కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

25వ అధ్యాయం

చెడ్డపనులు చేసేవాళ్లు మారే అవకాశం ఉందా?

చెడ్డపనులు చేసేవాళ్లు మారే అవకాశం ఉందా?

అం దరూ మంచి పనులే చేస్తే ఎంత బావుంటుందో కదా?— కానీ ఎప్పుడూ మంచిపనులే చేయడం ఎవరికీ సాధ్యం కాదు. మనం అందరం మంచి పనులే చేయాలని కోరుకుంటున్నా, అప్పుడప్పుడు చెడ్డపనులు ఎందుకు చేస్తామో తెలుసా?— ఎందుకంటే, మనందరం పాపంతోనే పుట్టాం. కానీ కొంతమంది ఎన్నోసార్లు చాలా చెడ్డ పనులు చేస్తుంటారు. వాళ్లు వేరేవాళ్లను ద్వేషిస్తారు, కావాలనే వాళ్లను గాయపరుస్తారు. వాళ్లు మారి, మంచి పనులు చేయడం నేర్చుకుంటారా?—

గొప్ప బోధకుని శిష్యుడైన స్తెఫనును రాళ్లతో కొడుతున్నవాళ్ల పైవస్త్రాలకు కాపలాకాస్తున్న యౌవనస్థుడిని చూడండి. హెబ్రీ భాషలో ఆయన పేరు సౌలు, కానీ రోమన్‌ భాషలో పౌలు. స్తెఫనును చంపుతున్నందుకు సౌలు సంతోషించాడు. ఆయన ఎందుకు అలాంటి చెడ్డ పనులు చేసేవాడో తెలుసుకుందాం.

సౌలు యుదా మతంలోని పరిసయ్యులు అనే గుంపు సభ్యుడు. పరిసయ్యుల దగ్గర దేవుని వాక్యం ఉండేది, కానీ వాళ్లు దానికన్నా తమ మతబోధకుల్లో కొంతమంది బోధించే విషయాలు ఎక్కువ ప్రాముఖ్యమైనవని నమ్మేవాళ్లు. అలా నమ్మడం వల్లే సౌలు చెడ్డ పనులు చేశాడు.

స్తెఫనును యెరూషలేములో బంధించినప్పుడు, సౌలు అక్కడే ఉన్నాడు. స్తెఫనును న్యాయస్థానానికి తీసుకువెళ్లారు, అక్కడి న్యాయాధిపతుల్లో కొంతమంది పరిసయ్యులు. అక్కడున్న వాళ్లు స్తెఫను మీద లేనిపోనివి చెప్పినా ఆయన భయపడలేదు. ఆయన ఆ న్యాయాధిపతుల ముందు ధైర్యంగా మాట్లాడి, యెహోవా దేవుని గురించి, యేసు గురించి చక్కని సాక్ష్యమిచ్చాడు.

కానీ ఆయన చెప్పింది ఆ న్యాయాధిపతులకు నచ్చలేదు. వాళ్లకు అప్పటికే యేసు గురించి చాలా విషయాలు తెలుసు. అంతెందుకు, ఇది జరగడానికి కొంతకాలం ముందే వాళ్లు యేసును చంపించారు! కానీ యెహోవా ఆ తర్వాత యేసును తిరిగి పరలోకానికి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత కూడా న్యాయాధిపతులు తమ పద్ధతి మార్చుకునే బదులు యేసు శిష్యులను హింసించేవాళ్లు.

ఆ న్యాయాధిపతులు స్తెఫనును పట్టుకుని నగరం బయటకు ఈడ్చుకెళ్లారు. ఆయనను కిందపడేసి, రాళ్లతో కొట్టారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు సౌలు అక్కడే ఉండి చూస్తున్నాడు. స్తెఫనును చంపడం సరైన పనే అని ఆయన అనుకున్నాడు.

స్తెఫనును చంపడం సరైనదేనని సౌలు ఎందుకు అనుకున్నాడు?

సౌలు అలా ఎందుకు అనుకున్నాడో మీకు తెలుసా?— సౌలు మొదటినుండి పరిసయ్యుడు కావడంవల్ల, పరిసయ్యులు బోధించేవే సరైనవని నమ్మాడు. సౌలు వాళ్లనే ఆదర్శంగా తీసుకుని, వాళ్లు చేసినట్లే చేసేవాడు.—అపొస్తలుల కార్యములు 7:54-60.

స్తెఫను చంపబడిన తర్వాత సౌలు ఏంచేశాడు?— యేసు శిష్యుల్లోని మిగతావాళ్లు కూడా లేకుండా చేయాలని ప్రయత్నించాడు! ఆయన వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి మరీ మగవాళ్లను, ఆడవాళ్లను బయటకు ఈడ్చుకొచ్చి వాళ్లను చెరసాలలో వేసేవాడు. చాలామంది శిష్యులు యెరూషలేము వదిలి పారిపోవాల్సివచ్చింది, అయినాగానీ వాళ్లు యేసు గురించి ప్రకటించడం మానుకోలేదు.—అపొస్తలుల కార్యములు 8:1-4.

దాంతో సౌలుకు యేసు శిష్యుల మీద ఇంకా కోపం వచ్చింది. అందుకే ఆయన ప్రధానయాజకుడైన కయప దగ్గరకు వెళ్లి, దమస్కు నగరంలో ఉన్న క్రైస్తవులను బంధించడానికి అనుమతి తెచ్చుకున్నాడు. వాళ్లను శిక్షించడానికి యెరూషలేముకు ఖైదీలుగా తీసుకురావాలని సౌలు అనుకున్నాడు. కానీ ఆయన దమస్కుకు వెళ్లే దారిలో ఉన్నప్పుడు, ఒక గొప్ప విచిత్రం జరిగింది.

సౌలుతో ఎవరు మాట్లాడుతున్నారు, ఆయన సౌలును ఏమి చేయమని పంపించాడు?

పరలోకం నుండి వెలుగు ప్రకాశించింది, అప్పుడు ఒక స్వరం, ‘సౌలా, సౌలా, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు’ అని అడిగింది. అది పరలోకం నుండి మాట్లాడుతున్న యేసు స్వరం! ఆ వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉందంటే దానివల్ల సౌలు గుడ్డివాడైపోయాడు. అప్పుడు ఆయనతో పాటు ఉన్నవాళ్లు ఆయనను దమస్కుకు తీసుకువెళ్లారు.

మూడు రోజుల తర్వాత యేసు దమస్కులో ఉన్న తన శిష్యుడైన అననీయకు దర్శనంలో కనిపించాడు. సౌలు దగ్గరకు వెళ్లి, ఆయనకు చూపు రప్పించి, ఆయనతో మాట్లాడమని యేసు అననీయకు చెప్పాడు. అననీయ సౌలుతో మాట్లాడినప్పుడు, ఆయన యేసు గురించిన సత్యాన్ని ఒప్పుకున్నాడు. ఆయనకు చూపు తిరిగొచ్చింది. అప్పటి నుండి ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది, ఆయన దేవునికి నమ్మకమైన సేవకుడయ్యాడు.—అపొస్తలుల కార్యములు 9:1-22.

సౌలు చెడ్డపనులు ఎందుకు చేసేవాడో ఇప్పుడు మీకు అర్థమైందా?— ఎందుకంటే ఆయనకు అవే బోధించబడ్డాయి. ఆయన దేవునికి నమ్మకంగాలేని వాళ్లు చేసినట్లే చేయడానికి ప్రయత్నించాడు. దేవుని వాక్యం చెప్పేవాటికన్నా మనుష్యులు చెప్పినవే ముఖ్యం అనుకునే వాళ్ల గుంపులో ఉండేవాడు. మిగతా పరిసయ్యులు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూనేవున్నా, సౌలు ఎందుకు తన జీవితాన్ని మార్చుకుని మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు?— ఎందుకంటే నిజానికి సౌలు సత్యాన్ని అసహ్యించుకోలేదు. అందుకే ఆయనకు సత్యమేమిటో తెలియజేసినప్పుడు దాని ప్రకారం నడుచుకోవడానికి వెంటనే ఒప్పుకున్నాడు.

సౌలు ఆ తర్వాత ఏమని పిలువబడ్డాడో తెలుసా?— సరిగ్గా చెప్పారు, ఆయనే ఆ తర్వాత అపొస్తలుడైన పౌలుగా పిలువబడ్డాడు, అంటే యేసుకు అపొస్తలుడయ్యాడు. బైబిలు పుస్తకాల్లో పౌలే అందరికన్నా ఎక్కువ పుస్తకాలు రాశాడని మీకు గుర్తుండేవుంటుంది.

సౌలు మారినట్లు మారగలిగినవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ అలా మారడం అంత సులభం కాదు, ఎందుకంటే ప్రజలతో చెడ్డపనులు చేయించడానికి ఒక వ్యక్తి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా?— దమస్కుకు వెళ్లే దారిలో యేసు సౌలుకు కనిపించినప్పుడు ఆయన ఆ వ్యక్తి గురించి చెప్పాడు. అక్కడ ఆయన పరలోకం నుండి సౌలుతో మాట్లాడుతూ, ‘ప్రజలు చీకటిలోనుండి వెలుగులోకి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగేలా వారి కన్నులు తెరవడానికి నేను నిన్ను పంపిస్తున్నాను’ అని చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 26:16-18.

అవును, అపవాది అయిన సాతానే అందరితో చెడ్డపనులు చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. సరైనది చేయడం మీకు కొన్నిసార్లు కష్టం అనిపిస్తుందా?— మనందరికీ అలానే అనిపిస్తుంటుంది. సరైనది చేయడం కష్టమయ్యేలా సాతాను చేస్తాడు. కానీ సరైనది చేయడం కొన్నిసార్లు కష్టం అవ్వడానికి మరో కారణం కూడా ఉంది. ఆ కారణం ఏమిటో తెలుసా?— మనం పాపంతో పుట్టడమే.

ఆ పాపమే, చాలాసార్లు సరైనది చేయడంకన్నా తప్పు చేయడమే సులభం అనిపించేలా చేస్తుంది. కాబట్టి, మనమేమి చేయాలి?— అవును, సరైనది చేయడానికి మనం చాలా కష్టపడాలి. మనం అలా చేసినప్పుడు, మనల్ని ప్రేమించే యేసు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు.

యేసు భూమ్మీద ఉన్నకాలంలో, ఒకప్పుడు చెడ్డ పనులు చేసి తర్వాత మంచిగా మారిన వాళ్లను ప్రేమించాడు. అలా మారడానికి వాళ్లు ఎంత కష్టపడి ఉంటారో ఆయన అర్థం చేసుకున్నాడు. ఉదాహరణకు, చాలామంది మగవాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకున్న స్త్రీలు ఉండేవాళ్లు. అవును అలా చేయడం తప్పే. బైబిలు, అలాంటి స్త్రీలను వేశ్యలు లేదా వ్యభిచారిణులు అంటుంది.

తప్పు పనులు చేసిన ఈ స్త్రీని యేసు ఎందుకు క్షమించాడు?

ఒకసారి, అలాంటి ఒక స్త్రీ యేసు గురించి విని, ఆయన ఒక పరిసయ్యుని ఇంట్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చింది. ఆమె తన కన్నీళ్లతో యేసు పాదాలు తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి, వాటి మీద అత్తరు పోసింది. ఆమె తను చేసిన తప్పులకు ఎంతో బాధపడింది, దాంతో యేసు ఆమెను క్షమించాడు. కానీ ఆమెను క్షమించవచ్చని ఆ పరిసయ్యుడు అనుకోలేదు.—లూకా 7:36-50.

మరో సందర్భంలో యేసు కొంతమంది పరిసయ్యులతో ఏమన్నాడో తెలుసా?— ‘వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యములో ప్రవేశిస్తున్నారు’ అన్నాడు. (మత్తయి 21:31) యేసు ఎందుకలా అన్నాడంటే, ఆ వేశ్యలు ఆయన మీద విశ్వాసం ఉంచి, తప్పు పనులు చేయడం మానేశారు. కానీ పరిసయ్యులు మాత్రం, యేసు శిష్యులకు చెడు చేయడం మానలేదు.

కాబట్టి మనం చేస్తున్నది తప్పని బైబిలు చూపించినప్పుడు, మనం వెంటనే మారడానికి ఇష్టపడాలి. అలాగే మనం ఏంచేయాలని యెహోవా కోరుతున్నాడో తెలుసుకున్నప్పుడు, దాన్ని వెంటనే చేయడానికి ఇష్టపడాలి. అప్పుడు యెహోవా మనల్ని చూసి సంతోషిస్తాడు, అంతేకాకుండా మనకు నిత్యజీవాన్ని ఇస్తాడు.

మనం చెడ్డ పనులు చేయకుండా ఉండేలా మనకు సహాయం చేయడానికి, కీర్తన 119:9-11; సామెతలు 3:5-7; 12:15 వచనాలు చదువుదాం.