కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

28వ అధ్యాయం

ఎవరి మాట వినాలనేది ఎలా తెలుసుకోవచ్చు?

ఎవరి మాట వినాలనేది ఎలా తెలుసుకోవచ్చు?

కొన్నిసార్లు ఎవరి మాట వినాలో తెలుసుకోవడం కష్టమవుతుంది. మీ అమ్మగానీ, నాన్నగానీ మీకు ఒకటి చేయమని చెప్తే, మీ టీచరు లేదా పోలీసు మరొకటి చేయమని చెప్పారనుకోండి. అప్పుడు మీరు ఎవరు చెప్పింది చేస్తారు?—

7వ అధ్యాయంలో, బైబిలు నుండి మనం ఎఫెసీయులు 6:1-3 వచనాలను చదివాం. అక్కడ, పిల్లలు తమ అమ్మానాన్నల మాట వినాలని ఉంది. ఆ వచనం, ‘ప్రభువునందున్న మీ తలిదండ్రులకు విధేయులై ఉండండి’ అని చెప్తోంది. అమ్మానాన్నలు “ప్రభువునందు” ఉండడమంటే ఏమిటో తెలుసా?— ప్రభువునందు ఉన్న అమ్మానాన్నలు దేవుని ఆజ్ఞలను పాటించమని తమ పిల్లలకు నేర్పిస్తారు.

కానీ కొంతమంది పెద్దవాళ్లు యెహోవాను నమ్మరు. కాబట్టి, వాళ్లలో ఎవరైనా స్కూల్లో పరీక్షలు జరుగుతున్నప్పుడు కాపీ కొట్టినా, దుకాణంలో డబ్బులివ్వకుండా ఏదైనా తెచ్చేసుకున్నా తప్పేమీ కాదంటే అప్పుడేమి చేస్తారు? కాపీ కొట్టడం లేదా దొంగతనం చేయడం తప్పుకాదా?—

మీకు గుర్తుందా, ఒకసారి నెబుకద్నెజరు రాజు తను చేయించిన బంగారు ప్రతిమకు అందరూ సాగిలపడి నమస్కారం చేయాలని ఆజ్ఞాపించాడు. కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగో అలా చేయలేదు. ఎందుకో తెలుసా?— ఎందుకంటే, ప్రజలు యెహోవాను మాత్రమే ఆరాధించాలని బైబిలు చెప్తోంది.—నిర్గమకాండము 20:3; మత్తయి 4:10.

పేతురు కయపతో ఏమి చెప్తున్నాడు?

యేసు చనిపోయిన తర్వాత, ఆయన అపొస్తలులను మహాసభ ముందుకు తీసుకెళ్లారు. మహాసభ అంటే యూదా మత ఉన్నత న్యాయస్థానం. అక్కడ ప్రధాన యాజకుడైన కయప వాళ్లతో, ‘మీరు యేసు నామాన్ని బట్టి బోధించకూడదని మేము మీకు ఖచ్చితంగా ఆజ్ఞాపించలేదా? అయినా, మీరు యెరూషలేమును మీ బోధతో నింపేశారు’ అన్నాడు. అపొస్తలులు మహాసభ చెప్పింది ఎందుకు వినలేదు?— పేతురు అపొస్తలులందరి తరఫున మాట్లాడుతూ కయపకు ఇలా సమాధానం ఇచ్చాడు, ‘మనుష్యులకు కాదు దేవునికే లోబడాలి.’—అపొస్తలుల కార్యములు 5:27-29.

ఆ రోజుల్లో యూదా మత నాయకులకు చాలా అధికారం ఉండేది. అయినా, అప్పట్లో వాళ్ల దేశాన్ని రోమా ప్రభుత్వం పరిపాలించేది. ఆ ప్రభుత్వంలో అందరికన్నా ఉన్నతాధికారిని కైసరు అనేవాళ్లు. కైసరు తమను పరిపాలించడం యూదలకు ఇష్టం లేకపోయినా, రోమా ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసింది. ఈ రోజుల్లో కూడా ప్రభుత్వాలు తమ పౌరుల కోసం మంచి పనులు చేస్తాయి. వాటిలో కొన్ని ఏమిటో తెలుసా?—

ప్రభుత్వాలు మనం ప్రయాణించడానికి రోడ్లు వేయిస్తాయి, మనల్ని కాపాడడానికి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి జీతాలిస్తాయి. అంతేకాకుండా, పిల్లల కోసం పాఠశాలలు కట్టిస్తాయి, రోగులకు వైద్య సహాయం అందిస్తాయి. ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతుంది. ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుందో తెలుసా?— ప్రజల దగ్గర నుండి. ప్రభుత్వానికి ప్రజలు చెల్లించే డబ్బును పన్ను అంటారు.

మన గొప్ప బోధకుడు భూమ్మీద ఉన్నప్పుడు చాలామంది యూదులు రోమా ప్రభుత్వానికి పన్ను కట్టడానికి ఇష్టపడేవాళ్లు కాదు. అందుకే దీని గురించి ఒక ప్రశ్న అడిగి యేసును చిక్కుల్లో పెట్టాలని, ఒకరోజు మతనాయకులు కొంతమందికి డబ్బిచ్చి ఆయన దగ్గరకు పంపించారు. ఆ ప్రశ్న ఏమిటంటే, ‘మనం కైసరుకు పన్ను కట్టలా, వద్దా?’ ఇది ఒక చిక్కు ప్రశ్న. ‘అవును, మీరు పన్ను కట్టాలి’ అని యేసు చెప్తే, చాలామంది యూదులకు అది నచ్చదు. కానీ యేసు, ‘మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు’ అని అనలేడు. అలా అనడం తప్పు అవుతుంది.

అందుకని యేసు ఏంచేశాడు? ‘ఒక నాణెం నాకు చూపించండి’ అని అడిగాడు. వాళ్లు ఆయన దగ్గరకు ఒక నాణెం తీసుకొచ్చినప్పుడు, యేసు వాళ్లను, ‘దీనిమీద ఎవరి రూపము, పేరు ఉన్నాయి?’ అని అడిగాడు. దానికి వాళ్లు, “కైసరువి” అని చెప్పారు. కాబట్టి యేసు, ‘అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి’ అని చెప్పాడు.—లూకా 20:19-26.

వీళ్లు అడిగిన చిక్కు ప్రశ్నకు యేసు ఎలా జవాబిచ్చాడు?

ఆయన చెప్పినదానిలో ఎవరూ తప్పు పట్టలేకపోయారు. కైసరు ప్రజల కోసం ఎన్నో చేస్తున్నప్పుడు ఆయన చేసిన వాటికి ఆయనకే డబ్బు కట్టడం సరైనది. యేసు అలా చెప్పి, ప్రభుత్వం మనకోసం చేసిన వాటికి పన్ను కట్టడం సరైనదని చూపించాడు.

మీకు ఇంకా పన్ను కట్టే వయసు రాలేదు. కానీ మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఒకటి ఉంది. అదేమిటో తెలుసా?— ప్రభుత్వం విధించిన నియమాలకు లోబడాలి. ‘పై అధికారులకు లోబడివుండాలి’ అని బైబిలు చెప్తోంది. పై అధికారులు అంటే ప్రభుత్వాధికారులు. మనం ప్రభుత్వం విధించిన నియమాలకు లోబడాలని దేవుడే చెప్తున్నాడు.—రోమీయులు 13:1, 2.

వీధుల్లో కాగితాలు, చెత్తాచెదారం పడేయకూడదనే నియమం ఉందనుకుందాం. దానికి మీరు లోబడాలా?— అవును, మీరు లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు పోలీసులకు కూడా లోబడాలా?— ప్రజల్ని కాపాడడానికి ప్రభుత్వం పోలీసులకు జీతాలిస్తుంది. వాళ్లకు లోబడితే ప్రభుత్వానికి లోబడినట్లే.

మనం పోలీసులు చెప్పింది ఎందుకు వినాలి?

ఉదాహరణకు మీరు రోడ్డు దాటుతున్నప్పుడు పోలీసు ఎవరైనా ఆగమంటూ చేయి చూపిస్తే మీరు ఏంచేయాలి?— వేరేవాళ్లు పోలీసులు చెప్పేది వినకుండా రోడ్డు దాటుతుంటే మీరు కూడా అలాగే చేయాలా?— మీరు ఆగాలి. అలా ఆగింది మీరు ఒక్కరే అయినా మీరు ఆగాల్సిందే. మీరు వాళ్లకు లోబడాలని దేవుడు చెప్తున్నాడు.

మీ ఇంటి దగ్గర్లో ఏదైనా గొడవ జరుగుతుంటే, “ఎవ్వరూ వీధుల్లోకి రావద్దు, ఇళ్లల్లో నుండి బయటకు రావద్దు” అని పోలీసులు చెప్పారనుకోండి. కానీ, బయట నుండి మీకు అరుపులు, కేకలు వినిపించడంవల్ల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అనిపించవచ్చు. అప్పుడు ఏమి జరుగుతుందో చూడడానికి బయటకు వెళ్లాలా?— అలా చేస్తే “పై అధికారులకు” లోబడినట్లేనా?—

చాలా దేశాల్లో ప్రభుత్వం పాఠశాలలు కట్టించి, టీచర్లకు జీతాలు ఇస్తుంది. కాబట్టి మీరు టీచరు చెప్పిన మాట వినాలని దేవుడు కోరుతున్నాడా?— దీని గురించి ఒకసారి ఆలోచించండి. ప్రజలను కాపాడడానికి పోలీసులకు జీతాలు ఇచ్చినట్లే, పాఠాలు చెప్పడానికి టీచర్లకు కూడా ప్రభుత్వం జీతాలిస్తుంది. కాబట్టి, పోలీసులు లేదా టీచర్లు చెప్పింది వినడమంటే ప్రభుత్వానికి లోబడడమే.

కానీ, ఒకవేళ మీ టీచరు దేనికైనా దండం పెట్టమని చెప్తే ఏంచేయాలి? మీరైతే ఏంచేస్తారు?— ఆ ముగ్గురు హెబ్రీయులు, ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయమని నెబుకద్నెజరు రాజు చెప్పినా చేయలేదు. ఎందుకో మీకు గుర్తుందా?— ఎందుకంటే, వాళ్లు దేవుడు చేయవద్దు అన్నది చేయకూడదని నిర్ణయించుకున్నారు.

చరిత్ర రచయితైన విల్‌ డ్యూరంట్‌ మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి, వాళ్లు ‘ఎక్కువ నమ్మకంగా ఉన్నది కైసరుకు కాదు’ అని రాశాడు. వాళ్లు ఎక్కువ నమ్మకంగా ఉన్నది యెహోవాకే! కాబట్టి మన జీవితంలో దేవుడే అన్నిటికన్నా ముఖ్యం అని గుర్తుపెట్టుకోవాలి.

మనం ప్రభుత్వాలకు లోబడతాం, ఎందుకంటే మనం అలా చేయాలని దేవుడు కోరుతున్నాడు. కానీ, ఒకవేళ దేవుడు చేయవద్దన్నది, ఎవరైనా చేయమంటే అప్పుడు మనం ఏంచెప్పాలి?— ప్రధాన యాజకునితో అపొస్తలులు చెప్పినట్లే, ‘మనుష్యులకు కాదు దేవునికే లోబడాలి’ అని చెప్పాలి.—అపొస్తలుల కార్యములు 5:29.

ప్రభుత్వ నియమాల్ని గౌరవించాలని బైబిలు చెప్తోంది. దాని గురించి, మత్తయి 5:41; తీతు 3:1; 1 పేతురు 2:12-14 వచనాల్లో ఏముందో చదవండి.