కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

27వ అధ్యాయం

మీ దేవుడు ఎవరు?

మీ దేవుడు ఎవరు?

‘మీదేవుడు ఎవరు?’ అనే ప్రశ్న ఎందుకు ప్రాముఖ్యమైనది?— ఎందుకంటే, ప్రజలు చాలా దేవుళ్లను ఆరాధిస్తారు. (1 కొరింథీయులు 8:5) అపొస్తలుడైన పౌలు, పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తిని యెహోవా ఇచ్చిన శక్తితో బాగుచేసినప్పుడు, ‘దేవతలు మనుష్యుల రూపం దాల్చి మన దగ్గరకు దిగి వచ్చారు!’ అని అక్కడున్న ప్రజలు గట్టిగా కేకలు వేశారు. ప్రజలు పౌలును, ఆయన స్నేహితుడైన బర్నబాను ఆరాధించాలనుకున్నారు. వాళ్లు పౌలును హెర్మే అనీ, బర్నబాను ద్యుపతి అని అన్నారు. అవి అబద్ధ దేవుళ్ల పేర్లు.

కానీ ప్రజలు తమను ఆరాధించడానికి పౌలు, బర్నబా ఒప్పుకోలేదు. వాళ్లు వెంటనే జనం మధ్యకు వెళ్లి, ‘వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, జీవంగల దేవునివైపు తిరగండి’ అని చెప్పారు. (అపొస్తలుల కార్యములు 14:8-15) అన్నిటినీ చేసిన ‘జీవం గల దేవుడు’ ఎవరు?— అవును, యెహోవా. ఆయన ‘సర్వలోకంలో మహోన్నతుడు.’ ఆయన “అద్వితీయ సత్యదేవుడు” అని యేసు అన్నాడు. కాబట్టి, ఆరాధన పొందే హక్కు ఎవరికి మాత్రమే ఉంది?— యెహోవాకు మాత్రమే ఉంది!—కీర్తన 83:18; యోహాను 17:3; ప్రకటన 4:10, 11.

ప్రజలు తమకు సాగిలపడి నమస్కరించడానికి పౌలు, బర్నబా ఎందుకు ఒప్పుకోలేదు?

చాలామంది ప్రజలు “అద్వితీయ సత్యదేవుణ్ణి” కాకుండా వేరే దేవుళ్లను ఆరాధిస్తారు. వాళ్లు సాధారణంగా చెక్కతో, రాయితో లేదా లోహంతో చేసిన వాటిని ఆరాధిస్తుంటారు. (నిర్గమకాండము 32:3-7; లేవీయకాండము 26:1; యెషయా 44:14-17) పేరు ప్రఖ్యాతులున్న కొంతమందిని కూడా దైవాలని, తారలని లేదా ఆదర్శమూర్తులని ప్రజలు అంటారు. వాళ్లను మరీ అంత గొప్పగా చూడడం సరైనదేనా?—

సౌలు అపొస్తలుడైన పౌలుగా మారిన తర్వాత, ‘ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడు’ అని రాశాడు. (2 కొరింథీయులు 4:4) ఈ దేవత ఎవరు?— అవును, అపవాదియైన సాతాను! ప్రజలు ఎంతోమంది మనుష్యులనే కాకుండా ఇంకా ఎన్నింటినో ఆరాధించేలా సాతాను చేయగలిగాడు.

యేసు తనకు సాగిలపడి నమస్కరించేలా చేయాలని సాతాను ప్రయత్నించినప్పుడు, యేసు అతనితో ఏమి అన్నాడు?— ‘మీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి.’ (మత్తయి 4:10) కాబట్టి, యెహోవాను మాత్రమే ఆరాధించాలని యేసు స్పష్టంగా చెప్పాడు. ఈ విషయం తెలిసిన కొంతమంది యువకుల గురించి మనం చదువుదాం. వాళ్ల పేర్లు షద్రకు, మేషాకు, అబేద్నెగో.

ఈ హెబ్రీ యువకులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. వాళ్లు బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడ్డారు. అక్కడ నెబుకద్నెజరు అనే రాజు ఒక పెద్ద బంగారు ప్రతిమను చేయించాడు. ఒకరోజు ఆయన, సంగీతం మొదలైన వెంటనే అందరూ ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలని ఆజ్ఞాపించాడు. ‘సాగిలపడి నమస్కరించనివాళ్లు మండుతున్న అగ్నిగుండంలో వేయబడతారు’ అని ఆయన హెచ్చరించాడు. అప్పుడు మీరైతే ఏమి చేసివుండేవాళ్లు?—

ఈ ముగ్గురూ ప్రతిమకు ఎందుకు సాగిలపడి నమస్కారం చేయలేదు?

షద్రకు, మేషాకు, అబేద్నెగో సాధారణంగా రాజు ఆజ్ఞాపించినవన్నీ చేసేవాళ్లు. కానీ ఇది మాత్రం చేయమని వాళ్లు అన్నారు. ఎందుకో తెలుసా?— ఎందుకంటే, ‘నేను తప్ప వేరే ఏ దేవుడు మీకు ఉండకూడదు. మీరు దేని రూపాన్ని విగ్రహంగా చేసుకోకూడదు; దానికి సాగిలపడకూడదు’ అని దేవుని ధర్మశాస్త్రం చెప్పింది. (నిర్గమకాండము 20:3-5) కాబట్టి షద్రకు, మేషాకు, అబేద్నెగో రాజు ఆజ్ఞాపించినట్లు చేసేబదులు యెహోవా ధర్మశాస్త్రం చెప్పింది చేశారు.

రాజుకు చాలా కోపం వచ్చి, ఆ ముగ్గురు హెబ్రీ యువకులను వెంటనే తన ముందుకు తీసుకుని రమ్మన్నాడు. ఆయన వాళ్లను ఇలా అడిగాడు, ‘మీరు నిజంగానే నా దేవతలను పూజించడం లేదా? మీకు మరో అవకాశం ఇస్తాను. ఈసారి సంగీతం వినిపించినప్పుడు, నేను చేయించిన ప్రతిమకు సాగిలపడి నమస్కరించండి. అలా చేయకపోతే మండుతున్న అగ్నిగుండంలోకి విసిరివేయబడతారు. నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించగల దేవుడు ఎవరు?’

అప్పుడు ఆ యువకులు ఏంచేశారు? మీరైతే ఏమి చేసివుండేవాళ్లు?— వాళ్లు రాజుతో ఇలా అన్నారు, ‘మేము సేవిస్తున్న మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు; ఒకవేళ ఆయన రక్షించకపోయినా, మేము మీ దేవతలను పూజించం, మీ బంగారు ప్రతిమకు నమస్కరించం.’

రాజు కోపంతో ఊగిపోయాడు. ‘అగ్నిగుండం ఎప్పటికన్నా ఏడింతలు వేడిగా చేయండి!’ అని ఆజ్ఞాపించాడు. ఆయన షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి అగ్నిగుండంలో వేయమని తన సైన్యంలోవున్న బలవంతులకు ఆజ్ఞాపించాడు! అగ్నిగుండం ఎంత వేడిగా ఉందంటే, వాళ్లను అందులోకి విసిరిన వాళ్లే ఆ మంటలకు కాలిపోయారు! మరి ఆ ముగ్గురు హెబ్రీయులకు ఏమైంది?

షద్రకు, మేషాకు, అబేద్నెగో సరిగ్గా మంటల మధ్యలో వెళ్లి పడ్డారు. కానీ వాళ్లు లేచి నిలబడ్డారు! వాళ్లకేమీ కాలేదు. వాళ్ల బంధకాలు తెగిపోయాయి. ఇదంతా ఎలా జరిగింది?— రాజు అగ్నిగుండంలోకి చూశాడు, ఆయనకు కనిపించింది చూసి, చాలా భయపడ్డాడు. ‘మనం అగ్నిలో వేసింది ముగ్గురిని కదా?’ అని అడిగాడు. దానికి ఆయన సేవకులు, ‘అవును రాజా’ అని చెప్పారు.

యెహోవా తన సేవకులను మండుతున్న అగ్నిగుండంలో నుండి ఎలా కాపాడాడు?

అప్పుడు రాజు, ‘చూడండి, అక్కడ నాకు నలుగురు నడుస్తూ కనబడుతున్నారు, వాళ్లెవ్వరూ మంటల్లో కాలిపోవడం లేదు’ అన్నాడు. ఆ నాలుగో వ్యక్తి ఎవరో తెలుసా?— ఆయన యెహోవా దేవుని దూత. ఆ ముగ్గురు హెబ్రీయులకు ఏమీ కాకుండా ఆయన కాపాడాడు.

అది చూసి రాజు అగ్నిగుండం ద్వారం దగ్గరకు వెళ్లి, ‘షద్రకు! మేషాకు! అబేద్నెగో! మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటకు రండి’ అని గట్టిగా పిలిచాడు. వాళ్లు బయటకు వచ్చినప్పుడు ఆ మంటల్లో వాళ్లు కాలిపోలేదని అందరూ చూశారు. వాళ్ల దగ్గర కనీసం కాలిన వాసన కూడా రాలేదు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, ‘షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే వీళ్ల దేవుడు గొప్ప దేవుడు; వాళ్లు తమ దేవునికి కాకుండా మరి ఏ దేవునికి నమస్కరించరు. కాబట్టి ఆయన తన దూతను పంపి తన దాసులను రక్షించాడు.’—దానియేలు 3వ అధ్యాయం.

ఈ రోజుల్లో ప్రజలు ఎవరిని, వేటిని కూడా ఆరాధిస్తున్నారు?

దీని నుండి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా ప్రజలు ఎన్నిటినో, ఎందరినో దేవుళ్లుగా ఆరాధిస్తున్నారు. చెక్కతో, రాయితో, లోహంతో లేదా బట్టతో తయారుచేసినవాటిని ప్రజలు ఆరాధిస్తుంటారు. ఉదాహరణకు, “జెండా సిలువలాగే పవిత్రమైనది” అని ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా అనే సర్వసంగ్రహ నిఘంటువు చెప్తోంది. అంతేకాదు, మొదటి శతాబ్దంలోని యేసు శిష్యులు రోమా చక్రవర్తిని ఆరాధించలేదు. అలా ఆరాధించకపోవడం, “జెండా వందనం చేయడానికీ, ప్రతిజ్ఞ వల్లించడానికీ నిరాకరించడం” వంటిదని చరిత్రను వివరించే డానియేల్‌ పి. మానిక్స్‌ చెప్పాడు.

కొన్నిటితో విగ్రహాలు చేసుకుంటే తప్పని, మరికొన్నింటితో చేసుకుంటే తప్పుకాదని దేవుని అభిప్రాయమా?— యెహోవా సేవకులు అలాంటి వాటిని ఆరాధించడం సరైనదేనా?— షద్రకు, మేషాకు, అబేద్నెగో అలా చేయలేదు, అందుకే యెహోవా వాళ్లను ఇష్టపడ్డాడు. మీరు కూడా వాళ్లలా ఎలా చేయవచ్చు?—

యెహోవాను సేవించేవాళ్లు ఇంకెవ్వరినీ, మరి దేనినీ ఆరాధించకూడదు. దీని గురించి, యెహోషువ 24:14, 15, 19-22; యెషయా 42:8; 1 యోహాను 5:21; ప్రకటన 19:10 వచనాలు ఏమి చెప్తున్నాయో చదవండి.