కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14వ అధ్యాయం

మనం ఎందుకు క్షమించాలి?

మనం ఎందుకు క్షమించాలి?

ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టే పనిచేశారా?— మీకు బాధ కలిగేలా మాట్లాడారా?— వాళ్లు మిమ్మల్ని బాధపెట్టారని మీరు కూడా వాళ్లను బాధపెడతారా?—

చాలామంది, ఎవరైనా తమను బాధపెడితే తిరిగి వాళ్లను బాధపెడతారు. కానీ మనల్ని బాధపెట్టిన వాళ్లను మనం క్షమించాలని యేసు బోధించాడు. (మత్తయి 6:12) మరి ఎవరైనా మనల్ని చాలాసార్లు బాధపెడితే అప్పుడేం చేయాలి? మనం వాళ్లను ఎన్నిసార్లు క్షమించాలి?—

పేతురు అదే తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే ఒకరోజు ఆయన, ‘నేను అతన్ని ఏడుసార్ల వరకు క్షమించాలా?’ అని యేసును అడిగాడు. ఏడుసార్లు సరిపోదు. ‘డెబ్భై ఏడుసార్ల వరకు’ క్షమించాలని యేసు చెప్పాడు, అంటే ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని డెబ్భై ఏడుసార్లు బాధపెట్టినా మీరు వాళ్లను అన్నిసార్లు క్షమించాలని ఆయన ఉద్దేశం.

క్షమించడం గురించి పేతురు ఏమి తెలుసుకోవాలని అనుకున్నాడు?

అది చాలా ఎక్కువసార్లు కదా? ఎవరైనా మనల్ని అన్నిసార్లు బాధపెడితే లేదా అన్ని తప్పులు చేస్తే మనం వాటిని కనీసం గుర్తుపెట్టుకోలేం, అవునా? వేరేవాళ్లు మన విషయంలో ఎన్నిసార్లు తప్పు చేశారో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించకూడదని యేసు మనకు చెప్పాలని అనుకుంటున్నాడు. వాళ్లు క్షమించమని అడిగితే మనం వాళ్లను తప్పకుండా క్షమించాలి.

క్షమించడం ఎంత ప్రాముఖ్యమో యేసు తన శిష్యులకు నేర్పించాలని అనుకున్నాడు. అందుకే, ఆయన పేతురు అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత, తన శిష్యులకు ఒక కథ చెప్పాడు. మీకూ ఆ కథ వినాలని ఉందా?—

ఒక ఊరిలో ఒక మంచి రాజు ఉండేవాడు. ఆయన చాలా దయగలవాడు. తన దాసుల్లో ఎవరికైనా అవసరమైతే వాళ్లకు అప్పు కూడా ఇచ్చేవాడు. అయితే ఆ రాజు ఒకరోజు, తన దగ్గర అప్పు తీసుకున్న దాసులను తిరిగి చెల్లించమన్నాడు. అప్పుడు, రాజు దగ్గర 6 కోట్ల కాసులు అప్పు తీసుకున్న ఒక దాసుణ్ణి తీసుకొచ్చారు. అది చాలా ఎక్కువ డబ్బు!

అప్పు తీర్చడానికి మరికొంత సమయం కావాలని దాసుడు రాజును బ్రతిమాలుకున్నప్పుడు ఏంజరిగింది?

కానీ ఆ దాసుడు రాజుగారి దగ్గర తీసుకున్న డబ్బంతా ఖర్చుపెట్టేయడం వల్ల రాజుకు తిరిగి ఇవ్వలేకపోయాడు. రాజు అతనిని అమ్మేయమని ఆజ్ఞాపించాడు. అంతేకాదు, ఆ దాసుని భార్యను, అతని పిల్లల్ని, అతనికున్న వాటన్నిటినీ అమ్మేయమని కూడా రాజు చెప్పాడు. అలా అమ్మితే వచ్చిన డబ్బుతో రాజు అప్పుతీర్చాలి. అప్పుడు ఆ దాసునికి ఎలా అనిపించి ఉంటుంది?—

అతను రాజు ముందు మోకాళ్లూని, ‘దయచేసి, నాకు మరికొంత సమయం ఇవ్వండి, మీ దగ్గర తీసుకున్న అప్పు మొత్తం తీర్చేస్తాను’ అని బ్రతిమాలుకున్నాడు. మీరే ఆ రాజు అయ్యుంటే ఆ దాసునికి ఏమి చేసివుండేవాళ్లు?— రాజు ఆ దాసుని మీద జాలిపడ్డాడు. అందుకే ఆయన దాసుణ్ణి క్షమించేశాడు. ఆ దాసుడు తీసుకున్న అప్పు అసలు తీర్చాల్సిన అవసరం లేదనీ, 6 కోట్ల కాసుల్లో ఒక్కటి కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదనీ చెప్పాడు. అప్పుడు ఆ దాసుడు ఎంత ఆనందపడి ఉంటాడో!

కానీ, ఆ తర్వాత ఆ దాసుడు ఏంచేశాడు? తన దగ్గర వంద కాసులు మాత్రమే అప్పు తీసుకున్న మరో దాసుని దగ్గరకు వెళ్లి, అతని గొంతు పట్టుకుని, ‘నా దగ్గర తీసుకున్న వంద కాసులు తిరిగి ఇచ్చేయ్‌!’ అని పట్టుబట్టాడు. అతను అలా చేయడం, మరి ముఖ్యంగా, రాజు అతణ్ణి అంత ఉదారంగా క్షమించిన తర్వాత అలా చేయడం ఎంత ఘోరమో కదా?—

తన అప్పు తీర్చలేకపోయిన తన తోటి దాసునికి ఆ దాసుడు ఏంచేశాడు?

వంద కాసులు మాత్రమే అప్పు తీసుకున్న దాసుడు పేదవాడు. అతను వెంటనే ఆ అప్పు తీర్చలేకపోయాడు. అందుకే, ఆయన తనకు అప్పిచ్చిన దాసుని కాళ్ల మీద పడి, ‘దయచేసి, నాకు ఇంకా కొంచెం గడువు ఇవ్వు, నీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చేస్తాను’ అని బతిమాలుకున్నాడు. అప్పుడు ఈ దాసుడు అతనికి ఇంకా కొంచెం గడువు ఇవ్వాలా, వద్దా?— మీరైతే ఏమి చేసుండేవాళ్లు?—

రాజులా ఈ దాసుడు దయ చూపించలేదు. తన డబ్బు వెంటనే తిరిగి ఇచ్చేయమని పట్టుబట్టాడు. తన తోటి దాసుడు అప్పు తీర్చలేకపోయాడు కాబట్టి అతణ్ణి చెరసాల్లో వేయించాడు. ఇదంతా జరగడం వేరే దాసులు చూశారు, అది వాళ్లకు నచ్చలేదు. వాళ్లు చెరసాల్లో ఉన్న దాసుని మీద జాలిపడ్డారు. అందుకే వాళ్లు రాజు దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పారు.

జరిగినదంతా రాజుకు కూడా నచ్చలేదు. తన తోటి దాసుణ్ణి క్షమించని దాసుని మీద ఆయనకు చాలా కోపం వచ్చింది. రాజు అతన్ని పిలిపించి, ‘చెడ్డ దాసుడా! నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పు నేను క్షమించలేదా? మరి నువ్వు కూడా నీ తోటి దాసుణ్ణి క్షమించవద్దా?’ అని అడిగాడు.

క్షమించని దాసుణ్ణి రాజు ఏంచేశాడు?

తోటివారిని క్షమించని ఆ దాసుడు మంచివాడైన రాజును చూసి నేర్చుకోవలసింది. కానీ అతను నేర్చుకోలేదు. అప్పుడు రాజు అతనిని చెరసాలలో వేయించి, తన 6 కోట్ల కాసుల అప్పు తీర్చే వరకు అతణ్ణి విడిచిపెట్టవద్దని ఆజ్ఞాపించాడు. అయితే, అతను చెరసాలలో ఉండి రాజు అప్పు తీర్చడానికి డబ్బు సంపాదించలేడు. కాబట్టి అతను ఇక చనిపోయేవరకు అక్కడే ఉంటాడు.

యేసు ఈ కథ చెప్పిన తర్వాత, ‘మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకపోతే, పరలోకంలో ఉన్న నా తండ్రి కూడా మీ విషయంలో అలాగే చేస్తాడు’ అని తన శిష్యులతో అన్నాడు.—మత్తయి 18:21-35.

మనందరం దేవునికి ఎంతో రుణపడి ఉన్నామని మీరు తెలుసుకోవాలి. అంతెందుకు, అసలు దేవుడు ఇచ్చిన జీవం వల్లే మనం ఇప్పుడు బ్రతికున్నాం! దేవునికి మనం రుణపడివున్న దానితో పోలిస్తే, వేరేవాళ్లు మనకు అసలు రుణపడి లేరనే చెప్పాలి. వాళ్లు మనకు రుణపడి ఉన్నది, ఒక దాసుడు మరో దాసుని దగ్గర తీసుకున్న వంద కాసుల లాంటిది. కానీ మనం చేసిన తప్పుల వల్ల మనం దేవునికి రుణపడి ఉన్నది, దాసుడు రాజు దగ్గర తీసుకున్న 6 కోట్ల కాసుల లాంటిది.

ఎవరైనా క్షమించమని అడిగితే మీరేం చేస్తారు?

దేవుడు చాలా దయగలవాడు. మనం తప్పులు చేసినా ఆయన క్షమిస్తాడు. మనం ఆయనకు రుణపడివున్న దానిని రాబట్టుకోవడానికి ఆయన మనల్ని శాశ్వతంగా చంపేయడు. అయితే మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని బాధపెట్టినవాళ్లను మనం క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అది ఆలోచించాల్సిన విషయం, కాదంటారా?—

కాబట్టి ఎవరైనా మీకు బాధ కలిగించే పని చేసి, క్షమించమని అడిగితే మీరేం చేస్తారు? వాళ్లను క్షమిస్తారా?— అలా చాలాసార్లు జరిగితే అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా వాళ్లను క్షమిస్తారా?—

ఒకవేళ క్షమించమని అడుగుతున్నది మనమే అయితే, ఎదుటివాళ్లు మనల్ని క్షమించాలని కోరుకుంటాం, అవునా?— కాబట్టి మనం కూడా వేరేవాళ్లను అలాగే క్షమించాలి. మనం క్షమించామని చెప్తే సరిపోదు కానీ వాళ్లను నిజంగా, మనస్ఫూర్తిగా క్షమించాలి. మనం అలా చేసినప్పుడు, గొప్ప బోధకునికి శిష్యులుగా ఉండాలని నిజంగా కోరుకుంటున్నట్లు చూపిస్తాం.

క్షమించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోవడానికి, సామెతలు 19:11; మత్తయి 6:14, 15; లూకా 17:3, 4 వచనాలు చూద్దాం.