకోబును, యోహానును చూశాడు. వాళ్లు వాళ్ల నాన్నతోపాటు పడవలో ఉండి, తమ వలలు బాగుచేసుకుంటున్నారు. యేసు వాళ్లను కూడా తనను వెంబడించమని పిలిచాడు. యేసు మిమ్మల్ని పిలిచివుంటే, మీరేమి చేసివుండేవాళ్లు? మీరు అప్పుడే ఆయన వెంట వెళ్లివుండేవాళ్లా?— వాళ్లకు యేసు ఎవరో తెలుసు. ఆయనను దేవుడు పంపించాడని వాళ్లకు తెలుసు. కాబట్టి వాళ్లు వెంటనే చేపలు పట్టి అమ్మే వ్యాపారం వదిలేసి యేసు వెంట వెళ్లారు.—మత్తయి 4:18-22.

నతనయేలు, ఫిలిప్పు, యోహాను

వాళ్లు యేసు శిష్యులు అయ్యారంటే దాని అర్థం, ఆ తర్వాత వాళ్లు ఏ తప్పూ చేయలేదనా?— కాదు, వాళ్లు తప్పులు చేశారు. ఎవరు గొప్ప అనే దాని గురించి వాళ్లు తమలో తాము వాదించుకున్నారని కూడా మనం చూశాం. కానీ వాళ్లు యేసు చెప్పింది విన్నారు, తమ ఆలోచనను, ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడ్డారు. మనం కూడా అలా మార్చుకోవడానికి ఇష్టపడితే యేసు శిష్యులం కావచ్చు.

యాకోబు (యోహాను అన్న), అంద్రెయ, పేతురు

యేసు ఏ తేడా లేకుండా ప్రజలందరినీ తన శిష్యులుగా ఉండమని పిలిచాడు. ఒకసారి, ధనవంతుడైన ఒక యువ పరిపాలకుడు యేసు దగ్గరకు వచ్చి, నిత్యజీవం పొందాలంటే తాను ఏంచేయాలో చెప్పమని అడిగాడు. ఆ యువ పరిపాలకుడు చిన్నప్పటి నుండీ తాను దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నానని చెప్పినప్పుడు, యేసు ఆ యువకునితో, ‘వచ్చి నన్ను వెంబడించు’ అని చెప్పాడు. అప్పుడు ఏంజరిగిందో తెలుసా?—

ధనవంతునిగా ఉండడం కంటే యేసు శిష్యునిగా ఉండడం ప్రాముఖ్యమని తెలుసుకున్నప్పుడు ఆ యువకుడు చాలా బాధపడ్డాడు. అతను దేవుని కంటే తన ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి అతను యేసు శిష్యుడు కాలేదు.—లూకా 18:18-25.

యేసు దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు ప్రకటించిన తర్వాత, తన శిష్యుల్లో 12 మందిని అపొస్తలులుగా ఎంచుకున్నాడు. ఈ అపొస్తలులను ఆయన ఒక ప్రత్యేకమైన పనిమీద పంపించాడు. వాళ్ల పేర్లు మీకు తెలుసా?— ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ల చిత్రాలను చూసి వాళ్ల పేర్లు చెప్పగలరేమో చూడండి. తర్వాత వాళ్ల పేర్లు చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి.

యేసు ప్రకటించడానికి వెళ్లినప్పుడు ఆయనకు సహాయం చేసిన ఈ స్త్రీలు ఎవరు?

పన్నెండుమంది అపొస్తలుల్లో ఒకతను చివరికి చెడ్డవాడిగా మారాడు. అతను ఇస్కరియోతు యూదా. మరో శిష్యుడు అతనికి బదులు ఆ తర్వాత అపొస్తలునిగా ఎంపిక చేయబడ్డాడు. ఆయన పేరు తెలుసా?— మత్తీయ. ఆ తర్వాత, పౌలు, బర్నబా అనేవాళ్లు కూడా అపొస్తలులయ్యారు. అయితే వీళ్లు, ఆ 12 మందిలో ఉన్నవాళ్లు కాదు.—అపొస్తలుల కార్యములు 1:23-26; 14:14.

మొదటి అధ్యాయంలో మనం తెలుసుకున్నట్లు, యేసు చిన్నపిల్లల మీద ప్రేమ చూపించాడు. ఎందుకు?— ఎందుకంటే, వాళ్లు కూడా తన శిష్యులు కావచ్చని ఆయనకు తెలుసు. ఒక్కోసారి పిల్లలు మాట్లాడే పద్ధతిని బట్టి, పెద్దవాళ్లు వినడమే కాదు, గొప్ప బోధకుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి కూడా ఇష్టపడతారు.

చాలామంది స్త్రీలు కూడా యేసు శిష్యులయ్యారు. ఆయన ప్రకటించడానికి వేరే పట్టణాలకు వెళ్లినప్పుడు కొంతమంది స్త్రీలు ఆయనతోపాటు వెళ్లారు. వాళ్లలో మగ్దలేనే మరియ, యోహన్న, సూసన్న ఉన్నారు. వీళ్లు ఆయన కోసం భోజనం తయారుచేయడానికి, ఆయన బట్టలు ఉతకడానికి కూడా సహాయం చేసివుంటారు.—లూకా 8:1-3.

మీరు కూడా యేసు శిష్యులు కావాలనుకుంటున్నారా?— మనం యేసు శిష్యులమని చెప్పుకున్నంత మాత్రాన ఆయన శిష్యులమైపోమని గుర్తుంచుకోండి. మనం క్రైస్తవ కూటాలకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు, మనం ఎక్కడున్నా యేసు శిష్యుల్లా ప్రవర్తించాలి. మనం యేసు శిష్యుల్లా తప్పక ప్రవర్తించాల్సిన కొన్నిచోట్ల గురించి చెప్పగలరా?—

అవును, మనం ఇంటి దగ్గర అలా ప్రవర్తించాలి. అంతేకాదు, స్కూల్లో కూడా అలాగే ప్రవర్తించాలి. మనందరం ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మనం యేసు నిజమైన శిష్యుల్లా ఉండాలంటే, మనం ఎక్కడున్నా సరే ఎప్పుడూ ఆయనలా ప్రవర్తించాలి.

మనం ప్రాముఖ్యంగా ఎక్కడ యేసు శిష్యుల్లా ప్రవర్తించాలి?

యేసు శిష్యుల గురించి బైబిలు ఏంచెప్తుందో తెలుసుకోవడానికి, మత్తయి 28:19, 20; లూకా 6:13-16; యోహాను 8:31, 32; 1 పేతురు 2:21 వచనాలను చదువుదాం.