కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు మర్చిపోకుండా థ్యాంక్స్‌ చెప్తారా?

మీరు మర్చిపోకుండా థ్యాంక్స్‌ చెప్తారా?

18వ అధ్యాయం

ఈరోజు మీరు అన్నం తిన్నారా?— దాన్ని ఎవరు వండారో తెలుసా?— అమ్మగానీ లేదా ఇంకెవరైనాగానీ వండివుంటారు. మరైతే మనం దేవునికి ఎందుకు థ్యాంక్స్‌ చెప్పాలి?— ఎందుకంటే, మొక్కలూ చెట్లూ పెరిగి మనకు ఆహారం వచ్చేలా చేసేది ఆయనే. అయితే, మనకు వండిపెట్టిన వాళ్లకు, వడ్డించిన వాళ్లకు కూడా మనం థ్యాంక్స్‌ చెప్పాలి.

కొన్నిసార్లు మనం, మనకు సహాయం చేసినవాళ్లకు థ్యాంక్స్‌ చెప్పడం మర్చిపోతుంటాం, అవునా? మన గొప్ప బోధకుడు భూమ్మీద ఉన్నప్పుడు కొంతమంది కుష్ఠురోగులు థ్యాంక్స్‌ చెప్పడం మర్చిపోయారు.

కుష్ఠురోగులు అంటే ఎవరో తెలుసా?— కుష్ఠువ్యాధి వచ్చినవాళ్లను కుష్ఠురోగులు అంటారు. ఈ వ్యాధి సోకిన కొంతమందికైతే శరీరంలోని కొంతభాగం కుళ్లిపోయి, రాలిపోతుంటుంది. యేసు భూమ్మీదున్న కాలంలో కుష్ఠురోగులు వేరేవాళ్లకు దూరంగా నివసించాల్సివచ్చేది. ఒక కుష్ఠురోగి, ఎవరైనా తనవైపు వస్తున్నట్లు చూస్తే దూరంగా ఉండమని అరవాలి. ఎవరైనా మరీ దగ్గరకు వస్తే వాళ్లకు కూడా ఆ కుష్ఠురోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కుష్టురోగులు అలా అరిచేవాళ్లు.

యేసు కుష్ఠురోగుల మీద ఎంతో కనికరం చూపించేవాడు. ఒకరోజు యేసు యెరూషలేముకు చేరుకోవడానికి ఒక చిన్న పట్టణం గుండా వెళ్లాడు. ఆయన ఆ పట్టణం దగ్గరకు వచ్చేసరికి పదిమంది కుష్ఠురోగులు ఆయనను కలవడానికి వచ్చారు. దేవుడు అన్ని రకాల రోగాలను నయం చేసే శక్తిని యేసుకు ఇచ్చాడని వాళ్లు విన్నారు.

ఆ కుష్ఠురోగులు యేసుకు దగ్గరగా రాలేదు. వాళ్లు ఆయనకు దూరంగా నిల్చున్నారు. అయితే, తమకున్న కుష్ఠురోగాన్ని యేసు తీసివేయగలడని వాళ్లు నమ్మారు. అందుకే ఆ కుష్ఠురోగులు మన గొప్ప బోధకుణ్ణి చూసి, ‘యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు’ అని అరిచారు.

వ్యాధితో బాధపడేవాళ్లను చూస్తే మీకు జాలి అనిపిస్తుందా?— యేసుకు జాలి అనిపించింది. కుష్ఠురోగం వస్తే ఎంత కష్టంగా ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకే ఆయన వాళ్లతో, ‘మీరు వెళ్లి, మిమ్మల్ని మీరు యాజకులకు చూపించుకోండి’ అన్నాడు.—లూకా 17:11-14.

యేసు ఈ కుష్ఠురోగులను ఏం చేయమంటున్నాడు?

యేసు వాళ్లను ఎందుకలా చేయమన్నాడు? ఎందుకంటే, కుష్ఠురోగులకు సంబంధించి యెహోవా తన ప్రజలకు ఇచ్చిన చట్టంలో అలా చేయాలని ఉంది. దేవుని యాజకుడు కుష్ఠురోగి శరీరాన్ని పరిశీలించి చూడాలని ఈ చట్టం చెప్పింది. కుష్ఠురోగికి పూర్తిగా నయమైతే యాజకుడు ఆ విషయాన్ని చెప్తాడు. ఆ రోగికి వ్యాధి నయమైతే ఇంటికి వెళ్లి ఆరోగ్యంగా ఉన్నవాళ్లతో పాటు ఉండవచ్చు.—లేవీయకాండము 13:16, 17.

కానీ ఈ కుష్ఠురోగులకు ఇంకా నయంకాలేదు. మరి వాళ్లు యేసు చెప్పినట్లు, యాజకుని దగ్గరకు వెళ్లారా?— వెళ్లారు, వెంటనే వెళ్లారు. యేసు తమ వ్యాధిని తీసేస్తాడని వీళ్లు నమ్మివుంటారు. అప్పుడు ఏంజరిగింది?

వాళ్లు యాజకుని దగ్గరకు వెళ్తుండగా దారిలోనే వాళ్లవ్యాధి నయమైపోయింది. వాళ్ల శరీరం మామూలుగా తయారైంది. వాళ్లకు బాగైంది! యేసు శక్తి మీద నమ్మకం ఉంచినందుకు వాళ్లకు మేలు జరిగింది. వాళ్లు ఎంత ఆనందపడి ఉంటారో! కానీ, తమ కృతజ్ఞతను చూపించడానికి వాళ్లు ఏంచేయాల్సింది? మీరైతే ఏంచేసేవాళ్లు?—

ఈ కుష్ఠురోగి మర్చిపోకుండా ఏం చేశాడు?

రోగం నయమైన వాళ్లలో ఒకతను తిరిగి యేసు దగ్గరకు వచ్చాడు. అతను తన వ్యాధి నయమైనందుకు యెహోవా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయనను మహిమపర్చాడు. అతను అలా చేయడం సరైనదే, ఎందుకంటే దేవుని శక్తి వల్లనే అతని రోగం నయమైంది. అతను మన గొప్ప బోధకుని కాళ్ల మీదపడి కృతజ్ఞతలు చెప్పాడు. యేసు చేసిన దానికి అతనెంతో కృతజ్ఞత చూపించాడు.

కానీ మిగతా తొమ్మిదిమంది ఏమయ్యారు? ‘పదిమంది వ్యాధి నయమై శుద్ధులయ్యారు కదా? మరి మిగతా తొమ్మిదిమంది ఎక్కడ? దేవుణ్ణి మహిమపర్చడానికి ఒక్కడే తిరిగివచ్చాడా?’ అని యేసు అడిగాడు.

అవును, అది నిజం. పదిమందిలో ఒక్కడే దేవుణ్ణి మహిమపర్చాడు లేదా స్తుతించాడు, వెనక్కి వచ్చి యేసుకు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ తిరిగి వచ్చిన వ్యక్తి సమరయుడు, వేరే దేశస్థుడు. మిగతా తొమ్మిదిమంది దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు, యేసుకు కృతజ్ఞతలు చెప్పలేదు.—లూకా 17:15-19.

మీరు వాళ్లలో ఎవరిలా ఉన్నారు? మనం ఆ సమరయునిలా ఉండాలనుకుంటాం, అవునా?— కాబట్టి మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం మర్చిపోకుండా ఏంచేయాలి?— మనం ఖచ్చితంగా థ్యాంక్స్‌ చెప్పాలి. ప్రజలు సాధారణంగా థ్యాంక్స్‌ చెప్పడం మర్చిపోతుంటారు. కానీ థ్యాంక్స్‌ చెప్పడం మంచిది. మనం అలా చెప్తే యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసు సంతోషిస్తారు.

యేసు దగ్గరికి తిరిగొచ్చిన కుష్ఠురోగిని మీరెలా అనుకరించవచ్చు?

ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వేరేవాళ్లు మీకు ఎన్నోసార్లు సహాయం చేసేవుంటారు. మీకు ఎప్పుడైనా ఒంట్లో బాలేకుండా అయ్యిందా?— మీకెప్పుడూ ఆ పదిమంది కుష్ఠురోగులకు వచ్చినంత పెద్దజబ్బు వచ్చివుండదు కానీ బాగా జలుబు చేసివుంటుంది లేదా కడుపు నొప్పి వచ్చివుంటుంది. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూసుకున్నారా?— మీకు వాళ్లు మందులు వేసివుంటారు, మీ కోసం ఇంకా ఎన్నో చేసివుంటారు. మీకు నయం కావడానికి వాళ్లు సహాయం చేసినందుకు మీకు సంతోషంగా లేదా?—

ఆ సమరయుడు తనను బాగుచేసినందుకు యేసుకు కృతజ్ఞతలు చెప్పినప్పుడు యేసు సంతోషించాడు. మీ అమ్మానాన్న మీకోసం ఏదైనా చేసినప్పుడు మీరు వాళ్లకు థ్యాంక్స్‌ చెప్తే వాళ్లు సంతోషిస్తారా?— తప్పకుండా సంతోషిస్తారు.

ఎందుకు మర్చిపోకుండా థ్యాంక్స్‌ చెప్పాలి?

కొంతమంది ప్రతీరోజు లేదా ప్రతీవారం మీకోసం కొన్ని పనులు చేస్తుంటారు. అలా చేయడం వాళ్ల పనే అయ్యివుండవచ్చు. అది వాళ్లు ఇష్టపడి చేస్తుండవచ్చు. అయితే, వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పడం మీరు మర్చిపోతుండవచ్చు. బడిలో మీరు నేర్చుకోవడానికి మీ టీచరు చాలా కష్టపడి సహాయం చేస్తుండవచ్చు. అది ఆవిడ పనే. కానీ నేర్చుకోవడానికి సహాయం చేసినందుకు మీరు థ్యాంక్స్‌ చెప్తే ఆమె చాలా సంతోషపడుతుంది.

కొన్నిసార్లు ఎవరైనా మీకోసం చిన్నచిన్న పనులు చేసిపెడుతుండవచ్చు. బరువైనవి ఏవైనా తీసుకువెళ్లడానికి ఎవరైనా మీకు సహాయం చేశారా? లేదా అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా మీకు వడ్డించారా? మీ కోసం అలాంటి చిన్నచిన్న పనులు చేసినప్పుడు కూడా థ్యాంక్స్‌ చెప్పడం మంచిది.

భూమ్మీద మన కళ్లముందున్న వాళ్లకు మర్చిపోకుండా థ్యాంక్స్‌ చెప్పడం అలవాటు చేసుకుంటే, పరలోకంలో ఉన్న మన తండ్రికి కూడా థ్యాంక్స్‌ చెప్పడం మర్చిపోము. యెహోవాకు ఎన్నో విషయాల్లో కృతజ్ఞతలు చెప్పాలి! ఆయన మనకు జీవం ఇచ్చాడు, మనం సంతోషంగా గడపడానికి కావల్సిన మంచి వాటినన్నిటినీ ఇచ్చాడు. కాబట్టి మనం ప్రతీరోజు దేవుని గురించిన మంచి విషయాలు వేరేవాళ్లకు చెప్తూ ఆయనను మహిమపర్చాలి.

కృతజ్ఞతలు చెప్పడం గురించి తెలుసుకోవడానికి, కీర్తన 118:29; ఎఫెసీయులు 5:20; కొలొస్సయులు 3:17; 1 థెస్సలొనీకయులు 5:18 వచనాలు చదవండి.